NTV Telugu Site icon

Top Headlines @ 5PM: టాప్‌ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

కవితకు బెయిల్ మంజూరుపై మాటల యుద్ధం.. బండి సంజయ్ vs కేటీఆర్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీకి, వారి లాయర్లకు కంగ్రాట్స్. ప్రసిద్ద మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇప్పించడంలో విజయాన్ని సాధించినందుకు అభినందనలు. మీ అవిశ్రాంత కృషి చివరికి ఫలించింది. ఈ బెయిల్ బీఆర్ఎస్, కాంగ్రెస్ సమిష్టి విజయం. బీఆర్ఎస్ నేత బెయిల్ మీద బయటకు వచ్చారు.. కాంగ్రెస్ నాయకుడు రాజ్యసభలోకి వెళ్తున్నారు. కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్. బెయిల్ కోసం వాదించిన అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం.. అధికార కాంగ్రెస్ ఏకపక్షంగా రాజ్యసభకు నామినేట్ చేయడం.. ఈక్విడ్ ప్రో కో నేరంలో పాలు పంచుకున్న భాగస్వామ్యులకు అభినందనలు. విలీనం మాట ముచ్చట పూర్తయింది.. ఇక “అప్పగింతలే” తరువాయి’ అని పేర్కొన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ‘ మీరు కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రిగా ఉన్నారు. సుప్రీం కోర్టు తీర్పుపై మీరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు!!. మీ స్థానానికి చాలా అనుకూలమైనది. గౌరవనీయులైన భారత ప్రధాన న్యాయమూర్తి, గౌరవనీయమైన సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను గుర్తించి కోర్టు ధిక్కార చర్యలను ప్రారంభించవలసిందిగా నేను గౌరవపూర్వకంగా కోరుతున్నాను’. అని కేటీఆర్ తెలిపారు.

 

సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాచరికపు పోకడలకు స్వస్తి.
ఆంధ్రప్రదేశ్‌లో సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాచరికపు పోకడలకు ప్రభుత్వం స్వస్తి పలకనుంది. కోర్టుల్లో జడ్జిల తరహాలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చొనే విధానానికి చెల్లు చీటి పలికేలా రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేస్తోంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రూపు రేఖలు మార్చే అంశంపై ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా ప్రతిపాదనలు పంపారు. అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఉన్నట్టుగానే సబ్ రిజిస్ట్రార్ల సీటింగ్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సబ్ రిజిస్ట్రార్లు కూడా సామాన్యులేననే భావన కలిగేలా రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే రెవెన్యూ శాఖ సర్కులర్ జారీ చేయనుంది. సర్క్యులర్ జారీ అయిన అనంతరం అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నట్లుగానే సబ్‌ రిజిస్ట్రార్‌ సీటింగ్ ఉండనుంది.

 

జనసేనలోకి వెళ్తున్నానని ప్రచారం చేస్తున్నారు.. బాలినేని కీలక వ్యాఖ్యలు
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి తాను పార్టీ దూరంగా ఉన్నానని.. ఈవీఎంలపై తాను చేస్తున్న పోరాటానికి కనీసం పార్టీ పట్టించుకోవడం లేదన్నారు. పార్టీకి చెబుదాం అంటే కనీసం వినే పరిస్థితుల్లో లేదన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేశాను.. అయినా ఎవరూ తన వైపు చూడటం లేదన్నారు. తాను జనసేనలోకి వెళ్తున్నానని ప్రచారం చేస్తున్నారని.. బహుశా జనసేనలోకి వెళ్లకుండా ఉండేందుకు కూడా తనపై ఇలా ఆరోపణలు చేస్తున్నారేమో అని బాలినేని వ్యాఖ్యానించారు. తనకు ప్రజలు మద్దతుగా ఉన్నారని.. ఎవరికి భయపడేది లేదన్నారు. పార్టీ పట్టించుకోకున్నా సరే.. తనకు ప్రజలున్నారని.. పోరాడుతానని ఆయన పేర్కొన్నారు. భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి స్పందించారు. భూకబ్జాలు, స్టాంప్స్‌ కుంభకోణానికి పాల్పడినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తనపై రాజకీయంగా దాడి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం మీదే కదా.. సీబీ సీఐడీ కాదు.. సీబీఐతో కూడా తనపై విచారణ చేయించాలన్నారు.

