NTV Telugu Site icon

Top Headlines @ 5 PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ధాన్యం కొనుగోళ్లపై గైడ్ లైన్స్ జారీ చేసిన ప్రభుత్వం
రాష్ట్రంలో 2024-25 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లపై ఏపీ ప్రభుత్వం గైడ్ లైన్స్ జారీ చేసింది. వికేంద్రీకరణ విధానంలో ధాన్యం కొనుగోళ్లకు సర్కారు మార్గదర్శకాలు జారీ చేసింది. రైతు సేవా కేంద్రాలు, ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని ఇ-పంట, ఈ కేవై సీ ద్వారా రైతులు, కౌలు రైతు వివరాలతో ధాన్యం కొనుగోళ్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆధార్ అనుసంధానంతో ఇ-పంట , ఇ-కేవై సీ ద్వారా రైతుల ఖాతాల్లోకి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన చెల్లింపులు చేయాలని ప్రభుత్వ ఆదేశించింది. ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, ఏపీ మార్క్ ఫెడ్ సంస్థలు రాష్ట్రస్థాయి ధాన్యం కొనుగోళ్లకు నోడల్ సంస్థలుగా పనిచేస్తాయని స్పష్టం చేస్తూ జీవో జారీ చేసింది. ధాన్యం కొనుగోలు లావాదేవీల్లో ఉన్న రైస్ మిల్లర్లు కూడా ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ లో నమోదు కావాలని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్ధతు ధర కామన్ వెరైటీ క్వింటాలుకు రూ.2300 , గ్రేడ్ ఏ రకానికి రూ.2320 క్వింటాలుకు చెల్లించాలని స్పష్టం చేసింది. 2024-25 ఖరీఫ్ సీజన్ కు 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు సర్కార్ స్పష్టం చేసింది. సేకరణ సహా, మిల్లింగ్ ఆపరేషన్లను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లు, జేసీలను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

తొలిసారి ఆర్టీజీఎస్ విభాగానికి సీఎం చంద్రబాబు
సచివాలయంలోని మొదటి బ్లాకులో రియల్ టైం గవర్నెన్స్ సెంటరును సీఎం చంద్రబాబు సందర్శించారు. అధికారంలోకి వచ్చాక తొలిసారి ఆర్టీజీఎస్ విభాగానికి ముఖ్యమంత్రి వెళ్లారు. అధికారంలోకి వచ్చాక సెక్రటేరీయేట్‌లో ఓ విభాగాన్ని తొలిసారి సీఎం సందర్ళించారు. 2014-19 మధ్య కాలంలో ఆర్టీజీఎస్ విభాగంలో చంద్రబాబు తరుచూ సమీక్షలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో నామమాత్రంగా ఆర్టీజీఎస్ వ్యవస్ఖ మారింది. ఆర్టీజీఎస్ సెంటర్‌లో సీఎస్, డీజీపీ సహా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పౌరసేవలను సులభతరం చేయడం.. పాలనలో వేగం పెంచడంపై సమావేశంలో చర్చించారు. ప్రజలకు సంబంధించిన మాస్టర్ డేటాను అన్ని శాఖలు యాక్సిస్ చేసుకుని సత్వర సేవలు అందించే విధంగా ప్రణాళిక రూపొందించాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఆధార్, వాక్సినేషన్ డాటా, స్కూల్ అడ్మిషన్, రేషన్ కార్డుల్లో పేర్ల నమోదు, మ్యారేజ్ సర్టిఫికెట్, ఇతర సర్టిఫికెట్ల వంటి కార్యక్రమాలు ప్రజలకు ఆటోమేటిక్‌గా అందే అంశంపై చర్చించారు. పారిశుద్ధ్యం, ట్రాఫిక్, ప్రమాదాలు, నేరాలు, రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, పంట కాలువల నిర్వహణ, అగ్రికల్చర్, వరదలు, భారీ వర్షాలు, విపత్తులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ వంటి అంశాల్లో రియల్ టైం గవర్నెన్స్ ద్వారా తీసుకోదగిన చర్యలపై చర్చించారు. సీసీటీవీ కెమేరాలు, డ్రోన్లు వంటి వాటి ద్వారా డేటా విశ్లేషణ, ప్రభుత్వ సేవల అందజేత, నాణ్యతపై సమావేశంలో చర్చించారు. రియల్ టైంలో సమస్యలపై ప్రభుత్వం స్పందించే విధానం అందుబాటులోకి వస్తే ప్రజలకు సత్వర సాయం అందుతుందని సీఎం తెలిపారు. రియల్ టైం గవర్నెస్ ద్వారా పౌర సేవలు, ప్రభుత్వ కార్యక్రమాలపై 100 రోజుల్లో ప్రత్యేక ప్రాజెక్ట్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

