విచారణ ముమ్మరం చేసిన సిట్:
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వివాదంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ సాగుతోంది. భూదేవి కాంప్లెక్స్‌లో లడ్డు కల్తీ వ్యవహారంపై సీబీఐ సిట్ బృందం సమావేశమంది. డీఎస్పీ, సీఐలు సహా ఇతర అధికారులు సీబీఐ ఎస్పీ మురళి రాంబాతో సమావేశం కానున్నారు. సిట్ బృందం డీఎస్పీల స్థాయిలో విచారణ ప్రారంభించింది. అధికారులు అన్ని కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు. సిట్ అధికారులు తిరుమలలో రెండు రోజులుగా దర్యాప్తు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులతో కలిసి ఇటీవల సిట్ ఏర్పాటు చేశారు. సీబీఐ అధికారుల పర్యవేక్షణలో ఈ విచారణ ముమ్మరంగా సాగుతోంది. అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్జీవీ అరెస్టుకు రంగం సిద్ధం:
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైంది. మరోసారి ప్రకాశం జిల్లా పోలీసులకు ఆర్జీవీ హ్యాండ్ ఇచ్చారు. ఇవాళ ఒంగోలు రూరల్ సర్కిల్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిన ఆయన డుమ్మా కొట్టారు. విచారణకు హాజరుకాలేనని పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణకు ఆర్జీవీ హాజరుకాకుంటే.. ఆయనను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్‌లోని వర్మ నివాసానికి ఇప్పటికే జిల్లా పోలీసులు చేరుకున్నారు. ఈనెల 19న విచారణకి హాజరు కాకుండా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ వారం రోజులు గడువు కోరటంతో.. ఆయన విజ్ఞప్తి మేరకు ఇవాళ హాజరు కావాలని 20వ తేదీన పోలీసులు మరోసారి నోటీసు ఇచ్చారు. ఆర్జీవీని విచారించేందుకు ఒంగోలు రూరల్ సర్కిల్ కార్యాలయంలో అన్నీ ఏర్పాట్లు చేశారు. తీరా అయన విచారణకు హాజరుకానని చెప్పడంతో.. అరెస్టుకు రంగం సిద్ధం చేశారు.
వెంటనే ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయండి:
ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఆన్లైన్ లో ఎంట్రీ చేయాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం తాడికల్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని రైతులను అడిగి తెలుసుకున్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు లేవని రైతులు తెలిపారు. వడ్లు కొనుగోలు చేసిన 24 గంటల లోపే ధాన్యం డబ్బులు పడుతున్నాయని రైతులు మంత్రికి వివరించారు. ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్ల కొనుగోలుకు క్వింటాల్ కి రూ.500 బోనస్ ఇస్తుందని తెలిపారు. తనకి బోనస్ డబ్బులు జమ అయ్యాయని రైతులు మంత్రికి చూపించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఆన్లైన్ లో ఎంట్రీ చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రతిపక్షాలు కావాలని కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేశారని మండిపడ్డారు. రైతులకు ఎక్కడ ఇబ్బందులు లేవని మంత్రి స్పష్టం చేశారు.
యజమానిపై దాడి చేసిన కస్టమర్లు:
తిన్న ఫుడ్ కు బిల్లు కట్టమని అడిగిన స్వీట్ హౌజ్ యజమానిపై ముగ్గురు కస్టమర్లు దాడి పాల్పడ్డారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. జగిత్యాలలో ఓ స్వీట్ హౌజ్ కి ఒక యువతి, ఇద్దరు యువకులు వచ్చారు. అయితే అక్కడ స్వీట్స్ ఆర్డర్ చేసి బాగా తిన్నారు. డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతుండటంతో స్వీట్ హౌజ్ యజమానికి కస్టమర్లను మనీ ఇవ్వాలని అడిగాడు. అంతే యువతి ఆగ్రహంతో ఎందుకు డబ్బులు ఇవ్వాలి అంటూ యజమానికి వద్దకు దుర్భాషలాడుతూ వెళ్లింది. లోపలికి ఎందుకు వస్తున్నావ్.. తిన్న తిండికి డబ్బులు కట్టాలా కదా? అని యజమాని ప్రశ్నించారు. దీంతో యువతితో పాటు వెనుక నుంచి వచ్చిన ఓ యువకుడు స్వీట్ యజమాని కాలర్ పట్టుకుని కడుపులో పిడుగుద్దులు గుద్దాడు. మరో యువకుడు వచ్చి యజమానిని తీవ్రంగా కొట్టాడు. అక్కడున్న కష్టమర్లు దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా యువకులు ఆగలేదు. దాడి అనంతరం వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. స్వీట్ షాప్ యజమాని టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్:
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి నేతలు రెడీ చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరన్నది? ఓ పెద్ద ప్రశ్నగా మారిపోయింది. సీఎం పదవి కోసం దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే ఇద్దరూ గట్టిగా పోటీ పడుతున్నారు. దీంతో ఎవరు సీఎం పీఠాన్ని దక్కించుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నెక్ట్స్ ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌కే అజిత్ పవార్ సపోర్ట్ ఇచ్చినట్లు సమాచారం. ఆదివారం జరిగిన భేటీలో ఫడ్నవీస్‌ను సీఎం చేసేందుకు అజిత్‌తో పాటు ఆయన ఎమ్మెల్యేలంతా మద్దతు ఇచ్చినట్లు తెలుస్తుంది.
