NTV Telugu Site icon

Top Headlines @ 5 PM : టాప్‌ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ.. బడ్జెట్‌కు ఆమోదం
ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ జరుగనుంది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కేబినెట్‌ బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. మరోవైపు.. ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. శాసనసభ్యులు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు త్వరితగతిన పూర్తి సమాచరంతో సమాధానాలు పంపాలని ఆమె అధికారులను ఆదేశించారు. బడ్జెట్ సెషన్‌లో సమన్వయ లోపం గ్యాప్ లేకుండా చూసేందుకు సీనియర్ అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని సీఎస్ తెలిపారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 25న ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తెలిపారు. తదుపరి రోజుల్లో వివిధ శాఖల డిమాండ్లపై చర్చ జరగనుంది. నోట్ ఆన్ డిమాండు మరియు రూపొందించి బడ్జెట్‌ను సిద్ధంగా ఉంచాలని, తద్వారా సభ్యులు దానిని పరిశీలించడానికి.. చర్చకు సంబంధించిన విషయాలను లేవనెత్తడానికి తగిన సమయం ఉంటుందని ఆయన అధికారులను కోరారు.

 

అడవులు, జలపాతాల వద్ద పర్యాటక అభివృద్ధికి చర్యలు చేపట్టండి.. అధికారులకు ఆదేశం
రాష్ట్రంలో అదిలాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్ వంటి జిల్లాల్లో పచ్చని, దట్టమైన అడవులు.. జలపాతాలు ఉన్నాయి. వాటిని గుర్తించి ఐటీ ఉద్యోగులు, జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించి ఆదాయాన్ని పెంచుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఆయన సచివాలయంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పర్యాటక, సాంస్కృతిక, క్రీడా, ఎన్సీసీపై బడ్జెట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. సాంస్కృతిక సారధి కళాకారులు గత ఏడు నెలలుగా ఏ విధులు నిర్వహిస్తున్నారని డిప్యూటీ సీఎం ఆరా తీశారు. కళాకారులను సమాజ అభివృద్ధికి పూర్తిగా వాడుకోవడం లేదు.. వారి సేవలు వినియోగించుకునేందుకు ఓ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో అనేక నిర్మాణాలు ప్రారంభించి మధ్యలో వదిలేసింది.. ఫలితంగా వందలాది కోట్ల రూపాయల ప్రజాధనం నిరుపయోగమైంది.. గతంలో ప్రారంభించి 90 శాతం పూర్తి చేసిన భవనాలను గుర్తించి నిర్మాణాలు పూర్తి చేయండి, మిగిలిన భవనాలు దశలవారీగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో క్రీడా మైదానాలు ఉన్నాయి.. వాటిని నిరుపయోగంగా ఉంచడం మూలంగా ఆక్రమణలు జరుగుతున్నాయి.. అధికారులు వెంటనే స్పందించి.. నిత్యం క్రీడలు నిర్వహించి… మైదానాలను ఉపయోగించుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని రెసిడెన్షియల్ విద్యార్థులకు క్రీడా మైదానాల్లో క్రీడలు నిర్వహించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. కొన్నిచోట్ల క్రీడా మైదానాలు ఆక్రమణలకు గురైనట్టుగా సమాచారం ఉంది.. వెంటనే ఆ విషయాలపై దృష్టి సారించి ఆక్రమణ దారులను ఖాళీ చేయించండి.. ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. ఏడాది మొత్తంగా ప్రభుత్వ క్రీడా మైదానాల్లో యాక్టివిటీ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. పర్యాటక శాఖ సొంత ఆస్తులు, లీజ్లో ఉన్న ఆస్తుల వివరాలపై ఒక సమగ్ర నివేదిక ప్రభుత్వానికి సమర్పించాలని సంబంధిత అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, అడవులను పర్యాటక సాంస్కృతిక శాఖలు పెద్ద సంఖ్యలో వినియోగించుకుని ఆదాయం పెంచుకోవాలని సూచించారు. కల్చర్ అంటే ఆటలు, పాటలు అనుకుంటున్నారు.. కానీ కల్చర్ అంటే జీవన విధానం అని చాలా మందికి తెలియదని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కళాకారులు ప్రజల జీవన విధానంలో మెరుగైన మార్పులు తెచ్చేందుకు.. తీసుకునే ఆహారం, వేసుకునే దుస్తులు ఇలా అన్ని అంశాల పైన గ్రామీణ ప్రజానీకాన్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న చెక్ పోస్టులను పూర్తిస్థాయిలో ఆధునికీకరించేందుకు సమగ్ర ప్రణాళికలు చేయాలని అధికారులను మంత్రి జూపల్లి ఆదేశించారు. రాష్ట్రంలో సంస్కృతి, వారసత్వ సంపదలు ఘనంగా ఉన్నా.. ఆ మేరకు వాటిని వినియోగించుకుని పూర్తిస్థాయిలో ఫలితాలు సాధించలేకపోతున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షించేందుకు దృష్టి సారించాలని మంత్రి జూపల్లి ఆదేశించారు.