 

ఛీ నువ్వు తల్లివేనా..? లవర్‌తో పారిపోయేందుకు కూతురి హత్య.. “క్రైమ్ పెట్రోల్‌” ఐడియా..
సభ్యసమాజం తలదించుకునేలా చేసింది ఓ తల్లి. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి, 3 ఏళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా గొంతు కోసి చంపింది. ప్రియుడితో వెళ్లేందుకు ఈ ఘతుకానికి పాల్పడింది. బీహార్ ముజఫర్‌పూర్‌లో సూట్‌కేస్‌లో మూడేళ్ల బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత, పోలీస్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివాహేతర సంబంధం పెట్టుకున్న కాజల్ అనే మహిళ, తన భర్తను విడిచిపెట్టి ప్రియుడితో వెళ్లిపోవాలిని భావించింది. ఇందుకు అడ్డుగా ఉన్న తన కుమార్తెని పాశవికంగా హత్య చేసింది. ప్రియుడు తన కుమార్తెతో ఉండేందుకు ఇష్టపడకపోవడంతోనే హత్య చేసినట్లు ఆమె ఒప్పుకుంది. చిన్నారి గొంతు కోసి, మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి పొదల్లో పారేసింది. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, పాపులర్ టీవీ షో ‘‘ క్రైమ్ పెట్రోల్’’ చూసి తన కూతురిని హత్య చేయడానికి ప్లాన్ చేసినట్లు చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. శనివారం ముజఫర్‌పూర్‌లోని మినాపూర్ పరిసరాల్లో రెడ్ ట్రాలీ సూట్‌కేసులో మూడేళ్ల మిస్తీ అనే బాలిక మృతదేహం లభించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. హత్యని దర్యాప్తు చేసేందుకు పోలీసులు స్పెషట్ టీమ్స్ ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్ టీములను రంపించి విచారణ వేగవంతం చేశారు. బాలిక కుటుంబంపై అనుమానంతో వారి ఇంటిని సోదా చేయగా నేలపై, సింక్, టెర్రస్‌‌పై రక్తపు ఆనవాళ్లు కనిపించాయి. మిస్తీ తల్లి కాజల్ కనిపించకుండా పోయిందని, ఘటన జరిగిన రోజు భర్త మనోజ్‌కి ఫోన్ చేసి పుట్టింటికి వెళ్తున్నట్లు చెప్పిందని పోలీసులు గుర్తించారు. మనోజ్ తన భార్య కాజల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కాజల్ ఫోన్ లొకేషన్ ట్రాక్ చేయడంతో ఆమె తన ప్రియుడి ఇంట్లో దొరికింది. విచారణతో కాజల్‌కి వివాహేతర సంబంధం ఉన్నట్టు తేలింది. తన ప్రియుడితో కలిసి ఉండేందుకు బిడ్డను అడ్డు తొలగించుకున్నట్లు చెప్పింది. కూతురిని తీసుకుని వెళ్లాలనుకున్నప్పటికీ ప్రియుడు దీనికి ఒప్పుకోకపోవడంతో కత్తితో గొంతు కోసింది. హత్య ఆనవాళ్లు చెరిపేసేందుకు రక్తపు మరకలను తొలగించాలని చూసింది. క్రైమ్ పెట్రోల్ షో చూసే అలవాటు ఉన్న కాజల్, ఓ ఎపిసోడ్‌లో చూసిన విధంగా బిడ్డను చంపి, సూట్‌కేస్‌లో పెట్టినట్లు తేలింది. అయితే, ఈ హత్యలో ఆమె ప్రియుడి ప్రమేయం ఉన్నట్లుగా, ఇందుకు అతను ప్రభావితం చేసినట్లుగా తేలలేదని పోలీస్ అధికారులు వెల్లడించారు.

