NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

విశాఖ-విజయనగరం కలిసిపోతాయి.. జూన్ 2026కి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పూర్తి..
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ప్రాజెక్టుల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఒకటి.. అయితే, జూన్ 2026 నాటికి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణ పనులు పూర్తికానున్నట్టు వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. భోగాపురం చేరుకున్న సీఏం చంద్రబాబుకు మంత్రులు అధికారులు.. పార్టీ ముఖ్య నాయకులు, అధికారులు స్వాగతం పలికారు.. ఆ తర్వాత భోగాపురం ఇంటర్నేషనల్ విమానాశ్రయ పనులను పరిశీలించారు చంద్రబాబు.. అనంతరం రాష్ట్రంలో ఎయిర్ పోర్ట్ పై సెంట్రల్ ఏవియేషన్ అధికారులతో సమీక్ష చేశారు.. రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ ఉంటుండగానే కాకినాడ, అమలాపురంలో ఎయిర్ పోర్ట్ లకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.. ఇక, భోగాపురం ఎయిర్‌పోర్ట్ పూర్తి కావటానికి ఎంత సమయం పడుతుందని జీఎంఆర్ ప్రతినిధులను అడిగారు చంద్రబాబు.. దానికి సమాధానంగా 2026 జూన్‌ నాటికి పూర్తి చేయనున్నట్టు తెలిపారు జీఎంఆర్‌ ప్రతినిధులు.. అలాగే మౌలిక సదుపాయాల వాటర్, పవర్ అందించే విషమై చొరవ చూపాలని సీఎం చంద్రబాబును కోరారు జీఎంఆర్ ప్రతినిధులు.. ఇక, అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం భోగాపురం ఎయిర్ పోర్ట్.. ఇది గ్రోత్ ఇంజన్ గా పనిచేస్తుందని తెలిపారు.. రానున్న రోజుల్లో విశాఖపట్నం – విజయనగం కలిసిపోతాయన్నారు.. ఫేజ్ వన్ లో బీచ్ రోడ్, ఫేజ్ త్రీలో శ్రీకాకుళం రోడ్.. 5 వేల ఎకరాలు తీసుకోడం జరిగింది.. ఎయిర్ పోర్ట్ పనులు చూస్తే 38 శాతం పూర్తి చేశారని తెలిపారు.. ఈ ఎయిర్‌పోర్ట్‌ నుంచి 45 మిలియన్ పాసింజర్ ట్రావెల్ చేస్తారు.. అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక, పారిశ్రామికంగా ఎదడగానికి భోగాపురానికి మంచి అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.

మంత్రి నారా లోకేష్ వాట్సాప్ బ్లాక్.. ప్రజలకు కీలక సూచన
మంత్రి నారా లోకేష్‌ అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.. ఫోన్‌ కాల్‌తో.. చివరకు తనకు మెసేజ్‌ వచ్చినా స్పందిస్తూ.. ఆ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటున్నారు.. ఓవైపు ప్రజా దర్భార్‌తో ప్రజల సమస్యల నుంచి వినతులు స్వీకరిస్తూ.. మరోవైపు.. సోషల్‌ మీడియాలో తన దృష్టికి వచ్చిన సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు.. అయితే, మంత్రి నారా లోకేష్ వాట్సాప్‌ను బ్లాక్‌ చేసింది మెటా.. దానికి ఓ ప్రధాన కారణం ఉంది.. పెద్ద ఎత్తున వాట్సాప్ కు మెసేజ్‌లు వస్తుండడంతో మెటా.. మంత్రి లోకేష్‌ వాట్సాప్‌ ఖాతాను బ్లాక్‌ చేసింది.. ఈ నేపథ్యంలో.. ప్రజలకు కీలక సూచనలు చేశారు మంత్రి.. ప్రజలు తమ సమస్యలు తన పర్సనల్ మెయిల్ ఐడీ hello.lokesh@ap.gov.inకి పంపాలని విజ్ఞప్తి చేశారు.. తానే స్వయంగా ఆ మెయిల్ చూసి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు.. సమస్య ఏదైనా, సహాయం కావాలన్నా ఇకనుంచి తనకు hello.lokesh@ap.gov.in ఈ మెయిల్ ఐడీకి