 

తెలంగాణలోని పది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పది జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. భద్రాది కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ ఐఎండీ అలెర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా.. ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఆ పది జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు.. హైదరాబాద్తో పాటు పరిసర జిల్లాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా.. ఈరోజు సాయంత్రం లోపు అల్పపీడనం తీరం దాటనున్నది. ఈ క్రమంలో.. రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా వరంగల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. మరోవైపు.. ఉత్తర తెలంగాణలో ఈ నెల 20 , 21వ తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రభుత్వం అధికారులను అలర్ట్ చేసింది. ఆయా జిల్లాల కలెక్టర్లు అలర్ట్గా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. నిన్న (శుక్రవారం) రాత్రి కలెక్టర్లు, జిల్లాల ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు.

 

కొత్త పథకాన్ని ప్రారంభించిన రేవంత్ సర్కార్.. లక్ష రూపాయల ఆర్థిక సహాయం
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించింది. దీనికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. అదే రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం. ఈ పథకాన్ని రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ప్రిలిమ్స్‌కు ఎంపికైన అభ్యర్థుల కోసం ఉద్దేశించి ప్రారంభించినట్లు తెలిపారు. వీరికి ఆర్థిక సాయం అందించేందుకు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టామని వెల్లడించారు. దీంతో ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభ్యహస్తం’ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద లబ్ధి పొందాలనుకునే అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు, కుటుంబ వార్షిక ఆదాయం, ఇతర మార్గదర్శకాలు, నిబంధనలను కూడా రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు ప్రభుత్వం జారీ చేసింది. లబ్ధి పొందాలనుకునే వారు బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (EWS) జనరల్ కేటగిరీలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. వారి కుటుంబ వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల రూపాయల లోపు ఉండాలి. కేంద్ర, రాష్ట్ర మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు కాదు. అలాగే- గతంలో ఈ పథకం నుంచి ఎలాంటి ప్రయోజనం పొంది ఉండకూడదు. అభ్యర్థులు తమ పౌర ప్రయత్నంలో ఒక్కసారి మాత్రమే ఈ ఆర్థిక ప్రోత్సాహకాన్ని పొందవచ్చు. దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలకు హాజరయ్యే వారి సంఖ్య దాదాపు 14 లక్షలు. సింగరేణి కాలరీస్ అంచనా ప్రకారం తెలంగాణ నుంచి ఏటా 50 వేల మంది సివిల్ ప్రిలిమినరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తున్న వారి సంఖ్య 400 నుంచి 500 వరకు ఉంటుంది.

