NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

అగనంపూడి టోల్‌గేట్ ఎత్తివేత.. ఇలా స్పందిస్తున్న స్థానికులు..
విశాఖలోని గాజువాక పరిధిలో ఉన్న అగనంపూడి టోల్గేట్ ని ఎట్టకేలకు తొలగించారు.. ఎప్పటి నుండో వివాదాస్పదంగా ఉన్న అగనంపూడి టోల్ గేట్ నుండి రోజు లక్షలాది వాహనాలు రాకపోకలు సాగించేవి.. అటు వర్తకులు, చిరు వ్యాపారులు, ఫార్మా కంపెనీలకు వెళ్లే వాహనాలు ఏడాదికి లక్షలాది రూపాయలు టోల్ ఫీజులు కట్టుకుంటూ వస్తున్నారు.. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ టోల్ గేట్ కు చుట్టుపక్కల ఉన్న నిర్వాసిత గ్రామ ప్రజలు టోల్ చార్జీలు కట్టుకోలేక నానా ఇబ్బందులకు గురయ్యారు.. స్థానికులు ఎంతో కాలం నుంచి మొరపెట్టుకున్నప్పటికీని హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించి మరీ టోల్ ప్లాజా యాజమాన్యం ఇప్పటివరకు అక్రమ వసూళ్లకు తెగబడిందని ఆరోపించారు.. దాన్ని గత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు.. ఈరోజు టోల్ ప్లాజా లో ఉన్న క్యాబిన్లు మొత్తాన్ని తొలగించి ఎటువంటి ఫీజులు వసూలు చేయకుండా మొత్తం టోల్ ప్లాజాని క్లియర్ చేశారు.. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టోల్ గేట్‌ను ఎత్తేసారు స్థానిక నాయకులు.. దీంతో స్థానిక ప్రజలు, ట్రాన్స్‌పోర్ట్ ఓనర్లు ఆనందం వ్యక్తం చేశారు.. ఇన్నాళ్లుగా ప్రతిరోజు రాకపోకలు సాగించే తమకు టోల్ గేట్ ఫీజులు చెల్లించటం తలకు మించిన భారంగా తయారైందని, అలాగే అగనంపూడి తదితర ప్రాంతాల నుంచి స్టీల్ ప్లాంట్ కి వచ్చే ఫోర్ వీలర్స్ సైతం టోల్గేట్ ప్రతిరోజు చెల్లించాల్సి వచ్చేదని వాపోయారు.. రాత్రి కి రాత్రే పూర్తిస్థాయిలో ఈ టోల్‌ గేట్‌ తొలగించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..

సీఎస్ పదవీ కాలం పొడిగింపు.. మరో 6 నెలలకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారింది.. సీఎస్‌ను కూడా మార్చారు.. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్‌ కల్యాణ్‌,, మంత్రుల ప్రమాణస్వీకారం కంటే ముందే.. ఏపీ నూతన సీఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు.. ఆయన అధ్వర్యంలోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.. అయితే, ఆయన పదవీ కాలం త్వరలోనే ముగిసిపోనుంది.. ఈ నెలాఖరుకు రిటైర్డ్‌ కావాల్సి ఉంది.. ఈ నేపథ్యంలో.. మరో ఆరు నెలల పాటు నీరబ్ కుమార్‌ ప్రసాద్‌ సర్వీసును పొడిగించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు సీఎం చంద్రబాబు.. ఇక, ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది.. దీంతో.. ఆయన మరో ఆరు నెలలు ఏపీ సీఎస్‌గా కొనసాగనున్నారు నీరబ్‌ కుమార్‌ ప్రసాద్.. అంటే, సర్వీస్ పొడిగింపుతో డిసెంబర్ నెలాఖరు వరకు ఏపీ సీఎస్‌గా నీరబ్ కుమార్‌ ప్రసాద్‌ కొనసాగుతారన్నమాట.

కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్.. పెన్షన్ల పంపిణీపై కీలక ఆదేశాలు
రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్.. జులై ఒకటో తేదీన ఉదయం 6 గంటల నుండి పెన్షన్ల పంపిణీ మొదలు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.. ఇంటింటికి గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులు వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలని స్పష్టం చేశారు.. పెన్షన్ల పంపిణీ నిమిత్తం ఒక్కొక్క ఉద్యోగికి 50 ఇళ్లు కేటాయించాం.. అదనంగా ఉద్యోగులు అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే వినియోగించాలని క్లారిటీ ఇచ్చారు. మొత్తం నాలుగు రకాల క్యాటగిరీల పింఛను దారులు ఉన్నారు.. 11 సబ్ క్యాటగిరీలకు చెందిన పెన్షన్ దారులకు మొత్తం రూ.7000 పెన్షన్‌ అందించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్.

శాసనసభ అంటే వారికి గౌరవం లేదు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం..
వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ కు ప్రతిపక్ష హోదా రాదని స్పష్టం చేశారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ.. నెల్లూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శాసనసభ అంటే ఆయనకు గౌరవం లేదని.. సభ నియమాలను కూడా ఆయన ఎప్పుడూ పాటించలేదన్నారు.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్పీకర్ ను బెదిరించి పాలన చేశారని విమర్శించారు. శాసనసభ నిబంధనలు కూడా వైఎస్‌ జగన్‌కు తెలియవని.. జగన్ సలహాదారులు కూడా అలానే ఉన్నారని ఎద్దేవా చేశారు. చట్టాలు. రాజ్యాంగం.. నిబంధనలు తెలియని 79 మందిని సలహాదారులుగా జగన్ పెట్టుకున్నారని సెటైర్లు వేశారు. ఈ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి 11 స్థానాలు మాత్రమే వచ్చాయని.. దీంతో ఆయన ఫ్లోర్ లీడర్ గా మాత్రమే ఉండవచ్చన్నారు. ఇక, వాలంటీర్ల వ్యవస్థ పై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనుందన్నారు మంత్రి ఆనం.. కనీసం, ఒక గంట సేపు జగన్.. ఎక్కడైనా వుండాలనుకున్నా.. ఆయన ప్యాలస్ నే కోరుకుంటారన్నారు. అందువల్లే ఎలాంటి అనుమతులు లేకుండా 28 చోట్ల పార్టీ కార్యాలయాల పేరుతో పెద్ద ప్యాలస్ లను కడుతున్నారన్నారు. భవిష్యత్తులో ఈ కార్యాలయాలను ఆస్తులుగా ఆయన మార్చుకుంటారని ఆనం విమర్శించారు. మరోవైపు.. తిరుమల పవిత్రతను దెబ్బతీశారని.. అందుకే టీటీడీని ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారన్నారు. ఎన్నికల్లో సవాళ్లు విసిరి.. ఓడిపోయిన నాయకులకు పిచ్చి పట్టిందని.. నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్.. తిరుపతి జిల్లాలో మరో వ్యక్తి ఉన్నారన్నారని సెటైర్లు వేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్నారని వెల్లడించారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.

