NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

పీసీబీ ఫైల్స్, రిపోర్టుల దగ్ధం.. డిప్యూటీ సీఎం పవన్‌ సీరియస్‌..
కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఫైల్స్, రిపోర్టుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఆరా తీశారు.. కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించిన ఫైల్స్, రిపోర్టులను కృష్ణా నది కరకట్టపై దగ్ధం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. దగ్ధం చేసిన ఫైల్స్, రిపోర్టులకు సంబంధించిన వివరాలను తక్షణమే అందించాలని ఆదేశించారు.. ఈ దగ్ధం వెనక ఎవరెవరు ఉన్నారు అని ఆరా తీసిన పవన్. ఇందుకు బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలకు ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు.. అసలు, పీసీబీ కార్యాలయాల్లో ఫైల్స్, రిపోర్టులు ఏ మేరకు భద్రంగా ఉన్నాయి.. భద్రపరచేందుకు అనుసరిస్తున్న విధానాలు ఏమిటో వెల్లడించాలని ఆధికారులకు ఆదేశించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌. అయితే, ఎక్సైజ్ శాఖలో పీసీబీ ఫైల్స్ దగ్ధం ఘటన సంచలనంగా మారింది.. సమీర్ శర్మ ఓఎస్డీ రామారావు పాత్ర ఉండడంతో ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల్లో చర్చ మొదలైంది.. ఎక్సైజ్ శాఖలో సుదీర్ఘ కాలం పని చేశారు రామారావు. ఓఎస్డీ రామారావు గురించి వెలుగులోకి ఆసక్తికర వ్యవహారాలు వస్తున్నాయి.. కొత్త ప్రభుత్వంలోని ముఖ్యులకు తాను ఓఎస్డీగా వెళ్తానంటూ గత కొంత కాలంగా రామారావు ప్రచారం చేసుకున్నారట.. పీసీబీపై రివ్యూ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో తానున్న ఫొటోను తన సన్నిహితుల గ్రూపుల్లో పెట్టారట రామారావు. అంతేకాదు.. పవన్ సహా ఇంకొందరు మంత్రులకు తాను సన్నిహితమని ప్రచారం చేసుకుంటున్నారని ఎక్సైజ్ శాఖలో చర్చ సాగింది.. ముఖ్యుల తెర వెనుక వ్యవహారాలను చక్కబెట్టడంలో రామారావు దిట్ట అని ఎక్సైజ్ శాఖ వర్గాలు చర్చించుకుంటున్నాయి.. ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల బదిలీలు.. ఆర్వోఆర్ విషయాల్లో భారీ అక్రమాలకు తెర తీశారని రామారావుపై అభియోగాలు ఉన్నాయి. 2014-19 మధ్య కాలంలో రామారావు అక్రమాలపై నాటి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారట అప్పటి మంత్రి జవహర్.. పట్టుబట్టి రామారావును అప్పట్లో బదిలీ చేయించారట.. మళ్లీ ఇప్పుడు ఫైళ్ల దగ్దం ఘటనలో రామారావు పేరు రావడంపై ఎక్సైజ్ శాఖలో ఆసక్తికర చర్చ సాగుతోంది.

మైనర్ బాలికపై లైంగిక వేధింపులు..! మాజీ ఎమ్మెల్యేపై పోక్సో కేసు
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత సుధాకర్‌పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.. ఓ మైనర్‌ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌పై ఆరోపణలు వచ్చాయి.. దీంతో ఇంటిలో ఉన్న మాజీ ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించినట్టుగా తెలుస్తోంది.. అయితే, మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఎన్నికల సమయంలోనే సుధాకర్‌పై ఆరోపణలు వచ్చాయి.. బాలికపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తూ వైరల్ గా మారిపోయింది.. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు.. ఇదే సమయంలో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ వ్యవహారం.. ఇప్పుడు కోడుమూరుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది.

