NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

టెట్ అప్లికేషన్స్ కు ముగిసిన గడువు..

తెలంగాణ రాష్ట్రం లో ఆగష్టు నెల 1వ తేదీన టెట్ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆగష్టు 2వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. రాష్ట్రం లో సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు జరగనున్నాయి. డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు పేపర్-1 పరీక్షను రాసుకునేందుకు అవకాశం కల్పించారు.గతంలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు డీఈడీ అభ్యర్థులకు మాత్రమే పోటీ పడే అవకాశం ఉండేది.కానీ 2018 న బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు పేపర్-2తో పాటు పేపర్-1కు కూడా రాసుకునే అవకాశం ఎన్సిటీఈ కల్పించింది.అయితే రాష్ట్రంలో 1.5 లక్షల మంది డిఈడి పూర్తి చేసినవారు అలాగే 4.5 లక్షల మంది బిఈడి పూర్తి చేసిన అభ్యర్థులు ఉన్నారు.గతంలో, టెట్ చెల్లుబాటు కేవలం 7 సంవత్సరాలు మాత్రమే ఉండేది.కానీ రెండేళ్ల క్రితం, టెట్ కాలవ్యవధిని జీవితకాలానికి పొడిగించారు.

నేడు విశాఖలో పవన్‌ కల్యాణ్‌ పర్యటన

జనసేన పార్టీ అధినే పవన్‌ కల్యాణ్‌ నేడు విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి విశాఖ దసపల్లా హోటల్‌లో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు పవన్‌ కల్యాణ్‌. ఈ కార్యక్రమంలో.. ఉత్తరాంధ్ర ప్రజలతో మాట్లాడనున్నారు పవన్‌ కల్యాణ్‌. అయితే.. నిన్న పవన్‌ కల్యాణ్‌ విశాఖపట్నం నుండి భీమిలి మార్గంలో ఎర్ర మట్టి దిబ్బలను, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. అధికార వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్రలో సహజ వనరులను యథేచ్ఛగా దోచుకోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన పవన్‌ కల్యాణ్.. ఆపకపోతే సహజ వనరులే ఉండవని అన్నారు.

ఇద్దరు సూపర్ స్టార్లకి శర్వానే విలన్?

జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన పని అయిపొయింది అనే కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికీ హిట్ సౌండ్ రీసౌండ్ వచ్చేలా వినిపించాడు రజినీ. 500 కోట్లు రాబట్టిన జైలర్ సినిమా కోలీవుడ్ కి ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ అవ్వడానికి రెడీగా ఉంది. దాదాపు దశాబ్దం తర్వాత సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన రజినీకాంత్, ఈసారి ఎక్స్పరిమెంట్ చేయడానికి సిద్ధమయ్యాడు. తన నెక్స్ట్ సినిమాని జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ తో చేయబోతున్నాడు రజినీ. ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ సినిమా ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటూ ఉంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తుండడం విశేషం. ఇండియన్ సూపర్ స్టార్స్ అయిన అమితాబ్-రజినీకాంత్ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు అంటే ఆ మూవీ రేంజ్ ఎలా ఉండబోతుందో ఊహించొచ్చు. అయితే జ్ఞానవేల్ కాబట్టి రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమా కాకుండా కొత్త కథా కథనాలతో ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉంది.

అప్పుల్లో వొడాఫోన్ ఐడియా.. చెల్లిస్తాం టైం ఇవ్వమన్న కంపెనీ

అప్పుల ఊబిలో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా స్పెక్ట్రమ్ వేలం విడతగా సుమారు రూ.1,680 కోట్లు చెల్లించేందుకు మరో 30 రోజుల గడువు కోరినట్లు వొడాఫోన్ ఐడియా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వోడాఫోన్ ఐడియా ఈ మొత్తాన్ని ఆగస్టు 17 గురువారం నాటికి చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తాన్ని వడ్డీతో సహా టెలికాం శాఖకు (DoT) తిరిగి చెల్లించాలని కంపెనీ ప్రతిపాదించింది. వోడాఫోన్ ఐడియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మూర్తి గ్వాస్ మాట్లాడుతూ.. 2022 వేలం కోసం స్పెక్ట్రమ్ వేలం వాయిదా రూ. 1,680 కోట్లను చెల్లించేందుకు ఈ 17తో గడువు ముగుస్తుంది. కానీ సంస్థలో తలెత్తిన ఆర్థిక సమస్యల కారణంగా వడ్డీతో సహా 30 రోజుల్లోపు చెల్లించేందుకు NIA నిబంధనల ప్రకారం చెల్లిస్తామని DoTకి ఒక లేఖను సమర్పించామన్నారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖేష్ అంబానీ కొడుకు.. దేశ ప్రజలకు శుభవార్త

