NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

కీలక శాఖలన్నీ పవన్‌ కల్యాణ్‌కే.. డిప్యూటీ సీఎం సహా నాలుగు శాఖలు..
సాధారణ పరిపాలన శాఖ, శాంతిభద్రతలు, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలను తన వద్దే ఉంచుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.. అయితే, ఈ ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కీలక శాఖలు దక్కాయి.. డిప్యూటీ సీఎం పదవితో పాటు.. ఆయనకు నాలుగు శాఖలు అప్పగించారు.. కీలకమైన పంచాయతీ రాజ్‌ శాఖ, గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా శాఖ, అటవీ – పర్యావరణ శాఖ, సైన్స్ & టెక్నాలజీ శాఖకు అప్పజెప్పారు. మరోవైపు.. జనసేన పార్టీకి చెందిన ఇతర మంత్రులకు కూడా కీలక శాఖలే దక్కాయి.. మంత్రి నాదెండ్ల మనోహర్‌కు పౌరసరఫరాలశాఖ, వినియోగదారుల వ్యవహారాలు అప్పగించారు.. అలాగే మంత్రి కందుల దుర్గేష్‌ కు పర్యాటక, సాంస్క్రతిక, సినిమాటోగ్రఫీ శాఖలు అప్పగించారు సీఎం చంద్రబాబు నాయుడు..

ఏపీ టీడీపీకి కొత్త చీఫ్‌.. పల్లా శ్రీనివాస్ యాదవ్‌కు బాధ్యతలు..
ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో గ్రాండ్‌ విక్టరీ కొట్టిన తర్వాత.. ఓవైపు ప్రభుత్వ ఏర్పాటు.. మరోవైపు పార్టీని చక్కదిద్దే పనిలో పడిపోయారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీకి కొత్త బాస్‌ను నియమించారు చంద్రబాబు.. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ యాదవ్‌ను నియమించారు.. సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన శ్రీనివాస్‌ యాదవ్.. తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు.. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాస్ యాదవ్ రికార్డు సృష్టించాడు.. ఇప్పుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనున్నారు. ఇక, యాదవ సామాజిక వర్గానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెద్ద పీట వేస్తున్నట్టుగా తెలుస్తోంది.. తన మంత్రి వర్గంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి చోటు కల్పించిన ఆయన.. టీడీపీ అధ్యక్ష బాధ్యతలను కూడా యాదవ వర్గం చేతిలోనే పెట్టారు.. దీంతో.. యాదవ సామాజిక వర్గానికి మరింత దగ్గరయ్యేలా చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నుంచి 95 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై విజయం సాధించారు పల్లా శ్రీనివాస్ యాదవ్.. ఆయన తండ్రి కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేశారు.. కానీ, పల్లా శ్రీనివాస్‌ యాదవ్.. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.. ఆ తర్వాత టీడీపీలో చేరి 2014లో గాజువాక ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అంటే.. 2019 ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూశారు.. ఆ తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడమే కాకుండా, నియోజకవర్గంపై మరింత కేంద్రీకరించి పనిచేశారు.. ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించారు.. ఇక, ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన సమయంలో.. పల్లా శ్రీనివాస్‌ యాదవ్‌కు ఏపీ టీడీపీ పగ్గాలు అప్పచెప్పారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

మిత్రపక్షాలకు కీలక శాఖలు కేటాయించిన చంద్రబాబు.
జనసేన-బీజేపీ మిత్రపక్షాలతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. వారికి మంత్రి పదవులు కేటాయించడంతో పాటు.. కీలక మంత్రిత్వశాఖలు కేటాయించారు.. మిత్రపక్షాలకు కీలక శాఖలు కేటాయించారు సీఎం చంద్రబాబు.. డిప్యూటీ సీఎం హెూదాను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఒక్కరికే పరిమితం చేశారు.. 2014-19 మధ్య కాలంలో ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులిచ్చిన చంద్రబాబు.. ఇక, 2019–24 మధ్య కాలంలో ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. అయితే, ఇప్పుడు కేబినెట్‌లోకి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రావడంతో ఆయన ఒక్కరికే డిప్యూటీ సీఎం పదవిచ్చి గౌరవించారు చంద్రబబు.. పౌర సరఫరాలు వంటి కీలక శాఖను జనసేనకు చెందిన నాదెండ్ల మనోహర్‌కు కేటాయించారు.. చంద్రబాబు పెట్ సబ్జెక్ట్ టూరిజం శాఖను కూడా జనసేనకే ఇచ్చారు ఏపీ సీఎం.. మరోవైపు, కీలకమైన వైద్యారోగ్య శాఖను బీజేపీకి కేటాయించారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు..
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. మంత్రివర్గంలోని నా సహచరులకు శాఖల కేటాయింపు జరిగిన సందర్భంగా వారికి నా అభినందనలు అని పేర్కొన్నారు.. అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేస్తూ, ప్రజా పాలన శకానికి నాంది పలుకుతామని ప్రతిజ్ఞ చేశాం. మంత్రులుగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తారని నాకు నమ్మకం ఉందన్నారు.. సేవ, భక్తితో కూడిన ఈ యాత్రను ప్రారంభించిన అందరికీ నా శుభాకాంక్షలు అని తెలిపారు సీఎం చంద్రబాబు.

తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఐసెట్-2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఐసెట్ ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, కాకతీయ యూనివర్సిటీ ఇంఛార్జి వీసీ వాకాటి కరుణ ప్రకటించారు. ఐసెట్‌ పరీక్ష కోసం 86 వేల 156 మంది దరఖాస్తు చేసుకోగా.. 77 వేల 942 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 71 వేల 647 మంది ఉత్తీర్ణులు కాగా.. ఉత్తీర్ణత శాతం 91.92 శాతంగా నమోదైంది. ఎంబీఏ 272 కాలేజీల్లో 35 వేల 949 సీట్లు ఉండగా.. ఎంసీఏ 64 కాలేజీల్లో 6 వేల 990 సీట్లు ఉన్నాయి. ఐసెట్‌ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. జూన్‌ 5, 6 తేదీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 116 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 77,942 మంది విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఏడాది ఐసెట్‌ ప్రవేశ పరీక్షను వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ నిర్వహించింది. కాగా తెలంగాణ ఐసెట్‌ పరీక్షలో వచ్చిన ర్యాంకు ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తుల వెల్లువ
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. చిన్నారెడ్డి పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలతో రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ప్రజలు చిన్నారెడ్డిని, ప్రజాభవన్ అధికారులను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. అన్ని విభాగాలకు సంబంధించి మొత్తం 702 దరఖాస్తులు నమోదయ్యాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 175, పంచాయతీ రాజ్, గ్రామిణాభివృద్ధి శాఖకు సంబందించి 60 దరఖాస్తులు, పౌరసరఫరాల శాఖ కు సంబంధించి 54, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి 51, హోం శాఖకు సంబందించి 38 దరఖాస్తులు, ఇతర శాఖలకు సంబంధించి 374 అందినట్లు అధికారులు తెలిపారు. ప్రజావాణి ప్రత్యేక అధికారి, మున్సిపల్ శాఖ సంచాలకులు దివ్య, ఇతర అధికారులు ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులు స్వీకరించండంతో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

“అయోధ్య రామాలయాన్ని కూల్చేస్తాం”..జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ బెదిరింపు
గత కొన్ని రోజులుగా భారత్‌లో నిరంతరంగా ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నాయి. గత కొద్దిరోజులుగా భారత్‌లోని మూడు చోట్ల ఉగ్రవాదులు దాడులు చేశారు. ఇప్పుడు రామాలయం కూడా ఉగ్రవాదుల టార్గెట్‌గా మారింది. రామ మందిరంపై ఉగ్రదాడి జరగబోతోందన్న బెదిరింపులు వెలుగులోకి వచ్చాయి. పాక్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ రామ మందిరంపై దాడి చేస్తామంటూ ఆడియో వార్నింగ్ ఇచ్చింది. ఆలయాన్ని కూల్చేస్తామని హెచ్చరించింది. ఈ ఉగ్రదాడి గురించి సమాచారం అందుకున్న పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఆలయ ప్రాంగణంలో భద్రతను కూడా పెంచారు. అయోధ్యలోని భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ‘నేషనల్ సెక్యూరిటీ గార్డ్’ (ఎన్‌ఎస్‌జి) హబ్‌ను నిర్మిస్తున్నారు. ఇది దేశంలోని ఆరో హబ్‌ అవుతుంది. గతంలో దేశంలోని చెన్నై, హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్‌లలో ఎన్‌ఎస్‌జీ హబ్‌లు ఉండేవి. ఇప్పుడు అయోధ్యలో కూడా NSG హబ్ సిద్ధమవుతోంది. భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని ఈ హబ్‌ను సిద్ధం చేశారు. ఈ హబ్ యొక్క స్థావరం కూడా రామ మందిరం దగ్గర సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన కొత్త అప్‌డేట్‌లు త్వరలో రానున్నాయి. ఇలాంటి ఉగ్రవాద దాడులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇక్కడ ఎన్‌ఎస్‌జీ హబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక్కడ ఎన్‌ఎస్‌జి హబ్‌ నిర్మాణం తర్వాత బ్లాక్‌ కమాండోలను కూడా రంగంలోకి దించనున్నారు.

