NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

అడ్డగోలుగా వ్యవహరించిన అధికారుల జాబితా ఇవ్వండి.. పార్టీ నేతలకు చంద్రబాబు సూచన..
గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వారికి చట్టపరంగా శిక్షలు మాత్రం కచ్చితంగా ఉంటాయని స్పష్టం చేశారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. దీని కోసం గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించిన అధికారుల జాబితా ఇవ్వాలని పార్టీ నేతలకు సూచించారు చంద్రబాబు.. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన ఆయన.. అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం అయ్యారు.. పార్టీ కార్యాలయం వేదికగా సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.. ప్రతి రోజూ ఒకరిద్దరు మంత్రులు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.. కార్యకర్తలు.. సామాన్య ప్రజల నుంచి వినతులు స్వీకరించాలన్నారు. పార్టీకి – ప్రభుత్వానికి గ్యాప్ రాకుండా చూసుకునే బాధ్యత మంత్రులదే అన్నారు చంద్రబాబు. వ్యక్తిగత దూషణలకు.. భౌతిక దాడులకు దిగకుండా సంయమనం పాటించాలన్నారు.. వైసీపీ తరహాలో టీడీపీ కూడా వ్యవహరిస్తే తేడా ఏముందని ప్రశ్నించారు.

గంజాయి, ఎర్రచందనంపై ఏపీ డీజీపీ కీలక వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి కట్టడి, ఎర్రచందనం స్మగ్లింగ్‌ అరికట్టడంపై కీలక వ్యాఖ్యలు చేశారు డీజీపీ ద్వారకా తిరుమలరావు.. ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తాం.. యాంటీ నార్కొటిక్స్ టాస్క్ ఫోర్స్ టీంను త్వరలో ఏర్పాటు చేస్తాం అన్నారు.. ఇక, గంజాయి అక్రమ రవాణా సమాచారం కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నాం.. ఎర్రచందనం స్మగ్లింగ్ ను పూర్తి స్థాయిలో అడ్డుకుంటామని స్పష్టం చేశారు.. సవరణ చేసిన మూడు నూతన చట్టాలపై పోలీసులకు అవగాహన కల్పిస్తున్నాం.. రాష్ట్రంలోని ప్రధానమైన నగరాల్లో మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం అన్నారు.. రాష్ట్రంలో పోలీసులు ఉపయోగించే పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలను కొనుగోలు చేస్తామని వెల్లడించారు డీజీపీ. మరోవైపు.. పోలీసులకు త్వరలో పదోన్నతులు ఇస్తున్నాం.. పోలీసు సిబ్బంది సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తాం అన్నారు ఏపీ డీజీపీ.. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తా.. పోలీసు అధికారులతో సమావేశమవుతా.. పౌరులను మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు. సమాజానికి.. ప్రజలకు జవాబుదారితనంగా పనిచేస్తాం.. చట్టాన్ని గౌరవిస్తూ.. మానవ హక్కులను ఉల్లంఘించకుండా.. ఏ పార్టీకి కొమ్ముకాయకుండా పనిచేస్తామని స్పష్టం చేశారు.. నేరాలను అదుపు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం.. ప్రతి జిల్లాలో సవాళ్లను ప్రతి సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటాం అన్నారు ఏపీ పోలీస్ బాస్‌ ద్వారకా తిరుమలరావు..

