NTV Telugu Site icon

Top Headlines @ 5 PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

సోషల్‌ మీడియాలో పోస్టులపై సీఎం సీరియస్‌.. ఆడబిడ్డల జోలికి వస్తే సహించేది లేదు.

సోషల్‌ మీడియాలో పోస్టులపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్‌గా స్పందించారు.. సోషల్ మీడియాలో అనర్థాలు పెరిగిపోతున్నయి అంటూ మండిపడ్డ ఆయన.. సోషల్ మీడియాలో ఆడబిడ్డల మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.. వారి జోలికి వస్తే సహించేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు.. ఆడబిడ్డ హోంమంత్రి పైన పోస్ట్ లు పెడుతున్నారు.. ఆంబోతులు మదిరిగా మారారు… మదమెక్కి వ్యవహరిస్తున్నారు అంటూ ఫైర్‌ అయ్యారు.. చివరకు పవన్ కల్యాణ్‌ కుమార్తెల మీద పోస్టింగ్ లు పెడితే.. వారు బాధపడుతున్నా పరిస్థితి తెచ్చారు.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలా..? వద్దా? అని ప్రశ్నించారు.. అయితే, అలాంటి వారిపై చర్యలు సబబే అంటూ సమాధానం ఇచ్చారు ప్రజలు.. ఇక, గతంలో వైఎస్‌ వివేకాను హత్య చేసి గుండెపోటు అంటే మొదట నేనుకూడా నమ్మాను.. పోస్ట్ మార్టం చేశాక చూస్తే భయంకరంగా చేసిన హత్య అని తేలింది అని గుర్తుచేసుకున్నారు సీఎం చంద్రబాబు.. తర్వాత ఆ హత్యను నా మీద నెట్టే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.. అత్యాచారాలు చేస్తున్న వారిని ఏమి చేయాలని ఆలోచిస్తున్నాం అన్నారు.. పోలీసులు ఒక సారి ఆలోచించు కోవాలి.. పోలీసులు అప్పర్ హ్యాండ్‌తో ఉండాలి.. నేరస్తులది అప్పర్ హ్యాండ్ వుంటే మంచిది కాదని హితవు చెప్పారు.. వైసీపీ నాయకులు తీరు మార్చుకోవాలి.. లేకపోతే తీవ్ర పరిణామాలు వుంటాయని హెచ్చరించారు.. రాజకీయాలు రాజకీయంగా చేస్తే సరే.. ఆడబిడ్డల జోలికి వస్తే సహించను అంటూ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు.. ఇప్పుడు ఈ అంశాలు చెప్పక పోతే నేను డిఫాల్టర్ గా మరుతాను.. అందుకే ఇప్పుడు చెప్పక తప్పలేదన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

 