పంపాలని సూచించారు మంత్రి నారా లోకేష్‌.. సాయం కోసం వచ్చే ప్రజలకు నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్న ఆయన.. నేనే అందరి సమస్యలు నేరుగా పరిష్కరించే ప్రయత్నం చేస్తాను అన్నారు. పేరు, ఊరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, సమస్య-సహాయంకు సంబంధించిన పూర్తి వివరాలు వినతులలో పొందుపరచాలని పేర్కొన్నారు.. తనకు మెయిల్ చేస్తే తాను స్పందిస్తాను అన్నారు.. వాట్సాప్‌ తరచూ బ్లాక్ కావడంతో ప్రజలు పంపే మెసేజ్‌లు చూసే అవకాశం ఉండటం లేదు.. దయచేసి అందరూ మెయిల్ ఐడీకే వినతులు పంపించాలని కోరారు మంత్రి నారా లోకేష్‌. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు మంత్రి లోకేష్‌. కాగా, సామాన్య ప్రజానీకం పడుతున్న కష్టాలు, వారి సమస్యల పరిష్కారం కోసం మంత్రి లోకేష్‌ నిర్వహిస్తోన్న ప్రజాదర్బార్ కు విశేష స్పందన లభిస్తోంది. ఉండవల్లి నివాసంలో 16వ రోజు ప్రజాదర్బార్ కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. ఆయన్ని నేరుగా కలిసి ప్రజలు తమ సమస్యలు విన్నవించారు. వారి సమస్యలను ఓపిగా వింటూ.. వాటి పరిష్కారానికి పూనుకుంటున్నారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభించి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటా..
భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ ను ప్రారంభించి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటా అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైన భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ గ్రోత్ ఇంజెన్ లా తయారవుతుందన్నారు.. హైదారాబాద్ కి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ ఎలా పని చేస్తుందో.. ఇది కూడా ఉత్తరాంధ్రకు అంతే కీలకంగా మారుతుందన్నారు. భవిష్యత్ లో ఈ ఎయిర్‌పోర్ట్‌తో విశాఖ, శ్రీకాకుళం కూడా కలిసిపోతాయని పేర్కొన్నారు.. 2015 మే 15న అప్పటి ముఖ్యమంత్రిగా ఈ ఎయిర్‌పోర్ట్‌కు ఆమోదం చేశాను.. కానీ, వైసీపీ వాళ్లు వచ్చి మొత్తం కూని చేశారు.. పూర్తిగా చిన్నాభిన్నం చేశారని విమర్శించారు.. 2700 ఎకరాల్లో 500 ఎకరాలు పక్కన పెట్టారు. చేసిన శంకుస్థాపలకే మళ్లీ శంకుస్థాపన చేశారు అంటూ ఎద్దేవా చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో ఇప్పటి వరకు 31.8 శాతం వర్క్ పూర్తి అయ్యిందన్నారు సీఎం చంద్రబాబు.. కేంద్ర పౌరవిమానాయశాఖ మంత్రి, ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణ సంస్థ… ఇరువురూ ఉత్తరాంధ్రకు చెందినవారే అని గుర్తుచేశారు.. ఈ ఎయిర్‌పోర్ట్‌ ద్వారా ప్రారంభంలో 4.5 మిలియన్ ప్రయాణికులు ప్రయాణించనున్నారు.. 400 కోట్లతో ఫేజ్ వన్ స్టార్ట్ చేస్తున్నారు.. ఎంత మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయో వివరాలు ఇవ్వమని అడిగానన్నారు. ఈ విమానాశ్రయం పూర్తి అయితే చుట్టూ పక్కల ప్రాంతాలు అన్ని అభివృద్ది చెందుతాయన్నారు. ఇక, కొన్ని రాష్ట్ర రహదారులు గుంతలుగా ఉన్నాయి.. ఆ రోడ్లు అన్ని పూర్తి చేస్తాం అన్నారు. కూటమికి ఉత్తరాంధ్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారు.. ఓటు వేసేవారిని విస్మరించను.. వారి అభివృద్ది, సంక్షేమమే నా లక్ష్యం అని స్పష్టం చేశారు.