 

నామినేటెడ్ పోస్టుల భర్తీ.. సామాన్య కార్యకర్తలకు టీడీపీ పెద్దపీట..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేసింది.. వివిధ కార్పొరేషన్లకు చైర్‌పర్సన్లను నియమించింది.. ఒకేసారి మొత్తం 20 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవులు భర్తీ చేసింది.. గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకోలేక పోయిన వారికి.. పొత్తుల్లో టిక్కెట్లు త్యాగం చేసిన వారికి ఈ నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత కల్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ నామినేటెడ్‌ పోస్టుల్లో టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1 నామినేటెడ్‌ పోస్టులు దక్కాయి.. అయితే, నామినేటెడ్ పోస్టుల భర్తీలో సామాన్య కార్యకర్తలకు పెద్దపీట వేసింది టీడీపీ.. 99 మందితో మొదటి నామినేటెడ్ పదవుల లిస్ట్ ప్రకటించిన కూటమి ప్రభుత్వం.. బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీలకు పెద్ద పీట వేసింది.. 11 మంది క్లస్టర్ ఇంఛార్జీలకు పదవులు. ఒక క్లస్టర్ ఇంఛార్జ్ కు ఛైర్మెన్ పదవి. ఆరుగురికి యూనిట్ ఇంఛార్జీలకు పదవులు. 20 కార్పొరేషన్లకు ఛైర్మెన్లు, ఒక కార్పొరేషనుకు వైస్ ఛైర్మెన్, వివిధ కార్పొరేషన్లు సభ్యులను ప్రకటించింది కూటమి ప్రభుత్వం. ఇక, ప్రకటించిన 99 పదవుల్లో యువతకు ప్రాధాన్యం కల్పించారు.. పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు పదవులు కట్టబెట్టారు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు.. మిత్రపక్షాలకు నాలుగు ఛైర్మన్ పదవులు, వివిధ కార్పోరేషన్లల్లో డైరెక్టర్లుగా నియమించారు.. బీజేపీకి కీలకమైన 20 సూత్రాల అమలు పథకం దక్కింది.. మరోవైపు.. త్యాగధనులు, యువగళం టీం, సీన్సియర్ కేడర్‌కు ప్రయార్టీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ.. త్యాగరాజుల కోటాలో మంతెన రామరాజు, కొనకళ్ల, పీలా గోవింద్, అబ్దుల్ అజీజ్, కర్రోతు బంగార్రాజు, బురగం శ్రీనివాసులు, పీతల సుజాతకు పదవులు దక్కగా.. యువగళం టీం కోటాలో అనిమిని రవి నాయుడు, దామచర్ల సత్యకు పదవులు కట్టబెట్టారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

 

