NTV Telugu Site icon

Top Headlines @ 5PM : టాప్‌ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

మద్యం షాపుల లాటరీకి వేళాయే.. దుకాణాలకు భారీగా దరఖాస్తులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు మొత్తం 89,882 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ. 1797.64 కోట్ల ఆదాయం లభించింది. అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువగా దరఖాస్తులు రాగా.. వీటిని పునః పరిశీలించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఎన్టీఆర్ విజయవాడ జిల్లాల్లో అత్యధికంగా 113 దుకాణాలకు 5824 దరఖాస్తులు వచ్చాయి. రేపు జిల్లాల వారీగా లాటరీ పద్ధతిలో దుకాణాల కేటాయింపునకు ప్రక్రియను ఎక్సైజ్ శాఖ చేపట్టింది. లాటరీ అనంతరం ఈ నెల 15న ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాల అప్పగించనున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. దేశంలో తయారైన విదేశీ మద్యం బాటిళ్లు ఎమ్మార్పీ ధరను చిల్లర లేకుండా సర్దుబాటు చేసేలా అదనపు ప్రివిలేజ్ ఫీజు విధించనుంది. క్వార్టర్ బాటిల్ ధర రూ.99కే విక్రయించేలా సవరణ చేసింది.

 

అత్తాకోడలిపై సామూహిక అత్యాచారం.. ఆరుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్లే!
శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని  నల్ల బొమ్మనపల్లిలో అత్తా కోడలిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో  హిందూపురం ప్రభుత్వం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి సవిత పరామర్శించారు. సంఘటన జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారని చెప్పారు. వారి ఆదేశాలతో 24 గంటల్లో నిందితులను పోలీసులు పట్టుకోగలిగారన్నారు. నిందితుల కోసం పోలీసులు నాలుగు బృందాలుగా గాలించారు.. మరో గంటలో నిందితులను చూపిస్తామన్నారు. ఈ సంఘటనలో ఆరు మంది పాల్గొన్నారని.. వారిలో ముగ్గురు బాలురు కూడా ఉన్నారని మంత్రి తెలిపారు. గత ఐదు సంవత్సరాలలో గత ప్రభుత్వంలో జగన్ హయాంలో అత్యాచారాలు ఇటువంటి ఘటనలు జరిగాయన్నారు. వారు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. దసరా పండుగ పూట శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది.. చిలమత్తూరు మండలం నల్లబొమ్మని పల్లి సమీపంలో అత్తా కోడళ్లపై అత్యాచారానికి తెగబడ్డారు దుండగులు. నిర్మాణంలో ఉన్న ఓ పేపర్‌ మిల్లులో వాచ్‌మన్‌గా ఉంటుంది ఓ కుటుంబం.. అయితే, రెండు బైక్‌లపై వచ్చిన దుండగులు.. కొడవలితో బెదిరించి ఘాతుకానికి పాల్పడినట్టు బాధితులు చెబుతున్నారు.. చిలమత్తూరు మండలం నల్లబొమ్మని పల్లి సమీపంలో నిర్మాణంలో ఉన్న పేపర్ మిల్లులో వాచ్‌మన్‌గా చేరింది ఓ కుటుంబం.. ఐదు నెలల క్రితం ఇక్కడికి ఉపాధి కోసం వచ్చిన బళ్లారికి చెందిన ఆ కుటుంబం.. ఇక్కడే ఉంటున్నారు.. అయితే, శుక్రవారం రాత్రి సమయంలో రెండు బైక్‌లపై దుండగులు వచ్చినట్టుగా తెలుస్తోంది.. కొడవలితో బెదిరించి.. బలవంతంగా పక్కకు లాక్కెల్లి.. ఒకరి తర్వాత ఒకరిపై అత్తా కోడళ్లపై అత్యాచారానికి ఒడిగట్టారు దుండగులు.. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు.. ఇక, జరిగిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లోనే ఆ వివరాలు తెలియనున్నాయి.

