NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి హస్తిన పర్యటనకు బయల్దేరి వెళ్లారు.. రేపు ఢిల్లీ వేదికగా జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్నారు సీఎం.. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే నీతి ఆయోగ్ భేటీలో ఏపీ అభివృద్ధిపై ప్రస్తావించబోతున్నారు. వికసిత్ భారత్-2047లో భాగంగా వికసిత్ ఏపీ-2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేపట్టింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను నీతి ఆయోగ్ భేటీలో ప్రస్తావించబోతున్నారు.. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ లక్ష్య సాధనకు అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ఏ విధంగా ఉపకరిస్తాయో చెప్పబోతున్నారు. ఏపీలో ప్రైమరీ సెక్టార్ పరిధిలోకి వచ్చే వ్యవసాయం, ఆక్వా రంగాలకున్న అవకాశాలను నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించనున్నారు. ఇక, జీడీపీ గ్రోత్ రేట్ పెరుగుదలకు తాము పెట్టుకున్న టార్గెట్.. చేపట్టనున్న ప్రణాళికలను నీతి ఆయోగ్‌ సమావేశంలో వివరించరున్నారు ఏపీ సీఎం.. సేవల రంగ అభివృద్ధికి ఏపీలో ఉన్న అవకాశాలను ప్రత్యేకంగా ప్రస్తావించబోతున్నారు.. డిజిటల్ కరెన్సీ అవశ్యకతను నీతి ఆయోగ్ భేటీలో వివరించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ విషయాలపై ఇప్పటికే సీఎం చంద్రబాబుతో సమావేశమై.. ప్రత్యేకంగా చర్చించారు నీతి ఆయోగ్ సీఈవో సుబ్రమణ్యం.. మరోవైపు.. నీతి ఆయోగ్ సమావేశం ముందు, ఆ తర్వాత అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలిసే అవకాశం ఉంది.

రాజకీయ హత్యలపై దమ్ముంటే వివరాలు బయటపెట్టండి..!
రాజకీయ హత్యలపై దమ్ముంటే వివరాలు బయటపెట్టాలని.. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి సవాల్‌ విసిరారు మంత్రి పయ్యావుల కేశవ్.. జగన్ కు ప్రతిపక్ష హోదా రావాలంటే ఇంకో పదేళ్లయినా సమయం పడుతుందన్న ఆయన.. ప్రజలు జగన్‌కు ఓట్లేసి 11 సీట్లయినా ఇచ్చింది అసెంబ్లీకి వచ్చి చర్చించమని.. కానీ, సింగిల్ కెమెరాతో ప్రెస్మీట్లు పెట్టడానికి కాదు అన్నారు. అభిమానించినా అవమానించినా నిలదొక్కుకున్న వాళ్లే రాజకీయాల్లో ఉండగలరని జగన్ గ్రహించాలని సూచించారు.. జగన్ ఇలాగే పోతే ఉన్న 11 మంది కూడా ఒక్కరయ్యే ప్రమాదముందని గ్రహించాలన్నారు.. శ్వేతపత్రంలో చూపిన తొమ్మిదన్నర లక్షల కోట్ల అప్పు ఖచ్చితంగా పెరుగుతుందన్నారు.. ఇండియా కూటమి ప్రతినిధులతో రహస్య చర్చలు కోసం ఢిల్లీ వెళ్లానని ధైర్యంగా చెప్పొచ్చు కదా? అని నిలదీశారు. ప్రతిపక్ష పాత్ర నిర్వర్తించలేనని సభలో చేతులెత్తేసి కోర్టులో ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతారు అంటూ ఎద్దేవా చేశారు.. అసెంబ్లీలో అడగాల్సినవి ఢిల్లీ వెళ్లి అడుగాతానంటున్నాడు.. కనీసం 30 మంది ఎమ్మెల్సీలను మండలికైనా పంపితే వాస్తవాలు తెలుసుకునేవాళ్లు అని హితవుపలికారు.. రాష్ట్రంలో ఈ నిమిషం వరకూ జగన్ వేసిన పోలీసులే ఎస్సైలు, సీఐలు, డీఎస్పీలుగా ఉన్న విషయం గ్రహించాలని.. రాజకీయ హత్యలపై దమ్ముంటే జగన్ వివరాలు బయటపెట్టాలని ఛాలెంజ్‌ చేశారు మంత్రి పయ్యావుల కేశవ్‌.

