నేను 1995 సీబీఎన్ తప్ప 2014 కాదు..
తాను 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడుని తప్ప, 2014 నాటి చంద్రబాబు కాదని వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు. చేసిన తప్పులను సరిదిద్దడం ఒక సమస్య అయితే, వాటిని చేసిన వారిని ఎదుర్కోవడం మరో సమస్య అని పేర్కొన్నారు.. కర్నూలు పర్యటనలో బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. మామిడి కాయలు తెచ్చి రోడ్లపై పడేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో బలప్రదర్శన చేయాలని, కానీ ప్రజల ప్రాణాలు, ఆస్తులకు భద్రత ఉండాలా లేదా అన్నది ఆలోచించాలని హెచ్చరించారు. రాయలసీమను ప్రపంచానికి హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ప్రకటించారు. ముచ్చుమర్రి, పోతురెడ్డిపాడు ఉన్నప్పటికీ డబ్బుల కక్కుర్తితో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ తెచ్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అనుమతులు లేకపోవడంతో ఎన్‌జీటీ పనులు నిలిపివేస్తే తనపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.
బాత్‌రూమ్ క్లీన్ చేసే కెమికల్స్‌తో తిరుమల లడ్డూ.. సీఎం సంచలన వ్యాఖ్యలు..
ఆలయ ప్రసాదాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న సమయంలో.. కర్నూలు పర్యటనలో కీలక కామెంట్లు చేశారు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఐదేళ్లు ఆలయాల్లో కల్తీ నెయ్యితో ప్రసాదాలు పంచారని ఆరోపించారు.. శ్రీశైలం ప్రసాదంలోనూ కల్తీ జరిగిందన్న ఆయన.. బాత్‌రూమ్‌లు క్లీన్ చేసే కెమికల్స్‌తో తిరుమల లడ్డూ తయారు చేశారని కీలక వ్యాఖ్యలు చేవారు.. NDDB నివేదిక ఆధారంగానే మాట్లాడుతున్నాను అన్నారు.. అయితే, సీబీఐ, సిట్ క్లీన్‌చిట్ ఇచ్చినట్లు మాట్లాడుతున్నారు.. కానీ, కల్తీ జరిగినట్టు సిట్ రిపోర్టులో ఉందని వైవీ సుబ్బారెడ్డే చెప్పారని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు ..ఐదేళ్ల పాటు తిరుమలలో లడ్డూలకు ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. బాత్‌రూమ్‌లు శుభ్రం చేసే రసాయనాలు, కూరగాయల్లో వాడే రసాయనాలతో నెయ్యి కల్తీ చేశారని చెప్పారు. శ్రీశైలంలో కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు. రిపోర్ట్‌లో ఎనిమల్ ఫ్యాట్ ఉందని తేలితే అదే నిజాన్ని చెప్పానని స్పష్టం చేశారు. గతంలో లడ్డూ రుచి, ఇప్పటి లడ్డూ రుచి ఒకటేనా కాదా ప్రజలే చెప్పాలని ప్రశ్నించారు. వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడాలని అడిగితే సహించరా అని మండిపడ్డారు చంద్రబాబు..
హైకోర్టులో అంబటి రాంబాబు 7 క్వాష్ పిటిషన్లు..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు మొత్తం ఏడు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. తనపై వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఆయన ఈ పిటిషన్లు వేశారు. పట్టాభిపురం, నగరం పాలెం, మంగళగిరి, నల్లపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులను క్వాష్ చేయాలని అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే నల్లపాడు పోలీస్ స్టేషన్ కేసుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ విచారణను ఈ నెల 11వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో 35(3) BNSS ప్రక్రియను తప్పనిసరిగా అనుసరించాలని మంగళగిరి పోలీసులకు ఈ రోజు ఏపీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో అంబటి రాంబాబు పై పిటి వారెంట్ పొందేందుకు మంగళగిరి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన ఐదు కేసులకు సంబంధించి దాఖలైన క్వాష్ పిటిషన్లు వచ్చే సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని న్యాయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ కేసులపై హైకోర్టు తీసుకునే నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
మనం కర్మకు వదిలేసి వెళ్లిపోతున్నాం.. ఇది మారాల్సిందే.. పవన్ కీలక వ్యాఖ్యలు..
