సీతారాం ఏచూరి కన్నుమూత..
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. కాగా.. కొన్ని రోజుల క్రితయం ఆయన ఫీవర్, లంగ్స్ ఇన్ఫెక్షన్ తో ఆగస్టు 19న ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. సీతారాం ఏచూరి మృతితో.. అటు కమ్యూనిస్ట్ వర్గాల్లో, దేశ రాజకీయాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. ఏచూరి స్వస్థలం కాకినాడ, పూర్తిపేరు ఏచూరి సీతారామారావు.ఆయన.. 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు. కాగా.. 1975లో సీపీఎం ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. సీతారాం ఏచూరి.. ఉమ్మడి ఏపీ మాజీ సీఎస్ మోహన్ కందాకు మేనల్లుడు.
బాల్యం మొత్తం హైదరాబాద్లోనే.. సీతారాం ఏచూరి జీవిత విశేషాలు
కమ్యూనిస్ట్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన సీతారాం ఏచూరి జీవిత విశేషాలు గురించి తెలుసుకుందాం. సీతారాం ఏచూరి తండ్రి ఏపీఎస్ ఆర్టీసీలో ఇంజినీర్ ఉద్యోగం చేసేవాడు.. ఆయన తల్లి ప్రభుత్వ ఉద్యోగిగా పని చేశారు. 1992 నుంచి ఏచూరి సీపీఎంలో పొలిట్‌బ్యూరో సభ్యుడుగా పనిచేశారు. ఆ తర్వాత.. 2005 నుంచి 2017 వరకు పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. సీతారాం ఏచూరి బాల్యం మొత్తం హైదరాబాద్‌లో గడిపారు. ఆయన హైదరాబాద్‌లోని ఆల్‌సెయింట్స్ హైస్కూల్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంతో ఏచూరి ఢిల్లీకి చేరారు. సీతారాం ఏచూరి.. ఢిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్‌లో 12వ తరగతి, ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో బీఏ ఆనర్స్, జేఎన్‌యూలో ఎంఏ ఎకనామిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. 1974లో ఎస్‌ఎఫ్‌ఐలో చేరిన ఏచూరి.. 1975 ఎమర్జెన్సీ టైమ్‌లో అరెస్ట్ కావడంతో స్టడీకి ఫుల్‌స్టాప్ పెట్టారు. మరోవైపు.. ఎమర్జెన్సీ టైమ్‌లో ఏచూరి అండర్‌గ్రౌండ్‌కు వెళ్లారు. అనంతరం ఆయన.. 1977-78 మధ్య జేఏన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1978లో ఎస్‌ఎఫ్‌ఐకి జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1984 సీపీఎం కేంద్ర కమిటీలోకి వెళ్లిన ఏచూరి.. 1985లో పార్టీ రాజ్యాంగ సవరణలో కీలక పాత్ర పోషించారు. 1992లో జరిగిన 14వ కాంగ్రెస్‌లో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ప్రమోషన్ పొందారు. 2005 నుంచి 2015 వరుసగా మూడు సార్లు ప్రధాన కార్యదర్శిగా.. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. అలాగే.. హిందుస్థాన్ టైమ్స్‌లో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కాలమ్.. 20 ఏళ్లుగా పార్టీ పత్రిక పీపుల్స్ డెమోక్రసీ ఎడిటోరియల్ బోర్డు మెంబర్ గా పని చేశారు. సీతారాం ఏచూరికి ఇంద్రాణి మజుందార్‌తో వివాహం అయింది. ఏచూరికి కూతురు అఖిలా ఏచూరి, కొడుకు ఆశిష్ ఏచూరి ఉన్నారు. జర్నలిస్ట్ సీమా చిస్తీని ఆయన రెండవ వివాహం చేసుకున్నారు. 2021 ఏప్రిల్ 22న కొవిడ్‌తో కొడుకు ఆశిష్ చనిపోయాడు.
ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలపై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ, ఆహార శుద్ది పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ శాఖల్లో ఉన్న పరిస్థితులపై సమీక్ష చేసి.. పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఉపాధి కల్పనలో కీలకమైన ఎంఎస్ఎంఈల అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి.. వాటికి చేయూతను ఇస్తుందని సీఎం అన్నారు. ప్రభుత్వం నుంచి తగు ప్రోత్సాహం అందిస్తే ఈ రంగం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అనేక సవాళ్లతో దెబ్బతిన్న ఈ రంగాన్ని సరికొత్త విధానాల ద్వారా మళ్లీ గాడిన పెడతామని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఎంఎస్ఎంఈ పార్కులను త్వరతిగతిన పూర్తి చేసి.. వసతులు, సౌకర్యాలు కల్పించి పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేస్తామన్నారు. ఆయా ప్రాంతాల్లో రైతుల భాగస్వామ్యంతో వారే ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసుకునే అంశంపై కసరత్తు చేయాలని సీఎం అన్నారు. భూములు కలిగిన రైతులు, ప్రైవేటు భాగస్వామ్యంతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం పార్క్‌లు ఏర్పాటు చేసుకునే విధానాన్ని అమల్లోకి తేవాలని సూచించారు. రాజధానిలో ఎలాగైతే రైతు భాగస్వామ్యంతో వారికి లబ్ది చేకూర్చామో.. అదే తరహా విధానాన్ని ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటులోనూ అవలంభించాలన్నారు. పుణె వంటి చోట్ల ఇలాంటి విధానం అమల్లో ఉందని అధికారులు చెప్పగా….అలాంటి విధానాలను పరిశీలించి రాష్ట్రంలో మెరుగ్గా అమలు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. పరిశ్రమల ఏర్పాటులో అర్థంలేని నిబంధనలు తొలగించాలని, సులభంగా అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిర్థేశించిన సమయంలో పరిశ్రమల ఏర్పాటుకు ఏ అధికారి అయినా, విభాగం అయినా అనుమతి ఇవ్వకపోతే.. ఆటోమేటిక్‌గా అనుమతులు పొందే విధానాన్ని అమల్లోకి తేవాలన్నారు. ప్యాకింగ్, డిజిటల్ కామర్స్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తే.. చిన్న పరిశ్రమల ఉత్పత్తులకు డిమాండ్ లభిస్తుందని అన్నారు. డ్వాక్రా సంఘాల వంటి వాటిని ఎంఎస్ఎంఈలతో అనుసంధానం చేయాలని.. వారిని ప్రోత్సహించాలని అన్నారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పరిశ్రమల ఇన్సెంటివ్స్‌ను ఇవ్వాల్సిన అవసరం ఉందని.. దానిపై కసరత్తు చేయాలని అధికారులకు సూచించారు. సాంకేతికత ద్వారా ఉత్పత్తి సామర్థ్యం పెంచేలా అధికారులు కార్యచరణ అమలు చేయాలన్నారు. ఆటోనగర్లను మోడ్రనైజేషన్ చేయాలని, ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు సర్వీస్ అందించే విధంగా నైపుణ్యం పెంచాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 7 క్లస్టర్లను పూర్తి చెయ్యాలన్నారు. ఎంఎస్ఎంఈకి క్రెడిట్ గ్యారెంటీకి రూ. 100 కోట్లు కేటాయిస్తామని సీఎం తెలిపారు. విశ్వకర్మవంటి కేంద్ర ప్రభుత్వ పధకాల ద్వారా వ్యాపారులకు రుణాలు, ప్రోత్సాహకాలు, ట్రైనింగ్ అందేలా చూడాలని అన్నారు. రాష్ట్రంలో ఆహారశుద్ది రంగంపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్‌కు రాష్ట్రంలో అపార అవకాశాలు, అనువైన పరిస్థితులు ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు. హార్టికల్చర్, ఆక్వా కల్చర్ ఉత్తత్తులకు.. ఆహార శుద్ధి పరిశ్రమ ద్వారా ఆదాయాలు పెరుగుతాయని సీఎం అన్నారు. రైతులు తాము పండించే పంటలకు వాళ్లే వాల్యూ ఎడిషన్ ఇచ్చుకునే పరిస్థితి కల్పించే విధంగా పాలసీ తీసుకురావాలని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని.. వాటిని ప్రోత్సహించాలని సీఎం వ్యాఖ్యానించారు. ఆయా ప్రాంతాల్లో పండే టమాటా, మ్యాంగో, మిరప, పసుపు, ఆక్వా ఉత్పత్తులకు అక్కడే ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. పుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ఎంఎస్ఎంఈలతో అనుసంధానం చేసి గ్రామాల్లో ప్రోత్సాహం ఇచ్చే విధంగా విధానాలు తీసుకురావాలని సీఎం అధికారులకు సూచించారు. సమీక్షలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
సీతారాం ఏచూరి మృతిపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి..
ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. సీతారాం ఏచూరి చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకమని అన్నారు. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని అభిప్రాయపడ్డారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో అడుగుపెట్టిన ఏచూరి.. దాదాపు నాలుగు దశాబ్ధాలుగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి అన్నారు. రాజ్యసభ ఎంపీగా, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యునిగా, ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా ఆయన దేశంలో అందరికీ సుపరిచితుడయ్యారని.. ఆయన లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అకాలమరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరోవైపు.. సీపీఏం సీనియర్ నేత కామ్రేడ్ సీతారాం ఏచూరి అకాల మరణం పట్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంతాపం వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి మరణం కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటని అన్నారు. తెలుగు బిడ్డగా ఢిల్లీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీతారాం ఏచూరికి నివాళి అర్పిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. బదిలీల గడువు పొడిగించిన సర్కార్..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఉద్యోగుల బదిలీలు చేపట్టేందుకు గడువును మరోసారి పొడిగించింది.. గతంలో గడువు పొడిగించిన ప్రకారం.. ఈ నెల 15వ తేదీ వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేసింది.. అయితే, 16వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్.. అయితే, ఉద్యోగుల బదిలీల గడువును మరోసారి పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. సెప్టెంబర్ 22 తేదీ వరకు గడువును పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.. ఇక, సెప్టెంబర్ 23 తేదీ నుంచి బదిలీలపై నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది.. ఎక్సైజ్ శాఖ బదిలీల గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.. అక్టోబర్ 1 తేదీన ఆ శాఖ బదిలీల్లో నిషేధం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కాగా, బదిలీల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయనే విమర్శలు వచ్చాయి.. వివిధ శాఖలు బదిలీలతో ఇబ్బందులు పడుతుంటే.. మరికొందరు ఉద్యోగులు.. వివిధ ఉద్యోగ సంఘాలను అడ్డం పెట్టుకుని బదిలీ కాకుండా చూసుకుంటున్నారట.. దాని కోసం ఆయా ఉద్యోగ సంఘాల నుంచి ఆఫీసర్ బేరర్స్ లెటర్స్ సంపాదించి.. బదిలీల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారట.. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి రావడంతో.. ఉద్యోగ సంఘాలకు వార్నింగ్ ఇచ్చిన విషయం విదితమే.. తప్పుడు మార్గంలో ఉద్యోగులకు ఆఫీసర్ బేరర్స్.. ఇతర పోస్టుల్లో ఉన్నట్టు లెటర్స్ ఇవ్వొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది.. అయితే, వరదల నేపథ్యంలో.. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వరద సహాయక చర్యల్లో ఉండడంతో.. ఇప్పుడు మరోసారి ఉద్యోగుల బదిలీల గడువును ప్రభుత్వం పొడిగించినట్టుగా తెలుస్తోంది.
పెట్రోలియం శాఖ కీలక ప్రకటన.. వాహనదారులకు శుభవార్త అందే ఛాన్స్!
వాహనదారులకు పెట్రోలియం శాఖ గుడ్‌న్యూస్ చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని పెట్రోలియం శాఖ కార్యదర్శి ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోవడం.. ఇంకోవైపు దేశంలో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు పెట్రోలియం శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం క్రూడాయిల్ ధర 70-72 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే భారత పౌరులకు త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరల భారం నుంచి ఊరట లభించే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ సూచనప్రాయంగా వెల్లడించారు. అంతర్జాతీయంగా ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే.. ప్రభుత్వరంగ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో హర్యానా, జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నిలక జరగబోతున్నాయి. అనంతరం కొద్దిరోజుల్లోనే మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు కచ్చితంగా తగ్గే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా కేంద్రం రూ.2 తగ్గించింది. ఒక వైపు క్రూడాయిల్ ధరలు తగ్గడం.. ఇంకోవైపు అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ధరలు తగ్గితే వాహనదారులకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది.
మరో 3 కొత్త వందే భారత్ రైళ్లు.. ఆ మార్గాలలో సేవలు..
