NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

SLBC సమావేశంలో కీలక నిర్ణయం.. రూ.5,40,000 కోట్లతో రుణ ప్రణాళిక..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశం ముగిసింది.. 5 ప్రధాన అంశాలపై మెరుగైన ఫలితాలు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంకర్లతో సబ్ కమిటీ ఏర్పాటుకు ఈ సమావేశం నిర్ణయం తీసుకుంది.. వ్యవసాయంలో సాగు ఖర్చులు తగ్గించడంపై బ్యాంకర్లు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు.. కౌలు రైతులకు సులభంగా రుణాలు అందించాలని.. మెరుగైన పంటల బీమాను అందుబాటులోకి తేవాలన్న ఏపీ సీఎం. పి 4 విధానం ద్వారా పేదరిక నిర్మూలనకు అవసరమైన ప్రాజెక్టులు, ప్రణాళిక చేపట్టాలన్నారు. సూపర్ సిక్స్‌లో పీ-4 గురించి ఈ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు సీఎం చంద్రబాబు.. డిజిటల్ లావాదేవీల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలని సూచించిన ఆయన.. స్కిల్ డెవలప్‌మెంట్‌ చర్యలకు బ్యాంకర్ల సాయం ఉండాలన్నారు.. ఇక, సంపద సృష్టించే, జీఎస్డీపీపీ రంగాలకు ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు సీఎం చంద్రబాబు.. కీలకాంశాలపై మంత్రులు, బ్యాంకర్లు, ఆయా రంగాల నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలన్నారు.. ఈ సందర్భంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రుణ ప్రణాళిక విడుదల చేసింది SLBC. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.5,40,000 కోట్లతో రుణ ప్రణాళిక విడుదల చేశారు.. రూ.3,75,000 కోట్లు ప్రాధాన్య రంగాలకు, రూ.1,65,000 కోట్లు ఇతర రంగాలకు కేటాయిస్తూ రుణ ప్రణాళిక రూపొందించారు.. వ్యవసాయ రంగానికి రూ.2,64,000 కోట్లు రుణాలు లక్ష్యం కాగా.. గతానికంటే 14 శాతం అధికంగా రుణాలిచ్చేలా ప్రణాళిక ఉంది.. డైరీ, ఫౌల్ట్రీ, ఫిషరీస్, వ్యవసాయ యాంత్రీకరణకు, వ్యవసాయం రంగంలో మౌళిక సదుపాయాలకు రూ.32,600 కోట్లతో రుణ ప్రణాళిక ప్రవేశపెట్టారు.. గతేడాది పెట్టిన వ్యవసాయ రుణ ప్రణాళిక లక్ష్యంలో 90 శాతం మేర రుణాలు మంజూరు చేశామని.. ఉద్యోగ, ఉపాధి కల్పనకు దోహద పడే MSME రంగానికి రూ.87,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నామని.. అలాగే గృహ నిర్మాణానికి రూ.11500 కోట్లు రుణాలు ఇచ్చేందుకు ప్రణాళిక ఉందని.. సాంప్రదాయేత ఇంథన సెక్టార్ కు రూ. 8000 కోట్లు రుణ ప్రణాళిక సిద్దం చేసినట్టు రుణ ప్రణాళికలో పేర్కొంది రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం.

