NTV Telugu Site icon

Top Headlines @ 5PM : టాప్‌ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

తెలంగాణలో గ్రూప్-2 వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?

గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. తెలంగాణలో గ్రూప్-2 ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. డిసెంబర్కు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం కాసేపటి క్రితమే ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం.. ఆగష్టు 7, 8 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉన్నాయి. డీఎస్సీ నేపథ్యంలో గ్రూప్-2 వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా.. గతేడాది మొత్తం 783 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అయితే.. మొదటగా ఆగష్టు 9, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. కాగా.. వరుసగా గ్రూప్‌-1, 4 పరీక్షలు.. గురుకుల నియామక పరీక్షలతో పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు సమయం లేనందున గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పరీక్షలను నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. నవంబరు 3 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో.. గ్రూప్ 2 పరీక్షలను 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ కొత్త తేదీలను ప్రకటించారు. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలు నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ మరోసారి ప్రకటన చేసింది. అయితే.. రాష్ట్రంలో ప్రస్తుతం డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలు పూర్తి అయిన వెంటనే గ్రూప్- 2 పరీక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో తమకు కొంత సమయం కావాలని కొద్దిరోజులుగా నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రూప్-2ను ప్రభుత్వం వాయిదా వేసింది.

 

ఏపీలో కుంభవృష్టి.. పోలవరంలో 27 సెంటీ మీటర్ల వర్షపాతం
బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.. వాయుగుండం ప్రభావంతో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.. ఇక, బలమైన ఈదురు గాలులుతో సముద్రం అలజడిగా మారింది.. దీంతో.. కళింగపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.. వాయువ్య బంగాళాఖాతం వైపు భారీ వర్ష సూచన ఉందని పేర్కొంది అమరావతి వాతావరణ కేంద్రం.. గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.. గాలుల తీవ్రత పెరిగి 65 కిలోమీటర్ల వేగం వరకూ చేరే అవకాశం ఉందని సూచించింది.. ఉత్తరాంధ్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వద్ద ఇవాళ, రేపు అల్పపీడనం కేంద్రీకృతమై ఉంటుందని వెల్లడించింది.. ఇవాళ, రేపు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. వాయువ్య, పశ్చిమ‌మధ్య బంగాళాఖాతంలో సముద్రం తీవ్రమైన అలజడితో ఉంటుంది.. మత్స్యకారులు సముద్రం వైపు వెళ్లరాదని హెచ్చరించింది.. స్ధానిక అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది అమరావతి వాతావరణ కేంద్రం.
ఇక, ఏపీలో అత్యధిక వర్ష పాతం నమోదైన సెంటర్లను పరిశీలిస్తే..
* కుకునూరు, పోలవరంలో 27 సెంటీ మీటర్లు..
* చింతలపూడిలో 18 సెంటీ మీటర్లు..
* పూసపాటిరేగలో 16 సెంటీ మీటర్లు..
* తాడేపల్లి గూడెంలో 13 సెంటీ మీటర్లు..
* కొయ్యలగూడెంలో 12 సెంటీ మీటర్లు..
* తణుకులో 11 సెంటీ మీటర్లు..
* రణస్థలం, విశాఖపట్నంలో 10 సెంటీ మీటర్లు..
* భీమిలిలో 9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

 

