NTV Telugu Site icon

Top Headlines @ 5 PM : టాప్‌ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతిపై చంద్రబాబు సర్కార్ ఫోకస్
ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతిపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అవినీతిపై దృష్టి సారించిన ఏపీ సర్కారు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అవినీతే పరమావధిగా జలవనరుల శాఖను వైసీపీ పాలకులు దుర్వినియోగం చేశారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఆవులుపల్లి ప్రాజెక్టులో పెద్దిరెడ్డి పాపాలు అన్నీ ఇన్నీ కాదని ఆరోపించారు. ఆవులుపల్లి ప్రాజెక్టులో పెద్దిరెడ్డి రూ. 600 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్జీటీ నిబంధనలకు విరుద్దంగా ఆవులుపల్లి ప్రాజెక్టు నిర్మాణం జరిగిందన్నారు. ఎన్జీటీ కోట్లాది రూపాయల జరిమానా విధించిందన్న మంత్రి.. ఆవులుపల్లి సహా ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఏమైనా అవినీతి జరిగిందా..? అనే అంశంపై వివరాలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కలల ప్రాజెక్టులు పూర్తి చేసి ఆయన లక్ష్యం నెరవేర్చేలా పని చేస్తామన్నారు. జలవనరుల శాఖను సమర్థంగా నిర్వర్తించడం అంటే రాష్ట్ర ప్రజల రుణo తీర్చుకునే అవకాశమేనని ఆయన పేర్కొన్నారు. అలాంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి కోల్పోవడంతో పాటు ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి తీరని ద్రోహం చేశాడన్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాలు వల్ల కృష్ణా నదీ జలాలపై అంతర్రాష్ట్ర వివాదం తలెత్తిందన్నారు. జగన్ పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేశాడని మేం చెప్పటం కాదు.. నీతి ఆయోగ్ కమిటీనే ధృవీకరించిందన్నారు. కీలక శాఖకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి పాదాభివందనం తెలుపుతున్నానన్నారు. తనకు ఈ శాఖ కేటాయింపులో సహకరించిన పవన్ కళ్యాణ్, లోకేషులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

 

బదిలీలపై సీఎం కసరత్తు.. సీఎంవో, సీఎస్‌, డీజీపీతో భేటీ
పరిపాలనలో ప్రక్షాళన ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. అందులో భాగంగా సచివాలయంలో సీఎంవో, సీఎస్, డీజీపీలతో సమావేశం అయ్యారు.. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ వంటి అధికారుల బదిలీలపై కసరత్తు ప్రారంభించారు.. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన అధికారుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసింది ఏపీ సీఎంవో.. అయితే, సమర్థులైన అధికారులకు, నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టింగులు ఇవ్వడంపై ఫోకస్‌ పెట్టారు.. ఇదే సమయంలో.. గత ప్రభుత్వంలో వైసీపీతో అంటకాగిన వారిని దూరంగా పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశారు ప్రభుత్వ పెద్దలు. ఈ నేపథ్యంలో.. ప్రవీణ్ ప్రకాష్, శశి భూషణ్, అజేయ్ జైన్, శ్రీలక్ష్మీ, గోపాల కృష్ణ ద్వివేది, మురళీధర్ రెడ్డి వంటి వారిని జీఏడీకి రిపోర్ట్ చేయమంటారని చర్చ సాగుతోంది.. ఇక, సీనియర్ ఐపీఎస్‌లు రాజేంద్రనాధ్ రెడ్డి, పీఎస్సార్ ఆంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి, ఎన్. సంజయ్, సునీల్ కుమార్ వంటి వారిపై బదిలీ వేటు పడే ఛాన్స్ ఉందనే ప్రచారం సాగుతోంది.. మరోవైపు.. వైఎస్‌ జగన్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై కేసులు కూడా నమోదు చేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉందనే ప్రచారం సాగుతోంది.. 5 హామీలపై అమలుపై ప్రణాళికతో, వేగంగా పని చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. నిర్ణయం వెలువడిన తరువాత జాప్యం ఉండకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.. టీటీడీ ప్రక్షాళనతో పని మొదలు పెట్టిన చంద్రబాబు. టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని తప్పించి.. ఈవోగా సీనియర్ ఐఏఎస్ శ్యామలరావుకు పోస్టింగ్ ఇచ్చిన విషయం విదితమే కాగా.. అన్ని విభాగాల్లో మార్పులు, చేర్పులకు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. దీంతో.. అధికారుల్లో గుబులు పుట్టుకుంది.. తామకు ఏ శాఖ వస్తుంది.. తమకు ఎక్కడికి పంపుతారనే టెన్షన్‌లో అధికారులు ఉన్నారు.