గంజాయి కట్టడికి కఠిన చర్యలు.. ANTF ఏర్పాటు..
గంజాయి కట్టడికి కఠిన చర్యలకు దిగుతోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. గంజాయి నివారణపై ఏర్పాటు చేసిన కేబినెట్‌ సబ్‌ కమిటీ ఈ రోజు సమావేశమై చర్చించింది.. బోర్డర్లల్లో చెక్ పోస్టులను పటిష్టం చేయాలని అధికారులకు మంత్రివర్గ ఉప సంఘం సూచించింది. గంజాయి సాగుని అరికట్టేలా చర్యలు చేపట్టాలన్నారు మంత్రులు. గంజాయి సాగు చేసే పేదలు, గిరిజనులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది కేబినెట్‌ సబ్‌ కమిటీ.. ఇక, మీడియాతో మాట్లాడిన హోం మంత్రి అనిత.. గంజాయి సాగు చేయాలని గిరిజనులను కొందరు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.. పేద గిరిజనులు కాఫీ సాగు వైపు కాకుండా.. గంజాయి సాగు వైపు మళ్లించేలా కొందరు ప్రలోభాలకు గురి చేస్తున్నారని.. గత ప్రభుత్వం సెబ్ ఏర్పాటు చేసినా గంజాయితో పాటు ఇసుక, ఎర్ర చందనం అక్రమ రవాణ బాధ్యతలు కూడా సెబ్ కే కేటాయించారని ఆరోపించారు. అయితే, గంజాయి నివారణకు కఠిన చర్యలు తీసుకుంటాం అని ప్రకటించారు మంత్రి అనిత.. యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ (ANTF) ఏర్పాటు చేస్తాం అన్నారు. ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ANTF ఏర్పాటు చేస్తామని.. గంజాయి కట్టడికి.. ఫిర్యాదులు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. గంజాయికి బాధితులకు డి-ఎడిక్షన్ సెంటర్లపై ఫోకస్ పెడతాం. సరైన ఉపాధి, విద్యా సౌకర్యం లేకపోవడం వల్ల గిరిజన యువత పక్కదారి పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 80 శాతం గిరిజనులే గంజాయి క్యారియర్లుగా ఉన్నారు. జైళ్లల్లో 15 ఏళ్ల నుంచి గంజాయి రవాణా చేసిన గిరిజన యువకులు ఉన్నారు. గంజాయిని ప్రొత్సహిస్తోన్న కింగ్ పిన్ల మీద ఫోకస్ పెడతాం అని హెచ్చరించారు. 100 రోజుల్లో గంజాయిని వీలైనంత వరకు కట్టడి చేసేలా ప్రణాళిక సిద్దం చేస్తాం. గంజాయిని అరికట్టేలా పొరుగు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడతాం అన్నారు మంత్రి అనిత.

