NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

15 రోజుల్లో డ్రోన్ పాలసీ.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..

పదిహేను రోజుల్లో మేం ఒక డ్రోన్ పాలసీని తెస్తామని ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. అమరావతిలో జరుగుతోన్న దేశంలోనే అతిపెద్ద డ్రోన్‌ సమ్మిట్‌ 2024ను కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుతో కలిసి ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 15 రోజుల్లోనే డ్రోన్ పాలసీ తీసుకొస్తాం.. ఓర్వకల్లు, కర్నూలు ప్రాంతంలో ఒక డ్రోన్ తయారీ కేంద్రంగా తీసుకురావాలన్నారు.. అన్ని ప్రధాన నగరాలకు కర్నూలు-ఓర్వకల్లు హబ్ దగ్గరలో ఉంటుంది.. కేంద్రానికి మేం ఇచ్చే అద్భుతమైన ప్రధాన అవకాశం ఇది అని పేర్కొన్నారు.. ఇక, నరేంద్ర మోడీ లాంటి టెక్నాలజీ అర్ధం చేసుకున్న ప్రధానిని చూడలేదన్న ఆయన.. నరేంద్ర మోదీ చేయలేరంటే.. ఇంకెవరూ చేయలేరన్నారు.. ఏపీ మొట్టమొదటి యూజర్ రాష్ట్రంగా ఉంటుంది.. భారతదేశ భౌగోళిక పతిస్ధితులు టెక్నాలజీకి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి.. అత్యధిక యువత ఉన్న దేశం భారతదేశం అన్నారు.. ఇలాంటి ఒక డ్రోన్ సమ్మిట్ చాలా మంచిది.. ఇది ఒక మార్పు తీసుకొస్తుందన్నారు.. మనకు అడ్వాన్స్‌డ్ డ్రోన్స్, సీసీ కెమెరాలు, ఇతర ఐఓటీ పరికరాలు ఉన్నాయన్నారు. జాబ్ అడిగే వారు కావద్దు.. జాబ్స్ ఇచ్చే వారిగా మారాలన్నారు సీఎం చంద్రబాబు.. ఇక, తెలుగు కమ్యూనిటీ నుంచే 30 శాతం మంది జాబ్స్ ఇచ్చే వారుగా ఉన్నారన్న ఆయన.. ఎమిరేట్స్ నుంచి మొదటి ఫ్లైట్ హైదరాబాద్‌కు తెచ్చాం.. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కోసం అప్పటి ప్రధాని వాజ్ పేయిని ఒప్పించాను అని గుర్తుచేసుకున్నారు.. ఔటర్ రింగ్ రోడ్, బయో టెక్నాలజీ పార్క్, ఐటీ.. ఏది చెప్పినా.. అన్నీ తెచ్చాం.. ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని బ్రాండ్ గా మార్చారు ప్రధాని మోడీ అన్నారు.. వికసిత్ భారత్ కోసం మోడీ పని చేస్తున్నారు.. 400 TB డేటా మనకు రాష్ట్రంలో ప్రతిరోజూ సమకూరుతోంది.. డిజిటల్ కరెన్సీ పై ఒక రిపోర్టు కావాలని ప్రధాని మోడీ నన్ను అడిగారు.. జనధన్, ఆధార్, మొబైల్ లను అనుసంధానం చేయడం.. జామ్ అనే దానిని ప్రధాని తీసుకొచ్చారు.. ఎంత డేటా ఉందనేదే రాబోయే రోజుల్లో ఆస్తి‌.. క్లౌడ్, డేటా.. ఊబరైజేషన్ చేయడం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఒక సక్సెస్ సాధిస్తాం అన్నారు.