 

చిక్కుల్లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే.. బెంగళూర్ ఏరోస్పేస్ పార్కులో 5 ఎకరాల భూమి..
కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్, ఆ పార్టీకి చెందిన కీలక నేతలు వరసగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్ర రాజకీయాలను ‘‘ముడా’’ స్కామ్ సంచలనంగా మారింది. ఇందులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య ప్రమేయం ఉండటంతో బీజేపీతో పాటు జేడీఎస్ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సీఎంపై విచారణకు కర్నాటక గవర్నర్ ఆదేశాలు ఇవ్వడంతో, ఆ తర్వాత హైకోర్టు దీనిపై స్టే విధించడం జరిగింది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తాజాగా ఓ వివాదంలో ఇరుక్కున్నారు. 2024 మార్చిలో ఖర్గే కుటుంబం, ఆయన కుమారుడు రాహుల్ అధ్యక్షతన నిర్వహిస్తున్న ట్రస్టుకు బెంగళూర్ సమీపంలోని ఏరోస్పేస్ పార్క్‌లో 5 ఎకరాల భూమిని కర్ణాటక ప్రభుత్వం కేటాయించడంపై వివాదం చెలరేగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని, తన వాళ్లకు భూముల్ని కట్టబెడుతోందని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా ఆరోపించారు. దీనికి ఖర్గే సమాధానం చెప్పాలని ఆయన ట్వీట్ చేశారు. ఖర్గే కుటుంబం నిర్వహిస్తున్న సిద్ధార్థ విహార్‌ ట్రస్ట్‌కు 5 ఎకరాల భూమిని షెడ్యూల్‌ కులం (ఎస్‌సి) కోటా కింద మంజూరు చేశారు. ఈ ట్రస్టుకి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఆయన అల్లుడు, కలబురిగి ఎంపీ రాధాకృష్ణ, కుమారుడు రాహుల్ ఖర్గే, ఇతర కుటుంబ సభ్యులు ట్రస్టీలుగా ఉన్నారు. ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్‌మెంట్ బోర్డ్ (KIADB) ద్వారా హైటెక్ డిఫెన్స్ ఏరోస్పేస్ పార్క్ కోసం కేటాయించిన 45.94 ఎకరాల్లో 5 ఎకరాలు భాగంగా ఉంది. సైట్ల కేటాయింపులో అవకతవకలపై అవినీతి చోటుచేసుకుందని ఉద్యమకారుడు దినేష్ కల్లహళ్లి గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌కి ఫిర్యాదు చేశారు. పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్‌ని విచారించాలని ఆయన అభ్యర్థించారు. ఇదిలా ఉంటే రాహుల్ ఖర్గే అర్హత కలిగిన దరఖాస్తుదారుడని, సింగిల్ విండో ఆమోదం ద్వారా మెరిట్ ఆధారంగా సైట్ ఆమోదించినట్లు పాటిల్ ఈ ఆరోపణల్ని తోసిపుచ్చారు. ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఎలాంటి రాయితీలు తీసుకోలేదని, సాధారణ కేటగిరీ రేట్ల ప్రకారం పూర్తి మొత్తాన్ని చెల్లించారని చెప్పారు. అయితే, ఈ భూమిని సొంతం చేసుకునేందుకు ఖర్గే కుటుంబం ఎప్పుడు ఏరోస్పేస్ పారిశ్రామికవేత్తలుగా మారారు..? అని బీజేపీ ప్రశ్నించింది. ఇదిలా ఉంటే రాష్ట్రమంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ.. ఆమోదించబడిన సైట్ పారిశ్రామిక లేదా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉద్దేశించిన పారిశ్రామిక ప్లాట్ కాదని, విద్యా ప్రయోజనాల కోసం అని ప్రియాంక్ ఖర్గే అన్నారు. ఆ స్థలంలో మల్టీస్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నది ట్రస్ట్ ఉద్దేశమని, అది తప్పు ఎలా అవుతుందని బీజేపీని ప్రశ్నించారు.

