NTV Telugu Site icon

Top Headlines @ 5 PM : టాప్‌ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలకు గ్రీన్‌ సిగ్నల్..
ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం ముగిసింది.. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటల తర్వాత ప్రారంభమైన సమావేశం.. మధ్యాహ్నం 1.30 తర్వాత ముగిసింది.. ఇక, కేబినెట్‌ భేటీ అనంతరం తాజా రాజకీయ పరిస్థితులపై మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు.. ఇక, కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది.. చెత్తపన్ను రద్దు అమలు విధానానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.. ఇక, మహిళలకు ఉచిత సిలిండర్ల పంపిణీ పథకంపై కేబినెట్‌ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ సాగింది.. మరోవైపు.. దేవాలయాల పాలకమండలి సభ్యుల సంఖ్యను 15 నుండి 17 వరకు పెంచాలని నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్‌.. ఇద్దరు బ్రాహ్మణులు పాలకమండలిలో ఉండాలనే నిర్ణయానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది.. ఉచితంగా ఇసుక పంపిణీ పథకంలో.. ట్రాక్టర్లు, లారీలతో పాటుగా ఎడ్ల బండ్లలో కూడా ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.. ఉచిత ఇసుక పూర్తిగా ఉచితం చేసింది ప్రభుత్వం..

 

ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా మాజీ ఐపీఎస్‌ అధికారి అనురాధ నియామకం
ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా మాజీ ఐపీఎస్‌ అధికారి అనురాధ నియామకమయ్యారు. ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా మాజీ ఐపీఎస్‌ అనురాధను నియమిస్తూ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీచేశారు. టీడీపీ హయాంలో కొన్నాళ్ల పాటు ఏఆర్ అనూరాధ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా, హోంశాఖ కార్యదర్శిగా అనురాధ బాధ్యతలు నిర్వహించారు. గౌతమ్ సవాంగ్ రాజీనామాతో ఏపీపీఎస్సీ ఛైర్మన్ స్థానం ఖాళీ అయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవికి సవాంగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో ఏపీపీఎస్సీలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఏపీపీఎస్సీలో గత ప్రభుత్వ అక్రమాలను వెలికి తీసే ప్రక్రియలో భాగంగా రిటైర్డ్ ఐపీఎస్‌కు ఛైర్మన్ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించినట్లు తెలుస్తోంది.

 

కూటమి పాలనలో మహిళలకు రక్షణ, ప్రజలకు భరోసా లేదు..
కడప జిల్లా బద్వేల్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించారు. యువకుడి చేతిలో హత్యకు గురైన యువతి కుటుంబసభ్యులను జగన్‌ పరామర్శించారు. శనివారం ఘటన జరిగితే ఎవరు పట్టించుకోలేదని.. కేవలం తాను వస్తున్నాను అని బాధితులకు సహాయం అందించారని ఆయన అన్నారు. కూటమి పాలనలో మహిళలకు రక్షణ, ప్రజలకు భరోసా లేదని తీవ్రంగా మండిపడ్డారు. ఘటన జరగగానే ప్రజలకు భరోసా ఇవ్వాల్సి ఉందన్నారు. చంద్రబాబు పాలన ఇలాగే ఉంటే ప్రజలు తిరగబడతారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలపై గుంటూరులో సుధీర్ఘంగా మాట్లాడానన్నారు. చంద్రబాబుకు ఒకటే చెబుతున్నా.. ప్రజలకు ఏదైనా జరిగినప్పుడు ప్రజలకు అండగా ఉండాలన్నారు. బద్వేలులో చనిపోయిన అమ్మాయి జెడ్పీ హైస్కూల్లో టాపర్ అని జగన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఘటనలపై చంద్రబాబు మేల్కోవాలని హెచ్చరిస్తున్నామన్నారు.

 