మారనున్న కుప్పం రూపురేఖలు.. సీఎం ఆదేశాలతో అభివృద్ధి వైపు వేగంగా అడుగులు..!
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం రూపురేఖలు మారిపోతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.. కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెట్టించడానికి చకచక అడుగులు పడుతున్నాయి. ఎన్నికల అనంతరం సీఎం హోదాలో కుప్పంలో పర్యటించిన చంద్రబాబు.. పలుకీలకమైన హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీల్లో భాగంగా తొలుత.. కడా (కుప్పం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ) ను తిరిగి ప్రారంభించారు. కుప్పం సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 1995లోనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో డీఆర్‌డీఏ పీడీ, సబ్‌ కలెక్టర్‌ స్థాయి అధికారులను ప్రాజెక్టు అధికారులుగా కొనసాగారు. 2004 వరకు కొనసాగిన కడాను కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసింది. చంద్రబాబు మూడో దఫా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తర్వాత  2014లో మళ్లీ పునరుద్ధరించారు. ఐదేళ్ల పాటు ప్రాజెక్టు అధికారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమాన్ని అమలు చేశారు. ఇక, కడా కోసం నెల్లూరు మున్సిపల్‌ కమిషనర్‌గా ఇది వరకు విధులు నిర్వర్తించిన వికాస్‌ మర్మట్‌ను కడా ప్రాజెక్టు డైరెక్టర్‌గా ప్రభుత్వ నియమించింది. 2019వ బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి ఆయన.. ఆధ్వర్యంలోనే పనులు సాగనున్నాయని అధికారులు చెబుతున్నారు. వందకోట్ల నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు చంద్రబాబు. ఆయా ఆభివృద్దికి సంబంధించిన ప్రణాళిక అధికారులు రూపొందిస్తున్నారు. ఇక శాంతిపురం మండల పరిధిలోని కొలమడుగు గ్రామపంచాయతీ రామాపురం వద్ద కార్గో ఎయిర్ పోర్టు నిర్మాణానికి భూములను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పరిశీలించారు. ఎయిర్‌పోర్టు సంబంధించిన భూ పరిశీలన వేగంగా సాగుతోంది. ఇక కుప్పంలోని చిగురుకుంట – బిస్సానత్తం గనుల నుంచి బంగారు నిక్షేపాలు వెలికి తీసేందుకు అడుగులు పడుతున్నట్లు సమాచారం.. దానిపై అధికారులు ఓ నివేదికను సిద్ధం చేస్తున్నారటా.. ఆ ప్రాజెక్టు వల్ల వేలమందికి కుప్పంలో ఉపాధి లభించే అవకాశం ఉంది. ఇలా కుప్పం అభివృద్ధి టార్గెట్ గా చంద్రబాబు పూర్తి స్ధాయిలో దృష్టి పెట్టడమే కాకుండా ఆ పనులు వేగంగా సాగుతుండటంపై కుప్పం ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తల్లికి వందనం పథకం.. క్లారిటీ ఇచ్చిన మంత్రి నిమ్మల
తల్లికి వందనం పథకంపై ఆంధ్రప్రదేశ్‌లో పాలక, ప్రతిపక్షాల మధ్య విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.. అయితే, ఎలాంటి కోతలు లేకుండా తల్లికి వందనం పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసి చూపిస్తుందని స్పష్టం చేశారు ఏపీ ఇరిగేషన్‌ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాoటీన్లు ప్రారంభిస్తున్నాం అని వెల్లడించిన ఆయన.. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ విద్యార్థికి రూ.15 వేలు తల్లికి వందనం పేరిట ఇచ్చే పథకానికి త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తాం అన్నారు.. పండుగ వాతావరణంలో తల్లికి వందనం కార్యక్రమం త్వరలో చేపడతామని వెల్లడించారు.. అయితే, అబద్దాలకు, అసత్యాలకు రాష్ట్రంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో వైసీపీ పేటంట్ పొందిందని ఎద్దేవా చేశారు.. 2019లో వచ్చిన మూడంకెల సీట్లు 2024లో డబుల్ డిజిట్ కు పడిపోయినా వైసీపీకి బుద్ధి రాలేదని మండిపడ్డారు. ఇక, ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకుండానే ఫించన్, ఇసుక, తల్లికి వందనం వంటి పథకాలపై విష ప్రచారం మొదలుపెట్టిన వైసీపీకి ఈసారి సింగిల్ డిజిట్టే అంటూ వార్నింగ్‌ ఇచ్చారు మంత్రి నిమ్మల.. అమ్మఒడి ఇద్దరు పిల్లలున్నా ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పి మడమ తిప్పింది జగన్ కాదా..? అని ప్రశ్నించారు. మేం ఇంకా తల్లికి వందనం విధి విధానాలు రూపొందించక ముందే అసత్యాలు మొదలు పెట్టారు. అమ్మఒడి ని మోసం దగాతో కేవలం 4సార్లు మాత్రమే ఇచ్చి ప్రతీ ఏటా ఇస్తానన్న మొత్తాన్ని కూడా కుదించేశారు.. అమ్మఒడి పథకానికి తూట్లు పొడిచిన వైసీపీ నేతలకు తల్లికి వందనం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు అటూ ఫైర్‌ అయ్యారు మంత్రి నిమ్మల రామానాయుడు.

