NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు
కేంద్ర బడ్జెట్‌కు ఆంధ్రప్రదేశ్‌కి నిధుల కేటాయింపుపై హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లుపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. ”మన రాష్ట్ర అవసరాలను గుర్తించి రాజధాని, పోలవరం, పారిశ్రామిక రంగాలపై దృష్టి సారించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.. ఇక, ”వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నుండి వచ్చే సహకారం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి చాలా ఉపయోగపడుతుంది.. రాష్ట్రానికి విశ్వాసాన్ని పెంచే బడ్జెట్‌ను సమర్పించినందుకు కేంద్రాన్ని అభినందిస్తున్నా.. ఏపీ మళ్లీ గాడిలో పడుతోంది” అంటూ ట్విట్టర్‌ (ఎక్స్‌)లో పేర్కొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..

మదనపల్లె సబ్ కలెక్టరేట్‌ ఘటనపై సీఎం కీలక వ్యాఖ్యలు..
సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటనపై అసెంబ్లీలో స్పందించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అగ్నిప్రమాద ఘటనపై ఇప్పటికే వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ వచ్చిన ఆయన.. ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ.. మరోసారి అగ్నిప్రమాద ఘటనను ప్రస్తావించారు.. 22-ఏ సెక్షనులో అగ్ని ప్రమాదం జరిగింది. సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే స్పందించాను. సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల కాదని అధికారులు చెప్పారు. కావాలనే ఫైళ్లను తగులబెట్టారని అధికారులు చెప్పారని సభలో ప్రకటించారు. ఇక, గతంలో యనమలకుదురు కట్ట మీద కూడా పీసీబీ ఫైళ్లను తగులబెట్టారు. ఏదో చూసీ చూడనట్టు పోతుంటే ఆధారాలు తుడిచేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు సీఎం చంద్రబాబు.. లా అండ్ ఆర్డర్ కాపాడాలి. ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచాలని పిలుపునిచ్చారు. మాచర్లకు ఐదేళ్ల పాటు మేం వెళ్లలేకపోయాం. కానీ, జగన్ వినుకొండకు వెళ్లాలని భావిస్తే మేమేం అడ్డుకోలేదని గుర్తుచేశారు.. గవర్నర్‌ను అడ్డుకోవాలని వైసీపీ భావించిందని దుయ్యబట్టారు.. ఫేక్ ప్రచారం చేస్తున్నారు.. తప్పుడు ఆరోణలు చేస్తున్నారు. 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ తప్పుడు ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు..

నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. పరదాలు కట్టొద్దు..
అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై సెటైర్లు వేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గతంలో సీఎం వస్తే ట్రాఫిక్‌ ఆపేవారు.. పరదాలు కట్టేవారంటూ ఎద్దేవా చేసిన ఆయన.. నా కోసం మాత్రం ట్రాఫిక్ ఆపొద్దు.. పరదాలు కట్టొద్దు అని పోలీసుల అధికారులకు సూచించారు.. నాకు ఐదు నిమిషాలు ఆలస్యమైనా ఫర్వాలేదు.. కానీ, జనాన్ని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు అన్నారు.. కొందరు మా ఎమ్మెల్యేలు వైఎస్‌ జగన్ గురించి చెబుతున్నారు. జగన్ హెలీకాప్టర్‌లో వెళ్తే.. కింద ట్రాఫిక్ ఆపేస్తారట.. ఇదేంటో అర్థం కాలేదని దుయ్యబట్టారు సీఎం చంద్రబాబు నాయుడు.