ఏపీబీసీఎస్‌లో అవకతవకల ఆరోపణలపై సీఐడీ ఫోకస్‌
గత ప్రభుత్వ హయాంలో మద్యం అక్రమాలపై సీఐడీ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఏపీబీసీఎస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి అక్రమాలపై సీఐడీ కూపీ లాగుతోంది. ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలు.. అక్రమాలు జరిగిన తీరుపై నాటి ఉన్నతాధికారుల నుంచి వివరాలను సీఐడీ తీసుకుంటోంది. వాసుదేవరెడ్డి పాత్రపై సంచలన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీబీసీఎల్ ఎండీతో పాటు, డిస్టలరీల కమిషనర్ గానూ వాసుదేవ రెడ్డికే గత ప్రభుత్వం బాధ్యతలు కట్టబెట్టింది. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కమిషనర్లకు ఫైళ్లు పంపకుండా నిర్ణయాలు తీసుకునేలా వాసుదేవ రెడ్డికే అధికారాలు ఇచ్చింది. ట్రాన్సఫర్లు చేయించేస్తానంటూ ఉన్నతాధికారులను బెదిరించారని వాసుదేవరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. మద్యం కొనుగోళ్లలోనూ భారీగా అవకతవకలకు వాసుదేవ రెడ్డి తెరలేపినట్లు తెలిసింది. ఒకే బ్రాండ్ మద్యాన్ని తెలంగాణ కంటే అధిక ధరకు కొనుగోలు చేసినట్టు విచారణలో సీఐడీ గుర్తించింది. ఒక్క వాసుదేవ రెడ్డి అవినీతే లెక్కలకు అందటం లేదని సీఐడీ అంటోంది. బినామీ పేర్లతో కొన్ని డిస్టిలరీల్లోకి వాసుదేవ రెడ్డి చొరబడినట్లు సీఐడీ పేర్కొంటోంది. కొన్ని మద్యం బ్రాండ్లను రాత్రికి రాత్రే తప్పించినట్లు గుర్తించింది. తక్కువ రేటు ఉన్న మద్యం బ్రాండ్లను గత సర్కారు గణనీయంగా తగ్గించేసినట్లు సీఐడీ గుర్తించింది. 2014-2019 మధ్యలో తక్కువ రేటు ఉన్న మద్యం బ్రాండ్లు 32 అందుబాటులో ఉంటే వాటిని రెండు బ్రాండ్లకే కుదించింది. . వాటిని అధిక ధరలకు విక్రయించి గత ప్రభుత్వం సొమ్ము చేసుకున్నట్లు సీఐడీ అధికారులు ఆరోపించారు. ప్రముఖ బ్రాండ్ల పేర్లతో పోలిన పేర్లు వచ్చేలా సొంత బ్రాండ్లను గత ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు సీఐడీ ఆరోపించింది. సొంత బ్రాండ్ల మద్యానికి అధిక ధరల ఎమ్మార్పీలను నిర్ధారించినట్లు సీఐడీ తెలిపింది. సబ్ లీజుల పేరుతో డిస్టిలరీలను జగన్ సన్నిహితులు కైవసం చేసుకున్నట్లు.. 11 డిస్టిలరీలను జగన్ అనుచరులు హస్తగతం చేసుకున్నట్టు విచారణలో గుర్తించినట్లు సీఐడీ ఆరోపించింది. హస్తగతం చేసుకున్న డిస్టిలరీల నుంచే 65 శాతం మేర మద్యాన్ని ఏపీలో కొనుగోళ్లకు వాసుదేవరెడ్డి అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. 2014-19 మధ్య కాలం లో ఉన్న టాప్ 5 మద్యం బ్రాండ్ మద్యాన్ని 2019 తర్వాత కొనుగోళ్లు నిలిపివేశారని సీఐడీ పేర్కొంది. మద్యం ఆదాయాన్ని ఏపీఎస్డీసీకి రూ. 14,276 కోట్లు మళ్లించినట్టు గుర్తించింది.

 

కాలినడకన తిరుమల చేరుకున్న హోంమంత్రి అనిత
ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. నడకదారి భక్తులకు సులభతరంగా దర్శనభాగ్యం కల్పించేందుకు దర్శన టోకెన్లు జారీ చేయాలని టీటీడీ అధికారులకు హోంమంత్రి సూచించారు. నడకదారి భక్తులకు భధ్రత కల్పించేందుకు పెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నరసాపురం ఎంపీడీఓ ఆచూకీ కోసం ఎన్డీఆర్ఏఫ్ బృందాలతో గాలింపు చేపడుతున్నామన్నారు. ఎంపీడిఓ కుటుంభానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఉద్యోగులపై ఒత్తిడి లేకుండా విధులు నిర్వర్తించేందుకు మా ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. మరో వైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో ఏపీ సర్కారు అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో మంత్రి అనిత అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలకు నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ఏలూరు, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి తీసుకుంటున్న చర్యలపై మంత్రి అనిత తీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.

