NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

వివాదంలో సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్..
సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ వివాదంలో చిక్కుకున్నారు.. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ విషయమై ట్విట్టర్‌ వేదికగా (ఎక్స్‌) స్పందించిన సునీల్.. ‘‘ఆ కేసు సుప్రీంకోర్టులో మూడేళ్లు నడిచిందని.. సాక్షాత్ సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నానని’’ అంటూ రాసుకొచ్చారు. అయితే, సోషల్ మీడియాలో సునీల్ కుమార్‌ ఈ విధంగా పోస్ట్ పెట్టడాన్ని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు.. ఎఫ్ఐఆర్ నమోదుపై ఈ రకమైన పోస్టులు పెట్టడం ప్రభుత్వాన్ని ధిక్కరించడమే అవుతుందంటున్నాయి టీడీపీ వర్గాలు. ఇది, ఆల్ ఇండియా కండక్ట్ రూల్స్‌లోని రూల్ నెంబరు 7ను ఉల్లంఘించడమే అంటుంది టీడీపీ.. మరోవైపు ఐపీఎస్‌ సునీల్ కుమార్‌ పోస్ట్ పై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది టీడీపీ.. సునీల్ కుమార్‌ సోషల్‌ మీడియాలో చేసిన పోస్టును పరిగణలోకి తీసుకుని సస్పెండ్ చేయాలని తన ఫిర్యాదులో పేర్కొంది టీడీపీ.

పెద్దిరెడ్డికి బిగ్‌ షాక్..! పార్టీకి ప్రధాన అనుచరుడితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు గుడ్‌బై..
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గ్రాండ్‌ విక్టరీ కొట్టింది.. ఆ తర్వాత రాజకీయ పరిస్థితులు మారిపోయాయి.. పలువురు ప్రజాప్రతినిధులు, నేతులు.. వైసీపీకి గుడ్‌బై చెప్పేసి.. కూటమి వైపు వచ్చేస్తున్నారు.. మరీ ముఖ్యంగా.. టీడీపీ గూటికి చేరుకుంటున్నారు.. ఈ పరిస్థితులతో ఇప్పటికే పలు మున్సిపాల్టీలు టీడీపీ ఖాతాలోకి పడిపోయాయి.. అయితే, తాజాగా, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్‌ షాక్‌ తగిలినట్టు అయ్యింది.. పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు పులిచెర్ల జడ్పీటీసీ మురళీధర్.. వైసీపీకి, జెడ్పీటీసీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. అతని బాటలో పులిచెర్ల వైస్ ఎంపీపీలు రాశి ప్రసాద్, ఈశ్వరి గోవర్ధన్ లు కూడా వైసీపీకి గుడ్‌బై చెప్పారు.. వీరితో పాటు నలుగురు ఎంపీటీసీ సభ్యులు.. మరో ఏడు మంది సర్పంచులు రాజీనామా బాటపట్టారు..

బాధ్యతలు స్వీకరించిన మంత్రి అచ్చెన్నాయుడు.. ఆరు ఫైళ్లపై సంతకాలు..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది.. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు.. మంత్రులు కూడా బాధ్యతలు స్వీకరించారు.. ఇక, ఛాంబర్లలో మార్పులు, చేర్పులతో.. కొందరు మంత్రుల బాధ్యతల స్వీకరణ ఆలస్యం అయ్యింది.. ఈ రోజు మంత్రి అచ్చెన్నాయుడు తన ఛాంబర్‌లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.. ఇప్పటి వరకు సచివాలయంలోని తన ఛాంబర్ సిద్ధం కాకపోవడంతో ఆలస్యంగా బాధ్యతలు స్వీకరించారు అచ్చెన్నాయుడు. ఈ సందర్భంగా అచ్చెన్నను టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు, అభిమానులు అభినందలు తెలిపారు.. మరోవైపు.. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరు ఫైళ్లపై సంతకాలు చేశారు మంత్రి అచ్చెన్నాయుడు.. పొలం పిలుస్తుంది కార్యక్రమంపై తొలి సంతకం చేసిన ఆయన.. వ్యవసాయ యాంత్రీకరణపై రెండో సంతకం.. 217 జీవో రద్దు చేస్తూ మరో సంతకం.. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ నిధుల విడుదలపై ఇంకో సంతకం.. పశువుల డీవార్మింగ్, యానిమల్ సెన్సెస్‌పై ఇలా ఆరు సంతకాలు చేశారు.. ఇక, ఈ సందర్భంగా మంత్రి అచెన్నాయుడు మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా వ్యవసాయ శాఖకు తాళం వేశారు.. కానీ, కూటమి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి ఉండదు.. రైతు ఆత్మగౌరవంతో బతికేలా పనిచేస్తాం అన్నారు. కౌలు రైతులను ఆదుకుంటామని ఈ సందర్భంగా వెల్లడించారు.. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రతి రైతు ఆత్మగౌరవంతో బతకాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తేవాలని.. వాటి పరిష్కారానికి కృషి చేస్తాం అన్నారు.. ఈనెల 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పొలం పిలుస్తోంది కార్యక్రమం ప్రారంభిస్తామని పేర్కొన్నారు.. ప్రతి మంగళవారం, బుధవారం వ్యవసాయ అధికారులు రైతుల వద్దకు వెళ్లి అన్ని విషయాలు వివరించి అవగాహన కల్పిస్తారని వివరించారు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.

