NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ఇండియా కూటమిలోకి వైసీపీ..!? వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే…?
ఏపీలో వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు, హింసాత్మక ఘటనలకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేశారు మాజీ సీఎం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. అయితే, ఈ ధర్నాకు జాతీయ నేతలు హాజరయ్యారు.. దీంతో, జగన్‌కు ఇంత మంది నేతల మద్దతు ఎలా వచ్చిందన్న చర్చ మొదలైంది. వైసీపీ కూడా వీళ్లంతా వస్తారని ఎక్కడా చెప్పలేదు. ప్రచారం చేసుకోలేదు. హఠాత్తుగా ఒక్కొక్కరుగా జాతీయ, ఇతర రాష్ట్రాల నాయకులు జగన్ ధర్నా శిబిరానికి క్యూ కట్టడం చూస్తే… ఆయన రూట్ మారుస్తున్నారా? అనే సందేహం వచ్చింది పరిశీలకులకు. ఇండి కూటమిలో ఉన్న కాంగ్రెస్ మినహా… మిగతా పెద్ద పార్టీలు జగన్ కు మద్దతు పలకడంతో.. జగన్‌ అడుగులు ఇండియా కూటమి వైపు పడుతున్నాయా? అనే కొత్త చర్చ మొదలైంది.. అయితే, ఈ రోజు మీడియాతో మాట్లాడిన వైఎస్‌ జగన్‌.. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.. ఇండియా కూటమిలో చేరతారా? అనే అంశంపై స్పందించిన వైఎస్‌ జగన్‌.. ఏపీలో జరుగుతున్న అరాచకాలపై ఢిల్లీలో ఫొటో, వీడియో గ్యాలరీలు ఏర్పాటు చేశాం.. అవి చూసిన తర్వాత గళం విప్పాలని కోరాం.. ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు వచ్చాయి.. కానీ, కాంగ్రెస్ పార్టీ రాలేదు అనే విషయాన్ని గుర్తుచేశారు.. అసలు కాంగ్రెస్‌ నేతలు ఎందుకు రాలేదు? అనేది ఆ పార్టీనే అడగాలన్నారు.. చంద్రబాబుతో కాంగ్రెస్‌కు ఉన్న సంబంధాలు ఏంటో వాళ్లే చెప్పాలన్న ఆయన.. ఇక, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు.. కాంగ్రెస్‌ పెద్దలతో ఎలా టచ్ లో ఉన్నాడో..? కూడా అనేది కాంగ్రెస్ పార్టీనే అడగాలన్నారు.. బీజేపీ, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, ఎన్సీపీ ఇలా అన్ని పార్టీలను పిలిచాం.. కానీ, కాంగ్రెస్‌ నేతలు ఎవరూ హాజరుకాలేదని పేర్కొన్నారు. మణిపూర్‌ అల్లర్లపై స్పందించే కాంగ్రెస్‌ పార్టీ.. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై ఎందుకు స్పందించదు? అని నిలదీశారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

