NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

విద్యుత్ శాఖపై సీఎం సమీక్ష
విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో.. రాష్ట్రంలో సౌరవిద్యుత్ ప్రోత్సాహంలో భాగంగా చేపట్టిన సోలరైజేషన్ కార్యక్రమంపై అధికారులతో చర్చించారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ సమీక్ష సమావేశానికి విద్యుత్‌శాఖ అధికారులు హాజరయ్యారు.. పీఎం సూర్య ఘర్, ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ పరికరాల ఏర్పాటుపై చర్చించారు.. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారి గృహాలకు సోలార్ విద్యుత్ సౌకర్యం ఏర్పాటుపై సమీక్ష నిర్వహించిన ఏపీ ముఖ్యమంత్రి.. ఈ సమావేశంలో అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.. కుసుమ్ పథకం, సోలార్ విలేజ్ అంశాలపైనా చర్చించారు ముఖ్యమంత్రి.. 100 శాతం సోలార్ విద్యుత్ సరఫరాకు కుప్పం నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం..

అమరావతిలో చివరి దశకు జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు
కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది.. రాజధాని 29 గ్రామాల పరిధిలో రైతులు ఇచ్చిన భూములు 34 వేల ఎకరాలు కాగా, ప్రభుత్వ భూములతో కలుపుకుని మొత్తం 58 వేల ఎకరాలున్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇందులో 24వేల ఎకరాలు కంపచెట్లతో అడవిలా మారిపోయింది. దీంతో ఈ మొత్తం జంగిల్‌ను తొలగించడానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం 36.50 కోట్లతో పనులు ప్రారంభించింది. ఈ కాంట్రాక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన నాగార్జున కన్‌స్ట్రక్షన్స్‌ సొంతం చేసుకుంది. రాజధాని పరిధిలోని 29 గ్రామాలను 250 జోన్లుగా విభజించి కంపచెట్ల తొలగింపు పనులు పూర్తి చేసింది. వీటిలో వందలాది పొక్లెయినర్లతో, కార్మికులతో పనులు జరిగాయి.. రోజూ పదుల సంఖ్యలో ఎక్స్‌కవేటర్లు, వందల సంఖ్యలో కార్మికులు, కూలీలు కంపచెట్ల తొలగింపులో పని చేసారు… రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో పనులు వేగంగా జరిగాయి. పనులు మొదలైన తరువాత రెండు మూడు రోజులు వర్షాలు పడడం, స్థలాలు బురదతో నిండిపోవడంతో కంపచెట్ల తొలగింపు కొంత మందకొడిగా సాగింది. రెండు మూడు రోజులుగా వాతావరణం పొడిగా వుండడంతో పనుల్లో వేగం పెరిగింది. అమరావతిలో కంపచెట్లు తొలగించడంతో మొత్తం ప్రాంతమంతా మైదానంలా చదునుగా కనిపిస్తోంది. చెట్ల మధ్యలో ఇప్పటి వరకూ కనిపించకుండా పోయిన హైకోర్టు భవనం ఇప్పుడు దర్శనమిస్తోంది. చెట్ల మధ్య కనిపించకుండా పోయిన సైన్‌బోర్డులు, రైతుల రిటర్నబుల్‌ ప్లాట్ల హద్దురాళ్లు ఇప్పుడు బయటపడుతున్నాయి.

చంద్రబాబు కీలక సూచనలు.. శక్తి మేరకు కృషి చేస్తానన్న చాగంటి..