స్టేజ్‌పై కోడి తల కొరికి చంపిన డ్యాన్సర్.. కేసు నమోదు
స్టేజ్‌పై నృత్య ప్రదర్శనలు ఇచ్చే సమయంలో.. కొంత రియాల్టీగా ఉండాలని.. కొన్ని సార్లు డ్యాన్సర్లు సాహసాలు చేస్తుంటారు.. అవి వారికి తంటాలు కూడా తెచ్చిపెడుతుంటాయి.. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటిదే ఓ కేసు నమోదు అయ్యింది.. ఓ కార్యక్రమంలో స్టేజ్‌పై ఓ డ్యాన్స్‌ గ్రూప్‌ ‘విలయ ప్రళయ మూర్తి వచ్చింది ఇదే కాంచన..’ అంటూ సాగే కాంచన్‌ సినిమా టైటిల్‌ సాంగ్‌కు నృత్యం చేసింది.. అచ్చం కాంచన సినిమాలో మాదిరిగా.. డ్యాన్సర్స్ రెచ్చిపోయి స్టేప్పులు వేశారు.. ఆ స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోయింది.. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆ గ్రూప్‌లో కీ డ్యాన్సర్‌గా ఉన్న వ్యక్తి.. ఓ కోడిని పట్టుకొని నృత్యం చేశాడు.. అంతటితో ఆగలేదు.. మధ్యలో ఆ కోడి తల కొరికేసి.. రక్తం తాగుతూ.. భయానకంగా కనిపించే విధంగా.. డ్యాన్స్‌తో అదరగొట్టాడు.. ఆ నృత్యాన్ని కాస్తా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు కొందరు వ్యక్తులు.. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారడంతో.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతి, 1860, (IPC)లోని సెక్షన్‌ 429 మరియు 34 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని.. మరియు ఆ నృత్య ప్రదర్శకుడు తోపాటు నిర్వాహకులకుపై కూడా జంతువుల పట్ల క్రూరత్వం వహించినందుకు (PCA) చట్టం, 1960లోని సెక్షన్ 11(1) కింద కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు పోలీసులు.. కాగా, గతంలో కూడా ఈ డ్యాన్స్‌ గ్రూప్‌ ఇలాంటి స్టేజీ షోలు ఇచ్చినట్టుగా తెలుస్తుండగా.. డ్యాన్స్ షోలో కోడి తలను కొరికి చంపినందుకు.. విష్ణు ఎంటర్‌టైన్‌మెంట్స్ (డ్యాన్స్ ట్రూప్ కంపెనీ)పై అనకాపల్లి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) ఇండియా దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు..