 

టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ.. ప్రధాన అజెండా ఇదే..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తిన అంశాలపై చర్చ చేపట్టారు. ఏపీకి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. మంత్రుల నుంచి వివిధ శాఖలకు చెందిన సమాచారాన్ని తీసుకుని కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సీఎం చంద్రబాబు ఎంపీలకు సూచించారు. అవసరాన్ని బట్టి రాష్ట్ర మంత్రులను వెంట పెట్టుకుని ఆయా శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను కలవాలని చంద్రబాబు సూచనలు చేశారు. ఏపీ అభివృద్ధే ప్రధాన అజెండాగా ఎంపీలు పోటీ పడి పని చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు, వివిధ కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి మరింత ప్రయోజనం పొందేందుకు చేయాల్సిన కృషిపై సీఎం సూచనలు చేశారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేంద్ర సాయం వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఢిల్లీలో జగన్ ధర్నా చేయనున్నారన్న అంశంపై భేటీలో ప్రస్తావించారు. జగన్ గురించి, వైసీపీ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదని పలువురు ఎంపీలు పేర్కొన్నట్లు సమాచారం. జగన్ గురించి ఒక్క క్షణం ఆలోచించే సమయాన్ని రాష్ట్రాభివృద్ధి కోసం వెచ్చించాలని ఓ మంత్రి సూచించారు. ఢిల్లీలో జగనేం చేస్తాడో ముఖ్యం కాదని.. మనమేం చేయాలనేదే ముఖ్యమని ఏపీ సీఎం చంద్రబాబు ఎంపీలతో చర్చించినట్లు తెలిసింది.

 

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. ఎంపీలకు జగన్‌ దిశానిర్దేశం
వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది.. ఎంపీలతో 40 నిమిషాల పాటు భేటీ అయిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. వారికి వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో తీవ్ర వైఫల్యం చెందిందని విమర్శించిన ఆయన.. వైసీపీ నాయకులు, కార్యకర్తల మీద దారుణంగా దాడులు జరగుతున్నాయి. నుకొండలో జరిగిన హత్యా ఘటన పరాకాష్ట. వీడియో దృశ్యాలు చూస్తే.. ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా జరుగుతున్నాయన్నారు. ప్రజలందరూ చూస్తుండగా, నడిరోడ్డుమీద కత్తితో జరిగిన దాడి అత్యంత అమానుషం.. రాజకీయ ప్రత్యర్థులకు, వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు ఒక మెసేజ్‌ పంపడానికి చేసిన ప్రయత్నం ఇది. రషీద్‌.. వైన్‌షాపులో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. జరిగిన ఘటనను వక్రీకరించడానికి ప్రభుత్వం నానా ప్రయత్నాలు చేస్తోందని.. ఏదో బైక్‌ కాల్చిన ఘటనకు, జరిగిన దారుణహత్యకు ముడిపెట్టే ప్రయత్నంచేస్తున్నారని మండిపడ్డారు.. మా కొడుకు ఏం తప్పుచేశాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. జగన్‌ ఉంటే.. మంచి జరుగుతుందని నమ్మడం మా తప్పు అవుతుందా? అని వాళ్లు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ఇక, కొత్త ఎస్పీ వచ్చిన రెండు మూడురోజుల్లో ఘటనలు జరిగాయి. దీనికి ముందు ఉన్న ఎస్పీ మల్లికాగార్గ్‌ను ఉద్దేశపూర్వకంగా బదిలీచేశారు. ఇప్పటివరకూ 36 మంది రాజకీయ హత్యలకు గురయ్యారు.. వేయికిపైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయి. హత్యలు, దాడులు చేయడానికి టీడీపీ వాళ్లకి లైసెన్స్‌ ఇచ్చినట్టుగా ఉంది అని మండిపడ్డారు వైఎస్‌ జగన్.. స్థానిక ఎమ్మెల్యేతో హంతకుడి ఫొటోలనుకూడా తల్లిదండ్రులు చూపారు. తన సొంత పార్లమెంటు నియోజకవర్గంలో, తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడులు చేశారు.. టీడీపీ మనుషులను అక్కడ కావాలని ఉంచేలా పోలీసులతో ప్లాన్‌చేసి దాడులు చేశారు. మాజీ ఎంపీ రెడ్డప్ప, న్యాయవాది అయిన రెడ్డప్ప ఇంటికి వెళ్తే దాడులు చేశారు. తప్పులు వారు చేసి తిరిగి మన పార్టీ వాళ్లమీద కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, రాష్ట్రంలో హత్యలు, దాడులు, ఇతర హింసాత్మక ఘటనలపై పార్లమెంటులో గళమెత్తాలి.. 15 సంవత్సరాలుగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రస్థానంలో ఉంది.. చంద్రబాబు ఆశించినట్టుగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని అణగదొక్కలేరన్నారు.. జరుగుతున్న ఘటనలు ప్రజల్లో మరింత ఆగ్రహానికి దారితీస్తున్నాయి. రాష్ట్రపతి పాలనకు డిమండ్‌ చేయాలని సూచించారు. పోరాటం చేయకపోతే దారుణాలకు అడ్డుకట్ట పడదన్న ఆయన.. రేపు అసెంబ్లీ సమావేశాల్లో నిరస తెలుపుతాం.. మంగళవారం నాటికి ఢిల్లీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమైన నాయకులు వస్తారు.. బుధవారం నాడు నిరసన తెలుపుతాం అన్నారు వైఎస్‌ జగన్‌.