ఎవ్వరిని వదిలి పెట్టం.. కాంగ్రెస్ నేత హత్యపై మంత్రి సీరియస్
జగిత్యాలలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి మర్డర్ పై సీరియస్ గా ఉన్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మర్డర్ ఎవరు చేసినా.. ఎవరు చేయించినా వదిలేది లేదని స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీతో ఇప్పటికే మాట్లాడినట్లు తెలిపారు. జీవన్ రెడ్డితో తాను కూడా మాట్లాడతానన్నారు. జీవన్ రెడ్డి పార్టీలో అత్యంత సీనియర్ నేత అని.. ఆయన సేవలను తాము వినియోగించుకుంటామన్నారు. పార్టీలో జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలిగించమని తెలిపారు. చనిపోయిన బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. నిన్న (అక్టోబర్02)న జగిత్యాల జిల్లా రూరల్ మండలం జాబితాపూర్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు, మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. సంతోశ్ అనే వ్యక్తి గంగారెడ్డిని కారుతో ఢీకొట్టారని.. ఆ తర్వాత కత్తితో పొడిచినట్లు స్థానికులు తెలిపారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ గంగారెడ్డిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మరణించినట్లు వెల్లడించారు. ఇక, గ్రామంలో రాజకీయ కక్షలే హత్యకి ప్రధాన కారణమని తెలిసింది. దీంతో జీవన్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు జగిత్యాల- ధర్మపురి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తమ్మునిలాంటి వాడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాలలో బీఆర్ఎస్ రాజ్యం నడుస్తుందా.. లేదంటే కాంగ్రెస్ రాజ్యం నడుస్తుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ రాజ్యంలో కాంగ్రెస్ నాయకులకే రక్షణ కరువైందని మండిపడ్డారు.

 

పెళ్లి చేసుకోమని అడిగిన ప్రియురాలు.. చచ్చిపోమని పురుగుల మందు కొనిచ్చిన ప్రియుడు.. చివరకు?
ప్రేమించానని మాయ మాటలు చెప్పి ప్రేమలోకి దించాడు. నువ్వు లేకపోతే నేను లేను, నువ్వే నా శ్వాస, నువ్వే నా జీవితం అంటూ కల్లిబొల్లి కబుర్లు చెప్పి దాదాపు ఏడేళ్లు ఆ అమ్మాయితో కలిసి తిరిగాడు. చివరకు పెళ్లి చేసుకుందామని అమ్మాయి అడగగానే ఏదో ఒకటి సాకు చెప్పుకుంటూ, లైఫ్ ఎంజాయ్ చేద్దామంటూ దాట వేసుకుంటూ వచ్చాడు. చివరకు ప్రేమించిన అమ్మాయిని వదిలేసి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇదేంటి అని ప్రేమించిన అమ్మాయి గట్టిగా నిలదీస్తే.. అసలు రూపాన్ని బయటపెట్టాడు ఆ ప్రియుడు. అక్కడితో ఆగకుండా చావమని పురుగుల మందు కొనిచ్చాడు. అందుకోసం ఆన్‌లైన్‌లో డబ్బు కూడా చెల్లించాడు. చివరకు ఆ అమ్మాయి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు సిద్ధపడింది. అసలేం జరిగిందంటే.. కాకినాడలో ఏడేళ్లు ప్రేమించిన యువతిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడు ఉమామహేశ్వరరావు అనే యువకుడు.. యామిని అనే యువతిని ప్రేమించాడు యువకుడు. పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయింది.. తర్వాత ఉమామహేశ్వరరావుకు మరొక అమ్మాయితో నిశ్చితార్థం అయింది.. మన సంగతి ఏంటని యామిని ప్రశ్నించింది.. నువ్వు లేకపోతే చనిపోతానని ఉమామహేశ్వరరావు చెప్పింది.. ఫెర్టిలైజర్స్ దుకాణానికి వెళ్లి పురుగుల మందు కొనుక్కుంటానని స్కానర్ పంపించింది.. దానికి ఏమీ అడ్డు చెప్పని ఉమామహేశ్వరరావు పురుగులు మందుకి 275 ఫోన్ పే చేశాడు.. దాంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది యామిని.. ప్రియుడు దక్కకపోవడం, పురుగుల మందు తాగమనడంతో యామిని ఆత్మహత్య చేసుకుంది. వాట్సాప్‌లో మెసేజ్‌లు చూసి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఉమామహేశ్వరరావు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి అతనికి రిమాండ్ విధించారని పోలీసులు వెల్లడించారు.