 

దేవరగట్టులో కర్రల సమరం, 70 మందికి గాయాలు
దేవరగట్టు కర్రల సమరంలో హింసను నియంత్రించేందుకు పోలీసులు తీసుకున్న ముందస్తు చర్యలు ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు. అధికారులు రూపొందించిన ప్రణాళికలు అమలవ్వకపోవడం వల్ల ఈ సమరంలో 70 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, వారిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా హోళగుంద మండలంలో ప్రతి సంవత్సరం దసరా రోజు అర్ధరాత్రి బన్ని ఉత్సవం జరగుతుంది. ఈ ఉత్సవంలో కర్రల సమరం జరిగి, ఇద్దరు వర్గాలు కర్రలతో పోరాడుతాయి. ఈ పోరాటం దేవతామూర్తుల ఆరాధన కోసం జరుగుతుంది, కానీ ఈసారి నిర్వహణలో చెలరేగిన హింస అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది. దీన్ని మరింత బలోపేతం చేయడానికి జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలు, హింసను అరికట్టలేకపోవడం పట్ల ప్రజలలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు ఈ ఉదంతాలను సమర్థంగా కట్టడి చేయలేకపోతుండడం, ప్రజల భద్రత పై నెగటివ్ ప్రభావం చూపుతోంది. ఈ కర్రల సమరంలో గాయపడిన 70 మందిలో చాలా మంది యువకులే కావడం, వారు చేస్తున్న ఈ పోరాటం ఆర్థిక, సామాజిక పరిస్థితుల ప్రతిబింబంగా కూడా ఉంది. దీంతో, ఈ సంఘటనలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నెగటివ్ భావనలను, ఆర్థిక సంక్షోభాలను ప్రతిబింబిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అటువంటి సంఘటనలు ప్రతీ సంవత్సరం జరుగుతున్నా, ప్రభుత్వం ఇంకా సమర్థమైన చర్యలు తీసుకోవడం లేదు. ప్రజలు ఈ ఘటనల గురించి చర్చిస్తూ, శాంతియుత పద్ధతుల్లో తమ అభ్యున్నతిని కోరుకుంటున్నారు, కానీ అధికార యంత్రాంగం వారి అభిప్రాయాలను పట్టించుకోవడం లేదు. ఇలా కొనసాగితే, భవిష్యత్తులో ఇలాంటి హింసాత్మక సంఘటనలు మరింత తీవ్రంగా మారవచ్చు అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