మైనార్టీ విద్యార్థులకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. ఉచితంగా శిక్షణ..
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది.. రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులకు టెట్ పరీక్ష కోసం మైనార్టీ సంక్షేమ శాఖ, ఏపీ ప్రభుత్వ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ ఎండీ ఫరూక్ ప్రకటించారు.. ఈ సెంటర్ల ద్వారా.. రాష్ట్రంలోని ముస్లిం, క్రిస్టియన్(బీసీ-సీ), సిక్కులు, బుద్ధులు, జైనులు తదితర మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు.. ఏపీ- టెట్ 2024కు ఈ అవకాశాన్ని కల్పిస్తూ ఉర్దూ, తెలుగు మీడియంలో శిక్షణ ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఇక, సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ (సీఈడీఎం) మైనార్టీ సంక్షేమ శాఖ పర్యవేక్షణలో ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని.. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా 19 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు మంత్రి ఫరూక్‌.. రాష్ట్రంలోని జిల్లాల వారీగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామని.. మైనారిటీ విద్యార్థులు రాష్ట్రంలో ఏర్పాటుచేసిన ఆయా కేంద్రాల ద్వారా ఉచితంగా శిక్షణ పొంది సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరోవైపు.. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో మైనార్టీ విద్యార్థుల సంక్షేమాన్ని, విద్యా అవకాశాలలో జగన్ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించారని.. మైనార్టీలకు తీరని అన్యాయం చేశారని దుయ్యబట్టారు.. జగన్‌ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రగతి పూర్తిగా కుంటుపడిందన్న ఆయన.. వైసీపీ ప్రభుత్వ ధోరణితో విసిగిన రాష్ట్ర ప్రజలు రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వానికి తిరుగులేని మెజార్టీతో పట్టం కట్టారన్నారు.. ఇక, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు.

కొత్త మున్సిపల్‌ కమిషనర్లతో మంత్రి నారాయణ సమీక్ష.. కీలక ఆదేశాలు..
రాష్ట్రంలోని 8 మున్సిపల్ కార్పొరేషన్ లకు కొత్తగా నియమించబడిన కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు మంత్రి నారాయణ.. సచివాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి మున్సిపల్ శాఖ డైరెక్టర్ హరీనారాయణన్, టిడ్కో ఎండీ సాయి కాంత్ వర్మ, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు హాజరయ్యారు.. ఆయా కార్పొరేషన్లలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, టిడ్కో ఇళ్లపై చర్చించారు.. ఈ సందర్భంగా మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ.. నగరాల్లో పార్కులు, సెంట్రల్ డివైడర్లు, రోడ్ల గుంతలు పూడ్చడం, డ్రెయిన్లలో పూడిక తొలగింపుపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.. ఇక, రోడ్లపై సెంట్రల్ డివైడర్ లలో ఎలాంటి ఫ్లెక్సీలు ఉన్నా వెంటనే తొలగించాలని సూచించారు మంత్రి నారాయణ.. సెంట్రల్ డివైడర్‌లలో ఫ్లెక్సీలు ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆయన.. వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు తాగునీటి పరీక్షలు చేయాలన్నారు.. అన్న క్యాంటీన్లు నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి.. వీధి కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు (స్టేరిలైజేషన్) చేయించాలన్నారు.. టౌన్ ప్లానింగ్ పై ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా చూడాలి.. టిడ్కో ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేసేలా చూడాలంటూ కీలక ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణ.