 

కోల్‌కతా డాక్టర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సీపీ బైక్ వాడిన నిందితుడు..!
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌పై జరిగిన దారుణమైన అత్యాచారం- హత్య కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ ఉపయోగించిన బైక్ కోల్‌కతా కమీషనర్ ఆఫ్ పోలీస్ పేరుతో రిజిస్టర్ చేయబడిందని తేలింది. అయితే, నిందితుడు కోల్‌కతా పోలీస్‌లో పౌర వాలంటీర్‌గా కొనసాగుతున్నాడు. ఇక, నేరం జరిగిన రోజు ఉత్తర కోల్‌కతాలోని రెడ్ లైట్ ఏరియాలను సందర్శించడానికి ఈ బైక్ ను ఉపయోగించినట్లు వెల్లడైంది. నిందితుడు సంజయ్ రాయ్ మద్యం మత్తులో 15 కిలో మీటర్ల దూరం పాటు బైక్‌ను నడిపినట్లు తెలుస్తుంది. అయితే, కోల్‌కతా సీనియర్ పోలీసు అధికారులతో సంజయ్ రాయ్‌కి ప్రోత్సాహకాలు అందించిన అధికారులపై సరైన చర్యలు తీసుకున్నారా అనే విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదు. కాగా, ఈ బైక్‌కు సంబంధించిన వివరాలు ప్రస్తుతం బయటకు వచ్చాయి. ఇది 2014లో ప్రస్తుత కమిషనర్ పేరుపై రిజిస్టర్ అయినట్లు తెలుస్తుంది. అత్యాచారం- హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ ఈ వాహనాన్ని స్వాధీనం చేసుకుంది.

 

ఏం గతి పట్టింది..ఇజ్రాయిల్‌కి భయపడి ఆడవేషంలో హమాస్ కీలక నేత..
అక్టోబర్ 7 నాటి హమాస్ దాడి తర్వాత, ఇజ్రాయిల్ ఉగ్రసంస్థపై విరుచుకుపడుతోంది. ముఖ్యంగా గాజా ప్రాంతంలో ఒక్క హమాస్ కార్యకర్త లేకుండా వారిని హతం చేస్తోంది. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ దాడికి ఇప్పటికే హమాస్ దాదాపుగా కకావికలం అయింది. మరోవైపు అగ్రనేతల్ని ఇజ్రాయిల్ వెతికి వేటాడి మట్టుపెడుతోంది. ఏ దేశంలో, ఎంత భద్రత మధ్య ఉన్నా కూడా వదిలిపెట్టడం లేదు. ఇక గాజాలోని హమాస్ టెర్రరిస్టుల్ని దొరికిన వాడిని దొరికినట్లు చంపేస్తోంది. ఇప్పటికే హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియేని ఏకంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోనే మట్టుపెట్టింది. ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ ప్రమాణస్వీకారానికి వచ్చిన సందర్భంలో హనియే ఉంటున్న హోటల్‌ గదిలో పేలుడు జరిగింది. దీంతో అతను మరణించాడు. ఈ ఘటన మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు కారణమైంది. అయితే, ఈ దాడిని తాము చేసినట్లు ఇజ్రాయిల్ ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇదిలా ఉంటే, హమాస్ మిలిటీరీ వింగ్ కీలక నేతగా ఉన్న మహ్మద్ డెయిఫ్‌ని కూడా ఇజ్రాయిల్ దాడిలో మరణించాడు. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ అంటేనే భయపడి చస్తున్నారు హమాస్ నేతలు. ప్రస్తుతం హమాస్ చీఫ్‌గా ఉన్న యాహ్యా సిన్వార్ భయంతో మహిళా దుస్తుల్లో తప్పించుకుని తిరుగుతున్నట్లు పలు కథనాలు వెల్లడించాయి. ఇతను గాజా ప్రజల మధ్యలో మహిళా వేషధారణలో ఉన్నట్లు ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ సోర్సెస్‌ని ఉటంకిస్తూ వెస్ట్రన్ మీడియ కథనాలను ప్రచురించింది. గాజాలోని హామాస్ సొరంగ వ్యవస్థ నుంచి బయటకు వచ్చిన అతను, తనని గుర్తించకుండా మహిళలాగా దుస్తుల్ని ధరిస్తున్నట్లు ఆదివారం న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. గత కొంత కాలంగా ఇజ్రాయిల్ సిన్వార్‌ కోసం వేట సాగిస్తోంది. ఈ క్రమంలోనే తరుచుగా తాను ఉండే చోటుని మారుస్తూ తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. జూలై 31 టెహ్రాన్‌లో ఇస్మాయిల్ హనియే హత్య తర్వాత హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్‌గా యాహ్యా సిన్వార్ నియమితులయ్యాడు. సిన్వాన్ సమాచారాన్ని మార్పిడి చేసుకునేందుకు కొరియర్లపై ఆధారపడి ఉన్నాడు. ఒక వేళ ఎలక్ట్రానిక్ పరికరాలను వాడితే ఇజ్రాయిల్ తనను కనిపెట్టి చంపేస్తుందని వాటిని వాడటం లేదు.