వరంగల్ను రెండో రాజధానిగా అభివృద్ధి చేసేలా సీఎం కార్యాచరణ..
రేపు వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉండటంతో జిల్లా మంత్రి మంత్రి కొండా సురేఖ, మంత్రి సీతక్క అధికారులతో సమావేశం నిర్వహించారు. సీఎం టూర్ వేళ తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. రేపు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ కు వస్తున్నారు.. సీఎం టూర్ పై ఎమ్మెల్యేలతో కలిసి అధికారులతో రివ్యూ చేశాము.. మధ్యాహ్నం 1 వరకు టెక్స్ టైల్ పార్క్ కు చేరుకుని పరిశీలిస్తారు.. ఆ తరువాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సందర్శించి అధికారుల దగ్గర నుంచి వివరాలు తెలుసుకుంటారు.. అనంతరం హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో రివ్యూ ఉంటుంది అని తెలిపారు. ఇక, రెండో రాజధానిగా చేసే లక్ష్యంగా అభివృద్ధి చేసేలా సీఎం కార్యాచరణ ఉంది.. మాస్టర్ ప్లాన్ అంశం చర్చకు వస్తాయి.. గతంలో ఉన్న మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలు సొంత ఎజెండాతో చేసింది అని అర్థం అయ్యింది.. దాన్ని మార్చాల్సి ఉంది అని మంత్రి కొండా సురేఖ చెప్పారు. ఇక, మూడు నెలల కాలవ్యవధి పెట్టి మాస్టర్ ప్లాన్ తయారీ చేసే అంశం ఉంటుంది అని మంత్రి సురేఖ అన్నారు. స్మార్ట్ సిటి పనుల అంశంపై చర్చించే అవకాశం ఉంది.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అంశం చర్చిస్తాం.. అలాగే కేబుల్ కూడా అండర్ గ్రౌండ్ లోనే ఏర్పాటు చేస్తారు.. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం.. దాని సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాము.. ఇప్పటి వరకు 8 కిలోమీటర్ల దూరం మాత్రమే చేశారు.. ఈ అంశం చర్చకు వస్తుంది.. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నీ అతి త్వరలో స్వాధీనం చేసుకొని రోగుల అందుబాటులో తెచ్చే అంశంపై చర్చిస్తాం.. ఈ హాస్పిటల్ కేవలం 12 అంతస్తులు మాత్రమే రోగులకు వాడాలి.. దీన్ని ఎలా వినియోగించుకోవాలనే అంశాన్ని చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం.. మమూనూర్ ఎయిర్ పోర్ట్ అంశం కూడా చర్చకు వస్తుంది.. సీఎం దృష్టి తీసుకెళ్ళి ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం జరగుతుంది.. రూ. 20 కోట్ల లోన్ రేపు మహిళ శక్తి రుణాల ఇస్తారు.. కాళోజీ కళ కేత్రం పనుల ఆలస్యం పైనా చర్చిస్తాం.. వరంగల్ కార్పొరేషన్ కి కొత్త బిల్డింగ్ ఏర్పాటు ప్రతిపాదనలు చర్చకు వస్తాయని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.

కేసీఆర్ పూర్తిగా చేతులెత్తేయడం వల్లే బీజేపీకి లాభం జరిగింది..
ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. నా పీసీసీ అధ్యక్ష పదవీకాలం ముగిసింది.. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వారితో కలిసి పని చేస్తా.. అధ్యక్షుడి నియామకంపై నాకంటూ ప్రత్యేక ఛాయిస్ ఏది లేదు.. అధిష్టానం ఎవరిని నియమించినా వారితో కలిసి పని చేయడమే నా బాధ్యత అన్నారు. నా పదవి కాలంలో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చింది.. పార్లమెంటు ఎన్నికల్లో మంచి పని తీరు కనబరిచాం.. అసెంబ్లీ ఎన్నికల కంటే కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగింది అని చెప్పుకొచ్చారు. కేసీఆర్ పూర్తిగా చేతులెత్తేయడం వల్లే బీజేపీకి లాభం జరిగింది అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఇక, బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు వచ్చిన చోట మేము గెలిచాం.. బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయిన చోట బీజేపీ గెలిచింది అని రేవంత్ రెడ్డి అన్నారు. కక్షపూరిత రాజకీయాలకు నేను పాల్పడను అని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ను గద్దె దింపాలన్న నా జీవిత లక్ష్యం నెరవేరింది.. ముఖ్యమంత్రిగా నా రెండో కల నెరవేరింది.. బీఆర్ఎస్ ను లోక్ సభలో జీరో చేశా.. ఆ పార్టీని సున్నా చేయాలన్న కోరిక కూడా నెరవేరింది.. ఇక, తెలంగాణను పునర్నిర్మించడమే ఇప్పుడు నా ముందున్న ఏకైక లక్ష్యం అని చెప్పుకొచ్చారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ పూర్తిగా ధ్వంసం అయింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.

