NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

స్పీకర్‌కు జగన్‌ లేఖ.. ఆ విషయాన్ని పరిశీలించండి..
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుకు లేఖ రాశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్.. మంత్రుల తర్వాత నాతో ప్రమాణస్వీకారం పద్దతులకు విరుద్ధం అని పేర్కొన్న ఆయన.. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టున్నారు..? అని ప్రశ్నించారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారు. కానీ, ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని తన లేఖలో పేర్కొన్నారు. పార్లమెంటులో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కానీ.. ఈ నిబంధన పాటించలేదన్నారు.. అధికార కూటమి, స్పీకర్‌ ఇప్పటికే నాపట్ల శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారని.. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్‌ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయని పేర్కొన్నారు. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదని లేఖలో పేర్కొన్నారు వైఎస్‌ జగన్.. ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీ హోదాతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని లేఖను పరిశీలించాలని కోరుతున్నాని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుకు రాసిన లేఖలో పేర్కొన్నారు మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి..

దేశ విదేశాల్లో అరకు కాఫీ ప్రమోట్.. రాష్ట్ర వ్యాప్తంగా చైన్ షాపులు..!
అరకు కాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి.. అరకు కాఫీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చైన్ షాపులు పెట్టబోతున్నాం.. జీసీసీ ద్వారా అరకు కాఫీ చైన్ షాపులు పెడతాం అన్నారు. అరకు కాఫీని గత టీడీపీ ప్రభుత్వం బ్రాండింగ్ చేసి.. ప్రమోట్ చేసింది. ఇప్పుడూ అదే తరహాలో అరకు కాఫీని మా ప్రభుత్వం ప్రమోట్ చేస్తుంది. అరకు కాఫీని దేశ విదేశాల్లో ప్రమోట్ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తాం అని వెల్లడించారు. ఇక, నెలకోసారి గిరిజన హాస్టళ్లల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. గత ప్రభుత్వం పెండింగ్ బిల్లులు పెట్టడం వల్ల పనులు చాలా వరకు జరగలేదు. 554 ట్రైబెల్ స్కూళ్లల్లో ఏఎన్ఎంలను డెప్యూటేషన్ మీద నియమిస్తున్నాం. ఫీడర్ అంబులెన్స్, తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్ వంటి సేవలను పునరుద్దరిస్తున్నాం. హాస్టళ్లల్లో స్టడీ అవర్స్ తిరిగి ప్రారంభిస్తాం అని పేర్కొన్నారు. మెగా డీఎస్సీ ద్వారా రిక్రూట్ అయ్యే పోస్టుల్లో 2 వేలకు పైగా పోస్టులు గిరిజన స్కూళ్లల్లోనే ఉన్నాయని తెలిపారు మంత్రి సంధ్యారాణి.. గిరిజన ప్రాంతాల్లో గత ప్రభుత్వం రేషన్ డిపోలను రద్దు చేసింది. గిరిజన ప్రాంతాల్లో రేషన్ డిపోలను తిరిగి ప్రారంభించే అంశంపై కసరత్తు చేస్తున్నాం. జీసీసీ ద్వారా నిర్వహించే సంస్ధలను.. ఉత్పత్తులను మరింత ప్రోత్సహిస్తాం అన్నారు. ఇకపై గిరిజన విద్యార్థుల మరణాలు ఉండకూడదని అధికారులను ఆదేశించాం.. పౌష్టికాహారం అందక గిరిజన పిల్లలు చనిపోకూడదు. గిరిజన బాలికల హాస్టళ్లల్లో మహిళ వార్డెన్లనే నియమిస్తాం. గిరిజన హాస్టళ్లల్లో కంప్లైంట్ బాక్సులు పెడతామన్నారు.

