NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

అమరావతి అభివృద్ధికి ముందడుగు.. ఢిల్లీలో కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. మళ్లీ అమరావతి అభివృద్ధిపై ఫోకస్‌ పెట్టింది.. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను పునర్‌ ప్రారంభించడమే కాకుండా.. పలు కీలక సంస్థలను అమరావతికి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఇక, అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు పడినట్టు అయ్యింది.. అమరావతి నిధుల ప్రతిపాదనపై ప్రంపచబ్యాంకు, ఏడీబీ, హడ్కో రుణాలపై ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది.. ప్రపంచ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు.. ఈ భేటీలో కేంద్ర, రాష్ట్ర అధికారులతో పాటు ప్రపంచబ్యాంకు, ఏడీబీ, హడ్కో బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.. ఈ రోజు సాయంత్రం వరకూ త్రైప్రాక్షిక చర్చలు కొనసాగనున్నాయి. చర్చల తరువాత ఎంవోయూపై సంతకం చేయనున్నారు ఆంధ్రప్రదేశ్‌ అధికారులు.. కాగా, అమరావతి అభివృద్ధి కోసం రుణ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం.. సమావేశంలో ఏపీ తరపున సీఆర్డీఏ కమిషనర్ కె. భాస్కర్, ఏడీసీఎల్‌సీ ఎండీ లక్ష్మీ పార్ధసారధి, ఆర్ధికశాఖ కార్యదర్శి డి. సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.. మరోవైపు.. అమరావతి రాజధాని అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిన విషయం విదితమే.. ప్రపంచ బ్యాంక్‌ సహా ఇతర సంస్థల నుంచి రుణాలను కేంద్ర ప్రభుత్వం ఇప్పించనుంది.

గుడ్‌న్యూస్‌ చెప్పిన సర్కార్.. వారికి సమ్మె కాలానికి వేతనాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.. సమగ్ర శిక్షా ఉద్యోగులకు సమ్మె కాలపు వేతనాలు విడుదల చేసిందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది సర్కార్‌.. ఈ మేరకు అంగీకారం తెలిపారు ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్.. అయితే, గత ప్రభుత్వ హయాంలో 20 డిసెంబర్‌ 2023 నుండి 10 జనవరి 2024 వరకు 21 రోజులు సమ్మెలో పాల్గొన్నారు కేజీబీవీలలో పని చేసే ఉద్యోగులు.. ఇక, ఈ సమ్మె తర్వాత కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గౌరవ వేతనాన్ని 23 శాతం పెంచుతూ జనవరి 2024లో ప్రభుత్వం మెమో విడుదల చేసింది.. 2019కు ముందు గౌరవ వేతనం పెంచని వాళ్లకు 23 శాతం మేర పెంచారు.. అయితే, 21 రోజులు సమ్మె కాలానికి గానూ వేతనం చెల్లించాల్సిందిగా మంత్రి నారా లోకేష్ ని కోరారు సమగ్ర శిక్షా అభియాన్‌ కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్.. దీనికి మంత్రి నారా లోకేష్‌ అంగీకారం తెలిపారు.. అ మేరకు సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేశారు.. దీంతో.. సమగ్ర శిక్షా అభియాన్‌ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈ వేతనాలు విడుదల చేస్తూ శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ లోని తెలుగుదేశం పార్టీ – జనసేన పార్టీ – బీజేపీ కూటమి ప్రభుత్వం..

ముగిసిన బీఏసీ.. ఎవరికోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు..!
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి.. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి.. రేపు ఏపీ అసెంబ్లీకి సెలవుగా నిర్ణయించారు.. రేపు ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తారు.. మధ్యాహ్నం 2 గంటల నుంచి కూటమి శాసనసభాపక్ష సమావేశం జరగనుంది.. అయితే, అసెంబ్లీ వాయిదా పడిన వెంటనే బీఏసీ సమావేశం జరిగింది.. ఈ సమావేశానికి హాజరైన స్పీకర్ అయ్యన్నపాత్రుడు, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ పక్ష నేత విష్ణు కుమార్ రాజు హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.. అయితే, ఈ నెల 22వ తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం.. అసెంబ్లీ సమావేశాలు సీరియస్ గా జరగాలి అన్నారు.. రేపు బడ్జెట్ పై అసెంబ్లీ కమిటీ హాల్ లో ఎమ్మెల్యేలందరికీ శిక్షణ తరగతులు ఉంటాయి.. శనివారం కూడా సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.. బిల్లులు, చర్చలకు అనుగుణంగా కొన్ని రోజులు రెండు పూటలా అసెంబ్లీ ఉంటుందన్నారు.. 8 బిల్లులతో పాటు ప్రభుత్వ పాలసీలకు ఆమోదం తెలపాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఇక, బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు అని స్పష్టం చేశారు.. ప్రజా సమస్యలపై బాధ్యతాయుతమైన చర్చ జరపడం సభ్యుల బాధ్యతగా పేర్కొన్న ఆయన.. 1995లో తెల్లవారుజామున 4 గంటలకు ముందురోజు రాత్రి భోజనం చేసిన సందర్భాలు ఉన్నాయి అని గుర్తుచేసుకున్నారు.. ఎమ్మెల్యేలు విధిగా అసెంబ్లీకి హాజరు అయ్యే విధంగా సీరియస్ గా తీసుకోవాలన్నారు.. చీఫ్ విప్, విప్ లను రేపు ఖరారు చేస్తాం అని వెల్లడించారు సీఎం చంద్రబాబు..