కేటీఆర్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ సవాల్‌
బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్‌ అలీ సవాల్‌ విసిరారు. బీఆర్‌ఎస్‌ హయాంలో 46 మందిని పార్టీలో చేర్చుకున్నారని చెప్పారు. తాను చెప్పిన వివరాలు తప్పని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని షబ్బీర్ అలీ అన్నారు. మరి కేటీఆర్‌ ఏం చేస్తారో చెప్పాలని ఛాలెంజ్‌ చేశారు. తలసాని టీడీపీకి రాజీనామా చేయకుండానే మంత్రిని చేసింది కేటీఆరేనని పేర్కొన్నారు. మండలిలో తాను ప్రతిపక్ష నేతగా ఉన్నా… దాన్ని లేకుండా చేసింది కేటీఆరేనని అన్నారు. తేదీల వారీగా కేటీఆర్‌ ఎమ్మెల్యేలను చేర్చుకున్న లిస్ట్ చెప్పడానికి కూడా రెడీ అంటూ షబ్బీర్ అలీ పేర్కొన్నారు. కోనేరు కోనప్ప, ఇంద్రకరణ్ రెడ్డి, విఠల్ రెడ్డి… ఇలా వరుస బెట్టి చేర్చుకున్నది కేటీరేనని చెప్పుకొచ్చారు. తాను చెప్పిన వివరాలు తప్పు అని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని ఆయన ఛాలెంజ్ చేశారు. నువ్వేం చేస్తావో చెప్పు.. లేదంటే మాట్లాడకుండా ఊరుకో అంటూ షబ్బీర్ అలీ సవాల్ విసిరారు.

ఒక బలమైన వ్యవస్థగా హైడ్రా ఉండాలి.. సీఎం రేవంత్ ఆదేశాలు జారీ
సచివాలయంలో హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్)పై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. హైడ్రా విధివిధానాలపై చర్చిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో కీలకమైన సేవలను అందించేందుకు హైడ్రా ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిటీ విస్తరణకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలను అంచనా వేసుకొని ప్రజలకు విస్తృత సేవలు అందించేలా కొత్త వ్యవస్థను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, వాటర్‌ బోర్డు, విజిలెన్స్, ట్రాఫిక్‌, పోలీస్ విభాగాలన్నింటి మధ్య సమన్వయం ఉండేలా హైడ్రాను రూపకల్పన చేయాలనేది సీఎం ఆలోచన. వర్షాకాలంలో విపత్తులు సంభవించే అవకాశం ఉన్నందున ఈ వ్యవస్థను బలోపేతం చేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

స్మృతీ ఇరానీ పట్ల అసహ్యంగా ప్రవర్తించొద్దు.. కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి..
మాజీ కేంద్రమంత్రి స్మృతీ ఇరానీపై అవమానకరమైన పదజాలం, అసహ్యంగా మాట్లాడటం మానుకోవాలని ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన మద్దతుదారులకు, కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ప్రజలను అవమానించడం బలహీనకు సంకేతమని, బలం కాదని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. యూపీ అమేథీ నుంచి ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో స్మృతీ ఇరానీ, కాంగ్రెస్ నేత కిషోరీ లాల్ శర్మ చేతిలో 1,67,196 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ‘‘జీవితంలో గెలుపు ఓటములు జరుగుతాయి. శ్రీమతి స్మృతి ఇరానీ లేదా మరే ఇతర నాయకుడి పట్ల అవమానకరమైన పదజాలం ఉపయోగించడం మరియు అసహ్యంగా ప్రవర్తించడం మానుకోవాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. ప్రజలను అవమానించడం మరియు అవమానించడం బలహీనతకు సంకేతం, బలం కాదు’’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

మరోసారి రికార్డులు సృష్టించిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్‌లో రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. తాజాగా మరోసారి సూచీలు రికార్డు స్థాయిలో దూసుకుపోయాయి. ఐటీ మెరుపులతో శుక్రవారం నిఫ్టీ, సెన్సెక్స్ రికార్డు గరిష్టాలను తాకాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ.. దేశీయ సూచీలు మాత్రం ఆరంభం నుంచి హైలో ట్రేడ్ అయ్యాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 622 పాయింట్లు లాభపడి 80, 519 దగ్గర ముగియగా.. నిఫ్టీ 186 పాయింట్లు లాభపడి 24, 502 దగ్గర ముగిసింది. ఇక డాలర్‌పై రూపాయి మారకం విలువ రూ.83.56 దగ్గర ముగిసింది. నిఫ్టీలో టీసీఎస్, విప్రో, ఎల్‌టిఐఎండ్‌ట్రీ, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అత్యధికంగా లాభపడగా.. మారుతీ సుజుకీ, దివిస్ ల్యాబ్స్, బీపీసీఎల్, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి.