మాట నిలబెట్టుకున్నారు.. సీఎం రేవంత్ కు గొంగడి కర్ర బహుకరించిన దత్తాత్రేయ..
వస్తా నని చెప్పి.. సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారని హర్యానా గవర్నర్​ బండారు దత్తాత్రేయ అన్నారు. సీఎం రేవంత్ కు గొంగడి కర్ర బహుకరించారు. సీఎం ఆత్మ విశ్వాసంతో ఎదిగిన వ్యక్తి అన్నారు. జడ్పీటీసీ నుంచి సీఎంగా రేవంత్ రెడ్డి ఎదిగారన్నారు. అలయ్ బలయ్ కి రాజకీయాలకు సంబంధం లేదన్నారు. అనంతరం సీఎం రేవంత్ నీ దత్తాత్రేయ సన్మానించారు. సీఎంకు గొంగడి .. కర్ర బహుకరించారు. వేదిక మీదున్న గవర్నర్ లు.. బీజేపీ నేతలకు గొంగడి కర్ర బహుకరించారు. దసరా పండుగ సందర్భంగా బండారు దత్తాత్రేయ, ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రతి సంవత్సరం అలయ్ బలయ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. హర్యానా కి గవర్నర్ ఐనా..తెలంగాణ బిడ్డను నేను అన్నారు. చేతివృత్తులు ఈ అలయ్ బలయ్ లో ప్రదర్శించామన్నారు. వాటిని కాపాడుకోవాలని ఆలోచన ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎం లు పరస్పర అవగాహన తో పని చేయాలన్నారు. అన్నీ రంగాల్లో మొదటి స్థానంలో ఉండాలని, ఐకమత్యంగా ఉండి ముందుకు వెళ్ళాలని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా అందరితో గౌరవింపబడే వ్యక్తి దత్తాత్రేయ అన్నారు. అలయ్ బలయ్.. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిందన్నారు. పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు.. అలయ్ బలయ్ స్ఫూర్తి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో.. రాజకీయ పార్టీలన్నీ ఒకే వేదిక మీదకు వచ్చే అవకాశం లేకుండే అన్నారు. అలయ్ బలయ్ తెలంగాణ సంప్రదాయాల వేదిక అని తెలిపారు. రాజకీయాలకు సంబంధం లేదన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఎంతో ఎనర్జీ ఉండాలన్నారు. అలయ్ బలయ్.. గ్రామీణ సంస్కృతి నీ ప్రదర్శిస్తుందని తెలిపారు. ఐక్యత కి వేదిక అన్నారు. తెలంగాణ కల్చర్ ఏందో అందంగా ఉందని తెలిపారు. త్రిపుర లో కూడా విజయ దశమి చేస్తామన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు మాట్లాడుతూ.. అలయ్ బలయ్ ఆంధ్రలో కూడా పెట్టండని కోరారు. రాయలసీమ లో ఒకసారి యుద్ధం ప్రకటిస్తే.. అంతే అన్నారు. అందుకే అక్కడ ఆంధ్రలో కూడా అలయ్ బలయ్ పెట్టాలని తెలిపారు. రాయల సీమలో కల్చర్ మారాలి.. కొట్టుకోవడం పోవాలన్నారు. దతన్న పేరు..అలయ్ బలయ్ దత్తన గా పేరు మార్చాలని కోరారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. అలయ్ బలయ్ గొప్ప విషయం అన్నారు. తెలంగాణ రాజకీయాలు అనేక మార్పులు చేర్పులు వచ్చాయని తెలిపారు. ఎన్నికల ఎప్పుడు ఘర్షణ పడొచ్చు.. తమ ఏజెండా ప్రజలకు చెప్పుకోవచ్చన్నారు. ఎన్నికల తర్వాత బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు ముఖ్యం అని తెలిపారు. నాయకుల ప్రసంగాల్లో భాషలో మార్పులు రావాలన్నారు. తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య విమర్శించుకుంటున్న విధానాలు ప్రజలు అసహించుకుంటున్నారని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో విమర్శించుకుందామన్నారు. కానీ ప్రజలు అసహ్యించుకునే లాగా మాట్లాడకండి అని సూచించారు. మోడీ తరపున తెలంగాణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

 

