NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

మనం కూడా మంచి ఫలితాలు సాధించాలి:
కొన్ని దేశాలు వ్యర్ధాలతో అద్భుతాలు చేస్తున్నాయని, ఏపీలో కూడా ‘స్వచ్ఛ దివాస్’ కార్యక్రమంతో మంచి ఫలితాలు సాధించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 2048 నాటికి రాష్ట్రం అద్భుతమైన పురోగతి కోసం కృషి చేస్తున్నామన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం అని, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని పవన్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో ‘స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హాజరయ్యారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో డిప్యూటీ సీఎం పవన్‌ మొక్కలు నాటారు. అనంతరం పారిశుద్ధ్య తరలింపు వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభం:
పోలవరం నిర్మాణ పనుల్లో కీలక ఘట్టానికి ప్రాజెక్టు అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు శ్రీకారం చుట్టారు. 2020 తర్వాత వచ్చిన వరదల కారణంగా దెబ్బతిన్న డయాఫ్రం వాల్ స్థానంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి పనులను ప్రారంభించారు. ప్రాజెక్టు ప్రధాన కాంట్రాక్టర్ మెగా ఇంజనీరింగ్ సంస్థ ఆధ్వర్యంలో జర్మనీకి చెందిన బావర్ కంపెనీ డివాల్ నిర్మాణ పనులను చేపడుతోంది. పాత డయాఫ్రం వాల్‌కు 6 మీటర్ల ఎగువన కొత్త నిర్మాణం చేపట్టనున్నారు. ఈ డయాఫ్రం వాల్ కోసం ప్రభుత్వం రూ.990 కోట్లు వ్యయం చేయనుంది.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై అనవసర రాజకీయాలు చేయొద్దు:
హైదరాబాద్ నగరంలోని ఎర్రమంజిల్ లో ఉన్న మిషన్ భగీరథ కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి కార్యదర్శి లోకేష్ కుమార్, డైరెక్టర్ సృజనతో పాటు అన్ని జిల్లాల డిఆర్డిఓల అధికారులు హాజరయ్యారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలుపై దిశానిర్దేశం చేస్తూ మంత్రి పలు కీలక సూచనలు చేశారు. కూలీల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేస్తామన్న మంత్రి, ఉపాధి హామీ పథకం కింద మహిళా కూలీలకు వారి బ్యాంకు ఖాతాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మొత్తాన్ని జమ చేస్తామని పేర్కొన్నారు.

మరోమారు బయటపడ్డ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్లక్ష్యం:
వరంగల్ జిల్లా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) అధికారుల నిర్లక్ష్యం మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఈ నెల 16న నిర్వహించిన పీజీ రేడియాలజీ డయాగ్నోసిస్ పరీక్షలో 2023 నవంబర్‌లో వాడిన పాత ప్రశ్నపత్రాన్నే మళ్లీ ఉపయోగించారు. ఆ ప్రశ్నపత్రంపై కవర్లో ఉన్న కోడ్ నంబర్ కూడా మార్పు చేయకపోవడం గమనార్హం. దీనితో విద్యార్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. అలాగే యూనివర్సిటీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత అవకతవకలు ఇంకా కొనసాగుతున్నాయా? కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం గతంలో కూడా పరీక్షల నిర్వహణలో అనేక అవకతవకలకు గురైంది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలలో బయో కెమిస్ట్రీ పేపర్ 1, పేపర్ 2లో సిలబస్‌లో లేని ప్రశ్నలను అందించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అదే నిర్లక్ష్యం పీజీ రేడియాలజీ పరీక్షల్లో కూడా కొనసాగుతోంది.

ఢిల్లీలో సీరియల్ కిల్లర్ అరెస్ట్:
ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పెరోల్ జంపర్ చంద్రకాంత్ ఝాను అరెస్టు చేశారు. చంద్రకాంత్ ఝా ఇప్పటి వరకు 18 హత్యలు చేశాడు. దీనితో పాటు అతడు వాళ్లను చంపిన తర్వాత వాళ్ల మృతదేహాలను ముక్కలుగా నరికి నగరంలో పలు చోట్ల విసిరేవాడు. 2013లో కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. అదే సమయంలో.. 2023 సంవత్సరంలో చంద్రకాంత్ 90 రోజుల పాటు పెరోల్ పొందాడు. పెరోల్ ముగిసిన తర్వాత కూడా చంద్రకాంత్ తిరిగి రాకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గత కొన్ని నెలలుగా పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు. అయినప్పటికీ, ఎటువంటి క్లూ దొరకలేదు.