ప్రభుత్వ పాఠశాలలో కూలిన స్లాబ్.. విద్యార్థి మృతి
నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాల స్లాబ్‌ కూలిన ఘటనలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.. నెల్లూరు రూరల్ పరిధి బీవీ నగర్‌లోని కురుగొండ నాగిరెడ్డి నగరపాలక సంస్థ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.. పాఠశాలలో ఇటీవల అదనపు తరగతుల కోసం భవనాలను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాణం సాగుతున్న ప్రాంతం వద్ద విద్యార్థులు ఆడుకుంటుండగా… ఒక్కసారిగా స్లాబ్ కింద పడిందని.. దీంతో 9వ తరగతి చదువుతున్న గురు మహేంద్ర అనే విద్యార్థి మృతి చెందినట్టు చెబుతున్నారు. ఈ సమాచారం తెలియడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. విద్యార్థులు ఆడుకునే క్రమంలో గోడ ఎక్కుతుండగా స్లాబ్ కూలిందని అంటున్నారు. నాడు – నేడు కింద చేపట్టిన పనుల్లో నాణ్యత లేకపోవడం వల్లే ఇలా జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.. విద్యార్థి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు.. మున్నీరుగా విలపించారు. ఇక, నెల్లూరులో ఘటన సమాచారం తెలియడంతో జిల్లా విద్యాశాఖ అధికారి రామారావును విచారణ కోసం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ పంపించారు. ఆయన పాఠశాల వద్దకు చేరుకొని ఘటనపై ఆరా తీశారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతామని ఆయన తెలిపారు. మరోవైపు పోలీస్ అధికారులు కూడా ఈ ప్రమాదంపై విచారణ చేపట్టారు. ప్రమాద విషయం తెలియగానే టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, జనసేన నాయకుడు గునుకుల కిషోర్.. అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వపరంగా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయల మేర ఎక్స్ గ్రేషియను మంత్రి నారాయణ ప్రకటించారు. భవన నిర్మాణంలో నాణ్యతపై కూడా విచారణ చేయిస్తామని వెల్లడించారు మంత్రి నారాయణ..

పెద్దవాగు ప్రాజెక్టుకు తక్షణ సాయంగా రూ.3.50 కోట్లు మంజూరు
ఇటీవల వర్షాలతో వరద పోటెత్తడంతో భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల ఉమ్మడి ప్రాజెక్టు పెద్ద వాగుకు 250 మీటర్ల పొడవున గండిపడిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 18.6 అడుగులు దాటడం, మూడు క్రస్ట్‌గేట్లలో ఒకటి పనిచేయకపోవడంతో ఇటీవల గండిపడి భారీ నష్టం జరిగింది. పెద్దవాగు ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో రైతులు పండిస్తున్న పంటలకు ఈ సీజన్‌లోనే సాగునీరు అందించేలా యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. బండ్‌ ఫార్మేషన్, అప్రోచ్‌ కాలువ పనులకు రూ.3.5 కోట్లతో అధికారులు అంచనాలను తయారు చేయగా.. అశ్వారావుపేట పెద్దవాగు ప్రాజెక్టుకు తక్షణ సాయంగా రూ3.50కోట్ల రూపాయలను చేసిన రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రాజెక్టు కట్ట మరమ్మతులకు కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రారంభించారు. ఈ ఏడాది ఆయకట్టు రైతులకు సాగునీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ, ఏపీ పరిధిలో 16 వేల ఎకరాల ఆయుకట్టు కలిగిన పెదవాగు ప్రాజెక్టుకు తక్షణ మరమ్మతులు చేసి ఈ సీజన్‌లోనే రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు తగిన ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సీఎస్‌ సమీక్ష
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి వేడుకలకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సీఎస్ ఆదేశించారు. గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు సీఎస్ తెలిపారు. ముందుగా ముఖ్యమంత్రి పరేడ్ గ్రౌండ్‌లోని సైనిక అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించి.. తర్వాత గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని ఆమె వెల్లడించారు. వేడుకల సందర్భంగా అసెంబ్లీ, కౌన్సిల్‌, హైకోర్టు, రాజ్‌భవన్‌, సెక్రటేరియట్‌ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని సంబంధిత అధికారులను సీఎస్ ఆదేశించారు. జాతీయ పతాకం ఎగురవేసే ప్రధాన వేదిక వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్ బీ శాఖను సీఎస్ కోరారు. ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సమయంలో ఆయనను అతిథులు అందరూ చూసేందుకు వీలుగా ప్రధాన వేదిక ఏర్పాట్లు ఉండాలన్నారు. వేడుకలు నిర్వహించే పరిసర ప్రాంతాలలో తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు చెత్తను శుభ్రం చేస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి పారిశుద్ధ్య పనులలో ఎలాంటి లోపాలు ఉండరాదని పురపాలక శాఖను ఆదేశించారు. అంబులెన్స్‌, నర్సింగ్‌ అసిస్టెంట్లను అందుబాటులో ఉంచాలని ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. ప్రముఖులకు, అధికారులకు, వేడుకకు హాజరయ్యేవారికి ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను కేటాయించడంతో పాటు ట్రాఫిక్ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని పోలీసు శాఖకు సూచించారు. అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచాలని ఫైర్ శాఖను, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