 

మైక్రోసాఫ్ట్ సర్వర్‌ అంతరాయంపై స్పందించిన కేంద్ర మంత్రి.. ఏమన్నారంటే..?
మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య తలెత్తిన విషయం విదితమే. మైక్రోసాఫ్ట్ సర్వర్‌ అంతరాయం కారణంగా భారత్‌లోనూ పలు రంగాలపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్పందించారు. ఆయన కీలక సూచనలిచ్చారు. ” ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడ్డ అంతరాయాన్ని పరిష్కరించేందుకు భారత ప్రభుత్వ ప్రయత్నిస్తోంది. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మైక్రోసాఫ్ట్‌తో సంప్రదింపులు జరుపుతోంది. ఈ అంతరాయానికి కారణం ఏంటో ఇప్పుడే కనుగొన్నారు. సమస్య పరిష్కారానికి కూడా ప్రక్రియ కొనసాగుతోంది. ఇది నేషనల్ ఇన్ఫార్మాటిక్స్‌ సెంటర్‌పై (NIC) ఎలాంటి ప్రభావం చూపలేదు. ” అని మంత్రి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అలాగే సమస్య పరిష్కారానికి కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ (CERT) మైక్రోసాఫ్ట్‌కు పలు కీలక సూచనలు చేసిందని తెలిపారు. కాగా.. మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య వల్ల భారత్, అమెరికా సహా ప్రపంచంలోని పలు దేశాల్లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలో సమస్యల కారణంగా విమాన సేవలు ప్రభావితమయ్యాయి. చాలా కంపెనీల విమానాలు ఎగరలేకపోతున్నాయి. భారతదేశంలో, ఢిల్లీ, ముంబై మరియు బెంగళూరు విమానాశ్రయాలలో విమానాలు షెడ్యూల్ కంటే ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ సాంకేతిక సమస్యల తర్వాత భారత ప్రభుత్వం మైక్రోసాఫ్ట్‌ను సంప్రదించింది. అనేక దేశాల ప్రభుత్వాలు అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేశాయి. స్పైస్‌జెట్, ఇండిగో మరియు అకాసా ఎయిర్‌లైన్స్ కూడా ఇలాంటి సాంకేతిక సమస్యలను ఉదహరించాయి. ఇండిగో, స్పైస్‌జెట్‌ వంటి విమానయాన సంస్థలు సర్వర్‌ సమస్యల కారణంగా సర్వీసులు నిలిచిపోయాయని చెబుతున్నాయి. విమానాశ్రయంలో చెక్-ఇన్, చెక్-అవుట్ వ్యవస్థలు స్తంభించాయి. బుకింగ్ సేవ కూడా ప్రభావితమైంది. విమానయాన సంస్థలు మాత్రమే కాకుండా బ్యాంకింగ్ సేవలు, టిక్కెట్ బుకింగ్ మరియు స్టాక్ ఎక్స్ఛేంజ్ కూడా చాలా దేశాల్లో ప్రభావితమయ్యాయి.

 

ట్రైనీ ఐఏఎస్ పై కేసు..అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన యూపీఎస్సీ
పుణెలో ట్రైనీ ఐఏఎస్‌గా ఉన్న పూజా ఖేద్కర్‌కు కష్టాలు మరింత పెరిగాయి. పూజపై యూపీఎస్సీ చర్యలు తీసుకుంది. పూజా ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటీసు జారీ చేసింది. దీంతోపాటు కమిషన్‌ ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చర్యలకు సంబంధించి యూపీఎస్పీ వివరణ ఇచ్చింది. ఖేద్కర్ యొక్క అన్ని సర్టిఫికేట్లు మరియు ఇతర పత్రాలను కోరుతూ యూపీఎస్సీ ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. పూజా ఖేద్కర్‌పై ఎఫ్‌ఐఆర్‌పై యూపీఎస్సీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. పూజా ఖేద్కర్ 2022లో జరిగిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజాపై వచ్చిన ఆరోపణలపై యూపీఎస్సీ విచారణ చేపట్టింది. పరీక్షలో ఇచ్చిన సడలింపును తప్పుడు మార్గాల్లో ఉపయోగించుకున్నట్లు విచారణలో తేలింది. తన పేరుతోపాటు తల్లిదండ్రుల పేరు, ఫొటో, ఈమెయిల్ ఐడీ, సంతకం, మొబైల్ నంబర్, చిరునామా మార్చుకుని తన గుర్తింపును దాచేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు.
షోకాజ్ నోటీసు జారీ..
ఐఏఎస్ పూజా ఖేద్కర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు షోకాజ్ నోటీసు (UPSC షోకాజ్ నోటీసు) కూడా జారీ చేసింది. సివిల్ సర్వీసెస్ పరీక్షకు రూపొందించిన నిబంధనల ఆధారంగానే వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు యూపీఎస్సీ తెలిపింది. CSE 2022లో ఆమె అభ్యర్థిత్వం రద్దు చేయబడుతోంది. భవిష్యత్తులో ఏదైనా పోటీ పరీక్షకు లేదా ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హురాలని ప్రకటించబడింది.
పూజా ఖేద్కర్‌పై వచ్చిన ఆరోపణలేంటి?
వ్యక్తిగత వాహనంపై మహారాష్ట్ర ప్రభుత్వం అని రాశారు.వ్యక్తిగత వాహనంపై రెడ్‌లైట్‌ను అమర్చారు.యూపీఎస్సీలో నకిలీ కుల ధ్రువీకరణ పత్రం ఇచ్చారు.నకిలీ వికలాంగ సర్టిఫికెట్ ఇచ్చారు.నిబంధనలకు విరుద్ధంగా ఇంటి బయట అక్రమ నిర్మాణం.వయస్సుకు సంబంధించి మోసం ఆరోపణలు.ట్రైనీ అయినప్పటికీ వ్యక్తిగత క్యాబిన్‌ను డిమాండ్ చేయడం.సీనియర్ అధికారి క్యాబిన్‌ను బంధించడం.రైతులను పిస్టల్‌తో బెదిరించారని తల్లి ఆరోపించింది.వివిధ ఆసుపత్రుల్లో వేర్వేరు చిరునామాలు ఇస్తున్నారని ఆరోపించారు.

