NTV Telugu Site icon

Top Headlines @ 5 PM : టాప్‌ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

పది నెలల్లో 50 వేల ఉద్యోగాలిచ్చాం.. ఒక్కటి తక్కువైనా క్షమాపణ చెప్తా
వేములవాడలో ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్సే.. ఇప్పుడు మిగిలిన వాటిని పూర్తి చేసేది కూడా కాంగ్రెస్సేనని అన్నారు. కేసీఆర్‌ గడీలను కూల్చేందుకే పాదయాత్ర చేశానని తెలిపారు. కరీంనగర్ జిల్లా ఉద్యమాలకు నాయకత్వం వహించింది.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని సోనియా ఆనాడు మాట ఇచ్చారు.. కరీంనగర్ గడ్డపై ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పొన్నంని ఒక్కసారి ఎంపీగా గెలిపిస్తే తెలంగాణ వచ్చింది.. బండి సంజయ్‌ని రెండు సార్లు గెలిపిస్తే కరీంనగర్ కి పైసా అయినా తెచ్చిండా…? అని సీఎం ప్రశ్నించారు. మిడ్ మానేర్ నిర్వాసితుల పోరాటంలో పాల్గొని వారికి ఇచ్చిన హామీని ఈరోజు అమలు చేశామని ముఖ్యమంత్రి అన్నారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై దృష్టిపెట్టాం.. ఈ ప్రాంతంలో అసంపూర్తిగా ఉన్నవాటిని వెంటనే పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలనే కాదు.. వేములవాడ రాజన్నని కూడా కేసీఆర్ మోసం చేశాడని దుయ్యబట్టారు. పీసీసీ అధ్యక్షుడిగా పలుమార్లు వేములవాడ వచ్చానని సీఎం తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రూ.20 లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు చేశారు.. వేములవాడకి ఎంత ఇచ్చారు..? అని అన్నారు. వేములవాడ రాజన్న గుడికి 100 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వలేకపోయారు..? అని ప్రశ్నించారు. ఓడిపోయిన తర్వాత ఫార్మ్ హౌస్‌కి కేసీఆర్ పరిమితం అయితే.. హరీష్, కేటీఆర్‌లు మా కాళ్ళలో కర్ర పెడుతున్నారు.. అధికారం పోయాక మతిలేకుండా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ఆత్మహత్యల్లో రెండవ స్థానంలో ఉండేది రాష్ట్రం.. అప్పట్లో రుణమాఫీ చేసి ఆదుకున్నాం.. పదేండ్ల పాలనలో నువ్వు చక్కగా పాలన చేస్తే తాము 25 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సిన అవసరం వచ్చేదా? అని దుయ్యబట్టారు. కేసీఆర్ అసెంబ్లీకి రా… రుణమాఫీ లెక్కలు చెప్తామని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో 50 వేల ఉద్యోగాలిచ్చాం.. ఒక్కటి తక్కువ అయినా క్షమాపణ చెప్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మరోవైపు.. గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం.. గల్ఫ్‌లో మరణించిన వారికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. త్వరలోనే గల్ఫ్ బోర్డ్ ఏర్పాటు పనులు ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. లగచర్ల లో 11 వందల ఎకరాల భూమి మాత్రమే సేకరిస్తున్నాం.. భూమి సేకరించి వారికి మంచి పరిహారం ఇచ్చేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చామని సీఎం పేర్కొన్నారు. మరోవైపు.. కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేటీఆర్ నువ్వు ఢిల్లీకి పోయినా.. చంద్రమండలం పోయినా తప్పు చేస్తే కటకటాల్లోకి పోవుడు ఖాయమని హెచ్చరించారు. కేటీఆర్ ఊసలు లెక్క పెడతావు గుర్తు పెట్టుకో.. ఎందుకులే ఉయ్యాల ఊగి ఊగి ఆగుతుంది కదా అని అనుకున్నా అని సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.