 

మెటాతో ఏపీ స‌ర్కార్‌ కీలక ఒప్పందం.. ఇక, స‌ర్టిఫికెట్ల క‌ష్టాల‌కు చెక్‌..
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. మెటాతో కీలక ఒప్పందం చేసుకుంది.. సర్టిఫికెట్ల కష్టాలకు టాటా చేబుతూ.. వాట్సాప్‌లోనే సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా ముందడుగు వేస్తోంది సర్కార్.. క్యాస్ట్ స‌ర్టిఫికెట్ కావాలంటే మూడు గ‌వ‌ర్నమెంట్ ఆఫీసులు, న‌లుగురు వ‌ర‌కూ వివిధ హోదాల అధికారులు, సిబ్బంది చిట్టూ ఓ వారం రోజులు తిర‌గాల్సిందే.. క‌రెంటు, న‌ల్లా, ఇంటి ప‌న్ను, ఇత‌ర‌త్రా బిల్లులు చెల్లించాలంటే సంబంధిత కార్యాల‌యాల్లో ఇప్పటికీ ఎడ‌తెగ‌ని క్యూలలో నిరీక్షణ తప్పడం లేదు.. అయితే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్రలో ఈ స‌ర్టిఫికెట్ల క‌ష్టాల‌ను యువ‌త ఏక‌రువు పెట్టారు. వాట్సప్ లో ఒక టెక్ట్స్ మెసేజ్ చేస్తే ఇంటికి, మ‌నిషికి అవ‌స‌ర‌మైన స‌మ‌స్త వ‌స్తువులు వ‌స్తున్నప్పుడు, సేవ‌లు అందుతున్నప్పుడు.. ఒక స‌ర్టిఫికెట్ కోసం ఆఫీసులు చుట్టూ ప‌నులు మానుకుని మ‌రీ తిర‌గాల్సిన ప‌రిస్థితికి చెక్ పెడ‌తామ‌ని, ప్రభుత్వంలోకి రాగానే.. వాట్సాప్‌ ద్వారా ప‌ర్మినెంట్ స‌ర్టిఫికెట్ పొందే అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు నారా లోకేష్‌.. ఇకె, అధికారంలోకి రాగానే కూట‌మి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెర‌వేరుస్తోంది. ఏపీ విద్య, ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ శాఖ‌ల మంత్రిగా బాధ్యత‌లు నిర్వహిస్తోన్న నారా లోకేష్‌.. యువ‌గ‌ళం పాద‌యాత్రలో ఇచ్చిన హామీల‌న్నీ ప్రాధాన్యతా క్రమంలో అమ‌లు చేస్తున్నారు. ప్రతి ఏటా క్యాస్ట్ స‌ర్టిఫికెట్ల కోసం కార్యాల‌యాల చుట్టూ తిరిగే అవ‌స‌రం లేకుండా వాట్సప్ ద్వారా పొందే ప‌ద్ధతి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అలాగే వివిధ ర‌కాల బిల్లులు వాట్సప్ ద్వారా చెల్లించేయ‌వ‌చ్చు. ఫేస్‌బుక్‌, వాట్సాప్, ఇన్‌స్టా ఫ్లాట్ ఫామ్స్ ద్వారా ప్రపంచ‌మంతా విస్తరించిన మెటాతో కీల‌క ఒప్పందం కుదుర్చుకోనుంది ఏపీ ప్రభుత్వం. ఐటీ, ఎల‌క్ట్రానిక్స్, ఆర్టీజీ, విద్య శాఖ‌ల మంత్రి నారా లోకేష్ చొర‌వ‌తో మెటా ప్రజ‌ల‌కు ప్రభుత్వం నుంచి పౌర‌సేవ‌లు వాట్సప్ బిజినెస్ ద్వారా అందించేందుకు అంగీక‌రించింది. మెటా ఫ్లాట్ ఫామ్‌ వాట్సాప్‌ బిజినెస్ ద్వారా ఇక‌పై క్యాస్ట్, ఇత‌ర‌త్రా స‌ర్టిఫికెట్లు వేగంగా, సుల‌భంగా పొందేందుకు వీలు అవుతుంది. అలాగే న‌కిలీలు, ట్యాంప‌రింగ్ అవ‌కాశం లేకుండా పార‌ద‌ర్శకంగా ఆన్‌లైన్‌లోనే స‌ర్టిఫికెట్ల జారీ ఉంటుంది. మెటా నుంచి క‌న్సల్టేష‌న్ టెక్నిక‌ల్ స‌పోర్ట్, ఈ గ‌వ‌ర్నెన్స్ అమ‌లు, ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ ద్వారా మ‌రిన్ని సిటిజెన్ స‌ర్వీసెస్ ఏపీ ప్రభుత్వానికి అందించేలా మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఏపీ అధికారులు, మెటా ప్రతినిధులు ఢిల్లీలోని 1 జన్‌పత్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ ఎంవోయూ చేసుకున్నారు. ఇక, ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ.. యువ‌గ‌ళం హామీలు నెర‌వేర్చడంలో మెటాతో ఎంవోయూ ఒక మైలురాయిగా అభివర్ణించారు.. మెటాతో ఎంవోయూ ఒక చారిత్రాత్మక‌మైన మైలురాయిగా అభివ‌ర్ణించారు. యువ‌గ‌ళం పాద‌యాత్రలో విద్యార్థులు, నిరుద్యోగులు వివిధ స‌ర్టిఫికెట్ల కోసం ప‌డుతున్న క‌ష్టాలు ప్రత్యక్షంగా చూసి.. మొబైల్‌లోనే ఆయా స‌ర్టిఫికెట్లు అందిస్తాం అని హామీ ఇచ్చాను. మాట ఇచ్చిన‌ట్టే నేడు మెటాతో ఒప్పందం ద్వారా వాట్సాప్‌లోనే స‌ర్టిఫికెట్లు, పౌర‌సేవ‌లు పొందేలా మెటాతో ఒప్పందం చేసుకున్నాం. రానున్న రోజుల్లో మ‌రిన్ని సేవ‌లు ఆన్‌లైన్‌లో అతి సులువుగా, పార‌ద‌ర్శకంగా, అతి వేగంగా పొందే ఏర్పాట్లు చేస్తాం అని స్పష్టం చేశారు.. మరోవైపు.. మెటాలో ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ సేవ‌లను వాడుకుని వాట్సాప్‌ ద్వారా ఏపీ ప్రజ‌ల‌కు పౌర సేవలను అందించేందుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని ప్రకటించారు మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంధ్యా దేవనాథన్ ప్రకటించారు..

రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ డిస్టలరీల్లో సీఐడీ తనిఖీలు
రాష్ట్రవ్యాప్తంగా మద్యం డిస్టలరీల్లో సీఐడీ బృందాల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయంలో వివిధ డిస్టలరీల్లో ఉత్పత్తి చేసిన మద్యం లెక్కలపై సీఐడీ బృందాలు ఆరా తీస్తోంది. డిస్టలరీల నుంచి నేరుగా నేతలకు మద్యం సరఫరా చేశారనే కోణంలో పరిశీలిస్తున్నారు. డిస్టలరీల యాజమాన్యం వెనుక బినామీలు ఉన్నారానే కోణంలో విచారణ జరుగుతోంది. 2014 – 2019 మధ్య కాలంలో టీడీపీ అనుమతులు ఇచ్చిన డిస్టలరీలను పలువురు వైసీపీ నేతలు చేజిక్కించున్నారనే ఫిర్యాదులపై విచారణ జరుగుతోంది. డిస్టలరీల నుంచి బెవరేజ్ కార్పొరేషన్‌కు మాత్రమే కాకుండా అనధికార సరఫరాపై సీఐడీ ఫోకస్ పెట్టింది. రికార్డుల పరిశీలన, ఆధారాల సేకరణపై సీఐడీ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ డిస్టలరీలలో సీఐడీ తనిఖీలు చేపట్టింది. అనకాపల్లి జిల్లా కశింకోట(మం) సుందరయ్య పేట దగ్గర వున్న విశాఖ డిస్టలరీ, జీఎస్‌బీ డిస్టలరీలో రికార్డులను అధికారులు పరిశీలించారు. తలుపు మూసివేసి లోపలికి అనుమతించకుండా సోదాలు చేపట్టారు. 2019- 24 మధ్య తయారైన లిక్కర్ నాణ్యత పై ప్రభుత్వం దృష్టి సారించింది. రెండు నెలల క్రితం ఎక్సైజ్ – సీఐడీతో జాయింట్ కమిటీలను ఏర్పాటు చేసింది. వివిధ డిస్టలరీలలో తయారైన మద్యం శాంపిల్స్ ను ఈ టీంలో సేకరించాయి. వీటికి సంబంధించిన కెమికల్ ఎనాలసిస్ రిపోర్టులు ప్రభుత్వానికి చేరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రికార్డుల తనిఖీలు కీలకంగా మారాయి. సుందరయ్యపేట డిస్టలరీలలో తయారయ్యే బ్రాండ్లు వైసీపీ ముఖ్య నేత కంపెనీకి చెందినవిగా టీడీపీ ఆరోపించింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. సోదాలకు గల కారణాలను సీఐడీ కానీ ఎక్సైజ్ శాఖ కానీ నిర్ధారించడం లేదు.