హరీష్ రావు చిట్ చాట్.. మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..
చీఫ్ విప్ గా మహేందర్ రెడ్డి నియామకం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతుంది. మహేందర్ రెడ్డి నియామకంపై చిట్ చాట్ వేదికగా హరీష్ రావు మండిపడ్డారు. దీంతో హరీష్ చిట్ చాట్ కు స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ప్రతిదాన్ని రాజకీయం చేయటం హారీష్ రావుకు అలవాటుగా మారిందన్నారు. హరీష్ రావు వ్యవస్థలను రాజకీయాల్లోకి లాగుతున్నారని మండిప్డడారు. రాజ్యాంగానికి లోబడే పట్నం మహేందర్ రెడ్డిని మండలి చీఫ్ విప్ గా నియమించారన్నారు. హరీష్ రావు శాసనసభ వ్యవహారాలమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో ఎలా చేర్చుకున్నారో చెప్పాలి? అని ప్రశ్నించారు. కేసీఆర్ హాయాంలో హరీష్ రావుకు రాజ్యాంగం గుర్తుకు రాలేదా ? అన్నారు. పీఏసీ ఛైర్మన్ పదవిని సంప్రదాయం ప్రకారం ప్రతిపక్షానికే ఇచ్చామన్నారు. ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. చీఫ్ విప్ గా మహేందర్ రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధం ? అంటూ మాజీ మంత్రి హరీష్ రావు చిట్ చాట్ వేదికగా విరుచుకుపడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుందన్నారు. బిల్ పాస్ చేయించడం, ప్రభుత్వ బిజినెస్ జరిగేలా చీఫ్ విప్ బాధ్యత అన్నారు. మహేందర్ రెడ్డి ఇప్పుడు ఎవరికి విప్ ఇష్యూ చేస్తాడు?.. అధికార పార్టీ సభ్యులకా… ప్రతి పక్ష పార్టీ సభ్యులకా అని ప్రశ్నించారు. ఆయన విప్ జారీ చేస్తడా.. లేక బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన విప్ ను పాటిస్తాడా అని ప్రశ్నలు సంధించారు. విప్ అనే వ్యక్తి తన పార్టీ ఆదేశాలనుసారం నడుచుకోమని జారీ చేసేది విప్ అన్నారు. ఎదుటి పార్టీ వారిని చీఫ్ విప్ చేస్తే ఏ పార్టీకి విప్ జారీ చేస్తాడన్నారు. బీఆర్ఎస్ పార్టీ విప్ ప్రస్తుత చీఫ్ విప్ కు విప్ జారీ చేసే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన, రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని ఎందుకు ఇది మరో ఉదాహరణ అన్నారు. పీఎసీ, చీఫ్ విప్ ఎంపిక విషయాల్లో ఇది స్పష్టంగా అర్థమవుతున్నదని చిట్ చాట్ కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇవ్వడంతో రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

 

సిద్ధిక్ హత్యతో సల్మాన్ ఖాన్‌‌కు నిద్ర పట్టడం లేదు.. అన్ని మీటింగ్స్ రద్దు..
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య దేశరాజకీయాల్లో సంచలనంగా మారింది. శనివారం రాత్రి ముంబైలోని బాంద్రాలో తన కుమారుడు జీషాన్ సిద్ధిక్ కార్యాలయం సమీపంలో బాబా సిద్ధిక్‌ని కాల్చి చంపారు. దాడికి పాల్పడిన ముగ్గురు దుండగుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నాడు. ఈ హత్య విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. మరోవైపు ఈ ఘటన బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలకు కారణమవుతోంది. ఈ హత్యకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. షుబు లోంకర్ మహారాష్ట్ర అనే గ్యాంగ్ సభ్యుడు ఫేస్‌బుక్ పోస్ట్‌లో “ఓం, జై శ్రీరామ్, జై భారత్. నేను జీవితం యొక్క సారాంశాన్ని అర్థం చేసుకున్నాను. సంపద, శరీరాన్ని ధూళిగా భావిస్తున్నాను. నేను ఒక మంచి పని చేసాను. స్నేహం యొక్క కర్తవ్యాన్ని గౌరవించాను. సల్మాన్ ఖాన్, మేము యుద్ధం కోరుకోలేదు. కానీ నువ్వు మా అన్నయ్యని బాధపెట్టావు. సల్మాన్ ఖాన్, దావూద్‌తో తప్ప మాకు ఎవరితో శత్రుత్వ లేదు. ఎవరైతే వీరికి మద్దతు ఇస్తారో వారు పరిణామాలు ఎదుర్కోవాలి. ఎవరైనా మా వాళ్లను చంపితే తప్పకుండా రియాక్షన్ ఇస్తాం. మేం ఎప్పుడూ మొదట దాడి చేయం’’ అని పేర్కొన్నాడు. సల్మాన్ ఖాన్‌కి అత్యంత ఆప్తుడైన సిద్ధిక్ మరణించడంపై ఆయన తీవ్రంగా మనోవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి సల్మాన్ ఖాన్, సిద్ధిక్ మరణంతో కుంగిపోయినట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ గత రాత్రి ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో సిద్ధిక్ మృతదేహాన్ని చూసి, బాంద్రాలోని తన నివాసం గెలాక్సీ అపార్ట్మెంట్‌కి తిరిగి వచ్చాడు. ఆ రాత్రి నిద్ర పోలేకపోయాడని సమచారం. ఇదిలా ఉంటే, సిద్ధిక్ హత్య నేపథ్యంలో సల్మాన్ ఖాన్ బాంద్రా నివాసం వెలుపల భద్రత పెంచారు. సల్మాన్ ఖాన్, సిద్ధిక్ అంత్యక్రియల ఏర్పాటును, ఇతర విషయాలను ఫోన్‌లో అడిగి తెలుసుకుంటున్నట్లుగా సన్నిహిత వర్గాలు తెలిపాయి. రాబోయే కొద్ది రోజుల పాటు తన వ్యక్తిగత సమావేశాలను కూడా రద్దు చేసుకున్నాడు. బాబా సిద్ధిక్ మరణం సల్మాన్ ఖాన్ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. అర్బాజ్, సోహైల్ కూడా సిద్ధిక్‌కి చాలా సన్నిహితులు. తరుచుగా వీరంతా ఇఫ్తార్ పార్టీల్లో కలుసుకునే వారు. సిద్ధిక్ సల్మాన్‌ఖాన్‌ని స్నేమితుడిగానే కాకుండా, కుటుంబంలో ఒకడిగా ఉండేవారు. సిద్ధిక్ మరణవార్త తెలిసిన సమయంలో సల్మాన్ ఖాన్ బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్‌లో ఉన్నారు. వెంటనే షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని ఆస్పత్రికి చేరారు.