వివిధ కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం
ఏపీలో వివిధ కార్పొరేషన్లకు కూటమి ప్రభుత్వం డైరెక్టర్లను నియమించింది. పౌరసరఫరాల శాఖ, పద్మశాలి సంక్షేమ, అభివృద్ధి కార్పొరోషన్లల్లో చెరో 15 మంది సభ్యులను నియమించింది. అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌లో 13 మంది సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీటీడీసీలో 10 మంది డైరెక్టర్లు నియామకమయ్యారు. మార్క్ ఫెడ్‌లో ఆరుగురు, ట్రైకార్లో ఐదుగురు సభ్యులు నియామకమయ్యారు. విత్తనాభివృద్ధి సంస్థలో ఇద్దరు, వినియోగదారుల రక్షణ మండలిలో ఒకరిని సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం విడుదలైన కార్పొరేషన్ల సభ్యుల జాబితాలో జనసేనకు 9, బీజేపీకి 5 పదవులను కేటాయించారు. మిగిలిన కార్పొరేషన్లల్లోనూ సభ్యుల నియామకంపై కసరత్తు కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. వివిధ కార్పొరేషన్లకు ఛైర్‌పర్సన్లను నియమించింది.. ఒకేసారి మొత్తం 20 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవులు భర్తీ చేసింది.. గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకోలేక పోయిన వారికి.. పొత్తుల్లో టిక్కెట్లు త్యాగం చేసిన వారికి ఈ నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత కల్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ నామినేటెడ్‌ పోస్టుల్లో టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1 నామినేటెడ్‌ పోస్టులు దక్కాయి.. అయితే, నామినేటెడ్ పోస్టుల భర్తీలో సామాన్య కార్యకర్తలకు పెద్దపీట వేసింది టీడీపీ.

 

అవన్నీ వెంటనే డిలీట్ చేయండి.. ఆర్కే రోజా హెచ్చరిక
ఒకప్పటి సినీ హీరోయిన్, ప్రస్తుత వైసీపీ ఫైర్ బ్రాండ్ లేడీ లీడర్ ఆర్కే రోజా తన ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. నాకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదు, వెంటనే, నా పేరు పై ఉన్న సదరు ఛానల్స్, అకౌంట్ లను డిలీట్ చేయాలని హెచ్చరిస్తున్నాను లేని పక్షంలో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అంటూ ఆమె సుదీర్ఘ హెచ్చరిక మెసేజ్ పోస్ట్ చేశారు. “అందరికీ నమస్కారం!! నా మిత్రులు మరియు అభిమానులు పార్టీ కార్యకర్తలు దయచేసి గమనించగలరు. నేను సామాజిక మాద్యమాల్లో మీ అందరికీ అందుబాటులో ఉండటానికి #facebook #Instagram , #twitter మరియు #threads మాత్రమే వాడుతున్నాను, నాకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదు దయచేసి గమనించగలరు. నా పై ఉద్దేశ్య పూర్వకంగా జరిగిన, జరుగుతున్న దుష్ప్రచారాల్లో ఇది కూడా ఒకటి. వెంటనే సదరు ఛానల్స్ నా పేరు పై ఉన్న అకౌంట్లను డెలీట్ చెయ్యాలని హెచ్చరిస్తున్నాను లేని పక్షంలో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. నా అధికారికంగా వెరిఫైడ్ అకౌంట్(బ్లూటిక్ ఉన్న)లను మాత్రమే ఫాలో కాగలరని అభిమానులను కోరుకుంటున్నాను” అని ఆమె పేర్కొన్నారు. ఇక నగరి నుంచి గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె మంత్రిగా కూడా పని చేశారు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం ఆమె వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

 