నన్ను చంపాలని ప్లాన్ చేశారు:
బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా సంచలన కామెంట్స్ చేసింది. ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశాన్ని వదిలి భారత్‌కు వచ్చే ముందు తనని, తన చెల్లెలు షేక్‌ రెహానాను హత్య చేసేందుకు అనేక కుట్రలు చేశారని తెలిపారు. గతేడాది ఆగస్టు నెలలో ఉద్యోగ రిజర్వేషన్ల చిచ్చుతో చెలరేగిన అల్లర్లలో బంగ్లాదేశ్‌ ప్రభుత్వం పడిపోయింది. ప్రధానికి షేక్‌ హసీనా రాజీనామా చేశారు. అవమానకర రీతిలో తన సోదరితో కలిసి దేశాన్ని విడిచి పెట్టిన ఘటనను తాజాగా షేక్‌ హసీనా గుర్తు చేసుకున్నారు.

డివోర్స్ తీసుకుంటున్నారన్న ప్రచారానికి ముగింపు :
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్ ఒబామా ప్రపంచంలోనే చాలా మందికి ఆదర్శ జంటగా కనిపిస్తుంటారు. ఆ జంటను చూసిన తర్వాత అందరికీ కనుల పండువలా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ జంట గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా మధ్య బాగాలేదనే వార్త చక్కర్లు కొడుతోంది. బరాక్, మిచెల్ విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ బరాక్ ఒబామా ఈ పుకార్లన్నింటికీ ముగింపు పలికారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలను పుకారు అని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కొట్టేశారు. ఒక పోస్ట్ ద్వారా ఒబామా మిచెల్ తో తనకున్న సంబంధం చాలా బలంగా ఉందని చూపించారు.

డొనాల్డ్ ట్రంప్ సుంకాల దెబ్బ తప్పదు:
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కెనడాపై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తానని డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ రియాక్ట్ అయ్యారు. యూఎస్ టారీఫ్ లు పెంచితే అమెరికన్లకు కూడా ట్రంప్‌ పన్నుల దెబ్బ తప్పదంటూ ఆమె వార్నింగ్ ఇచ్చారు. అయితే, యూఎస్- కెనడా దేశాల మధ్య దశాబ్దాల కాలంలో ఇదే అతి పెద్ద వాణిజ్య వార్ అని వెల్లడించింది. కాగా, ఏ వాణిజ్యంలోనైనా కఠినమైన రియాక్షన్ తప్పకుండా ఉంటుందన్నారు. డొనాల్డ్ ట్రంప్ తన హెచ్చరికలు అమలు చేస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలను ఎదుర్కొనేందుకు కెనడా రెడీగా ఉందని తెలిపారు. ఆ చర్యతో తమ కస్టమర్లు, కెనడా ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని మెలానీ జోలీ పేర్కొన్నారు.

‘మా’లో మాధవీలత కంప్లైంట్:
జేసి ప్రభాకర్ రెడ్డిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కంప్లైంట్ చేసింది నటి మాధవీలత. కొద్దిరోజుల క్రితం జరిగిన నూతన సంవత్సర వేడుకల గురించి ముందు మాధవీలత కామెంట్ చేయగా దానికి ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మాధవి లతా ప్రాస్టిట్యూట్ అంటూ కామెంట్స్ చేశారు. తాజాగా ఈ కామెంట్స్ గురించి మాకి ఫిర్యాదు చేసి ట్రెజరర్ శివ బాలాజీకి ఫిర్యాదు పత్రం అందజేసింది మాధవి లత. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ ఈ అంశం మీద మానవ హక్కుల సంఘానికి, పోలీస్ లకు ఫిర్యాదు చేశాను. జేసీ ప్రభాకర్ రెడ్డి నా మీద చాలా దారుణంగా మాట్లాడారు. నా మీద వచ్చిన వ్యాఖ్యలను ఇండస్ట్రీ ఖండించలేదు, అందుకే ‘మా’కు ఫిర్యాదు చేశాను. మా ట్రెజరర్ శివబాలాజీకి కాల్ చేస్తే వెంటనే స్పందించారు, నా ఫిర్యాదును మంచు విష్ణు దృష్టికి కూడా తీసుకెళ్లారు అని ఆమె అన్నారు.

