NTV Telugu Site icon

Top Headlines @1pm : టాప్ న్యూస్‌

Top Headlines

Top Headlines

సస్పెండ్ చేసినా.. సమస్యలను ప్రజా కోర్టులో ప్రస్తావిస్తూనే ఉంటా

రాష్ట్ర శాసనసభ నుంచి తనను సస్పెండ్ చేసినా తాను సమస్యలను ప్రజా కోర్టులో ప్రస్తావిస్తూనే ఉంటానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ కు నిరసనగా కార్యాలయంలో మాక్ అసెంబ్లీని నిర్వహించారు. నెల్లూరు రూరల్ లో ప్రజా సమస్యల పరిష్కారానికి నాలుగేళ్ల నుంచి పోరాడుతున్నా ఫలితం లేదన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ఇచ్చిన జీవోలకు దిక్కు లేకుండా పోయిందని ..ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో పనులన్నీ ఆగిపోయాయని అన్నారు.. సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తూనే ఉంటానని కోటంరెడ్డి స్పష్టం చేశారు. శాంతియుతంగా గాంధీగిరి తరహలో నిరసన తెలియజేస్తుంటే అడ్డుకున్నారని, అసెంబ్లీకి ప్లకార్డు పట్టుకెళ్తుంటే..పీకేశారని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యలు తెలియజేయడానికి నాకు మైక్ ఇవ్వలేదని, నన్ను తిట్టేందుకు 40 నిమిషాలు మంత్రులకు మైకు ఇచ్చారని ఆయన మండిపడ్డారు. నా పేపర్ సైతం దౌర్జన్యంగా లాక్కున్నారని, ఇదేంటని ప్రశ్నించిన నన్ను.. మార్షల్స్ తో బయటకు పంపి సస్పెండ్ చేశారన్నారు. నేను మాట్లాడాలి అనుకున్నది మాక్ అసెంబ్లీ ద్వారా తెలియజేస్తానని, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని సమస్యలను మాక్ అసెంబ్లీ ద్వారా స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆర్జి ఇస్తే పరిష్కరిస్తామని ఆర్ధిక మంత్రి చెప్పడం హాస్యాస్పదమని ఆయన విమర్శించారు. నా దగ్గర ముఖ్యమంత్రి ఇంపార్టెంట్ అని 2021లో సంతకాలు పెట్టిన అర్జీలు ఉన్నాయని, రెండు సంవత్సరాలు గడుస్తున్నా ముఖ్యమంత్రి సంతకాలు పెట్టిన ఫైల్స్ కి దిక్కులేదని ఆయన అన్నారు. ఇప్పుడు అర్జీలు ఇస్తే ఆరు నెలల్లో ఏమి చేస్తారని ఆయన అన్నారు. నా మీద పరుష పదజాలం వాడిన 5 మంది మంత్రుల పై సమాధానాలు చెప్పాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన జీవోకి.. టెండర్లు పిలిచినా.. నిధులకు అనుమతులు లేక పనులు ఆగిపోయాయన్నారు. ఓ శాసనసభ్యుడిగా ఇంతకంటే ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు. కాళ్లు నొప్పులతో నాలుగు గంటల పది నిమిషాలు అసెంబ్లీలో నిలుచున్నా మైక్ ఇవ్వలేదని, నా రూరల్ నియోజకవర్గ సమస్యల కోసం ఆర్జించా, రికివెస్ట్ చేసాను.. ఇక ఉద్యమం తప్పదన్నారు. రూరల్ సమస్యల పరిష్కారానికి శాసనసభ్యుడిగా నేను చేస్తున్న ప్రయత్నాన్ని గమనించాలన్నారు.

అసెంబ్లీ వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టి బుగ్గన.. కేటాయింపులు ఇలా..