జనసేన సభ్యులు ఎవరూ గీత దాటరు.. నేను తప్పు చేసినా వదలొద్దు..
గతంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేశారు అని అసెంబ్లీ వేదికగా దుయ్యబట్టారు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌. ఇప్పుడు జనసేన సభ్యులు కూడా ఎవరూ గీత దాటరన్న ఆయన… తప్పు చేస్తే వారిపైనా చర్యలు తీసుకోవాలని చెబుతున్నా అన్నారు.. నేను తప్పు చేసినా నన్ను కూడా వదలొద్దు అని సూచించారు.. రాష్ట్ర భవిష్యత్తు పునర్ నిర్మాణం కోసం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు పవన్‌ కల్యాణ్‌.. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై మాట్లాడిన ఆయన.. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లి బాధ్యత కూటమి ప్రభుత్వానిది. ప్రతిపక్ష నేతలను కూడా గౌరవించే సంస్కారం సీఎం చంద్రబాబుకు ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఎంతో కష్టపడి రాజధాని నిర్మాణం చేపట్టాం. కానీ, వైసీపీ వచ్చి మూడు రాజధానులని చెప్పింది. ఈసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా అమరావతి రాజధాని కావాలన్నారు. ఇక, కేంద్రం రాజధాని నిర్మాణానికి రూ 15 వేల కోట్లు ఇవ్వటం స్వాగతిస్తున్నాం అన్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. వైసీపీ పాలనలో పోలవరం కట్టలేక పోయారు, రివర్స్ టెండరింగ్ అన్నారు. పెట్టుబడులు రాకుండా చేశారు. ఖజానా ఖాళీ చేశారు, సహజ వనరుల దోపిడి చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేశారు అంటూ విమర్శలు గుప్పించారు పవన్‌ కల్యాణ్‌.. మరోవైపు.. పవన్ కల్యాణ్‌ క్లిష్ట సమయంలో కీలకంగా వ్యవహరించారని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం విదితమే.. రాష్ట్రం కోసం టీడీపీ-జనసేన కలిసే పోటీ చేస్తాయని చెప్పిన గొప్ప వ్యక్తి పవన్ అని పేర్కొన్న ఆయన.. ఓట్లు చీలకూడదు.. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని పవన్ కల్యాణ్‌ సామాజిక బాధ్యతతో ఆలోచించారని కొనియాడారు.. ఇక, రాష్ట్రాన్ని ముందుకు నడిపించేందుకు సమైక్యంగా పని చేస్తాం అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం విదితమే..

ఏపీ ఆర్థిక వ్యవస్థకు కేంద్రం ఆక్సిజన్ ఇచ్చింది..
ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థకు కేంద్రం ఆక్సిజన్ ఇచ్చిందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. బడ్జెట్, ఏపీ ప్రాజెక్టుల ప్రస్తావనపై అసెంబ్లీ సమావేశాల్లో స్పందించిన చంద్రబాబు. ఏపీ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ ఇచ్చిందన్నారు.. ఏపీ గురించి కేంద్రం బడ్జెట్టులో ప్రస్తావించారు. అమరావతికి రూ. 15 వేల కోట్లు వచ్చేలా చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత మాదేనని కేంద్రం చెప్పిందని.. వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం జిల్లా చేర్చారు.. సంతోషంగా ఉందన్నారు చంద్రబాబు నాయుడు. ఏపీలో పారిశ్రామిక ప్రగతికి తోడ్పాటు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని కేంద్రం చెప్పిందని గుర్తుచేశారు సీఎం చంద్రబాబు.. బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యం ఇచ్చిన కేంద్రానికి ఈ సభ ద్వారా ధన్యవాదాలు చెబుతున్నాం అన్నారు. దేశం ఆర్థిక ప్రగతిలో నడిచేలా కేంద్ర బడ్జెట్ ఉందని ప్రశంసించారు. ఇక, త్వరలోనే ఏపీ బడ్జెట్ పెడతాం అన్నారు. సూపర్ సిక్స్ సహా ఇచ్చిన హామీలను అమలు చేస్తాం. అన్నింటి మీద త్వరలో పెట్టబోయే బడ్జెట్టులో క్లారిటీ ఇస్తాం అని వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆలోచన మేరకు స్కిల్ సెన్సస్ చేపడుతున్నాం అన్నారు.. సుపరిపాలనకు మారు పేరుగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుందని వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు నాయుడు..

విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్నాం
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల స్థాయిలో మంచి వాతావరణం తెస్తామని, మూడోతరగతి వరకు అదే గ్రామంలో పాఠశాల ఉంటుందన్నారు భట్టి విక్రమార్క. అంగన్ వాడి అయాలతోపాటు విద్యాబోధన కోసం ప్రత్యేక టీచర్లు అని, ప్రతి పది గ్రామాలకు ఒక రెసిడెన్షియల్‌ స్కూల్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి మండలానికి మూడు సమీకృత రెసిడెన్సిల్ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా.. 4 వ తరగతి నుంచి రెసిడెన్సియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు భట్టి విక్రమార్క. 10 వ తరగతి వరకు పూర్తి ఉచిత విద్య అందిస్తామని ఆయన తెలిపారు. రాత్రి కి అక్కడ ఉండలేని పిల్లలను ఇళ్లకు పంపేందుకు సౌకర్యాలు ఉంటాయని, వాహనాల ఏర్పాటు చేసి రవాణా సౌకర్యం ఉంటుందని, ఒక్కో పాఠశాలకు రూ 80 to 100 కోట్లు అంచనా వేస్తున్నామన్నారు. ఒక్కో పాఠశాలకు భూమి అందుబాటును బట్టి 25 ఎకరాల వరకు ఉంటుందని, బాసర ఐఐఐటీ లో మాదక ద్రవ్యాలు దొరకడం దురదృష్టకరమన్నారు. దానిపైన విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క వెల్లడించారు.

