NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ఏపీ తొలి కేబినెట్‌లో కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మూడున్నర గంటలపాటు సాగిన సమావేశంలో.. కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.. అంతేకాదు.. కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు.. ముఖ్యంగా సీఎం చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.. మెగా డీఎస్సీ, పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్లు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, స్కిల్ సెన్సస్ కు మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది.. ఇక, హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. మరోవైపు.. కేబినెట్‌ భేటీలో శ్వేత పత్రాల విడుదలపై చర్చ జరిగింది.. ఏడు అంశాలపై శ్వేత పత్రాల విడుదలకు నిర్ణయం తీసుకున్నారు.. గత ప్రభుత్వ పరిపాలనపై శ్వేత పత్రాలు విడుదల చేయడం వల్ల ప్రజలకు వాస్తవాలు తెలపాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు చంద్రబాబు. వ్యవస్థలను పరిపాలనను వైఎస్‌ జగన్ ప్రభుత్వం ఏ స్థాయిలో ధ్వంసం చేసిన విధానాన్ని వైట్ పేపర్లలో తెలపాలని పలువురు మంత్రులు సూచించగా.. ఏయే అంశాలపై శ్వేత పత్రాలు విడుదల చేయొచ్చని మంత్రుల అభిప్రాయాలు కోరారు సీఎం చంద్రబాబు. ముఖ్యంగా పోలవరం, అమరావతి, పర్యావరణం, శాంతి భద్రతలు, ఫైనాన్స్, పవర్, మద్యం అంశాలపై శ్వేత పత్రాల విడుదలకు నిర్ణయం తీసుకున్నారు.. పర్యావరణంలో భాగంగా ఇసుక, గనుల విషయమై శ్వేత పత్రాల విడుదలకు నిర్ణయించింది ఏపీ కేబినెట్‌.

నెలాఖరు నుంచి శ్వేత పత్రాల విడుదల.. వాటిపైనే దృష్టి..
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మూడున్నర గంటలపాటు సాగిన సమావేశంలో.. జరిగిన సుదీర్ఘ చర్చ, తీసుకున్న నిర్ణయాలపై మీడియాకు వివరాలు వెల్లడించారు మంత్రి కొలుసు పార్థసారథి.. ప్రజలరు భరోసా కల్పించే ప్రభుత్వం వచ్చింది.. మెగా డీఎస్సీ నిర్వహణపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం.. ఉపాధ్యాయుల నియామకాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కానీ, మేం టీచర్ల నియామకానికి హై ప్రయార్టీ ఇచ్చాం.. 16,347 పోస్టులతో భర్తీ చేశాం. ఆరు నెలకొకసారి నిర్వహించే టెట్ పరీక్షలను గత ప్రభుత్వం నిర్వహించ లేదు. దీని వల్ల నిరుద్యోగులకు తీరని నష్టం జరిగింది. నాణ్యత కలిగిన విద్యని అందించేలా ఎన్ఈపీని స్టడీ చేయమన్నారని తెలిపారు. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దుపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది అని తెలిపారు పార్థసారథి.. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ పేరు చెబితేనే భూ యజమానులు తమపై పిడుగుపాటు పడ్డట్టు ఫీలయ్యారు. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి.. గత ప్రభుత్వం తెచ్చిన చట్టానికి తీవ్ర వైరుధ్యాలున్నాయి. అలాంటి భయంకరమైన చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం అన్నారు. పెన్షన్లు పంపిణీపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం. 65.30 లక్షల మంది లబ్దిదారులు ఉన్నారు. సచివాలయ సిబ్బందే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేపడతారు.. బకాయిలతో సహా రూ.7 వేల పెన్షన్ ఇస్తామన్నారు.. ఈ పెన్షన్ పెంపు వల్ల నెలకు రూ. 810 కోట్ల భారాన్ని ప్రభుత్వం భరిస్తుంది.. ఏడాదికి రూ. 33,709 కోట్లు పెన్షన్ల నిమిత్తం పంపిణీ చేయబోతున్నాం అని పేర్కొన్నారు పార్థసారథి.

