NTV Telugu Site icon

Top Headlines @ 5PM: టాప్‌ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. తొలి రోజు గవర్నర్‌ ప్రసంగం
ఏపీలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి 5 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెలాఖరుతో ఓట్‌ ఆన్ అకౌంట్ బడ్జెట్‌గడువు పూర్తి కానున్నందున మరో మూడు నెలలకు ఓట్‌ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. 23న ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందుగా ఉదయం 8.30 గంటలకు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో అసెంబ్లీకి రావాలని టీడీఎల్పీ సూచించింది. గత ప్రభుత్వ పాలన తీరుపై ఇప్పటికే నాలుగు శ్వేతపత్రాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. మరో మూడు పత్రాలను అసెంబ్లీ సమావేశంలో విడుదల చేయనున్నారు.

 

ప్రమాద అంచుల్లో యునెస్కో గుర్తింపు ఉన్న రామప్ప దేవాలయం..
ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి ముంపు పొంచి ఉందా.. యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత కూడా రామప్ప అభివృద్ధికి సరైన చర్యలు తీసుకోవడం లేదా అంటే అవుననే అంటున్నారు స్థానికులు. చిన్నపాటి వర్షానికి రామప్ప దేవాలయం పైకప్పు నుంచి నీరు కురవడమే ఎందుకు నిదర్శనం అంటున్నారు. ప్రమాదపు అంచుల్లో ఉంది రామప్ప దేవాలయం. యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత రామప్ప అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తాం అని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ విడుదల చేయలేదు. రామప్ప ఆలయాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ఉపాలాయాలకు పునరుద్ధరిస్తామని పురావస్త అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆశించిన స్థాయిలో పనులు జరగలేదు.. నిధులు మంజూరు కాలేదు. దీంతో రామప్ప అభివృద్ధి నత్తనడకన సాగుతుంది. మరోవైపు రామప్ప ఆలయానికి ప్రస్తుతం ముంపు పొంచి ఉంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం వర్షానికి కురుస్తోంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రామప్ప ప్రధానాలయానికి ఈశాన్యం వైపున ఉన్న రెండు పిల్లర్లతో పాటు పలు చోట్ల వర్షపు నీరు ఆలయంలోకి వచ్చి చేరుతోంది. భారీ వర్షాలకు ఆలయ పైకప్పుకు లీకేజీలు ఏర్పడి దేవాలయం వర్షపు నీటితో బురదమయంగా మారుతోంది. గతంలో పైకప్పు నుండి నీరు కురుస్తుండటం, కేంద్ర పురావస్తుశాఖ అధికారులు ఆలయ పైకప్పుకు మరమ్మతులు చేశారు. అయిన లీకేజీ సమస్య తీరడం లేదు. 2018లో మొదలైన లీకేజీల సమస్యను ఆపేందుకు ఆపేందుకు చర్యలు తీసుకున్నారు. ఇక యునెస్కో రైస్లో నిలిచిన రామప్పకి ఇలాంటి సమస్య ఉండకూడదు అంటూ.. 2020లో తిరిగి పై కప్పుకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టారు. ఆలయ పైకప్పు పై జాలీ ఏర్పాటు చేసి దానిపై డంగుసున్నం, కరక్కాయ, నల్లబెల్లం, ఇటుక పొడి, ఇసుక కలిపిన మిశ్రమాన్ని (పీఓపీ)వేసి లీకేజీలు పూడ్చివేశారు. అయితే మళ్ళీ నాలుగేళ్ల తర్వాత యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం కురుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో పర్యాటకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రామప్ప ఆలయం పైకప్పు నుంచి నీళ్ళు కురుస్తున్న నేపథ్యంలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్పకి ముప్పు ఉంటుందని భయం స్థానికుల వెంటాడుతుంది. వెంటనే వీటిని మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందంటూ గుర్తు చేస్తున్నారు. మరోవైపు ఆలయం చూసేందుకు వచ్చినటువంటి భక్తులు.. ఆలయం మొత్తం తడిచిపోవడంతో కనీసం కూర్చోవడానికి కూడా వీలు లేకుండా ఇబ్బంది పడాల్సిన పరిస్థితిలో ఆలయంలో కనిపిస్తుంది.