ఇటలీలో పలువురు అధ్యక్షులతో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు..
ఇటలీలోని అపులియాలో జీ-7 సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ ఏడాదిలో ఇరువురు నేతల మధ్య ఇది ​​రెండో సమావేశం. ఈ సమావేశం అనంతరం.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో కూడా ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతకుముందు బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తో సమావేశమయ్యారు. కాగా.. జీ7 సమ్మిట్ ఔట్రీచ్ సెషన్‌లో పాల్గొనడానికి ప్రధాని మోడీ ఈరోజు ముందుగానే ఇటలీలోని అపులియా చేరుకున్నారు. శుక్రవారం కార్యక్రమం సందర్భంగా పలువురు నాయకులను కలవనున్నారు. ప్రధాని మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధానికి ఇదే తొలి విదేశీ పర్యటన.

ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్ టాక్సీ ప్రారంభం.. ఎక్కడంటే..
జూన్ 14, శుక్రవారం నుండి ప్రారంభమయ్యే ఈ సంవత్సరం హజ్ సీజన్‌లో యాత్రికుల కోసం స్వీయ డ్రైవింగ్ ఎయిర్ టాక్సీ సేవను ప్రారంభించింది. సౌదీ రవాణా మరియు లాజిస్టిక్ సేవల మంత్రి, సలేహ్ బిన్ నాసర్ అల్ జాసర్, పౌర విమానయాన ప్రెసిడెంట్ అబ్దుల్ అజీజ్ అల్ దుయిలేజ్, డిప్యూటీ మంత్రి డాక్టర్ రుమైహ్ అల్ రుమైహ్, ఇతర అధికారుల సమక్షంలో ఈ సేవను ప్రారంభించారు. ఈ కార్యక్రమం లాంచ్ సందర్భంగా అల్ జాసర్ మాట్లాడుతూ.., ఈ విమానం ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్ టాక్సీ అని, పౌర విమానయాన అథారిటీ లైసెన్స్ పొందింది. స్మార్ట్ మొబిలిటీని పెంపొందించడానికి అలాగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల ఉపాధిని ప్రారంభించే చట్టాలు, వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందని ఆయన తెలిపారు. యాత్రికులను రవాణా చేయడం, అత్యవసర కదలికలను సులభతరం చేయడం, వైద్య పరికరాలను రవాణా చేయడం మరియు సరుకు రవాణా ద్వారా లాజిస్టికల్ సేవలను అందించడం లాంటి వాటిలో ఎయిర్ టాక్సీ అందించగల సేవలను కూడా సమీక్షించారు. నేషనల్ ట్రాన్స్‌ పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ స్ట్రాటజీ లక్ష్యాలకు అనుగుణంగా ఎయిర్ టాక్సీ టెక్నాలజీలు, ఎలక్ట్రిక్ కార్లు, హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా సౌదీ తన రవాణా రంగాన్ని ఆధునీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వివిధ భవిష్యత్ రవాణా సాంకేతికతలను పరిచయం చేయడంలో పని చేయడానికి ప్రయోగాత్మక వాతావరణాలను అందించడం దీని లక్ష్యం.