భారతీయ రైల్వే ట్రాక్‌పై సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ రైళ్ల సంఖ్య మరింత పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలోని వివిధ రైలు మార్గాల్లో మొత్తం 54 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. సెప్టెంబరు 15 నుండి మరికొన్ని కొత్త వందే భారత్ రైళ్లు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో మూడు వందే భారత్ రైళ్లు తూర్పు మధ్య రైల్వే అధికార పరిధి గుండా నడపబోతున్నాయి. ఈ కొత్త వందేభారత్ రైళ్లను సెప్టెంబరు 15న ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ మూడు కొత్త వందే భారత్ రైళ్లు గయా – హౌరా, పాట్నా – టాటా, వారణాసి – డియోఘర్ మధ్య తూర్పు మధ్య రైల్వే పరిధిలో నడుస్తాయి. నిజానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలల ప్రాజెక్ట్‌గా సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లను నడపడంలో భారతీయ రైల్వే ఈ రోజుల్లో బిజీగా ఉంది. ఈ శ్రేణిలో, ప్రయాణీకులకు కొత్త అత్యాధునిక సౌకర్యాలు, సేవలను అందించే ప్రక్రియను కొనసాగిస్తూ కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపబడుతుంది. సెప్టెంబర్ 15న ప్రారంభం కానున్న రైళ్లలో ఈ సర్వీసులను ప్రారంభించాలని ప్రతిపాదించారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలో నడుస్తున్న ఈ కొత్త వందే భారత్ రైళ్ల నిర్వహణ ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, జార్ఖండ్ ప్రజలకు రవాణా సౌకర్యాన్ని అందిస్తుంది. ఇదొక్కటే కాదు, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో ఉన్న బాబా విశ్వనాథ్ నగరం నుండి జార్ఖండ్ లోని డియోఘర్‌లో ఉన్న బాబా బైద్యనాథ్ ధామ్‌కు వెళ్లే భక్తులకు కూడా మెరుగైన సౌకర్యాలు లభిస్తాయి. మరోవైపు, బీహార్‌లోని మతపరమైన నగరం గయా నుండి హౌరాకు ప్రయాణించే వారికి వందే భారత్ రైలు కూడా అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ రైల్వే డివిజన్ నుండి అందిన సమాచారం ప్రకారం.. ఈ కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టడంతో ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలతో వేగవంతమైన రవాణా ప్రయోజనం లభిస్తుంది. ECR అధికార పరిధి ద్వారా ఈ రైలు మార్గాలలో కొత్త వందే భారత్ రైళ్లు నడుస్తాయి.
ఒకే రోజు 23 దంతాలు.. గుండెపోటుతో పేషెంట్ మృతి..
దంతాల సర్జరీ ఒకరి ప్రాణాలను తీసింది. ఒకే రోజు ప్రమాదకరమైన రీతిలో ఈ సర్జరీ సాగడంతో రోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తూర్పు చైనాలోని జరిగింది. హువాంగ్ అనే ఇంటిపేరు కలిగిన వ్యక్తి ఆగస్టు 14న జెజియాంగ్ ప్రావిన్స్‌లోని జిన్హువాలోని యోంగ్ కాంగ్ దేవే డెంటల్ ఆస్పత్రిలో దంతాలకు సంబంధించిన ఒక ప్రొసీజర్ చేయించుకున్నాడు. ‘‘ఇమ్మిడియేట్ రిస్టోరేషన్’’ ప్రక్రియ ద్వారా ఒకే రోజు 23 దంతాలను తీసి, 12 ఇంప్లాంట్స్‌లను అమర్చారు. ఈ ప్రక్రియ జరిగిన రెండు వారాల తర్వాత అతను హఠాత్తుగా గుండెపోటుకు గురై మరణించారు. ఆగస్టు 28న అతను మరణించినట్లు ఆయన కుమార్తె షు ఆన్‌లైన్ పోస్ట్ ద్వారా ఈ కేసును వెలుగులోకి తెచ్చారు. ఈ ప్రక్రియ తర్వాత తన తండ్రి దారుణమైన నిరంతర నొప్పిని అనుభవించినట్లు చెప్పారు. ‘‘మా నాన్న ఇంత త్వరగా చనిపోతాడని అనుకోలేదు. మేం కొనుకున్న కొత్త కారు కూడా అతడికి నడిపే అవకాశం రాలేదు’’ అని పోస్టులో అతడి కూతురు షు చెప్పింది. ఈ ఘటనపై యోంగ్‌కాంగ్ మున్సిపల్ హెల్త్ బ్యూరో నుంచి ఒక అధికారి సెప్టెంబర్ 3న స్పందించారు. డెంటర్ ప్రక్రియ, వ్యక్తి మరణానికి మధ్య 13 రోజుల గ్యాప్ ఉందని, మరణానికి కారణాలు ఇంకా దర్యాప్తు చేయబడుతున్నాయని చెప్పారు. వుహాన్‌లోని హాస్పిటల్ ఆఫ్ యూనివర్సల్ లవ్‌లోని డెంటల్ మెడిసిన్ సెంటర్ డైరెక్టర్ జియాంగ్ గుయోలిన్ ప్రకారం, ఒకే విధానంలో తీయగల గరిష్ట సంఖ్యలో దంతాల తీసే విషయంలో అధికారిక మార్గదర్శకాలు ఏవీ లేవు. అయినప్పటికీ, సాధారణంగా, 10 పళ్ళును తీస్తుంటారు అని చెప్పారు. 