విష్ణుకి మనోజ్ ఛాలెంజ్:
మంచు బ్రదర్స్‌ మధ్య ట్వీట్స్‌ వార్‌ మొదలైంది. మొన్నటి వరకు మీడియా ముఖంగా కొట్టుకున్న ఈ అన్నదమ్ములు ఇప్పుడు ట్విట్టర్ యుద్ధం మొదలు పెట్టారు. ముందుగాతాను నటించిన రౌడీ చిత్రంలోని ఓ డైలాగ్‌ ఆడియోను ట్వీట్‌లో షేర్‌ చేసిన మంచు విష్ణు, తన ఫేవరేట్‌ డైలాగ్స్‌లో ఇది ఒకటని చెప్పారు. “‘సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది..కానీ వీధిలో మొరగటానికి.. అడవిలో గర్జించటానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ’ అనే డైలాగ్‌ షేర్ చేశారు. తరువాత అదే డైలాగుల్లో ఫ్రాడ్ కుక్క అంటూ మనోజ్ కూడా వాడారు. ఇక పేరు ప్రస్తావించకుండా తాజాగా విష్ణు పై ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు మనోజ్. రండి ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం, నేను ఒక్కడినే వస్తాను ఏ ప్లేస్ కైనా వస్తాను అని పేర్కొన్నాడు. ఎవర్నో అడ్డం పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, నాన్నని, మహిళలను , సిబ్బందిని అడ్డం పెట్టుకొని మాట్లాడవలసిన అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. మన వద్ద ఉన్న సమస్యని ఒక పరిష్కారం తీసుకొని వద్దాం, ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చలు జరుపుకుందాం అంటూ చెప్పుకొచ్చాడు. మరి దీనిపై విష్ణు ఇంకా స్పందించలేదు. నిన్న బెంగళూరులో కన్నప్ప ప్రెస్ మీట్ పెట్టగ ఈరోజు చెన్నైలో పెడుతున్నాడు విష్ణు.

రంజీ మ్యాచ్‌లకు కోహ్లీ:
జనవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి రంజీ ట్రోఫీ గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌లు.. తమ స్క్వాడ్‌లో ఇప్పటికే రిషభ్ పంత్‌తో పాటు విరాట్ కోహ్లీకి అవకాశం కల్పిస్తూ ఢిల్లీ క్రికెట్ సంఘం జాబితాను విడుదల చేసింది. కానీ, మెడ నొప్పితో కోహ్లీ రంజీ మ్యాచ్‌ ఆడలేనని బీసీసీఐకి సమాచారం ఇచ్చినట్లు కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఆసీస్‌ టూర్ లో చివరి టెస్టులోనే మెడ పట్టేసిందని.. దానికి ఇంజెక్షన్లు కూడా వాడుతున్నట్లు పేర్కొన్నారు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో గాయం నుంచి కోలుకోవడానికి తగినంత సమయం ఇచ్చే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు టాక్. కెప్టెన్ రోహిత్ శర్మ ఆడటంపై ఈరోజు క్లారిటి వచ్చే ఛాన్స్ ఉంది.

మ్యాచ్‌ను తిలకించిన మెగాస్టార్:
యూఏఈలో జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో మెగాస్టార్ చిరంజీవి తళుక్కున మెరిశారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ డైరెక్టర్ ముబాషిర్ ఉస్మాని, జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంథితో కలిసి షార్జా స్టేడియంలో నిన్న (జనవరి 17) దుబాయ్ కేపిటల్స్, షార్జా వారియర్జ్ మధ్య జరిగిన మ్యాచ్‌ను ఆయన వీక్షించారు. ఇంటర్నేషనల్ లీగ్ టీ20కు సంబంధించిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఇక, ఈ వీడియోను చూసి మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.