ఆకాష్ అంబానీ, ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ భారతదేశంలో 5G స్పెక్ట్రమ్‌ను రూ. 88,078 కోట్లకు ధృవీకరించింది. గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దీన్ని ప్రకటించారు. 5జీ స్పెక్ట్రమ్ కోసం రెండో విడతగా రూ.7864 కోట్లను టెలికాం శాఖకు చెల్లించాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే అంతకంటే ముందే ఆకాష్ అంబానీ ఓ శుభవార్త అందించారు. దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో 22 లైసెన్స్‌డ్ సర్వీస్ ఆసియా (ఎల్‌ఎస్‌ఎ)లో 5 జి నెట్‌వర్క్‌ను ప్రారంభించడాన్ని పూర్తి చేసినట్లు ప్రకటించింది. గత సంవత్సరం కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్ కోసం కంపెనీ అన్ని స్పెక్ట్రమ్ బ్యాండ్‌లలో షెడ్యూల్ కంటే ముందే ఈ లాంచ్‌ను పూర్తి చేసింది.

Jio 700MHz, 800MHz, 1800MHz, 3300MHz, 26GHz బ్యాండ్‌లలో స్పెక్ట్రమ్‌తో అతిపెద్ద స్పెక్ట్రమ్ పరిధిని కలిగి ఉంది. దీనితో పాటు జియో కంపెనీకి చెందిన 5G నెట్‌వర్క్ చాలా వేగంగా ఉంది. Jio తన ప్రతి 22 సర్కిల్‌లలో మిల్లీమీటర్ వేవ్ బ్యాండ్ (26 GHz)లో 1,000 MHzని కలిగి ఉంది. ఇది అధిక నాణ్యతగల స్ట్రీమింగ్‌ను అందిస్తోంది. రిలయన్స్ జియో తన ప్రారంభానికి సంబంధించిన అన్ని వివరాలను గత నెలలో టెలికాం డిపార్ట్‌మెంట్ (DoT)కి సమర్పించింది. ఆగస్టు 11 నాటికి అన్ని సర్కిళ్లలో తన టెస్టింగ్ పనులను కూడా పూర్తి చేసింది.

యుద్ధనౌకల ప్రాజెక్ట్ కు కేంద్రం ఆమోదం.. రూ. 20 వేల కోట్లు కేటాయింపు

భారత ప్రభుత్వం రక్షణ రంగానికి ఎక్కువగా నిధులు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించగా.. ఇప్పుడు యుద్ధ నౌకలను దేశంలోనే తయారు చేయాలని నిర్ణయించింది. యుద్ధనౌకల తయారీ ప్రాజెక్టకు కేంద్రం ఆమోదం తెలిపింది. భారత నావికాదళానికి ప్రోత్సాహంగా నౌకల్లో ఇంధనం, ఆహారం, మందుగుండు సామగ్రిని నింపడానికి సహాయపడే ఐదు ఫ్లీట్ సపోర్ట్ నౌకలను నిర్మించే ప్రాజెక్టుకు కేంద్రం బుధవారం అనుమతి ఇచ్చింది. ఈ ఐదు నౌకలను రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించే నౌకలు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆత్మనిర్భరత లేదా భారత నౌకాదళ స్వావలంబన లక్ష్యాలను పెంచుతాయ‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. నౌకాదళ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఉద్దేశించిన రూ.20,000 కోట్ల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

పోర్టులు, హార్బర్లపై సీఎం జగన్ సమీక్ష

ముఖ్యమంత్రి జగన్ నేడు పోర్టులు, హార్బర్లపై సమీక్ష చేయనున్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్ల పనుల పురోగతిపై సీఎం సమీక్ష చేయనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం ప్రారంభంకానుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌.. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. విద్యాసంస్థలో మెరుగైన ప్రమాణాలను పాటించడంతో పాటు అద్భుతమైన ఫలితాలు సాధించే దిశగా కృషి చేయాలని , అందుకోసం ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్సీని విస్తృతస్థాయిలో వినియోగించుకోవాలని సీఎం జగన్.. విద్యాశాఖ ఆదేశించారు. ఆర్బీకేలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న అవసరాలకు అనుగుణంగా డీసీఎంఎస్‌ పనులు, కార్యక్రమాల పై అధ్యయనం జరగాలని అధికారులకు తెలిపారు.