 

ఆ ఒక్క విషయంలో మోడీని అనుసరిస్తా.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
కేటీఆర్ నోటీసులకు భయపడేది లేదన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఉడుత ఊపులకు భయపడేది లేదని.. బండి సంజయ్ అన్నారని.. మళ్లీ ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. బండి సంజయ్ తనకు లీగల్ నోటీసులు ఇస్తే, తాను మళ్లీ మళ్లీ లీగల్ నోటీసులు పంపిస్తానన్నారు. రాహుల్ గాంధీకి మోడీ లీగల్ నోటీసులు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. లీగల్ నోటీసుల విషయంలో మాత్రం మోడీని అనుసరిస్తానని తెలిపారు. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ లీగల్ నోటీసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తాజాగా స్పందించారు. నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక.. లీగల్ నోటీస్ ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీమంత్రి కేటీఆర్ నాకు లీగల్ నోటీసు పంపినట్లు మీడియాలో చూశానని తెలిపారు. లీగల్ నోటీసుతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారెవరూ లేరని అన్నారు. నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్ నోటీస్ ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోందన్నారు. తాటాకు చప్పళ్లకు భయపడేది లేదన్నారు. నాపై తొలుత వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించింది కేటీఆరే.. అన్నారు. అందుకు బదులుగానే నేను మాట్లాడిన అన్నారు. ఆయన సుద్దపూస అనుకుంటున్నాడేమో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన భాగోతం ప్రజలకు తెలుసని అన్నారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో తెలుసని అన్నారు. ఇప్పటి వరకు మాటకు మాటతోనే బదులిచ్చిన అన్నారు. లీగల్ నోటీసులకు నోటీసులతోనే బదులిస్తా. మేం చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వ్యక్తులం అన్నారు. చట్టం, న్యాయం ప్రకారం కూడా ముందుకు వెళతామని తెలిపారు.

 

మంత్రులకు క్లాస్‌ తీసుకున్న సీఎం చంద్రబాబు..
సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది.. అయితే, కేబినెట్‌ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు సీఎం చంద్రబాబు.. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ సాగినట్టుగా తెలుస్తుండగా.. మంత్రులతో చంద్రబాబు సీరియస్ కామెంట్స్ చేశారు.. మంత్రులు ప్రో యాక్టివ్ గా పని చేయలని స్పష్టం చేశారు.. మంత్రులు స్పీడ్ పెంచాలి, అదే సమయంలో సమర్ధంగా పని చేయాలంటూ మంత్రులకు క్లాస్‌ తీసుకున్నారు చంద్రబాబు.. ఇక నుంచి ప్రతిరోజు ముఖ్యమేనంటూ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.. మంత్రులు కూడా తనతో సమానంగా పని చేయగలగలన్న చంద్రబాబు.. ఇంకా కొందరు నిర్లిప్తంగా ఉన్నారని.. ఇలా ఉంటే పని చేయలేరంటూ మంత్రులకు హితవు చెప్పారు. కాగా, కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది.. చెత్తపన్ను రద్దు అమలు విధానానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.. ఇక, మహిళలకు ఉచిత సిలిండర్ల పంపిణీ పథకంపై కేబినెట్‌ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ సాగింది.. మరోవైపు.. దేవాలయాల పాలకమండలి సభ్యుల సంఖ్యను 15 నుండి 17 వరకు పెంచాలని నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్‌.. ఇద్దరు బ్రాహ్మణులు పాలకమండలిలో ఉండాలనే నిర్ణయానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది.. ఉచితంగా ఇసుక పంపిణీ పథకంలో.. ట్రాక్టర్లు, లారీలతో పాటుగా ఎడ్ల బండ్లలో కూడా ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.. ఉచిత ఇసుక పూర్తిగా ఉచితం చేసింది ప్రభుత్వం..

 