 

ముప్పు వాటిల్లితే తగ్గేదేలే.. శత్రు దేశాలకు భారత్ హెచ్చరిక?
భద్రత విషయంలో భారత్ రాజీపడదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దసరా సందర్భంగా అన్నారు. ఏ దేశమైనా భారత్ ప్రయోజనాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు భారత్ వెనకాడబోదని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని సుక్నా మిలటరీ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు. భారతదేశం ఏ దేశంపైనా ద్వేషపూరిత భావంతో, ద్వేషపూరితంగా దాడి చేయలేదన్నారు. ఎవరైనా మమ్మల్ని అవమానించినప్పుడు లేదా మన సమగ్రత, సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించినప్పుడు మాత్రమే పోరాడుతామన్నారు. మన ప్రయోజనాలకు ముప్పు కలిగితే, పెద్ద అడుగు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని శత్రు దేశాలను హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. బీఆర్‌ఓ నిర్మించిన ఈ 75 ప్రాజెక్టులలో 22 రోడ్లు, 51 వంతెనలు, రెండు ఇతర ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో జమ్మూ కాశ్మీర్‌లో 19, అరుణాచల్ ప్రదేశ్‌లో 18, లడఖ్‌లో 11, ఉత్తరాఖండ్‌లో 9, సిక్కింలో 6, హిమాచల్ ప్రదేశ్‌లో 5.. బెంగాల్, రాజస్థాన్‌, నాగాలాండ్, మిజోరాం, అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక్కొక్కటి ఉన్నాయి. ఈ 75 ప్రాజెక్టులతో బీఆర్‌ఓ ఈ ఏడాది మొత్తం 111 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పూర్తి చేసింది. వాటి మొత్తం ఖర్చు రూ.3,751 కోట్లు. శనివారం ప్రారంభించబడిన ప్రధాన ప్రాజెక్టులలో ఒకటి సిక్కింలో వ్యూహాత్మకంగా ముఖ్యమైన కుపుప్-షెర్తాంగ్ రహదారి. ఈ రహదారి జవహర్ లాల్ నెహ్రూ మార్గ్, జులుక్ యాక్సిస్ మధ్య ఒక ముఖ్యమైన లింక్‌గా పనిచేస్తుంది. ఇది ఆర్మీ సిబ్బంది, పరికరాల తరలింపు కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని అందిస్తుంది. వ్యూహాత్మక కారణాలతో సరిహద్దు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతోపాటు ఈ ప్రాంతాలు, ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాల సామాజిక-ఆర్థిక అభివృద్ధిని నిర్ధారించేందుకు ప్రభుత్వం ‘అచంచలమైన సంకల్పం’కు ఈ ప్రాజెక్టులు నిదర్శనం.