చెరువుల పున‌రుజ్జీవ‌నంపై హైడ్రా ఫోకస్..
న‌గ‌ర ప‌రిధిలోని చెరువ‌ల ఆక్రమ‌ణ‌ల‌ను తొల‌గించిన హైడ్రా ఇప్పుడు.. ఆయా చెరువుల పున‌రుజ్జీవ‌నంపై దృష్టి సారించింది. నిజాంపేట మున్సిపాలిటీ ప‌రిధిలోని ప్రగ‌తీన‌గ‌ర్‌కు చేరువ‌లో ఉన్న ఎర్రకుంట చెరువుతో ఈ కార్యక్రమానికి శ్రీ‌కారం చుట్టారు అధికారులు. ఈ చెరువులో 5 అంత‌స్తుల 3 భ‌వ‌నాల‌ను ఆగ‌స్టు 14న హైడ్రా కూల్చివేత‌లు జ‌రిపిన విష‌యం తెలిసిందే. కూల్చివేతలు అనంత‌రం నిర్మాణానికి వాడిన ఐర‌న్‌తో పాటు, ఉప‌యోగ‌ప‌డే ఇత‌ర సామ‌గ్రిని నిర్మాణదారుడు తీసుకొని వెళ్ళగా.. మిగతా వ్యర్థాల‌ను తొల‌గించ‌కపోవటంతో, నిర్మాణ‌దారుడికి హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఎర్రకుంట‌లో గుట్టలుగా ప‌డి ఉన్న నిర్మాణ వ్యర్థాల‌ను పూర్తిగా తొల‌గించే ప‌నులను హైడ్రా అధికారులు ప్రారంభించారు. మ‌రో రెండు మూడు రోజుల్లో ప‌నులు పూర్తి చేయనున్నారు. నిర్మాణ వ్యర్థాల‌ను తరలించిన తరువాత హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆదేశాల మేర‌కు చెరువుకు పున‌రుజ్జీవ‌నం క‌ల్పించేందుకు అధికారులు ప్రణాళిక‌లు రూపొందిస్తున్నారు. అలాగే.. నగరంలోని మిగతా చెరువుల్లో కూల్చివేసిన భవనాల వ్యర్థాలను కూడా త్వరలో తొలగిస్తామని అధికారులు పేర్కొన్నారు. అన్ని చెరువుల్లో పురుజ్జీవనం పనులు చేపట్టనున్నారు.

రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు..
రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి ఇంట్లో ఏసీబీ మెరుపు దాడులు చేసింది. ఆదానికి మించిన ఆస్తుల కేసులో భూపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. భూపాల్ రెడ్డికి సంబంధించిన ఐదు చోట్ల ఏసీబీ సోదాలు జరిపింది. ఈ క్రమంలో.. 40 కోట్ల రూపాయల వరకు అక్రమాసులను గుర్తించింది ఏసీబీ.. బినామీ పేర్లతో ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. గతంలోనూ భూపాల్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఓ ల్యాండ్ వ్యవహారంలో అధికారులకు దొరికిపోయాడు. పెద్ద ఎత్తున నగదు, ఆస్తి పత్రాలను అధికారులు అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు.

