NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

మద్యం కుంభకోణం.. సభలో సీఎం పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌
గత ప్రభుత్వ హయాంలోని మద్యం కుంభకోణాలపై అసెంబ్లీలో పవర్ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నేరస్తుడే సీఎం అయితే వ్యవస్థలు ఎలా ఉంటాయో గత ఐదేళ్లల్లో చూశామన్న ఆయన.. మద్య నిషేధం అని హామీ ఇచ్చారు.. ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టారు. మద్యం పాలసీలో అడుగడుగునా తప్పులు చేశారు. వైసీపీ హయాంలోని మద్యం పాలసీ వల్ల నేరాలు పెరిగాయని విమర్శించారు. గత ప్రభుత్వం మద్యం ధరలను 75 శాతం పెంచింది. మైండ్ ఉండే ఎవ్వడూ ఈ తరహాలో ఎక్సైజ్ పాలసీ రూపొందించరు. ఏం చేసినా జరిగిపోతోందనే అహకారంతో ఇష్టానుసారంగా వ్యవహరించారు. పాత బ్రాండ్లను తప్పించారు.. కొత్త బ్రాండ్లను తెచ్చారు. పేదలు తాగే తక్కువ ధర మద్యం బ్రాండ్లు లేకుండా చేశారు. నాకు మద్యం తాగే అలవాటు లేదు.. కానీ, ఏదేదో బ్రాండ్లు తెచ్చారని మా వాళ్లు కొందరు చెబుతున్నారన్నారు. ఇక, MNC బ్రాండ్లకు చెల్లింపులు పెండింగులో పెట్టి.. వేరే బ్రాండ్లను మార్కెట్టులోకి తెచ్చారు. మద్యం దుకాణాల్లో మొత్తం నగదు లావాదేవీలే ఉన్నాయన్నారు సీఎం చంద్రబాబు.. మద్యం అమ్మకాల ఇల్లీగల్ కలెక్షన్ ద్వారానే మొత్తంగా రూ. 3 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని విమర్శించారు.. లక్ష కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగితే.. కేవలం రూ. 630 కోట్లు మాత్రమే డిజిటల్ అమ్మకాలు జరిగాయి. నాసిరకం మద్యం ద్వారా కిడ్ని వ్యాధులు 54 శాతం, లివర్ వ్యాధులు 52 శాతం పెరిగాయి. మద్యపాన నిషేధం అన్నారు.. మద్యం ఆదాయం తాకట్టు పెట్టారు. దేశ చరిత్రలో ఇంత పెద్ద మద్యం కుంభకోణం మరెక్కడా జరగలేదన్నారు.. ఎక్సైజ్ శాఖ ప్రక్షాళన చేయాలి. పారదర్శకతతో కూడిన ఎక్సైజ్ పాలసీ ఇవ్వాలన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

మద్యం కుంభకోణంపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..
గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందంటూ ఆరోపణలు గుప్పించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. లిక్కర్‌ స్కామ్‌పై సంచలన నిర్ణయం తీసుకున్నారు.. వైసీపీ సర్కార్‌ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సీఐడీ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.. నగదు లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి ఈడీకి రిఫర్ చేస్తామని స్పష్టం చేశారు. ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం ఈడీ దర్యాప్తుకు అర్హమైన కేసుగా పేర్కొన్న ఆయన.. మద్యం విషయంలో మరింత దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఐదేళ్లల్లో లక్ష కోట్ల నగదు అమ్మకాలు జరిగాయి.. ఇది భయంకరమైన స్కామ్‌గా అభివర్ణించారు..

మాజీ మంత్రి కాకాణిపై డిప్యూటీ సీఎం పవన్‌కు ఫిర్యాదు..
మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు అందించింది.. కాకాణిపై పవన్‌కు ఫిర్యాదు చేశారు ముత్తుకూరు సర్పంచ్ బూదూరు లక్ష్మి.. డిప్యూటీ సీఎం పవన్‌ను అసెంబ్లీలోని ఆయన కార్యాలయంలో కలిసి.. లక్ష్మికి జరిగిన అన్యాయం వివరించారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. కాకాణి గోవర్థన్ రెడ్డి, వైసీపీ నాయకులు తనపై చేసిన బెదిరింపులు, దౌర్జన్యాలను పవన్ కు ఫిర్యాదు చేశారు లక్ష్మి.. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తనపై వైకాపా నాయకులు, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కుల దూషణకి పాల్పడుతున్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.. ఊరి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించినట్లు ఫిర్యాదు చేసిన ఆమె.. ఎన్నికైనప్పటి నుంచి బెదిరింపులకు దిగి బలవంతంగా సంతకాలు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, లక్ష్మి ఫిర్యాదుపై పూర్తి వివరాలు తన ముందు ఉంచాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళ సర్పంచ్ పట్ల కుల దూషణలకి పాల్పడ్డ వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు పవన్‌ కల్యాణ్‌.