జమ్ము రాజౌరీలో భూకంపం

జమ్ముకశ్మీర్‌లో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఇప్పటికే మూడుసార్లు జమ్ము కశ్మీర్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పలుసార్లు భూమి కంపించింది. ఈ సారి జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీలో భూకంపం సంభవించింది. రాజౌరీలో స్వల్ప భూకంపం సంభవించినట్టు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ(ఎన్‌సీఎస్‌) అధికారులు తెలిపారు. రాజౌరీ భూకంపం.. 3.6 తీవ్రతగా నమోదయింది. గురువారం తెల్లవారుజామున 3.49 గంటలకు రాజౌరీలో భూమి కంపించిందని అధికారులు తెలిపారు. ఈ రోజు తెల్లవారుజామున 3.49 గంటలకు రాజౌరీలో భూమి కంపించగా.. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 3.6గా నమోదైనట్టు ఎన్‌సీఎస్‌ ప్రకటించింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. అర్ధరాత్రి వేల భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆ సమయంలో మెలకువతో ఉన్న వారు కొందరు ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా అందలేదని అధికారులు తెలిపారు.

హిమాచల్-ఉత్తరాఖండ్‌లో వర్ష విధ్వంసం.. 81 మంది మృతి

ఉత్తరాఖండ్‌ నుంచి హిమాచల్‌ ప్రదేశ్‌ వరకు పర్వతాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలు తెరపైకి వస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 81 మంది చనిపోయారు. కాగా, చాలా చోట్ల ఇళ్లు కూలిపోవడంతో క్షతగాత్రులను రక్షించేందుకు, శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఆగస్టు 17న కొండ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా పంజాబ్‌ రాష్ట్రం వరదల్లో చిక్కుకుంది.

హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాల కారణంగా గత మూడు రోజుల్లో కనీసం 71 మంది ప్రాణాలు కోల్పోగా, 13 మంది కనిపించకుండా పోయారు. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలోని సమ్మర్ హిల్ సమీపంలోని శివాలయం శిధిలాల నుండి మరో మహిళ మృతదేహాన్ని వెలికితీయడంతో ఇప్పటి వరకు వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన 57 మంది మృతదేహాలను ఇప్పటివరకు వెలికితీశారు. బుధవారం కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా కూలిపోయిన భవనాల శిథిలాల నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీయడంతో మృతుల సంఖ్య పెరిగిందని అధికారులు తెలిపారు.

చంద్రయాన్‌-3లో నేడు కీలక ఘట్టం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 ప్రయోగంతో చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్‌ను విజయవంతం చేసేందుకు శ్రీకారం చుట్టింది. చంద్రయాన్‌ 3 చివరి కక్ష్య తగ్గింపు ప్రక్రియను బుధవారం విజయవంతంగా పూర్తి చేసినట్టు ఇస్రో వెల్లడించింది. ప్రస్తుతం 153x 163 కి.మీ కక్ష్యలో స్పేస్‌క్రాఫ్ట్‌ తిరుగుతున్నది. అయితే నేడు ప్రయోగంలో ఎంతో కీలకమైన విక్రమ్ ల్యాండర్‌ మాడ్యూల్‌ విడిపోయే ప్రక్రియను చేపట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విక్రమ్ ల్యాండర్‌ మాడ్యూల్‌ వేరుకానున్నది. ల్యాండర్‌ మాడ్యూల్‌లో భాగమైన ల్యాండర్‌, రోవర్‌ ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి వేరుకానున్నాయి. ఈ మేరకు బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం ట్వీట్‌ చేసింది. ఈ మిషన్ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి GSLV మార్క్ 3 (LVM 3) భారీ-లిఫ్ట్ లాంచ్ వెహికల్ ద్వారా జూలై 14న ప్రభావవంతంగా ప్రారంభించబడింది. ఇది ఆగస్ట్ 23న చంద్రుని వెలుపలి భాగాన్ని తాకేందుకు సిద్ధంగా ఉంది. చంద్రునికి సంబంధించిన అన్ని విన్యాసాలు పూర్తి చేసిన తర్వాత, వ్యోమనౌక ఇప్పుడు విక్రమ్ ల్యాండర్‌ను ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి వేరు చేయడానికి సిద్ధం చేస్తుంది.

రాజ్‌భవన్‌కు ఏపీ బీజేపీ నేతలు.. గవర్నర్‌ను కలవనున్న పురంధేశ్వరి

నేడు రాజ్‌భవన్‌కు ఏపీ బీజేపీ నేతలు వెళ్లనున్నారు. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి కలవనున్నారు. కేంద్రం నుంచి వచ్చిన స్థానిక సంస్థల నిధులపై గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు బీజేపీనేలు ఫిర్యాదు చేయనున్నారు. ఇదిలా ఉంటే.. నిన్న మాజీ ప్రధాని వాజపేయి వర్ధంతి సందర్భంగా విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సుపరిపాలన అంటే అటల్‌ బిహారీ వాజపేయి గుర్తుకొస్తారని అన్నారు. అటల్ జీవితం దేశ సేవకు అంకితమయ్యారన్నారు. అటల్ జీవితం బీజేపీ కార్యకర్తకు దిక్సూచిలాంటిదని తెలిపారు.