 

ఛత్తీస్‌గఢ్ 6 జిల్లాల్లో నీటిలో ప్రమాదకర స్థాయిలో ‘‘యురేనియం’’
ఛత్తీస్‌గఢ్‌లోని 6 జిల్లాల్లోని నీటిలో ప్రమాదకరమైన స్థాయిలో ‘‘యురేనియం’’ ఉందని తేలింది. అణు కార్యక్రమాల్లో ఉపయోగించి యూరేనియం మోతాదుకి మించి నీటిలో ఉండటం ప్రమాదాన్ని సూచిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఒక లీటర్‌నీటిలో 15 మైక్రోగ్రాముల పరిమిత, ప్రభుత్వం ప్రకారం లీటర్ నీటిలో 30 మైక్రోగ్రాములతో పోలిస్తే ఈ నీటిలో యురేనియా మూడు నుంచి నాలుగు రెట్లు అధికంగా ఉంది. నీటిలో ఈ స్థాయిలో యురేనియం ఉండటం ప్రజల్లో క్యాన్సర్లు, ఊపిరితిత్తుల రోగాలు, చర్మ, మూత్రపిండాల వ్యాధులకు కారణం అవుతుంది. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్, రాజ్‌నంద్‌గావ్, కంకేర్, బెమెతర, బలోడ్, కవార్ధా ప్రాంతాలలోని తాగు నీటి నమూనాల పరీక్షలలో లీటరుకు 100 మైక్రోగ్రాముల కంటే ఎక్కువ యురేనియం స్థాయిలు కనుగొనబడ్డాయి. 2017లో డబ్ల్యూహెచ్‌ఓ లీటర్ నీటిలో 15 మైక్రోగ్రాముల పరిమితికి మించకూడదని సూచించింది. డబ్ల్యూహెచ్ఓ భారత్‌ లాంటి కొన్ని దేశాల్లో ఈ పరిమితిని రెట్టింపు చేసింది. జూన్‌లో భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం లీటరుకు 60 మైక్రోగ్రాములు కూడా సురక్షితమని సూచించింది. అయితే, ఛత్తీస్‌గఢ్‌లోని ఆరు జిల్లాల్లో ఇది 100 మైక్రోగ్రాముల కన్నా ఎక్కువగా ఉంది. బలోడ్‌లోని ఒక గ్రామంలోని నీటిని పరీక్షిస్తే ఇది 130 మైక్రోగ్రాములు ఉంది. కాంకేర్ జిల్లాలో లీటర్‌కి 106 మైక్రోగ్రాముల యురేనియం ఉంది. ఆరు జిల్లాల్లో సగటున లీటర్ నీటికి 86 నుంచి 105 మైక్రోగ్రాముల యురేనియం ఉంది. భారతదేశంలో పలు రాష్ట్రాల్లోని భూగర్భ జలాల్లో యురేనియం అనేది ఆందోళన కలిగించే విషయం. గత ఏడాది జనవరిలో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ఇచ్చిన నివేదిక పంజాబ్ మరియు హర్యానాతో సహా 12 రాష్ట్రాల్లో అనుమతించదగిన పరిమితులను దాటిందని పేర్కొంది. ఇందులో రెండు రాష్ట్రాలు భారతదేశంలో సగానికి పైగా గోధుమను పండించేవి ఉన్నాయి. ఆగస్టు 2022లో, బీహార్‌లోని తొమ్మిది జిల్లాలు నీటిలో యురేనియం అధిక స్థాయిలో ఉన్నట్లు నివేదికలు వచ్చాయి. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం.. 100 శాతం గ్రేడ్ యురేనియం నాలుగు నిక్షేపాలకు చత్తీస్‌గఢ్ కేంద్రంగా ఉంది. వీటిలో మూడు రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోనే ఉన్నాయి. ఇక్కడ తాగునీటిలో యురేనియం ఉన్నట్లు తేలింది.