అన్ని వ్యవస్థలను నీరుగార్చి నాశనం చేస్తున్నారు.. ఏపీ ప్రభుత్వంపై జగన్‌ ఫైర్
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారి నెలకొన్నాయని.. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.. రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల హామీలు అమలు చేయటం లేదు కాబట్టి ప్రశ్నించే స్వరం లేకుండా అణిచి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతున్నా హామీల అమలు లేదని మండిపడ్డారు. ప్రతివర్గాన్ని మోసం చేస్తు్న్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం మోసం చేయని వారంటూ ఎవరూ ఏపీలో లేరని విమర్శలు గుప్పించారు. అన్ని వ్యవస్థలను నీరు గార్చి నాశనం చేస్తున్నారన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ మూడు దఫాలుగా పెండింగ్‌లో పెట్టారని.. విద్యార్థులు రోడ్డెక్కుతున్న పట్టని పరిస్థితి ఉందన్నారు. విద్యా వ్యవస్థ గాడి తప్పిందని.. టోఫెల్, CBSE, ఇంగ్లీష్ మీడియం వంటి పనులు అన్నీ పక్కన పెట్టేశారన్నారు. అమ్మ ఒడి గాలికి ఎగిరి పోయిందన్నారు. ఆరోగ్య శ్రీ, 108, 104 నిధులు చెల్లింపులు లేవని జగన్‌ పేర్కొన్నారు.లక్షన్నర పెన్షన్‌లు తొలగించారన్న ఆయన.. కొత్త పెన్షన్ల నమోదు కార్యక్రమం చేపట్టలేదన్నారు. అన్ని విధాలుగా ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు వైఎస్ జగన్. లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని.. 5 నెలల కాలంలో 95 మంది మహిళలు, పిల్లల మీద అత్యాచారాలు జరిగాయన్నారు. అందులో 7 మంది చనిపోయారని చెప్పారు. టీడీపీ కార్యకర్తలు దగ్గరుండి ఈ పనులు చేస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా సపోర్ట్ చేస్తుందని ఆరోపించారు. తెనాలిలో సహానా అనే యువతిపై టీడీపీ రౌడీషీటర్ దాడి చేసి హత్య చేశాడని అన్నారు. శ్రీకాకుళంలో ఇద్దరు బాలికలపై అధికార పార్టీ నేతల కుమారులు అత్యాచారం చేశారని పేర్కొన్నారు.

 

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత కీలక భేటీ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత సమావేశమయ్యారు. హోంమంత్రిపై పవన్‌ వ్యాఖ్యలు, ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు – పోలీసుల రియాక్షన్‌పై పవన్ ఇటీవల అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాను హోంమంత్రి అయితే రాష్ట్రంలో పరిస్థితులు వేరేగా ఉంటాయని ఇటీవల పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తానే హోం మంత్రి పదవి తీసుకోవలసి వస్తుందంటూ పవన చేసిన వ్యాఖ్యలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనితల భేటీపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా బుధవారం కేబినెట్ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు మంత్రుల తీరుపై మండిపడిన సంగతి తెలిసిందే. ఇంకా కొందరు మంత్రులలో సీరియస్‌నెస్ రావడం లేదని వ్యాఖ్యానించారు.

 

మాజీ మంత్రి మాల్లారెడ్డి కి బిగ్ షాక్.. ఈడీ నోటీసులు..
మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. మల్లారెడ్డికి ఇవాళ ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. పీజీ మెడికల్ సీట్లు అక్రమాలు పై నోటీసులు ఇచ్చినట్లు ఈడీ పేర్కింది. గత ఏడాది జూన్ లో ఈడీ అధికారులు మాజీ మంత్రి మల్లారెడ్డి మెడికల్ కళాశాలలపై సోదాలు నిర్విహించిన విషయం తెలిసిందే. సుమారు 12 మెడికల్‌ కాలేజీల్లో సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. పీజీ మెడికల్ సీట్లు అక్రమంగా బ్లాక్ చేశారన్న అభియోగంపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 45 సీట్లు బ్లాక్ చేసి అమ్మకున్నట్లు ఈడీ గుర్తించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు నోటీసులు జారీ చేశారు. కానీ.. ఈడీ నోటీసుల్లో ఇంకా ఎలాంటి విషయాలు పేర్కొంది? తదితర అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

 

