NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Ntv Top Hl 5pm

Ntv Top Hl 5pm

రేపు రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన..,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు రాజధాని ప్రాంతంలో పర్యటించబోతున్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ఇప్పటికే రోడ్ల పక్కనున్న ముళ్ల కంచెలు, తుమ్మ చెట్లని సీఆర్డీఏ అధికారులు తొలగిస్తున్నారు. ప్రజా ప్రతినిధుల భవనాల సముదాయం, సీడ్ యాక్సెస్ రోడ్లు, మంత్రులు, ఐఏఎస్ అధికారుల క్వార్టర్లని ఏపీ సీఎం పరిశీలించనున్నారు. ఉద్దండరాయుని పాలెంలోని రాజధాని భూమి పూజ ప్రాంతాన్ని సైతం చంద్రబాబు సందర్శించనున్నారు. అయితే, గత ప్రభుత్వం అమరావతి రాజధానిని పెద్దగా పట్టించుకోకపోవడంతో పూర్తిగా అక్కడ తుమ్మ చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. దీంతో ఏపీలో మరోసారి ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పనుల నిర్మాణాలను సీఎం హోదాలో రేపు ( గురువారం) చంద్రబాబు నాయుడు పరిశీలించబోతున్నారు. ఈ పర్యటనలోనే త్వరగా అమరావతి రాజధాని శాశ్వత నిర్మాణాలు పూర్తి చేయాలని సీఆర్డీఏ అధికారులకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.

గ్రామాల్లో తాగునీటి వనరుల కల్పన కోసం డీపీఆర్ సిద్దం చేయాలి..
కృష్ణా జిల్లాలో సాగునీటి కాల్వలు డ్రెయిన్లు నిర్వహణకు 55 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్దం చేశామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నంలో 17 కోట్ల రూపాయలతో 63 పనులకు ప్రతిపాదనలు సిద్ధం కాగా.. వర్షాకాలం వచ్చినా సాగునీటి కాల్వల నిర్వహణ చేపట్టకపోవడంపై మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులను సాగునీటి కాల్వల్లో నీటి నిల్వలు గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే, గ్రామాల్లో తాగునీటి వనరుల కల్పన కోసం డీపీఆర్ సిద్దం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ సీజన్ లో రైతులకు విత్తనాలు ఎరువులు కొరత లేకుండా ముందుగానే ఇండెంట్ పెట్టాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. అలాగే, బందరు పోర్టు పనులపై కూడా గనులు, భూగర్భవనరులు,ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరా తీశారు. రూ. 5, 156 కోట్ల రూపాయలతో నాలుగు బెర్తులతో 13 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో సామర్థ్యంతో 2025కి మొదటి దశ పనులు చేపట్టేలా పనులు చేస్తున్నట్టు మంత్రికి అధికారులు తెలిపారు. బందరు కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సరఫరా మెరుగు పరచటంపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ బాధ్యత కరీంనగర్ ప్రజల బిక్ష.. బండి సంజయ్ ఎమోషనల్ కామెంట్స్
ఈ బాధ్యత కరీంనగర్ ప్రజలు పెట్టిన బిక్ష అని..సామాన్య కార్యకర్త నుంచి జాతీయ స్థాయికి ఎదిగానంటే బీజేపీ కారణమని బండి సంజయ్ అన్నారు. 152 రోజులు కుటుంబానికి దూరమై ప్రజా సంగ్రామయాత్రతో తన వెంట ఉన్నారని గుర్తుచేశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా సొంత గడ్డ కరీంనగర్ కు చేరుకున్న బండి సంజయ్ కి బీజేపీ కార్యకర్తలు బుల్డోజర్ తో అపూర్వ స్వాగతం పలికారు. బుల్డోజర్లపై నుంచి పూలు చల్లి…గజమాలతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. కరీంనగర్ గడ్డకు పాదాభివందనం చేయడం ద్వారా తనను ఎంపీగా గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. జై బీజేపీ…. జైజై నరేంద్ర మోడీ… భారతమాతాకీ జై అంటూ నినదించారు బండి సంజయ్. బండి సంజయ్ కరీంనగర్ గడ్డపై ప్రణమిల్లి సాష్టాంగ నమస్కారం చేయడంతో కరీంనగర్ ప్రజలు ఫిదా అయ్యారు. అనంతరం గీతాభవన్ చౌరస్తాకు చేరుకున్న బండి సంజయ్ కు అపూర్వ స్వాగతం దక్కింది. స్థానిక ముస్లిం నేతలు భారీ గజమాలతో స్వాగతం పలికారు. నేరుగా బండి సంజయ్ మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. కార్యకర్తల కష్టార్జితం వల్లే ఈరోజు తనకు ఈ పదవి లభించిందన్నారు. ఈ పదవి, హోదా కార్యకర్తలకు అంకితం చేస్తున్నానన్నారు. కమిట్ మెంట్ తో పని చేసే కార్యకర్తలు ఉన్నారు కాబట్టే కేంద్రం తనను గుర్తించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్రమంత్రిగా కరీంనగర్ అభివృద్ధికి పాటుపడుతానని హామీ ఇచ్చారు. ఎన్నికల వరకే రాజకీయాలు.. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అందరిని కలుపుకుని అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