 

బడ్జెట్ సమావేశాల్లో 6 కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం.. వివరాలు..
రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం కీలమైన 6 బిల్లులను ప్రవేశపెట్టనునంది. విమానయాన రంగంలో వ్యాపారాన్ని సులభతరం చేసే బిల్లును తీసుకురానుంది. దీని కోసం 90 ఏళ్ల నాటి ఎయిర్‌క్రాఫ్ట్ చట్టాన్ని భర్తీ చేయనుంది. దీంతో సహా ఆరు కొత్త బిల్లులను సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెడుతుంది. ఆర్థిక బిల్లులతో పాటు ‘ది డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (సవరణ) బిల్లు’ను కూడా జాబితా చేసింది. ఈ చట్టం ద్వారా వివత్తు నిర్వహణ రంగంలో పనిచేస్తున్న వివిధ సంస్థల పనితీరులో మరింత స్పష్టత, కలయికను తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు లోక్‌సభ బులెటిన్ గురువారం పేర్కొంది. ‘భారతీయ వాయుయాన్ విధేయక్’ ద్వారా 2024 పౌర విమానయాన రంగంలో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి అనుమతించే నిబంధనలను తీసుకురావడానికి 1934 ఎయిర్ క్రాఫ్ట్ చట్టాన్ని భర్తీ చేయనుంది. జూలై 22 ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 12న ముగుస్తాయి. జూలై 23న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం ఉన్న చట్టాలను రీప్లేస్ చేసేందుకు ‘బాయిలర్స్ బిల్’ ని తీసుకురాబోతోంది. కాఫీ (ప్రమోషన్ మరియు అభివృద్ధి) బిల్లు మరియు రబ్బరు (ప్రమోషన్ మరియు అభివృద్ధి) బిల్లు స్థానంలో బాయిలర్‌ల బిల్లును తీసుకు వస్తోంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంటరీ ఎజెండాను నిర్ణయించే బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ)ని కూడా ఏర్పాటు చేశారు. స్పీకర్ అధ్యక్షత ఏర్పడిన కమిటీలో సుదీప్ బందోపాధ్యాయ (టిఎంసి), పిపి చౌదరి (బిజెపి), లావు శ్రీకృష్ణ దేవరాయలు (టిడిపి), నిషికాంత్ దూబే (బిజెపి), గౌరవ్ గొగోయ్ (కాంగ్రెస్), సంజయ్ జైస్వాల్ (బిజెపి), దిలేశ్వర్ కమైత్ (జెడి- యు), భర్తృహరి మహతాబ్ (బిజెపి), దయానిధి మారన్ (డిఎంకె), బైజయంత్ పాండా (బిజెపి), అరవింద్ సావంత్ (శివసేన-యుబిటి), కొడికున్నిల్ సురేష్ (కాంగ్రెస్), అనురాగ్ ఠాకూర్ (బిజెపి) మరియు లాల్జీ వర్మ (ఎస్‌పి) సభ్యులుగా ఉన్నారు.