రైతుల అభిప్రాయాలకు అనుగుణంగానే రైతు భరోసా ఖరారు
క్షేత్రస్థాయిలో రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి పూర్తిస్థాయి మార్గదర్శకాలతో ‘రైతుభరోసా’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో రైతు భరోసా విధివిధానాల ఖరారుపై ఉమ్మడి అదిలాబాద్ జిల్లా రైతుల నుండి అభిప్రాయాలు, సలహాలను కేబినెట్ సబ్ కమిటీ సేకరించింది. కేబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల్లో కీలకమైన రైతు భరోసా పథకాన్ని ప్రజాక్షేత్రంలో రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా పకడ్బందీగా అమలు చేసి తీరుతుందన్నారు. అన్ని జిల్లాల్లో కేబినెట్ సబ్ కమిటీ పర్యటించి ప్రజా క్షేత్రంలో అభిప్రాయాలు సేకరించి ఈ అసెంబ్లీలో నివేదిక పొందుపరుస్తామని అన్నారు. పంట పెట్టుబడి సాయం కోసం అందించే రైతు భరోసా పేద బడుగు వర్గాలకు న్యాయం చేసేదిగా ఉండాలని విజ్ఞప్తులు వస్తున్నాయని అన్నారు. రైతు భరోసా సాయంపై ఇప్పటివరకు ఎలాంటి పరిమితులు ఖరారు కాలేదని, గ్రామం యూనిట్‌గా తీసుకోవాలని ఎక్కువ మంది రైతులు సూచిస్తున్నారని పేర్కొన్నారు. పోడు రైతులకు సర్కారు సాయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

స్కూల్‌లో ప్రేయర్ చేస్తుండగా గుండెపోటుతో పీఈటీ టీచర్ మృతి
ఓ ప్రైవేట్ స్కూల్‌లో విద్యార్థులు, తోటి స్టాఫ్‌తో కలిసి ప్రేయర్ చేస్తున్న టీచర్ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అనంతరం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. జనగామ పట్టణంలోని అరబిందో స్కూల్‌లో రాజారెడ్డి పీఈటీగా పని చేస్తున్నారు. గురువారం ఉదయం పాఠశాలకు హాజరైన రాజారెడ్డి విద్యార్థులతో ఉత్సాహంగా గడిపాడు. పిల్లలందరినీ ప్రేయర్ కోసం పిలిచాడు. తర్వాత ప్రేయర్ మొదలైంది. అయితే, అంతలోపే ఉన్నట్లుండి కార్డియాక్ అరెస్టుతో అదరిముందే కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది, యాజమాన్యం దగ్గర్లోని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. తమను ఆటలు ఆడిస్తూ ఉత్సాహపరిచే పీఈటీ టీచర్ రాజారెడ్డి మృతి పట్ల పాఠశాల విద్యార్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. రాజారెడ్డి మృతితో అతడి కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.

రాష్ట్రంలో పెట్టుబడికి ముందుకొచ్చిన అమెరికా టెలికమ్యూనికేషన్స్ దిగ్గజం
అమెరికా టెలికమ్యూనికేషన్స్ దిగ్గజం మైక్రోలింక్ నెట్ వర్క్స్ రూ.500 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో తమ ఎలక్ట్రానిక్, ఇతర ఉత్పత్తుల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన పీఎస్‌ఆర్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో మైక్రోలింక్ పరిశ్రమల క్లస్టర్‌ను ప్రారంభిస్తుందని తెలిపారు. గురువారం నాడు మైక్రోలింక్ గ్లోబల్ ప్రతినిధులు, భారతీయ భాగస్వామి పీఎస్‌ఆర్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ రంగారావు మంత్రితో సచివాలయంలో సమావేశమయ్యారు. వచ్చే మూడేళ్లలో రూ.500 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్, ఐటీ, నిర్మాణరంగ పరికరాలను ఉత్పత్తి చేస్తుందని శ్రీధర్ బాబు వివరించారు. రానున్న మూడేళ్లలో 700 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఇటీవల తన అమెరికా పర్యటనలో మైక్రోలింక్ నెట్ వర్క్స్ యాజమాన్యంతో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని అన్నారు. అనంతరం తెలంగాణలో పెట్టుబడులకు అంగీకరించిందని మంత్రి తెలిపారు. డేటా ట్రాన్స్‌మిషన్, నెట్ వర్కింగ్ కేబుల్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మల్టీ లెవెల్ పార్కింగ్ మిషన్ల ఉత్పత్తిలో మైక్రోలింక్ నెట్ వర్క్స్ గ్లోబల్ లీడర్‌గా ఉంది. ఇప్పుడా కంపెనీ పీఎస్‌ఆర్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో పరిశ్రమలను ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణలో నైపుణ్యం ఉన్న సిబ్బందికి కొరత లేదని వెల్లడించారు. సమావేశంలో పీఎస్‌ఆర్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ రంగారావు, డైరెక్టర్ నమ్యుత, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధర్మరాజు చక్రవరం, మైక్రోటెక్ గ్లోబల్ ప్రతినిధులు డెనిస్ మొటావా,సియాన్ ఫిలిప్స్, జో జోగ్భి, అశోక్ పెర్సోత్తమ్, తదితరులు పాల్గొన్నారు.

“ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌”ని తప్పుడు కేసులో ఎందుకు ఇరికించారు.? కేరళ పోలీసులపై సీబీఐ సంచలన విషయాలు.
ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ కేసులో సీబీఐ చివరి ఛార్జిషీట్‌ని దాఖలు చేసింది. జూన్ చివరి వారంలో దాఖలు చేసిన ఈ ఛార్జిషీట్‌లో సంచలన విషయాలను పేర్కొంది. 1994 ఇస్రో గూఢచర్యం కేసులో మాజీ అంతరిక్ష శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ని కేరళ పోలీస్ తప్పుగా ఇరికించారని పేర్కొంది. మాల్దీవులకు చెందిన మహిళ పోలీస్ అధికారి చెప్పిన దానికి ఒప్పుకోకపోవడంతోనే, ఆమెను అక్రమంగా నిర్బంధించి, దానిని కప్పిపుచ్చుకోవడానికే ఈ కేసును తీసుకువచ్చారని సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొంది. గూఢచర్యం కేసులో నారాయణన్‌తో పాటు ఇద్దరు మాల్దీవుల మహిళలతో సహా మరో ఐదుగురిని ఇరికించారనే ఆరోపణలపై మాజీ పోలీసు అధికారులపై దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో కేంద్ర ఏజెన్సీ ఈ ఆరోపణ చేసింది. మాల్దీవులకు చెందిన మరియం రషీదా అనే మహిళ, అప్పటి స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ ఎస్ విజయన్ ఆమె ప్రయాణ పత్రాలు, విమాన టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నాడని సీబీఐ పేర్కొంది. విజయన్ లైంగిక కోరికల్ని ఆమె తిరస్కరించడంతో దేశం విడిచివెళ్లకుండా ఈ పనిచేసినట్లు సీబీఐ పేర్కొంది. ఇస్రో శాస్త్రవేత్త డి శవికుమారన్‌తో రషీదా సంప్రదింపులు జరుతున్నాడని తెలుసుకున్న విజయన్, రషీదా మరియు ఆమె మాల్దీవుల స్నేహితురాలు ఫౌజియా హసన్‌పై నిఘా పెట్టినట్లు ఛార్జిషీట్ పేర్కొంది.

నీట్‌ వివాదంపై సుప్రీంకోర్టు విచారణ.. ఏం తేల్చిందంటే..!
దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్న నీట్ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టింది. మే 5న మెడికల్ ప్రవేశ పరీక్ష కోసం జరిగిన అవకతవకలు పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు నీట్-యూజీ విచారణను వచ్చే గురువారం (జూలై 18కి) వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై జరుగుతున్న విచారణకు సంబంధించి నివేదికను సీబీఐ కోర్టుకు సమర్పించింది. శుక్రవారమే విచారణ చేపడతామని న్యాయస్థానం చెప్పినప్పటికీ.. సొలిసిటర్‌ జనరల్‌ అభ్యర్థన మేరకు వాయిదాను పొడిగించింది. జూలై 8న ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ వ్యవహారంపై నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తమ స్పందనలు తెలియజేశాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పేర్కొన్నారు. ఆ అఫిడవిట్లు పిటిషన్‌దారులకు ఇంకా చేరలేదని.. వాటిని పరిశీలించేందుకు వీలుగా సమయమిస్తూ తదుపరి విచారణ జూలై 18కి వాయిదా వేస్తున్నట్లు చంద్రచూడ్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే లీకైన ప్రశ్నపత్రం బీహార్‌లోని ఒక్క పరీక్ష కేంద్రానికే పరిమితమైందని, విస్తృతంగా వ్యాప్తి చెందలేదని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ సుప్రీంకోర్టుకు తెలియజేసినట్లు సమాచారం. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ ఇది వ్యాప్తి చెందలేదని పేర్కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన నివేదికను ధర్మాసానానికి సీబీఐ సీల్డ్‌ కవర్‌లో గురువారం అందజేసింది.