సర్పంచ్‌లతో సమావేశం.. వాలంటీర్లపై తేల్చేసిన డిప్యూటీ సీఎం పవన్‌..
జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో సర్పంచ్ సంఘాల‌తో సమావేశం అయిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ వాలంటీర్‌ వ్యవస్థ రద్దుపై కీలక వ్యాఖ్యలు చేశారు.. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచుల విజ్ఞప్తిపై స్పందించిన పవన్‌.. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచలతోనే కూటమి ప్రభుత్వం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. అయితే, గత ప్రభుత్వం వారిని మోసం చేసిందని విమర్శించారు.. వాళ్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయవచ్చు.. కానీ, వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరు.. ఇదో సాంకేతిక సమస్య అన్నారు.. ఇక, గ్రామ‌ల‌కు నీళ్లు పంప‌డానికి స‌రైన పైప్ లైన్ల విష‌యంలో పూర్తిగా మార్పులు తెస్తాం.. టెక్నిక‌ల్ గా లోపాలు గుర్తించాం అన్నారు పవన్‌.. గ్రామ‌ల‌కు సంబంధించిన నిధులు విడుద‌ల‌పై ఆర్ధిక శాఖ‌తో మాట్లాతాం అన్నారు.. ఉచిత విద్యుత్ విష‌యంలో కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటాం.. ఉచిత విద్యుత్ అంశంపై కేబినెట్ లో మాట్లాడతామని తెలిపారు పవన్‌ కల్యాణ్‌.. క్వారీల‌లో బాంబు పేలినా చాలా ఇళ్ళు దెబ్బతింటాయి.. సిన‌రేజీ గురించి మాట్లాడుతాం.. బకాయిలు ల‌క్షకోట్లు దాటేలా క‌నిపిస్తోంది… మేం ప్రతీ అంశంలో పూర్తిగా క‌ట్టుబ‌డి ఉన్నాం.. స్టేట్ ఫైనాన్స్ క‌మీష‌న్ నుంచీ రావాల్సిన వాటిపైన కూడా ఆర్ధిక శాఖ‌తో మాట్లాడుతాం అన్నారు.. సర్పంచ్ అనేవాళ్లు గ్రామ ప్రధ‌మ పౌరుడు.. వారికి గౌర‌వానికి లోటుండ‌కూడదన్న ఆయన.. గాంధీ గారు పెట్టిన పంచాయితీరాజ్ చ‌ట్టాన్ని పూర్తిగా నీరుకార్చారని విమర్శించారు.. సోష‌ల్ ఆడిట్ చేయ‌డానికి ఒక డీఎస్పీ స్ధాయి అధికారిని ఏర్పాటు చేశాం.. సిటిజ‌న్ ఇన్ఫర్మేష‌న్ బోర్డులు పెట్టాల‌ని క‌చ్చితంగా చెప్పాం అన్నారు.. ప్రతి కార్యక్రమం కూడా పంచాయితీ ప్రజ‌లకు వాట్సప్ ద్వారా పంపడం పై ఆలోచిస్తున్నాం అని వెల్లడించారు. సిటిజ‌న్ ఇన్ఫర్మేష‌న్ బోర్డులు విష‌యంలో స‌ర్పంచులు కూడా బాధ్యత వ‌హించాలని సూచించారు.. మాది వినే ప్రభుత్వం.. మెత్తగా చ‌ప్పగా ఉండే ప్రభుత్వం కాదన్నారు.. ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత తీసుకున్నాక కొన్నిసార్లు తిట్లు త‌ప్పవు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్‌ కల్యాణ్.. సీఎం చంద్రబాబు నాయుడు కూడా సీరియ‌స్ అంశాల‌పై క‌చ్చితంగా స్పందిస్తారని తెలిపారు.. ఇక, వాలంటీర్ల వ్యవ‌స్ధ అనేది ఒక స‌మాంత‌ర వ్యవ‌స్థగా ఉంది.. కానీ, గ్రామ స‌చివాల‌య సిబ్బందిని ర‌ద్దు చేయ‌డంపై ఆలోచించలేదన్నారు.. వలంటీర్లను మోసం చేసి పెట్టుకున్నారు… వారి జీతాలు పెంచాల‌న్నా కూడా జీవోలో స‌రిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

 