 

 

వేములవాడలో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం..
వేములవాడలో రూ.679 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు. రూ.236 కోట్లతో మిడ్ మానేరు రిజర్వాయర్ భూ నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన.. రూ.166 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల పాస్టర్ బ్లాక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. రూ.50 కోట్లతో వేములవాడ పట్టణంలో నూలు డిపో నిర్మాణం.. రూ.47 కోట్ల 85 లక్షలతో మూల వాగు నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన.. రూ.42 కోట్లతో రుద్రంగి మండలంలో అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే.. రూ.28 కోట్లతో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు. వేములవాడ పట్టణంలో రూ.కోటి 45 లక్షలతో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనం, రూ.4 కోట్ల 80 లక్షలతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ప్రారంభోత్సవం.. రూ.3 కోట్ల 80 లక్షలతో వేములవాడ పట్టణంలో మురుగు కాల్వ పనులకు శంకుస్థాపన.. వీర్నపల్లిలో కోటి యాభై లక్షలతో పి.హెచ్.సి నిర్మాణం, మేడిపల్లిలో రూ.5 కోట్లతో జూనియర్ కళాశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా.. ఎల్లంపల్లి ప్రాజెక్టు భూ సేకరణకు రూ. 5 కోట్ల, కాళేశ్వరం ప్యాకేజీ 9 పనులకు రూ.11 కోట్ల 79 లక్షలు నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు మాట్లాడారు.
మంత్రి పొన్నం ప్రభాకర్..
భవిషత్ తరాల కోసం నిత్యాన్నదానసత్రం కోసం రూ.35 కోట్లు సీఎం మంజూరు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆనాడు కేసీఆర్ శివుడికి శఠగోపం పెట్టారని అన్నారు. వేములవాడ రాజన్నకు నిధులు ఇచ్చిన క్యాబినెట్ మంత్రులకు ధన్యవాదములు.. కేసీఆర్ రాజన్న గుడి తంతేలా మీద ఇచ్చిన మాట మర్చిపోయారు.. ముంపు గ్రామాల ప్రజలకి న్యాయం జరగాలని తాము ఇచ్చిన మాట నెరవేర్చమని మంత్రి పేర్కొన్నారు. నేతన్నల సంక్షేమమే తమకు ముఖ్యమని తెలిపారు. నేతన్నలకి యారన్ డిపో సీఎం మంజూరు చేశారు.. నిరంతరంగా పేద ప్రజలకు అన్నదానం ఉండాలని తమ ధ్యేయమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
మంత్రి శ్రీధర్ బాబు..
పీసీసీ హోదాలో రేవంత్ రెడ్డి వచ్చారు.. ఏడాది కాకముందే రేవంత్ రెడ్డి సీఎం హోదాలో నెరవేర్చారని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాబోయే నాలుగేళ్లలో మిగిలిపోయిన ప్రతి పని పూర్తి చేస్తాం.. ఆర్థిక క్రమశిక్షణతో ప్రజలకు వాగ్దానాలను చేస్తున్నాం.. సిరిసిల్ల నియోజకవర్గంకి సంబంధించిన యర్న్ డిపోను తీసుకువచ్చామని మంత్రి తెలిపారు. రైతు సోదరులు, నేతన్నలకి అండగా ఉంటాం.. ఇచ్చిన మాట తీరుస్తామన్నారు. సాగునీటి విషయంలో శ్రీ పాద ఎల్లంపల్లి కట్టింది, మిడ్ మనేరు కట్టింది తామేనని పేర్కొన్నారు. ప్రతి రైతు సాగుకి నీరు అందిస్తాం.. వేములవాడలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం డెవలప్ చేస్తుందని మంత్రి తెలిపారు.
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..
మాది చేతల ప్రభుత్వం, గత ప్రభుత్వంకి మా ప్రభుత్వం తేడా మీరే చూడాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరిట దోపిడీ జరిగింది.. ఈ ప్రాంతాల్లో పదేళ్లలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి.. ఆనాటి పాలకుల హామీలు హామీలుగానే మిగిలిపోయాయని ఆరోపించారు. కాంగ్రెస్ కు జనాలు అండగా ఉండాలని కోరారు.

