NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

కేంద్ర ప్రభుత్వం ఏపీలో రూ. 60 వేల కోట్లతో రోడ్ల నిర్మాణం..
ప్రధాని మోడీ ఆధ్వర్యంలో భారత దేశం ఈ పది సంవత్సరాలలో ఆర్థిక శక్తిగా ఎదిగిందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ప్రధాని స్థానంలో మోడీ ఉంటేనే ప్రపంచంలో తగిన స్థానంలోకి భారత దేశం వస్తుంది.. మోడీ ఆధ్వర్యంలో ఆర్థిక శక్తిగా మూడో స్థానంలోకి భారత్ వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో 60 వేల కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టిందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం పేదలకి ఇళ్ల నిర్మాణం, మరుగు దొడ్లు నిర్మాణం చేపట్టారు అని ఆమె గుర్తు చేశారు. బీజేపీ సిద్ధాంతం ఒకటే.. ముందు దేశం ఆ తర్వాత పార్టీ ఆ తరువాతే వ్యక్తి.. అందుకే రాష్ట్ర అధ్యక్షురాలు పదవిలో నేను ఉన్నా.. లేకపోయినా దేశం కోసం బీజేపీ కోసం మనందరం కలిసి కట్టుగా పని చేయాలి అని పురందేశ్వరి పిలుపునిచ్చింది.

తెలంగాణలో రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నాడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఓడిపోయే పరిస్థతి ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అందుకే అధికారుల్ని కేడర్ ని నమ్మించటానికి విశాఖలో హడావిడి అని చెప్తున్నారు.. నేను విశాఖలోని హోటల్స్ కు ఫోన్ చేశాను ఎక్కడ గదులు బుక్ కాలేదు.. కౌంటింగ్ సందర్భంగా రెచ్చగొట్టే మాటల్లో కూడా ఓడిపోతారని విషయం తెలుస్తోంది.. డీఐజీ ఇంటెలిజెన్స్ గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావు మంచి అధికారి అని ఆయన పేర్కొన్నారు. కానీ, రాజకీయ కక్షతో జగన్మోహన్ రెడ్డి వచ్చిన మరుసటి రోజు నుంచి ఆయనను డ్యూటీలోకి తీసుకోలేదన్నారు. ఈ ఐదు సంవత్సరాలు వెంకటేశ్వరరావు పైన సీఎం జగన్ కక్ష తీర్చుకున్నాడు అని సీపీఐ నారాయణ తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి పాజిటివ్ ఆలోచనతో ఉంటే రాష్ట్రం అభివృద్ధి అయ్యేది.. ఆయన మరోసారి సీఎం అయ్యేవాడు అని పేర్కొన్నారు. అలాగే, తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నాడు.. రాజకీయ విభేదాలు ఉండొచ్చు కానీ కక్షలు ఉండకూడదన్నారు. కేసీఆర్ చేసిన ప్రతిదాన్ని రివర్స్ చేస్తే రేవంత్ రెడ్డి ఆయన నెత్తిన ఆయనే చెత్త వేసుకున్నట్టు అవుతుంది.. తెలంగాణ గేయాన్ని కొత్తగా రూపొందించడానికి అభినందిస్తున్నామని నారాయణ వెల్లడించారు.

రిటైర్మెంట్కు ఒక్కరోజు ముందే ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత..
ఆంధ్రప్రదేశ్ లో గత టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా పని చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ఏపీ హైకోర్టు తెలిపింది. అయితే, ఏబీని రెండోసారి సస్పెండ్ చేయడం చెల్లదంటూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ క్యాట్ ఉత్తర్వుల్ని ఉన్నత న్యాయస్థానం సమర్దించింది. రెండోసారి వెంకటేశ్వరరావుని సస్పెండ్ చేయడం చెల్లదని తీర్పు వెల్లడించింది. దీంతో రిటైర్మెంట్ కు ఒక్కరోజు ముందు ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట లభించింది. కాగా, గతంలో ఏబీపై విధించిన సస్పెన్షన్ ఎత్తేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో తనకు పెండింగ్ ఉన్న జీత భత్యాలు, పోస్టింగ్ కోసం ఏబీ ఎదురు చూస్తున్న టైంలోనే ఆయనపై రెండోసారి ఏపీ సర్కార్ సస్పెన్షన్ వేటు వేసింది. దీన్ని క్యాట్ తోసిపుచ్చింది. ఇప్పుడు క్యాట్ ఉత్తర్వుల్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా సమర్థించింది. దీంతో రేపు ( జూన్ 1) రిటైర్ అవుతున్న ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట దొరికింది. సస్పెన్షన్ ఎత్తివేత నేపథ్యంలో ఆయనకు యథావిధిగా రిటైర్మెంట్ ప్రయోజనాలు దొరకనున్నాయి. కాగా, ఏబీ వెంకటేశ్వరరావుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఏపీ ప్రింటింగ్, స్టేషనరీ డీజీగా ఏబీకి బాధ్యతలు అప్పగించింది. ఇవాళ సాయంత్రమే ఏబీ వెంకటేశ్వరరావు రిటైరవుతున్నారు.

తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబు..
తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబు అవుతుంది. అవతరణ ఏర్పాట్లను సీఎస్, డిజిపి, ఉన్నతాధికారులు పరిశీలించారు. జూన్ 2 ప్రభుత్వ కార్యక్రమానికి విశిష్ట అతిధి సోనియాగాంధీ రానున్నారు. సుమారు 20 నుంచి 25 వేల మంది కోసం పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు చేస్తున్నారు. 1860 మంది వీవీఐపీలు, 11 వేల మంది సామాన్య ప్రజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. జూన్ 2న ఉదయం 9.30 గంటలకు గన్‌పార్క్‌లోని అమర వీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధనలో మరణించిన వారికి ముఖ్యమంత్రి నివాళులర్పిస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. పోలీసు బలగాల కవాతు, మార్చ్ ఫాస్ట్, గౌరవ వందనం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత సోనియా గాంధీ ప్రసంగం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుంది. పోలీసు సిబ్బందికి, ఉత్తమ సిబ్బందికి అవార్డులు అందజేస్తారు. అవార్డు గ్రహీతలతో ఫోటో సెషన్ తర్వాత కార్యక్రమం ముగుస్తుంది. జూన్ 2వ తేదీ సాయంత్రం ట్యాంక్ బండ్ పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ట్యాంక్ బండ్ పై తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు.

కుళ్లిన మాంసాన్ని మసాలాతో కవర్ చేస్తున్నారు.. తినే ముందు జర జాగ్రత్త
వరంగల్ నగరం లోని స్టార్ హోటల్ లో లొట్టలు వేసుకుంటూ తింటున్నారా.. మీరు తినే తిండి కుళ్లిపోయిందేమో ఒక్క సారి చూసుకోండి. అవును మీరు విన్నది నిజమే. హనుమకొండ నగరంలో పేరు ఉన్న స్టార్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన తనిఖీల్లో బయటపడ్డ నిజం ఇది. హనుమకొండ పట్టణంలోని అశోక.. శ్రేయ.. అరణ్య.. హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. కాగా.. పలు హోటళ్లు, రెస్టారెంట్లను తనిఖీ చేయగా, చూస్తేనే వాంతులొచ్చే పరిస్థితులు కనిపించాయి. కుళ్లిపోయిన మాంసం, ప్రమాదకరమైన రంగులు కలిప, నాన్ వెజ్ పరిశుభ్రత లేని కిచెన్ వారి తనిఖీల్లో బయటపడింది. దీంతో స్టార్ హోటల్ పై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. హనుమకొండలోని అరణ్య, జంగిల్‌ థీమ్‌ రెస్టారెంట్‌లో తనిఖీలు చేయగా, ఆహార భద్రత ప్రమాణాల ప్రకారం రిఫ్రిజిరేటర్‌ను సరైన ఉష్ణోగ్రతలో ఉంచలేదని, చికెన్‌, మటన్‌లను ఫుడ్‌ గ్రేడ్‌ కాని ప్లాస్టిక్‌ కవర్లలో భద్రపరిచినట్లు గుర్తించారు. ఇది కాకుండా, హానికరమైన రసాయనాలు కలిపిన చీజ్, తుప్పు పట్టిన వంట పాత్రలు మరియు బూజుపట్టిన కూరగాయలు కనిపించాయి. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు అరణ్య జంగిల్ రెస్టారెంట్ యజమానుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు రెస్టారెంట్‌లో నిల్వ ఉంచిన 26 కిలోల చికెన్‌ వెరైటీలను విసిరేసి, ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా చట్టం కింద సంబంధిత యజమానికి నోటీసులు కూడా జారీ చేశారు. బస్టాండ్ సమీపంలోని శ్రేయ హోటల్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది.

తాగునీటి కోసం ఆప్ ప్రభుత్వం పిటిషన్.. ఏం కోరిందంటే..!
తాగునీటి కోసం ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. గత కొద్ది రోజులుగా తాగునీటి సమస్యతో దేశ రాజధాని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసినా నీళ్లు సరిపోవడం లేదు. దీంతో దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆప్ ప్రభుత్వ ఆశ్రయించింది. హర్యానా, యూపీ, హిమాచల్ ప్రదేశ్ నుంచి నీటి సరఫరా అయ్యేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరింది. ఒక వైపు దేశ రాజధానిలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు నీటి కష్టాలు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడిమిని తట్టుకోలేక విలవిలలాడుతున్నారు. ఇటీవల 52 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదైంది. దేశ రాజధానిలో తీవ్ర నీటి కొరత ఉన్న నేపథ్యంలో హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌ల నుంచి ఒక నెల పాటు అదనపు నీటి సరఫరా చేయాలని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఢిల్లీలోని చాణక్యపురి సంజయ్ క్యాంప్ ప్రాంతం, గీతా కాలనీ ప్రాంతంతో సహా పలు ప్రాంతాలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ట్యాంకర్లు వచ్చినా నీళ్లు లభించక ఇబ్బందులు పడుతున్నారు.