ఏపీ టెట్-2024 ఫలితాలు విడుదల
ఏపీ టెట్‌ (టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌)- 2024 ఫలితాలను విడుదల చేశారు.. టెట్-2024లో మొత్తంగా 58.4 శాతం మంది అభ్యర్థుల ఉత్తీర్ణత సాధించారు.. కాగా, డీఎస్సీలో టెట్‌ మార్క్‌లకు 20 శాతం వెయిటేజ్‌ కల్పించనున్న విషయం విదితమే.. అయితే, బీఈడీ, డీఈడీ పూర్తి చేసినవారికి త్వరలో మరోసారి టెట్‌ నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది.. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో టెట్‌ షెడ్యూల్‌ విడుదల చేశారు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు టెట్‌ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,67,789 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,35,907 మంది పరీక్షలు రాశారు.. అంటే దరఖాస్తు చేసిన వారిలో 88.90 శాతం మంది టెట్‌ రాశారు.. వారిలో 1,37,904 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే 58.4 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇక, టెట్‌ ఫలితాలు మార్చి 14నే విడుదల కావాల్సి ఉన్నా.. అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ కారణంగా వాయిదా పడగా.. ఇప్పుడు ఎన్నికలు పూర్తి కావడం.. కొత్త ప్రభుత్వం కూడా ఏర్పాటు కావడంతో.. ఫలితాలు విడుదల చేశారు..

కేంద్రమంత్రి జేపీ న‌డ్డాతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం..
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ న‌డ్డాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స‌మావేశ‌మయ్యారు. జాతీయ ఆరోగ్య మిష‌న్ (ఎన్‌హెచ్ఎం) 2023-24 మూడు, నాలుగు త్రైమాసికాల నిధులు రూ.323.73 కోట్లు విడుద‌ల చేయాల‌ని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా.. ఎన్‌హెచ్ఎంలో 2024-25 మొద‌టి త్రైమాసిక గ్రాంట్ రూ.231.40 కోట్లు మంజురు చేయాల‌ని కోరారు. ఎన్‌హెచ్ఎంకు సంబంధించి కేంద్రం నుంచి రావ‌ల్సిన నిధులు ఆల‌స్యం కావ‌డంతో అత్యవ‌స‌ర వైద్య సేవ‌ల‌కు అంత‌రాయం క‌ల‌గ‌కుండా.. సిబ్బందికి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఉండేందుకు రాష్ట్ర వాటాతో పాటు కేంద్రం నుంచి రావ‌ల్సిన వాటా మొత్తాన్ని 2023 అక్టోబ‌రు నుంచి తామే విడుద‌ల చేస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎన్‌హెచ్ఎం కింద తెలంగాణ‌కు రావ‌ల్సిన పెండింగ్ నిధులు స‌త్వర‌మే విడుద‌ల చేయాల‌ని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే.. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. సోమవారం కేంద్ర గృహ, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటిని వచ్చేలా సహకరించాలని సీఎం కేంద్ర మంత్రిని కోరారు. 2024-25 ఆర్థిక సంవ‌త్సరంలో బీఎల్‌సీ మోడ‌ల్‌లో తెలంగాణ‌కు 2.70 ల‌క్షల ఇళ్లు మంజూరు చేయాల‌ని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. నిరుపేద‌లకు వారి సొంత స్థలాల్లో 25 ల‌క్షల ఇళ్లు నిర్మించాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింద‌ని కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. రాష్ట్రంలో తాము నిర్మించ‌ద‌ల్చిన 25 ల‌క్షల ఇళ్లలో 15 ల‌క్షలు ఇళ్లు, ప‌ట్టణాభివృద్ధి సంస్థల ప‌రిధిలోకి వ‌స్తాయ‌ని, వాటిని ల‌బ్ధిదారు ఆధ్వర్యంలోని వ్యక్తిగ‌త ఇళ్ల నిర్మాణం (బీఎల్‌సీ) ప‌ద్ధతిలో నిర్మించ‌నున్నట్లు కేంద్ర మంత్రికి వివ‌రించారు.