 

తీవ్ర అల్పపీడనం.. రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు.
ఒడిశా తీరంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. వాయువ్యదిశగా కదులుతూ రాగల 12 గంటలలో ఛత్తీస్‌గడ్ మీదుగా ప్రయాణించి తీవ్ర అల్పపీడనం బలహీనపడనుంది. దీని ప్రభావంతో రాగల 24 గంటలలో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్రం అలజడిగా మారడంతో మత్స్య కారుల వేటపై నిషేధం కొనసాగుతోంది. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇవాళ మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మిగతా చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా.. చింతూరులో 5 సెం.మీ, అనకాపల్లిలో 3 సెంటిమీటర్లు, విశాఖలోని ఎయిర్ పోర్టు వద్ద 2 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది.

 

అన్ని శాఖల అధికారులకు మంత్రి తుమ్మల క్లాస్..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో పెద్దవాగు ప్రాజెక్ట్ గండి పడడంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం.. ఆయకట్ట రైతులను పరామర్శించి నీట మునిగిన ఇళ్ళను సందర్శించారు. కొత్తూరు గ్రామానికి చెందిన మురళి అనే వ్యక్తి విద్యుత్ షాక్తో మృతి చెందిగా ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా.. గుమ్మడవల్లి ప్రభుత్వ కాలేజీలో అధికారులతో సమీక్షలో అన్ని శాఖల అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లాస్ పీకారు. ఇరిగేషన్ అధికారులతో ఆయన మాట్లాడుతూ.. అసలు ప్రాజెక్ట్ గేట్లు ఎందుకని ముందుగా ఎత్తలేదని ప్రశ్నించారు. జూన్, జులైలో ఎందుకు మోటర్లపై పర్యవేక్షణ చేయలేదని అధికారులను అడిగారు. నీరు వస్తుందని తెలుసు కదా.. మీరు అబద్ధం చెప్పిన నేను ప్రజలను అడుగుతానని తుమ్మల పేర్కొన్నారు. ప్రాజెక్ట్ కూలే నాటికి జులై వచ్చి 18 రోజులు అయ్యింది.. ఆ 18 రోజుల్లో మోటార్లు ఎందుకు చెక్ చేయలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జులై 17వ తేదీనే గేట్లు ఎత్తి ఉంటే ఇంతటి నష్టం జరిగేది కాదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎప్పటికప్పుడు మీకు ఎన్ని మిల్లీమీటర్లు వర్షపాతం నమోదవుతుందో తెలుసు.. అయినా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని అధికారులప ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతారం, కొత్తూరు మండల వ్యాప్తంగా 72 ఇళ్ళు నీట మునిగాయి.. 250 మందికి నిత్యం భోజనం, ప్రతి కుటుంబానికి 10 కేజీలు బియ్యం, నిత్యావసర సరుకులు ఏర్పాటు చేయండని తుమ్మల ఆదేశించారు. మీరు మంచిగా చేయకపోతే రానున్న రోజుల్లో డెంగ్యూ, విష జ్వరాలు వస్తాయన్నారు. అందులో వేలేరుపాడు. కుకునూరు, అశ్వారావుపేట మండలాల్లో ఎక్కువుగా ఉంటాయని మంత్రి తెలిపారు. హెల్త్ డిపార్ట్మెంట్ ఇంటి ఇంటికి తిరిగి వైద్యం చేయండని సూచించారు. ముందుగా నీట మునిగిన ఇళ్ళ వద్దకు మీరే వెళ్ళండి.. డాక్టర్స్ కానీ మొబైల్ వ్యానులు ఇంకా ఏమైనా కావాలంటే వెంటనే కలెక్టర్ పంపిస్తారు ఏ ఒక్కరికి జ్వరం రావద్దని తెలిపారు. అన్ని శాఖలతో సమన్వయంతో ఉంటూ ప్రతి గ్రామానికి తిరగాలి.. ఏ సమస్య ఉన్న కలెక్టర్ చెప్పాలి అంటూ పోలీస్ శాఖకు మంత్రి తుమ్మల సూచించారు. నష్టపోయిన ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి అంటూ వ్యవసాయ శాఖకు ఆదేశం చేశారు. హాస్టల్స్, స్కూల్స్ ప్రతి ఒక్కటి మీరు క్షుణ్ణంగా పరిశీలించి విద్యుత్ సరఫరాలో ఎటువంటి నిర్లక్ష్యం వ్యవహరించకండి అంటూ విద్యుత్ శాఖకు సూచించారు. ఏ ఒక్క పాత స్కూల్, హాస్టల్ బిల్డింగ్స్ ఉండకూడదు.. అవసరమైతే రేకులు షెడ్ వేయించండి.. ఏ ఒక్క పిల్లోడికి ప్రమాదం జరిగిందంటూ వార్తలు రావద్దని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

 