తెలంగాణ పాఠశాలల్లో ప్రహరీ కమిటీలు.. డ్రగ్స్ అరికట్టేందుకు నిర్ణయం
తెలంగాణ పాఠశాలల్లో ప్రహరీ కమిటీలు వేయనున్నారు. మాదక ద్రవ్యాల నిరోధానికి ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాలలు, విద్య, శిశు సంరక్షణ సంస్థల పరిసర ప్రాంతాలలో మాదకద్రవ్యాల విక్రయాలను ఆపడానికి ప్రహరీ కమిటీలు పనిచేయనున్నాయి. అన్ని ఉన్నత పాఠశాలల్లో ప్రహరీ క్లబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. పిల్లలను మాదకద్రవ్యాల దుర్వినియోగం నుండి దూరం చేయడానికి ప్రహరీ క్లబ్ లు నిర్మించనున్నారు. పాఠశాలలు, విద్య, శిశు సంరక్షణ సంస్థల పరిసర ప్రాంతాలలో మాదకద్రవ్యాల విక్రయాలను ఆపడానికి ప్రహరీ క్లబ్ లు ఏర్పాటు చేయనున్నారు. పిల్లలు మత్తు పదార్థాలుగా ఉపయోగించే ఔషధ మందులు, పదార్థాలు.. ఇతర రకాల వస్తువులు చేరకుండా నిరోధించడానికి ఈ క్లబ్ లు ఏర్పాటు చేయనుంది. త్వరలో విధివిధానాలు ఖరారు కానున్నాయి. డ్రగ్స్ కట్టడికి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది.

తెలంగాణ సహా ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రాల జాబితాను విడుదల చేసి అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రానున్న మూడు రోజులు అనేక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గోవా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే జూలై 16న (మంగళవారం) గుజరాత్‌లో అతి భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నట్లు వెల్లడించింది. అలాగే వచ్చే మూడు రోజుల్లో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, నాగాలాండ్, కేరళ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి ప్రభంజనం.. కూటమికి 10, బీజేపీకి 02..
ఏడు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి సత్తా చాటింది. మొత్తం 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 10 స్థానాలను కూటమి కైవసం చేసుకోగా, బీజేపీ కేవలం 02 సీట్లకు మాత్రమే పరిమితమైంది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, బీహార్ మరియు తమిళనాడులోని 13 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఉపఎన్నికలు జరగగా, ఈ రోజు ఫలితాలు వెలువడ్డాయి. పంజాబ్ జలంధర్ వెస్ట్ నుంచి ఆప్‌కి చెందిన మోహిందర్ భగత్ విజయం సాధించారు. బెంగాల్‌లో నాలుగు స్థానాలను అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) గెలుచుకుంది. ఈ స్థానాల్లో బీజేపీ రెండో స్థానానికి పరిమితమైంది. తమిళనాడులోని విక్రవాండిలో అధికార డీఎంకే అభ్యర్థి అన్నియూర్ శివ గెలుపొందారు. ఇక హిమాచల్ ప్రదేశ్‌లో 03 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగగా, రెండు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. హిమాచల్‌ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్‌ సింగ్‌ సుఖు భార్య కమలేష్‌ ఠాకూర్‌ తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచి బీజేపీ కంచుకోట డెహ్రా నియోజకవర్గంలో విజయం సాధించారు. ఈ రాష్ట్రంలో నలాగడ్‌లో కాంగ్రెస్ గెలవగా, హమీర్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి ఆశిష్ శర్మ విజయం సాధించారు.