ఇంకా రెడ్ బుక్ తెరవలేదు.. అప్పుడే గగ్గోలు పెడుతున్నారు..
ఇంకా రెడ్‌ బుక్‌ తెరవలేదు.. అప్పుడే గగ్గోలు పెడుతున్నారంటూ ఎద్దేవా చేశారు మంత్రి నారా లోకేష్‌.. ఈ రోజు అసెంబ్లీ చివరి రోజు కావటంతో నారా లోకేష్ కు వినతులు వెల్లువెత్తాయి.. లోకేష్ ని కలిశారు పలువురు నామినేటెడ్ పదవుల ఆశావహులు.. తమ తమ బయోడేటాలు లోకేష్ కు అందజేశారు.. అయితే, పార్టీ కోసం కష్టపడిన వారి సేవల్ని గుర్తుపెట్టుకుని అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.. ఇక, అసెంబ్లీ లాబీలో మీడియా చిట్‌చాట్‌లో హాట్‌ కామెంట్లు చేశారు లోకేష్‌.. నా దగ్గర రెడ్ బుక్ ఉందని నేనే దాదాపు 90 బహిరంగ సభల్లో చెప్పాను అని గుర్తుచేశారు.. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్ లో చేర్చి.. చట్టప్రకారం శిక్షిస్తామని చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నాను అని స్పష్టం చేశారు.. ఇంకా రెడ్ బుక్ తెరవక ముందే జగన్ ఢిల్లీ దాకా వెళ్లి గగ్గోలు పెడుతున్నాడు అంటూ సెటైర్లు వేశారు మంత్రి. పీవీ నరసింహారావుకు భారతరత్నపై స్పందించమని జాతీయ మీడియా కోరితే విజయసాయి పేరు చెప్పి వెళ్లిపోయారని గుర్తుచేసిన మంత్రి లోకేష్‌.. రెడ్ బుక్ కు మాత్రం జాతీయ మీడియా వెంటపడి బతిమాలి పిలిపించి మరీ ప్రచారం కల్పించాడు అని దుయ్యబట్టారు.. గత 5ఏళ్ల కాలంలో జగన్ రెండు ప్రెస్‌మీట్లు పెడితే.. 11 సీట్లు వచ్చాక నెల రోజుల వ్యవధిలో ఐదు ప్రెస్‌మీట్లు పెట్టాడు అంటూ ఎద్దేవా చేశారు.. జగన్ చెప్పే అసత్యాలేవో అసెంబ్లీకి వచ్చి చెప్తే.. వాస్తవాలు మేం వివరిస్తాం కదా? అని ప్రశ్నించారు. జగన్ అసెంబ్లీకి వస్తే గౌరవంగా చూసుకుని వాస్తవాలు అర్ధమయ్యేలా వివరిస్తాం అన్నారు. వైసీపీ నేతల్లా కూటమి నేతలెవ్వరూ బూతలు తిట్టరు, వైఎస్‌ జగన్ కుటుంబసభ్యుల్ని అగౌరవపరచరు అని వ్యాఖ్యానించారు మంత్రి నారా లోకేష్‌.

వైసీపీకి మరో బిగ్‌ షాక్‌..! లోకేష్‌ను కలిసిన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మరో బిగ్‌ షాక్‌ తప్పదా? అంటే అవుననే ప్రచారం సాగుతోంది.. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు.. వైసీపీకి గుడ్‌బై చెప్పి.. తెలుగుదేశం కండువా కప్పుకుంటుండగా.. ఈ రోజు శాసనమండలి లాబీలో మంత్రి నారా లోకేష్‌ను కలిశారు వైసీపీ ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ చైర్‌పర్సన్ జకియా ఖానమ్.. ఇప్పటికే ఆమె మంత్రి ఫరూఖ్ తో సమావేశమై.. పలు కీలక అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది.. మరోవైపు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చట్టసభలను బహిష్కరించినా.. రెగ్యులర్‌గా మండలి సమవేశాలకు హాజరవుతూనే ఉన్నారు జాకియా ఖానమ్.. ఇక, ఈ రోజు మంత్రి నారా లోకేష్ తో ఆమె కుటుంబసభ్యులతో కలిసి సమావేశం కావడం చర్చగా మారింది.. ఈ భేటీలో ఆమె.. పార్టీలో చేరడంపై క్లారిటీ వచ్చిందని.. త్వరలో తెలుగుదేశం పార్టీలో జాకియా ఖానమ్ చేరుతున్నారంటూ పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది.

ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. 27.28 గంటల పాటు సభ
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.. 16వ శాసన సభ మొదటి సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు.. ఈ సందర్భంగా స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. మొత్తం 27 గంటల 28 నిముషాల పాటు సభ కార్యక్రమాలు జరిగాయని వెల్లడించారు.. శాసన సభలో సభ్యులు 36 ప్రశ్నలు ప్రభుత్వానికి సంధించారని.. అందులో స్వల్ప వ్యవధి ప్రశ్న ఒకటిగా పేర్కొన్నారు.. ఇక, శాసనసభలో సభాధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు ప్రకటనలు చేసినట్టు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.. ప్రవేశపెట్టిన బిల్లులు 2 కాగా.. ఆమోదం పొందిన బిల్లులు కూడా 2గా వివరణ ఇచ్చారు.. మొత్తం శాసన సభలో 68 మంది సభ్యులు ప్రసంగించారని వెల్లడించారు.. 344 నిబంధన కింద ఒక చర్చ కూడా సాగిందన్నారు స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు. కాగా, ఈనెల 22 నుంచి ప్రారంభమైన సమావేశాలు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన ఐదు రోజుల పాటు కొనసాగాయి. తొలిరోజు గవర్నర్‌ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కాగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశాల్లో పాల్గొన్నారు.. ఇక, సభ ప్రారంభమైన రోజు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు , వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలు ధరించి సమావేశాలు హాజరుకాగా.. రాష్ట్రంలో ప్రభుత్వం అరాచక పాలనను కొనసాగిస్తుందని ఆరోపిస్తూ కేవలం 15 నిమిషాల వ్యవధిలోనూ అసెంబ్లీ సమావేశాలను వాకౌట్‌ చేసి వెళ్లిపోయిన విషయం విదితమే..