ప్రజలు గెలిపించింది అసెంబ్లీకి రావడానికే.. వైసీపీ ఎమ్మెల్యేలు పారిపోతున్నారు..!
ప్రజలు మిమ్మల్ని గెలిపించింది శాసనసభకు రావడానికే.. కానీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు శాసన సభకు రాకుండా పారిపోతున్నారని ఎద్దేవా చేశారు మంతరి బీసీ జనార్దన్‌ రెడ్డి.. ఇక, గుంతల్లో చిడతల బేరం పేరుతో మీడియాలో కథనాలు వస్తున్నాయి.. గడిచిన ఐదు సంవత్సరాలకే రోడ్లు ఎలా ఉన్నాయో ప్రజలకు తెలుసు అన్నారు.. 2014 -19 మధ్యలో 11 వేల కోట్లు ఖర్చు చేశాం… కానీ, 2019 – 24 వరకు కేవలం ఏడు వేలకోట్లు మాత్రమే ఖర్చు పెట్టారన్న ఆయన.. అంతేకాదు.. వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టారని విమర్శించారు.. 2019 -24 వరకు రాష్ట్ర రోడ్డులపై పక్క రాష్ట్రాల మంత్రులు సైతం జోకులు వేసుకున్న పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్యెల్యే విచారణకు గైర్హాజరు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో నకిరేకల్ మాజీ ఎమ్యెల్యే చిరుమర్తి లింగయ్య జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు గైర్హాజరు అయ్యారు. అనారోగ్య కారణంగా జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఎదుట విచారణకు రాలేనని పోలీసులకు సమాచారం అందించారు మాజీ ఎమ్మెల్యే. ఈ నెల 14న విచారణకు హాజరవుతానని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక నిందితుడితో సంబంధాలు కలిగి ఉన్నాడనే అనుమానంతో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సమన్లు ఇచ్చారు. ఈరోజు జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. అయితే.. అనారోగ్యం కారణంగా విచారణకు హాజరుకాలేనని చిరుమర్తి లింగయ్య తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారి రాజకీయ నాయకుడికి నోటీసులు ఇచ్చారు. ఆయన తర్వాత మరికొంత మంది రాజకీయ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్.. బీజేపీకి బీ టీంగా ప‌నిచేస్తోంది
హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స‌చివాల‌యంలో మంత్రి సీత‌క్క మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ త‌ప్పుడు ప్రచారంపై మంత్రి సీత‌క్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో బీజేపీకి లబ్ది చేకూర్చేందుకు బీఆర్ఎస్ కుట్ర పూరితంగా వ్యవ‌హ‌రిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీకి బీ టీంగా బీఆర్ఎస్ ప‌నిచేస్తోందని మంత్రి ఆరోపించారు. కేసులు నుంచి తప్పించుకునేందుకు బీజేపీతో బీఆర్ఎస్ అంట‌కాగుతోందని పేర్కొన్నారు. మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ వ‌చ్చిన నాటి నుంచి ప‌క్కా ప్రణాళిక‌తో బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. పదే ప‌దే త‌ప్పుడు ప్రచారం చేస్తూ ప్రజా ప్రభుత్వంపై విషం చిమ్ముతోందని మంత్రి సీతక్క అన్నారు. అందులో భాగంగా మ‌హిళ‌ల ఉచిత ప్రయాణ ప‌థ‌కంపై దుష్ప్రచారం చేస్తున్నారు.. అత్యవ‌స‌ర స‌మయాల్లో చేతిలో చిల్లి గ‌వ్వ లేకున్నా మ‌హిళ‌లు ఉచిత ప్రయాణాలు చేస్తున్నారన్నారు. ఆటో డ్రైవర్లను ఉసి గొల్పి ధర్నాలు చేయిస్తున్నారు.. ఓలా, ఉబ‌ర్ క్యాబ్‌లు, బైకులు తెచ్చిన‌ప్పుడు ఆటో డ్రైవ‌ర్లు గుర్తుకు రాలేదా..? అని మంత్రి ప్రశ్నించారు.