 

శ్రీశైలం దిశగా కృష్ణమ్మ పరుగులు.. భారీగా పెరిగిన వరద ప్రవాహం
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు జలాశయాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. గతవారం రోజులుగా కురుస్తోన్న వర్షాలకు కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణ్‌పూర్‌ జలాశయాలు నిండిపోయాయి. దీంతో నీటిని విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి జలాశయానికి వచ్చిన నీటి వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్‌ జలాశయానికి లక్షకు పైగా క్యూసెక్కుల వరద వస్తుండగా.. జూరాల వైపు 80 వేల క్యూసెక్కులకు పైగా ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు. జూరాలకు ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకుని ఆ నీటిని దిగువకు విడుదల చేస్తన్నారు. జూరాల నుంచి శ్రీశైలం దిశగా వరద సాగుతోంది. జూరాల సామర్థ్యం 9.6 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7 టీఎంసీలగా పైగా నీరు ఉంది. ఎగువ నుంచి ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో జూరాల నుంచి కిందికి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల జలాశయం నుంచి వరద నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా పెరిగింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి జూరాల ప్రాజెక్టు నుంచి 82,398 క్యూసెక్కులు వరద నీరు వచ్చి చేరుతుండగా.. ఔట్‌ఫ్లో నిల్‌గా ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 813 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 36.08 టీఎంసీలుగా ఉంది. రాబోయే రెండు రోజుల్లో శ్రీశైలం జలాశయంలో భారీ స్థాయిలో నీటి నిల్వ పెరిగే అవకాశం ఉంది.

 

ఏపీలో భారీ వర్షాలు.. విద్యుత్‌ శాఖ అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమీక్ష నిర్వహించారు. ఏపీఈపీడీసీఎల్ అధికారులతో వర్చువల్‌గా మంత్రి సమీక్షించారు. అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున్న అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. వర్ష ప్రభావిత జిల్లాల అధికారులతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. విద్యుత్ స్థంభాలు, చెట్లు నెలకొరిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రాంరంభించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచనలు చేశారు. లంక గ్రామాల ప్రజలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి పేర్కొన్నారు. వర్షాలు, వరదలతో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో వరదలో చిక్కుకున్న ఏలూరు జిల్లా మాదేపల్లి గ్రామస్థులను సురక్షత ప్రాంతానికి అధికారులు తరలించారు.