పుతిన్‌తో ప్రధాని మోడీ భేటీ.. ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ..
16వ బ్రిక్స్ సమావేశం కోసం ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు రష్యాకు వెళ్లారు. రష్యాలోని కజాన్‌లో సమావేశం జరగుతుంది. రష్యాకి చేరిన ప్రధాని మోడీకి అక్కడి ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ఇదిలా ఉంటే, తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్రమోడీ భేటీ అయ్యారు. ఈ రోజు బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు ఒకరినొకరు కౌగిలించుకుని, పలకరించుకున్నారు. మరిన్ని దేశాలు బ్రిక్స్‌లో చేరుతున్న సమయంలో, ఈ సదస్సు విజయవంతం కావాలని ప్రధానిమోడీ అభినందనలు తెలిపారు. ఇరువురు నేతల భేటీలో ఉక్రెయిన్ యుద్ధంపై శాంతియుత పరిష్కారం గురించి చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ‘‘రష్యా-ఉక్రెయిన్ సమస్యలో మేము అన్ని వర్గాలతో టచ్‌లో ఉన్నాము. అన్ని వివాదాలను చర్చలతో పరిష్కరించుకోవాలనేది మా వైఖరి. వివాదాలకు శాంతియుత పరిష్కారాలు ఉండాలని మేము విశ్వసిస్తున్నాము. శాంతిని నెలకొల్పడానికి సహాయం చేయడానికి భారతదేశం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది’’ అని ప్రధాని మోడీ అన్నారు. ఈ సమావేశంలో ‘‘కజాన్ డిక్లరేషన్’’ ఉండబోతోంది. బ్రిక్స్‌లోని సభ్యులు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా నేతలు ఈ సమయంలో కలుసుకోనున్నారు. ఈ ఏడాది మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ప్రధాని నరేంద్రమోడీ రెండోసారి రష్యాకు వెళ్లారు. జూలై నెలోల 22వ భారత్-రష్యా వార్షిక సదస్సుకు హాజరయ్యారు. ఇరువురు నేతలు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సమయంలో ప్రధాని నరేంద్రమోడీకి క్రెమ్లిన్‌లో రష్యా అత్యున్నత పౌర పురస్కారం ‘‘ ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్’’ పురస్కారంతో సత్కరించింది.

 

చైనా కోసమే కాశ్మీర్‌లో పాక్ ఉగ్రవాద సంస్థ దాడి!.. 7గురు భారతీయుల మృతి
కశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లాలో సొరంగం నిర్మాణ సంస్థ క్యాంప్‌సైట్‌పై ఆదివారం రాత్రి ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఒక వైద్యుడు, ఆరుగురు కార్మికులు మరణించారు. ఈ సొరంగం గగనీర్‌ను సెంట్రల్ కాశ్మీర్‌లోని సోనామార్గ్‌కు కలుపుతుంది. కాగా.. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టీఆర్‌ఎఫ్) ఈ దాడికి బాధ్యత వహించింది. టీఆర్‌ఎఫ్ లష్కరే తోయిబాలో ఒక భాగం. పాకిస్థాన్‌కు చెందిన మరో ఉగ్రవాద సంస్థ ‘పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్’ (పిఎఎఫ్ఎఫ్) టీఆర్‌ఎఫ్‌ను ప్రశంసించింది. ఇది వ్యూహాత్మక దాడి అని పేర్కొంది. తూర్పు సరిహద్దు వైపు భారత సైన్యం మోహరింపును అడ్డుకునేందుకే ఈ దాడి జరిగిందని పీఏఎఫ్ఎఫ్ పేర్కొంది. పీఏఎఫ్‌ఎఫ్‌ తన ప్రకటనలో “చైనీస్ స్నేహితులు” అని కూడా ప్రస్తావించింది. ఈ దాడిలో చైనా ప్రమేయంపై అనుమానం మొదలైంది. అయితే, పీఏఎఫ్‌ఎఫ్‌ ప్రకటనలకు మించి బీజింగ్ ప్రమేయాన్ని సమర్థించే ఆధారాలు లేవని అధికారులు చెబుతున్నారు. శ్రీనగర్-లేహ్ హైవేపై నిర్మిస్తున్న 6.5 కి.మీ పొడవైన జెడ్-టర్న్ టన్నెల్ నిర్మాణ స్థలంలో ఈ దాడి జరిగింది. ఈ సొరంగం కాశ్మీర్- లడఖ్ మధ్య కనెక్టివిటీ ఉపయోగపడుతుంది. యూపీకి చెందిన ఏపీసీవో ఇన్ఫ్రాటెక్ నిర్మించిన ఈ సొరంగం నవంబర్‌లో ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రాజెక్ట్ టైమ్‌లైన్‌లో ఎలాంటి మార్పు లేదని అధికారులు తెలిపారు. 2022లో ఎన్‌ఐఏ రూ.10 లక్షల రివార్డును ప్రకటించిన టీఆర్‌ఎఫ్ చీఫ్ షేక్ సజ్జాద్ గుల్ ఆదేశాల మేరకు ఈ దాడి జరిగిందని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. రాత్రి 8.15 గంటల ప్రాంతంలో ఆటోమేటిక్ ఆయుధాలతో ఇద్దరు ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు క్యాంప్‌సైట్‌లోకి ప్రవేశించి మెస్ ప్రాంతంలో విందు కోసం గుమిగూడిన కార్మికులపై కాల్పులు జరిపారు. బాధితుల్లో బీహార్‌కు చెందిన ముగ్గురు కార్మికులు – ఫహీమ్ నసీర్, మహ్మద్ హనీఫ్, అబ్దుల్ కలాం – మధ్యప్రదేశ్‌కు చెందిన అనిల్ శుక్లా, పంజాబ్‌కు చెందిన గుర్మీత్ సింగ్, జమ్మూకి చెందిన ఆర్కిటెక్చరల్ ఇంజనీర్ శశి భూషణ్ అబ్రోల్, కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాకు చెందిన డాక్టర్ షానవాజ్ అహ్మద్ దార్ ఉన్నారు. ఈ దాడి ఘటనను కాశ్మీర్ అంతటా విస్తృతంగా ఖండించింది. బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలిపేందుకు ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు.