పార్లమెంటులో ఉద్విగ్న క్షణాలు.. తన మనవడు శ్రీభరత్‌ను ఆశీర్వదించిన కేంద్ర మాజీ మంత్రి..
పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి.. సభ్యులు ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేస్తుండా.. పార్లమెంట్‌ ఆవరణలో ఉద్విగ్న క్షణాలు చోటు చేసుకున్నాయి.. తొలిసారి ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టిన తన మనవడు శ్రీభరత్‌ను చూసి ఉద్వేగానికి లోనయ్యారు కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు.. సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించిన శ్రీభరత్.. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కూతురు కొడుకు.. ఇక, విశాఖ లోక్‌సభ సభ్యుడు భరత్ ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు పార్లమెంట్ కు చక్రాల కుర్చీలో వచ్చిన కావూరి సాంబశివరావు. ప్రమాణం స్వీకారం పూర్తి అయిన తర్వాత, పార్లమెంట్ లాబీలో తాత కావూరి సాంబశివరావు పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.. కాగా, విశాఖపట్టణం లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించిన టీడీపీ ఎంపీ శ్రీభరత్.. ఎంపీగా తెలుగులో ప్రమాణం చేశారు..

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేష్‌.. భావోద్వేగానికి గురైన భువనేశ్వరి
ఆంధ్రప్రదేశ్‌ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్‌కు అభినందనలు తెలుపుతూ.. భావోద్వేగానికి గురయ్యారు నారా భువనేశ్వరి.. మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తనయుడు లోకేష్ కు అభినందనలు తెలిపిన ఆమె.. అప్పగించిన బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తావనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యను మెరుగుపరచి, ఐటీ సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు. ప్రజా సేవ చేస్తూనే రాష్ట్రాన్ని సుభిక్ష మార్గంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరుకుంటున్నాను అని.. పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నా అని తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇక, ఆంధ్ర ప్రదేశ్‌లో మహిళలు గతంలో న్యాయం కోసం ఎదురు చూడాల్సి వచ్చేది.. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పరిస్థితి మారిపోయింది అన్నారు భువనేశ్వరి.. రాష్ట్రంలో మహిళలపై నేరాలు ఇక తగ్గినట్లే అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. చీరాల ఘటనలో త్వరితగతిన చర్యలు తీసుకున్న హోంమంత్రి అనిత, పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు.. మహిళల భద్రత పట్ల మీ నిబద్ధత భవిష్యత్తులోనూ కొనసాగుతుందని నేను విశ్వసిస్తున్నాను అని పేర్కొన్నారు నారా భువనేశ్వరి.

ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలి.. శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న డిప్యూటీ సీఎం
ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా వారి అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, శ్రీశైల మల్లికార్జున, భ్రమరాంబిక అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. సోమవారం ఆయన కుటుంబ సభ్యులతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్, మేఘా రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎన్నం శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి శ్రీశైల మల్లికార్జున దర్శనం చేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇరు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి, ఋతుపవనాలు బలంగా వీచాలని, పంటలు సమృద్ధిగా పండాలని ఆ దేవుడిని ప్రార్థించానని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క తెలిపారు. కరువు కాటకాలు అనేవి లేకుండా అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. ఋతుపవనాలు రాకముందే శ్రీశైలం హైడల్ ప్రాజెక్టును సమీక్షించి తద్వారా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన చర్యలు చేపట్టడమే తన పర్యటన ఉద్దేశమన్నారు. నాటి కాంగ్రెస్ పెద్దలు ముందుచూపుతో నిర్మించిన బహుళార్థక సార్ధక ప్రాజెక్టుతో మన జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. అమర జీవులకు నివాళులు అర్పిస్తున్నామన్నారు. శ్రీశైలం హైడల్ ప్రాజెక్టు ద్వారా అత్యధిక స్థాయిలో విద్యుత్తు ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవు, 2029-30 వరకు కావలసిన విద్యుత్తు తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో ఉందని ఆయన తెలిపారు.