లిక్కర్‌పై శ్వేతపత్రం.. పవన్‌ కల్యాణ్‌, విష్ణుకుమార్‌ రాజు సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్‌ స్కామ్‌పై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్‌ వ్యవహారాలపై సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.. అయితే, శ్వేత పత్రంలో చెప్పిన దానికంటే మరింత అక్రమాలు జరిగాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. రాష్ట్ర ఖజానాకు రూ. 18 వేల కోట్ల నష్టం జరిగిందన్న ఆయన.. రూ. 15 వేల కోట్లు కేంద్రం కేటాయిస్తే ఎంతో సంబరపడ్డాం. కానీ, ఖజానాకు రావాల్సిన రూ. 18 వేల కోట్లు వచ్చుంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యేదన్నారు.. మద్యం స్కాం కారకులను కచ్చితంగా శిక్షించాలని కోరారు.. తప్పు చేసిన వారిని వదిలేస్తే.. మనకు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుంటుంది..? అని ప్రశ్నించారు. రూ. 20 వేల లంచం తీసుకున్న ఓ సాధారణ ఉద్యోగిని శిక్షించగలుగుతున్నాం… ఇంత భారీ మొత్తంలో దోపిడీకి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు అన్నారు పవన్‌ కల్యాణ్‌.. పెద్దొళ్లు తప్పు చేస్తే శిక్షలు ఉండవా? అనే ఫీలింగ్‌ను సామాన్యునికి కలగకుండా చేయాలన్నారు. మద్యం వ్యసనం తగ్గించేలా డీ-ఎడిక్షన్ సెంటర్లకు బడ్జెట్ కేటాయించాలని కోరారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌. ఇక, మద్యం శ్వేతపత్రంపై బీజేపీ ఎల్పీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రం వాస్తవాలకు దూరంగా ఉందన్న ఆయన.. ఏపీలో రూ. 30 వేల కోట్ల మేర మద్యం స్కాం జరిగింది. రూ. 99 వేల కోట్ల మేర నగదు అమ్మకాలు జరిపితే మూడు శాతం కూడా అక్రమాలే జరిగాయనేలా శ్వేత పత్రంలో ఉంది. ఈ శ్వేతపత్రం చూస్తే.. తానేం దొరకలేదనే జగన్ సంబరపడతారు. సీఐడీ లేదా సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు విష్ణుకుమార్‌ రాజు..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత ప్రమాదకరంగా ఉంది
అసెంబ్లీలో శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత ప్రమాదకరంగా ఉందని, రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అనుసరించాల్సిన సమైక్య న్యాయ సూత్రాలకు పూర్తిగా విరుద్ధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ పునర్విభజన చట్టం 2014 అనుగుణంగా నిధుల కేటాయింపు జరగలేదని ఆయన మండిపడ్డారు. షెడ్యూల్ తొమ్మిది, పది అంశాలని పట్టించుకోలేదని, అన్ని రాష్ట్రాలకు సమన్యాయం కులమత బేదాలకు తావులేకుండా బడ్జెట్ ఉంటుందని చెప్పారన్నారు మంత్రి శ్రీధర్‌ బాబు. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్లో ఒక్కసారి కూడా తెలంగాణ పదాన్ని పలకలేదని, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో 35 హామీలున్నవని ఆయన పేర్కొన్నారు. హామీల కోసం మేము చాలాసార్లు ప్రస్తావించామన్నారు. కానీ బీఆర్ఎస్ నాయకులు ఏనాడు పోరాటం చేయలేదని, కానీ తెలంగాణను బడ్జెట్లో నిర్లక్ష్యం చేశారన్నారు. పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణకు కూడా ప్రాధాన్యత ఇస్తామని ఉందని, తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఎకనామిక్ గ్రోత్ ఉన్న రాష్ట్రమని ఆయన వెల్లడించారు.