విలువలతో కూడిన రాజకీయాలు.. ప్రజలకు మార్పు చూపించాలనే మా ఆలోచన
పారదర్శకంగా విలువలతో కూడిన రాజకీయాలు చేసి ప్రజలకు మార్పు చూపించాలని మా ఆలోచన అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్‌.. గత ఐదేళ్ల పాలన వలన రైతులు ఎంతో ఆవేదనతో ఇబ్బందులు ఎదుర్కొని చితికిపోయారు.. రైతు భుక్తే ప్రమాదంలోకి నెట్టేశారు.. రైతుల దగ్గర కొనుగోలు చేసిన ఆహార ధాన్యాలకు కూడా బకాయిలు పెట్టేశారు.. 36,300 కోట్ల రూపాయల అప్పుల పాలు చేశారు… 1659 కోట్ల రూపాయలు రైతులకు బకాయి పెట్టారని మండిపడ్డారు.. అయితే, రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యానికి బాధ్యత మాది.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రైతుల అంశంపై సానుకూలంగా స్పందించారు.. రైతుల‌ బకాయిలు తీర్చడానికి 1000 కోట్ల రూపాయలు సీఎం చంద్రబాబు మంజూరు చేశారని వెల్లడించారు. ఇక, ఆహార భద్రత కూడా మా బాధ్యత.. బియ్యం, నిత్యవసర సరుకులు తూకంలో తేడా వచ్చినా, పక్కదారి పట్టించినా ఉపేక్షించేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు మంత్రి నాదెండ్ల.. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబం చేసిన అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిందని ఆరోపించిన ఆయన.. ఇంకా తనిఖీలు చేస్తాం.. ద్వారంపూడి కుటుంబంపై చర్యలుంటాయని స్పష్టం చేశారు.. కచ్చితంగా స్ధానిక కలెక్టర్ తో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తున్నాం.. రైతుల పొట్ట కొట్టిన వారి పై చర్యలుంటాయి.. సక్రమ పంపిణీ జరపడం జిల్లా యంత్రాంగం బాధ్యత.. పారదర్శకంగా విలువలతో కూడిన రాజకీయాలు చేసి ప్రజలకు మార్పు చూపించాలని మా ఆలోచన అన్నారు.

మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నియామకంపై అధిష్టానందే నిర్ణయం..
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నియామకంపై మరోసారికి ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. అధిష్టానం ఇంకా ఏమీ ఖరారు చేయలేదు. ఈరోజు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అవుతుందనే దానికి మళ్లీ బ్రేక్ పడింది. కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి ఈ విషయాలపై చర్చించారు. అయినప్పటికీ ఈ అంశం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఈ క్రమంలో.. సీఎం రేవంత్ రెడ్డిమాట్లాడుతూ.. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నియామకం పై ఏఐసీసీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. బాల్ ఏఐసీసీ కోర్టులో ఉంది.. ఎందుకు ఆలస్యం అవుతుందనేది ఏఐసీసీ అధిష్టానం చెప్పాలన్నారు. కేబినెట్ విస్తరణ, నూతన పీసీసీ నియామకం జరగాలని ఏఐసీసీ అధ్యక్షున్ని కోరాం.. ఏఐసీసీ హైకమాండ్ పరిశీలనలో ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. మరోవైపు.. బీఆర్ఎస్, బీజేపీపై సీఎం విమర్శలు గుప్పించారు. సింగిల్ సీటు పార్లమెంట్ లో లేదు.. బీఆర్ఎస్ ను టార్చ్ లైట్ వేసుకొని కేసీఆర్ వెతుక్కోవాలని విమర్శించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో.. ప్రజలు విసిగి చెంది ఇండియా కూటమికి ఎక్కువ సీట్లు కట్టబెట్టారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. అమిత్ షాకు ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం పై చర్చించుకుంటున్నామని చెప్పాం.. కేంద్రం సహకరించాలని చెప్పామన్నారు. రాముడి గుడితో పాటూ.. దేవుడి మాన్యాలు.. ఇలా ఎన్నో అంశాలు పరిష్కారం కావాల్సి ఉందన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య పరిష్కారం జరిగేటివి జరుగుతాయి.. లేదంటే కేంద్రం ఎలాగు ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావు అరెస్ట్..
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ నిందితుడు, టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. చంచల్ గూడా జైల్లో ఉన్న రాధాకృష్ణ రావును పీటీ వారెంట్ పై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ల్యాండ్ వ్యవహారంలో వ్యాపారవేతను బెదిరించినదుకు జూబ్లీహిల్స్ లో రాధ కిషన్ పై కేసు నమోదైంది. అంతేకాకుండా.. కంపెనీ వ్యవహారంలో రాధా కిషన్ రావు జోక్యం చేసుకొని సెటిల్మెంట్ చేశారని ఆరోపణలు వచ్చాయి. రూ. 150 కోట్ల కంపెనీని తక్కువ ధరకు మరొకరికి ఇప్పిచ్చారని రాధాకృష్ణన్ రావు పై ఫిర్యాదు నమోదైంది.