ట్రంప్-పుతిన్ మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదు.. రష్యా వెల్లడి
అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో సంభాషించినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం ముగించాలంటూ పుతిన్‌కు ట్రంప్ సూచించినట్లు వార్తలు వచ్చాయి. గురువారం ఫోర్లిడాలోని తన ఎస్టేట్‌ నుంచి ట్రంప్‌.. పుతిన్‌తో ఫోన్‌‌లో మాట్లాడినట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం వెలువరించింది. దీనిపై రష్యా తాజాగా స్పందించింది. ట్రంప్-పుతిన్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని.. ఆ వార్తలన్నీ పూర్తి అవాస్తవమని రష్యా కొట్టిపారేసింది. రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ఒక్క రోజులో ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాన్ని ముగిస్తానంటూ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ ప్రచారం చేశారు. ఇందులో భాగంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారు. తాను యుద్ధాన్ని ప్రారంభించబోనని, దాన్ని ముగించేందుకు సాయం చేస్తానంటూ ట్రంప్ భరోసానిచ్చారు. ఈ నేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కూడా ట్రంప్ మాట్లాడినట్లు కథనాలు పేర్కొన్నాయి. తాజాగా ఈ సమాచారం పూర్తిగా తప్పుడు సమాచారం అని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ సోమవారం స్పస్టం చేశారు. రష్యా-యూఎస్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని పేర్కొన్నారు.

ప్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కె్ట్ ప్లాట్‌గా ముగిసింది. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు కారణంగా సోమవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా అలానే కొనసాగాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం సాధించిన తర్వాత మార్కెట్లు పంజుకుంటాయని అంతా భావించారు. కానీ ఇన్వెస్టర్లు అంతగా మక్కువ చూపించినట్లుగా కనిపించలేదు. ఇక ముగింపులో సెన్సెక్స్ 9 పాయింట్లు లాభపడి 79, 496 దగ్గర ముగియగా.. నిఫ్టీ 6 పాయింట్లు నష్టపోయి 24, 141 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.84.38 దగ్గర ముగిసింది. నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్ప్, ట్రెంట్, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్, టెక్ మహీంద్రా ప్రధాన లాభాల్లో ఉండగా.. ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, అపోలో హాస్పిటల్స్, సిప్లా మరియు జెఎస్‌డబ్ల్యు స్టీల్ నష్టపోయాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ దాదాపు 1 శాతం క్షీణించాయి. సెక్టార్లలో బ్యాంక్ మరియు పవర్ ఇండెక్స్ ఒక్కొక్కటి 0.5 శాతం, ఐటీ ఇండెక్స్ 1 శాతం పెరగగా, ఆటో, ఎఫ్‌ఎంసిజి, హెల్త్‌కేర్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా 0.5-1 శాతం క్షీణించాయి.

న్యూజిలాండ్‌తో ఓటమిపై తొలిసారిగా మౌనం వీడిన గంభీర్.. ఏం చెప్పాడంటే?
న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో 0-3తో ఘోర పరాజయం తర్వాత గౌతం గంభీర్ తొలిసారిగా మౌనం వీడాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌పై 0-3 తేడాతో ఘోర పరాజయం తర్వాత తాను ఎదుర్కొన్న విమర్శలపై భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. భారత కోచ్‌గా గౌరవనీయమైన పాత్రను పోషించడం చాలా కష్టమని, అది తనకు తెలుసునని అన్నాడు. న్యూజిలాండ్‌తో ఓటమి 2012 తర్వాత స్వదేశంలో భారత్‌కు ఇదే తొలి టెస్టు సిరీస్ ఓటమి కాగా.. ఈ శతాబ్దంలో స్వదేశంలో 0-3 తేడాతో ఓటమి పాలైంది. ఇకపోతే, టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు దాదాపు పది రోజుల ముందే బయల్దేరింది. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గౌతమ్‌ గంభీర్‌ కొన్ని విషయాలను తెలిపాడు. తమకు ఆసీస్‌ చేతిలో ఓటమి తప్పదని, సీనియర్ ఆటగాళ్లు రోహిత్, విరాట్ ఫామ్‌పై చేస్తున్న విమర్శలను కోచ్ గౌతమ్‌ గంభీర్ కొట్టిపడేశాడు. టీమిండియా కుర్రాళ్లకు ఎప్పుడూ మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తూనే.. మరోవైపు ఫామ్‌లో లేని కేఎల్ రాహుల్ పైనా ఆయన స్పందించాడు. మొత్తానికి పెద్దమార్పులేమి లేకుండా ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ కు తాము సిద్ధమని ఆయన తెలిపాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని పరిస్థితులు ఎదుర్కోవడం చాలా కఠినమని ఆయన అన్నాడు. అక్కడి పరిస్థితులు ఇక్కడితో పోలిస్తే చాలా విభిన్నమన్నారు.