 

ఇరాన్ , హిజ్బుల్లా మద్దతు కోసం అక్టోబర్ 07 దాడి ఆలస్యం.. 9/11 తరహా దాడులకు ముందుగా ప్లాన్..
హమాస్ అక్టోబర్ 07, 2023 దాడికి ఏడాది ముందు నుంచే ప్లాన్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. దాడుల కోసం హమాస్ మిలిటరీ, పొలిటికల్ నాయకుడు దాదాపుగా రెండేళ్ల పాటు వరసగా సమావేశాలు నిర్వహించారు. గతేడాది అక్టోబర్ 07 నాటి దాడిలో హమాస్, దక్షిణ ఇజ్రాయిల్‌లోకి ప్రవేశించి 1200 మందిని చంపింది. 251 మందిని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత నుంచి ఇజ్రాయిల్ హమాస్‌పై విరుచుకుపడుతోంది. గాజాలో దాడుల్లో ఇప్పటి వరకు 40 వేలకు పైగా మంది మరణించారు. నిజానికి హమాస్ అంతకుముందు ఏడాదే అక్టోబర్07 తరహా దాడులు చేయాలని ప్లాన్ చేసింది. అయితే, ఇరాన్ హిజ్బుల్లా సాయం పొందాలని కోరడంతో ప్లాన్ ఆలస్యం అయింది. రెండేళ్ల పాటు హమాస్ కీలక నాయకులు వరసగా చర్చలు జరిపారు.ఈ ఏడాది జనవరిలో ఖాన్ యూనస్‌లోని హమాస్ కంట్రోల్ సెంటర్‌లోని కంప్యూటర్ నుంచి సేకరించిన వివరాల్లో ఈ వివరాలు ఉన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ వెల్లడించింది. న్యూయార్క్ టైమ్స్ శనివారం వెల్లడించిన కథనం ప్రకారం.. జనవరి 2022 నుంచి ఆగస్టు 2023 వరకు జరిగిన 10 హమాస్ సమావేశాల గురించి వివరించింది. ఈ సమావేశాల్లో ఇరాన్ ప్రమేయం, ఫండింగ్‌కి సంబంధించిన వివరాలు ఉన్నట్లు తెలిసింది. అయితే, హమాస్ నుంచి ఏ నాయకులు హాజరైన వివరాలు స్పష్టంగా తెలియనప్పటికీ, ప్రస్తుత హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మాత్రం అన్ని సమావేశాలకు హాజరైనట్లు తెలుస్తోంది. చనిపోయిన మహ్మద్ డెయిఫ్, మర్వాన్ ఇస్సా, మహ్మద్ సిన్వార్ చాలా సమావేశాలకు హాజరైనట్లు నివేదిక పేర్కొంది. యాహ్యా సిన్వార్ 500 మిలియన్ డాలర్ల నిధులను కోరాడని, దీనిని పవిత్ర యుద్ధానికి ఉపయోగిస్తానని చెప్పాడని సమాచారం. ప్రణాళికలో భాగంగా హమాస్ ఇజ్రాయిల్ సైనిక సదుపాయాలు, పౌరులపై దాడికి ప్లాన్ చేసింది. “ఈ పవిత్రమైన లక్ష్యాన్ని సాధించడానికి మమ్మల్ని తీసుకెళ్లే వరకు మేము ఒక్క నిమిషం లేదా పైసా వృధా చేయబోమని మేము మీకు వాగ్దానం చేస్తున్నాము” అని సిన్వార్ జూన్ 2021 నాటి ఒక లేఖలో పేర్కొన్నాడని నివేదిక తెలిపింది. ది వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. హమాస్ మిలిటరీ వింగ్ 10 మిలియన్ డాలర్ల కేటాయింపును ఇరాన్ అధికారి ధృవీకరించిన లేఖను ఉటంకిస్తూ నివేదించింది. సిన్వార్ తర్వాత అదనంగా $500 మిలియన్లను కోరినట్లు నివేదించబడింది, ఇది రెండు సంవత్సరాలలో డెలివరీ చేయబడుతుందని అతను చెప్పాడు, నెలకు $20 మిలియన్లు బదిలీ చేయబడతాయని ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. జనవరి 2022లో జరిగిన సమావేశం తర్వాత, మహాస్ అదే ఏడాది ఏప్రిల్, జూన్‌లో పెద్ద దాడి చేయాలని సుదీర్ఘంగా చర్చింది. షాపింగ్ మాల్స్, మిలిటరీ కామాండ్ సెంటర్ల, టెల్ అవీవ్‌లో అజ్రీలీ టవర్లపై దాడి చేయాలని అనుకున్నారు. న్యూయార్క్‌ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై 9/11 దాడుల తరహాలోనే దాడులు చేయాలని భావించింది. అయితే, టవర్లను కూల్చే సామర్థ్యం తకము లేదని నిర్ధారించడంతో ఈ ప్రణాళికను అమలు చేయలేదు. ఆ తర్వాత 2022 సెప్టెంబర్‌లో ఇజ్రాయిల్ మిలిటరీ సదుపాయాలపై దాడులు చేయాలని ప్లాన్ చేసింది. అయితే, మళ్లీ వెనక్కి తగ్గింది. దీనికి నిధులు, ఇరాన్, హిజ్బుల్లా మద్దతు కారణంగా తెలిసింది. 2023 ఆగస్టులో హమాస్ డిప్యూటీ లీడర్ ఖలీల్ అల్ హయ్యా, ఇరాన్ రివల్యూషనరీ గార్డస్ కార్ఫ్స్ సీనియర్ నాయకుడు మహ్మద్ సైద్ ఇజాదీ లెబానాన్‌లో సమావేశమయ్యారని నివేదిక తెలిపింది. దాడి ప్రారంభమైన మొదటి గంటలోనే ఇజ్రాయిల్ టార్గెట్లను నాశనం చేయాల్సిన అవసరం కోసం హమాస్ ఇరాన్‌ని సాయం కోరింది. అయితే, ఇరాన్ హమాస్ ప్లాన్‌ని స్వాగతించింది, అదే సమయంలో తమకు టైమ్ కావాలని కోరినట్లు తెలిసింది. చివరకు హమాస్ ఇరాన్, హిజ్బుల్లా ప్రత్యక్ష సాయం లేకుండానే అక్టోబర్ 07 ఉదయం ఇజ్రాయిల్‌పై దాడి చేసింది. ఇది గాజా యుద్ధానికి కారణమైంది. ఏడాదిగా యుద్ధం కొనసాగుతూనే ఉంది.