తీరం వైపు దూసుకొస్తున్న ‘దానా’ తుఫాన్.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ
తీరం వైపు దానా తుఫాన్‌ దూసుకొస్తుంది.. తూర్పుమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోన్న ‘దానా’ తుఫాన్‌.. రేపటికి వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.. ఇక, గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలో మీటర్ల వేగంతో కదులుతున్న తుఫాన్.. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము లోపు తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది.. పూరీ-సాగర్ ద్వీపం మధ్య భితార్కానికా మరియు ధమ్రా (ఒడిశా) సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేసింది.. ప్రస్తుతానికి పారాదీప్ (ఒడిశా)కి 520 కిలో మీటర్లు.. సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) 600 కిలో మీటర్లు మరియు ఖేపుపరా (బంగ్లాదేశ్)కి 610 కిలో మీటర్ల దూరంలో దానా తుఫాన్‌ కొనసాగుతోంది.. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని తీర ప్రాంతం వెంబడి ఈ రోజు మధ్యాహ్నం నుంచి గంటకు 80-100 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. రేపు రాత్రి నుంచి 100-110 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇక, ఈ సమయంలో భారీ వృక్షాలు, చెట్ల దగ్గర / కింద నిల్చోవడం, కూర్చొవడం చేయవద్దు అని సూచించారు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్.. ఎండిపోయిన చెట్లు / విరిగిన కొమ్మలను తొలగించండి వాటి కింద ఉండకండి.. వేలాడుతూ, ఊగుతూ ఉండే రేకు/మెటల్ (ఇనుప) షీట్లతో నిర్మించిన షెడ్లకు దూరంగా ఉండండి.. పాత భవనాలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండకండి. కరెంట్/ టెలిఫోన్ స్థంబాలకు, లైన్లకు మరియు హోర్డింగ్స్ కు దూరంగా ఉండండి.. మీరు ప్రయాణంలో ఉంటే వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్లండి అని సూచించారు.. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇవాళ, రేపు సముద్రం అలజడిగా ఉంటుంది.. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించింది విపత్తుల నిర్వహణ సంస్థ.. మరోవైపు.. విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం.. వాతావరణ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తూర్పుమధ్య బంగాళాఖాతంలో ‘దానా’ తుఫాన్ కొనసాగుతుందన్నారు.. రాగల 24 గంటల్లో ఇది తీవ్ర తుఫాన్‌గా మారుతుందన్న ఆయన.. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిమీ వేగంతో తుఫాన్‌ కదులుతోందన్నారు.. 25వ తేదీన ఉదయం పూరీ-సాగర్ ఐలాండ్స్ మధ్య భితార్కానికా మరియు ధమ్రా సమీపంలో తీరం దాటే ఆవకాశం ఉందని.. ప్రస్తుతానికి పారాదీప్ 520 కిమీ., సాగర్ ఐలాండ్స్ కు 600 కిమీ.. ఖేపుపరాకి 610 కిమీ దూరంలో దానా తుఫాన్‌ కేంద్రీకృతమైందని తెలిపారు.. ఇక, అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశాం.. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాస్..

 

ఉగ్రవాదంపై దేశాలు కలిసి పోరాడాలి.. బ్రిక్స్ సదస్సులో మోడీ పిలుపు
ఉగ్రవాదంపై అన్ని దేశాలు కలిసి పోరాడాలని బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ పిలుపు నిచ్చారు. రష్యాలోని కజాన్‌లో జరిగిన 16వ బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా పుతిన్‌పై ప్రశంసలు కురిపించారు. బ్రిక్స్‌ సమావేశాన్ని పుతిన్ విజయవంతంగా నిర్వహించారంటూ కొనియాడారు. భవిష్యత్‌లో బ్రిక్స్ మరింత పటిష్టమైన వేదిక అవుతుందని ఆకాంక్షించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధిపై బ్రిక్స్ దృష్టి పెట్టాలని సూచించారు. ప్రపంచంలో 40 శాతం జనాభాకు బ్రిక్స్ ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరు తల్లి పేరుతో మొక్క నాటే కార్యక్రమాన్ని భారత్‌లో చేపట్టినట్లు గుర్తుచేశారు. ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండటం సరికాదని.. ఉగ్రవాదంపై అన్ని దేశాలు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢమైన మద్దతు అవసరమని.. ద్వంద్వ ప్రమాణాలకు చోటు లేదన్నారు. అలాగే గ్లోబల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో సంస్కరణలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఇక బ్రిక్స్ దేశాలు లోకల్ కరెన్సీ ద్వారా వ్యాపారం చేసుకోవడాన్ని ప్రోత్సహించాలని ప్రధాని మోడీ కోరారు. ద్రవ్యోల్బణం, ఆహార భద్రత, సైబర్ బెదిరింపులు వంటి ప్రపంచ సవాళ్లను గురించి కూడా మోడీ ప్రస్తావించారు. ‘‘ద్రవ్యోల్బణాన్ని నిరోధించడం, ఆహారం మరియు ఇంధన భద్రత, ఆరోగ్య భద్రత మరియు నీటి భద్రతను రక్షించడం ప్రపంచంలోని అన్ని దేశాలకు ప్రాధాన్యతనిచ్చే అంశాలు’’ అని మోడీ పేర్కొన్నారు. గ్లోబల్ ఇన్‌స్టిట్యూషన్‌లలో సంస్కరణల కోసం బ్రిక్స్ భాగస్వాములు సమిష్టిగా తమ గళాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. సురక్షితమైన కృత్రిమ మేధస్సుతో పాటు సైబర్ భద్రత కోసం ప్రపంచ నిబంధనల కోసం దేశాలు కృషి చేయాలన్నారు.