ఉగ్రవాదులు జైలుకు లేదా “నరకానికి”.. పార్లమెంట్‌లో కేంద్రం సమాధానం..
జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదానికి పాల్పడుతున్న వారు జైలుకు వెళ్తారు లేదా ‘నరకానికి’ వెళ్లారని రాజ్యసభలో కేంద్రం హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ బుధవారం సమాధానమిచ్చారు. ఉగ్రవాదాన్ని మోడీ సర్కార్ సహించబోదని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో జరగుతున్న ఉగ్రదాడుల గురించి ఆయన మాట్లాడారు. ఉగ్రవాదులు ఎప్పటికీ విజయం సాధించలేరని మంత్రి చెప్పారు. గత కొద్ది రోజులుగా జమ్మూ కాశ్మీర్‌లో 28 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, కొందరు భద్రతా సిబ్బంది కూడా మరణించారని, ఇది చాలా దురదృష్టకరమని నిత్యానంద రాయ్ అన్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భద్రతా దళాలు ఈ ప్రాంతంలో సుమారు 900 మంది ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు చెప్పారు. ‘‘ మోడీ ప్రభుత్వం తీవ్రవాదాన్ని సహించేది లేదని, ఉగ్రవాదులు జైలులో లేదా జహనుమ్(నరకం)లో ఉంటారని నేను సభకు హామీ ఇవ్వాలనుకుంటున్నాను’’ అని మంత్రి అన్నారు.

ప్రేమికుడి కోసం పాక్ వెళ్లింది.. చివరికిలా దొరికిపోయింది!
మహారాష్ట్రలోని థానేకు చెందిన మహిళ.. పాకిస్థాన్‌కు చెందిన యువకుడితో ఆన్‌లైన్ ప్రేమలో పడింది. 2024, ఫిబ్రవరిలో ఇద్దరూ ఆన్‌లైన్‌లోనే వావాహం చేసుకున్నారు. దీంతో ఆమె.. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి పాకిస్థాన్ వెళ్లిపోయింది. హఠాత్తుగా జూలై 17న నగ్మా అలియాస్ సనమ్ ఖాన్ రూఖ్ థానేలో ప్రత్యక్షమైంది. ఆమె పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు సమాచారం రావడంతో పోలీసులు రంగంలోకి దిగి కూపీలాగుతున్నారు. అసలు ఆమె ఎలా ప్రేమలో పడింది. పాకిస్థాన్ ఎలా వెళ్లింది. ఈ వివరాలను సేకరించిన పోలీసులు షాక్ అయ్యారు. 2021లో థానేకు చెందిన నగ్మా.. ఫేస్‌బుక్ ద్వారా పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌కు చెందిన బాబర్ బషీర్ అహ్మద్‌తో పరిచయం ఏర్పడింది. ఒకరినొకరు ఫోన్ నెంబర్లు ఇచ్చుకున్నారు. ఇద్దరి మధ్య సంభాషణ కొనసాగుతోంది. ఇలా వారిద్దరు ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలోనే నగ్మా పాకిస్థాన్‌ వెళ్లిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంది. కానీ పాస్‌పోర్టు తిరస్కరణకు గురైంది. అనంతరం ఫిబ్రవరి 2024లో నగ్మా.. బాబర్‌ను ఆన్‌లైన్‌లో వివాహం చేసుకుంది. పాకిస్థాన్ వెళ్లేందుకు వీసా కోసం మళ్లీ దరఖాస్తు చేసుకుంది. అయితే ఈసారి పత్రాల్లో పేరు మార్చేసింది. నగ్మా నూర్ మక్సూద్ అలీ సనమ్ ఖాన్ రూఖ్‌గా పేరు మార్చుకుంది. ఇలా ఆధార్ సహా పలు పత్రాల్లో పేరు మార్చుకుని పాస్ పోర్టు సంపాదించి పాక్ వెళ్లిపోయిది. తిరిగి ఈనెల 17న థానేకు చేరుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి వీసా సంపాదించినట్లుగా పోలీసులు గుర్తించారు.