ఈ మధ్యే నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. నైతిక విలువల సలహాదారుగా (స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్) చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ కేబినెట్‌ హోదా కల్పించింది సర్కార్‌.. అయితే, ఈ రోజు తనను మర్యాదపూర్వకంగా కలిసి చాగంటి కోటేశ్వరరావును సన్మానించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కీలక సూచనలు చేశారు.. ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావును శాలువాతో సన్మానించిన సీఎం చంద్రబాబు.. భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాలి.. విద్యార్ధుల్లో నైతిక విలువలు పెంచేందుకు కృషి చేయండి అంటూ చాగంటి కోటేశ్వరరావుకు సూచించారు.. ఇక, తన బాధ్యతను నెరవేర్చేందుకు శక్తి మేరకు కృషి చేస్తానని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చారు చాగంటి కోటేశ్వరరావు.. మరోవైపు.. విద్యార్థుల నైతిక విలువల సలహాదారుగా నియమితులైన ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఈరోజు ఉండవల్లి నివాసంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.. విద్యార్థుల్లో మహిళలు, పెద్దలు, గురువులపై గౌరవం పెంపొందించేలా ప్రత్యేకంగా పాఠ్యాంశాలు రూపొందించాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి లోకేష్.. ఇందుకు మీ వంటి పెద్దల అమూల్యమైన సలహాలు అవసరమని అన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, సత్ప్రవర్తన పెంపొందించేందుకు తమ వంతు సలహాలు, సహకారం అందిస్తానని.. మంచి చదువు, ఉద్యోగం, భవిష్యత్ తో పాటు నైతిక విలువలు కూడా అవసరమని, అప్పుడే మంచి సమాజం ఆవిష్కృతం అవుతుందన్నారు చాగంటి కోటేశ్వరరావు..

ఏఈఈ-డీఈఈ ఇంజనీర్లపై కాళేశ్వరం కమిషన్‌ చీఫ్‌ అసహనం
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కుంగుబాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ నేతృత్వంలో కాళేశ్వర కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే.. ఈ క్రమంలోనే నేడు మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల వద్ద పనిచేసిన DEE -AEE లను కమిషన్‌ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ విచారించించారు. విచారణలో AEE – DEE ఇంజనీర్లపై కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ అసహనం వ్యక్తం చేశారు. అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పాలి ముందుగా అనుకొని వచ్చి పొంతన లేని సమాధానాలు చెప్పొద్దు అని కమిషన్ చీఫ్‌ వ్యాఖ్యానించారు. ఫీల్డ్ లో జరిగిన పనులకు సంబంధించిన రిజిస్టర్లను సంతకాలు చేసుకున్న కమిషన్.. రిజిస్టర్లలో ఇంజనీర్ల చేత సంతకాలు తీసుకున్నారు. మేడిగడ్డ బ్లాక్ 7కు సంబంధించిన ఫీల్డ్ వర్క్ ప్లేస్మెంట్ రిజిస్టర్ లను సంతకాలు చేయించుకున్నారు. కాళేశ్వరంలో జరిగిన పనులపై ప్లేస్మెంట్ రికార్డులు రోజువారిగా చేశారా లేదా? ఒకరోజు పనిని మరొక రోజు నమోదు చేశారని కమిషన్‌ ప్రశ్నించింది. కుంగిన పిల్లర్లకు సంబంధించిన బ్లాక్ 7 రిజిస్టర్ లపై ఇంజనీర్ల సంతకాలు తీసుకుంది కమిషన్. 2020లోని కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ వద్ద డ్యామేజీని గుర్తించి ఉన్నతాధికారులకు నిర్మాణ సంస్థలకు లేఖలు రాసినట్లు ఇంజనీర్లు తెలిపారు. మొదటి డ్యామేజీ 2020లోనే జరిగినట్లు గుర్తించి లేఖలు రాసినట్లు కమిషన్ ముందు ఇంజనీర్లు చెప్పినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మిస్ అయినట్లు కమిషన్ గుర్తించింది. మేడిగడ్డ బ్లాక్ 7తో పాటు మూడు బ్యారేజీలకు సంబంధించిన వర్క్ ప్లేస్మెంట్ రిజిస్టర్ లను స్వాధీనం చేసుకుంది కాళేశ్వరం కమిషన్.