విదేశాల నుంచి టన్నుల కొద్ది బంగారం వెనక్కి తీసుకురానున్న ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇంగ్లాండ్ నుండి 100 టన్నుల బంగారాన్ని వెనక్కి తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ బంగారాన్ని ఇంగ్లండ్‌లో కాకుండా భారతదేశంలో ఉంచారు. రాబోయే కొద్ది రోజుల్లో మరింత బంగారం భారతదేశానికి తిరిగి రాబోతోంది. ఇప్పుడు ఈ బంగారాన్ని ఆర్‌బీఐ వద్ద ఉంచారు. రిజర్వ్ బ్యాంక్ వద్ద ప్రస్తుతం 822 టన్నుల బంగారం ఉంది. ఇందులో 100.3 టన్నుల బంగారాన్ని భారత్‌లో ఉంచగా, 413.8 టన్నుల బంగారం ఇప్పటికీ విదేశాల్లోనే ఉంది. ఇది కాకుండా, నోట్ల జారీ కోసం భారతదేశంలో 308 టన్నుల బంగారాన్ని ఉంచారు. గత కొన్నేళ్లుగా విదేశాల్లో భారతీయుల బంగారం నిల్వలు పెరుగుతుండడంతో రిజర్వ్ బ్యాంక్ దానిని తిరిగి దేశానికి తీసుకురావాలని నిర్ణయించింది. భవిష్యత్తులో రిజర్వ్ బ్యాంక్ విదేశాల నుంచి మరిన్ని బంగారాన్ని తీసుకొచ్చి దేశంలోనే ఉంచుతుంది. రిజర్వ్ బ్యాంక్ మళ్లీ 100 టన్నుల బంగారాన్ని దేశానికి తీసుకురాగలదు. సాంప్రదాయకంగా, ప్రపంచంలోని చాలా దేశాలు తమ బంగారాన్ని లండన్‌లో ఉంచుతాయి. మన దేశంలో ఇప్పటి వరకు బంగారాన్ని లండన్ లో ఉంచుకునేది. కానీ ఇప్పుడు దాని బంగారాన్ని పెద్ద మొత్తంలో దేశంలోనే ఉంచాలని నిర్ణయించుకుంది. రిజర్వ్ బ్యాంక్ విదేశాల నుంచి బంగారాన్ని తీసుకువస్తూనే, నిరంతరం కొత్త బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 34.3 టన్నుల కొత్త బంగారాన్ని, 2023-24లో 27.7 టన్నుల కొత్త బంగారాన్ని కొనుగోలు చేసింది. భారతదేశం నిరంతరం బంగారం కొనుగోలు చేయడం దాని ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని.. దాని ఆర్థిక భద్రతా నిర్వహణను బలోపేతం చేస్తుందని చూపిస్తుంది. ప్రపంచంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్న అతి కొద్ది బ్యాంకుల్లో రిజర్వ్ బ్యాంక్ కూడా ఒకటి.

మిస్‌ యూ నాన్న.. మహేశ్‌బాబు ఎమోషనల్ పోస్ట్!
నేడు తెలుగు చిత్ర పరిశ్రమలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న ‘సూపర్‌ స్టార్‌’ కృష్ణ 81వ జయంతి. ఈ సందర్భంగా తన తండ్రిని గుర్తు చేసుకుని స్టార్ హీరో మహేశ్‌ బాబు భావోద్వేగానికి గురయ్యారు. హ్యపీ బర్త్‌డే నాన్నా, నిన్ను ఎంతగానో మిస్‌ అవుతున్నా అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. మిమ్మల్ని ఎంతగానో మిస్‌ అవుతున్నా. నా ప్రతి జ్ఞాపకంలో ఎప్పటికీ ఉంటావు’ అని మహేష్ పేర్కొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ 2022 నవంబర్ 15న మరణించారు. 79 ఏళ్ల వయసులో ఆయనకు గుండెపోటు వచ్చింది. ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతులకు 1943 మే 31న కృష్ణ జన్మించారు. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివ రామ కృష్ణ మూర్తి. ఐదు దశాబ్దాల కెరీర్‌లో 350కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. అభిమానుల మనసుల్లో ‘సూపర్ స్టార్’గా చెరగని ముద్ర వేశారు. కృష్ణ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈ సంక్రాంతికి మహేష్ బాబు ‘గుంటూరు కారం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటించారు. సూపర్ హిట్ కొట్టిన ఈ యాక్షన్ మూవీ.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యారు. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో ఈ కథ సాగనుంది.