ఒకే లిఫ్ట్‌లో ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే.. ‘‘సీక్రెట్ మీటింగ్’’..
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల సమయంలో ఒకేసారి ఉద్ధవ్ ఠాక్రే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అనుకోకుండా కలిశారు. అసెంబ్లీలో లిఫ్టు కోసం ఇద్దరు నేతలు ఎదురుచూస్తు్న్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇద్దరు పరస్పరం కొంతసేపు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం గురించి ఉద్ధవ్ ఠాక్రేని ప్రశ్నించిన సందర్భంలో.. ‘‘ఇప్పటి నుంచి రహస్య సమావేశాలన్ని లిఫ్టులోనే చేస్తాం’’ అని సరదాగా అన్నారు. ఫడ్నవీస్‌తో తాను లిఫ్టులో ఉన్నప్పుడు ప్రజలు ‘‘ నానా కర్తే ప్యార్ తుమ్హీ సే కర్ బైతే’’((1965 చిత్రం జబ్ జబ్ ఫూల్ ఖిలే సాంగ్, దీని అర్థం నన్ను ద్వేషించినా నిన్ను ప్రేమిస్తున్నాను) అని అనుకున్నారని, అయితే అలాంటిదేం లేదని, ఇది ఊహించని సమావేశం అని ఠాక్రే చెప్పారు. బీజేపీ మంత్రి చంద్రకాంత్ పాటిల్‌తో, ఠాక్రే మధ్య సంభాషణకు సంబంధించిన చిత్రాలు వెలువడ్డాయి. బీజేపీ నేత ఠాక్రేకి చాక్లెట్ బార్ ఇచ్చినప్పుడు, ‘‘రేపు మీరు మహారాష్ట్ర ప్రజలకు చాక్లెట్ ఇస్తారు’’ అని ఠాక్రే బదులిచ్చారు. ఎన్నికల ముందు మహారాష్ట్ర ప్రజల్ని ఆకట్టుకునేందుకు బడ్జెట్ రూపొందిస్తున్నారని శివసేన యూబీటీ నేత ఠాక్రే చెప్పారు.

‘‘ఎమర్జెన్సీ’’పై రాష్ట్రపతి, స్పీకర్ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నిరసన..
ఇందిరా గాంధీ విధించిన ‘‘ఎమర్జెన్సీ’’కి జూన్ 25, 2024తో 50 ఏళ్ల నిండాయి. అయితే, ఈ అంశంతో కాంగ్రెస్‌ని బీజేపీ టార్గెట్ చేస్తోంది. ఎమర్జెన్సీపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు ఈ రోజు జరిగిన ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. స్పీకర్ ఓం బిర్లా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన తెలుపుతోంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఇండియా కూటమి సీనియర్ నేతలు గురువారం లోక్‌సభ స్పీకర్‌తో సమావేశమై..‘‘ఎమర్జెన్సీ చీకటి రోజుల’’ గురించి పార్లమెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యల గురించి నిరసించారు. పార్లమెంట్ విశ్వనీయతను ప్రభావితం చేసే చాలా తీవ్రమైన విషయంగా దీనిని ప్రతిపక్ష కాంగ్రెస్ పేర్కొంది. పార్లమెంటరీ సంప్రదాయాల అపహాస్యం పట్ల తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేసింది. బుధవారం స్పీకర్‌గా ఎన్నికైన తర్వా ఓం బిర్లా మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ భారతదేశ ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా అభివర్ణించారు. అయితే, స్పీకర్ పదవి నుంచి ఇలాంటి ప్రకటన రావడం మంచిది కాదని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ లేఖ రాశారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించిన, ఆ సమయంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించి వారి సంకల్పాన్ని గుర్తు చేసుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించాలని నిన్న స్పీకర్ ఓం బిర్లా పిలుపునిచ్చారు. దీనిపై కాంగ్రెన్‌తో పాటు దాని మిత్రపక్షాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