ఏపీ బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాలు నేడు కొనసాగుతున్నాయి. అయితే.. నేడు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి 2023-24 సంవత్సరానికి చెందిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే.. మంత్రి బుగ్గన రాజేంద్రానాథ్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతండగా టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. అంతేకాకుండా బడ్జెట్‌ కాపీలను స్పీకర్‌ పోడియం వద్దకు వచ్చి విసిరేశారు. దీంతో 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌ ఒక్కరోజు సస్పెండ్‌ చేశారు. ఇదిలా ఉంటే.. బడ్జెట్‌లో ఈ విధంగా కేటాయింపులు జరిగాయి. 2023-24 వార్షిక బడ్జెట్ 2 లక్షల 79వేల 279.17 కోట్లు అందులో.. రెవెన్యూ వ్యయం – 2,28,540 కోట్లు, మూల ధన వ్యయం – 31,061 కోట్లు, రెవెన్యూ లోటు – 22,316 కోట్లు. ద్రవ్య లోటు – 54,587 కోట్లు. జీఎస్డీపీ లో రెవిన్యూ లోటు – 3.77 శాతం. ద్రవ్య లోటు – 1.54 శాతం. బడ్జెట్ వ్యవసాయం -11,589 కోట్లు కాగా.. పశు సంవర్ధక శాఖ – 1787 కోట్లు, బీసీ సంక్షేమం- 23,509 కోట్లు, పర్యావరణం – 685 కోట్లు, ఉన్నత విద్య – 2065 కోట్లు, ఇంధన శాఖ – 6546 కోట్లు, మాధ్యమిక విద్యా – 29, 691కోట్లు, అగ్రవర్ణ పేదల సంక్షేమం – 11,085 కోట్లు, సివిల్ సప్లై – 3725 కోట్లు. ఆర్ధిక శాఖ -72, 424 కోట్లు కాగా.. జీఏడీ -1,148 కోట్లు, గ్రామ, వార్డు సచివాలయాలు -3,858కోట్లు, వైద్య, ఆరోగ్య శాఖ – 15,882 కోట్లు, హోం శాఖ -8, 206 కోట్లు, హౌసింగ్ -6292 కోట్లు, ఇరిగేషన్ -11,908 కోట్లు, మౌలిక వసతులు, పెట్టుబడులు – 1295 కోట్లు. పరిశ్రమలు, వాణిజ్యం – 2602 కోట్లు. ఐటీ – 215 కోట్లు. కార్మిక శాఖ – 796 కోట్లు. న్యాయ శాఖ – 1058 కోట్లు. శాసన సభ సెక్రటేరియట్ – 111 కోట్లు. పట్టణాభివృద్ధి శాఖ – 9381 కోట్లు. మైనారిటీల సంక్షేమం -2240 కోట్లు. పబ్లిక్ ఎంటర్‌ ప్రైజెస్ -1.67 కోట్లు. ప్రణాళిక – 809 కోట్లు. పంచాయతీ రాజ్ శాఖ -15, 874కోట్లు. రెవెన్యూ – 5380 కోట్లు. రియల్ టైం గవర్నెస్ -73 కోట్లు. స్కిల్ డెవలప్మెంట్ -1167 కోట్లు. సాంఘిక సంక్షేమం – 14511 కోట్లు. ఆర్ అండ్ బి – 9119 కోట్లు. స్త్రీ శిశు సంక్షేమం – 3951 కోట్లు. యూత్, టూరిజం – 291 కోట్లు. డీబీటీ స్కీముల కోసం 54228.36 కోట్లు కేటాయింపు. పెన్షన్లు – 21434 కోట్లు. రైతు భరోసా – 4020కోట్లు. జగనన్న విద్యా దీవెన – 2842 కోట్లు. జగనన్న వసతి దీవెన -2200కోట్లు. వైఎస్సార్ పీఎమ్ బీమా యోజన – 700 కోట్లు. డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు -300 కోట్లు. రైతులకు వడ్డీ లేని రుణాలు – 500 కోట్లు. కాపు నేస్తం – 550 కోట్లు. జగనన్న చేదోడు – 350 కోట్లు, వాహన మిత్ర- 275 కోట్లు. నేతన్న నేస్తం -200 కోట్లు. మత్స్యకార భరోసా -125 కోట్లు. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడి 50 కోట్లు. రైతులకు నష్టపరిహారం – 20 కోట్లు. లా నేస్తం – 17 కోట్లు. జగనన్న తోడు -35 కోట్లు. ఈబీసీ నేస్తం – 610 కోట్లు. వైఎస్సార్ కళ్యాణ్ మస్తు -200 కోట్లు. వైఎస్సార్ ఆసరా – 6700కోట్లు, వైఎస్సార్ చేయూత -5000కోట్లు. అమ్మ ఒడి -6500 కోట్లు చొప్పున బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు.

క్రికెట్‌ అభిమానులకు ముఖేష్‌ అంబానీ కానుక?

క్రికెట్‌ అభిమానులకు ముఖేష్‌ అంబానీ గుడ్‌ న్యూస్‌ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఆయన ఉచితంగా ప్రసారం చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రపంచంలో అత్యధిక వ్యూవర్‌షిప్‌ కలిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌ల డిజిటల్‌ ప్రసార హక్కులను ఈసారి ముఖేష్‌ అంబానీ ఆధ్వర్యంలోని వయాకామ్‌18 మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ దక్కించున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ సంస్థ 2.7 బిలియన్‌ డాలర్లు చెల్లించింది.