ఏపీ సీఎం చంద్రబాబుపై కేటీఆర్ ప్రశంసలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. పెన్షన్ పెంపుపై ఏపీ సీఎం మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి అయిన వారంలోనే ఏపీలో వృద్దులకు చంద్రబాబు పెన్షన్ పెంచారని అన్నారు. కానీ.. పెన్షన్ల పెంపుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో చిట్టినాయుడు సోదరుల కంపెనీ నడుస్తుందన్నారు. రైతు బంధు, భరోసా కాదు..సీఎం కుర్చి కే భరోసా లేదన్నారు. హైదరాబాద్ లో మనం క్లీన్ స్వీప్ చేసిన్నామన్నారు. బీఆర్ఎస్ అన్ని సీట్లు గెలిచినామన్నారు. అందుకే రేవంత్ రెడ్డి నగర ప్రజల పై కక్ష కట్టారన్నారు. పేదల ఇండ్లు కూలగొడుతున్నారని మండిపడ్డారు. సెటిల్మెంట్ లు జరిగే మాదాపూర్ లోని తిరుపతి రెడ్డి ఇంటిని ఎందుకు కూల్చట్లేదన్నారు. తిరుపతి రెడ్డి కి ఒక న్యాయం.. పెదవాళ్ళకి ఒక న్యాయమా? అని ప్రశ్నించారు. కోర్టులు పనిచేయని శనివారం ఆదివారం వచ్చి కూల్చుతున్నారని మండిపడ్డారు. హీరో నాగార్జున కన్వెన్షన్ కు కూల్చివేశారని గుర్తు చేశారు. దానికి అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నే అన్నారు. అనుమతులు ఇచ్చిన అధికారులను ఎందుకు శిక్షించట్లేదు? అని ప్రశ్నించారు. పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ను ఎందుకు కూల్చట్లేదన్నారు. మంత్రుల ఫామ్ హౌస్ లు ఎందుకు ముట్టు కోవట్లేదని మండిపడ్డారు. నగరంలో మేము లక్ష ఇండ్లు కట్టినామని క్లారిటీ ఇచ్చారు. హైడ్రా కూల్చిన పేదలకు ఆ లక్ష డబుల్ బెడ్ రూముల్లో కేటాయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

 

కామారెడ్డిలో హై టెన్షన్.. పోలీసులపై రాళ్లు, సీఐ తలకు గాయం
కామారెడ్డి జిల్లా కేంద్రంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జీవదాన్ స్కూల్ పై విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో.. ఆందోళనకారులు పోలీసుల పై రాళ్ళు రువ్వారు. దీంతో.. పట్టణ సీఐ తలకు గాయాలు అయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. తోపులాటలో హెడ్ కానిస్టేబుల్ కాలు విరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. ఈ క్రమంలో.. పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి నాయకులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సింధు శర్మ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితులను పరిశీలించారు. అయితే.. ఆరేళ్ల బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పీఈటి నాగరాజును కఠినంగా శిక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. స్కూల్ గుర్తింపు రద్దు కోరుతూ ముట్టడించారు. ఉదయం నుంచి ఐదు గంటలుగా కామారెడ్డిలో ఆందోళన కొనసాగుతుంది.

 

తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో.. యూపీ సీఎం యోగి కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై వివాదం ముదురుతోంది. శ్రీవేంకటేశ్వర స్వామికి ప్రసాదంగా సమర్పించిన ప్రసాదంలో కల్తీ జరిగినట్లు వచ్చిన వార్తలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. లడ్డూల్లో జంతువుల కొవ్వు కలపడంపై సాధువులు, సన్యాసులు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఈ లడ్డూ వివాదానికి సంబంధించి సనాతన ధర్మ బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్ వచ్చింది. తాజాగా.. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం మధురకు చెందిన ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం , బృందావనం తదితర ప్రాంతాల్లోని ధార్మిక క్షేత్రాలకు సమీపంలోని 15 దుకాణాల నుంచి 43 ఆహార పదార్థాల నమూనాలను సేకరించింది. కల్తీ పదార్థాలను వాడుతున్నారనే అనుమానంతో లక్నోలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి ‘పేడా’ (ఒక రకమైన స్వీట్) నమూనాను పరీక్షల నిమిత్తం పంపింది. ఎఫ్‌ఎస్‌డిఎ అసిస్టెంట్ కమిషనర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. సోమవారం మధుర, బృందావన్‌లలో నిర్వహించిన నమూనా ప్రచారంలో 15 మంది వ్యాపారుల‌ నుంచి మొత్తం 43 నమూనాలను సేకరించినట్లు తెలిపారు. మిఠాయిలు, పాలు, పనీర్, పెడా, బర్ఫీ, మిల్క్ కేక్, రసగుల్లా, సోన్‌పాప్డి, ఇతర స్వీట్లు మసాలా దినుసులతో తయారుచేసిన వ‌స్తువులను లాబ్ కు పంపించారు. వాటిలో 42 స్టాండర్డ్‌లో ఉన్నట్లు గుర్తించామని, అయితే ‘పెడా’ నమూనాను పరీక్ష కోసం లక్నోకు పంపామని ఆయన చెప్పారు. ఆలయాల చుట్టుపక్కల ఉన్న దుకాణాల నుంచి ఆదివారం, సోమవారాల్లో అన్ని నమూనాలను సేకరించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. మార్కెట్‌లో నెయ్యిలో కల్తీ జరుగుతోందన్న అంశాన్ని లక్నోలోని పురాతన మంకమేశ్వర దేవాలయం అధిపతి మహంత్ దేవ్యగిరి లేవనెత్తారు. బయటి నుంచి తెచ్చిన ప్రసాదాన్ని మంకమేశ్వరాలయంలో సమర్పించబోమని మహంత్ దేవయగిరి స్పష్టం చెశారు. ప్రజలు ఇంట్లో తయారుచేసిన ప్రసాదం తీసుకువస్తేనే దేవుడికి నైవేద్యంగా పెడతారు. అలాగే, భక్తులు స్వామికి పొడి ప్రసాదాన్ని సమర్పించవచ్చన్నారు. సనాతన ధర్మ బోర్డును దేశం, రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, నగరంలోని ప్రధాన ఆలయాల మహంతులు, ప్రధాన అర్చకులను కూడా చేర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ బోర్డుకు న్యాయపరమైన అధికారం రావాలనే డిమాండ్ ను కూడా లేవనెత్తారు. దీనితో పాటు, మతపరమైన ప్రదేశాలలో (ఆలయాల్లో) ప్రసాదంగా విక్రయించే వస్తువులపై విచారణ జరపాలని మహంత్ దేవ్యగిరి డిమాండ్ చేశారు. ఇందులో అవినీతిపరులు ఎలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారో విచారణ చేపట్టాలన్నారు. విచారణలో అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ కి లేఖ రాశారు. మహంత్ దేవ్యగిరి తన డిమాండ్ల లేఖను సీఎం యోగి పేరిట సోమవారం లక్నో డీఎం సూర్యపాల్ గంగ్వార్‌కు అందజేశారు.

 