 

 

శుభవార్త చెప్పిన సీఎం.. త్వరలో 16 వేల ఉద్యోగాలు..
నిరుద్యోగులకు శాసన సభ వేదికగా శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. త్వరలోనే 16 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిపై మా ఆలోచన.. ఓర్వకల్లు ను డ్రోన్ సిటీగా తయారు చేస్తాం.. లా అండ్ ఆర్డర్, ప్రజలకు అవసరమైన సేవలు టెక్నాలజీ అనుసంధానంతో చేస్తాం.. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ను తీసుకొస్తున్నాం.. సోలార్ పేనెల్స్ పెడతాం.. కరంటు ఉచితంగా ఇచ్చేలా చేస్తామన్నారు.. ఇక, ఎన్డీఏ కూటమి జాబ్‌ ఫస్ట్.. ఉద్యోగకల్పన మా విధానం అని చాలా స్పష్టంగా చెప్పాం.. అందుకే ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదట సంతకం మెగా డీఎస్సీపై పెట్టాం.. ఈ మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తాం అన్నారు. ఇంటర్వ్యూలు కూడా పిలవడానికి సిద్ధంగా ఉన్నాం.. అయితే, రాత పరీక్షకు కొంత సమయం కావాలంటే ఆ టైం ఇచ్చాం.. ఇక, ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేసి.. వీలైనంత త్వరగా 16,347 ఉగ్యోగాలు మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేయడానికి ముందుకు వెళ్తాం అన్నారు చంద్రబాబు.. ఇక, కూటమి ద్వారా ఏపీకి‌ సుపరిపాలన అందిస్తామన్నారు సీఎం చంద్రబాబు.. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి అయిన పొట్టి శ్రీరాములును మేం ప్రభుత్వం తరుఫున గౌరవిస్తాం అన్నారు.. సెంటిమెంట్ లను మేం గౌరవిస్తాం అన్నారు.. సినిమాలు తీయాలన్నా రాయలసీమలో పాత చరిత్రలే అని పేర్కొన్నారు.. బ్లేడ్ బ్యాచ్ లు ఇంకా ఉన్నాయి.. జాగ్రత్త అని చెబుతూనే.. మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదని వార్నింగ్‌ ఇచ్చారు.. అన్ని నగరాలలాగా మనం కూడా అభివృద్ధి చెందబోతున్నాం.. పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయి.. ఆదాయం పెంచడం మన కర్తవ్యం.. మన ప్రజలకు బాధ్యులం.. నాలెడ్జ్ ఎకానమీలో మన వాళ్లు అగ్రదేశంలో ఉన్నారు.. ఏపీలో అమెరికా లాంటి వాతావరణం తీసుకురావాలన్నదే తమ లక్ష్యంగా పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

 

సూపర్‌-6 హామీల విషయంలో ప్రభుత్వం ఫెయిల్‌.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
సూపర్‌-6 హామీల విషయంలో ప్రభుత్వం ఫెయిల్‌ అయిందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు అబద్ధాలు కొనసాగుతూ వస్తున్నాయన్నారు.సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ఉండటానికి మాత్రమే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. హామీలు అమలు చేయలేకనే బడ్జెట్‌ను ఆలస్యం చేశారని అన్నారు. చంద్రబాబు అనే వ్యక్తి ఎప్పటికీ మారరన్నారు. 2018-19 నాటికి ప్రభుత్వం చేసిన అప్పు రూ.3 లక్షల కోట్లు అని.. వైసీపీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి 6.46 లక్షల కోట్లు అప్పులు రాష్ట్రానికి ఉన్నాయన్నారు. వాస్తవాలు ఏమిటో చంద్రబాబు ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలు చెబుతున్నాయన్నారు. 11 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అని చంద్రబాబు రాష్ట్రం అప్పులపై అసత్యాలు చెప్పటం ధర్మమేనా అంటూ ప్రశ్నించారు. కాగ్‌ రిపోర్టుపై కూడా తప్పుడు ప్రచారం చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు. బీజేపీలో కూడా టీడీపీకి చెందిన మనుషులే ఉండి టీడీపీ అసత్యాలకు మద్దతు ఇస్తారని విమర్శలు గుప్పించారు. బడ్జెట్‌లో లెక్కలు కూడా చంద్రబాబు పెట్టారన్నారు. కాగ్ ధృవీకరించిన తర్వాత కూడా అప్పులపై మళ్ళీ మాట మారుస్తున్నారన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన డాక్యుమెంట్స్ పై మాట మార్చటం చంద్రబాబు మాత్రమే చేస్తున్నారని మండిపడ్డారు. బొంకుల బాబు అని చంద్రబాబును ఎందుకు అనకూడదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు 2019లో దిగిపోయే ముందు సుమారు 42 వేల కోట్ల బకాయి పెట్టారన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని మించి చంద్రబాబు రూ.28,457 కోట్లు అధిక అప్పులు చేశారని.. వైసీపీ హయాంలో రూ1647 కోట్లు మాత్రమే ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని మించి అప్పులు చేశామన్నారు. ఎవరు ఆర్థిక విద్వంసం చేశారో అర్థం అవుతోందన్నారు. రెండేళ్లు కొవిడ్ వల్ల ఇబ్బందులు పడినా కూడా పరిపాలన మాత్రం గాడి తప్పలేదన్నారు. చంద్రబాబు హయాంలో కంటే మా హయంలో 4 శాతం అప్పులు తగ్గాయన్నారు. ఎవరు ఆర్థిక విధ్వంసకారులు అనేది ఈ లెక్కలు చెబుతాయన్నారు.

