NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేసిన సీఎం..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్పీడ్‌ పెంచారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. వరుసగా సమీక్షలు, సమావేశాలు.. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు.. ఇక, ఆంధ్రా ప్రజల జీవనాడి అయిన పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏడు ప్రభుత్వశాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదిదమే.. కాగా, దీనికి ఏపీ కేబినెట్‌ ఆమోదం కూడా తెలిపింది.. అందులో భాగంగా.. పోలవరంపై తొలి శ్వేతపత్రం విడుదల చేశారు.. గత ఐదేళ్ల కాలంలో పోలవరంలో జరిగిన విధ్వంసంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. వాస్తవ పరిస్థితులను ప్రజల దృష్టికి తెచ్చేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు.. 20-25 రోజుల్లో శ్వేత పత్రాలు విడుదలను పూర్తి చేస్తాం. ఆ తర్వాత బడ్జెట్‌ పెడతాం అన్నారు.. ఇరిగేషన్‌.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం డాక్యుమెంట్లు ప్రత్యేక వెబ్‌సైటులో పెడతాం. చెప్పిన తప్పులను వందసార్లు చెప్పి.. ప్రజలను నమ్మించేందురు గత ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు.. పోలవరం, ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నామన్న ఆయన.. నదుల అనుసంధానానికి పోలవరం ఓ వరంగా పేర్కొన్నారు.. ఇలాంటి పోలవరానికి జగన్ ఓ శాపంగా మారాడు అని దుయ్యబట్టారు.. అన్నింటికీ అతీతంగా అందరూ జగన్ చేసిన తప్పులను నిలదీయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో రెండు సీజన్ల పాటు పోలవరం పనులను నిలిపేశారు. సమర్ధులైన అధికారులను బదిలీ చేసేశారు. డయాఫ్రం వాల్‌ దెబ్బతిందని.. రెండేళ్ల తర్వాత గుర్తించారు. పీపీఏ వద్దని చెప్పినా.. కాంట్రాక్టరును మార్చారు అని మండిపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు..

పోలవరంను దారిలో పెట్టేందుకు విదేశీ నిపుణులు.. నెలలో 10 రోజులు అక్కడే మకాం..!
పోలవరం ప్రాజెక్టును దారిలో పెట్టడానికి విదేశీ నిపుణులను పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలవరాన్ని ఎంతలా ధ్వంసం చేశారంటే.. చివరకు దానిని దారిలో పెట్టేందుకు విదేశీ నిపుణులను పెట్టాల్సి వస్తుంది.. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో పోలవరానికి విదేశీ నిపుణులు రానున్నారు. నెలలో ఓ పది రోజులు ఇక్కడే ఉండి.. పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణులు పరిశీలించనున్నారని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి జీవనాడి అయిన పోలవరానికి శాపం జగన్ అంటూ సీఎం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం.. గత 5ఏళ్ళు రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో ప్రజల్లో చర్చ జరగాలి.. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని గుర్తించారు కాబట్టే ఇంత అఖండ విజయం అందించారు.. మీడియాను కూడా భయపెట్టే పరిపాలన గత 5ఏళ్లలో జరిగింది.. న్యాయస్థానాలను సైతం బ్లాక్‌మెయిల్‌ చేసేలా న్యాయమూర్తుల వ్యక్తిత్వాన్ని విమర్శించారు.. రాష్ట్ర పుననిర్మాణo జరగాల్సిన పరిస్థితి నెలకొంది.. వివిధ అంశాలపై వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలని నిర్ణయించాం.. రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో వివరించాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం అన్నారు సీఎం చంద్రబాబు.

ఏయూ వీసీ, రిజిస్ట్రార్‌ రాజీనామాలు..
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్‌ స్టీఫెన్‌ తమ పదవులకు రాజీనామా చేశారు.. గవర్నర్ కార్యాలయానికి రాజీనామా లేఖలు పంపినట్టుగా తెలుస్తోంది.. అయితే, రాజీనామాపై స్పందించేందుకు అందుబాటులోకి రావడం లేదు ప్రసాద్ రెడ్డి.. మరోవైపు.. రిజిస్ట్రార్ స్టీఫెన్ రాజీనామాకు ఆమోదం తెలిపారు.. దీంతో.. ఇంచార్జీ రిజిస్ట్రార్ గాకిషోర్ బాధ్యతలు స్వీకరించారు.. ఈ పరిణామాలతో వీసీ ఆఫీస్ ఎదుట బాణా సంచా పేల్చి.. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఏయూ పూర్వ ఉద్యోగులు, విద్యార్థి సంఘాలు. కాగా, ఇప్పటి వరకు ఏయూ వీసీగా ఉన్న పీవీజీడీ ప్రసాదరెడ్డి.. యూనివర్సిటీని భ్రష్టు పట్టించారంటూ పలు సందర్భాల్లో ఆరోపణలు చేశాయి.. రాజీనామా చేయాలని డిమాండ్‌ కూడా చేస్తూ వచ్చాయి..