పోఖ్రాన్ అణు పరీక్షలు చేసిన ధీరోధాత్తుడు అని కొనియాడారు. దేశం ఎదుర్కొన్న అతి పెద్ద బానిసత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. చాలా పిన్న వయస్సులోనే సామాజిక కార్యక్రమాలు చేపట్టారన్నారు. నేటి యువత అటల్ స్ఫూర్తితో పని చేయాలని పిలుపునిచ్చారు. అయితే.. స్థానిక సంస్థలకు కేంద్రం పంపించిన నిధులను రాష్ట్రప్రభుత్వం మళ్లించడాన్ని నిరసిస్తూ గురువారం విజయవాడలో నిర్వహించతలపెట్టిన రాష్ట్రస్థాయి నిరసన కార్యక్రమాన్ని బీజేపీ వాయిదా వేసుకుంది. గురువారం సాయంత్రం గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో భేటీ తర్వాత, నిరసన ఎప్పుడనేది పురంధేశ్వరి ప్రకటించనున్నారు.

గంగవరం పోర్టు వద్ద హై అలెర్ట్

గంగవరం పోర్టులో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ.36,000 ఇవ్వాలని, తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కార్మిక సంఘం నాయకులు పోర్టు ముట్టడికి పిలుపునివ్వడంతో నగరంలోని గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోర్టు వైపు ఎవరూ రాకుండా పోలీసులు భారీగా మోహరించారు. అదానీ పోర్టు పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఇప్పటికే పోర్టు ప్రధాన గేటు వద్దకు చేరుకున్నారు. గాజువాక సీఐతోపాటు పది మంది పోలీసులు, ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. పోర్టు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలో పోర్టు వద్దకు చేరుకున్న నిర్వాసితలు, కార్మికులు గంగవరం పోర్టు ముట్టడికి యత్నించారు. పోర్ట్‌ వద్దకు భారీగా చేరుకున్న కార్మికులు.. కంచె, బారికేడ్లను దాటుకుని ముందుకు వెళ్లేందుకు యత్నం చేశారు. ఈ క్రమంలో కార్మికులను నిలువరిచేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసులు, కార్మికులు, నిర్వాసితుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. కార్మికులు చేపట్టిన ‘పోర్టు బంద్‌’ ఉద్రిక్తతకు దారి తీసింది. కార్మికులు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. తొలగించిన పోర్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు కనీస వేతనం రూ.36వేలు చెల్లించాలనే డిమాండ్లతో కార్మిక సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. గురువారం ఉదయం పెద్ద ఎత్తున కార్మికులు, నిర్వాసితులు, కాలుష్య ప్రభావిత ప్రాంతాల ప్రజలు, అఖిలపక్ష నేతలు గంగవరం పోర్టు వద్దకు చేరుకున్నారు.

భర్తకు మరో యువతితో పెళ్లి చేసింది కానీ.. ట్విస్ట్ మామూలుగా ఇవ్వలేదుగా మేడం..

స్త్రీ ఏదైనా పంచుకోవడానికి ఇష్టపడుతుంది, తన భర్తను పంచుకోవడానికి ఇష్టపడదు. అంతెందుకు.. ఏ పరాయి స్త్రీ అయినా తన భర్త వైపు చూస్తే ఊరుకోదు. భర్త ఎవరితోనైనా క్లోజ్ గామాట్లాడినా తట్టుకోలేదు. అలాంటిది ఓ మహిళ… తనలో సభభాగమైన భర్తను ఎంతో ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసింది. అయితే లాస్ట్ లో ఓ ట్విస్ట్ కూడా ఉందండోయ్. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ లో చోటుచేసుకుంది. సింగాడి కుంట బస్తీకి చెందిన యువతి(20) నగరంలో హోం ట్యూటర్‌గా పనిచేస్తోంది. 2020లో యూసుఫ్‌గూడలోని ఓ డ్యాన్స్‌ అకాడమీలో శిక్షణ తీసుకోవడానికి వెళ్లినప్పుడు గాంధీ(23) అనే యువకుడిని కలిసింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరుపక్షాల పెద్దలను ఒప్పించి వారి అంగీకారంతో నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు. ఆ తర్వాత యువతి, గాంధీ కొద్దిరోజులు సహజీవనం చేశారు. అయితే అంతకు ముందు రోజా అనే అమ్మాయిని గాంధీ ప్రేమిస్తున్నాడని యువతి అనుమానించింది.