బెంగళూరులో హైడ్రా బృందం పర్యటన.. పలు ప్రాజెక్టులపై స్టడీ
బెంగళూరులో హైడ్రా బృందం పర్యటిస్తుంది. రెండు రోజుల పాటు బెంగళూరులో హైడ్రా పర్యటన కొనసాగనుంది. కర్ణాటక ప్రభుత్వంతో పాటు CSR కింద కొన్ని కంపెనీలు అభివృద్ధి చేసిన చెరువులను హైడ్రా బృందం స్టడీ చేయనుంది. తక్కువ ఖర్చుతో బెంగుళూరులో కర్ణాటక ప్రభుత్వం 35 చెరువులను అభివృద్ధి చేసింది. చెరువుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై క్షేత్రస్థాయిలో హైడ్రా బృందం పరిశీలించనుంది. ఈ పర్యటనలో రంగనాథ్‌తో పాటు పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉన్నారు. పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత సిటీలో మొదటి దశలో నాలుగు చెరువుల ప్రక్షాళనపై ఫోకస్ పెట్టనుంది హైడ్రా. బాచుపల్లి ఎర్రగుంట చెరువు, మాదాపూర్ సున్నం చెరువు, కూకట్‌పల్లి నల్ల చెరువు, రాజేంద్రనగర్ అప్పా చెరువులకు పునరుజ్జీవం తీసుకురానుంది హైడ్రా. బెంగళూర్ పర్యటనలో భాగంగా.. కర్ణాటక స్టేట్ నేచురల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్‌ (KSNDMC)ను హైడ్రా బృందం సందర్శించింది. ముందస్తుగా వర్షం సమచారం ప్రజలకు చేర్చడం.. ఎంత మొత్తం వర్షం పడబోతోంది.. వరద ముంచెత్తే ప్రాంతాల వారిని అలర్ట్ చేయడం.. ట్రాఫిక్ జామ్ అలెర్ట్.. ప్రత్యామ్నాయ రహదారులను సూచించే విధానాలపై అధ్యయనం చేసింది. బెంగళూర్ మేఘసందేశం యాప్ పనిచేసే విధానం, ఆప్ ద్వారా ఈ ప్రాంతాల్లో ఎంత మొత్తం వర్షం పడుతోంది.. వరద, ట్రాఫిక్ జామ్, వడగళ్ల వాన ఇలా సమాచారం ఇచ్చే విధానం.. వరద ముప్పు ఉన్న ప్రాంతాలను అప్రమత్తం చేయడం.. వరద కాలువలు ఎంత మొత్తం నీరు వెళ్తోంది.. ఎక్కడ చెత్త పేరుకుపోయింది.. వివరాలను అలర్ట్ చేసే సెన్సార్ విధానంపై అధ్యయనం చేశారు. 20 ఏళ్ల డేటాతో ఎన్ని సెంటిమీటర్ల వర్షం పడితే వరద ముప్పు ప్రాంతాలను అంచనా వేయడం తదితర సమాచారం.. కర్ణాటక స్టేట్ నేచురల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్‌లో వర్షపాతం నమోదు, గాలి వేగం, ఉష్ణోగ్రతల వివరాలు చెప్పే వాతావరణ కేంద్రాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు.

 

ప్రభుత్వ ఉద్యోగాల నియామక నిబంధనలు మధ్యలో మార్చొద్దు..
సుప్రీంకోర్టు గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలకు సంబంధించిన నిబంధనలను మార్చలేమని కోర్టు పేర్కొంది. పోస్టుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత నియమాలను మధ్యలో మార్చలేమని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈ కేసు రాజస్థాన్ హైకోర్టులో ఓ ప్రభుత్వ పోస్టు రిక్రూట్‌మెంట్‌కు సంబంధించినది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పుల చెప్పింది. సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. జస్టిస్‌ హ్రిషికేశ్‌ రాయ్‌, జస్టిస్‌ పీఎన్‌ నరసింహ, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. 2008లో కె.మంజుశ్రీ వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బెంచి సమర్థించింది. ఆ కేసు తీర్పు సరైనదని.. దానిని తప్పు అని చెప్పడానికి అవకాశం లేదని పేర్కొంది. “ప్రభుత్వాలు నియామక ప్రక్రియకు ముందే నిబంధనలు సిద్ధం చేసి ఆ తర్వాతే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలి. చివరికి ఖాళీలను పూరించిన తర్వాత ఆ ప్రక్రియ ముగుస్తుంది. నిబంధనలు మార్చొచ్చని ముందుగానే చెబితే పర్వాలేదు. నియామక ప్రక్రియ నిబంధనలు ఎవరికి నచ్చినట్లు వారు మార్చడానికి వీల్లేదు. కచ్చితంగా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14కు అనుగుణంగా ఉండాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండాలి. మధ్యలో నిబంధనలు మార్చి అభ్యర్థులను ఇబ్బందిపెట్టరాదు.” అని ధర్మాసనం పేర్కొంది.