న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్‌ సభ్యురాలిగా బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్‌ నియామకం
న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీ బాన్సురి స్వరాజ్‌కు హోం మంత్రిత్వ శాఖ కీలకమైన బాధ్యతలను అప్పగించింది. న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (NDMC) సభ్యురాలిగా బాన్సురి స్వరాజ్‌ను నియమించింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను హోం మంత్రిత్వ శాఖ జులై 3న విడుదల చేసింది. ఆ తర్వాత బుధవారం నాడు ఎన్‌డీఎంసీ సభ్యురాలిగా బాన్సురి స్వరాజ్ ప్రమాణ స్వీకారం చేశారు. బాన్సురి స్వరాజ్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్‌లో తన పోస్ట్‌ను కూడా పంచుకున్నారు. ఎన్‌డీఎంసీ చైర్మన్‌గా ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసి అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సతీష్ ఉపాధ్యాయ పాల్గొన్నారు. బాన్సురి స్వరాజ్‌ 2024 లోక్‌సభ ఎన్నికల్లో న్యూఢిల్లీ స్థానం నుంచి ఆప్‌కి చెందిన సోమనాథ్ భారతిపై పోటీ చేశారు. బాన్సురి స్వరాజ్ కంటే ముందు న్యూఢిల్లీ స్థానం బీజేపీ నాయకురాలు మీనాక్షి లేఖి వద్ద ఉండేది. బన్సూరి స్వరాజ్ మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె. ఆమె తండ్రి పేరు స్వరాజ్ కౌశల్, వృత్తిరీత్యా న్యాయవాది. స్వరాజ్ కౌశల్ మిజోరాం మాజీ గవర్నర్‌గా కూడా ఉన్నారు. బాన్సురీ స్వరాజ్ ఆమె తల్లిదండ్రులకు ఏకైక సంతానం. ఆమె జనవరి 3, 1984న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. బాన్సురి స్వరాజ్ 2007లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో నమోదు చేసుకున్నారు. ఆమె గత కొన్నేళ్లుగా న్యాయవాద వృత్తిలో ఉన్నారు. ఆమె క్రిమినల్ లాయర్‌గా విధులు నిర్వర్తించారు. వార్విక్ విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్ల సాహిత్యంలో బీఏ(ఆనర్స్), ఆమె ప్రతిష్టాత్మకమైన బీపీపీ లా స్కూల్, లండన్‌లో న్యాయశాస్త్రం అభ్యసించారు. ఆ తర్వాత న్యాయవాదిగా అర్హత సాధించారు. దీని తర్వాత బాన్సురి స్వరాజ్ సెయింట్ క్యాథరిన్స్ కళాశాల, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్ స్టడీస్ పూర్తి చేశారు.