 

వైభవంగా నారా రోహిత్ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే ?
ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. హీరోలు లేదా హీరోయిన్లు వరుసగా పెళ్లి పీటలెక్కుతున్నారు. తాజాగా మరో టాలీవుడ్ హీరో త్వరలో పెళ్లిలెక్కబోతున్నారు. 40 ఏళ్ల లేటు వయస్సులో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు నారా వారబ్బాయి నారా రోహిత్. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సోదరుడు కుమారుడు నారా రోహిత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ‘బాణం’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత సోలో సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ తరువాత రౌడీ ఫెలో, అప్పట్లో ఒకడు ఉండేవాడు, ఒక్కడినే, ప్రతినిధి, అసుర, రాజా చేయి వేస్తే, జో అచ్చుతానంద, శంకర, శమంతక మణి, కథలో రాజకుమారి, బాలకృష్ణుడు అనే సినిమాల్లో నటించారు. తాజాగా ప్రతినిధి 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఆ సినిమా హీరోయిన్‌ శ్రీ లేళ్లతో ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఆయనకు పరిచయం ఏర్పడింది. ఇరుకుటుంబాల పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ రోజు అంటే ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో జరిగిన వారి ఎంగేజ్‌మెంట్‌ ఫంక్షన్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, ఇరు కుటుంబాల పెద్దలతోపాటు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు చెప్పారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.