బీఆర్‌ఎస్‌కు షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన మరో ఎమ్మెల్యే
బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ఎమ్మెల్యే హస్తం గూటికి చేరారు. చేవెళ్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్‌లో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల బీఆర్‌ఎస్‌ నుంచి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, సంజయ్‌కుమార్‌లు హస్తం కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు బీఆర్‌ఎస్‌ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

జాతీయ రహదారులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష
న్యాక్‌లో జాతీయ రహదారులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, సెక్రటరీ హరీష్, ఐఏఎస్, ఎన్‌హెచ్‌ఆరోవో రజాక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. రీజనల్‌ రింగ్ రోడ్డు, ఎన్‌హెచ్‌-65, మన్నెగూడ, ఆర్మూర్-మంచిర్యాల జాతీయ రహదారులపై ఈ సమావేశ జరిగింది. ప్రజల ప్రాణాలు పోతుంటే నిర్లక్ష్యం తగదని అధికారులకు మంత్రి సూచించారు. వేగంగా పనులు చేస్తే ప్రజల మన్ననలు పొందవచ్చన్నారు. మన్నెగూడ రహదారికి మార్గం సుగమం చేసేందుకు నేషనల్ గ్రీన్‌ ట్రిబ్యూనల్ ఆదేశానుసారం 915 చెట్లను రీలొకేట్ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టు సంస్థ 300 చెట్లను రీలొకేట్ చేసేందుకు సిద్ధంగా ఉందని, మిగతా 615 చెట్లను అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎన్‌హెచ్‌ అధికారులు రీలొకేట్ చెయ్యాల్సి ఉందన్నారు. దీన్ని వెంటనే ప్రారంభించాలని ఎన్‌హెచ్‌ ఆర్వో రజాక్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ – విజయవాడ హైవేని గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఉప్పల్ – ఘట్కేసర్ ఫ్లైఓవర్ పనులకు ఆగస్టులో కొత్త టెండర్స్ పిలుస్తామన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం భూసేకరణ, పనులను వేగవంతం చేయాలని సూచించారు. రీజనల్‌ రింగ్ రోడ్డు ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం జులై మొదటి వారంలో రాష్ట్రానికి నేషనల్ హైవే అథారిటీ కమిటీ వస్తోందని వెల్లడించారు. ఎల్బీ నగర్ – మల్కాపూర్ 6 లైన్ పనులకు అడ్డుగా ఉన్న వాటర్ లేన్, ట్రాన్స్కో అధికారులతో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. వారంలో సమస్యలన్నీ కొలిక్కి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అయిదు నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన మాజీ సీఎం..
భూ కుంభకోణంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ శుక్రవారం విడుదలయ్యారు. ఆయన ఈ కేసులో అయిదు నెలలు జైలులో ఉన్నారు. ల్యాండ్ స్కామ్ కేసులో మనీలాండరింగ్‌కి పాల్పడినట్లు ఆరోపిస్తూ ఈడీ సోరెన్‌ని అరెస్ట్ చేసింది. ఈ కేసులోనే ఈ రోజు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.హేమంత్ సొరేన్ ప్రస్తుతం జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకు బెయిల్ మంజూర్ కావడంపై పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాలతో మిఠాయిలను పంచుకున్నారు. సోరెన్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు జనవరి 31న అరెస్టు చేశారు. సోరెన్ ను అన్యాయంగా టార్గెట్ చేశారని, ఆయనపై పెట్టింది రాజకీయ ప్రేరేపిత, కల్పిత కేసు అని ఆయన తరఫు న్యాయవాది, సీనియర్ అడ్వొకేట్ మీనాక్షి అరోరా వాదించారు.

ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగా మైక్ కట్.. ఎక్స్‌లో వీడియో షేర్
నీట్ వ్యవహారం పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. పేపర్ లీకేజ్‌పై చర్చ జరపాలని శుక్రవారం విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో సభ సోమవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడింది. ఇదిలా ఉంటే ఇదే వ్యవహారంపై ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మాట్లాడుతుండగా మైక్‌ ఆపేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈమేరకు ఎక్స్ వేదికగా ఒక వీడియోను షేర్‌ చేసింది. మైక్రోఫోన్‌లో మాట్లాడేందుకు వీలు కల్పించాలంటూ స్పీకర్ ఓం బిర్లాను రాహుల్ కోరడం వీడియోలో కనిపిస్తోంది. నీట్ పేపర్ లీకేజీపై ప్రధాని మోడీ ఏం మాట్లాడడం లేదని.. యువత తరపున రాహుల్ తన గొంతు వినిపిస్తు్న్నారని.. అలాంటి సమయంలో మైక్ ఆఫ్ చేయడం చౌకబారు పనులకు పాల్పడుతోందని కాంగ్రెస్ ట్విట్టర్‌లో రాసుకొచ్చింది. కాంగ్రెస్ ఆరోపణలపై స్పీకర్ స్పందిస్తూ.. తాను ఎంపీల మైక్రోఫోన్ స్విచ్చాఫ్‌ చేయనని, అలాంటి నియంత్రణ ఏదీ తన దగ్గర లేదని స్పష్టంచేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరగాల్సిన సమయంలో ఇతర విషయాలు రికార్డు కావని వెల్లడించారు. అయితే ముందు నీట్ వ్యవహారంపై చర్చ జరగాలని రాహుల్ డిమాండ్ చేశారు. అయితే ముందుగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని మాత్రమే అంగీకరిస్తానని స్పీకర్ స్పష్టం చేశారు.