రైతుబంధు ఎప్పుడు ఇస్తారని మమ్మల్ని జనం అడుగుతున్నారు..
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన తెలంగాణ భ‌వ‌న్‌లో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కూతలు… ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కోతలు అని విమర్శించారు. మరోవైపు.. రైతుబంధు ఎప్పుడు ఇస్తారని జనం తమను అడుగుతున్నారని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో రుణమాఫీ అంతా చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని.. 2018 కంటే ముందు మిగిలిన వ్యవసాయ రుణమాఫీ ఏం చేస్తరని కాంగ్రెస్ ప్రభుత్వంను అడుగుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఇస్తారా ? ఇవ్వరా ? చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా మాఫీ చేస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదని తెలిపారు. రైతుల రుణాల వివరాలు చెప్పాలి.. ఎందుకు దాచి పెడుతున్నారు? అని ఆయన ప్రశ్నించారు.

ఇండియా కూటమి స్పీకర్ ప్రతిపాదనపై తృణమూల్ అసంతృప్తి..
దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారిగా స్పీకర్ పోస్టు కోసం అధికార, ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయి. అధికార ఎన్డీయే ప్రభుత్వం తన స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లాను నామినేట్ చేసింది. మరోవైపు ఇండియా కూటమి తరుపున కాంగ్రెస్ ఎంపీ కే. సురేష్ పేరును ప్రతిపాదించింది. స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. తమకు డిప్యూటీ స్పీకర్ పదవిని ఇస్తేనే ఏకగ్రీవంగా స్పీకర్ ఎన్నికకు మద్దతు ఇస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఎన్నిక అనివార్యంగా మారింది. ఇదిలా ఉంటే, ఇండియా కూటమి తీసుకున్న నిర్ణయంపై తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఆగ్రహంగా ఉంది. మమతా బెనర్జీకి చెందిన పార్టీ ఈ విషయంలో అసంతృప్తికి గురైంది. తమను సంప్రదించకుండా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ స్పీకర్ ఎన్నికల ఇండియా కూటమిలో మరోసారి చిచ్చుకు కారణమైంది. ఇది చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయమని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సురేష్‌ని ప్రతిపాదించడంపై టీఎంసీని సంప్రదించి మద్దతు కోరినట్లు సమాచారం.

ఓవైసీ ప్రమాణస్వీకారం.. లోక్‌సభలో దుమారం..
18వ లోక్‌సభకు ఇటీవల ఎన్నికైన ఎంపీల ప్రమాణస్వీకారం కార్యక్రమం జరుగుతోంది. ఎంపీ ఎన్నికల్లో గెలిచిన సభ్యులచే స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించారు. అయితే, ప్రస్తుతం హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చేసిన ప్రమాణస్వీకారం లోక్‌సభలో దుమారం రేపింది. ఉర్దూలో ప్రమాణస్వీకారం చేసిన ఓవైసీ, ‘‘జై పాలస్తీనా’’ అని నినదించడం చర్చనీయాంశంగా మారింది. అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణస్వీకారం చేసే సమయంలో కొందరు అధికార పార్టీ ఎంపీలు జై శ్రీరాం, భారత్ మాతాకీ జై అంటూ నినదించారు. ఓవైసీ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ‘‘జై భీమ్’’, ‘‘జై మీమ్’’, ‘‘జై పాలస్తీనా’’, జై తెలంగాణ, అల్లాహు అక్బర్ అంటూ నినాదాలు చేయడంపై రచ్చ మొదలైంది. దీనిపై కొందరు పార్లమెంట్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రికార్డుల నుంచి అసదుద్దీన్ వ్యాఖ్యల్ని తొలగిస్తామని ప్రొటెం ప్యానెల్ స్పీకర్ రాధా మోహన్ సింగ్ తెలిపారు.