సీఎం అసెంబ్లీలో మాట్లాడాలంటే ఎందుకు జంకుతున్నారు
సీఎం అసెంబ్లీలో మాట్లాడాలంటే ఎందుకు జంకుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష గొంతు వింటే ఎందుకు భయపడుతున్నారని ఆయన అన్నారు. తప్పించుకునేందుకే నాలుగు రోజులు అసెంబ్లీ రన్ చేస్తారని, డిమాండ్స్ పై మూడు రోజులు మాత్రమే డిస్క్యుషన్ పెట్టారన్నారు. 31 లోపు అప్రప్రేషన్ బిల్లు కావాలంటే బడ్జెట్ ముందు పెట్టాలని తెలీదా? అని ఆయన ప్రశ్నించారు. బీఅర్ఎస్ మాదిరిగానే మూడు నాలుగు రోజులు బడ్జెట్ సెషన్ పెట్టడం అప్రజాస్వామికమని ఆయన మండిపడ్డారు. మేము 18 అంశాలు వారి దృష్టికి తీసుకెళ్లామని, అందులో ఒక్కటి రెండు అంశాలే చర్చకు వచ్చే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. వ్యవసాయం , ఇరిగేషన్ , సాగు. నీరు , ఉద్యోగాల ఖాళీలు , భర్తీ , మహిళల హామీ మీద , విద్య రంగ సమస్యలు , పంచాయతీ రాజ్ శాఖ సమస్యలు, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే హామీల మీద , పౌర సరఫరాల శాఖ మీద జరిగే అక్రమాల మీద , గృహ నిర్మాణ శాఖ , పెన్షన్లు , రెవిన్యూ శాఖ అవినీతీ …. ఇలా 18 రోజులు రోజుకి ఒక్క అంశం మీద చర్చ పెట్టాలని డిమాండ్ చేశామని ఆయన తెలిపారు. ఈ ప్రభుత్వం అవినీతి పునాదుల మీద నడుస్తోందని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రవేశ పెట్టిన బడ్జెట్ సామాన్యుల కలను సహకారం చేసేలా ఉందని, పేదల సంక్షేమానికి పెద్ద వేసేలా ఉందని, ఇది విసినరీ బడ్జెట్ అని, యువతకు పెద్ద పీట వేసే బడ్జెట్ అని ఆయన వ్యాఖ్యానించారు.

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం..
‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను నెరవేర్చేందుకు బీజేపీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోందని’ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను బీజేపీ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందన్న ఆశతో తెలంగాణ ప్రజలు పదేళ్లుగా ఎదురుచూస్తున్నారని, కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్‌ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీకి నిధులు, హైస్పీడ్‌ రైలు కనెక్టివిటీ , చట్టంలో చేసిన ఇతర వాగ్దానాలు అమలు చేయాలని అన్నారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తర కోస్తాంధ్రలోని వెనుకబడిన ప్రాంతాలకు ఎంపిక చేసి గ్రాంట్లు మంజూరు చేశారని, అయితే తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల ప్రస్తావనను దాటవేయాలని నిర్ణయించుకున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను నెరవేరుస్తామని ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో చేసిన హామీలు నెరవేరుతాయని భావిస్తున్నామని ఆయన అన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు జి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ సహా ఎనిమిది మంది బిజెపి ఎంపీలు కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తగిన వాటాను పొందడంలో విఫలమయ్యారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి వనరులు, సంక్షేమ పథకాల్లో వాటా దక్కకుండా చేసిన కేంద్ర బడ్జెట్ తెలంగాణకు తీవ్ర నిరాశ కలిగించిందని అన్నారు.