రీల్స్ పిచ్చితో ముగ్గురు యువకులు బలి.. బస్సును ఢీకొని మృతి
సోషల్ మీడియాలో హైలైట్ అవడం కోసం యువకుల తమ ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ కోసం చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే లైకుల కోసం, వ్యూస్ కోసం ఏకంగా ప్రాణాలు సైతం పణంగా పెడుతున్నారు. సోషల్ మీడియాలో సెలబ్రెటీ అయిపోవాలని పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నారు. కష్టపడి చేసిన వీడియోకు అనుకున్న స్థాయిలో లైకులు, వ్యూస్ రాకపోతే వారికి చాలా బాధగా ఉంటుంది. ఒక్కోసారి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి ఆత్మహత్యలు చేసుకుంటుండగా.. కొందరు మాత్రం చేజేతులా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన జరిగింది. గురువారం తెల్లవారుజామున వారణాసిలో ఒకే బైక్‌పై రీల్స్ చేస్తూ వెళ్తున్న ముగ్గురు యువకులు బస్సును ఢీకొట్టారు. దీంతో.. వారు వంద మీటర్ల దూరంలో పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాద వార్త తెలియగానే మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు మృతదేహాలను అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం ప్రమాదానికి పాల్పడ్డ బస్సును పట్టుకున్నారు. అయితే.. ఈ ఘటనకు ముందు ముగ్గురు యువకులు మార్గమధ్యంలో ఓ యువకుడిని ఢీకొట్టారని పోలీసులు చెబుతున్నారు. రోహనియా పోలీస్ స్టేషన్ పరిధిలోని చితాయ్‌పూర్ ఖానావ్ గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అనంత్ అంబానీ పెళ్లికి ప్రపంచ ప్రఖ్యత కంపెనీల ప్రముఖులు..
అనంత్, రాధిక వివాహం జులై 12న జరగనుంది. అనంతరం జులై 13న శుభాశీర్వాద కార్యక్రమం, 14న స్వాగత కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ సెంటర్‌లో జరుగుతాయి. పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందింది. వీరిలో అనేక గ్లోబల్ కంపెనీల సీఈఓలు ఉన్నారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీల్లో ఒకటైన సౌదీ అరామ్‌కో సీఈవో అమీన్ నాసర్, హెచ్‌ఎస్‌బీసీ గ్రూప్ ఛైర్మన్ మార్క్ టక్కర్, అడోబ్ భారతీయ సంతతికి చెందిన సీఈవో శంతను నారాయణ్, మోర్గాన్ స్టాన్లీ ఎండీ మైఖేల్ గ్రిమ్స్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఛైర్మన్ జే లీ, ముబాదలా ఎండీ ఖల్దున్ అల్ ముబారక్, బీపీ సీఈవో ముర్రే ఔచ్ వంటి వ్యాపార ప్రముఖులు ఉన్నారు. లాక్‌హీడ్ మార్టిన్ సీఈవో జేమ్స్ ట్యాక్‌లెట్, ఎరిక్సన్ సీఈవో బోర్జే ఎఖోల్మ్ మరియు సింగపూర్ ప్రభుత్వ యాజమాన్యంలోని ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ టెమాసెక్ సీఈవో దిల్హాన్ పిళ్లే ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సమాచారం. దీనితో పాటు, హెచ్ (HP) ప్రెసిడెంట్ ఎన్రిక్ లోర్స్, ADIA బోర్డు సభ్యుడు ఖలీల్ మహ్మద్ షరీఫ్ ఫౌలాతీ, కువైట్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ MD బదర్ మహ్మద్ అల్-సాద్, నోకియా ప్రెసిడెంట్ టామీ ఉటో, గ్లాక్సో స్మిత్‌క్లైన్ సీఈవో ఎమ్మా వాల్మ్‌స్లీ తదితరులు రానున్నారు.