 

విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష
ఏపీలో నూతనంగా ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం విద్యాశాఖపై దృష్టి సారించింది. విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. విద్యావ్యవస్థలో మార్పులకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. డ్రాప్ అవుట్స్, మౌలిక సదుపాయాలపై ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంపై అధికారులను ఆరా తీశారు. మధ్యాహ్న భోజనం రుచిగా, నాణ్యతతో ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. పాఠశాలల్లో పారిశుధ్యం నిర్వహణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఇతర రాష్ట్రాల్లో విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు లోకేష్ సూచించారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు మారిన విద్యార్థుల సంఖ్య, అందుకు గల కారణాలను విశ్లేషించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్థిస్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జులై 15 నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాక్ పాక్ ఇవ్వాలని సూచించారు. కొత్తగా చేపట్టాల్సిన పనులతో పాటు గత ప్రభుత్వ హయాంలో అర్థంతరంగా నిలిచిపోయిన ఫేజ్-2 పనులు, ఫేజ్-3 పనులన్నీ ఏడాదిలోగా పూర్తి చేయాలన్నారు. బడిలో చేరి మధ్యలో మానేసిన జనరల్ డ్రాప్ అవుట్స్ వివరాలు అందజేయాలన్నారు. గత ఐదేళ్లలో ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి, అందుకు గల కారణాలను కూడా తెలియజేయాలని మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు.

 

ఆక్రమణల తొలగింపులో తొందరపాటు వద్దు.. జనం వీధిన పడతారు..
మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి టీజీ భరత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కర్నూలులో పారిశుధ్యం, మౌలిక సౌకర్యాల అభివృద్ధి, పచ్చదనంపై మంత్రి భరత్ అధికారులను ఆరా తీశారు. ఆక్రమణల తొలగింపులో తొందరపాటు వద్దని మంత్రి సూచించారు. చిన్న వ్యాపారులు, పేదలతో చర్చించి ప్రత్యామ్నాయం చూపిన తరువాతనే ఆక్రమణలు తొలగించాలని ఆయన సూచనలు చేశారు. ఉన్నట్టుండి ఆక్రమణలు తొలగిస్తే జనం వీధిన పడతారని వెల్లడించారు. కర్నూలులో రంగు మారిన నీళ్లు వస్తున్నాయని.. శుద్దమైన నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రోజు టైమ్‌కు తాగు నీరు వచ్చేలా చూడాలన్నారు. కర్నూలును స్మార్ట్ సిటీగా చేయడమే తన లక్ష్యమన్నారు. తన కంపెనీ నుంచి ఉచితంగా హైపో ద్రావణం ఇస్తానన్న మంత్రి.. దోమల నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. హంద్రీనదికి వరదలు వస్తే పలు కాలనీలు మునుగుతాయని.. పూడిక తీసేందుకు పనులు మొదలు పెట్టాలన్నారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి టీజీ భరత్ ఆదేశించారు.