లోక్‌సభ స్పీకర్ కుమార్తె జాబ్‌పై విమర్శలు.. హైకోర్టులో పరువు నష్టం దావా
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా ఐఆర్‌పీఎస్ అధికారిణిగా ఎంపికైన తర్వాత పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. తండ్రి ఓం బిర్లా పలుకుబడి ఉపయోగించి అంజలి ఉద్యోగం సంపాదించిందని.. యూపీఎస్సీ పరీక్షల్లో నెగ్గుకు రాగలిగారని నెటిజన్లు ట్రోల్స్ చేశారు. తన తండ్రి లోక్‌సభ స్పీకర్ కావడం కారణంగానే తొలి ప్రయత్నంలోనే అంజలి ఉద్యోగం సంపాదించగలిగిందని పోస్టులు తెగ వైరల్ చేశారు. సోషల్ మీడియా విమర్శలపై ఆమె న్యాయస్థానం మెట్లెక్కింది. తన పరువుకు భంగం కలిగించేలా దుష్ప్రచారం చేశారంటూ వాపోయింది. దీంతో ట్రోల్స్‌పై ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా చేశారు. నిరాధార పోస్టుల్ని వెంటనే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆమె ధర్మాసనాన్ని అభ్యర్థించారు. కావాలనే టార్గెట్‌ చేసుకుని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె అభ్యర్థనను న్యాయస్థానం స్వీకరించింది. ఈ కేసులో ప్రతివాదులుగా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గూగుల్, ఎక్స్ (ట్విట్టర్), జాన్ డోను చేర్చారు. ఇటీవల కాలంలో యూపీఎస్సీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. పూణెకు చెందిన పూజా ఖేద్కర్.. తప్పుడు పత్రాలు సమర్పించి ఐఏఎస్‌కు ఎంపిక కావడం పట్ల దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె సర్వీస్‌ను నిలిపివేసింది. యూపీఎస్సీని ప్రక్షాళన చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు డిమాండ్ చేశారు.

ఉపాధి అవకాశాల్లో కొత్త శకం ప్రారంభం.. బడ్జెట్‌పై అమిత్ షా..
ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. ఉపాధి అవకాశాలలో కొత్త శకాని నాంది పలకడం ద్వారా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు 2024-25 బడ్జెట్ సహకరిస్తుందని ఆయన అన్నారు. దేశ ఉద్దేశ్యం, ఆశలను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తుందని చెప్పారు. ‘‘ భారత యువత, మహిళలు, రైతుల శక్తిని సద్వినియోగం చేస్తూ, ఉపాధి అవకాశాలు కొత్త శకానికి నాంది పలికి, అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారేందుకు ఈ బడ్జెట్ ఇంధనంగా పనిచేస్తుంది’’అని ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రజల అనుకూల, అభివృద్ధి అనుకూల దార్మనిక బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి అమిత్ షా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్రమోడీ బడ్జెట్‌ గురించి మాట్లాడుతూ.. ఇది దేశంలోని అన్ని వర్గాలదని అన్నారు. భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని చెప్పారు. మహిళలు, మధ్యతరగతి వర్గాలకు ఈ బడ్జెట్ పెద్దపీట వేసిందని చెప్పారు.

బడ్జెట్ ఎఫెక్ట్.. రూ. 4000 తగ్గిన బంగారం, వెండి ధరలు..
బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. ఈ రోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024-25లో బంగారం, వెండిపై దిగుమతి సుంకాలు తగ్గించారు. దీంతో పుత్తడి ధరలపై బడ్జెట్ ఎఫెక్ట్ చూపిస్తోంది. బంగారం, వెండి వంటి లోహాలపై కేంద్రం 6 శాతానికి కస్టమ్ డ్యూటీని తగ్గించింది. దీంతో మంగళవారం MCX(మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్)లో బంగారం ధర 10 గ్రాములకు రూ. 72,838 నుంచి ఇంట్రాడేలో రూ. 68,500 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది. వెంటి మార్కెట్‌లో MCX ధర కిలోకు రూ. 88,995 వద్ద ఉంది. ఈ రోజు ఇది రూ. 84,275 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది. భారతీయులకు బంగారంతో భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉన్నారని, బంగారంపై కస్టమ్ డ్యూటీని 6 శాతంకి తగ్గించడాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. 6 శాతానికి దిగుమతి సుంకం తగ్గించడం ద్వారా దేశీయ ధరల్లో క్షీణతకు దారి తీయవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దీని వల్ల డిమాండ్ పెరిగే అవకాశం ఉందన్నారు. బంగారం, వెండిపై ప్రస్తుతం ఉన్న సుంకం 15 శాతం. దీంట్లో 10 శాతం బెసిక్ కస్టమ్ డ్యూటీ, 5 శాతం అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ సెస్ ఉంటుంది. ప్రస్తుతం బెసిక్ కస్టమ్ డ్యూటీలో 10 శాతాన్ని 6 శాతానికి తగ్గించారు. మొత్తం చూస్తే దిగుమతి సుంకం..11 శాతానికి చేరుకుంది. దీని ఫలితంగా MCXలో బంగారం ధర రూ. 4000 కంటే ఎక్కువ తగ్గి రూ. 68,500కి, వెండి ధర రూ. 2500 నుండి రూ. 84,275కి చేరుకుంది.