కూలీలను కలిసిన రాహుల్ గాంధీ.. ఆసక్తికర చర్చ
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీలోని జీటీబీ నగర్ చేరుకున్నారు. అక్కడ రోజువారీ కూలీలను కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు ఏం పనిచేస్తారో తెలుసుకున్న రాహుల్ మెటీరియల్ ఎక్కడ నుంచి తీసుకొస్తారని అడిగారు. సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో రాహుల్ గాంధీ కూలీలు, కార్మికుల మధ్య కూర్చున్నారు. కింగ్స్‌వే క్యాంపులోని లేబర్‌ చౌక్‌లో ఆయన చాలా సేపు కార్మికులతో చర్చించారు. ఆ వీడియోలో రాహుల్ గాంధీ చుట్టూ చాలా మంది గుమిగూడి ఉన్నారు. రాహుల్ గాంధీ కార్యకర్తల మధ్య కూర్చొని వారిని ప్రశ్నలు అడిగారు . కాంగ్రెస్ తన సోషల్ మీడియా ఖాతాలో ఫోటోలను షేర్ చేసింది. “ఢిల్లీలోని జీటీబీ నగర్‌లో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కార్మికులతో సమావేశమై వారి సమస్యలను విన్నవించారు. కష్టపడి పనిచేసే ఈ కార్మికులు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. వారి జీవితాలను సులభతరం చేయడం మరియు వారి భవిష్యత్తుకు భద్రత కల్పించడం మన బాధ్యత.” అని రాసుకొచ్చింది. ఇంతకు ముందు కూడా రాహుల్ గాంధీ చాలాసార్లు కూలీలు, కార్మికులు, రైతుల మధ్యకు వెళ్లారు. ఏడాది క్రితం రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఓ గ్యారేజీకి చేరుకున్నారు. అక్కడ మెకానిక్‌లతో కలిసి పనిచేశారు. ఆ సమయంలో వైరల్‌గా మారిన ఫొటోల్లో రాహుల్ గాంధీ బైక్ రిపేర్ చేస్తున్నట్టు కనిపించారు. అతని చేతిలో స్క్రూ డ్రైవర్ ఉంది. దానితో అతను స్క్రూలు బిగిస్తూ.. కనిపించారు.

ఫైవ్ స్టార్‌ హోటల్‌ను తలపించేలా భోలే బాబా ఆశ్రమం.. బాబాకు అన్ని కోట్ల ఆస్తులా?
ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్‌లో నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 123 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మృతుల్లో అత్యధికంగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన అధికారులు భోలే బాబా ఆశ్రమంలో నిర్వహించారు. ఈ తనిఖీల్లో భోలే బాబా ఆశ్రమం 13 ఎకరాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆశ్రమం ఫైవ్ స్టార్‌ హోటల్‌ను తలపించేలా ఉన్నట్లు తెలిసింది. భోలే బాబా అని పిలవబడే నారాయణ్ సాకర్ హరి మెయిన్‌పురి బిచ్వాలో కోట్ల విలువైన విలాసవంతమైన ఆశ్రమంలో నివసించారు. ‘ప్రవాస్ ఆశ్రమం’ అని పిలవబడే ఈ భవనం అలీఘర్-గుజరాత్‌ రహదారిపై 13 ఎకరాల స్థలంలో నిర్మించబడింది. ఈ విలాసవంతమైన భవనంలో అన్ని ఫైవ్-స్టార్ సౌకర్యాలతో పాటు బాబాకు చెందిన లగ్జరీ కార్లను ఉంచడానికి పెద్ద గ్యారేజీ ఉంది. విలాసవంతమైన కార్ల సముదాయాన్ని ఉంచడానికి భారీ గ్యారేజీ ఉంది. ఈ విలాసవంతమైన ఆశ్రమంలో బాబా కోసం ప్రత్యేకంగా ఆరు గదులను కేటాయించినట్లు వెల్లడైంది. ఆశ్రమం కోసం భూమిని మెయిన్‌పురికి చెందిన వినోద్‌బాబు విరాళంగా ఇచ్చారని తేలింది. భోలే బాబా తన ఆశ్రమ ద్వారం వెలుపల 200 మంది పెద్ద దాతల జాబితాను కూడా ఉంచాడు. జాబితాలో మొదటి పేరు వినోద్‌బాబు. ఆ తర్వాత రూ.2.5 లక్షల నుంచి రూ.25 వేల వరకు విరాళాలు ఇచ్చిన 199 మంది పేర్లు ఉన్నాయి. రూ.10 వేల లోపు విరాళం ఇచ్చిన దాతల పేర్లు జాబితాలో లేవు. షాజహాన్‌పూర్, ఆగ్రా వంటి ఉత్తరప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాలలో భోలేబాబాకు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని కూడా వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా, ఆశ్రమం వెలుపల ఉన్న భూమిలో భోలే బాబా తన సత్సంగాలు (మతపరమైన సమావేశాలు) నిర్వహించేవాడు. ఈ భూమిని పేద గ్రామస్థులు ఆశ్రమం కోసం తనకు విరాళంగా ఇచ్చినట్లు భోలే బాబా గతంలో పేర్కొన్నారు. ఆశ్రమంలో ప‌లు కీల‌క డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేశంలోని ఇత‌ర ప్రాంతాల్లో కూడా బాబాకు ఆశ్రమాలు ఉన్నాయి. వీటి విలువ రూ. కోట్లలో ఉంటుంద‌ని పోలీసులు అంచ‌నా వేశారు.