సాయంత్రం ఖర్గే ఇంట్లో ఇండియా కూటమి నేతల భేటీ.. స్పీకర్ ఎన్నికపై చర్చ
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో రాత్రి 8 గంటలకు ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్లు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఇదిలా ఉంటే సోమవారం నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలంతా ప్రమాణస్వీకారం చేశారు. ఇక బుధవారం లోక్‌సభ స్పీ్కర్ ఎన్నిక జరగనుంది. ఇందుకోసం నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈసారి ఎన్నడూ లేని విధంగా స్పీకర్‌కు పోటీ నెలకొంది. ఎన్డీఏ కూటమి నుంచి ఓం బిర్లా నామినేషన్ వేయగా.. ఇండియా కూటమి నుంచి కె.సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. దీంతో స్పీకర్ ఎన్నికకు పోటీ నెలకొంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి దెబ్బ దెబ్బగా సీట్లు గెలుచుకున్నాయి. ఎన్డీఏ కూటమి 293 సీట్లు గెలుచుకోగా.. ఇండియా కూటమి 233 సీట్లు గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ సొంతంగా 99 సీట్లు గెలుచుకుని ప్రతిపక్ష హోదాను సంపాదించింది. అయితే ఇండియా కూటమి డిప్యూటీ స్పీకర్ పదవిని ఆశిస్తోంది. ఈ పదవి ఇస్తే.. ఎన్డీఏ కూటమి బలపరిచిన స్పీకర్ అభ్యర్థికి సపోర్టు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఒకవేళ అంగీకరించకపోతే స్పీకర్ పోస్టుకు పోటీ చేస్తామని స్పష్టం చేసింది.

జూలైలో ప్రధాని మోడీ రష్యా పర్యటన..!
భారత ప్రధాని నరేంద్రమోడీ రష్యా పర్యటనకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. జూలై నెలలో ఈ పర్యటన చోటు చేసుకునే అవకాశం ఉందని రష్యన్ మీడియా ఏజెన్సీ ఆర్ఐఏ మంగళవారం నివేదించింది. నిజానికి మే నెలలోనే ప్రధాని మోడీ రష్యా పర్యటనకు వెళ్తానే వార్తలు వచ్చినప్పటికీ, జూలైలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి నెలలో రష్యా ప్రతిష్టాత్మకంగా ప్రధాని నరేంద్రమోడీని తమ దేశంలో పర్యటించాలని ఆహ్వానించింది. జూలైలో జరిగే ప్రధాని పర్యటనలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఆయన భేటీ అవుతారని తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య అనేక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది మే నెలలో రష్యా అధ్యక్షుడిగా పుతిన్ వరసగా ఐదోసారి ఎన్నికయ్యారు. మరోవైపు భారత ప్రధానిగా మూడోసారి మోడీ ఈ నెలలో ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే గెలిచిన తర్వాత పుతిన్ ప్రధానికి అభినందనలు తెలియజేశారు. జూలై నెలలో ప్రధాని మోడీ రష్యాలో పర్యటిస్తే, ఇది 2019 తర్వాత తొలి పర్యటనగా నిలుస్తుంది. చివరిసారిగా 2022లో పుతిన్, మోడీలు ఉజ్బెకిస్తాన్ సమర్ఖండ్‌లో జరిగిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ)లో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఉక్రెయిన్ యుద్ధాన్ని చర్చలు, దౌత్యమార్గాల్లో పరిష్కరించుకోవాలని మోడీ సూచించారు.

యాక్టర్ దర్శన్ కేసులో కీలక పరిణామం.. సీఎం సిద్ధరామయ్యని కలిసిన రేణుకాస్వామి పేరెంట్స్..
కన్నడ స్టార్ హీరో దర్శన్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అతని అభిమాని రేణుకాస్వామిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటనలో దర్శన్‌తో పాటు అతని లివింగ్ పార్ట్‌నర్ పవిత్రగౌడతో సహా మొత్తం 17 మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. తన అభిమాన హీరో కాపారాన్ని కూల్చిందనే కోపంతో పవిత్రగౌడని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు రేణుకాస్వామి హత్య జరిగింది. చిత్రదుర్గకి చెందిన స్వామిని కిడ్నాప్ చేసి, బెంగళూర్‌లోని ఓ షెడ్డులో చిత్ర హింసలు పెట్టారు. తీవ్రంగా కర్రలతో చితకబాదడంతో పాటు కరెంట్ షాక్ పెట్టడం, వృషణాలపై బలమైన గాయాల కారణంగా స్వామి మరణించినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఇదిలా ఉంటే, ఈ కేసులో కీలక పరిణామం ఎదురైంది. రేణుకాస్వామి తల్లిదండ్రులు ఈ రోజు బెంగళూర్‌లో సీఎం సిద్ధరామయ్యను కలిశారు. స్వామి కేసులో ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. హత్య కేసు విచారణలో సంతృప్తి వ్యక్తం చేసిన స్వామి పేరెంట్స్ తమ కోడలికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎంను కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించి, కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.