ఆటో పరిశ్రమకు బడ్జెట్ ఎలా ఉంది.. EVలు చౌకగా మారే అవకాశం ఉందా..?
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆటోమొబైల్ రంగంలో కస్టమ్స్ సుంకం నుండి పూర్తి మినహాయింపు ఇవ్వాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పరిశ్రమతో సహా అనేక రంగాలకు లిథియం కీలకమైన భాగం. అంతేకాకుండా.. రాగి, కోబాల్ట్.. అరుదైన భూమి మూలకాలపై కూడా మినహాయింపు ప్రతిపాదించారు. ఇంకా.. ఈ మెటీరియల్‌లలో బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD)ని తగ్గించాలని ఆర్థికమంత్రి సూచించారు. ఆర్థిక మంత్రి చేసిన ఈ ప్రకటనతో ఎలక్ట్రికల్ వెహికల్స్ (EV)లు చౌకగా మారవచ్చు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్లు చౌకగా మారవచ్చని భావిస్తున్నారు. ఏదైనా ఎలక్ట్రిక్ కారులో అత్యంత ఖరీదైనది దాని బ్యాటరీ ప్యాక్. అటువంటి పరిస్థితిలో.. బ్యాటరీ చౌకగా ఉంటే, కారు ధర కూడా తగ్గుతుంది. లిథియం చౌకగా మారడం వల్ల బ్యాటరీల తయారీ ధరపై ప్రభావం పడుతుంది. దీని కారణంగా లిథియం అయాన్ బ్యాటరీ చౌకగా ఉంటుంది. కారు బ్యాటరీలు చౌకగా మారినప్పుడు వాహన తయారీదారులు ఎలక్ట్రిక్ వాహనాల ధరలను తగ్గించవచ్చు. ప్రస్తుతం.. ఎలక్ట్రిక్ కారు కొనుగోలుకు ముందస్తు ఖర్చు చాలా ఎక్కువ. ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణకు ఆటంకం కలిగించే అనేక కారణాలలో ఈవీ అధిక ధర కూడా ఒక ప్రధాన కారణం. ఈ దశాబ్దం చివరి నాటికి దేశంలోని మొత్తం వాహన విక్రయాల్లో ఎలక్ట్రిక్ మొబిలిటీని 30 శాతం సాధించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