రేపు జమ్మూకాశ్మీర్‌లో రెండో విడత పోలింగ్.. ఏర్పాట్లు పూర్తి
జమ్మూకాశ్మీర్‌లో బుధవారం రెండో విడత పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పా్ట్లు పూర్తి చేశారు. పోలింగ్ సిబ్బంది ఈవీఎంలు తీసుకుని బూత్ సెంటర్లకు చేరుకుంటున్నారు. జమ్మూకాశ్మీర్‌లో మూడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత సెప్టెంబర్ 18న ప్రశాంతంగా ముగిసింది. రెండో విడత సెప్టెంబర్ 25న జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లన్నీ అధికారులు పూర్తి చేశారు. బుధవారం జమ్మూ కాశ్మీర్‌లోని ఆరు జిల్లాల్లో 26 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా భద్రతా సిబ్బంది మోహరించారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్నారు. రాజౌరీ జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎన్నికలు జరిగే అసెంబ్లీ స్థానాలు: కంగన్ (ST), గందర్‌బల్, హజ్రత్‌బాల్, ఖన్యార్, హబ్బకదల్, లాల్ చౌక్, చన్నపోరా, జదిబాల్, ఈద్గా, సెంట్రల్ షాల్టెంగ్, బుద్గామ్, బీర్వా, ఖాన్‌సాహిబ్, చ్రార్-ఐ-షరీఫ్, చదూరా మరియు గులాబ్‌ఘర్ ( ST). రియాసి, శ్రీ మాతా వైష్ణో దేవి, కలకోటే-సుందర్‌బని, నౌషేరా, రాజౌరి (ST), బుధాల్ (ST), తన్నమండి (ST), సురంకోట్ (ST), పూంచ్ హవేలీ, మెంధార్ (ST)ల్లో ఎన్నికలు జరగనున్నాయి. మాజీ ముఖ్యమంత్రి మరియు నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లాతో సహా 239 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఒమర్.. బుద్గామ్ మరియు గందర్‌బల్ రెండింటి నుంచి పోటీ చేస్తున్నారు. నౌషేరా స్థానం నుంచి జమ్మూకాశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా పోటీ చేస్తున్నారు. సెంట్రల్ షాల్టెంగ్ నుంచి జమ్మూకాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా ఇతర ప్రముఖ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. సెప్టెంబర్ 18న జరిగిన తొలి దశలో భారీగా పోలింగ్ నమోదైంది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఏడు జిల్లాల్లోని 24 నియోజకవర్గాల్లో 61.13 శాతం ఓటింగ్ నమోదైంది. రెండో విడత సెప్టెంబర్ 25, మూడో విడత అక్టోబర్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి. జమ్మూకాశ్మీర్‌లో మొత్తం 90 నియోజకవర్గాలు ఉన్నాయి.

 

బద్లాపూర్ రేప్ నిందితుడి ఎన్‌కౌంటర్.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారిన అంశం..
బద్లాపూర్ అత్యాచార నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. నిందితుడిని వాహనంలో తీసుకెళ్తుండగా.. అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ నీలేష్ మోర్ పిస్టల్ లాక్కుని ఎస్కార్ట్ పోలీసుల నుంచి పారిపోయిందుకు ప్రయత్నించాడని, ఈ నేపథ్యంలో ముగ్గురు పోలీసులకు కారణమయ్యాయని పోలీసులు వెల్లడించారు. బద్లాపూర్ పాఠశాలలో ఇద్దరు మైనర్ బాలికను లైంగికంగా వేధించిన స్వీపర్ అక్షయ్ షిండే ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఈ లైంగిక వేధింపుల ఘటన ఆగస్టులో బద్లాపూర్ రైల్వే స్టేషన్‌లో తీవ్ర నిరసనకు కారణమైంది. కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసు వెలుగులోకి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఇదిలా ఉంటే, ఈ ఎన్‌కౌంటర్ మహారాష్ట్రలో పొలిటికల్ వార్‌కి దారి తీసింది. ముఖ్యంగా కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్ పవార్) పార్టీలు అధికార బీజేపీ-శివసేన ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. మహారాష్ట్ర ఎన్నికలకు కొన్ని రోజుల ముందు, ఈ ఎన్‌కౌంటర్ ప్రజల దృష్టిని మళ్లించడానికి అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఘటన జరిగిన స్కూల్ బీజేపీ నాయకుడి యాజమాన్యంలో ఉందనే రుజువల్ని నాశనం చేయడానికి ఈ ఎన్‌కౌంటర్ చేసినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. మహారాష్ట్ర మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ నేత అనిల్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ.. చేతికి సంకెళ్లు ఉన్న వ్యక్తి ఎలా కాల్పులు జరిపాడని ప్రశ్నించారు. ఈ ఘటనపై రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే మాట్లాడుతూ.. ఈ రోజు మహారాష్ట్రలో చట్టం అమలు, న్యాయవ్యవస్థ పూర్తిగా విచ్చినమైందని అన్నారు. కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ దీనిని ‘‘మహారాష్ట్ర పోలీసులకు బ్లాక్ డే’’గా అభివర్ణించారు. అది ఎన్‌కౌంటర్ అని ఎవరూ నమ్మరు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విచారణ జరిపించాలని చవాన్ డిమాండ్ చేశారు. నిందితుడి తల్లిదండ్రులు ఎన్‌కౌంటర్‌ బూటకమని ఆరోపించారు. ఇందులో పెద్ద కుట్ర దాగి ఉందని షిండే తల్లిదండ్రులు అన్నారు. తన కొడుకు క్రాకర్స్, రోడ్డు దాటడానికి కూడా భయపడుతాడని, అలాంటి వాడు ఎలా పోలీసులపై కాల్పులు జరుపుతాడంటూ ప్రశ్నించారు. అయితే, ప్రతిపక్షాల ఆరోపణలపై బీజేపీ, అధికార శివసేన ఘాటుగా స్పందించాయి. అత్యాచార నిందితుడికి ప్రతిపక్షాలు మద్దతు తెలుపుతున్నాయని ఆరోపించారు. పోలీసులపై దాడి చేశాడు, అయినా కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని, అక్షయ్ షిండేను ఉరితీయాలని ప్రతిపక్షాలే డిమాండ్ చేశాయి, ఇప్పుడు ఎన్‌కౌంటర్‌లో మరణిస్తే అతడికి అనుకూలంగా మాట్లాడుతున్నారని శివసేన ఎంపీ నరేష్ మాస్కే అన్నారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా ప్రతిపక్షాల విమర్శలపై ధ్వజమెత్తాడు. ప్రతిపక్షాలు తమ ప్రభుత్వ లడ్కీ బహిన్ పథకం విజయవంతం కావడంతో భయపడుతున్నాయని అన్నారు.