 

మహిళా స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది రూ. 20 వేల కోట్ల రుణాలు
మహిళా స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది 20 వేల కోట్ల రుణాలు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి మ‌రియు మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) తెలిపారు. గత ఏడాది కేవలం 15,400 కోట్ల రుణాలు ఇచ్చారని వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సర రుణ ప్రణాళికను సీతక్క శనివారం విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఒకప్పుడు మహిళా సంఘాలకు రూ. పది వేల లోన్ ఇవ్వాలంటేనే బ్యాంకులు భయపడేవన్నారు. ఇప్పుడు మహిళా సంఘాలకు రూ. 20 లక్షల వరకు రుణాలు అందుతున్నాయన్నారు. మహిళా సంఘాలు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాదు.. ఐక్యతను అభివృద్ధిని సాధిస్తున్నమని సీతక్క తెలిపారు. పేదలకు పేదలే బందువులుగా ఉంటారన్నారు. అందుకే పేదలకు ప్రభుత్వమే అండగా ఉండి అభివృద్ధి పథాన నిలపాలన్నదే మా సంకల్పమని స్పష్టం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా మహిళా సంఘాలు బల పడాలని మంత్రి సూచించారు. ఏజెన్సీ ప్రాంతాలకే బ్యాంకర్లు వెళ్లి మహిళా సంఘాలకు లోన్లు ఇవ్వాలని ఆదేశించారు. తమ అవసరాలు తీరుస్తారనే విశ్వాసాన్ని బ్యాంకులు కల్పించాలన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళలను పారిశ్రామికవెత్తలుగా చేయడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. అందులో భాగంగా మహిళలకు ఉపాధి అవకాశాలను పెంచుతున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ స్టిచ్చింగ్ బాధ్యతను మహిళా సంఘాలకే అప్పగించామని పేర్కొన్నారు. పాఠశాలలు తెరిచిన రోజే యూనిఫాంలు విద్యార్థులకు అందించిన చరిత్ర మహిళా సంఘాల కే దక్కుతుందని కొనియాడారు. మహిళా సాధికారతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని తెలిపారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ముందంజలో ఉన్నపుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళా సంఘ సభ్యులకు జీవిత భీమా కల్పిస్తున్నామని ఉద్ఘాటించారు. కుటుంబానికి భారం కాకుండా ప్రభుత్వమే పెండింగ్ లోన్లు చెల్లిస్తుందని స్పష్టం చేశారు. మహిళలు కొత్త ఉపాధి అవకాశాలు ప్రతిపాదించండి, బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వమని.. ఉక్కు మహిళ ఇందిరా గాంధీ దేశానికి ప్రధానిగా సేవలందించారని గుర్తుచేశారు. సోనియాగాంధీ చొరవ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని.. సమాజం లో సగభాగమైన మహిళలు ఆనందంగా ఉండాలన్నారు. అందుకే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని తెలిపారు.

 

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. వచ్చే వారమే పీఎం కిసాన్ నిధులు
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు పెట్టుబడి సాయం.. పీఎం-కిసాన్‌ పథకం 17వ విడత నిధులు వచ్చేవారం విడుదల కానున్నాయి. జూన్‌ 18న రూ.2వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. కాగా.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని మోడీ పీఎం కిసాన్ నిధులను రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ శనివారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. గతంలోనూ రైతుల ప్రయోజనాల కోసం ప్రధాని అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పీఎం-కిసాన్‌ నిధులకు సంబంధించి తొలి సంతకం చేశారని చౌహన్‌ తెలిపారు. కాగా.. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.3.04 లక్షల కోట్లు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. కాగా.. పీఎం కిసాన్ పథకం 2018 నుంచి అమలు చేస్తున్నారు. ఈ పథకం అర్హులైన రైతులకు మూడు విడతల్లో రూ.2వేలు చొప్పున ఏటా రూ.6 వేలు పెట్టుబడి సాయంగా అందిస్తుంది. ఈ పథకంతో 9.3 కోట్ల మంది రైతులకు రూ.20వేల కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది.