జీఎస్టీ అమలు తర్వాత ఏ వస్తువులు చౌకగా మారాయి?
వస్తు సేవల పన్ను(జీఎస్టీ) 17 స్థానిక పన్నులు, 13 రకాల సెస్‌లను కేవలం ఐదు భాగాలుగా విభజించడం ద్వారా మొత్తం పన్ను వ్యవస్థను చాలా సులభతరం చేసింది. జూలై 1, 2017 నుంచి జీఎస్టీ అమలు చేయబడింది. గత 6 సంవత్సరాలలో సామాన్య ప్రజలు ఉపయోగించే కొన్ని ఉత్పత్తులు, సేవలపై పన్నులు తగ్గించబడ్డాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) డేటా ప్రకారం జీఎస్టీ అమలులోకి వచ్చిన వెంటనే పిండి, సౌందర్య సాధనాలు, టెలివిజన్, రిఫ్రిజిరేటర్లు వంటి వస్తువులు చౌకగా మారాయి.దీనివల్ల కుటుంబాల ఆదాయంపై ఒత్తిడి తగ్గి, మోసే సామర్థ్యం పెరిగింది. శనివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ‘జీఎస్టీ చెల్లింపుదారుల జీవితాన్ని సులభతరం చేయడమే మా ఉద్దేశమని పన్ను చెల్లింపుదారులకు నేను భరోసా ఇవ్వాలనుకుంటున్నాను. మేము కనీస సమ్మతి కోసం పని చేస్తున్నాము.” అని మంత్రి వెల్లడించారు. జీఎస్టీ సామాన్యులపై భారం మోపుతుందన్న ఆరోపణలను కూడా గతంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తోసిపుచ్చారు. జీఎస్టీ కింద సామాన్యులు, పేదల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు. 2017 నుంచి పన్ను రేట్లు నిరంతరం తగ్గించబడ్డాయన్నారు. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత గతంలో కంటే అనేక నిత్యావసర వస్తువులపై పన్ను తగ్గించామన్నారు. నూనె, సబ్బుపై పన్ను 28 శాతం నుండి 18%కి తగ్గించబడిందన్నారు. జీఎస్టీ కింద ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై గతంలో అధికంగా 31.3 శాతం పన్ను విధించగా ఇప్పుడు 18 శాతం మాత్రమే విధిస్తున్నారని చెప్పారు. బ్రాండ్ లేని ఆహార పదార్థాలు, ప్రాణాలను రక్షించే మందులు, ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయ సేవలు వంటి అనేక వస్తువులకు GST కింద మినహాయింపు ఇవ్వబడింది.

ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. బ్యూటీ పార్లర్‌లో వధువు హత్య
మధ్యప్రదేశ్‌లోని దాతియా జిల్లా సోనగిరిలోని బార్‌గావ్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల కాజల్‌కు.. యూపీలోని ఝాన్సీ గ్రామానికి చెందిన రాజ్ అనే యువకుడితో నిశ్చితార్థం జరిగింది. అయితే వివాహం కోసం కాజల్, ఆమె స్నేహితులు, బంధువులంతా ఝాన్సీ గ్రామానికి వచ్చారు. అప్పటికే నిషా గర్డెన్ కల్యాణ్ మండపంలో వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. అయితే పెళ్లి మండపంలోకి వెళ్లే ముందు తన స్నేహితులతో కలిసి కాజల్.. బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. లోపల మేకప్ వేసుకుంటుండగా.. దీపక్ అనే యువకుడు.. కాజల్‌ను బయటకు రావాలని పిలిచాడు. తనను మోసం చేశావంటూ బెదిరించాడు. కానీ కాజల్ మాత్రం బయటకు వచ్చేందుకు నిరాకరించింది. దీంతో దీపక్.. బ్యూటీ పార్లర్‌లోకి ప్రవేశించి కాజల్‌పై సెకన్ల వ్యవధిలోనే తుపాకీతో కాల్పులు జరపగా అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఈ ఘటనతో స్నేహితులంతా భయాందోళనతో షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. వారికి 6 నెలల సెలవులు