“నన్ను చంపొద్దు ప్లీజ్” ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన అమితాబ్.. ఎందుకో తెలుసా?
కల్కి 2898 AD రేపు విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్‌లో చిత్రబృందం చురుగ్గా పాల్గొంటోంది. కల్కి 2898 AD నిర్మాణ సంస్థ వైజయంతీ నెట్‌వర్క్ ఒక కొత్త వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే మరియు నిర్మాతలు ప్రియాంక దత్ మరియు స్వప్నా దత్, ప్రభాస్ ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన సమాచారాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. సినిమాలో తన పాత్ర కోసం దర్శకుడు తనను సంప్రదించిన విషయాన్ని అమితాబ్ గుర్తు చేసుకున్నారు. అప్పుడే ప్రభాస్ అభిమానులకు అమితాబ్ క్షమాపణలు చెప్పాడు. దీని గురించి ఆయన మాట్లాడుతూ, “నాగీ (నాగ్ అశ్విన్) నాతో దీని గురించి మాట్లాడటానికి వచ్చినప్పుడు, అతను నా పాత్ర ఎలా ఉంటుందో, ప్రభాస్ ఎలా ఉంటుందో ఒక ఫొటో తీసుకువచ్చాడు. ఇక ప్రభాస్‌ని డంప్ చేసిన పెద్ద వ్యక్తిని నేనే. అందుకే ప్రభాస్ అభిమానులందరూ దయచేసి నన్ను క్షమించండి. నేను సినిమాలో ఏమి చేస్తున్నానో చూసి నన్ను హత్య చేయవద్దు” అని అమితాబ్ అన్నారు. దీంతో ప్రభాస్ అడ్డుతగులుతూ తన అభిమానులు కూడా మిమ్మల్ని ఇష్టపడతారని హామీ ఇచ్చారు.

తిరుమల గుడిలో శ్రీ లీల బుగ్గ గిల్లిన తమన్
అదేంటి తిరుమల గుడిలో శ్రీ లీల బుగ్గను తమన్ గిల్లడం ఏంటి? అని మీకు అనుమానం కలుగవచ్చు. కానీ అది నిజమే, అసలు విషయంలోకి వెళితే తిరుమల శ్రీవారిని సినీ నటి శ్రీ లీల దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి అష్టదళ పాదపద్మారాధన సేవలో శ్రీ లీల పాల్గొన్నారు. దర్శనం అనంతరం శ్రీలీలకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు సైతం అందజేశారు. ఇక ఆ తరువాత ఆలయం వెలుపల మీడియాతో శ్రీలీల మాట్లాడుతూ శ్రీవారి దర్శనం చాలా సంతోషకరంగా జరిగిందని వెల్లడించారు. ఏదైనా ప్రారంభించేటప్పుడు స్వామివారిని దర్శించుకోవడం తనకు అలవాటు అని ఆమె చెప్పారు కానీ ఏం ప్రారంభిస్తున్నాను అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే ఆమె త్వరలో నితిన్ రాబిన్‌ హుడ్‌ చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పారు. ఇక ఆసక్తిక్రమైన విషయం ఏమిటంటే శ్రీ లీల దేవుడిని దర్శించుకుని బయటకు వస్తున్న సమయంలో సంగీత దర్శకుడు తమన్ గుడి లోపలికి వెళ్తున్నారు. ఈ క్రమంలో శ్రీలీలను చూసి ఆయన ఆగారు. అనంతరం ఆమెను పలకరించి బుగ్గగిల్లి, షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు. నిజానికి శ్రీ లీల నటించిన స్కంద, భగవంత్ కేసరి, గుంటూరు కారం సినిమాలకి తమన్ సంగీతం అందించారు.