తద్వారా ఈ పోటీలో వాల్ట్‌ డిస్నీ కంపెనీని మరియు సోనీ గ్రూప్‌ కార్పొరేషన్‌ను పక్కకు నెట్టేసింది. వయాకామ్‌18 మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనేది పారామౌంట్‌ గ్లోబల్‌ మరియు రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ల జాయింట్‌ వెంచర్‌. ఈ సంస్థ ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఫ్రీగా ప్రసారం చేయటం ద్వారా సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజలు వాటిని చూసేలా చేయనుంది. ఫలితంగా యాడ్స్‌ రూపంలో ఎక్కువ ఆదాయం పొందాలని భావిస్తోంది.

టాలీవుడ్ లో మరో విషాదం…

తనికెళ్ల భరణి దర్శకత్వంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం, లక్ష్మీ లాంటి నటులతో ‘మిథునం’ అనే మంచి సినిమాని ప్రొడ్యూస్ చేశాడు ‘మొయిద ఆనంద రావు’. ఎలాంటి కమర్షియల్ లెక్కలు వేసుకోకుండా మంచి సినిమాని తెలుగు ఆడియన్స్ కి ఇచ్చిన ఆనంద రావు కన్ను మూసారు. మధుమేహంతో చాలా కాలం నుండి బాధపడుతున్న ఆనంద రావు, గత కొన్ని రోజులుగా అస్వస్ధగా ఉండటం తో వైజాగ్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ వున్నారు. బుధవారం నాడు పరిస్థితి విషమించటంతో డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది, బుధవారం ఉదయం ఆనంద రావు ౫౭ ఏళ్ల వయసులో కన్ను మూసారు. ఆనందరావు కి భార్య పద్మిని, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వున్నారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం వావిలవలసలో జరగనున్నాయి.

షడ్రుచుల సమ్మేళంగా ‘రంగమార్తాండ’!

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తాజా చిత్రం ‘రంగమార్తాండ’ విడుదల తేదీ ఖరారైంది. షడ్రుచుల సమ్మేళనంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాను ఉగాది కానుకగా ఈ నెల 22న జనం ముందుకు తీసుకు రాబోతున్నారు. బుధవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘రంగమార్తాండ’కు క్లీన్ యు సర్టిఫికెట్ లభించిందని చిత్ర బృందం తెలిపింది. ప్రకాశ్‌ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక, అనసూయ, ఆదర్శ్ బాలకృష్ణ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు మూలం మరాఠీ చిత్రం ‘నటసమ్రాట్’. నానాపటేకర్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఆ సినిమాను మహేశ్ మంజ్రేకర్ తెరకెక్కించాడు. తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో దీన్ని కాలెపు మధు, వెంకటరెడ్డి నిర్మించారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చడంతో పాటు ఇందులోని కొన్ని గీతాలను ఆలపించారు. ఆకెళ్ళ శివప్రసాద్ సంభాషణలు సమకూర్చగా, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, లక్ష్మీ భూపాల, కాసర్ల శ్యామ్, భల్లా విజయ కుమార్ పాటలు రాశారు.

ఆస్కార్ కి రాంగ్ సినిమాలని పంపిస్తూ… అవార్డ్స్ రావట్లేదంటే ఎలా? : ఏఆర్ రెహమాన్

నాటు నాటు సాంగ్ ఇండియాకి ఆస్కార్ అవార్డ్ ని తీసుకోని వచ్చింది. భారతీయ ప్రజలంతా గర్వించాల్సిన విషయం ఇది. ఈ ఆనందాన్ని కొన్నేళ్ల క్రితమే ఒక భారతీయుడిగా మనందరికీ ఇచ్చిన వాడు ఏఆర్ రెహమాన్. ఇండియన్ ప్రొడక్షన్ కాదు కానీ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ‘స్లమ్ డాగ్ మిలియనేర్’ సినిమా ఒక సెన్సేషన్ అయ్యింది. ఈ మూవీకి గాను రెహమన్ రెండు ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకున్నాడు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ సౌండ్ కేటగిరిల్లో రెహమాన్ కి ఆస్కార్ అవార్డ్స్ లభించాయి. నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలవడంతో చాలా హ్యాపీగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన రెహమాన్ ఇటీవల సంగీత దిగ్గజం ఎల్ సుబ్రమణ్యంతో  ఒక ఇంటరాక్షన్‌ వీడియో చేశాడు. ఈ వీడియోలో రెహమాన్ ఆస్కార్ అవార్డ్స్ గురించి మాట్లాడుతూ… “భారతదేశం నుండి రాంగ్ సినిమాలు ఆస్కార్‌కు పంపబడుతున్నాయని, అందుకే అవార్డ్స్ గెలవడంలేదని” అన్నాడు.