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. సరోగసీ ద్వారా తల్లులైనా ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ఆరు నెలల ప్రసూతి సెలవులు తీసుకోవచ్చు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం 50 ఏళ్ల నాటి నిబంధనను సవరించింది. సరోగసీ అంటే అద్దె గర్భం ద్వారా బిడ్డకు జన్మనివ్వడం. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (సెలవులు) రూల్స్, 1972లో చేసిన మార్పుల ప్రకారం.. తల్లి (సరోగసీ ద్వారా జన్మించిన బిడ్డను మోస్తున్న తల్లి) పిల్లల సంరక్షణ కోసం సెలవు తీసుకోవచ్చు.. అంతేకాకుండా.. తండ్రి కూడా 15 రోజుల పితృత్వ సెలవు కూడా తీసుకోవచ్చు. అయితే అతనికి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉండకూడదని షరతు విధించింది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం గత వారమే నోటిఫికేషన్ జారీ చేయగా.. జూన్ 18 నుంచే ఇవి అమలులోకి వచ్చాయి. పర్సనల్ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన సవరించిన నిబంధనల ప్రకారం.. ‘సరోగసీ విషయంలో, సరోగసీతో పాటు అలాగే ఇద్దరు పిల్లల కంటే తక్కువ జీవించి ఉన్న తల్లికి 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయవచ్చు. కాగా.. సరోగసీ ద్వారా బిడ్డ పుడితే ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలనే నిబంధన ఇంత వరకు లేదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. బతికి ఉన్న ఇద్దరు పెద్ద పిల్లల సంరక్షణ కోసం మొత్తం సేవా వ్యవధిలో గరిష్టంగా 730 రోజుల చైల్డ్ కేర్ లీవ్.. ‘ఒక మహిళా ప్రభుత్వోద్యోగికి, ఒక మగ ప్రభుత్వ ఉద్యోగికి’ అందించబడుతుంది. తాజాగా.. మంత్రిత్వ శాఖ సవరించిన నిబంధనలలో స్పష్టం చేసింది.

ఇకపై ఒక్క క్లిక్ తో అన్ని స్కాలర్‌షిప్‌ల వివరాలు.. ఒక్కసారి రిజిస్టరైతే చాలు..
తాజాగా 2024 – 25 సంవత్సరంకు గాను చుదువులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు వివిధ స్కాలర్‌షిప్ లకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం తాజాగా కేంద్రం కొన్ని కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. ఇక వాటికీ సంబంధిత వివరాలను పరిశీలిస్తే.. జాతీయ స్కాలర్‌షిప్ పోర్టల్‌ లో ప్రతి విద్యార్థి వన్-టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) నంబర్ అనేది తప్పనిసరి. ఇది వారి మొత్తం విద్యకి చెల్లుబాటు అయ్యేలా చర్యలు చేపట్టింది. 2024 – 25 విద్యా సంవత్సరానికి నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP) సిద్ధం చేసారు అధికారులు. ఇందులో తాజాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఎవరిపైన, ఏదైనా స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు వారికీ అర్హత ఉందో లేదో ఈ పోర్టల్లో తెలుసుకోవచ్చు. ఇక ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) అనే ఓ ప్రత్యేక నంబర్ ను ఇస్తున్నారు. విద్యార్థులు e-KYC పూర్తి చేసి, వారి మొబైల్ నంబర్‌ను ఉపయోగించి నమోదు చేసుకోవాలి. దీని తర్వాత విద్యార్థుల ఫోన్‌కి OTR నంబర్ జనరేట్ అవుతుంది. దీని ద్వారా సులువుగా లాగిన్ అవ్వొచ్చు. ఈ OTR నంబర్ ఒక్కసారి మాత్రమే వస్తుంది. దాంతో ఆ విద్యార్థి చదివినన్ని రోజులు వాడుకోవచ్చు. ఇక దీని తర్వాత NSP OTR, విద్యార్థి అకడమిక్ కెరీర్ వ్యవధికి చెల్లుబాటు అయ్యే 14 అంకెల సంఖ్య అనేది ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడి కి అనుగుణంగా జారీ అవుతుంది. 2024 – 25 విద్యా సంవత్సరంలో నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్లో స్కాలర్‌ షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే.. OTR కచ్చితంగా కావలిసిందే. ఆధార్ ఎన్‌రోల్మెంట్ నంబర్ తో, OTRని మనం పొందవచ్చు.