వామ్మో.. ఒలంపిక్స్ కోసం ప్రభుత్వం ఇన్ని కోట్లు ఖర్చు పెడుతోందా..?
పారిస్ ఒలింపిక్స్ జూలై 26 నుండి ప్రారంభంకానున్నాయి. ఇందులో భారతదేశం నుండి మొత్తం 117 మంది క్రీడాకారులు పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. గత టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి మొత్తం 7 పతకాలు సాధించింది. దింతో మరోసారి భారత జట్టు పతకాలు పెంచుకోవాలని భావిస్తోంది. పారిస్ ఒలింపిక్స్ సన్నాహకాల కోసం భారత ప్రభుత్వం మొత్తం రూ. 417 కోట్లు వెచ్చించింది. ఇందుకు సంబంధించి వివరాలను ఓసారి పరిశీలిద్దాం. పారిస్ ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ నుండి అత్యధికంగా 29 మంది ఆటగాళ్లను భారత్ కలిగి ఉంది . భారత ప్రభుత్వం అథ్లెటిక్స్ కోసం అత్యధికంగా రూ. 96.08 కోట్లు ఖర్చు చేసింది. ఒలింపిక్స్‌ చరిత్రలో అథ్లెటిక్స్‌లో భారత్‌ కేవలం 3 పతకాలు మాత్రమే సాధించింది. గత ఎడిషన్‌లో నీరజ్‌ చోప్రా జావెలిన్‌ త్రోలో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. ఇక బ్యాడ్మింటన్ కోసం 72.02 కోట్లు ఖర్చు చేసింది. ఈసారి బ్యాడ్మింటన్‌లో మొత్తం 7 మంది భారత క్రీడాకారులు పాల్గొననున్నారు. ఒలింపిక్స్ చరిత్రలో ఈ గేమ్‌ లో భారత్ మొత్తం 3 పతకాలు సాధించింది. పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం, రియో ​​ఒలింపిక్స్ (2016)లో రజత పతకం సాధించింది. అంతకు ముందు సైనా నెహ్వాల్ లండన్ ఒలింపిక్స్ 2012లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. ఇక బాక్సింగ్‌లో రూ.60.93 కోట్లు, షూటింగ్‌లో రూ.60.42 కోట్లు ఖర్చు చేసింది. ఒలింపిక్ చరిత్రలో బాక్సింగ్‌ లో భారత్ మొత్తం 3 పతకాలు సాధించింది. 2008లో విజేందర్ సింగ్, 2012లో మేరీకోమ్ , 2020లో లోవ్లినా బోర్గోహైన్ కాంస్య పతకాలు సాధించారు. షూటింగ్‌లో భారత్ మొత్తం 4 పతకాలు సాధించింది. ఇందులో అభినవ్ బింద్రా స్వర్ణం కూడా ఉంది. ఇకపోతే హాకీకి రూ.41.29 కోట్లు, ఆర్చరీకి రూ.39.18 కోట్లు, రెజ్లింగ్‌కు రూ.37.80 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇప్పటి వరకు ఒలింపిక్ చరిత్రలో భారత్ హాకీలో మొత్తం 12 పతకాలు సాధించగా.. అందులో 8 బంగారు పతకాలు ఉండడం గమనార్హం. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. భారత్ ఇప్పటివరకు ఆర్చరీలో పతకం సాధించలేకపోయింది. ఈసారి 6 మంది భారతీయ క్రీడాకారులు పాల్గొనడం ద్వారా చరిత్రను మార్చాలనుకుంటున్నారు. రెజ్లింగ్‌లో భారత్‌కు 2 రజతాలు సహా మొత్తం 7 పతకాలు వచ్చాయి.

భారత్ మార్కెట్ లోకి వచ్చేసిన బిఎండబ్ల్యూ 5 సిరీస్..
జర్మన్ కార్ల తయారీ సంస్థ బిఎండబ్ల్యూ భారతదేశంలో కొత్త 5 -సిరీస్ లాంగ్ వీల్‌బేస్ (LWB) వెర్షన్‌ ను విడుదల చేసింది. ఈ వాహనం రైట్ హ్యాండ్ డ్రైవ్ మోడల్‌ ను పొందిన మొదటి మార్కెట్ భారతదేశం. బిఎండబ్ల్యూ 5 సిరీస్ LWB 4 రంగులలో కారును అందించబడుతుంది. మినరల్ వైట్, ఫైటోనిక్ బ్లూ, M కార్బన్ బ్లాక్, స్పార్క్లింగ్ కాపర్ గ్రే లలో లభిస్తుంది. స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే దీని వీల్‌బేస్ 110mm లు 3,105mm లకు పెరిగింది. ఇది Mercedes-Benz E-Class LWB తో పోటీపడుతుంది. ఈ కార్ సంబంధించి బుకింగ్‌లు గత నెలలోనే ప్రారంభమయ్యాయి. కొత్త 5-సిరీస్ LWB పెద్దగా ఉండే ఫ్రంట్ గ్రిల్, మ్యాట్రిక్స్ LED హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ ల్యాంప్స్, హాఫ్‌ మీస్టర్ కింక్‌ పై ‘5’ చిహ్నం, కొత్త అల్లాయ్ వీల్స్, ర్యాప్‌రౌండ్ LED టెయిల్ లైట్లు, ఇంటిగ్రేటెడ్ రిఫ్లెక్టర్‌ లతో కూడిన బంపర్‌ను కలిగిఉంది. కారు ప్రీమియం క్యాబిన్ గ్రే లేదా బ్రౌన్ కలర్ సదుపాయాలను కలిగి ఉంటుంది. ఇక డాష్‌ బోర్డ్‌ లో యాంబియంట్ లైటింగ్ అందించబడింది. ఇది కాకుండా., 12.3 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 14.9 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, హెడ్ అప్ డిస్‌ప్లే, సిగ్నల్ నియంత్రణ, 18 స్పీకర్ బోవర్స్ & విల్కిన్స్ సరౌండ్ సిస్టమ్ అందుబాటులో ఉన్నాయి.