ప్రతి భక్తుడికి ధార్మిక బాధ్యత ఉండాలని అన్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. దేవుడిపై భయం, ధర్మంపై గౌరవం ఉన్న సాధారణ హిందూ మనస్తత్వంలోని నిద్రావస్థ నుంచి, సౌకర్య భావన నుంచి మనం బయటకు రావాలి అని కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ, ఎవరు మన హిందూ దేవుళ్లను అవమానించినా, మన ధర్మాన్ని ఎగతాళి చేసినా, మనం లోపలే బాధపడి, కర్మకు వదిలేసి, ముందుకు వెళ్లిపోతున్నాం అన్నారు. అయితే, ఇది మారాల్సిందే అని పిలుపునిచ్చారు పవన్ కల్యాణ్.. కులం, మతం, ప్రాంతం, భాషలతో మనం విభజించబడి ఉన్నా, మన ధర్మం ఒక్కటే.. దేవుళ్లు కూడా ఒక్కటే.. మన ధర్మాన్ని, విశ్వాసాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించినప్పుడు, మన బాధను గొంతెత్తి చెప్పడం మన బాధ్యత అన్నారు పవన్.. అలాంటి సందర్భాల్లో మౌనం సమిష్టి మనస్సాక్షిని బలహీనపరుస్తుంది అన్నారు..భక్తులుగా మాత్రమే కాకుండా, మన విశ్వాసానికి జాగ్రత్తగా కాపలాదారులుగా కూడా మనం వ్యవహరించాలి అని పిలుపునిచ్చారు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం అంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండటం కాదు. అది కేవలం మన ధర్మాన్ని మనమే రక్షించుకోవడమే అంటూ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్..
టీ20 వరల్డ్‌కప్‌కు ముందు Rinku Singhకు షాక్.. సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్!
ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 ప్రారంభానికి ముందు టీమిండియా స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ సైబర్ నేరగాళ్ల బారిన పడ్డాడు. అతని ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం (ఫిబ్రవరి 7) నుంచి భారత్ లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌లో తొలి రోజే టీమిండియా అమెరికా (USA)తో మ్యాచ్ ఆడనుంది. టోర్నమెంట్‌కు జట్టు సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన వెలుగులోకి రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్‌కు చెందిన రింకూ సింగ్ ఫేస్‌బుక్ అకౌంట్ ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని రింకూ స్వయంగా పోలీసులకు ఫోన్ ద్వారా తెలియజేశారని అలీగఢ్ ఎస్ఎస్పీ నీరజ్ జాదౌన్ తెలిపారు. కొంతకాలంగా ఆ అకౌంట్‌ను ఉపయోగించడం లేదని, కానీ అందులో సందేహాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని రింకూ తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయమై రింకూ సోదరుడు సోను పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ అకౌంట్ ఎప్పుడు హ్యాక్ అయ్యింది? హ్యాకర్లు ఎవరు అనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. రింకూ సింగ్ సంబంధించిన ఫేస్‌బుక్ అకౌంట్ కు దాదాపు 1.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
15 సిక్సర్లు, 15 ఫోర్లు.. ఏంటయ్యా వైభవ్.. నీ దెబ్బకు ప్రత్యర్ధులు కెరియర్ కోల్పోవాలా ఏంటి?
అండర్-19 వరల్డ్‌కప్ 2026 ఫైనల్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ ఆయుష్ మహాత్రే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీనితో బ్యాటింగ్ మొదలు పెట్టిన టీమిండియాకు మంచి ఆరంభం లభించింది. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ “నభూతో నభవిష్యత్” అన్నట్లుగా రెచ్చిపోయాడు. మరొకసారి తన అద్భుత ఇన్నింగ్స్ తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు మరోసారి తిప్పుకున్నాడు. ఇలా ఎన్ని చెప్పిన తక్కువే వైభవ్ ఇన్నింగ్స్ చూస్తే. అవును ఇంగ్లాండ్ తో హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ఈ 14 ఏళ్ల ఓపెనర్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఎన్నో రికార్డులు బద్దలుకొట్టాడు. ఇక ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో వైభవ్ కేవలం 80 బంతుల్లో 175 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉండటం చుడితే అతడి బ్యాటింగ్ ఏ రేంజ్ లో చేసాడో అర్థం చేసుకోవచ్చు. ఏకంగా 218.75 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి బౌలర్లకు ఫ్యూచర్లో వారి కెరియర్ ను ప్రశ్నార్ధకం చేసాడంటే నమ్మండి. డబుల్ సెంచరీకి చేరువైనప్పటికీ చివరకు 175 పరుగుల వద్ద అతని ఇన్నింగ్స్ ముగిసింది. దీనితో అండర్ 19 చరిత్రలో ఒక్క ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా రికార్డుకు ఎక్కాడు.