కేజ్రీవాల్ హెల్త్‌పై ఆప్ రిపోర్టు విడుదల.. ఆందోళనలో శ్రేణులు!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. కేజ్రీవాల్ దాదాపు 8.5 కిలోల బరువు తగ్గారని.. అలాగే బ్లడ్ షుగర్ కూడా 50 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా పడిపోయిందని ఆప్ సీనియర్ నేత సంజయ్ ‌సింగ్ ఆరోపించారు. దీంతో ఆప్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న అరెస్టై తీహార్ జైల్లో ఉన్నారు. పలుమార్లు బెయిల్ పిటిషన్లు వేసినా తిరస్కరణకు గురయ్యాయి. ఆ మధ్యలో ట్రయల్ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కానీ సీబీఐ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టుకు వెళ్లి అడ్డుకోవడంతో ఆగిపోయింది. ఇటీవల ఈడీ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ మరో సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ఇంకా జైల్లోనే కేజ్రీవాల్ మగ్గుతున్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల కోసం మాత్రం 21 రోజులు సర్వోన్నత న్యాయస్థానం తాత్కాలిక బెయిల్ మంజూరు చేయడంతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం జూన్ 2న తిరిగి తీహార్ జైల్లో లొంగిపోయారు. శనివారం సంజయ్‌సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. తీహార్ జైల్లో కేజ్రీవాల్‌ను తీవ్రమైన వ్యాధితో బాధపెట్టడానికి కుట్ర పన్నుతోందని.. ఇది అత్యంత ఆందోళనకరమైన విషయమని పేర్కొన్నారు. మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసినప్పుడు కేజ్రీవాల్ బరువు 70 కిలోలు అని, ప్రస్తుతం బరువు 61.5 కిలోలకు తగ్గిందని సంజయ్‌సింగ్ చెప్పారు. ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించకపోవడం వల్లే కేజ్రీవాల్ బరువు తగ్గడానికి కారణమని పేర్కొన్నారు.

పాక్ కు భారీ ఉపశమనం.. రుణ ప్యాకేజీకి అంతర్జాతీయ ద్రవ్య నిధి గ్రీన్ సిగ్నల్
తీవ్ర ఆర్థిక సంక్షోంభంలో చిక్కుకున్న పాకిస్థాన్ కు తీపి కబురందింది. బెయిలౌట్ ప్యాకేజీ కోసం పాక్ నెలల తరబడి అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)ని నిరంతరం సంప్రదించింది. కొన్ని వారాల క్రితం.. ఐఎంఎఫ్ ఉన్నత స్థాయి కమిటీ ఆ దేశంలో పర్యటించి ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమీక్షించింది. ప్రస్తుతం పాక్ కు 7 బిలియన్ల యూఎస్ (US) డాలర్ల రుణ ప్యాకేజీని ఆమోదించింది. అయితే దీనికి పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆర్థిక, ఆర్థిక సంస్కరణలతో పాటు పన్ను బేస్ కూడా పెంచాల్సి ఉంటుంది. సబ్సిడీ విషయంలోనూ సంస్కరణలు తప్పవు. దీని వల్ల సామాన్య ప్రజలతో పాటు ముఖ్యంగా రైతులు కూడా నష్టపోవాల్సి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులకు స్వర్గధామంగా పేరొందిన పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి కొన్నేళ్లుగా చాలా దారుణంగా ఉంది. దీంతో అంతర్జాతీయ ద్రవ్య నిధి వద్ద మోకరిల్లింది. ఆర్థిక సంస్కరణలను చేపట్టాలని ఐఎమ్ఎఫ్‌ పాక్ కు సలహా ఇచ్చింది. కొన్ని వారాల క్రితం.. అకస్మాత్తుగా పాక్ లో పర్యటించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. “కఠినమైన షరతులతో కూడిన బెయిలౌట్ ప్యాకేజీ ప్రణాళికకు ఐఎమ్ఎఫ్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓ వైపు పన్ను బేస్ పెంచవలసి ఉంటుంది. మరోవైపు సబ్సిడీలను కూడా క్రమబద్ధీకరించవలసి ఉంటుంది. దీంతోపాటు వ్యవసాయ పన్నుల విషయంలో కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి.” అని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి రుణం పొందినందుకు కృషి చేసిన పాక్ ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్‌ను ప్రధాని షాబాజ్ ప్రశంసించారు.