చివరి నిమిషంలో ట్విస్ట్‌.. నేను రాలేనంటూ కవిత లేఖ

ఢిల్లీలోనే ఉన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందు హాజరవుతుంది అనే చివరి నిమిషంలో అందరూ షాక్ అయ్యేలా ఈడీకి కవిత లేఖ రాసింది. నేను రాను రాలేనంటూ ఈడీకి లేఖ రాసారు ఎమ్మెల్సీ కవిత. మార్చి 16వ తేదీ విచారణకు హాజరు కాలేదు. అనారోగ్య కారణాలతో హాజరుకాలేకపోతున్నానని.. మీరు అడిగిన ప్రశ్నలకు నా సమాధానం ఇదే అంటూ తన ప్రతినిధితో అధికారులకు లేఖ పంపారు. సుప్రీంకోర్టులో పిటీషన్ పెండింగ్ లో ఉందని.. కోర్టు నిర్ణయం తర్వాత హాజరుఅవుతానని లేఖలో పేర్కొన్నారు కవిత. కవిత రాలేనంటూ లేఖ రాయడంతో ఢిల్లీలో ఏంజరగుతుందో అని ఎదురుచూస్తున్న వారందరికీ మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. ఒక్కక్షణంలో కవిత ఈడీ ముందు హాజరు అవుతుందని నిర్ణయాలు తారుమారు కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సింహంపై హిప్పో దాడి.. బెదిరిపోయిన అడవి రాజు.. ఏం జరిగిందంటే..

అడివికి రాజు అంటే సింహం. తమ భూభాగం విషయంలో చాలా మొండిగా వ్యవహరిస్తాయి సింహాలు. తమ ప్రాణాలు వదిలేస్తాయి గానీ వేరే జంతువు ఆ చుట్టుప్రక్కల ఆక్రమిస్తే ఊరుకోవు. ఒక రాజులా కాపాడుకుంటాయి. అందుకే కేవలం ఆహారం కోసమే కాదు ఆక్రమించడానికి వచ్చినా చంపేస్తాయి. అందుకే సింహిం ‘అడవికి రాజు’ అనే బిరుదును పొందింది. అడవిలో సింహం గర్జిస్తే ఇతర జంతువులు భయంతో వణికిపోతాయి. సింహం వస్తుందంటే చాలు పారిపోతాయి. అలాంటి అడగి రాజు అయిన సింహాన్నే ఓ హిప్పోల గుంపు బెదరగొట్టింది. సింహంపై దాడి చేసి మరీ బెదరగొట్టింది.ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అయింది. వీడియోలో హిప్పోల గుంపు సింహంపై దాడి చేసి భయపెట్టడం కనిపిస్తుంది.

కేటీఆర్‌ కు రేవంత్‌ సవాల్‌.. ఆవిషయంలో ఎక్కడికైనా చర్చకు నేను రెడీ

మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్‌ విసిరారు. విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. టైం, డేట్ కేటీఆర్ ఖరారు చేయాలని, ప్రజల మధ్య తేల్చుకుందాం రేవంత్‌ అన్నారు. కేటీఆర్ ఎక్కడ చెబితే అక్కడ చర్చకు నేను రెడీ అంటూ ఛాలెంజ్‌ చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రాణహిత చేవెళ్ల ప్యాకేజ్ ను రేవంత్ రెడ్డి సందర్శించారు. అనంతరం కవితపై ఈడీ విచారణ బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాటకం అంటూ రేవంత్ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ బీజేపీ ది మిత్రభేదమంటూ మండిపడ్డారు. కవిత విషయంలో మీడియా హడావిడే ఎక్కువగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత ఈడీ విచారణ సాధారణ విషయమే అంటూ కొట్టిపారేశారు. విచారణను కవిత ఎదుర్కోవాలన్నారు. సోనియాను ఈడీ విచారణ సమయంలో కవిత, కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదంటూ ప్రశ్నించారు. వాటాల పంపకంలో తేడా వల్లే చిల్లర పంచాయతీ అంటూ సంచలన వ్యాఖ్యాలు చేశారు.