జపాన్ మ్యాగజైన్‌పై ప్రభాస్ రాజసం.. సోలోగా మెరిసిన తొలి ఇండియన్ హీరో!
జపాన్‌లో ‘డార్లింగ్’ ప్రభాస్ సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. ప్రఖ్యాత జపాన్ మ్యాగజైన్ అనన్ బ్యాక్ కవర్‌పై కనిపించనున్న తొలి ఇండియన్ సోలో హీరోగా ప్రభాస్ హిస్టరీ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. గతంలో ‘RRR’ సినిమా సందర్భంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి ఈ మ్యాగజైన్ కవర్‌పై కనిపించగా.. ఇప్పుడు ప్రభాస్ ఒక్కడే సోలోగా తన చరిష్మాతో మ్యాగజైన్‌ను అలంకరించడానికి రెడీ అవుతున్నారు. ఫిబ్రవరి 10న విడుదల కానున్న ఈ మ్యాగజైన్ కవర్ పేజీ ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ‘బాహుబలి’ సిరీస్ నుంచి ప్రభాస్‌కు జపాన్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇటీవల ‘కల్కి 2898 AD’ కూడా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. గతంలో జపాన్ అభిమానులకు ఇచ్చిన మాట ప్రకారం, ప్రభాస్ గత డిసెంబర్‌లో టోక్యో పర్యటించారు. ఆ పర్యటనలోనే ఈ స్పెషల్ కవర్ ఫోటో షూట్ జరిగింది. ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’, సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ‘కల్కి 2’ షూటింగ్‌లో కూడా ప్రభాస్ పాల్గొననున్నారు.
ఇదేమి ‘యాటిట్యూడ్’ చంద్రహాస్.. మస్త్ ఉందిలే!
తెలుగు సినిమా అంటే ఇవాళ ఒక బ్రాండ్. నార్త్ నుంచి సౌత్ దాకా, అమెరికా నుంచి జపాన్ దాకా ‘తెలుగు’ అనే మాట ఒక ప్రభంజనం. మన నటుల క్రమశిక్షణ, మన దర్శకుల సృజనాత్మకత మనల్ని ప్రపంచం నెత్తిన కూర్చోబెట్టాయి. కానీ.. ఈ వెలుగుల వెనుక కొన్ని చీకటి కోణాలు కూడా తయారవుతున్నాయి. టాలెంట్ అంటే ఏంటో తెలియక ముందే.. స్టార్‌డమ్ అంటే అర్థం కాకముందే.. కొందరు కుర్ర హీరోలు అహంకారాన్ని నెత్తినేసుకుని తిరుగుతున్నారు. ‘యాటిట్యూడ్ స్టార్’ అని పిలిపించుకుంటున్న చంద్రహాస్.. ఇప్పుడు చేస్తున్న రచ్చ చూస్తుంటే ఒక అద్భుతమైన పరిశ్రమ పరువును బజారున పడేస్తున్నట్లు కనిపిస్తోంది. ‘బరాబర్ ప్రేమిస్తా’.. ఈ సినిమా టైటిల్‌లో ఉన్నంత ప్రేమ, ఆ సినిమా ప్రమోషన్లలో కనిపించడం లేదు. ఇటీవల జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ సాక్షిగా చంద్రహాస్ తనలోని అసలైన ‘యాటిట్యూడ్’ను బయటపెట్టాడు. సినిమాలోని క్యారెక్టర్ గురించి చెప్తున్నానని అంటూనే.. అత్యంత అసభ్యకరమైన, సభ్య సమాజం తలదించుకునే పదజాలంతో పాట పాడాడు. వేదికపై తన తల్లిదండ్రులు ఉండగానే.. ఆ బూతులు ఎలా నోటికొచ్చాయి?. ఇండస్ట్రీలో సీనియర్ నటులు, మహిళలు ఉన్నారని కూడా మర్చిపోయారా?. సినిమాలో బూతులు ఉండటం వేరు.. లైవ్ ఈవెంట్‌లో, పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌పై మైక్ పట్టుకుని బూతులు వాడటం వేరు. ఇది కేవలం పొరపాటు కాదు.. పక్కా ప్లాన్ ప్రకారం చేసిన పబ్లిసిటీ స్టంట్.