నేను తప్పు చేశా.. నేను మధ్యలోకి రాను..సప్తమి గౌడ ఎమోషనల్ ఆడియో వైరల్!
కన్నడలో బిగ్గెస్ట్ సినిమా ఫ్యామిలీ అయిన డాక్టర్ రాజ్‌కుమార్ కుటుంబంలో విడాకుల వార్తలు రావడం ఇదే తొలిసారి. రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ కుమారుడు యువరాజ్‌కుమార్‌ విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. విడాకుల నోటీసులో భార్య శ్రీదేవి భైరప్పపై యువరాజ్‌కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నోటీసుకు శ్రీదేవి భైరప్ప తన లాయర్ ద్వారా సమాధానం ఇచ్చారు. శ్రీదేవి భైరప్ప తన సమాధానంలో యువ రాజ్‌కుమార్ – సప్తమి గౌడ మధ్య ఎఫైర్‌ను పదేపదే ప్రస్తావించారు. సప్తమి గౌడ మరియు యువ ప్రేమలో ఉన్నారని, ఏడాది కాలంగా వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని శ్రీదేవి ఆరోపించింది. ఇదిలా ఉండగా ఈ రోజు సప్తమి గౌడకు చెందిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆడియోలో సప్తమి గౌడగా చెబుతున్న యువతి వాయిస్‘నా వైపు కథ వినండి.. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి.. నేను తప్పు చేశాను’ అంటూ ఏడుస్తూ వేడుకుంటున్నట్టు కనిపిస్తోంది. అందుతున్న సమాచారం మేరకు ప్రకారం, ఇది దర్శకుడు లేదా నిర్మాతకి పంపబడిన ఆడియో అని అంటున్నారు. ఆమె ఆడియోలో ఉన్నదున్నట్టు మీకోసం. హాయ్ సార్, ఏం జరుగుతుందో మీకు ముందే తెలిసి ఉండాలి. నా వైపు కథ చెప్పే అవకాశం ఇవ్వండి. నేను ఏ తప్పూ చేయలేదని చెప్పడం లేదు. కచ్చితంగా నా తప్పు ఉంది. నేను కాదు అనడం లేదు. నేను మా అమ్మపై ప్రమాణం చేస్తున్నాను, బాబాపై ప్రమాణం చేస్తున్నాను… మీ భార్యను వదిలేసి నాతో రమ్మని నేనెప్పుడూ గురు(యువ రాజ్‌కుమార్‌)కి చెప్పలేదు. కావాలంటే అతణ్ని కూడా అడగవచ్చు’’ ఇది మీ సెట్‌లో జరిగింది. మాపై మీకు ఎంత కోపం వచ్చినా ఫర్వాలేదు సార్. నేను మాట్లాడనని మా ఇంట్లో కూడా వాగ్దానం చేశాను.” గురు (యువ రాజ్‌కుమార్)కి ఇది తొలి సినిమా. నాకు కూడా ముఖ్యం. సినిమా చేయడానికి అందరూ చాలా కష్టపడ్డారు. 100% నేను అందులో జోక్యం చేసుకోను సార్. నేను అలా చేయబోవడం లేదు. సార్, మిమ్మల్ని సంప్రదించవద్దని, ఏమీ చేయవద్దని చెప్పాను. ‘‘మీరు ఏమి చెప్పినా నేను అంగీకరిస్తా అంటూ ఆమె చెబుతున్న ఆడియో వైరల్ అయింది.