చరిత్ర సృష్టించనున్న నిర్మలా సీతారామన్..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ఏడో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. జులై 22 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో వరుసగా ఏడు బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా సీతారామన్‌ రికార్డులకెక్కనున్నారు. ఆరు బడ్జెట్లు సమర్పించిన మొరార్జీ దేశాయ్ రికార్డును ఆమె బద్దలు కొట్టనున్నారు.1959 నుంచి 1964 వరకు దేశ ఆర్థిక మంత్రిగా పనిచేసిన దేశాయ్.. ఆరు సార్లు రికార్డు స్థాయిలో బడ్జెట్లు సమర్పించారు. వాటిలో ఐదు పూర్తి బడ్జెట్లు మరియు ఒకటి మధ్యంతర బడ్జెట్. మధ్యంతర కేంద్ర బడ్జెట్ 1 ఫిబ్రవరి 2024న సమర్పించబడింది.బడ్జెట్ సన్నాహాల్లో భాగంగా.. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవస్థలోని వివిధ వాటాదారులతో అనేక రౌండ్ల సంప్రదింపులను పూర్తి చేశారు. ఈ సమావేశాలు జూన్ 20న ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీతారామన్ ట్రేడ్ యూనియన్‌లు, విద్య మరియు ఆరోగ్య రంగం, ఉపాధి మరియు నైపుణ్యాలు,ఎంఎస్ఎమ్ఈ, వాణిజ్యం,సేవలు, పరిశ్రమలు, ఆర్థికవేత్తలు, ఆర్థిక రంగం, క్యాపిటల్ మార్కెట్‌ల ప్రతినిధులతో పాటు మౌలిక సదుపాయాలు, ఇంధనం, పట్టణ రంగాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సమావేశాల సందర్భంగా.. ఆర్థికవేత్తలు మూలధన వ్యయాన్ని పెంచడం, ద్రవ్య లోటును తగ్గించడం వంటి అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించారు. రానున్న బడ్జెట్‌లో ఉపాధి కల్పనతో పాటు ఆర్థిక లోటును తగ్గించడంపై దృష్టి సారించాలని ఆర్థికవేత్తల బృందం మంత్రిత్వ శాఖకు సూచించింది. రానున్న బడ్జెట్‌లో ప్రభుత్వం మూలధన వ్యయాన్ని పెంచాలని పరిశ్రమల సంఘం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సూచించింది. మూలధన వ్యయాన్ని పెంచాల్సిన అవసరాన్ని ఆర్థికవేత్తలు కూడా నొక్కి చెప్పారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలని రైతు సంఘాలు ఆర్థిక మంత్రిని కోరాయి. నైపుణ్యం మరియు ఉపాధి రంగాలకు చెందిన ప్రతినిధులు శ్రామిక శక్తిని మెరుగైన వినియోగానికి యువతకు నైపుణ్యాలను అందించడానికి మార్గాలను సూచించారు. ఈ ఏడాది వర్షాకాల సమావేశాల్లో ఆగస్టు 12 వరకు 19 సమావేశాలు జరగనున్నాయి. మోడీ ప్రభుత్వం ఆరు బిల్లులను ప్రవేశపెడుతుంది. వీటిలో ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం, జమ్మూ కాశ్మీర్ బడ్జెట్‌కు పార్లమెంటు ఆమోదం ప్రధానమైనవి. జూలై 23న బడ్జెట్‌ ప్రకటన అనంతరం ప్రభుత్వం ఆర్థిక బిల్లును కూడా ప్రవేశపెట్టనుంది. ఇతర బిల్లుల్లో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్, ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ లెజిస్లేషన్ 2024, బాయిలర్ బిల్లు, కాఫీ (ప్రమోషన్ అండ్ డెవలప్‌మెంట్) బిల్లు మరియు రబ్బర్ (ప్రమోషన్ అండ్ డెవలప్‌మెంట్) బిల్లు ఈ ఏడాది వర్షాకాల సెషన్‌లో ప్రవేశపెట్టబడతారు.