 

రాహుల్‌గాంధీపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీని కలవలేకే తన తండ్రి రామ్‌విలాస్ పాశ్వాన్ యూపీఏ నుంచి బయటకు వచ్చేశారని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీని కలిసేందుకు 3-4 నెలలు ప్రయత్నించారని.. కానీ ఎప్పుడూ కలిసేందుకు అవకాశం ఇవ్వలేదని చిరాగ్ పాశ్వాన్ అన్నారు. రాహుల్‌ను కలిసే అవకాశం లేకపోవడంతో.. విసుగుపోయి యూపీఏ నుంచి తన తండ్రి రామ్‌విలాస్ పాశ్వాన్ బయటకు వచ్చేశారని చెప్పారు. తాను, తన తండ్రి పదే పదే సోనియాగాంధీని కలిసేవాళ్లం అని చెప్పారు. కలిసినప్పుడల్లా.. రాహుల్ గాంధీని కూడా కలవమని చెప్పేవారని గుర్తుచేశారు. తీరా ఆయన్ను కలిసేందుకు ప్రయత్నిస్తే.. ఎప్పుడూ అందుబాటులోకి రాలేదన్నారు. అలా మూడు, నాలుగు నెలలు నిరీక్షించిన తర్వాత విసుగుపోయి.. యూపీఏ నుంచి బయటకు వచ్చేశామని చిరాగ్ పేర్కొన్నారు. అందుకే తాను రాహుల్ రాజకీయాలను మెచ్చుకోను అని కేంద్రమంత్రి, ఎన్‌జేపీ జాతీయ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ స్పష్టం చేశారు.

 

మధ్యప్రదేశ్‌లో ఘోరం.. రన్నింగ్ కారులో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్
మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. కదులుతున్న కారులోనే ఆమెపై ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. బాలికకు నిందితుల్లో ఒకరితో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఉంది. ఆ స్నేహంతో ఒక రోజు కలవాలంటూ బయటకు పిలిచాడు. దీంతో ఆ బాలిక.. ఒక స్థలానికి రాగానే అప్పటికే కారులో వేచి ఉన్న మరో ఇద్దరు స్నేహితులు.. రైడింగ్‌కు వెళ్దామంటూ ఆహ్వానించారు. కారులోకి ఎక్కగానే ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారం చేశారు. ఈ దృశ్యాలను మొబైల్‌లో చిత్రీకరించారు. అంతే.. ఈ వీడియోను అడ్డంపెట్టుకుని ఆమెను బ్లాక్‌ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. తమతో బయటకు రావాలంటూ భయపెట్టారు. లేదంటే వీడియో మీ పేరెంట్స్‌కు పంపిస్తామని బెదిరింపులకు దిగారు. అయినా ఆమె వారితో వెళ్లేందుకు నిరాకరించింది. కానీ నిందితులు మాత్రం అన్నంత పని చేశారు. అత్యాచార వీడియోను అమ్మాయి పేరెంట్స్‌కు పంపించారు. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించగా… ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులపై అత్యాచారం, కిడ్నాప్ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాలికతో మైనర్‌కు స్నేహం ఉందని.. ఆ చనువుతోనే ఆమె అతడి దగ్గరకు వెళ్లిందని పోలీసులు తెలిపారు. అతడి దగ్గరకు వెళ్లగానే కారులో రైడ్‌కు వెళ్దామని కారు ఎక్కించుకున్నాడని.. అందులో అప్పటికే మరో ఇద్దరు స్నేహితులు ఉన్నారని చెప్పారు. కారు హైవే‌పైకి వెళ్లాక.. ఒకరి తర్వాత ఒకరు గ్యాంగ్‌రేప్ చేశారని పోలీసులు వెల్లడించారు. వీడియో ద్వారా ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఆమె నిరాకరించడంతో.. కుటుంబ సభ్యులకు పంపించారని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు.. కుమార్తెను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారన్నారు. విద్యార్థిని వాంగ్మూలం ప్రకారం ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారని పోలీస్ అధికారి తెలిపారు. త్వరలోనే పట్టుకుంటామని మోహనా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రషీద్ ఖాన్ చెప్పారు. పరిచయస్తులతో జాగ్రత్తగా ఉండాలని అమ్మాయిలకు పోలీసులు సూచిస్తున్నారు.