 

పుతిన్‌తో మాట్లాడిన ప్రధాని మోడీ.. ఉక్రెయిన్ పర్యటనపై చర్చ..
ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో టెలిఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇటీవల జరిగిన ఉక్రెయిన్ పర్యటనపై ఇరు నేతలు చర్చించారు. ‘‘ ఈరోజు అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడారు. ప్రత్యేక మరియు విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయడానికి చర్యల గురించి చర్చించాము. రష్యా-ఉక్రెయిన్ వివాదంపై ఇటీవలి ఉక్రెయిన్ పర్యటన గురించి మాట్లాడాను. ఈ సంఘర్షణపై స్థిరమైన మరియు శాంతియుత పరిష్కారానికి మద్దతు ఇవ్వడానికి భారతదేశం యొక్క దృఢ నిబద్ధతను పునరుద్ఘాటించాను.” అని ప్రధాని మోడీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ పోలాండ్‌తో పాటు ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు. ఆ దేశ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలన్‌స్కీతో చర్చించారు. సంఘర్షణను దౌత్యం, చర్యల ద్వారా పరిష్కరించుకోవాలని మరోసారి మోడీ పునరుద్ఘాటించారు. ఇదిలా ఉంటే, మరోవైపు అమెరికా అధ్యక్షుడు జోబైబెన్‌తో కూడా మోడీ టెలిఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్ పర్యటన విషయాలను పంచుకున్నట్లు తెలుస్తోంది.

 

టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన..
అక్టోబర్ 3 నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో జరుగనున్న మహిళల టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) తాజాగా టీమిండియా జట్టును ప్రకటించింది. ఈ ప్రపంచ టోర్నీలో టీమిండియాకు హర్మన్‌ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా వ్యవహరించనుంది. ఈ టోర్నీలో అక్టోబర్ 4న న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా ప్రపంచ కప్‌ లో విజయాల వేట ప్రారంభిస్తుంది. దీని తర్వాత అక్టోబర్ 6న పాకిస్థాన్‌ జట్టుతో, ఆపై అక్టోబర్ 9న శ్రీలంక జట్టుతో మ్యాచ్‌ లు ఆడనుంది టీమిండియా. ఇక ఈ రెండు మ్యాచ్‌లు దుబాయ్‌ లోనే జరగనున్నాయి. ఇక టీమిండియాగ్రూప్ స్టేజిలో తన చివరి మ్యాచ్ ను అక్టోబర్ 13న ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ షార్జా వేదికగా జరుగుతుంది. టీమిండియాకు చెందిన ఈ గ్రూప్ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు మొదలవుతాయి. ఇక నేడు ప్రకటించిన టీమిండియా జట్టు ఈ విధంగా ఉంది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, దీప్తి శర్త, రోడ్రిగ్స్‌, ఘోష్‌, భాటియా, పూజా వస్త్రాకర్‌, అరుంధతి రెడ్డి, ఠాకూర్‌, హేమలత, శోభన, రాధా యాదవ్‌, పాటిల్‌, సజీవన్‌ లు టీంలో ఉన్నారు. ఇక సైమా ఠాకూర్‌, తనూజా కన్వర్, ఉమా ఛెత్రిలు ట్రావెలింగ్ రిజర్వ్‌ లుగా జట్టులో స్థానం కల్పించింది బీసీసీఐ.