 

బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు..
రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌కు ఊరట లభించేలా కనిపించడం లేదు. ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీని జూన్ 22 వరకు పొడిగించింది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బిభవ్ కుమార్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు మే 13న న్యూఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసంలో బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని స్వాతి మలివాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే.. అంతకుముందు శుక్రవారం, దర్యాప్తు అధికారి గైర్హాజరైన దృష్ట్యా కుమార్ కస్టడీని కోర్టు ఒక రోజు పొడిగించింది. కాగా.. మే 18న బిభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మేజిస్ట్రేట్ కోర్టు అదే రోజు ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపింది. ఆయన అరెస్టు కారణంగా ముందస్తు బెయిల్ పిటిషన్‌లో అర్థం లేదని కోర్టు పేర్కొంది. మే 24న అతడిని నాలుగు రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపగా, మళ్లీ మూడు రోజుల పోలీసు కస్టడీకి పంపారు. మరోవైపు రెగ్యులర్ బెయిల్ కోసం బిభవ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. జూన్ 14న ఢిల్లీ హైకోర్టు బిభవ్ కుమార్ బెయిల్ దరఖాస్తుపై ఢిల్లీ పోలీసుల నుంచి స్పందన కోరింది. జస్టిస్ అమిత్ శర్మతో కూడిన వెకేషన్ బెంచ్ బెయిల్ పిటిషన్‌పై నోటీసు జారీ చేసింది మరియు స్టేటస్ రిపోర్ట్‌ను దాఖలు చేయాలని ఢిల్లీ పోలీసులను కోరింది. బిభవ్ కుమార్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.

 

తాగిన మత్తులో మహిళ బెర్త్పై సోల్జర్ మూత్ర విసర్జన..
తాగిన మత్తులో ఓ సైనికుడు రైలులో ప్రయాణిస్తుండగా.. తన బెర్త్ పై మూత్ర విసర్జన చేశాడని, నిద్రిస్తున్న సమయంలో అది తనపై పడిందని ఓ మహిళ ఆరోపించింది. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌కు వెళ్తున్న గోండ్వానా ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగింది. రైలు గ్వాలియర్ చేరుకుంటుందనగా ఈ ఘటన జరిగిందని బాధిత మహిళ తెలిపింది. ఈ విషయమై ఆమె రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)కు ఫిర్యాదు చేస్తే వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) మరియు రైల్వే మంత్రికి ఫిర్యాదు చేసింది. ఆమె రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తన కుమారుడు, భర్త ఉన్నారని.. బీ-9 కోచ్‌లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగిందని బాధిత మహిళ పేర్కొంది. సైనికుడికి పై బెర్త్ కేటాయించగా, మహిళకు లోయర్ బెర్త్ కేటాయించారు. సైనికుడు పూర్తిగా మత్తులో ఉన్నాడని, అతని బెర్త్‌పై అపస్మారక స్థితిలో పడుకున్నాడని.. పై బెర్త్‌పై మూత్ర విసర్జన చేశాడని బాధిత మహిళ ఆరోపించింది. ఘటన జరిగిన వెంటనే బాధితురాలు తన భర్తకు సమాచారం అందించడంతో రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కి ఫిర్యాదు చేశాడు. గ్వాలియర్‌, ఝాన్సీ స్టేషన్లలో ఆర్పీఎఫ్ సిబ్బంది ఫిర్యాదు చేసినప్పటికీ.. ఫోటోలు తీసి, ఎటువంటి చర్య తీసుకోకుండా వెళ్లిపోయారు. మరోవైపు.. ఆర్‌పిఎఫ్ ఇన్‌ఛార్జ్ అధికారి సంజయ్ ఆర్య ఈ సంఘటనను అంగీకరించారు. సైనికుడు మత్తులో ఉన్నాడని.. అతని ప్యాంటు తడిగా ఉందని ధృవీకరించారు. అయితే B-9 కోచ్‌లోని సీట్ నంబర్ 23లో మహిళా కనిపించలేదని పేర్కొన్నారు.