మాస్కోను ఠారెత్తిస్తున్న ఎండలు.. వందేళ్ల రికార్డ్ బద్దలు
గత వందేళ్లలో ఎన్నడూ లేని ఎండలు రష్యాను హడలెత్తిస్తున్నాయి. ప్రస్తుతంలో రష్యాలో హీట్ వేవ్‌ పరిస్థితులు భీకరంగా కొనసాగుతున్నాయి. జూలై ఆరంభం నుంచి ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఇక గురువారం మాస్కోలో 1917 రికార్డును బద్దలు కొట్టింది. మైనస్ 40 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే మాస్కోలో జూలై 3న 32.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం మరింత పెరిగి 1917 రికార్డ్‌ను బద్దలు కొట్టింది. ఇక రష్యా అంతటా 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంత వేడి వాతావరణం ఉన్న కూడా రష్యన్లు మాత్రం ధైర్యంగానే ఎదుర్కొంటున్నారు. రష్యాలోని పసిఫిక్ తీరం, సైబీరియా అడవుల నుంచి యూరోపియన్ భాగాల వరకు హీట్‌వేవ్ రికార్డులు బద్దలయ్యాయి. ఇక వేడి వాతావరణం కారణంగా ఎయిర్ కండిషనర్లకు డిమాండ్ పెరిగింది. అలాగే ఐస్‌క్రీమ్‌లు, డ్రింక్స్‌ విపరీతంగా సేల్ అవుతున్నాయి. హీట్‌వేవ్‌ను తట్టుకునేందుకు ప్రజలు వీటిపైన ఆధారపడుతున్నారు. ఇక మెట్రో రైళ్లలో ప్రయాణికులకు నీటిని అందిస్తున్నారు. మాస్కోలో 20 మిలియన్లకు పైగా జనాభా ఉన్నారు. హీట్‌వేవ్ పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు అయితే తప్ప బయటకు వెళ్లొద్దని పేర్కొన్నారు. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు.

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ అస్థిరత మధ్య గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బుధవారం రెండు సూచీలు జీవనకాల గరిష్ఠాలను నమోదు చేశాయి. ఇక గురువారం ఆరంభంలోనూ అదే దూకుడు కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు సూచీలకు గట్టి ఊపునిచ్చాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ సూచీ 80,331 దగ్గర జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 71 పాయింట్లు పుంజుకొని 24,357 దగ్గర ట్రేడ్ అయింది. ఒక దశలో 24,372 దగ్గర రికార్డు స్థాయిని అందుకుంది. అనంతరం సూచీలు నెమ్మది నెమ్మదిగా డౌన్ అయిపోయాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 62 పాయింట్లు లాభపడి 80, 049 దగ్గర ముగియగా.. నిఫ్టీ 15 పాయింట్లు లాభపడి 24, 302 దగ్గర ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.54 దగ్గర ప్రారంభమైంది. ఇక ఐటీ రంగం వెలిగిపోయింది. నిఫ్టీలో అత్యధికంగా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ లాభపడగా.. టాప్ లూజర్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, విప్రో, టెక్ మహీంద్రా, అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఉన్నాయి.