దొంగే దొంగ అన్నట్లు కేసీఆర్, హరీశ్ పరిస్థితి ఉంది..
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. నిన్న బడ్జెట్ మీద పదేళ్లు అనుభవం ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని బడ్జెట్ విషయంలో చీల్చి చెండాడుతాం అన్నారని.. అలాంటి కేసీఆర్ పదేళ్లలో వాస్తవిక బడ్జెట్ పెట్టలేదని విమర్శించారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మొదటి సారి బడ్జెట్ పెట్టినా.. మీలాగా గ్యాస్…స్ట్రాష్ బడ్జెట్ పెట్టలేదంటూ పేర్కొన్నారు. పదేళ్లు ఆదాయానికి మించి ఖర్చు చేస్తామని.. కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టారంటూ తెలిపారు. మోసం చేయకుండా.. వాస్తవాలకు దగ్గరగా ఎంత వస్తే అంతే ఖర్చు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రైతులను నట్టేట ముంచుతున్నామని కేసీఆర్ మాట్లాడుతున్నారని.. రైతు బంధు ఎత్తివేయలేదు కదా అంటూ మంత్రి జూపల్లి వ్యాఖ్యానించారు. గతంలో ఇచ్చిన దానికి ఎక్కడా తగ్గించలేదన్నారు. రైతులకు 31వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నాం.. ఎలా నట్టేట ముంచినట్లు అవుతుందని ప్రశ్నించారు.

61 ఏళ్లు పూర్తి చేసుకున్న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు
ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నేటితో 61 వసంతాలు పూర్తి చేసుకుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాగుకు ఆధారంగా ఈ ప్రాజెక్టు నిలుస్తోంది. 1963 జులై 26న నాటి భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వద్ద శంకుస్థాపన చేసి.. దీనిని ఒక ఆధునిక దేవాలయంగా అభివర్ణించారు. 1978లో ప్రాజెక్టు పూర్తికాగా అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రారంభించారు. 2009లో కాంగ్రెస్‌ సర్కారు హయాంలో ప్రాజెక్టు పైన నెహ్రూ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 112 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించారు. పూడిక కారణంగా ఇది 90.313 టీఎంసీల నీటి నిల్వకు పడిపోయింది. ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు కాకతీయ, సరస్వతి, లక్ష్మి కాల్వలను అందుబాటులోకి తెచ్చారు. నిజామాబాద్‌తోపాటు ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు ప్రాణధారగా నిలిచింది ఈ ప్రాజెక్టు. 60 ఏళ్లుగా ఉత్తర తెలంగాణలోని అయిదు జిల్లాలకు సాగు, తాగు నీరు అందిస్తోంది శ్రీరాంసాగర్ ప్రాజెక్టు. 1983లో టీడీపీ సర్కారు హయాంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ జల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాని నిర్మాణం 1988లో పూర్తి కాగా.. ఆయనే ప్రారంభించారు. 61 వసంతాలు పూర్తయిన సందర్భంగా, ప్రాజెక్టు వద్ద గల నెహ్రూ విగ్రహానికి ఎస్‌ఈ శ్రీనివాస్ రావు గుప్తా పూలమాల వేశారు. గోదావరి మాతకు పూజలు చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతం నుంచి గురువారం 22 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. ఎగువ గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1072 అడుగుల నీటిమట్టం ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 26.76 టీఎంసీల నీరు నిల్వ ఉంది.ఈ ఖరీఫ్ సీజన్‌లో 20 టీఎంసీల వరద నీరు వచ్చినట్లు ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు

గాజాపై ఇజ్రాయెల్ చర్యలను ఖండించిన ప్రియాంక గాంధీ..
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అనాగరికంగా అభివర్ణించారు. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను జాతి నిర్మూలన చర్య అని తెలిపారు. ఇజ్రాయెల్ అనాగరికతకు అనేక పాశ్చాత్య దేశాలు మద్దతు పలకడం సిగ్గుచేటని ప్రియాంక ఆరోపించారు. గాజాలో కొనసాగుతున్న సైనిక చర్యను ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలు తీవ్రంగా ఖండించాలని ఆమె కోరారు. గాజాలో ప్రతిరోజూ అమాయక పిల్లలు, మహిళలు, వృద్ధులు, వైద్యులు, జర్నలిస్టులు హత్యకు గురవుతున్నారని ప్రియాంక తెలిపారు. ప్రియాంక గాంధీ.. సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూపై మండిపడ్డారు. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు బుధవారం యుఎస్ కాంగ్రెస్ ఉమ్మడి సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగించిన అనంతరం ఉభయ సభల ఎంపీలు లేచి నిలబడి ఆయనకు చప్పట్లు కొట్టారు. అదే సమయంలో.. కొందరు నాయకులు ఇజ్రాయెల్ ప్రధాని ప్రసంగాన్ని చారిత్రాత్మకంగా అభివర్ణించారు. ఈ క్రమంలో.. అమెరికా నేతల తీరుపై ప్రియాంక గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. మానవత్వం, నాగరికతపై నమ్మకం ఉన్నవారు ఇలా చేసి ఉండరని అమెరికా నేతలను ఉద్దేశించి దుయ్యబట్టారు.

ప్రతిపక్ష నేతకు లుటియన్స్‌లో కొత్త బంగ్లా కేటాయింపు!
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి ఢిల్లీలోని లుటియన్స్‌లో ప్రభుత్వం కొత్త బంగ్లాను కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రియాంకాగాంధీ కొత్త బంగ్లాను పరిశీలించి వెళ్లారు. మరీ ఈ బంగ్లాను రాహుల్ అంగీకరిస్తారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఢిల్లీలోని లుటియన్స్‌లోని సున్‌హారీ బాగ్‌లో రాహుల్ గాంధీకి బంగ్లా నంబర్ 5 కేటాయించారు. లోక్‌సభ ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత రాహుల్ గాంధీ ఢిల్లీలోని లుటియన్స్‌ దగ్గర తుగ్లక్ 12 లేన్‌ను ఖాళీ చేసి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. దీంతో ఆయనకు బంగ్లా నెంబర్ 5 కేటాయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాహుల్ సోదరి ప్రియాంక శుక్రవారం మధ్యాహ్నం పరిశీలించి వెళ్లారు. ఈ బంగ్లాను రాహుల్ అంగీకరిస్తారా? లేదా ? అన్నది తెలియాల్సి ఉంది.

ఇథియోపియాలో ఘోర విషాదం.. 257కి చేరిన మృతుల సంఖ్య
ఇథియోపియాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఆది, సోమవారాల్లో కురిసిన వర్షాలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. దీంతో తీవ్ర విషాదం నెలకొంది. మట్టిచరియలు విరిగి పడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 257 మంది మృత్యువాత పడ్డారని తాజాగా అధికారులు వెల్లడించారు. ఈ సంఖ్య 500 వరకు చేరవచ్చని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మృతదేహాల వెలికితీత కోసం అన్వేషణ కొనసాగుతోందని అధికారులు చెప్పారు. ఇదిలా ఉంటే ఘటనాస్థలికి దగ్గర బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ వారి కోసం రోధిస్తున్నారు. మరోవైపు కిన్‌ చో షాచా గోజ్‌డీ ప్రాంతం నుంచి దాదాపు 15 వేల మందికి పైగా బాధితులను ఖాళీ చేయించారు. ఇదిలా ఉంటే ఇథియోపియా ప్రధాని అబీఅహ్మద్‌ శుక్రవారం ప్రమాద ప్రదేశాన్ని సందర్శించే అవకాశం ఉంది. ఈ ఘటనపై తాను చాలా బాధపడినట్లు పేర్కొన్నారు. మట్టిచరియల కింద చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను గుర్తించి బయటకు తీసేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని చెప్పారు. మృతుల్లో చిన్నారులు, గర్భిణులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వర్షాలు జూలైలో ప్రారంభమై సెప్టెంబర్ వరకు కొనసాగనున్నాయి.