 

సైబరాబాద్‌లో బిగ్ స్కాం.. రూ.300 కోట్లతో బోర్డు తిప్పేసిన సంస్థ
సైబరాబాద్ పరిధిలో భారీ స్కాం వెలుగుచూసింది. రూ.300 కోట్లు కొల్లగొట్టి బోర్డు తిప్పేసింది ఓ సంస్థ. కూకట్‌పల్లి కేంద్రంగా 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ పేరుతో బడా మోసానికి పాల్పడింది. ఈ మోసంలో 3600 మంది బాధితులు చిక్కుకుపోయారు. తమ కంపెనీలో 8 లక్షల 8 వేల రూపాయలు కనీస పెట్టుబడిగా పెట్టి.. రెండు గుంటల స్థలాన్ని కొనుగోలు చేస్తే, 25 నెలల పాటు ప్రతి నెలా 4 శాతం చొప్పున అంటే నెలకు రూ.32 వేలు చెల్లిస్తామని జోరుగా ప్రచారం చేశారు. అంతేకాకుండా.. ఈ స్కీమ్‌లో మరెవరినైనా చేర్పించినా వారికి 25 నెలల పాటు ప్రతి నెలా రూ.7200 చొప్పున చెల్లిస్తామని ఆశ చూపింది 12 వెల్త్ సంస్థ. ఇదేగాక.. డబుల్‌ గోల్డ్‌ స్కీమ్‌లో కనీసం రూ.4 లక్షలు పెట్టుబడి పెడితే 12 నెలల తరువాత రూ.8 లక్షల విలువ చేసే స్విట్జర్లాండ్‌ గోల్డ్‌ బిస్కెట్ ఇస్తామని ట్రాప్ చేశారు. అంతేకాకుండా.. గోల్డ్‌ చిట్‌ స్కీమ్‌ పేరుతో మరో వల వేశారు. 5 లక్షల రూపాయలను 20 నెలల పాటు పెట్టుబడిగా పెడితే 19 నెలల పాటు నెలకు 15 వేల చొప్పున ప్రతి నెలా చెల్లిస్తామని.. 20వ నెల మరో 15 వేలు అదనంగా చెల్లిస్తామని నమ్మించారు కేటుగాళ్లు. ఈ క్రమంలో 3600 మంది బాధితులు పెట్టుబడి పెట్టి మోసపోయారు. తాము మోసపోయామని తెలుసుకుని సైబరాబాద్ EOW పోలీసులను ఆశ్రయించారు బాధితులు. ఈ క్రమంలో.. 12 వెల్త్‌ క్యాపిటల్‌ సర్వీసెస్‌ ప్రై.లి. ఎండీ కలిదిండి పవన్‌ కుమార్‌ సహా మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. 12 వెల్త్ అనుచరులు కొందరు అరాచకాలకు దిగారు. పోలీసులను ఆశ్రయించిన బాధితులను భయాందోళనకు గురి చేస్తూ అరాచకాలు చేశారు. కంప్లైంట్ చేస్తే డబ్బులు ఇవ్వమంటూ బెదిరించారు. ప్రస్తుతం వల్లభనేని రవికుమార్ చౌదరి, కాకర్ల గిరిబాబు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 

 