విద్యుత్‌ రంగంపై శ్వేతపత్రం విడుదల..
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వరుసగా వివిధ రంగాలపై శ్వేతప్రతాలు విడుదల చేస్తూనే ఉంది.. ఈ రోజు విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను బయటపెడుతూ.. పీపీఏల్లో అవకతవకలు, సోలార్, విండ్‌, పవర్‌ కొనుగోళ్లల్లో అనితీపై వివరణ ఇచ్చారు.. ఇదే సమయంలో.. హైడ్రో పంప్‌ ఎనర్జీ, స్మార్ట్‌ మీటర్ల కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు.. వ్యవసాయ మీటర్లు, పవర్‌ ప్రాజెక్టుల గోల్‌మాల్‌పై కూడా వివరణ ఇచ్చారు సీఎం చంద్రబాబు.. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని విమర్శించిన ఆయన.. శ్వేతపత్రాల ద్వారా ఆయా శాఖల గురించి ప్రజలందరికీ వాస్తవాలు చెప్పాలన్నదే తమ ప్రయత్నం అన్నారు.. సమర్థమైన పాలన వల్లే పేదలకు మెరుగైన ప్రయోజనాలు అందుతాయని, బాధ్యతలేని పరిపాలన వల్ల అనేక కష్టాలు ఎదురవుతాయన్నారు.. ఇక, విద్యుత్ తో ప్రతి ఒక్కరి జీవితం ముడిపడి ఉంది.. విద్యుత్ రంగంపైనే ప్రజల జీవన ప్రమాణాలు ఆధారపడి ఉంటాయన్నారు సీఎం చంద్రబాబు.. 2014లో తాము అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉంది. ఈ ఐదేళ్లలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారు.. అసమర్థులు పాలన చేస్తే ఇలాగే ఉంటుందని మండిపడ్డారు.. ఒక అసమర్థుడు, అహంకారి రెండూ కలిసిన నేత రాజకీయాలకు అనర్హుడు అని ఫైర్ అయ్యారు.. వాస్తవాలు ప్రజలకు తెలిపేందుకే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామన్న ఆయన.. ఏ శాఖ చూసినా తీవ్రమైన పరిస్థితి కనిపిస్తోంది.. తవ్విన కొద్దీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.. 2014-19 మధ్య విద్యుత్ ఉత్పత్తి పెంచి, కరెంటు బిల్లు పెంచకుండా, నాణ్యమైన కరెంటు ఇచ్చిన ఘనత నాటి టీడీపీ ప్రభుత్వానిది అన్నారు.. కరెంటుపై బాదుడు తెలిస్తే, కరెంటు షాక్ కొట్టాల్సిందే అన్నట్టుగా చార్జీలు పెంచారని దుయ్యబట్టారు..

జగన్ ఓటమిపై కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. అది ఆశ్చర్యం కలిగించింది..!
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా.. వైఎస్‌ జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.. అయినా, 40 శాతం ఓట్లు సాధించడం మాములు విషయం కాదన్నారు.. అయితే, ఏపీ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవని మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు.. మరోవైపు, ప్రతిరోజూ జనంలోకి వెళ్లే కేతిరెడ్డి ఓడిపోవడం ఊహించలేమన్నారు. జగన్ ను ఓడించేందుకు షర్మిలను ఒక వస్తువులా ఉపయోగించారు.. అంతకు మించి షర్మిల ఏమీ లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్‌ ఓటమిపై స్పందించిన ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్.. ప్రజలతో మాకు గ్యాప్ వచ్చింది.. ప్రజలది తప్పనీ అనలేం.. మేం మారాలి అన్నారు.. అయితే, హైదారాబాద్ లో అన్ని సీట్లు గెలిచాం అని గుర్తుచేశారు.. కానీ, రాష్ట్రంలో మేం చేసిన అభివృద్ధిని మేమే చెప్పుకోలేదన్నారు.. అసలు, తెలంగాణ పేరు మార్చడం (టీఆర్ఎస్‌ ను బీఆర్ఎస్‌గా) వల్ల ఓడిపోయామనడానికి ఆధారం లేదన్నారు.. మాకు అహంకారం ఉందని కృత్రిమంగా సృష్టించారు.. ఆత్మవిశ్వాసం, అహంకారానికి తేడా తెలియదు..! అని మండిపడ్డారు.. అభివృద్ధిలో మాతో పోటీ పడలేని వారే అహంకారం అని ప్రచారం చేశారని దుయ్యబట్టారు బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్.

సీఎం సొంత జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. జిల్లాలో మొత్తం రూ. 396.09 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందులో.. రూ.353.66 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి. అంతేకాకుండా.. పాలమూరు యూనివర్సిటీలో రూ.42.40 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. మరోవైపు.. ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.10 కోట్లతో బాలికల హాస్టల్ నిర్మాణానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అటు.. దేవరకద్రలో రూ.6.10 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. మహబూబ్ నగర్ రూరల్ లో రూ. 3.25 కోట్లతో కేజీవీబీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గండీడ్ లో రూ. 6.20 కోట్లతో కేజీవీబీ భవన నిర్మాణానికి శంకుస్థాపన.. పాలమూరు యూనివర్సిటీలో రూ.13.44 కోట్లతో ఎస్టీపీ, అకాడామిక్ బ్లాక్, గ్యాలరీ పనులకు శంకుస్థాపన.. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో రూ.37.87 కోట్లతో సీసీ రోడ్లు, స్టోరేజ్ ట్యాంక్ పనులకు శంకుస్థాపన.. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో రూ.276.80 కోట్లతో ఎస్టీపీ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