విదేశాంగ కార్యదర్శిగా విక్రమ్ మిస్రీ..
భారత విదేశాంగ కార్యదర్శిగా.. దేశ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (డిప్యూటీ ఎన్‌ఎస్‌ఏ) విక్రమ్ మిస్రీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. జూలై 15న విక్రమ్ మిస్రీ బాధ్యతలు స్వీకరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నియామక ఉత్తర్వుల్లో పేర్కొంది. విక్రమ్ మిస్రీ 1989 బ్యాచ్‌కి చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) అధికారి. ప్రస్తుతం భారత విదేశాంగ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న వినయ్‌ క్వాట్రా (Vinay Kwatra) పదవీకాలం 2024 ఏప్రిల్‌ 30తో ముగిసింది. ఆయన పదవీకాలాన్ని ఏప్రిల్‌ 30 నుంచి జూలై 14 వరకు పొడిగిస్తూ కేంద్రం 2024 మార్చి 12 ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వుల మేరకు ఆయన జూలై 14 వరకు విదేశాంగ కార్యదర్శిగా కొనసాగుతారు. అనంతరం విక్రమ్‌ మిస్రీ బాధ్యతలు స్వీకరిస్తారు.

దర్శన్ హిస్టరీ తెలిసి కూడా నువ్విలా మాట్లాడుతున్నావా నాగశౌర్యా?
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి పవిత్ర గౌడకి అసభ్యకరమైన సందేశాలు పంపగా దర్శన్ అండ్ కో అతడిని కిడ్నాప్ చేసి బెంగళూరు తీసుకొచ్చారు. ఆ తర్వాత పట్టనగెరెలోని ఓ షెడ్డులో హత్య చేసి అనంతరం మృతదేహాన్ని రాజ కాలువలో పడేశారనే ఆరోపణలు ఉన్నాయి. దర్శన్ ఆదేశాలతోనే ఇది జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు, ఆధారాలు ఉండడంతో ఈ కేసులో పవిత్ర గౌడ, దర్శన్‌తో పాటు మరో 17 మంది ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే ఈ కేసు వ్యవహారం జరిగి చాలా కాలమే అయినా ఎందుకో తెలుగు యువత రెండు మూడు రోజుల నుంచి దర్శన్ ను వదలకూడదు అంటూ విరుచుకుపడుతున్నారు. మరి అందుకు స్పందించాడో లేక ఎందుకు స్పందించాడో తెలియదు కానీ తెలుగు హీరో నాగశౌర్య సోషల్ మీడియా పోస్ట్‌ ఒకదాన్ని షేర్ చేస్తూ దర్శన్ కు మద్దతు పలికారు. శౌర్య పోస్ట్ చేసిన అంశం యధాతధంగా మీ కోసం ‘‘ఈ కష్టకాలంలో ఆ రేణుకాస్వామి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఈ ఘటనపై ప్రజలు ఒక్కసారిగా అంచనాలకు రావడం నిజంగా బాధాకరం. దర్శన్ అన్న కలలో కూడా ఎవరినీ ఇబ్బంది పెట్టడు. దర్శన్ ఉదారమైన, దయగల వ్యక్తి, ఇతరులకు సహాయ పడతాడు. దర్శన్ నిస్సహాయులకు సహాయం చేసారు, చాలా మందికి దర్శన్ బలం. నేను ఈ వార్తలను అంగీకరించలేను. మన న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంది, వీలైనంత త్వరగా నిజం బయటకు వస్తుందని నమ్ముతున్నాను’’ అని నాగశౌర్య అన్నారు. “మరో కుటుంబం కూడా కష్టపడుతుందని మనం గుర్తుంచుకోవాలి. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆ కుటుంబానికి గోప్యత, గౌరవం అవసరం. కరుణకు పేరుగాంచిన దర్శన్ అన్న నిర్దోషి అని రుజువై, అలాగే న్యాయవ్యవస్థ అసలు దోషిని బయటకు తీసుకు వస్తుందని గట్టిగా నమ్ముతున్నాను’’ అని నాగశౌర్య అన్నారు.