మహిళలపై అఘాయిత్యాలు.. సీఎం సీరియస్‌ వార్నింగ్‌

ఆంధ్రప్రదేశ్‌లో చిన్నారులు, బాలికలు, యువతులు, మహిళలు.. ఇలా తేడా లేకుండా వరుసగా అఘాయిత్యాలు వెలుగు చూశాయి.. అయితే, మహిళలపై అత్యాచార ఘటనలపై సీరియస్‌గా స్పందించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మహిళలపై అత్యాచార ఘటనలపై సహించేది లేదని హెచ్చరించారు.. పిల్లల తప్పు కూడా ఉండదు… మనమే మానసికంగా సరిదిద్దాలని సూచించారు.. అయితే, ఎవరైనా కరుడుగట్టిన నేరస్తులు ఉంటే చర్యలుంటాయి.. కరుడుగట్టిన నేరస్తులు ఉంటే వాళ్ల తాటతీస్తామని వార్నింగ్‌ ఇచ్చారు.. ఇక, అరవై శాతం భూ ఆక్రమణల పైనే తమకు ఫిర్యాదు వచ్చాయన్నారు సీఎం.. గ్రామాలలో రెవెన్యూ ఇబ్బందులపై ప్రత్యేక పరిష్కార మార్గాలు చూస్తాం అన్నారు.. విదేశీ మద్యం, స్టాండర్డ్ బ్రాండ్లు తీసుకొచ్చాం.. షాపు లైసెన్సులు రద్దు చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఇక, ఎమ్మెల్యేలు కూడా తన మన లేకుండా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు చంద్రబాబు.. 25 ఏళ్ల తాకట్టు పెట్టి మద్యం పైన అప్పులు తెచ్చారు.. ఇసుక రవాణా విషయంలో ఎవరైనా అడ్డు పడితే పిడి యాక్టు పెడతాం అని హెచ్చరించారు.. ఉచిత ఇసుక అమలు సరిగా జరగడానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.. దీపం – 2 పధకం అమలు పూర్తిస్ధాయిలో జరుగుతుంది. అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.. ఉద్యోగాల కల్పన ప్రధాన ఉద్దేశంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది.. 3,73,539 మందికి ఉద్యోగకల్పన ధ్యేయంగా పని చేస్తున్నాం.. ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చే కంపెనీలకు ఇన్సెంటివ్ ఎక్కువ ఇస్తాం అని ప్రకటించారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పైన మా ఆలోచన.. ఓర్వకల్లును డ్రోన్ సిటీగా తయారు చేస్తాం.. లా అండ్ ఆర్డర్, ప్రజలకు అవసరమైన సేవలు, టెక్నాలజీ అనుసంధానంతో చేస్తాం.. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ను తీసుకొస్తున్నాం.. సోలార్ పేనెల్స్ పెడతాం.. కరంటు ఉచితంగా ఇచ్చేలా చేస్తాం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

 

 

ఆర్జీవీకి మళ్లీ పోలీసుల నోటీసు.. 25న విచారణకు రండి..
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మకు మరోసారి నోటీసులు జారీ చేశారు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఈ నెల 25వ తేదీన ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణ కి హాజరుకావాల్సింది ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ నోటీసులు పంపించారు.. దర్శకుడు రాంగోపాల్ వర్మ వాట్సప్ నంబర్‌కు సంబంధిత నోటీసు పంపించారు సీఐ శ్రీకాంత్. కాగా, ముందుగా జారీ చేసిన నోటీసు ప్రకారం మంగళవారం (ఈ నెల 19వ తేదీన) విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. వారం రోజులు గడువు కోరారు రాంగోపాల్ వర్మ.. ఈ మేరకు నిన్న ఉదయం సీఐకి వాట్సాప్‌ మెసేజ్‌ పెట్టిన విషయం విదితమే.. ఇక, ఆ తర్వాత వర్మ తరఫు న్యాయవాదులు కూడా వచ్చి ఒంగోలు రూరల్‌ పోలీసులకు ఈ సమాచారాన్ని ఇచ్చారు.. అయితే, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి (ట్విట్టర్‌) ఎక్స్ లో పోస్ట్ చేసిన కేసులో రాంగోపాల్‌ వర్మ విచారణ ఎదుర్కొంటోన్న విషయం విదితమే.. అయితే, రాంగోపాల్ వర్మ తనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.. ఇక, ఆర్జీవీ పిటిషన్‌పై సోమవారం రోజు విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ వర్మ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది.. అరెస్ట్‌పై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని స్పష్టం చేసింది.. మంగళవారం విచారణ హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారని పిటిషన్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. హాజరు అయ్యేందుకు మరి కొంత సమయాన్ని ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని వర్మ తరపు న్యాయవాది అభ్యర్థించారు.. ఇక, సమయం పొడిగించాలనే అభ్యర్థనను పోలీసులు ముందు చేసుకోవాలని సూచించింది హైకోర్టు.. ఇటువంటి అభ్యర్థన కోర్టు ముందు కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.. అయితే, నిన్న విచారణకు డుమ్మా కొట్టిన ఆర్జీవీ.. మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.. ఒంగోలు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.. ఆర్జీవీ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది..