జనసేన ఎమ్మెల్సీగా హైపర్ ఆది.. షాకింగ్ రియాక్షన్!
2024 ఎన్నికల్లో జనసేన తరఫున చాలా మంది సినీ నటులు ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యంగా హైపర్ ఆది పిఠాపురం మాత్రమే కాదు రాష్ట్రంలో పలుచోట్ల జనసేన అభ్యర్థుల తరఫున, కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. అయితే హైపర్ ఆదికి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని లేదా ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వస్తోంది. ఇక తాజాగా ఆ ప్రచారం మీద ఆది స్పందించాడు. ఆగస్టు 1వ తేదీన రిలీజ్ అవ్వబోతున్న ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు శివం భజే సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి సినిమాలో నటించిన హైపర్ ఆది కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా మీడియా పలు ప్రశ్నలు హైపర్ ఆదికి కూడా సంధించింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ట్రోలింగ్ వ్యవహారంతో పాటు తనకు జనసేన ఎమ్మెల్సీ పదవి ఇచ్చే విషయం మీద కూడా ఆయన స్పందించారు. తాను రాజకీయంగా ఇదేమీ చేయలేదని తనకు వ్యక్తిగతంగా కళ్యాణ్ బాబు అంటే ఇష్టం కాబట్టి ఆయన కోసం వెళ్లి ప్రచారం చేశానని అన్నారు. ఆయన ఆనందంగా ఉంటే దూరంగా ఉండి చూడడం ఇష్టం బాధతో ఉంటే దగ్గరికి వెళ్లి చూసుకోవడం ఇష్టం అంటూ ఆయన కామెంట్ చేశాడు. అయితే ఎవరైనా పిలిచి పదవి ఇస్తానంటే తీసుకోకుండా ఉంటామా అంటూ కూడా ఆయన కామెంట్ చేయడం గమనార్హం. ఇక తాను ప్రచారం చేయడానికి ఏపీ వెళ్లినప్పుడు రెండు నెలల పాటు కొన్ని సినిమాలు మిస్ అయ్యాయని, అయితే మంచి పనులు చేసినప్పుడు మిస్ అయిన వాటికంటే ఎక్కువే దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు అంతకన్నా మంచి అవకాశాలే తనకు వస్తున్నాయని చెప్పుకొచ్చాడు.

శేఖర్ బాషా బాగోతం బయటపెడతా.. బిగ్ బాస్ లోకి వెళ్లడానికే ఇదంతా.. లావణ్య సంచలనం!
గత కొద్దిరోజులుగా రాజ్ తరుణ్ అతని ప్రేయసిగా చెబుతున్న లావణ్య కేసుల వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజ్ తరుణ్ ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ లావణ్య మాత్రం రాజ్ తరుణ్ తనకు కావాలంటూ రకరకాల కేసులు నమోదు చేస్తూ వస్తోంది. అయితే రాజ్ తరుణ్ స్నేహితుడిగా చెప్పుకుంటూ ఆర్జే శేఖర్ భాష అనే వ్యక్తి మీడియాలో అనేక ఛానళ్లకి ఇంటర్వ్యూలు ఇస్తూ తనను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని లావణ్య అంటుంది. ఈ విషయం మీద ఆమె ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడింది. రాజ్ తరుణ్, నా జీవితంలోకి ఆర్జే శేఖర్ భాషా ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఆర్జే శేఖర్ బాషా వలలో పడి పలువురు బాధితులు మోసపోయారని లావణ్య అన్నారు. ఆర్జే శేఖర్ బాషా బాగోతం అంత త్వరలో బయటపెడతా, ఈ వివాదం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆర్జే శేఖర్ భాష బాధితురాలు నన్ను సంప్రదిస్తున్నారని అన్నారు. శేఖర్ భాష బాధితులతో కలిసి నార్సింగ్ పోలీసులకు త్వరలో ఫిర్యాదు చేస్తానని లావణ్య అన్నారు. ఓవైపు రాజ్ తరుణ్ తో నాకు వివాదం నడుస్తుండగా కావాలనే రాజ్ తరుణ్ శేఖర్ భాషను ఇన్వాల్వ్ చేశాడని, టాపిక్ డైవర్ట్ చేయడానికి శేఖర్ బాషా ఎంటర్ అయ్యాడని ఆమె అన్నారు. ఆర్జే శేఖర్ భాష బిగ్ బాస్ లోకి వెళ్లి ఫేమ్ అవ్వడానికి ప్లాన్ వేశాడని ఆరోపించిన ఆమె రాజ్ తరుణ్ వదిలిన పెట్ ఆర్టిస్ట్ బాణం ఆర్జే శేఖర్ భాష అని లావణ్య అన్నారు. ఇప్పటికే రాజ్ తరుణ్ వివాదంలో నా వద్ద ఉన్న పూర్తి ఆధారాలు నార్సింగ్ పోలీసులకు అందజేశానన్న ఆమె కేసు దర్యాప్తులో ఉందని, నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా, నాకు రాజ్ తరుణ్ కావాలి అని అన్నారు. నేను డ్రగ్స్ ఎవరికీ అమ్మ లేదు ఇది అవాస్తవం అని అన్నారు. మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ ఓ హోటల్ లో ఉన్న ఒక వీడియో వైరల్ అయింది, మాల్వి మల్హోత్రా ఎంటర్ అయ్యాకే రాజ్ తరుణ్ నాకు దూరమయ్యాడని అన్నారు.