సరికొత్త రికార్డ్‌లు సృష్టించిన స్టాక్ మార్కెట్
దేశీయ మార్కెట్‌లో ఐదు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఆసియా మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు మన మార్కెట్‌ సూచీలకు దన్నుగా నిలిచాయి. దీంతో శుక్రవారం ఉదయం లాభాలతో ట్రేడ్ అయిన సూచీలు.. రికార్డు దిశగా దూసుకుపోయాయి. ఇక తాజాగా నిఫ్టీ రికార్డు గరిష్టాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్ కూడా భారీగా దూసుకుపోయింది. సెన్సెక్స్ 1292 పాయింట్లు లాభపడి 81, 332 దగ్గర ముగియగా… నిఫ్టీ 428 పాయింట్లు లాభపడి 24, 834 దగ్గర ముగిసింది. నిఫ్టీ శుక్రవారం 24,854.80 మార్కు చేరింది. 25 వేల మార్కుకు అతి చేరువలో ఉంది. నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, దివీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, భారతీ ఎయిర్‌టెల్, విప్రోలు లాభపడగా.. ఓఎన్‌జీసీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, యాక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ నష్టపోయాయి. ఐటీ, మెటల్, ఫార్మా, రియల్టీ, ఆటో, క్యాపిటల్ గూడ్స్, టెలికాం, మీడియా రంగాల సూచీలు 1.3 శాతం వృద్ధితో అన్ని రంగాలు గ్రీన్‌లో ట్రేడయ్యాయి.

బంగ్లాదేశ్పై ఘన విజయం.. ఫైనల్స్కు భారత్
మహిళల ఆసియా కప్లో భాగంగా.. ఈరోజు బంగ్లాదేశ్తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. 81 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఓపెనర్లు కేవలం 11 ఓవర్లలోనే ఛేదించారు. భారత్ ఓపెనర్లు స్మృతి మంధాన (55*), షఫాలీ వర్మ (26*) పరుగులు చేశారు. దీంతో.. భారత జట్లు ఫైనల్స్లోకి ప్రవేశించింది. ఈరోజు రాత్రి శ్రీలంక- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అందులో ఏ టీమ్ గెలుస్తే.. ఆ టీమ్తో ఎల్లుండి భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 80 పరుగులు మాత్రమే చేసింది. భారత్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి బంగ్లా జట్టును స్కోరు చేయకుండా కట్టడి చేశారు. దీంతో.. బంగ్లా తక్కువ స్కోరు చేసింది. బంగ్లా బ్యాటింగ్లో కెప్టెన్ నిగర్ సుల్తానా అత్యధికంగా (32) పరుగులు చేసింది. ఆ తర్వాత.. శోర్ణా అక్తర్ (19) రన్స్ సాధించింది. మిగతా అందరు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ఇండియా బౌలింగ్లో రేణుకా సింగ్, రాధా యాదవ్ చెరో 3 వికెట్లు తీశారు. ఆ తర్వాత పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ తలో వికెట్ సాధించారు.

డబుల్ ఇస్మార్ట్ క్రేజ్ మామూలుగాలేదుగా.. ఏకంగా అన్ని కోట్లకు డిజిటల్ రైట్స్..
రామ్‌ హీరోగా.. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం కాంబినేషన్ లో మరోసారి రాబోతున్న చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా పెద్దఎత్తున్న విడుదల చేయనున్నారు మూవీ మేకర్స్. ఇక మూవీలో మాస్‌, యాక్షన్‌, డ్రామా, ఎంటర్‌టైన్మెంట్‌.. మొదటి పార్ట్ కంటే డబుల్‌ డోస్‌ లో కచ్చితంగా ఉంటాయంటున్నారు దర్శకుడు పూరి జగన్నాద్. ఇక ఈ సినిమా సంబంధించి తాజా సమాచారం ఏమిటంటే.. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల వరల్డ్‌ థియేట్రికల్‌ రైట్స్‌ ను “అమెజాన్ ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ ” అధినేతలు నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి సొంతం చేసుకున్నారు. అదికూడా భారీ ధరను వెచ్చించి. ‘డబుల్‌ ఇస్మార్ట్‌’లో సంజయ్‌దత్‌ ఓ పవర్‌ఫుల్‌ రోల్‌ పోషించగా.. కావ్య థాపర్‌ హీరోయిన్. ఈ సినిమాకు పూరి జగన్నాథ్‌, ఛార్మి కౌర్‌ నిర్మాతలుగా ఉన్నారు. ఇకపోతే., తాజాగా కేవలం దక్షిణ భారతదేశ భాషలకు సంబంధించి డిజిటల్ రైట్స్ ఏకంగా రూ. 33 కోట్ల భారీ ధరకు అమ్ముడ బోయినట్లుగా మూవీ మేకర్స్ తెలిపారు. దింతో ఈ సినిమాపై అంచనాలు ప్రేక్షకులలో మరింత పెరిగాయి. మరోవైపు ఇదే రోజున మాస్ మహారాజ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చుడాలిమరి ఎవరు ఎంతటి విజయాన్ని సాధిస్తారో.