మెగా డీఎస్సీ ఎక్కడ? ముఖ్యమంత్రి గారు.. సీఎంపై కేటీఆర్ ఫైర్
ట్విట్టర్లో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. మెగా డీఎస్సీ ఎక్కడ? ముఖ్యమంత్రి గారు అని ప్రశ్నించారు. తొలి క్యాబినెట్లోనే 25 వేలతో మెగా డీఎస్సీ అని మీరిచ్చిన మాట ఏమైంది? అని అన్నారు. తొమ్మిది నెలలు కావస్తున్నా.. లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్ధుల ఆక్రందన మీ కాంగ్రెస్ సర్కారుకు వినపడటం లేదా? చురకలు అంటించారు. మీరు కొలువుదీరితే సరిపోతుందా..? యువతకు కొలువులు అక్కర్లేదా ? అని అడిగారు. గతంలో మీరు.. ఉస్మానియా విద్యార్థులు అడ్డమీద కూలీల్లాంటి వారని ఎగతాళి చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. తిన్నది అరిగేదాకా అరిచే బీరు, బిర్యానీ బ్యాచ్ అని బద్నాం చేశారన్నారు. సిద్ధాంతం, ఆలోచన లేని ఆవారా టీమ్ అని అవహేళన చేశారు.. అధికారంలోకి వచ్చాక నేడు అదే ఉస్మానియా యూనివర్సిటీని రణరంగంగా మార్చారని కేటీఆర్ పేర్కొన్నారు. డీఎస్సీ అభ్యర్థులపై పోలీసులను ప్రయోగించి అణచివేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల మందిని అన్యాయంగా అరెస్టు చేసి అక్రమ కేసులు పెడుతున్నారు.. కనీసం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారని తెలిపారు. గుర్తుపెట్టుకోండి ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశ సరిహద్దుల్లో లేదు.. మరెందుకు ఇన్ని బలగాలు, ఎందుకు ఇంతటి నిర్బంధం అని ప్రశ్నించారు. మళ్లీ ఉద్యమం నాటి పరిస్థితులను ఎందుకు కల్పిస్తున్నారు.. నిత్యం పోలీసుల బూట్ల చప్పుళ్లతో ఎందుకు కలవరపెడుతున్నారని అడిగారు. డీఎస్సీ అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ తెలిపారు.

అటల్‌ పింఛన్‌దారులకు శుభవార్త! ఒకేసారి డబుల్ చేసే యోచనలో కేంద్రం
త్వరలో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌లో అటల్ పెన్షన్ దారులకు శుభవార్త చెప్పే యోచనలో ఉంది. కేంద్రంలో మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడింది. ఈ నెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఇక జూలై 23న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌లో పలు వర్గాలపై వరాలు కురిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాముఖ్యంగా అటల్‌ పెన్షన్‌ యోజన పథకాన్ని మార్పులు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద అందించే పింఛన్ మొత్తాన్ని పెంచే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. గ్యారెంటీ పెన్షన్‌ మొత్తాన్ని రూ.5 వేలు నుంచి రూ.10 వేలకు పెంచాలని చూస్తోంది. అటల్‌ పెన్షన్‌ యోజనను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు గ్యారెంటీగా ఇచ్చే మొత్తాన్ని పెంచేందుకు ఉన్న అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఎలాంటి పింఛను పథకాలకు నోచుకోని వారికోసం అటల్‌ పెన్షన్‌ యోజన పథకాన్ని 2015 బడ్జెట్‌లో ప్రకటించారు. నెలకు రూ.1000-5000 వరకు పెన్షన్‌ అందుతుంది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తులు ఈ పథకానికి అర్హులు. అందుకు అనుగుణంగా నెలనెలా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకంలో 6.62 కోట్ల మంది చేరారు. ఒక్క 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే 1.22 కోట్ల మంది ఈ పథకంలో చేరారు. పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ దీన్ని నిర్వహిస్తుంది. జులై 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఆ మేరకు ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.

కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుకుని.. లవర్‌లతో జంప్ అయిన 11 మంది వివాహిత మహిళలు..
ఉత్తర్ ప్రదేశ్‌లో ఘరానా మహిళల విషయం వెలుగులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించిన డబ్బులు తీసుకుని కొంత మంది వివాహిత మహిళలు తమ లవర్‌లతో ఉడాయించారు. మహరాజ్ గంజ్ జిల్లాలో ప్రధాని మంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి మొదటి విడత పొందిన తర్వాత 11 మంది వివాహితలు ప్రేమికులతో పారిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ప్రభుత్వ పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు శాశ్వత నివాసాన్ని నిర్మించుకునేందుకు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ పథకం మొదటి విడత రూ.40,000 అందిన తర్వాత సంజయ్ అనే వ్యక్తి తన భార్య సునియా కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహరం బయటకు వచ్చింది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన డబ్బును తీసుకుని సునియా గుర్తుతెలియని వ్యక్తితో పారిపోయిందని బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రాథమిక విచారణలో తేలింది. మహారాజ్ గంజ్ జిల్లాలో మొత్తం 2350 మంది ఈ పథకం కింద డబ్బులు అందుకున్నారు. ఈ ఘటన తర్వాత ఇలాంటివే మొత్తం 10 కేసులు వెలుగులోకి వచ్చాయి. అక్కడ కూడా భర్తలు తమ భార్యలు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ అనునమ్ ఝా మాట్లాడుతూ..‘‘ధాన మంత్రి ఆవాస్ యోజన మొదటి విడతను ఇళ్ళ నిర్మాణానికి ఉపయోగించని 11 మంది మహిళలు దుర్వినియోగం చేసినట్లు దృష్టికి వచ్చింది. లబ్ధిదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖను ఆదేశించాం, నిధులను రికవరీ చేయాలని సూచించాం’’ అని అన్నారు. సునియా కేసులో మిగిలిన రెండు విడతల డబ్బుల్ని తన కుమారుడు సంజయ్ ఖాతాలకు బదిలీ చేయాలని ఆయన తండ్రి అధికారుల్ని వేడుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో ఇలా జరగడం ఇదే తొలిసారి కాడు. గతంలో బారాబంకి జిల్లాకు చెందిన నలుగురు మహిళలు పథకంలో భాగంగా ప్రభుత్వం అందించిన రూ. 50,000 తీసుకుని తమ ప్రియులతో ఉడాయించారు.

“యుద్ధం పరిష్కారం కాదు”.. పుతిన్‌కి ప్రధాని మోడీ సందేశం..
రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రస్తావించారు. యుద్ధం పరిష్కారం కాదని మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అన్నారు. మంగళవారం మాస్కోలో ఇరు నేతల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ యుద్ధంపై ఓపెన్ మైండ్‌లో చర్చించడం నాకు సంతోషంగా ఉంది, యుద్ధంపై ఒకరి ఆలోచనలను మరొకరం గౌరవంగా విన్నాము అని అన్నారు. యుద్ధం పరిష్కారం కాదని, శాంతికి భారత్ అనుకూలమని ప్రధాని పునరుద్ఘాటించారు. ‘‘శాంతి పునరుద్ధరణ కోసం అన్ని విధాల సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని, నేను మీకు ప్రపంచ సమాజానికి భారతదేశం అనుకూలంగా ఉంటుందని హమీ ఇస్తున్నాను.’’ అని మోడీ పుతిన్‌తో చెప్పారు. ప్రపంచం ముందు ఇంధనం యొక్క సవాలు ఉందని, ఇలాంటి సమయంలో మీ సహకారంతో మేము పెట్రోల్-డీజిల్‌కి సంబంధించి ఇబ్బందుల నుంచి సామన్య ప్రజల్ని రక్షించామని, భారత్-రష్యా మధ్య ఇంధనానికి సంబంధించిన ఒప్పందం పరోక్షంగా ప్రపంచ మార్కెట్ స్థిరత్వాన్ని అందించిందని, దీనిని ప్రపంచం అంగీకరించాలని ప్రధాని అన్నారు. కోవిడ్, ప్రపంచ వ్యాప్తంగా సంఘర్షణలు కారణంగా ప్రపంచం ఆహారం-ఇంధనం-ఎరువుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు , భారత్-రష్యా స్నేహం, సహకారం కారణంగా భారత రైతులు ఇబ్బందులు ఎదుర్కోలేని మోడీ కొనియాడారు. రైతులక ప్రయోజనాలకు మేం కట్టుబడి ఉన్నామని, రష్యా సహకారంతో మరింత ముందుకు సాగాలని ప్రధాని మోడీ చెప్పారు.

సిరాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్..
టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్కు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. సిరాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉద్యోగం, ఇంటి స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. టీ20 వరల్డ్ కప్ ను గెలుచుకున్న అనంతరం హైదరాబాద్కు చేరుకున్న సిరాజ్.. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అంతర్జాతీయ క్రికెట్లో భారత దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవాన్ని తెచ్చిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా.. సిరాజ్కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉద్యోగం, ఇంటి స్థలం కేటాయించాలని సీఎం అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో అందుకు అనువైన స్థలాన్ని వెంటనే గుర్తించాలని.. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకోవలసిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇటీవల టీ20 ప్రపంచకప్‌ సాధించిన భారత జట్టులో సిరాజ్‌ ఉన్నారు. ప్రపంచకప్ గెలిచిన తర్వాత.. ఈనెల 5వ తేదీన సిరాజ్ హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా అభిమానులు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు. అనంతరం.. మెహిదీపట్నంలోని సరోజని ఐ హాస్పటల్ నుంచి ఈద్గా మైదానం వరకు రోడ్ షో నిర్వహించారు. ఓపెన్‌టాప్‌ వాహనంపై వస్తూ ఆయన పాట పాడి అభిమానుల్లో జోష్‌ పెంచారు.