అనంత్‌ పెళ్లిలో వదిన శ్లోకా స్పెషల్ ఎట్రాక్షన్.. మరిది కోసం ఏం చేసిందంటే..!
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. దేశ, విదేశాల నుంచి వచ్చిన అతిథుల మధ్య ఏడడుగుల బంధంతో జంట ఒక్కటైంది. బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని రంగాల సినీ ఇండస్ట్రీల ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు.. ఆనందోత్సవాలతో ఉత్సాహంగా డ్యాన్స్‌లు చేశారు. ఇక అనంత్ అంబానీ పెళ్లిలో వదిన శ్లోకా అంబానీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. మరిదికి ఇష్టమైన వాటిని వస్త్రాల రూపంలో ధరించి స్పెషల్‌గా నిలిచింది. అనంత్ అంబానీకి జంతువులు అంటే చాలా ఇష్టం. ఇందుకోసం గుజరాత్‌లో ప్రత్యేకంగా ఫారెస్ట్ కూడా ఏర్పాటు చేసి జంతువుల్ని పెంచుతున్నారు. దీంతో మరిదికి జంతువులపై ఉన్న మక్కువతో శ్లోకా అంబానీ.. జంతువుల బొమ్మలతో కూడిన దుస్తులు ధరించి ప్రేమను కురిపించారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్ట్రాగామ్‌లో వీడియోలు పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అంబానీ పెళ్లిలో తెలుగు హీరోల సందడి
గత కొన్నాళ్లుగా ముఖేష్ అంబానీ ఇంట్లో పెండ్లి వేడుకలు ముంబైలో ఘనంగా జరుగుతున్నాయి. అయితే శుక్రవారం రాత్రి అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహం జరిగింది. ఈ వేడుకకు దేశ విదేశాల తారలు తరలి వచ్చారు. ముఖ్యంగా పలు దేశాలకు చెందిన సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చి ఆటపాటలతో సందడి చేశారు. అంబానీల ఇంట వివాహ వేడుకకి బాలీవుడ్ నుంచి మాత్రమే కాక సౌత్ సహా హాలీవుడ్ నుంచి కూడా అనేక మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. అంబానీల పెళ్లిలో తెలుగు హీరోల గురించి మాట్లాడాలి అంటే మహేష్ బాబు ఫ్యామిలీతో పాటు రాంచరణ్, రానా దగ్గుబాటి తమ భార్యలతో హాజరయ్యారు. అలాగే ఫ్యామిలీతో రాకుండా విక్టరీ వెంకటేష్ కూడా అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో కనిపించారు. అలాగే అక్కినేని అఖిల్, రష్మిక మందన్న సహా మరికొందరు సెలెబ్రిటీలు కూడా హాజరయ్యారు.

తిండి లేక ఇబ్బంది పడుతున్నా.. తట్టుకోలేకే సూసైడ్ అటెంప్ట్.. లావణ్య కీలక వ్యాఖ్యలు
రాజ్ తరుణ్ ప్రియురాలిగా భార్యగా చెప్పుకుంటున్న లావణ్య సూసైడ్ అటెంప్ట్ వార్తలతో హాట్ టాపిక్ అయింది. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె తాను ఎందుకు సూసైడ్ చేసుకోవాలి అనుకున్నది వివరించింది. ‘’నాకు ఈ [ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ రాజే, ఆ రాజ్ కోసమే ఫైట్ చేస్తున్నాను. వస్తాడో, రాడో తెలియదు. వస్తాడని నమ్మకంతో ఫైట్ చేస్తున్నాను. నా ప్రేమ నిజమైతే వస్తాడని నమ్ముతున్నాను. అలాంటి ఒక టైంలో నేను వచ్చి ఫైట్ చేస్తుంటే, రాజ్ కోసం నేను పోరాడాలో లేకపోతే ఈ సొసైటీ అనే మాటలు, కామెంట్స్, తంబ్ నెయిల్స్ చూడాలో అర్థం కావడం లేదు. ఇవన్నీ నేను తట్టుకోలేక పోతున్నాను. రాజ్ తల్లితండ్రుల తరపున అడ్వొకేట్ ఉదయం నాకు సపోర్ట్ గా లెటర్ ఇచ్చి ఒక ఛానల్ కి వెళ్లి తిడుతున్నాడు. ఇలాంటి మనుషుల మధ్య ఉంటే నాకు డిప్రెషన్ కాక ఏం వస్తుంది? ఒకప్పుడు ఉదయం చూసే మొదటి ముఖం, రాత్రి పడుకునే ముందు చూసే చివరి ముఖం రాజ్ దే ఉండేది. కానీ ఇప్పుడు ఇల్లు ఖాళీ అయింది. తిండి లేక ఇబ్బంది పడుతున్నా అని రాజ్ కి ఫోన్ చేస్తే మాల్వి మల్హోత్రా ఫోన్ ఎత్తేది. ఆమె చెబితేనే రాజ్ నాకు డబ్బులు వేస్తాడు.. చాలామంది నన్ను టార్గెట్ చేశారు అలా చేయడం తట్టుకోలేకే సూసైడ్ అటెంప్ట్ చేశానని నటుడు రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య చెప్పుకొచ్చింది.