 

బందీలను తీసుకురండి, రూ.37.5 కోట్లు పట్టుకెళ్లండి.. నెతన్యాహూ సూపర్ డీల్..
ఇజ్రాయిల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది దాటింది. అక్టోబర్ 07 నాటి హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయిల్ గాజాలోని హమాస్‌పై విరుచుకుపడుతోంది. హమాస్ కీలక నేతల్ని ఒక్కొక్కరిగా మట్టుపెడుతోంది. ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మంగళవారం పాలస్తీనా ప్రాంతమైన గాజాలో పర్యటించారు. గాజా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆ ప్రాంతానికి నెతన్యాహూ వెల్లడం ఇదే మొదటిసారి. అక్టోబర్ 07 నాటి దాడుల సమయంలో హమాస్ మిలిటెంట్లు 240కి పైగా ఇజ్రాయిలీలను బందీలుగా పట్టుకుని గాజాలోకి వెళ్లారు. అయితే, గతేడాది నవంబర్‌లో సంధి ఒప్పందంలో భాగంగా కొందరిని విడిచిపెట్టారు. అయితే, ఇప్పటికీ 101 మంది ఇజ్రాయిలీ బందీల ఆచూకీ లభించడం లేదు. తాజాగా నెతన్యాహూ తన పర్యటనలో మాట్లాడుతూ… హమాస్ సైనిక సామర్థ్యాన్ని తమ దేశ సైన్యం నాశనం చేసిందని, ఇకపై హమాస్ గాజాను పాలించబోదని అన్నారు. మా బందీలకు హాని చేయాలని చూస్తే మేము వాళ్లను వెండించి హతమారుస్తామని అన్నారు. గాజాలోని ఇప్పటీకి 101 మంది బందీలను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రతీ ఒక్క బందీని సురక్షితంగా తమకు అప్పగిస్తే వారికి 5 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 37.5 కోట్లు) బహుమతిని ప్రకటించారు. ‘‘మా బందీలను హాని చేయడానికి ఎవరైనా ధైర్యం చేస్తే వారి తలపై రక్తం ఉంటుంది. మేము మిమ్మల్ని వేటాడి పట్టుకుంటాము. ఎవరు బందీలను తీసుకువస్తే అతను మరియు అతని కుటుంబం బయటపడటానికి సురక్షితమైన మార్గాన్ని కల్పిస్తాం. తేల్చుకోండి , ఛాయిస్ మీదే.’’ అని బంపర్ ఆఫర్ ప్రకటించారు.

 

తమిళ సెలబ్రిటీల వరుస విడాకులు.. ఎందుకంటే?
నిన్న రాత్రి ఎవరూ ఊహించని విధంగా రెహమాన్ భార్య తను తన భర్త రెహమాన్ నుంచి విడిపోతున్నాను అంటూ తన లాయర్ చేత ఒక ప్రకటన ఇప్పించింది. ఒక్కసారిగా వచ్చిన ఈ ప్రకటన గురించి ఒకటే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తమిళ సినీ పరిశ్రమలో ఈ విడాకుల కల్చర్ బాగా పెరిగిపోయిందని అంటున్నారు. సుమారు ఏడాది వ్యవధిలో దాదాపు మూడు నాలుగు జంటలు విడాకుల బాట పడ్డాయి. ముఖ్యంగా ఈ ఏడాది ముగ్గురు సెలబ్రిటీలు ఎవరు ఊహించని విధంగా విడాకుల ప్రకటనలు చేశారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సంగీత దర్శకుడు నటుడు జీవి ప్రకాష్ కుమార్ గురించి. ఆ తర్వాత నా హీరో జయం రవి గురించి ఇప్పుడు రెహమాన్ గురించి. ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన జయం రవి తన భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక జీవీ ప్రకాష్ కుమార్ కూడా తన భార్య సైంధవి నుంచి విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక వీరు కాకుండా దర్శకుడు బాలాతో పాటు మరో సంగీత దర్శకుడు ఇమ్మాన్ కూడా తన భార్య నుంచి విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించడం గమనార్హం. ధనుష్ కూడా తన భార్య సౌందర్య నుంచి విడాకులు తీసుకోబోతున్నట్లు గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తమిళ సినీ పరిశ్రమలో ఈ తరహా విడాకుల అంశాలు తెరమీదకు వస్తూ ఉండటం గమనార్హం. అయితే అక్కడే ఎందుకు ఇలా విడాకుల సంఖ్య ఎక్కువ నమోదవుతోంది అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి.