నానా పటోలే రాజీనామా:
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహా వికాస్ అఘాడీ ఘోర ఓటమిని చవి చూసింది. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ‘మహా’ ఎన్నికల్లో పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవికి నానా పటోలే రిజైన్ చేశారు. ఎన్నికల్లో ఆయన సకోలి స్థానం నుంచి 208 ఓట్ల మార్జిన్‌తో విజయం సాధించారు. అయితే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 288 స్థానాలు ఉండగా.. మహాయుతి కూటమి 233 స్థానాల్లో గెలిచింది. అటు ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి 51 చోట్ల విజయం సాధిచింది. కూటమిలో భాగంగా 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 16 స్థానాలు మాత్రమే గెలుచుకోవడంతో పార్టీకి భారీ షాక్ తగిలింది. మహారాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి ఎప్పుడూ లేనంత బలహీనంగా హస్తం పార్టీ మారిపోయింది.
థర్డ్ డిగ్రీకి వర్మ భయపడడు:
ఆర్జీవీ పై ఒంగోలు పోలీసులు సీరియస్ యాక్షన్ కు సిద్ధమయ్యారు. వర్మను అరెస్టు చేసి ఒంగోలు తీసుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. డిజిటల్ మోడ్ లో విచారణకు హాజరవుతానని ఆర్జీవీ రెక్వెస్ట్ చేసినా అవకాశం ఇచ్చేది లేదంటున్నారు. విచారణ అధికారిగా పోలీసులకు ఉన్న పవర్స్ దృష్ట్యా డిజిటల్ విచారణకు అంగీకరించమంటున్నారు. ఆయన కోరిన విధంగా రెండు సార్లు విచారణకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించినా ఆర్జీవీ సద్వినియోగం చేసుకోలేదంటున్నారు. పోలీసు అధికారుల నోటీసులు ధిక్కరించారు కాబట్టే చట్టప్రకారం ఆర్జీవీ ని అరెస్ట్ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని ఆయన నివాసం వద్ద మోహరించారు. ఆర్జీవీ మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్ లో ఉండటంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. ఆర్జీవీ ని ట్రాక్ చేసేందుకు తెలంగాణ పోలీసుల సాయం కోరనున్నారు జిల్లా పోలీసులు. అయితే ఈ విషయం మీద రామ్ గోపాల్ వర్మ లాయర్ స్పందించారు. దేశం ఇంత అభివృద్ధి చెంది ముందుకు దూసుకుపోతున్న కారణంగా ఫిజికల్ గా కాకుండా వర్చువల్ గా హాజరవుతామని చెబుతున్నారు. అంతేకాక ఆయన బిజీ డైరెక్టర్ కావడంతో ఆ సదుపాయం కోసం కోరినట్టు చెబుతున్నారు. అయితే థర్డ్ డిగ్రీకి వర్మ భయపడ్డారా? అని అడిగిన మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానంగా థర్డ్ డిగ్రీకి వర్మ భయపడడు అని వర్మ తరపు లాయర్ చెప్పుకొచ్చారు.
టాప్ 10 ఆటగాళ్లు ఎవరంటే:
1. రిషబ్ పంత్ – లక్నో సూపర్ జెయింట్స్ – రూ.27 కోట్లు
2. శ్రేయాస్ అయ్యర్ – పంజాబ్ కింగ్స్ – రూ.26.5కోట్లు
3. వెంకటేష్ అయ్యర్ – కోల్‌కతా నైట్ రైడర్స్ – రూ. 23.75 కోట్లు
4. అర్ష్‌దీప్ సింగ్ – పంజాబ్ కింగ్స్ (RTM) – రూ.18కోట్లు
5. యుజ్వేంద్ర చాహల్ – పంజాబ్ కింగ్స్ – రూ.18కోట్లు
6. జోస్ బట్లర్ – గుజరాత్ టైటాన్స్ – రూ.15.75కోట్లు
7. కేఎల్ రాహుల్ – ఢిల్లీ క్యాపిటల్స్ – రూ.14కోట్లు
8. మహ్మద్ సిరాజ్ – గుజరాత్ టైటాన్స్ – రూ. రూ.12.25కోట్లు
9. మిచెల్ స్టార్క్ – ఢిల్లీ క్యాపిటల్స్ – రూ.11.75కోట్లు
10. ఇషాన్ కిషన్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ – రూ.11.25 కోట్లు