మళ్లీ రికార్డుల మోత మోగించిన సెన్సెక్స్, నిఫ్టీ
కేంద్రంలో మోడీ 3.0 సర్కార్ కొలువుదీరాక స్టాక్ మార్కెట్లలో సరికొత్త జోష్ కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సూచీలు టాప్ గేర్‌లో దూసుకుపోతున్నాయి. ఈ వారం అయితే మరింత దూకుడుగా ట్రేడ్ అయ్యాయి. గత నాలుగు రోజులుగా భారీ ర్యాలీ దిశగా దూసుకుపోయాయి. ఏ రోజుకు ఆ రోజు తాజా రికార్డులు నమోదు చేశాయి. ఇక గురువారం అయితే సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త మైలురాయిని తాకాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. కొద్ది సేపట్లోనే వేగంగా పుంజుకుని సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. సెన్సెక్స్ 79000 కీలక మైలురాయి దాటగా.. నిఫ్టీ కూడా 24 వేల మైలురాయిని అధిగమించింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 568 పాయింట్లు లాభపడి 79, 243 దగ్గర ముగియగా.. నిఫ్టీ 175 పాయింట్లు లాభపడి 24,044 దగ్గర ముగిసింది. అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఎల్‌టిఐఎండ్‌ట్రీ, విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌లు ఎన్‌ఫిటీ లాభాల్లో కొనసాగగా.. శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్‌అండ్ టి, కోల్ ఇండియా, బజాజ్ ఆటో మరియు ఒఎన్‌జిసి నష్టపోయాయి.

యూపీఐ చెల్లింపుల కోసం కొత్త యాప్‌ను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్
భారతీయ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ తన చెల్లింపు యాప్‌ను విడుదల చేసింది. సూపర్.మనీ పేరుతో దీన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఫోన్‌పే నుంచి విడిపోయిన తర్వాత ఫ్లిప్‌కార్ట్ తన యాప్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్ ఒకటిన్నర సంవత్సరాల క్రితం ఫోన్‌పే నుంచి విడిపోయింది. కానీ ఫోన్‌పే ఇప్పటికీ వాల్‌మార్ట్ యాజమాన్యంలో ఉంది. వాల్‌మార్ట్ కొత్త యాప్ బీటా వెర్షన్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత వినియోగదారులు ఇక్కడ నుంచి మొబైల్ చెల్లింపు చేయవచ్చు. ఆన్‌లైన్ చెల్లింపులు చేసే వినియోగదారులు యాప్ నుంచి భిన్నమైన అనుభవాన్ని పొందబోతున్నారు. అలాగే యూజర్ల ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగా ఇందులో మార్పులు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. Super.Money సహాయంతో వినియోగదారులు క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఇది పనికిరాని బహుమతులు కాకుండా విభిన్నమైన క్యాష్‌బ్యాక్‌ను అందించబోతోందని కంపెనీ తెలిపింది.

వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఆఫ్ఘాన్ ఆటగాడు..
గురువారం జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 తొలి సెమీఫైనల్‌లో ఆఫ్ఘనిస్తాన్ 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే అఫ్గానిస్థాన్‌ ఓడిపోయినప్పటికీ.. ఆ జట్టు ఫాస్ట్‌ బౌలర్‌ ఫజల్‌హక్‌ ఫరూఖీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో క్వింటన్ డికాక్ వికెట్ తీసి రికార్డు సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ఫరూఖీ 2 ఓవర్లలో 11 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో ఫరూకీకి ఇది 17వ వికెట్. టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఫజల్‌హక్ ఫరూఖీ నిలిచాడు. ఫరూఖీ 8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు. 2021 టీ20 ప్రపంచకప్‌లో 16 వికెట్లు తీసిన శ్రీలంక లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగా రికార్డును బద్దలు కొట్టాడు. 2012 టీ20 ప్రపంచకప్‌లో 15 వికెట్లు తీసిన శ్రీలంక ఆటగాడు అజంతా మెండిస్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.