వెళ్లి వివరాలు ఇవ్వచ్చుగా ఎందుకు భయం.. కేసీఆర్‌ పై కీలక వ్యాఖ్యలు
జ్యుడీషియల్ విచారణను మాజీ సీఎం కేసీఆర్‌ తప్పు పెట్టాల్సిన అవసరం ఏముందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. అధికారిని దిగిపో అనాల్సిన పనేముంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెళ్లి వివరాలు ఇవ్వచ్చుగా అన్నారు. కేసీఆర్‌ ఎందుకు అంత భయపడుతున్నారని తెలిపారు. రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని తెలిపారు. రైతు బంధు వేయరు అనే ప్రచారం చేశారు.. కానీ వేసి చూపించామన్నారు. రుణమాఫీ మిలాగా నాలుగు సార్లు చేస్తామని.. అనలేదన్నారు. అందరూ మిలాగే ఉంటారని అనుకోకండి అన్నారు. మేము చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. మేము ప్రజాస్వామ్యం నమ్మే వాళ్లుగా… విచారణకు అదేశించామన్నారు. కక్ష సాధింపు కోసం వేసిన కమిషన్ కాదన్నారు. గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా చేసిన ఆయనే విచారణ అడిగితే వేశామన్నారు. కమిషన్ ఎవరు ఉండాలని మేము వేసింది కాదు.. మాకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. మేము ఎవరం రోజు వారీ సమీక్ష చేయడం లేదన్నారు. జ్యుడీషియల్ విచారణ తప్పు పెట్టాల్సిన అవసరం ఏముందని తెలిపారు. జగదీశ్ రెడ్డి నే.. జ్యుడీషియల్ విచారణ అడిగారని తెలిపారు.

బారాముల్లా ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం..
జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. ఇటీవల కాలంలో కేంద్రపాలిత ప్రాంతంలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్న తరుణంలో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు ఈ రోజు మట్టుపెట్టాయి. బారాముల్లాలోని రఫియాబాద్ ప్రాంతంలో బుధవారం ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఎదురుకాల్పుల్లో ఒక పోలీస్ అధికారికి గాయాలయ్యాయి. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. అంతకుముందు సోమవారం బందిపొరా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఆదివారం రాత్రి బందిపోరా జిల్లాలోని ఆరగాం ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరక భద్రతాబలతగాలు కార్డర్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ సమయంలోనే ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. గత 10 రోజులుగా జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాద ఘటనలు పెరిగాయి. ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన గత ఆదివారం రోజున రియాసి జిల్లాలో శివ్ ఖోరా నుంచి ఖత్రా వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది మరణానికి కారణమయ్యారు.ఈ ఘటన జరిగిన రెండు రోజుల్లోనే కథువా, దోడా జిల్లాల్లో ఉగ్రవాద ఘటనలు జరిగాయి. కథువా జిల్లా ఎన్‌కౌంటర్ ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఆ తర్వాత నుంచి జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాదుల వ్యతిరేక ఆపరేషన్‌ని భద్రతా బలగాలు ముమ్మరం చేశాయి.

ఖలిస్తానీ టెర్రరిస్ట్ నిజ్జర్‌కి కెనడా పార్లమెంట్ నివాళి.. 1985 “ఎయిర్ ఇండియా” ఘటనను గుర్తు చేసిన భారత్..
కెనడా మరోసారి తన భారత వ్యతిరేకితను బయటపెట్టింది. ఖలిస్తానీ ఉగ్రవాదులకు సిగ్గులేకుండా మద్దతు తెలుపుతోంది. తాజాగా ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ ఉగ్రసంస్థ చీఫ్, గతేడాది చంపివేయబడిన హర్దీప్ సింగ్ నిజ్జర్‌కి పార్లమెంట్‌లో నివాళులు అర్పించింది. భారతదేశ విదుదల చేసిన 40 మంది ఉగ్రవాదుల జాబితాలో నిజ్జర్ కూడా ఉన్నాడు. నిజ్జర్ మరణించి ఏడాది గడిచిన సందర్భంగా కెనడా పార్లమెంట్ మంగళవారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో కొద్దిసేపు మౌనం పాటించింది. కెనడా చర్యలను భారత్ తీవ్రంగా పరిగణించింది. 1985 ఎయిర్ ఇండియా కనిష్క విమానంలో ఖలిస్తానీ ఉగ్రవాదులు బాంబులు పెట్టి 329 మంది మరణానికి కారణమైన ఘటనను గుర్తు చేసింది. మరణించిన వారి సంస్మరణ సభ ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు స్లాన్లీ పార్క్‌లోని సెపర్లీ ప్లే గ్రౌండ్‌లో భారత రాయబార కార్యాలయం నిర్వహించనుంది. ‘‘ఉగ్రవాదం యొక్క ముప్పును ఎదుర్కోవడంలో భారతదేశం ముందంజలో ఉంది మరియు ఈ ప్రపంచ ముప్పును ఎదుర్కోవటానికి అన్ని దేశాలతో కలిసి పని చేస్తుంది. ఎయిర్ ఇండియా కనిష్క బాంబింగ్‌లో 86 మంది పిల్లతో సహా 329 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పౌర విమానయాన చరిత్రలో అత్యంత ఘోరమైన ఉగ్రవాద సంబంధిత వాయు విపత్తులలో ఒకటిగా ఉంది. 23 జూన్ 2024 39వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది’’ అని ఇండియన్ కాన్సులేట్ ఎక్స్ లో ట్వీట్ చేసింది.