కోర్టుల్లో పెండింగ్‌ కేసులపై కేంద్రం కీలక ప్రకటన.. ఎన్ని కేసులున్నాయంటే..!
దేశ వ్యాప్తంగా న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో మొత్తం 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు. గరిష్ఠంగా 1.18 కోట్ల కేసులు ఉత్తర్‌ ప్రదేశ్‌లోని సబార్డినేట్‌ కోర్టుల్లోనే ఉన్నాయని తెలిపారు. మొత్తంగా 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉండగా.. వీటిలో సుప్రీంకోర్టులో 84,045, వివిధ హైకోర్టుల్లో 60,11,678 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. అత్యధికంగా జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల్లోనే 4,53,51,913 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కోర్టుల్లో సరిపడా భౌతికపరమైన వనరులు లేకపోవడం, కేసుల్లోని వాస్తవాలు తేలడంలో సంక్లిష్టత, సాక్ష్యాలు, లిటిగేషన్లు.. ఇలా పలు కారణాలతో కోర్టుల్లో కేసులు పెండింగ్‌ పడుతున్నాయని చెప్పారు. నియమాలు మరియు విధానాలను సరిగ్గా అమలు చేయడం కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.

నీతి ఆయోగ్‌ సమావేశంలో కేంద్రాన్ని నిలదీస్తా..
రేపు ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొననున్నారు. ఇండియా కూటమికి చెందిన ఇతర ముఖ్యమంత్రుల మాదిరిగానే ఆమె కూడా సమావేశానికి హాజరుకాకుండా ఉంటారా అనే సస్పెన్స్ కు తెర తీసింది. ఈ క్రమంలో.. నీతిఆయోగ్‌ సమావేశానికి హాజరవడం కోసం శుక్రవారం ఆమె కలకత్తా నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ‘నీతిఆయోగ్‌ మీటింగ్‌కు వెళ్తానని బడ్జెట్‌కు ముందే చెప్పా. మీటింగ్‌లో నా స్పీచ్‌ కాపీని కూడా ఇప్పటికే పంపించాను. ప్రతిపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో కేంద్రం వ్యవహరించిన తీరు చూశాక ఈ విషయమే నీతిఆయోగ్‌లో మాట్లాడాలనుకుంటున్నానని తెలిపారు. నీతి ఆయోగ్‌ సమావేశంలో కేంద్రాన్ని నిలదీస్తానని సీఎం మమతా బెనర్జీ అన్నారు. నీతి ఆయోగ్‌ సమావేశంలో కొంతసమయం ఉంటానని.. తనకు మాట్లాడేందుకు అవకాశం వస్తే.. బడ్జెట్‌లో విపక్షపాలిత రాష్ట్రాలపై చూపిన వివక్షపై మాట్లాడుతానన్నారు. బెంగాల్‌, పొరుగు రాష్ట్రాలను విభజించేందుకు జరుగుతోన్న కుట్రపై నిరసన వ్యక్తం చేస్తానని పేర్కొన్నారు. లేదంటే.. సమావేశం నుంచి బయటకు వచ్చేస్తా అని మమతా బెనర్జీ తెలిపారు. అయితే.. మమతాబెనర్జీ నీతిఆయోగ్‌ సమావేశానికి హాజరవడం ఇదే తొలిసారి. 2014లో ప్లానింగ్‌ కమిషన్‌ను రద్దు చేసి నీతిఆయోగ్‌ను ఏర్పాటు చేయడంపై దీదీ మొదటి నుంచి నిరసన తెలుపుతున్నారు.