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ తాజా రికార్డ్ ఇదే
దేశీయ స్టాక్ మార్కె్ట్ వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసింది. ఉదయం సూచీలు మిశ్రమంగా ట్రేడ్ అయినా.. అరంతరం వేగంగా పుంజుకుంది. ఇక నిఫ్టీ అయితే మరోసారి ఆల్‌టైమ్ రికార్డ్ సొంతం చేసుకుంది. శుక్రవారం 23, 490 తాజా మార్కు చేరింది. వచ్చే నెలలోనే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ జోష్ కనిపించినట్లుగా తెలుస్తోంది. సెన్సెక్స్ 181 పాయింట్లు లాభపడి 76, 992 దగ్గర ముగియగా.. నిఫ్టీ 66 పాయింట్లు లాభపడి 23, 465 దగ్గర ముగిసింది. ఇక నిఫ్టీ 23, 500 మార్కు రీచ్ అయ్యేందుకు అతి చేరువలో ఉంది. ఇక ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఐటీ షేర్లు అండర్ పెర్ఫార్మ్‌ను నమోదు చేశాయి. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ 1 శాతం చొప్పున లాభపడ్డాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్ ర్యాలీ తీశాయి. BSE మిడ్‌క్యాప్ మరియు స్మాల్‌క్యాప్ ఒక్కొక్కటి 1 శాతం లాభపడతాయి. ఐటీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ట్రేడ్ అయ్యాయి. గురువారం నాటి ముగింపు 83.54తో పోలిస్తే.. డాలర్‌కు భారత రూపాయి విలువ శుక్రవారం 83.56 దగ్గర ఫ్లాట్‌గా ముగిసింది.

‘థగ్‌ లైఫ్‌’ సెట్‌లో ప్రమాదం.. ప్రముఖ నటుడికి గాయం..
విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రస్తుతం ‘థగ్‌ లైఫ్‌’ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉంది.. భారీ సెట్ లో షూటింగ్ జరుగుతుంది.. ఈ క్రమంలో భారీ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.. ఈ ప్రమాదంలో ప్రముఖ నటుడు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది.. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా థగ్ లైఫ్. ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు శింబు, త్రిష కృష్ణన్, అభిరామి, నాజర్, జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మి వంటి నటినటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు… ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరిస్తున్నారు.. ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పుదుచ్చేరిలో సినిమా షూటింగ్ జరుగుతుండగా, యాక్షన్ సీక్వెన్స్ లో భాగంగా ఓ హెలికాప్టర్ సీన్ ను షూట్ చేస్తున్నారు..

రేణుకా స్వామి మర్డర్ కేసులో ట్విస్ట్.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన క్యాబ్ డ్రైవర్
నటుడు దర్శన్ లివిన్ పార్ట్నర్ పవిత్ర గౌడకు అసభ్యకరమైన ఫోటోలు, సందేశాలు పంపినందుకు చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామిని బెంగళూరు తీసుకొచ్చి దర్శన్ అండ్ గాంగ్ హత్య చేశారు. ఈ కేసులో నటుడు దర్శన్, పవిత్ర గౌడ సహా 13 మంది నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. కాగా, జూన్ 13న మరో నిందితుడు రవి అలియాస్ రవిశంకర్ చిత్రదుర్గలో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇంతకీ, ఈ రవి ఎవరు? రేణుకాస్వామి హత్య కేసుతో అతడికి సంబంధం ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే.. చిత్రదుర్గలోని కురుబరహట్టి గ్రామానికి చెందిన రవి కారు డ్రైవర్. అద్దెకు కారు నడుపుతున్నాడు. రేణుకా స్వామిని రవి కారులో చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు తీసుకొచ్చారు. తొలుత ఈ కేసులో 13 మంది పేర్లు వినిపించాయి. ఆ తర్వాత మరో నలుగురి పేర్లను చేర్చారు. ఈ కేసులో తన పేరు వినిపించడంతో రవి చిత్రదుర్గ డీవైఎస్పీ కార్యాలయానికి వెళ్లి పోలీసు అధికారి దినకర్ ఎదుట లొంగిపోయాడు. దర్శన్‌ కేసులో తన పేరు వినిపించిన వెంటనే భయాందోళనకు గురైన రవి చిత్రదుర్గ ట్యాక్సీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆఫీస్‌ బేరర్‌లను కలిసి అనంతరం వారందరి సమక్షంలో చిత్రదుర్గ డీవైఎస్పీ కార్యాలయానికి వెళ్లి లొంగిపోయాడు. అనంతరం రవి ఇచ్చిన సమాచారాన్ని టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లు మీడియాతో పంచుకున్నారు. రాఘవేంద్ర, ఇతర నిందితులు రేణుకా స్వామిని బెంగళూరు తీసుకెళ్లేందుకు రవి కారును అద్దెకు తీసుకున్నారు.