ఇండియాను వదులుతున్న మిలియనీర్లు.. ఏ దేశాలకు వెళ్తున్నారంటే..?
మిలియనీర్లు భారత్ నుంచి వలస బాట పడుతున్నారు. ఈ ఏడాది దాదాపుగా 4300 మంది మిలియనీర్లు భారత దేశాన్ని విడిచిపెడతారని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ పెట్టుబడి వలసల సలహా సంస్థ హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ ఇటీవల విడుదల చేసిన నివేదికల ఈ విషయాలను పేర్కొంది. గతేడాది ఇదే నివేదిక 5100 మంది భారత మిలియనీర్లు విదేశాలకు మకాం మార్చినట్లు చెప్పింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్.. చైనా, యూకే తర్వాత మిలియనీర్ల వలసల్లో మూడో స్థానంలో ఉంది. భారత్ నుంచి ఇలా వలస వెళ్లే వారు తమ గమ్యస్థానంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)ని ఎంచుకుుంటున్నారు. భారత్ వేలాది మిలియనీర్లను కోల్పోతుండగా, అనేక మంది యూఏఈకి వెళ్తున్నారు. అయితే, భారత్ మిలియనీర్లను కోల్పోతున్నప్పటికీ 85 శాతం వృద్ధితో దేశంలో కొత్త మిలియనీర్లు పుట్టుకొస్తున్నారు. దీంతో వలసలపై ఆందోళన తగ్గే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఇలా వెళ్తున్న ధనవంతులు భారత్‌ని తమ రెండో ఇళ్లుగా భావిస్తూనే, భారతదేశంలో వ్యాపార ప్రయోజనాలను కలిగి ఉన్నట్లు, ఇది కొనసాగుతున్న ఆర్థిక సంబంధాన్ని సూచిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

ఏపీ అడవుల బాట పట్టిన ‘స్వయంభు’
కార్తికేయ 2 సినిమాతో నిఖిల్ సిద్ధార్థ్ పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత స్పై అనే సినిమా చేశాడు కానీ అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇప్పుడు నిఖిల్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘స్వయంభు’లో దేశం గర్వించేలా చేసిన టెక్నిషియన్లు వర్క్ చేస్తున్నారు. బాహుబలి, RRR వంటి అనేక ఎపిక్ మూవీస్ కి పని చేసిన మాస్టర్ సినిమాటోగ్రాఫర్ KK సెంథిల్ కుమార్ తన మ్యాజిక్‌ మార్కు చూపించనున్నారు. ఆ మధ్య నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా నిఖిల్ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్ నిఖిల్‌ను సవ్యసాచిలా రెండు కత్తులతో, యుద్ధంలో శ్రతువులతో పోరాడుతున్న లెజండరీ వారియర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నిఖిల్ 20వ మైల్ స్టోన్ మూవీ. ఇందులో లెజెండరీ వారియర్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. క్యారెక్టర్ కోసం వెపన్స్, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి KGF, సాలార్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందించగా, M ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్. రిచ్ ప్రొడక్షన్, టెక్నికల్ స్టాండర్డ్స్‌తో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మారేడుమిల్లి అడవులలో ప్రారంభం కాబోతోంది. మారేడుమిల్లి అడుగులలో ఈ మధ్యకాలంలో చాలా పెద్ద తెలుగు సినిమాల షూటింగ్స్ జరుగుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో అక్కడ షూట్ చేయడానికి తెలుగు దర్శక నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాని కూడా అక్కడే షూట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రేపటి నుంచి కొద్ది రోజులపాటు ఈ షెడ్యూల్ అక్కడే కొనసాగనుంది.