 

నయనతార వెడ్డింగ్ సీన్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఎన్ని కోట్లు చెల్లించిందో తెలుసా?
నయనతార నటించిన డాక్యుమెంటరీ చిత్రం బియాండ్ ది ఫెయిరీ టేల్ 18న నెట్‌ఫ్లిక్స్ OTTలో విడుదలైంది. అయితే ఈ డాక్యుమెంటరీలో నాను రౌడీ దాన్ అనే సినిమా ఆఫ్ స్క్రీన్ క్లిప్స్ కొన్ని వాడారని నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ట్రైలర్‌ను విడుదల చేసిన తర్వాత ధనుష్ 10 కోట్ల రూపాయల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసు పంపాడు. దీంతో ఆగ్రహించిన నయనతార మూడు పేజీల ఆవేదన వ్యక్తం చేస్తూ నివేదికను విడుదల చేసింది. ఇందులో నయనతార మాట్లాడుతూ ధనుష్ సినీ నేపథ్యం నుంచి వచ్చారని, నేను మాత్రం కష్టపడి ఈ స్థాయికి ఎదిగారని, మీరు పంపిన లీగల్ నోటీసును కూడా ఎదుర్కొంటానని చెప్పింది. నయనతారకు మద్దతుగా, ఆమె భర్త విఘ్నేష్ శివన్ ధనుష్ స్టేట్‌మెంట్‌ను షేర్ చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వాజు వాహ విడు అనే క్యాప్షన్‌తో మాట్లాడుతున్న పాత వీడియోను కూడా పంచుకున్నారు. ఆ తర్వాత ఆ వీడియోను విఘ్నేష్ శివన్ తొలగించారు. నయనతార తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన స్టేట్‌మెంట్‌ను లైక్ చేయడం ద్వారా శ్రుతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, ఐశ్వర్య రాజేష్, నస్రియా తమ మద్దతును తెలిపారు. నయన్ తార ప్రకటనపై ధనుష్ వైపు నుంచి ఎలాంటి అభ్యంతరం రాలేదు. ఈ పరిస్థితిలో ప్రేమ నుంచి పెళ్లి వరకు జీవితాన్ని చిత్రీకరిస్తూ రూపొందించిన డాక్యుమెంటరీని నయనతార 40వ పుట్టినరోజు సంధర్భంగా 18న విడుదల చేశారు. అమిత్ కృష్ణ దర్శకత్వంలో నయనతార, ఆమె తల్లి ఓమన కురియన్, సోదరుడు లెను కురియన్, భర్త విఘ్నేష్ శివన్‌తో పాటు రాధికా శరత్‌కుమార్, నాగార్జున, తాప్సీ, రానా దగ్గుబాటి, తమన్నా, విజయ్ సేతుపతి తదితరులు కూడా కనిపించారు. దాదాపు గంటా 22 నిమిషాల నిడివితో నయనతార నటించిన ఈ డాక్యుమెంటరీ పెద్దగా చర్చనీయాంశం అయితే కాలేదు. ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నా, సెకండాఫ్ మాత్రం అదిరిపోయే సన్నివేశాలతో ఉందని, ఎమోషనల్ సీన్స్ పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో పలు విమర్శలు కూడా వచ్చాయి. సినిమా విషయానికొస్తే లాభం లేకుండా ఎవరూ ఉండరు. అలాగే నయనతార కూడా. నెట్‌ఫ్లిక్స్‌లో తన డాక్యుమెంటరీని కొన్ని కోట్లకు విక్రయించినట్లు సమాచారం. నయనతార డాక్యుమెంటరీ కోసం నెట్‌ఫ్లిక్స్ రూ.25 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఇందులో అధికారిక సమాచారం లేకపోయినా నయనతార తన డాక్యుమెంటరీ కోసం రూ.20 నుంచి రూ.30 కోట్ల వరకు కొనుగోలు చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.