ప్రధాని మోడీతో ఇండియా క్రికెటర్లు స్పెషల్ మీట్.. ఫొటోలు వైరల్
టీ20 ప్రపంచకప్‌ 2024లో టీమిండియా ట్రోఫీ సాధించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈరోజు ఉదయం భారత క్రికెటర్లు స్వదేశానికి వచ్చారు. అనంతరం.. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ప్రధానితో కలిసి భారత ఆటగాళ్లంతా అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ప్రతీ క్రికెటర్‌ను ప్రధాని ఆప్యాయంగా పలకరించి.. అభినందనలు తెలిపారు. టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీతో ప్రధాని ఫొటోలు దిగారు. ఆటగాళ్లతో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా మోడీని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం భారత క్రికెటర్స్ ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు బయల్దేరారు. భారత క్రికెటర్లు నేరుగా ముంబైకి వెళ్లారు. కాసేపట్లో ఓపెన్ టాప్‌ బస్‌లో రోడ్‌షో నిర్వహించనున్నారు. అభిమానులందరూ ఈ వేడుకలో పాల్గొననున్నారు. కాగా.. ఇప్పటికే ముంబైలో భారీ ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. రోడ్‌షో అనంతరం వాంఖడేలో ఆటగాళ్లను బీసీసీఐ సన్మానించనుంది. టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు 13 ఏళ్ల తర్వాత భారత్ ప్రపంచకప్‌ నెగ్గింది. చివరిగా ఎంఎస్ ధోనీ నాయకత్వంలో 2011 వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను దక్కించుకోవడానికి ఏకంగా 17 ఏళ్లు పట్టింది. మొదటి ఎడిషన్ 2007లో ఎంఎస్ ధోనీ సారథ్యంలోనే భారత్ పొట్టి కప్ గెలిచింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర పడడంతో భారత అభిమానుల్లో చెప్పలేని ఆనందం నెలకొంది.

నక్క తోక తొక్కిన నిహారిక.. ఏకంగా గీతా ఆర్ట్స్ సినిమాతో?
కంటెంట్ క్రియేటర్ గా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన నిహారిక ఎన్ఎం గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించనున్న సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఈ రోజు ఆమె బర్త్ డే సందర్భంగా విషెస్ అందిస్తూ టాలీవుడ్ లోకి వెల్కమ్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది గీతా ఆర్ట్స్ సంస్థ. చెన్నైలో పుట్టిన నిహారిక బెంగళూరులో పెరిగింది. యూఎస్ కాలిఫోర్నియాలోని చాప్ మాన్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసింది. థియేటర్ ఆర్ట్స్ మీద చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉన్న నిహారిక తన పదో తరగతిలో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. వివిధ అంశాలపై తన అభిప్రాయాలు తెలిపేలా ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ సబ్ స్క్రైబర్స్ ని ఆకట్టుకుంటుంది. క్రమంగా సోషల్ మీడియాలో ఎంటర్ టైన్ మెంట్, కామెడీ క్వీన్ గా పేరు తెచ్చుకుంది. నిహారికకు సోషల్ మీడియాలో 6 మిలియన్ సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఇటీవల యూట్యూబ్ ఆధ్వర్యంలో జరిగిన క్రియేటర్స్ ఫర్ ఛేంజ్ కార్యక్రమంలో ఇండియా నుంచి వరుసగా రెండోసారి రిప్రజెంట్ చేసింది. కొన్ని ముఖ్యమైన సామాజికాంశాలపై అవేర్ నెస్ తెచ్చేలా నిహారిక కంటెంట్ క్రియేట్ చేస్తోంది. తాను చదువుకున్న యూఎస్ కాలిఫోర్నియా చామ్ మాన్ యూనివర్సిటీలో నిహారిక ఎన్ఎం కెరీర్ లో ఎదిగిన విధానంపై కేస్ స్టడీ చేస్తుండటం విశేషం. టాలీవుడ్ లో కూడా నిహారిక ఎన్ఎంకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని ఆశభావం వ్యక్తం చేస్తున్నారు ఆమె అభిమానులు. .