వోక్స్‌వ్యాగన్ కారుపై భారీ డిస్కౌంట్.. కొనేందుకు ఇదే మంచి సమయం..!
జర్మనీ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్.. 2024 జూలైలో భారత మార్కెట్‌లో విక్రయించే కార్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. వోక్స్‌వ్యాగన్ టిగువాన్, టైగన్ SUVలపై డిస్కౌంట్లు ఇచ్చింది. కంపెనీ అందిస్తున్న ఆఫర్లలో నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ తగ్గింపుతో సహా పలు రకాల ఆఫర్లు ఉన్నాయి. ఏ మోడల్ కు ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారో తెలుసుకుందాం. ఈ కారుపై కంపెనీ భారీ తగ్గింపును ఇస్తోంది. టిగువాన్ కారుపై రూ.3.4 లక్షల వరకు తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా.. ఈ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీపై డిస్కౌంట్‌లో నాలుగేళ్లపాటు రూ.90,000 వరకు సేవా విలువ ప్యాకేజీ కూడా ఉంది. దీనిపై కంపెనీ రూ.75,000 క్యాష్ డిస్కౌంట్, రూ.75,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.లక్ష వరకు కార్పొరేట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ కారు ధర మార్కెట్లో రూ. 35.17 లక్షలు ఉంది. ఈ కాంపాక్ట్ SUVలో రూ. 1 లక్ష వరకు ఎక్స్ఛేంజ్, లాయల్టీ బోనస్‌ ప్రకటించారు. అంతేకాకుండా.. GT 1.5L వేరియంట్‌లో రూ. 73,900 విలువైన స్పెషల్ కిట్ కూడా అందిస్తున్నారు. అయితే.. ఈ కారు పరిమిత స్టాక్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. GT 1.5L TSI DST వేరియంట్ ధర రూ. 1.37 లక్షలు తగ్గింది. దీనిపై ఎలాంటి ఎక్స్ఛేంజ్ బోనస్ లేదు. ఈ కారు డిస్కౌంట్లతో కలిపి ధర రూ. 15.99 లక్షలకు లభించనుంది.

షార్ట్ ఫిలిమ్ కి 10 అంతర్జాతీయ అవార్డులు
సినిమా అనేది కొందరికి వ్యాపారం అయితే కొందరికి ప్యాషన్. కొందరు సినిమా డబ్బుల కోసం తీస్తే ఇంకొందరు అవార్డుల కోసం తీస్తుంటారు..ఈ కోవలోనే సినిమాల మీద ఇష్టం, ప్యాషన్‌తో చేసే వారికి డబ్బుల సంగతి ఎలా ఉన్నా అవార్డులు, రివార్డులు వస్తుంటాయి. ఈక్రమంలోనే న్యూయార్క్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేస్తున్న గోపాల్ బోడేపల్లి తన ప్యాషన్‌తో తీస్తున్న షార్ట్ ఫిలిమ్స్ కు ప్రపంచ వ్యాప్తంగా పేరు వస్తోంది. తాజాగా గోపాల్ బోడేపల్లి నిర్మిస్తూ, దర్శకత్వం వహించిన హంగర్ షార్ట్ ఫిలిమ్ కు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు వరించాయి. ఈ షార్ట్ ఫిలిమ్ ఇంటర్నేషనల్ న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో హానరబుల్ మెన్షన్ అవార్డుని గెల్చుకుంది. అంతే కాకుండా ఈ చిత్రం ప్యారిస్, లండన్ ఉత్సవాలతో పాటు మరో 10 అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డులను గెల్చుకుందని మేకర్స్ వెల్లడించారు. గోపాల్ బోడేపల్లి డైరెక్షన్‌లో ఇంతకు ముందు వచ్చిన ‘మరణం’ షార్ట్ ఫిల్మ్ కూడా 34 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డు గెల్చుకుంది. ఇక ఈ రెండు చిత్రాలు దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అఫీషియల్ సెలక్షన్‌కి ఎంపిక అయ్యాయి.