 

నీటిని విడుదల చేయాలని హర్యానా సర్కార్‌కు ఆప్ విజ్ఞప్తి
ఓ వైపు ఎండలు.. ఇంకోవైపు విద్యుత్ సంక్షోభం.. దానికి తోడు తాగునీటి కష్టాలు.. ఇవన్నీ ఒకేసారి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వేధిస్తోంది. కనీస అవసరాలకు నీళ్లు లభించక హస్తిన వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ట్యాంకర్ల మాఫీయాగా ఏర్పడి.. జనాలను పీడించుకుని తింటున్నారు. అధికారులు చర్యలు చేపట్టినా అత్యధిక ధరల్లో విక్రయిస్తున్నారు. ఇక ట్యాంకర్లు కాలనీలకు రాగానే.. ప్రజలు ఎగబడి పట్టుకుంటున్నారు. ఇలా తాగునీటి కష్టాలతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో ఏర్పడిన నీటి సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్పథంతో నీళ్లు విడుదల చేయాలని హర్యానా ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ సర్కార్ కోరింది. యమునా నదికి అదనపు నీటిని విడుదల చేయాలని ఢిల్లీ ప్రభుత్వం హర్యానాకు విజ్ఞప్తి చేసిందని మంత్రి అతిషి శనివారం తెలిపారు. మునక్ కాలువ, వజీరాబాద్ రిజర్వాయర్‌లో ముడి నీటి కొరత కారణంగా రాజధాని ఉత్పత్తిలో రోజుకు 70 మిలియన్ గ్యాలన్ల కొరతను ఎదుర్కొంటోందని వెల్లడించారు. ముడి నీటి కొరత కారణంగా ఢిల్లీలో దాదాపు 1,002 ఎంజీడీల సాధారణ నీటి ఉత్పత్తి శుక్రవారం నాటికి 932 ఎంజీడీలకు పడిపోయిందని ఆమె తెలిపారు. శుక్రవారం జరిగిన ఎగువ యమునా రివర్ బోర్డు సమావేశంలో ఢిల్లీలో నీటి సంక్షోభానికి పరిష్కారం లభించలేదని ఆమె అన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఉపయోగించని నీటిని ఢిల్లీకి అందించేందుకు సిద్ధంగా ఉందని ఆమె పేర్కొన్నారు. తాను హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడానని.. సహకరిస్తామని మంత్రి హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. శనివారం ఢిల్లీ జల్‌బోర్డు అధికారులతో జరిగిన సమావేశంలో నీరు అందని ప్రాంతాలను అంచనా వేయాలని, నీటి ట్యాంకర్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో DJB ట్యాంకర్లు రోజుకు 10 MGD నీటిని సరఫరా చేస్తున్నాయని వివరించారు. సుమారు 10,000 ట్రిప్పులు చేస్తున్నాయన్నారు. బవానా, ద్వారకా, నాంగ్లోయ్ వంటి కొన్ని ఇతర ప్రాంతాల్లో స్థానిక నివాసితులకు నీటిని అందించడానికి అత్యవసర గొట్టపు బావులను ప్రారంభించినట్లు మంత్రి చెప్పారు.

 

బెంగళూరు-తిరుపతి హైవేపై ప్రమాదం.. ముగ్గురు యువకుల మృతి
బెంగళూరు-తిరుపతి జాతీయ రహదారిపై ఘోర విషాదం చోటుచేసుకుంది. స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా బర్త్‌డే కేక్ కొనేందుకు బయటకు వచ్చిన ముగ్గురు యువకుల్ని మినీలారీ రూపంలో మృత్యువు వెంటాడింది. అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు వదిలారు. దీంతో గ్రామంలో, కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఓషన్‌ గ్రామానికి చెందిన పవన్‌, మంజు, చరణ్‌ అనే యువకులు స్నేహితుడి పుట్టినరోజు కేక్‌ కొనుగోలు చేసేందుకు కాణిపాకం వెళ్తుండగా చెర్లోపల్లి సమీపంలో ద్విచక్రవాహనాన్ని మినీ లారీ ఢీకొట్టింది. ఐషర్ వాహనం రాంగ్ రూట్‌లో రావడంతో ఈ ఘరో ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో పవన్‌, మంజు, చరణ్‌ అనే యువకులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల స్వగ్రామం బంగారుపాళెం మండలం ఓషన్‌ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.