భారతీయుడు -2 టీంకి నా ప్రత్యేక అభినందనలు : సీఎం రేవంత్ రెడ్డి
భారతీయుడు -2 సినిమా బృందానికి నా ప్రత్యేక అభినందనలు అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వారికి అభినందనలు తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం… ప్రజా ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నానికి మద్ధతుగా… శ్రీ కమల్ హాసన్…శ్రీ శంకర్…శ్రీ సిద్దార్థ… శ్రీ సముద్రఖని కలిసి ఒక అవగాహనా వీడియో రూపొందించడం హర్షించదగ్గ విషయం అని ఆయన అన్నారు. క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. ఇక ఈ మూవీ విశేషాలను పంచుకునేందుకు చిత్రయూనిట్ సోమవారం నాడు ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ మీడియా సమావేశంలో ఈ డ్రగ్స్ అవేర్నెస్ కోసం ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నను అపార్ధం చేసుకున్న సిద్దార్థ రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చినట్టు మాట్లాడారు. అయితే విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్షమాపణలు చెబుతూ సిద్దార్థ్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇక ఆ తరువాత డ్రగ్స్ వాడకం ప్రమాదకరం అంటూ కమల్ హాసన్, శంకర్, సిద్దార్థ, సముద్రఖనిలతో ఒక అవేర్నెస్ వీడియో చేసి రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే వారికి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.

పండగ రేస్ లో ఎవరు పైచేయి సాధిస్తారో..?
ఏదైనా పండుగ వచ్చిందంటే సినిమాలకు గోల్డెన్ డేస్ కింద లేక్క. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్లన్నీ హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కోలాహలంగా ఉంటుంది. దాంతో పాటే నిర్మాతలకు కాసుల వర్షం కురుస్తుంది. హాలిడే రోజు సినిమా విడుదల చేస్తే డే -1 భారీ నెంబర్ కనిపిస్తుంది. ఇక రానున్న వినాయక చవితికి ఇప్పటి నుండే థియేటర్ల బ్లాకింగ్ మొదలైంది. ఈ వినాయక చవితికి రెండు పెద్ద సినిమాలు రాబోతున్నాయి. దుల్కర్ సల్మాన్ స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ లక్కీ భాస్కర్ ను సెప్టెంబరు7న విడుదల చేస్తూ పోస్టర్ విడుదల చేసింది నిర్మాణ సంస్థ. మరోవైపు అదేవారంలో రెండు రోజులు ముందుగా సెప్టెంబరు 5న తమిళ స్టార్ విజయ్ నటించిన G.O.A.T  విడుదల చేస్తున్నట్టు పోస్టర్ రిలిజ్ చేసారు. దింతో అటు తమిళ్, మలయాళం, తెలుగులో క్లాష్ వచ్చేలా ఉంది. కేరళలో విజయ్ vs సల్మాన్ ఫ్యాన్స్ మధ్య పోటీ నెలకొంటుంది. తమిళ్ లో విజయ్ సినిమాకే ఎడ్జె, దుల్కర్ సిసినిమాలకు కూడా డిమాండ్ ఉంది. తెలుగులో ఈ చిత్రాల మధ్య పోటీ గట్టిగా ఉండబోతుంది. కారణం విజయ్ G.O.A.T చిత్రాన్ని అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ రైట్స్ ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థయిన మైత్రిమూవీస్ కొనుగోలు చేసింది. మైత్రికి రెండు స్టేట్స్ లో థియేటర్లు గట్టిగానే లాక్ చేస్తుంది. మరోవైపు లక్కీ భాస్కర్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. సీతారకు రెగ్యులర్ బయ్యర్స్ ఉన్నారు. నైజం దిల్ రాజు విడుదల చేస్తే మరోసారి హనుమాన్ నాటి పరిస్థితులు రావొచ్చు. నైజాంలో మైత్రి vs దిల్ రాజు గా వ్యవహారం మారుతుంది. థియేటర్ల కేటాయింపు సమస్యలు షరా మాములే. వీటితో పాటు తెలుగు హీరోల సినిమాలు ఉంటాయి. ఎవరెవరికి ఎన్ని థియేటర్లు దొరుకుతాయో మరికొద్ది రోజుల్లో తేలుతుంది.  ఏ సినిమా అయిన టాక్ బాగుంటేనే నిలబడుతుంది.