 

కస్టమర్లకు గుడ్‌న్యూస్.. కొత్త లోగోతో పాటు ఫీచర్లు వచ్చేశాయ్!
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. త్వరలో 5జీ సేవలను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా కొత్త లోగోను అవిష్కరించింది. దీంతో పాటు మంగళవారం ( అక్టోబర్ 22) బీఎస్ఎన్‌ఎల్ ఏడు కొత్త ఫీచర్లను ప్రారంభించింది. బీఎస్ఎన్‌ఎల్ ఇప్పటికే దేశంలో ఎంపిక చేసిన సర్కిళ్లలో 4జీ సేవలను అందిస్తోంది. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు అనేక కొత్త కొత్త ఫీచర్లను అందించబోతుంది. ఇందులో భాగంగా అన్ వాంటెడ్ కాల్స్, మెసేజ్‌లను అరికట్టేందుకు స్పామ్ ఫ్రీ నెట్ వర్క్‌ను తీసుకొచ్చింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పామ్-ఫ్రీ నెట్‌వర్క్, వై-ఫై రోమింగ్ మరియు డైరెక్ట్-టు-డివైస్ కనెక్టివిటీతో సహా ఏడు కొత్త BSNL సేవలను ప్రారంభించారు. దీంతో పాటు బీఎస్‌ఎన్‌ఎల్ 500కి పైగా లైవ్ ఛానెల్స్, పేటీవీ ఆప్షన్లతో కొత్తగా ఫైబర్ టీవీ సర్వీస్‌ను ప్రకటించింది. ఇది ఫైబర్ ఇంటర్నెట్ సబ్ స్క్రైబర్లందరికీ అదనపు ఖర్చు లేకుండా అందిస్తోంది. అంతేకాదు కొత్త సిమ్ కార్డులను కొనుగోలు చేసేందుకు ఆటోమేటెడ్ కియోస్క్ లను పరిచయం చేస్తుంది. అంతేకాకుండా దేశంలో మొట్టమొదటి డైరెక్ట్ టు డివైజ్ (D2D) కనెక్టివిటీ సొల్యూషన్ ను ప్రారంభించింది. ఇది శాటిలైట్, మొబైల్ నెట్ వర్క్ లను కలుపుతుంది. ఈ కొత్త సర్వీస్ అత్యవసర పరిస్థితుల్లో , మారుమూల ప్రాంతాల్లో కీలకంగా మారనుంది. సాధారణ కనెక్టివిటీ లేని ప్రదేశాల్లో కూడా డిజిటల్ పేమెంట్స్ చేయొచ్చు.