 

హేమ కమిటీ కలకలం.. మోహన్ లాల్ సంచలన నిర్ణయం
హేమ క‌మిటీ రిపోర్టు ఆధారంగా బహిర్గతమైన అనేక సంచలన విష‌యాల‌ నేపథ్యంలో ‘అమ్మ‌’(మలయాళ నటీనటుల సంఘం)కి రాజీనామాలు మొదలయ్యాయి. సంస్థ అధ్యక్ష్యుడు మోహన్‌లాల్‌తో సహా అందరూ రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుత అమ్మ పాలకమండలి రద్దు చేయబడింది. హేమ క‌మిటీ రిపోర్ట‌ర్ వెంట‌నే మ‌రికొంత మంది సినీ ప‌రిశ్ర‌మ‌లో జ‌రుగుతున్న అఘాయిత్యాల‌పై ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావ‌డంతో ‘అమ్మ‌’లో తీవ్ర విభేదాలు భ‌గ్గుమంటున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న జాయింట్ సెక్రటరీ బాబు రాజ్‌ను తొలగించాలని ఓ వర్గం సభ్యులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. లైంగిక ఆరోపణలకు పాల్పడిన ‘అమ్మ’లో సభ్యులైన తారలను వివరణ కోరాలన్న డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. ‘అమ్మ’కు చెందిన మహిళా సభ్యులే ఎక్కువగా ఆ డిమాండ్‌ చేయడంతో వారి వాదనకు బలం చేకూర్చినట్లు సమాచారం. మొన్న ‘అమ్మ’ తప్పు చేసిందని నటుడు పృథ్వీరాజ్ బహిరంగంగా కామెంట్ చేశాడు. ఇక ఈరోజు జరగాల్సిన ‘అమ్మ’ కార్యవర్గ సమావేశం వాయిదా పడినట్లు నిన్న వార్తలు వచ్చాయి. సినీనటుడు, సంస్థ అధ్యక్ష్యుడు మోహన్‌లాల్‌ వ్యక్తిగతంగా సమావేశానికి హాజరుకావడంలో ఇబ్బంది సభను వాయిదా వేసినట్లు అధికారిక సమాచారం ఇచ్చారు. ఇక ప్రస్తుతం మోహన్ లాల్ చెన్నైలో ఉన్నట్లు సమాచారం. మోహన్‌లాల్‌ వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పడంతో సమావేశం వాయిదా పడింది. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని అమ్మ అధికారులు తెలిపారు. ఈలోగా మూకుమ్మడి రాజీనామాలు జరిగాయి, హేమ కమిటీ నివేదిక వెలువడిన తర్వాత మీడియా, సోషల్ మీడియాలో ‘అమ్మ’ సంస్థకు చెందిన కొందరు ఆఫీస్ బేరర్లపై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో, ప్రస్తుతం ఉన్న ‘అమ్మ’ మేనేజ్‌మెంట్ కమిటీ నైతిక బాధ్యతతో రాజీనామా చేసిందని తెలుస్తోంది. హేమ కమిటీ నివేదిక నేపథ్యంలో మోహన్‌లాల్‌ ‘అమ్మ’కు రాజీనామా చేశారు. రెండు నెలల్లో సాధారణ సమావేశం నిర్వహించి కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకోనున్నారు. సాధారణ సమావేశం వరకు కార్యాలయం కార్యకలాపాలను సమన్వయం చేయడానికి ప్రస్తుత నిర్వహణ కమిటీ తాత్కాలిక వ్యవస్థగా కొనసాగుతుందని చెబుతున్నారు.