ఓ దొంగకు తిక్క కుదిర్చిన వరుడు.. సినిమాను తలపించిన ఛేజింగ్
నిదానమే ప్రదానం అన్నారు పెద్దలు. ఎవడి దారిన వాడు పోతే ఇబ్బంది ఉండదు. అంతేకానీ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే.. ఎవడికైనా తిక్క రేగుతుంది. ఈ స్టోరీ చదివితే.. లేపి తన్నించుకోవడం అంటే ఇదేనేమో అనిపిస్తోంది. అసలేం జరిగింది. ఊరేగింపులో ఉన్న పెళ్లికొడుకు ఒక్కసారిగా ఉగ్రరూపం ఎందుకు దాల్చాడు. సినీ ఫక్కీలో ఛేజింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలియాలంటే ఈ వార్త చదవండి. ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్ ప్రాంతం. ఓ యువకుడు పెళ్లికుమారుడిగా ముస్తాబైయ్యాడు. స్నేహితులు, బంధువుల రాకతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉన్నారు. ఇక పెళ్లి సంప్రదాయంలో భాగంగా వరుడిని గుర్రంపై ఊరేగించే సమయం వచ్చింది. యువకుడు పెళ్లికొడుకుగా తయారై.. గుర్రంపై ఊరేగింపుగా బయల్దేరాడు. మెడలో నోట్లతో కూడిన దండ వేసుకుని సాగిపోతున్నాడు. పెళ్లికొచ్చిన వారందరితో సంతోషంగా రోడ్డుపై ఊరేగింపు జరుగుతోంది. ఇంతలో ఓ మినీ ట్రక్కు అటుగా వచ్చింది. అంతే అందులో ఉన్న డ్రైవర్.. పెళ్లికొడుకు మెడలో ఉన్న డబ్బుల దండను లాక్కుని వేగంగా పారిపోయాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా వరుడికి తిక్క రేగింది. వెంటనే గుర్రం పైనుంచి దిగి అక్కడే ఉన్న బైక్ తీసుకుని స్నేహితులతో వెంబడించాడు. వరుడు ట్రక్కు పైకి దూకి డ్రైవర్‌ను అడ్డుకున్నాడు. అనంతరం ట్రక్కు డ్రైవర్‌ను కిందకి దింపి బడిత పూజ చేశారు. వరుడితో సహా స్నేహితులంతా చితకబాదారు. అయితే ఛేజింగ్ అంతా ఒక సినిమా తరహాలో జరగడం విశేషం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య భీకరపోరు.. 250 రాకెట్లు ప్రయోగించిన హిజ్బుల్లా
ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య వార్ మరోసారి ఉధృతం అయింది. ఇజ్రాయెల్ సైన్యమే లక్ష్యంగా హిజ్బుల్లా రెచ్చిపోయింది. ఆదివారం ఒకేసారి 250 రాకెట్లను ప్రయోగించింది. ఇరాన్ మద్దతుతో ఈ రాకెట్లను ప్రయోగించింది. లెబనాన్ సరిహద్దు ప్రాంతం నుంచి ఈ క్షిపణులను ప్రయోగించింది. కొన్ని టెల్ అవీవ్ ప్రాంతంలో పడగా.. మరికొన్నింటినీ ఐడీఎఫ్ దళాలు గగనతలంలో పేల్చేశాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను హిజ్బుల్లా సోషల్ మీడియాలో వీడియోలు పంచుకుంది. ఇక ఇజ్రాయెల్‌లోని ఒక ఇంటిపై క్షిపణి పడడంతో మంటల్లో కాలిపోయింది. మరొక క్షిపణి కారణంగా కార్లు దగ్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఐడీఎఫ్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. గత కొద్దిరోజులుగా హిజ్బుల్లా అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు సాగిస్తోంది. దక్షిణ బీరుట్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా ఆదివారం ఇరాన్ మద్దతుతో హిజ్బుల్లా రెచ్చిపోయింది. ఒకేసారి 250 క్షిపణులను ప్రయోగించింది. ఐడీఎఫ్ సమర్థవంతంగా తప్పికొట్టింది. కొంత నష్టమైతే జరిగింది. దక్షిణ ఇజ్రాయెల్‌లోని అష్డోద్ నావికా స్థావరం లక్ష్యంగా దాడి చేసినట్లు హిజ్బుల్లా తెలిపింది. అలాగే టెల్ అవీవ్‌లోని సైనిక స్థావరం లక్ష్యంగా అధునాతన క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించినట్లు వెల్లడించింది.