 

పవన్ కళ్యాణ్ ఫైర్.. వీడియో రిలీజ్ చేసిన ప్రకాష్ రాజ్
తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పటికీ హాట్ టాపిక్ గా నడుస్తూనే ఉంది. తాజాగా ఈ విషయం మీద ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తెలుగు సినీ పరిశ్రమ మీద ఫైర్ అవడమే కాకుండా నటుడు ప్రకాష్ రాజు మీద కూడా ఫైర్ అయ్యారు. ఈ విషయంలో ప్రకాష్ రాజ్ పూర్తి అవగాహనతో మాట్లాడాలని సున్నిత అంశాల మీద అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే మాట్లాడాలని అన్నారు. ఆయనతో పాటు అందరికీ చెబుతున్నా, విమర్శలు చేసే ముందు ఏం జరిగిందో తెలుసుకోండి. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. ఇక ఈ అంశం మీద ప్రకాష్ రాజ్ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కి ఒక వీడియో మెసేజ్ కూడా అటాచ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ చూశాను, నేను చెప్పింది ఏంటి మీరు అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తేదీ తర్వాత నేను వచ్చి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతాను. మీకు వీలైతే నా ట్వీట్ మళ్లీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్ అంటూ ప్రకాష్ చెప్పుకొచ్చారు. నిజానికి ముందుగా తిరుమల లడ్డు వ్యవహారం మీద పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ కి ప్రకాష్ రాజ్ వ్యంగ్యంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఈ సమస్య జరిగింది వెంటనే అసలు ఏం జరిగిందో వివరాలు కనుక్కుని నేరస్తులను శిక్షించండి. అంతేకానీ మీరు ఏదేదో నేషనల్ మీడియా ముందుకు తీసుకు రావద్దు. మన దేశంలో చాలా కమ్యూనల్ ఇష్యూస్ ఉన్నాయి అంటూనే సెంటర్లో అంటే కేంద్రంలో ఉన్న మీ మిత్రులకు థాంక్స్ అంటూ ఆయన బిజెపిని ప్రస్తావిస్తూ ట్రీట్ చేశారు. ఆ ట్వీట్ ఉద్దేశిస్తూ తాజాగా పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ విషయం తెలుసుకుని మాట్లాడాలంటూ ఫైర్ అయ్యారు.