జాకెట్ విప్పిన ప్రోమోపై ట్రోలింగ్స్.. ఇంకోసారి రిపీట్ చేయోద్దన్న నెటిజన్.. అనసూయ షాకింగ్ రిప్లై
న్యూస్ రీడర్గా బుల్లితెర‌కి పరిచ‌య‌మై ఆ త‌ర్వాత యాంకర్ అయి ఇప్పుడు న‌టిగా స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకుంది అనసూయ. సినిమాలు, షోల కంటే అన‌సూయ సోష‌ల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నిజానికి బుల్లితెర‌పై చాన్నాళ్ల‌పాటు త‌న హ‌వాని చూపించిన ఈ ముద్దుగుమ్మ కొద్ది రోజుల క్రితం ఊహించ‌ని విధంగా స్మాల్ స్క్రీన్‌కి బ్రేక్ ఇచ్చి సినిమాల్లోనే కనిపిస్తానని చెప్పింది. అలా చెప్పాక ‘రంగమార్తాండ’, ‘విమానం’, ‘పెద కాపు 1’, ‘ప్రేమ విమానం’ వంటి సినిమాల్లో మంచి బరువున్న పాత్రలు చేసింది. అయితే ఎంత సడన్గా బ్రేక్ ఇచ్చిందో అంతే సడన్గా అన‌సూయ ఇప్పుడు తిరిగి స్మాల్ స్క్రీన్‌ మీద సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైంది. ‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్’ పేరుతో స్టార్ మాలో ఓ గేమ్ షో జూన్ 29వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. శ్రీముఖి హోస్ట్‌గా ప్రారంభం కానున్న ఈ షోలో అమ్మాయిలు, అబ్బాయిలు రెండు టీమ్స్‌గా విడిపోయి పోటీ పడనున్నారు. ఖిలాడీ గర్ల్స్ టీమ్‌కు అనసూయ, కిర్రాక్స్ బాయ్స్‌కు శేఖర్ మాస్టర్ మెంటర్లుగా ఉంటారని ప్రోమోతో క్లారిటీ వచ్చింది. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోలో అన‌సూయ జాకెట్ విప్పేస్తూ ఉంది. ఈ అంశం మీద ఆమెను పలువురు ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది ఇదేమీ బాలేదని కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజ‌న్ ఇది నిజంగా నాన్ సెన్స్.. ఏమన్నా అంటే అనసూయ విక్టిమ్ కార్డు ప్లే చేస్తుంది అంటూ వాంతి చేసుకుంటున్న ఎమోజీలతో పోస్ట్ పెట్టాడు. దానికి అన‌సూయ స్పందిస్తూ మీరు పెట్టిన ఎమోజిలు, మీ మైండ్ సెట్ చూస్తుంటే.. ఎందుకు మీరు ఇలాంటి రోగంతో ఎందుకు బాధ‌ప‌డుతున్నారా అని అనిపిస్తుంద‌ని కామెంట్ చేసింది. మరొకరు మీరు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు, కానీ ఆ ప్రోమో నచ్చలేదు. ఇలాంటివి రిపీట్ చేయకండి అనసూయ మేడం అని అంటూ కామెంట్ పెట్టాడు. దానికి కూడా అనసూయ స్పందించింది. ఈ మేరకు ఒక సుదీర్ఘ మెసేజ్ ను షేర్ చేసింది. మనందరికీ భావవ్యక్తీకరణ హక్కు ఉందని నిరూపించినందుకు చాలా ధన్యవాదాలు, కానీ అది గౌరవప్రదంగా ఉండాలి. ప్రోమో మీకు నచ్చనందుకు క్షమించండి అండి.. అయితే నటనకు ముందు ఇది కేవలం ఒక చర్య అని నేను మీకు హామీ ఇస్తున్నాను,మేము దానిని వినోదాత్మకంగా చేస్తాము.. కానీ తప్పకుండా మీ మాటలు గుర్తుంచుకుంటాము, అలాగే నా ప్రయాణాన్ని గుర్తించి, అభినందించినందుకు చాలా ధన్యవాదాలు అని అంటూ అనసూయ పేర్కొంది. సాధారణంగా అనసూయ నెటిజన్ల మీద విరుచుకు పడుతుంది అనుకుంటారు. కానీ తనకు పద్దతిగా కామెంట్ చేసిన వారికి అంతే పద్దతిగా ఆమె కామెంట్ చేయడం గమనార్హం.