 

ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. 16ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!
ప్రస్తుతం మనిషి.. మనుషులతో కంటే.. మొబైల్‌తోనే ఎక్కువ గడుపుతున్నాడు. చిన్న పిల్లల దగ్గర నుంచి నడి వయసులో ఉన్న పెద్దోళ్ల వరకు ఫోన్‌తోనే గడుపుతున్నారు. అంతగా మనుషులు మొబైల్‌కు బానిసైపోయారు. దీనికి తోడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది. రీల్స్ చేయడం.. లేదంటే ఏవైనా ప్రోగ్రామ్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం.. ఇలా పిల్లలు బిజీ అయిపోతున్నారు. దీంతో మానవ సంబంధాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఎప్పుడైనా సోషల్ మీడియా యాప్‌ల్లో అంతరాయం కలిగితే… ఎంత గాబరాపడిపోతుంటారో. దీని బట్టి చెప్పొచ్చు. సోషల్ మీడియా ప్రభావం మనుషులపై ఎంతగా ఉందో చెప్పడానికి ఇంత కంటే మరో ఉదాహరణ లేదు. సోషల్ మీడియా యుగంలో పిల్లల భవిష్యత్ దెబ్బతినకూడదన్న ఉద్దేశంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా వెళ్తోంది. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా ఉపయోగించకుండా నిషేధించాలని ఆస్ట్రేలియా యోచిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, ఫేస్‌బుక్ మొదలైన సోషల్ మీడియా యాప్‌లను ఉపయోగించకుండా 16 ఏళ్లలోపు పిల్లలను నిషేధించడానికి ప్రపంచంలోనే ప్రముఖ చట్టాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు ఆస్ట్రేలియా తెలిపింది. ఈ చట్టాన్ని ఈ ఏడాదే ఆస్ట్రేలియా పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. చట్టం చేయగానే 12 నెలల్లోనే అమలులోకి రానుంది. చట్టసభ సభ్యులు ఆమోదించిన తర్వాత తల్లిదండ్రుల సమ్మతితో పిల్లలకు వయోపరిమితిపై ఎలాంటి మినహాయింపులు ఉండవు. సోషల్ మీడియా ప్రభావం కారణంగా యువత చెడిపోతుందన్న ఆలోచనతోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. అశ్లీల చిత్రాలు, దృశ్యాలు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వైరల్ అవుతుండడంతో ఆస్ట్రేలియా ఆందోళన వ్యక్తం చేసింది. యువత పెడదారిన పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే తల్లిదండ్రులు, మేధావులతో ఈ అంశంపై ప్రభుత్వం చర్చించింది. సోషల్ మీడియా కారణంగా పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నట్లు కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. కచ్చితంగా సోషల్ మీడియాపై నిషేధం విధించాలని ప్రభుత్వానికి తల్లిదండ్రులు, మేధావులు సూచించారు. చట్టం అమల్లోకి వస్తే.. వయసును నిర్ధారించడానికి ప్రత్యేకమైన eSafety కమీషనర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే eSafety కమీషనర్ జరిమానాలు విధించనుంది. నవంబర్‌లోనే ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టడానికి కసరత్తు చేస్తున్నారు.

Show comments