డీప్ ఫ్రైడ్ ఫ్రాగ్‌తో కూడిన పిజ్జా.. షాక్ అవుతున్న కస్టమర్లు..!
పిజ్జా అంటే దాదాపు అందరికి ఇష్టమే ఉంటుంది. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు తినడానికి ఎక్కువగా లైక్ చేస్తారు. వివిధ రకాల పదార్థాలతో పిజ్జాలను తయారు చేసి అమ్ముతుంటారు. మీరు కూడా పిజ్జాలో అనేక రకాల పిజ్జాలను తినే ఉంటారు. అయితే చైనాలో ఓ వెరైటీ పిజ్జా భారీగా సేల్స్ అవుతుండటంతో పాటు.. ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చైనీయుల ఆహారం గురించి ప్రపంచ మొత్తం తెలుసు.. వారు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాములు, క్రిములు, కీటకాలు, కప్పలు ఇలాంటి ఆహారాలను తింటారని మనకు తెలుసు. అయితే ప్రస్తుతం ఆశ్చర్యకరమైన వార్త ఒకటి వైరల్ అవుతుంది. చైనాలో పిజ్జా హట్ కంపెనీ ఒక కొత్త పిజ్జాను లాంచ్ చేసింది. ఇందులో మొత్తం డీప్ ఫ్రైడ్ ఫ్రాగ్ టాప్‌లో అందిస్తుంది. పిజ్జా హట్ చైనా యొక్క ‘గోబ్లిన్ పిజ్జా’ పైన బాగా వేయించిన బుల్‌ఫ్రాగ్, ఉడకబెట్టిన గుడ్డు, బ్లాక్ ఆలివ్‌లతో ఉంది. ఈ పిజ్జాను చైనీయులు తెగ లాగించేస్తున్నారు. ఈ పిజ్జాకు సంబంధించిన పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది ఈ పిజ్జాలపై తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ పిజ్జా ధర 169 యువాన్లు అంటే సుమారు రూ. 2,000. చైనాలో విక్రయిస్తున్న ఈ డీప్ ఫ్రైడ్ ఫ్రాగ్ పిజ్జాపై ఇతర దేశస్తులు విమర్శలు చేస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశాడు, ” పిజ్జా పరువు తీసేశారు.. ఇది తినడానికా.. పారేయ్యడానికా..?”. ఒక వినియోగదారు వ్యంగ్యంగా “కొత్తిమీర, కప్ప? ఇది మంత్రగత్తెల ఆహారమా?.” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్‌లో లాభాల జోరు కొనసాగుతోంది. గత వారం మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలకు ముందు సూచీల్లో మంచి హుషారు కనిపించింది. ఇక ఈ వారం ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు, మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో మార్కెట్‌కు మరింత కొత్త జోష్ వచ్చింది. ఉదయం మార్కెట్ ప్రారంభంలోనే భారీ లాభాలతో మొదలైన సూచీలు చివరిదాకా గ్రీన్‌లోనే కొనసాగాయి. గతంలో నష్టపోయిన ఇన్వెస్టర్ల సంపద తిరిగి రికవరీ అవుతోంది. సెన్సెక్స్ 992 పాయింట్లు లాభపడి 80,109 దగ్గర ముగియగా. నిఫ్టీ 314 పాయింట్లు లాభపడి 24, 221 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.84.28 దగ్గర ముగిసింది. నిఫ్టీలో ఒఎన్‌జీసీ, శ్రీరామ్ ఫైనాన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎల్‌అండ్‌టి భారీ లాభాల్లో కొనసాగగా.. జెఎస్‌డబ్ల్యు స్టీల్, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా నష్టపోయాయి. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 1.5 శాతం చొప్పున పెరిగాయి. ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, పీఎస్‌యూ బ్యాంక్‌లు 2-4 శాతం మేర పెరిగాయి.