కొత్త కారు కొన్న చరణ్.. ఇండియాలోనే రెండోది.. ఆ ధరతో ఎన్ని ఫ్లాట్లు కొనచ్చో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవికి కార్లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇప్పుడు ఆయన నటవారసుడిగా ఉన్న రామ్ చరణ్ కూడా ఈ కార్లపై అంతే ఇష్టాన్ని కనబరుస్తున్నారు. ఇప్పటికే పలు లగ్జరీ కార్లను మెయింటైన్ చేస్తున్న రామ్ చరణ్ ఇప్పుడు మరో లగ్జరీ కార్ ను కొనుగోలు చేశారు. అది కూడా అల్లాటప్పా కారు కాదండోయ్ దాని రేటు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన ఈ కారు ధర ఏకంగా ఏడున్నర కోట్లు. ఇక ఆన్ రోడ్ ధర ఇంకా ఎక్కువే. రోల్స్ రాయిస్ స్పెక్ట్రాగా పిలువబడే ఈ కారు ఇండియాలో రెండో కారు అని తెలుస్తోంది. చరణ్, ఉపాసన ముంబైలో జరుగుతున్న అనంత్ అంబానీ పెళ్లి వేడుకలకు వెళ్ళడానికి ఎయిర్ పోర్ట్ లో ఈ రోల్స్ రాయిస్ కారులో వెళ్లగా అక్కడి వీడియోలు వైరల్ గా మారాయి. రోల్స్ రాయిస్ కారుని చరణ్ స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ రాగా ఉపాసన కూడా ఈ కారులో క్లిన్ కారాతో కలిసి వచ్చింది. నిజానికి రోల్స్ రాయిస్ కంపెనీ ఈ కారుని జనవరిలో రిలీజ్ చేయగా అప్పుడే చరణ్ బుక్ చేయించగా అది ఈ మధ్యనే డెలివరీ అయింది. ఇది దేశంలో రెండవ కారు కాగా హైదరాబాద్ లో ఈ కార్ ఫస్ట్ కస్టమర్ రామ్ చరణ్ కావడం గమనార్హం. ఇక డబ్బు లెక్కలో చూస్తే రామ్ చరణ్ ఈ కారు కొనడానికి పెట్టిన ఏడున్నర కోట్లతో హైదరాబాదులో ప్రైమ్ లొకేషన్లో రెండు మూడు లగ్జరీ ఫ్లాట్లు కొనుగోలు చేయొచ్చు.

పవన్ కళ్యాణ్ ఆఫీసుకు రాజ్ తరుణ్ లవర్.. భార్యలను ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు
హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించి తనతో సహజీవనం కూడా చేసి ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నాడు అంటూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదే విషయం మీద ఆమె పలు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ క్రమంలోనే ఆధారాలు సబ్మిట్ చేయడంతో రాజ్ తరుణ్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. లావణ్య కేసులో హీరో రాజ్‌తరుణ్‌ను ఏ-1 చేర్చిన పోలీసులు, ఏ-2గా మాల్వి మల్హోత్రా.. ఏ-3గా మయాంక్‌ మల్హోత్రలను చేర్చాడు. 2010లో రాజ్‌తరుణ్‌ తనకు ప్రపోజ్‌ చేశాడని, 2014లో నన్ను పెళ్లి చేసుకున్నాడని లావణ్య చెవుతోంది. రాజ్ తరుణ్‌ను మా కుటుంబం అన్ని విధాలుగా ఆదుకుంది. రాజ్‌తరుణ్‌కు ఇప్పటివరకు రూ.70 లక్షలు ఇచ్చామని, ఆయన 15 కుక్కల కారణంగా 6 సంవత్సరాల్లో 6 ఇల్లులు మార్చామని కూడా లావణ్య చెబుతోంది. అంతేకాదు రాజ్‌తరుణ్‌, మాల్వి కలిసి నన్ను డ్రగ్స్‌ కేసులో ఇరికించారని లావణ్య ఆరోపిస్తోంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ దేవుళ్లలో శివుడు మనుషుల్లో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని అన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడం మొదలు కార్ వెనుక స్టిక్కర్ దాకా ఆయన మీద చాలా ప్రేమ ఉందని అన్నారు. ఇప్పుడు కూడా ఆయనను కలిసి ఆయనకు రాజ్ తరుణ్ నన్ను ప్రేమించి నమ్మించి మోసం చేశాడని ఆయన దృష్టికి తీసుకు వెళ్లాలని అనుకుంటున్నానని ఆమె అన్నారు. పవన్ కి కూడా రెండు మూడు పెళ్లిళ్లు అయ్యాయి కానీ వాళ్ళని పవన్ గౌరవంగా, భాద్యతగానే చూసుకుని ఉంటారు. కానీ రాజ్ తరుణ్ అలా కాదు నాకు , పిల్లల(రాజ్ తరుణ్ 15 కుక్కలు)కు కనీసం తిండి తినడానికి కూడా డబ్బు ఇవ్వడం లేదని లావణ్య పేర్కొంది.