తమిళ సినిమాలా.. ఇక చాలు బాబోయ్!
చోటా కె నాయుడు మేనల్లుడు సందీప్ కిషన్ ప్రస్థానం అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత స్నేహ గీతం అనే సినిమాతో హీరోగా మారిన ఆయన మొట్టమొదటి హిట్ అందుకుంది మాత్రం వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతోనే. ఆ తర్వాత టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ వస్తున్న ఆయన తమిళంలో కూడా హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 9 సినిమాలు చేశారు. ఇప్పుడు ధనుష్ హీరోగా ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాయన్ అనే సినిమాలో ధనుష్ సోదరుడి పాత్రలో నటిస్తున్నాడు. ఆయన సరసన అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. 26వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈరోజు సందీప్ కిషన్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తాను ఇకమీదట వేరే హీరోల సినిమాలలో క్యారెక్టర్లు చేయాలని కానీ తమిళ సినిమాలు చేయాలని కాని అనుకోవడం లేదని తేల్చి చెప్పాడు. ఒకవేళ అది తమిళ సినిమా చేయాలి అంటే తెలుగులో కూడా రిలీజ్ అయ్యేలా బైలింగ్యువల్ సినిమా మాత్రమే ప్లాన్ చేసుకుంటానని అన్నారు. వాస్తవానికి చాలామంది హీరోలు ఇతర భాషల నుంచి వచ్చి టాలీవుడ్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. నేను అలా తమిళ సినీ పరిశ్రమకు వెళ్లి మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేశానని ఆయన అన్నారు. ఇక్కడైతే తనను చోటాకే నాయుడు మేనల్లుడు కాబట్టి సినిమా అవకాశాలు వస్తున్నాయి అంటారు. అందుకే తమిళనాడు వెళ్తే అక్కడ ఈ ప్రభావం ఉండదు కాబట్టి నా సొంతంగా నేను ప్రయత్నం చేసే సినిమాలు చేశానని, అయితే ఇకమీదట ఆ అవకాశం రాదు. నేరుగా తెలుగు సినిమాలే చేయాలని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.

మెగా ఫాన్స్.. పులకించిపోవడానికి రెడీ అవ్వండి!
ఇంద్ర సినిమా అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. అప్పుట్లో రిలీజ్ అయిన ఇంద్ర సినిమాని మెగాస్టార్ చిరంజీవి హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్ ఏర్పాటు చేసి 50 ఏళ్లు పూర్తవుతోంది. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కూడా రాబోతోంది. అలాగే ఇంద్ర రిలీజ్ అయి నేటికి 22 ఏళ్ళు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. వాస్తవానికి ఇప్పుడు రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. కలెక్షన్స్ రావట్లేదు కానీ ప్రేక్షకులు మాత్రం తమ చిన్నప్పుడు థియేటర్లలో చూసిన సినిమాలను మళ్లీ ఇప్పుడు థియేటర్లలో చూసి మురిసిపోతున్నారు. ఇక ఇంద్ర సినిమా రిలీజ్ అయి దాదాపు 22 ఏళ్లు పూర్తయింది. జూలై 24 వ తేదీన అంటే ఈరోజుకి ఈ సినిమా రిలీజ్ అయి 22 ఏళ్లు పూర్తయ్యాయి. మెగాస్టార్ కెరియర్ లో అప్పటివరకు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలవడమే కాదు హైయెస్ట్ గ్రాసింగ్ సౌత్ ఇండియన్ మూవీ గా కూడా నిలిచింది. అంతే కాదు ఈ సినిమా మూడు నంది అవార్డులతో పాటు రెండు సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్ సాధించింది. మెగాస్టార్ చిరంజీవికి బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది. ఒక రాయలసీమ వ్యక్తి అక్కడి ప్రజల కోసం వేల కోట్ల ఆస్తులు వదులుకొని అయిన వారందరిని దూరం చేసుకుని కాశీలో సాధువులా జీవిస్తూ ఉంటాడు. ఇలాంటి కథతో తెరకెక్కిన ఈ సినిమా అప్పటిలో భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మణిశర్మ అందించిన పాటలు ఇప్పటికీ ప్రేక్షకులు, ప్రజలు వింటూనే ఉంటారు. అలాంటి సినిమా ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.