గాజాకు పోలియో ప్రమాదం.. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక
ఇజ్రాయెల్ రూపంలో ఓ వైపు గాజాకు ప్రమాదం పొంచి ఉంటే.. తాజాగా ఇప్పుడు మరో వైపు నుంచి కూడా ప్రమాదం పొంచి ఉంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులతో గాజా అల్లాడిపోతుంది. గజగజవణికిపోతుంది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఇలాంటి తరుణంలో డీహెచ్‌వో మరో బాంబు పేల్చింది. గాజా మురుగునీటి నమూనాల్లో పోలియో సంబంధమైన వైరస్‌ అవశేషాలు ఉన్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో 10 లక్షల టీకాలను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు పోలియో కేసు నమోదు కాలేదని.. తక్షణమే చర్యలు తీసుకోకపోతే వేలాది మంది చిన్నారులు ఈ వ్యాధి బారినపడే సమయం ఎంతో దగ్గరలో లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధానోమ్‌ స్పష్టం చేశారు. యుద్ధం కారణంగా గడిచిన తొమ్మిది నెలలుగా వ్యాక్సిన్‌ పంపిణీకి ఆటంకాలు ఎదురవుతున్నాయని.. దీంతో ఐదేళ్లలోపు చిన్నారులకు ఈ వ్యాధి ముప్పు అధికంగా ఉందన్నారు. రెండేళ్లలోపు శిశువులకు మరింత ప్రమాదకరంగా మారనుందని వెల్లడించారు.

గ్రాండ్‌గా పాక్ మహిళ విడాకుల పార్టీ.. వీడియో వైరల్
అమెరికాలో ఉంటున్న పాకిస్థాన్ మహిళ.. తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఈ సందర్భాన్ని ఆమె చాలా వేడుకగా నిర్వహించింది. అతిథుల్ని పిలిచి గ్రాండ్‌గా చేసింది. స్టేజీ బ్యాక్‌గ్రౌండ్‌లో ‘డివోర్స్ ముబారక్’ అంటూ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసి.. దానికి ముందు బాలీవుడ్ పాటలకు ఉత్సాహంగా డ్యాన్స్ చేసింది. అక్కడికి వచ్చిన అతిథులు కూడా ఆమెను చాలా ఎంకరేజ్ చేశారు. నోట్లు వెదజల్లుతూ ఉత్సాహపరిచారు. వీడియోలో శ్రోతలు కూడా కేరింతలు కొడుతూ గంతులేశారు. అయితే ఆమె విడాకులు ఎందుకు తీసుకుందో చెప్పలేదు గానీ.. ఈ వీడియోపై పాకిస్థాన్ నెటిజన్లు.. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇంకొందరు నెటిజన్లు ఆమెకు సపోర్టుగా కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

మంత్రి కొండా సురేఖను కలిసిన ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణు దేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్‌లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖను వారింట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాలపై చర్చించారు. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే ప్రప్రథమంగా నెలకొల్పనున్న గీత యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను రేణు దేశాయ్ మంత్రి సురేఖకు వివరించారు. ఈ సందర్భంగా తమ ఇంటికి అతిథిగా వచ్చిన రేణుదేశాయ్‌ని మంత్రి సురేఖ నూతన వస్త్రాలు, పండ్లు, పసుపు కుంకుమలతో సత్కరించారు. మంత్రి సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ ప్రత్యేకంగా తెప్పించిన గొలుసుని మంత్రి సురేఖ రేణు దేశాయ్‌కి తన స్వహస్తాలతో అలంకరించారు.