 

మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ ఎఫెక్ట్‌! భారీగా పతనమైన స్టాక్ మార్కెట్
మైక్రోసాఫ్ట్‌ విండోస్‌‌లో తలెత్తిన సమస్య కారణంగా అన్ని సంస్థలను అతలాకుతలం చేసింది. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. గురువారం సెన్సెక్స్, నిఫ్టీ జీవితకాల గరిష్టాలను నమోదు చేసిన సూచీలు.. శుక్రవారం మాత్రం అందుకు భిన్నంగా తిరోగమనంలో కొనసాగాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభం కాగా.. అనంతరం క్రమక్రమంగా భారీ నష్టాల దిశగా ట్రేడ్ అయింది. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 738 పాయింట్లు నష్టపోయి 80, 604 దగ్గర ముగియగా.. నిఫ్టీ 269 పాయింట్లు నష్టపోయి 24, 530 దగ్గర ముగిసింది. రూపాయి మారకం విలువ డాలర్‌పై రూ.83.65 దగ్గర ముగిసింది. నిఫ్టీలో ఇన్ఫోసిస్, ఐటీసీ, ఎల్‌టీఐఎండ్‌ట్రీ, ఏషియన్ పెయింట్స్, ఎస్‌బీఐ లాభాల్లో కొనసాగగా.. టాటా స్టీల్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, హిందాల్కో, బీపీసీఎల్, టెక్ మహీంద్రా నష్టపోయాయి.

 

స్టార్ ప్రొడ్యూసర్ ఇంట తీవ్ర విషాదం
నటుడు-నిర్మాత క్రిషన్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. క్రిషన్ కుమార్ కుమార్తె తీషా కుమార్ 20 ఏళ్ల వయసులో మరణించారు. టీ-సిరీస్ సీఈవో భూషణ్ కుమార్ బంధువు తీషా జూలై 18న తుది శ్వాస విడిచారు. ఆమె గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం, తీషా క్యాన్సర్ చికిత్స జర్మనీలో కొనసాగుతోంది. తీషా తుది శ్వాస విడిచారు. రెండు నెలల తర్వాత తీషా తన 21వ పుట్టినరోజు జరుపుకోబోతోంది, అయితే ఇంతలోన్ ఆమె కన్నుమూయడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. భారతదేశపు అతిపెద్ద సంగీత లేబుల్, చలనచిత్ర నిర్మాణ సంస్థ T-Series తీషా మృతి సందర్భంగా అధికారిక ప్రకటనను విడుదల చేసింది. కంపెనీ ప్రతినిధి ఒక ప్రకటనలో, ‘క్రిషన్ కుమార్ కుమార్తె తీషా కుమార్ అనారోగ్యంతో సుదీర్ఘ పోరాటం తర్వాత నిన్న మరణించారు. ఇది మా కుటుంబానికి చాలా కష్టమైన సమయం, కుటుంబ గోప్యతను గౌరవించాలని మా వినయపూర్వకమైన అభ్యర్థన’’ అని పేర్కొన్నారు. ఇక టి-సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ తమ్ముడు నటుడు క్రిషన్ కుమార్‌ అందరికీ సుపరిచితుడు. ఆయన కేవలం 5 సినిమాలో నటించాడు కానీ 1995లో విడుదలైన ‘బేవఫా సనం’ సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. ఆ సినిమా పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. క్రిషన్ కుమార్ తాన్యా సింగ్ కుమార్తె తీషా కుమార్. తాన్య నటి అలాగే గాయని. ఆమె క్రిషన్ కుమార్‌తో కలిసి ‘ఆజా మేరీ జాన్’ (1993) చిత్రంలో నటించింది. 2000ల ప్రారంభంలో, ఆమె పాట ‘వో బీటే దిన్’ చాలా ప్రజాదరణ పొందింది. 6 సెప్టెంబర్ 2003న జన్మించిన తీషా తరచుగా T-సిరీస్ చిత్రాల ప్రీమియర్స్ లో కనిపించేది. ఆమె చివరిగా నవంబర్ 30, 2023న రణబీర్ కపూర్ మరియు రష్మిక మందన్న నటించిన ‘యానిమల్’ చిత్రం స్క్రీనింగ్‌లో కనిపించింది.