విజయ్ మాల్యా, గాలి జనార్దన్ రెడ్డిలను టచ్ చేసిన శంకర్?
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు 2 సినిమా ఎట్టకేలకు జూలై 12వ తేదీ అంటే ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 96 లో రిలీజ్ అయిన భారతీయుడు సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జె సూర్య, బాబీ సింహ, సముద్రఖని వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాకి మిశ్రమ స్పందన అయితే లభిస్తుంది. అయితే సినిమాలో ప్రస్తావించిన ఇద్దరి గురించి ఇప్పుడు ఫ్యాన్ ఇండియా వైడ్ చర్చ జరుగుతుంది. అదేంటంటే సినిమాలో ఒక మహారాష్ట్ర వ్యాపారి 12 వేల కోట్లు బ్యాంకు లోన్స్ ఎగ్గొట్టి తైపే అనే తైవాన్ కి చెందిన ఒక ప్రాంతానికి పారిపోయి అక్కడ విలాసంగా అమ్మాయిలతో గడుపుతున్నట్టు చూపించాటారు. అలాగే గుజరాత్ కి చెందిన ఒక మైన్స్ వ్యాపారి 10 ఏళ్లలోనే వందల మైన్స్ సంపాదించి, గోల్డెన్ బాత్రూంలో తన కాలకృత్యాలు తీర్చుకుంటున్నట్లు చూపించారు. ఇందులో మొదటి మహారాష్ట్ర వ్యాపారి పాత్రను విజయ్ మాల్యాను ఆధారంగా చేసుకుని తీర్చిదిద్దారని టాక్ వినిపిస్తోంది. అలాగే కాలకృత్యాలు తీర్చుకునే వ్యక్తి పాత్రను మైన్స్ కింగ్ గా పేరు తెచ్చుకున్న గాలి జనార్దన్ రెడ్డిని చూసి స్ఫూర్తి పొంది ఆయన ఆధారంగానే రెడీ చేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమా చూసిన వారు ఎవరైనా ఉంటే ఈ విషయంలో మీకేం అనిపించిందో కింద కామెంట్ చేయండి.

వాళ్ళు మేజర్లలా రేప్ చేస్తే మైనర్లు అంటారేంటి.. వాళ్ళని వదలద్ధంటున్న రష్మీ
ఏపీలో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. తొమ్మిదేళ్ల చిన్నారి.. ఆడుకుంటానని బయటకు వెళ్లగా ఆ చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో సుజాత, మద్దిలేటి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కూలిపనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు.. రెండవ కుమార్తె వాసంతి 5వ తరగతి చదువుతోంది.. అయితే, ఆదివారం సెలవు కావడంతో ఉదయం ఆడుకుంటానని ఇంటికి దగ్గరలోనే ఉన్న పార్క్ లోకి వెళ్ళింది. మధ్యాహ్నం దాటినా ఇంటికి రాలేదు. ఎక్కడుందోనని వెతికగా కనిపించలేదు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేయగా ముగ్గురు మైనర్ బాలురపై అనుమానంతో తమదైన స్టైల్ లో విచారించారు పోలీసులు.. అందులో ఒకరు బాలిక వాసంతి పై అత్యాచారం చేసి మల్యాల ఎత్తిపోతల కాలువలో పడేసినట్లు ఒప్పుకున్నారు. ఈ దారుణానికి కారణమైన ముగ్గురు 15 ఏళ్లలోపు వారే. ఈ అంశం మీద పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. తాజాగా ఈ అంశం మీద స్పందించిన యాంకర్ రష్మీ ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసింది. వాళ్లు పెద్దవాళ్లలాగా రేప్ చేయగలిగితే వాళ్లని పెద్ద వాళ్ళ లాగానే శిక్షించాలి వాళ్ళు చేసిన తప్పుకు ఏ మాత్రం పశ్చాత్తాప పడటం లేదు కాబట్టి వాళ్ళు కచ్చితంగా మైనర్లు అయితే కాదు మైనర్లు అనే ఒక కార్డుతో వాళ్ళు తక్కువ శిక్షతో బయటపడడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ ఆమె తన సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చింది.