‘వీరాంజనేయులు విహారయాత్ర’ గట్టిగా సౌండ్ చేసేలా ఉందే!
డా. నరేశ్ వికె, రాగ్‌ మయూర్‌, ప్రియా వడ్లమాని లీడ్ రోల్స్ నటిస్తున్న హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘వీరాంజనేయులు విహారయాత్ర. అనురాగ్‌ పలుట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాను బాపినీడు. బి, సుధీర్‌ ఈదర సంయుక్తంగా నిర్మించారు. ఆగస్ట్ 14న ఈ సినిమా ఈటీవీ విన్ లో ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీం కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పవిత్ర లోకేష్ ఈ టీజర్ ని లాంచ్ చేశారు. డైరెక్టర్ సందీప్ రాజ్, వినోద్, ప్రవీణ్ కంద్రేగుల, హీరో తిరువీర్ పాల్గొన్న టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఇక అదలా ఉంచి టీజర్ విషయానికి వస్తే వీరాంజనేయులు అస్థికల చెంబుకు బ్రహ్మానందం చెప్పిన వాయిస్ ఓవర్ తో మొదలై హిలేరియస్ అనిపించేలా సాగింది. చాలా కాలం తరువాత కుటుంబమంతా కలిసి చూసే పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా అనిపిస్తోంది. అన్ని విషయాలను సమపాళ్లలో వేసి డైరెక్టర్ అనురాగ్ ఈ సినిమాను మలిచారని టీజర్ చుస్తే అర్ధమౌతోంది. నరేశ్‌ కామెడీ టైమింగ్‌, పెర్ఫార్మెన్స్ అయితే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రియా వడ్లమాని, రాగ్‌ మయూర్‌ పాత్రలు కూడా ఆసక్తికరంగా ఉన్నట్టే కనిపిస్తున్నాయి. చనిపోయిన వీరాంజనేయులు అస్థికలను గోవాలో కలిపేందుకు అతని కుటుంబం అంతా అతని పాత డొక్కు మెటాడోర్ వ్యాన్ -బేబీలో బయలుదేరడమే ఈ సినిమా కథాంశం. మ్యూజిక్, విజువల్స్ ఉన్నత స్థాయిలో ఉన్నా ఈ టీజర్ మొత్తానికి సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచేసింది.

ప్రభాస్ పెళ్ళికి షాపింగ్.. శ్యామలా దేవి ఆసక్తికర వ్యాఖ్యలు
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో మొట్టమొదటి స్థానంలో ఉంటాడు ప్రభాస్. ఆయన పెళ్లి గురించి కూడా ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఆయన పెళ్లి గురించి పెద్దమ్మ శ్యామలాదేవి మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసలు విషయం ఏమిటంటే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 32 లో హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేతుల మీదుగా జరివరం శారీస్ స్టోర్ ఓపెన్ ఐయింది. మేయర్ తో పాటు స్వర్గీయ కృష్ణం రాజు గారి సతీమణి శ్యామలాదేవి, యువ హీరో రక్షిత్ అట్లూరి వచ్చి నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. అభిలాష రెడ్డి, గాయత్రి ( నటుడు కృష్ణుడు వైఫ్) ఇద్దరూ కలిసి ఎంతో ఫ్యాషన్ పెట్టిన స్టోర్ ఈ జరివరం కాగా ఇందులో అన్ని రకాల కలెక్షన్స్ తో పాటు కంచి పట్టు, ఆర్గంజా, బ్రైడల్ కు డిజైన్ తో కష్టమైజెషన్ కూడా ఉంటుందని ప్రకటించారు. ఇక ఈ క్రమంలో శ్యామలా దేవి మాట్లాడుతూ నాకు పర్సనల్ గా కంచి పట్టు అంటే ఇష్టం, ఇప్పుడు నేను వేసుకుంది కూడా కంచి పట్టునే..కృష్ణం రాజు గారు నాకు కొన్న ఫస్ట్ కంచి పట్టు చీర ఇదని చెప్పారు. అంతే కాకుండా ప్రభాస్ పెళ్ళి బట్టలు కూడా ఈ జరివరం నుండే కొంటామని ఆమె చెప్పారు. ఇక నటుడు కృష్ణుడు మాట్లాడుతూ: అభిలాష రెడ్డి,నా వైఫ్ గాయత్రి కలసి ఈ స్టోర్ స్టార్ట్ చేశారు, హైద్రాబాద్ లో ఉండే అతివలకు బెస్ట్ కలెక్షన్స్ ఇవ్వాలనే ఉద్దేశం తోనే వాళ్ళు ఈ జరివరం స్టార్ట్ చేశారని అన్నారు.