పుష్ప – 2 ది రూల్‌ ట్రైలర్‌ రిలీజ్ డేట్ ఇదే..
పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైర్‌… నీయవ్వ తగ్గేదేలే.. పుష్ప ది రైజ్‌లో ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్ చెప్పిన ఈ మాసివ్‌ డైలాగులు ఇంకా అందరి చెవులో మారుమ్రోగుతూనే వున్నాయి. బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప ది రైజ్‌’ తో ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ క్రియేట్‌ చేసిన సన్సేషన్‌ అంతా ఇంతా కాదు. తెలుగు సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా మరోసారి మాసివ్‌గా మాట్లాడుకోవడం ఈ సినిమా విషయలో అందరూ చూశారు. ఇక త్వరలోనే ఇండియన్‌ బిగ్గెస్ట్‌ ఫిలిం పుష్ప-2 ది రూల్‌ ద్వారా అల్లు అర్జున్‌-సుకుమార్‌ల ద్వయం మరో బిగ్గెస్ట్‌ సన్సేషన్‌ సృష్టించబోతున్నారు. డిసెంబరు 5 నుంచి బాక్సాఫీస్‌ కలెక్షన్ల సునామీ రాబోతుంది. సుకుమార్‌ రైటింగ్స్‌ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఇండియన్‌ బిగ్గెస్ట్‌ ఫిలిం ప్రమోషన్‌ కార్యక్రమాలు ఇక ఎగ్రెసివ్‌గా స్టార్‌ అయ్యాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రమోషన్స్‌ను పాట్నా, కలకత్తా, చెన్నయ్‌, కొచ్చి, బెంగళూరు, ముంబయ్‌ హైదరాబాద్‌లో ఈ మాసివ్‌గా నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగానే పుష్ప-2 ది రూల్‌ చిత్రం ట్రయిలర్‌ లాంచ్‌ను ఈ నెల 17న బిగ్గెస్ట్‌ ఈవెంట్‌ ఫర్‌ ఇండియన్‌ బిగ్గెస్ట్‌ ఫిలింగా పాట్నాలో అత్యంత గ్రాండ్‌గా ఈ మాసివ్‌ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు.

మట్కా సెన్సార్ రిపోర్ట్ – రన్ టైమ్ పూర్తి డీటెయిల్స్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘మట్కా’ నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. తాజాగా సెన్సార్‌తో సహా అన్ని ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. మట్కా పర్ఫెక్ట్ స్క్రీన్‌ప్లేతో మొదటి నుండి చివరి వరకు రేసీగా, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. టైటిల్స్‌తో సహా మొత్తం 2 గంటల 39 నిమిషాల రన్‌టైమ్‌తో రానుంది. టైటిల్స్ లేకుండా, రన్‌టైమ్ 2 గంటల 33 నిమిషాలు ఉంటుంది. మాస్ ఎంటర్‌టైనర్‌కి ఇది సరైన రన్‌టైమ్ అనే చెప్పాలి. మొదటి సగం 1 గంట 22 నిమిషాలు మరియు రెండవ సగం 1 గంట 11 నిమిషాల వ్యవధి ఉండనుంది. ఫస్ట్ హాఫ్‌లో ఉత్కంఠభరితమైన ఇంటర్వెల్ బ్లాక్‌తో సహా 4 ఫైట్లు ఉండగా, చివరి 20 నిమిషాల క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ గా నిలవనుంది. మట్కా గేమ్ అనేది కేవలం సినిమాలో ఒక భాగం మాత్రమే. ఇది వాస్తవానికి వాసు జీవితం ఆధారంగా తెరకెక్కింది, అతని 16 సంవత్సరాల వయస్సు నుండి 52 ఏళ్ల వ్యక్తి లైఫ్ జర్నీ ఈ సినిమా. అతని పాత్ర వయస్సు పెరిగే కొద్దీ అతని వాయిస్, బాడీ లాంగ్వేజ్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్‌లో వైవిధ్యాన్ని వరుణ్ తెజ్ కనబరిచాడు. సెన్సార్ రిపోర్ట్ పూర్తి పాజిటివ్ గా ఉండటంతో ఈ సినిమా ఓపెనింగ్స్ భారీగా ఉండే అవకాశం ఉంది.