 

మోడీ సర్కార్ ఎక్కువ కాలం ఉండదు, త్వరలో పడిపోతుంది..
బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో ఈ రోజు ‘ ధర్మతల ర్యాలీ’ని నిర్వహించారు. కోల్‌కతాలో జరిగిన ఈ ర్యాలీలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. మతం పేరిట దేశాన్ని విభజించేందుకు కుట్రలు పన్నుతున్న శక్తులు తాత్కిలికంగా విజయం సాధించవచ్చు కానీ, అంతిమంగా ఓడిపోతాయని అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు బీజేపీని ఓడించారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వారు చుట్టం చూపుగానే ఉంటారని, కేంద్రంలోని ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని, త్వరలోనే పడిపోతుందని జోక్యం చెప్పారు. బెంగాల్ ప్రజలు బీజేపీతో పోరాడారని, ఉత్తర్ ప్రదేశ్‌లో కూడా ఇదే జరిగిందని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వంలో కూర్చున్న వ్యక్తులు కొద్ది రోజులు మాత్రమే అధికారంలో ఉంటారని, వారిడి నడిచే సర్కార్ కాదని, పడిపోయే సర్కార్ అని ఆయన చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ కనబరిచిన ఫలితాలను సీఎం మమతా బెనర్జీ ప్రశంసించారు. యూపీలో మీరు ఆడిన ఆట బీజేపీ ప్రభుత్వాన్ని బలవంతంగా రాజీనామా చేయాల్సి ఉంది, కానీ సిగ్గులేని ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను, ఇతర మార్గాలను దుర్వినియోగం చేస్తూ అధికారంలో కొనసాగుతోందని మండిపడ్డారు. ర్యాలీకి హాజరైన అఖిలేష్ యాదవ్‌కు మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రంపై అఖిలేష్ చేసిన వ్యాఖ్యలకు మమతా మద్దతు ఇచ్చారు. కేంద్రంలోని ప్రభుత్వం బెదిరింపుల ద్వారా ఏర్పడిందని, అది ఎక్కువ కాలం నిలవదని అన్నారు. బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పారని టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అన్నారు. 400 సీట్లు దాటుతామని చెప్పినప్పటికీ 240కే వారు పరిమితమయ్యారని బీజేపీని ఎద్దేవా చేశారు. టీఎంసీకి వ్యతిరేకంగా ఈడీ, సీబీఐని ప్రయోగించినా విజయం సాధించలేకపోయారని అన్నారు. సందేశ్ ఖాలీ నాటకంతో బెంగాల్ పరువు తీయాలని చూశారని మండిపడ్డారు.

 

బంగ్లాదేశీయులకు ఆశ్రయం ఇస్తా.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్య..
ఓ వైపు భారత సైన్యం బంగ్లాదేశీ చొరబాటు దారులను అడ్డుకునేందుకు కృషి చేస్తుంది. మరోపైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బంగ్లాదేశీయులకు ఆశ్రయం కల్పిస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. శరనార్థులు బెంగాల్ తలపులు కొడితే సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ వ్యాఖ్యానించారు. శరణార్థులపై ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని ప్రస్తావిస్తూ..ఈ హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్ హింసాకాండ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భారీ ప్రకటన చేశారు. ఆదివారం కోల్‌కతాలో అమరవీరుల దినోత్సవ ర్యాలీ సందర్భంగా విక్టోరియా హౌస్ ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో మమతా బెనర్జీ బంగ్లాదేశ్ ప్రజలకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. బంగ్లాదేశీయుల కోసం పశ్చిమ బెంగాల్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులకు సంబంధించిన విషయాలను మనం ప్రేరేపించకూడదని మమతా బెనర్జీ అన్నారు. బంగ్లాదేశీయులు మా తలుపు తడితే వారికి ఆశ్రయం ఇస్తామన్నారు. శరణార్థులపై ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని ప్రస్తావిస్తూ.. “హింసాత్మక బంగ్లాదేశ్‌లో బెంగాల్ నివాసితువుల బంధువులకు నేను పూర్తి మద్దతునిస్తాను. మీరు బెంగాల్ తలుపు తడితే, నేను మీకు సహాయం చేస్తాను.” అని ఆమె చెప్పారు. బంగ్లాదేశ్‌లో ఉన్న మీ కుటుంబ సభ్యులకు.. చదువుకోవడానికి అక్కడికి వెళ్లిన వాళ్లకుచికిత్స కోసం వెళ్లి తిరిగి రాలేని వారికి సాయం అందిస్తానన్నారు. ఆమె మాట్లాడుతూ, “నేను బంగ్లాదేశ్ గురించి మాట్లాడలేను. ఎందుకంటే అది వేరే దేశం. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. భారత ప్రభుత్వం చేతుల్లో ఉంది. కానీ నిస్సహాయ ప్రజలు బెంగాల్ తలుపు తడితే.. ఖచ్చితంగా వారికి ఆశ్రయం ఇస్తా. ఈ విషయానికి నేను కట్టుబడి ఉంటా.. ఎందుకంటే దీనిపై ఐక్యరాజ్యసమితి తీర్మానం ఉంది. ఎవరైనా శరణార్థులు ఉంటే.. పరిసర ప్రాంతం వారికి ఆశ్రయం కల్పిస్తుంది.” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