నీట్ యూజీ ఫలితాలు విడుదల
NEET UG 2024 పరీక్ష ఫలితాలు ప్రకటించారు. ఫలితాలను ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు exam.nta.ac.in/NEET/ , neet.ntaonline.in అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించి వారి అప్లికేషన్ నంబర్ ద్వారా స్కోర్‌కార్డ్‌ను తనిఖీ చేసుకోవచ్చు. నీట్ యూజీ కేసు సుప్రీంకోర్టుకు వెళ్లడం, అభ్యర్థులందరి ఫలితాలు మళ్లీ విడుదల కావడం ఇదే తొలిసారి. మే 5న జరిగిన నీట్ యూజీ పరీక్ష ఫలితాలు ముందుగా జూన్ 4న విడుదలయ్యాయి. మొత్తం 67 మంది టాపర్‌లను ప్రకటించగా, అభ్యర్థులు పరీక్షలో అవకతవకలు, పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఈరోజు NTA పరీక్షా నగరం, కేంద్రాల వారీగా NEET UG ఫలితాలను ప్రకటించింది. పరీక్షకు హాజరైన 23 లక్షల మందికి పైగా అభ్యర్థుల ఫలితాలను ప్రకటించారు. ఇప్పుడు దీని ఆధారంగానే నీట్ కేసులో తదుపరి విచారణను సుప్రీంకోర్టు నిర్వహించనుంది.
ఇలా NEET UG 2024 ఫలితాలు చెక్ చేసుకోండి.
* NTA neet.ntaonline.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
* NEET UG 2024 ఫలితాల లింక్‌పై ఇక్కడ క్లిక్ చేయండి.
* ఫలితం మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
* ఇప్పుడు రోల్ నంబర్ సహాయంతో చెక్ చేయండి.
* NEET UG ఫలితం 2024 లింక్ అభ్యర్థులు ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా స్కోర్‌కార్డ్‌ని తనిఖీ చేయవచ్చు.

 

 

కన్వర్ యాత్రపై సోనూసూద్ పోస్ట్.. ‘‘హలాల్’’తో రిప్లై ఇచ్చిన కంగనా రనౌత్..
ఉత్తర్ ప్రదేశ్‌లో ‘కన్వర్ యాత్ర’కి పోలీసులు పెట్టిన రూల్స్‌పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఈ నిబంధనలపై విరుచుకుపడుతున్నాయి. ముజఫర్ నగర్ జిల్లా నుంచి సాగే ఈ యాత్రా మార్గంలో షాపులు, హోటళ్లు ఇతర దుకాణాల యజమానులు వారి పేర్లను ప్రదర్శించాలని పోలీసులు చెప్పారు. ఇప్పుడు ఇదే వివాదాస్పదమైంది. ప్రియాంకాగాంధీ ఈ రూల్స్‌ని రాజ్యాంగపై దాడిగా అభివర్ణించారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వీటిని దక్షిణాఫ్రికా ‘వర్ణవివక్ష’, హిట్లర్ నాజీ రూల్స్‌గా విమర్శించారు. జావెద్ అక్తర్ వంటి వారు రూల్స్‌ని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే, ఈ నిబంధనలపై యాక్టర్ సోనూ సూద్ ట్వీట్ చేశారు. షాపుల నేమ్ ప్లేట్‌పై ‘మానవత్వం’ మాత్రమే ప్రదర్శించాలని పోస్ట్ చేశారు. అయితే, దీనిపై ఎంపీ, బాలీవుడ్ యాక్టర్ కంగనా రనౌత్ స్పందించారు. సోనూసూద్ వైఖరిపై స్పందించిన కంగనా ‘‘ అంగీకరిస్తున్నాను. హలాల్ స్థానంలో ‘మానవత్వం’ ’’ అని ట్వీట్ చేశారు. అంతకుముందు బాలీవుడ్ పాటల రచయిత జావెద్ అక్తర్ స్పందిస్తూ.. “ముజఫర్‌నగర్ యుపి పోలీసులు సమీప భవిష్యత్తులో ఒక నిర్దిష్ట మతపరమైన ఊరేగింపు జరిగే మార్గంలో అన్ని దుకాణాలు రెస్టారెంట్లు మరియు వాహనాలు కూడా యజమాని పేరును ప్రముఖంగా మరియు స్పష్టంగా చూపించాలని ఆదేశాలు ఇచ్చారు. ఎందుకు? జర్మన్‌లో నాజీలు దుకాణాలు, ఇళ్లపై ప్రత్యేక గుర్తు ఉంచేవారు’’ అని ట్వీట్ చేశారు. శుక్రవారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. యాత్రికుల విశ్వాసం, పవిత్రతను కాపాడేందుకు కన్వర్ మార్గాల్లో ఆహారం, పానీయాలు అమ్మే దుకాణాల యజమానులు పేర్లను ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ రూల్స్‌పై ముజఫర్ నగర్ పోలీసుల స్పందిస్తూ.. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, శాంతి భద్రతల సమస్యలు ఏర్పడకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.