23 దంతాలను ఒకే సారి తీయడం చాలా ఎక్కువ. దీనికి తగిన అర్హత, అనుభవం ఉన్న వైద్యుడు అవసరమని, అలాంటి విస్తృతమైన ప్రక్రియను నిర్వహించేటప్పుడు రోగి ఆరోగ్య సామర్థ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని ఆయన చెప్పారు. ఈ కేసు గురించి తెలుసుకున్న నెటిజన్లు చాలా మంది సోషల్ మీడియాలో షాక్ అవుతున్నారు. ఒకే రోజులో 23 దంతాలను తీసే నిర్ణయాన్ని వారు ప్రశ్నించారు. దీనిపై మరో డెంటిస్ట్ స్పందిస్తూ.. ‘‘నేను దంతవైద్యుడిని, అవి చాలా వదులుగా ఉంటే తప్ప నేను ఒకేసారి మూడు దంతాల కంటే ఎక్కువ తీయను. డాక్టర్ కి మతిస్థిమితం తప్పింది. ఇది దంత ప్రక్రియ కంటే మానవ ప్రయోగంలా అనిపిస్తుంది.’’ అని అన్నారు.
మధ్యప్రదేశ్‌లో ఘోరం.. ఇంటి గోడ కూలి ఏడుగురు మృతి
మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలు కారణంగా పలు ఇళ్లు నీటిలో నానిపోయాయి. దీంతో ఒక ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగించి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఒకేసారి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. స్థానికులు, బంధువులు పెద్ద ఎత్తున చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. సంఘటనాస్థలికి స్థానిక నేతలు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే కొండ ప్రాంతం కావడంతో ఇంటిపై బండరాళ్లు పడడంతో శిథిలాలను తొలగించడం కష్టసాధ్యంగా మారింది. ఒక్కొక్క బండరాయిను తొలగించారు. ప్రస్తుతం ఇంకా సహాయ చర్చలు కొనసాగుతున్నాయి. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరోసారి రికార్డు సృష్టించిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి రికార్డుల దిశగా దూసుకెళ్లింది. అంతర్జాతీయ మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు మన మార్కెట్‌కు బాగా కలిసొచ్చింది. దీంతో గురువారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా గ్రీన్‌లోనే ట్రేడ్ అయ్యాయి. అంతేకాకుండా సెన్సెక్స్ 1,500 పాయింట్లు దూసుకెళ్లి తొలిసారిగా 83 వేల మార్కు దాటింది. అలాగే నిఫ్టీ కూడా ట్రేడింగ్‌లో రికార్డు స్థాయిని తాకి 25, 400 మార్కును క్రాస్ చేసింది. మొత్తానికి పెట్టుబడిదారుల పంట పడింది. సెన్సెక్స్ 1,439 పాయింట్లు లాభపడి 82, 962 దగ్గర ముగియగా.. నిఫ్టీ 470 పాయింట్లు లాభపడి 25, 388 దగ్గర ముగిసింది. ఆటో, మెటల్, ఎనర్జీ మెజారిటీ స్టాక్‌లు లాభాల్లో దూసుకెళ్లగా.. అన్ని రంగాలు గ్రీన్‌లో ముగిశాయి. భారత బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు సెషన్ ముగింపులో 1.5 శాతం పెరిగి వరుసగా 83,116 మరియు 25,433 ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని తాకాయి. సెన్సెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, ఎంఅండ్‌ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, విప్రో టాప్ గెయినర్లుగా కొనసాగాయి. నిఫ్టీ కూడా రికార్డు స్థాయిలో దూసుకెళ్లింది. నిఫ్టీ 50లో కేవలం రెండు స్టాక్‌లు మాత్రమే మధ్యాహ్నం 2:08 గంటలకు తగ్గుముఖం పట్టగా.. మిగిలిన 48 షేర్లు భారీగా పెరిగాయి.