అఖిలపక్ష సమావేశంలో “కన్వర్ యాత్ర” వివాదాన్ని లేవనెత్తిన ప్రతిపక్షాలు..
ఉత్తర్ ప్రదేశ్‌లో కన్వర్ యాత్ర వివాదం దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారి తీసింది. యూపీ ముజఫర్‌నగర్ జిల్లా మీదుగా సాగే ఈ యాత్ర మార్గంలోని దుకాణదారులు, తమ పేరు కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని జిల్లా పోలీసులు ఆదేశించారు. ఇప్పుడు ఇది వివాదాస్పదమైంది. ఈ నిబంధనలు రాజ్యాంగ వ్యతిరేకమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వర్ణవివక్ష, హిట్లర్ నాజీ రూల్స్ అంటూ ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ఈ రోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలు కన్వర్ యాత్ర వివాదం, నీట్ పరీక్ష అంశాలను లేవనెత్తాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ నుంచి జేపీ నడ్డా, కిరణ్ రిజిజు హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి గౌరవ్ గొగోయ్, జైరాం రమేష్, కే సురేష్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎల్‌జేపీ (రామ్‌విలాస్) నాయకుడు చిరాగ్ పాశ్వాన్, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రామ్ గోపాల్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సంజయ్ సింగ్, ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ, ఎన్సీపీ నుంచి ప్రఫుల్ పటేల్ హాజరయ్యారు. ఈ సమావేశాంలో కన్వయ్ యాత్ర మార్గంలో తినుబండారాల యజమానులు తమ పేర్లను ప్రదర్శించాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వులను సమాజ్‌వాదీ పార్టీ, ఆప్ లేవనెత్తాయి. కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ.. లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ స్థానం ప్రతిపక్షానికి కేటాయించాలని, ఆ స్థానాన్ని ఖాళీగా ఉంచకూడదని కోరారు. జనతాదల్, ఎల్జేపీ పార్టీలు బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌ని లేవనెత్తారు. ఏపీకి కూడా ప్రత్యేక హోదా కేటాయించాలని వైఎస్సార్సీపీ కోరింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 22 నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. నీట్ పేపర్ లీక్, వరసగా రైలు ప్రమాదాలపై ప్రతిపక్షాలు బీజేపీని ఇరుకున పెట్టేందుకు అస్త్రాలను రెడీ చేసుకుంటున్నాయి.

 

నిపా వైరస్‌ సోకిన 14 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మృతి..
కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ మరోసారి కలకలం రేపుతోంది. మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడికి ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. ఆదివారం చికిత్స పొందతూ బాలుడు మరణించినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఆదివారం ఉదయం 10.50 గంటలకు బాలుడికి తీవ్రమైన గుండెపోటు వచ్చిందని, అతడిని బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు ఆమె వెల్లడించారు. ‘‘ వెంటిలేటర్‌పై బాలుడికి చికిత్స అందిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి మూత్ర విసర్జన తగ్గింది. కార్డియాక్ అరెస్ట్ తర్వాత, డాక్టర్లు అతడిని బతికించే ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాయి. 11.30 గంటలకు అతను మరణించాడు’’ అని వీణా జార్జ్ తెలిపారు. నిపా ప్రోటోకాల్ ప్రకారం అంత్యక్రియనను నిర్వహించనున్నట్లు మంత్రి చెప్పారు. బాలుడి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులతో జిల్లా కలెక్టర్ చర్చించిన తర్వాతే అంత్యక్రియలకు సంబంధించిన మరిన్ని విషయాలను నిర్ణయిస్తామని జార్జ్ తెలిపారు. గతంలో నాలుగు సార్లు రాష్ట్రాన్ని వణికించిన నిపా వ్యాధి నివారణకు ప్రత్యేక కార్యాచరణ క్యాలెండర్ రూపొందించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. 2019, 2021, 2023లో కోజికోడ్ జిల్లాలో, 2019లో ఎర్నాకులం జిల్లాలో నిపా వ్యాప్తి నమోదైంది. కోజికోడ్, వాయనాడ్, ఇడుక్కి, మలప్పురం, ఎర్నాకులం జిల్లాల్లోని గబ్బిలాలలో నిపా వైరస్ యాంటీబాడీల ఉనికిని గుర్తించారు.