వేరే లెవెల్ ఆఫీస్” వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్
ఆహా ఓటీటీ ఒరిజినల్స్ గా స్ట్రీమింగ్ కు రాబోతోంది “వేరే లెవెల్ ఆఫీస్” వెబ్ సిరీస్. ఈ సిరీస్ ను వరుణ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వరుణ్ చౌదరి గోగినేని నిర్మిస్తున్నారు. ఇ సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ జే కాజల్, అఖిల్ సార్థక్, శుభశ్రీ, మిర్చి కిరణ్, రీతు చౌదరి, స్వాతి చౌదరి, వసంతిక, మహేశ్ విట్టా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 12వ తేదీ నుంచి వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది.  నేడు ఈ సిరీస్ ట్రైలర్ ను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈవెంట్ లో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఈవెంట్ లో నటుడు అఖిల్ సార్థక్ మాట్లాడుతూ – బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నాను. నాలుగేళ్లుగా ఇలాంటి ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. వేరే లెవల్ ఆఫీస్ స్క్రిప్ట్ వినగానే నాకు పర్పెక్ట్ స్క్రిప్ట్ అనిపించింది. మా టీమ్ అంతా ఎంజాయ్ చేస్తూ ఈ సిరీస్ లో నటించాం. ఒక మంచి సిరీస్ తో మీ ముందుకు రాబోతున్నాం. డిసెంబర్ 12నుంచి ఆహాలో వేరే లెవెల్ ఆఫీస్ చూడండి. అన్నారు.

తమిళ సెలబ్రిటీల్లో పెరుగుతున్న విడాకుల కల్చర్
లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ డివోర్స్ న్యూస్ కోలీవుడ్‌లో మాత్రమే కాదు యావత్ సినీ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. 29 ఏళ్ల లాంగ్ మ్యారేజ్ రిలేషన్ షిప్‌కు బ్రేకప్ చెప్పింది ఈ జోడీ. జులైలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లిలో ఫోటోలకు ఫోజులిచ్చిన ఈ జంట.  నాలుగు నెలలు తిరగకుండానే విడాకులు తీసుకునేంత క్లాషెస్ ఏమొచ్చాయన్నది ప్రశ్నగా మారింది. ఇద్దరి మధ్య కొరవడిన భావోద్వేగాలు, సమస్యలే బందం బీటలు వారడానికి కారణమన్నది సైరా భాను లాయర్ స్టేట్ మెంట్. పగిలిన ముక్కలు తిరిగి అతుక్కోలేవంటూ ఏఆర్ రెహమాన్ తమ రిలేషన్ ఎలా ఉందో ఒక్క ట్వీట్‌తో చెప్పేశాడు. ఈ ఏడాది ఏఆర్ రెహమాన్ మాత్రమే కాదు.. మరో టూ పెయిర్స్ కూడా డివోర్స్ న్యూస్ ఎనౌన్స్ చేసి.. కోలీవుడ్ ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఒకే ఏడాదిలో మామా అల్లుళ్లు.. ఏఆర్ రెహమాన్, జీవీ ప్రకాష్ తమ జీవిత భాగస్వాములకు బ్రేకప్ చెప్పారు. సింగర్ సైంధవితో 11 ఏళ్ల రిలేషన్‌కు ఎండ్ కార్డ్ వేశాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్. మ్యూజిక్‌తో ఉర్రూతలూగించే కంపోజర్స్ తమ లైఫ్‌లో చేదు బాణీలు  స్వరపరుస్తున్నారు. ఇక ఎంతో అన్యోన్యంగా కనిపించే కోలీవుడ్ స్టార్ జోడీ జయం రవి, ఆర్తి డివోర్స్ న్యూస్ ఎనౌన్స్ చేసి సడెన్ షాక్ ఇచ్చారు. 15 ఏళ్ల వైవాహిక బంధాన్ని తెంచుకున్నారు ఈ పెయిర్. భార్య ఆర్తి ఇబ్బంది పెట్టడం వల్లే జయం రవి సెపరేషన్‌ కోరినట్లు కోలీవుడ్ టాక్.