NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్ న్యూస్

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

షేక్ హసీనా, రెహానాలను అరెస్టు చేయండి.. భారత్‌కు బంగ్లాదేశ్ ఎస్‌సీబీఏ వినతి..!

బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా, ఆమె సోదరి షేక్ రెహానాలను అరెస్టు చేసి తమ దేశానికి పంపించాలని బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) అధ్యక్షుడు మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ భారత్‌ను కోరారు. ఎస్‌సీబీఏ ఆడిటోరియంలో తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. బంగ్లాలో హసీనా అనేక మరణాలకు బాధ్యురాలని ఆరోపణలు చేశారు. అలాంటి వారితో సానుకూల సంబంధాలు ఎలా కొనసాగిస్తారు.. భారత్ దేశ ప్రజలతో బంగ్లాదేశ్ సానుకూల సంబంధాలు కొనసాగించాలని అనుకుంటుంది.. కాబట్టి వెంటనే హసీనా, రెహనాలను తమకు అప్పగించాలని మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ కోరారు.

“మంగ‌ళ‌గిరితో ముడిప‌డిన బంధం నన్ను చేనేత కుటుంబ‌ స‌భ్యుడిని చేసింది”

మంగ‌ళ‌గిరితో ముడిప‌డిన బంధం న‌న్ను చేనేత కుటుంబ‌ స‌భ్యుడిని చేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్ర మంత్రి జాతీయ చేనేత దినోత్సవం సంద‌ర్భంగా చేనేత క‌ళాకారులు అంద‌రికీ హృద‌య‌పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చేనేత క‌ళాకారుల క‌ష్టాలు చూశానని..స‌మ‌స్యల‌పై పూర్తి అవ‌గాహ‌న వ‌చ్చిందన్నారు. యువ‌గ‌ళం పాద‌యాత్రలో చేనేత రంగం గురించి అవగాహన కలిగిందని గుర్తుచేశారు. చేనేత రంగం ల‌క్షలాది మంది జీవ‌నానికి ఉప‌యోగ‌ప‌డ‌ుతోందని తెలిపారు. మ‌న సంస్కృతి, సంప్రదాయాల‌ను ప‌రిర‌క్షించే ఓ క‌ళ చేనేత రంగమన్నారు.

నేడు పాదయాత్ర ప్రారంభించిన ఊరు పిప్పిరికి రానున్న డిప్యూటి సీఎం

నేడు ఆదిలాబాద్ జిల్లాకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రానున్నారు. పాదయాత్ర ప్రారంభించిన ఊరు పిప్పిరిలో డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఉద‌యం 11.30 గంట‌ల‌కు పిప్పిరి గ్రామానికి డిప్యూటి సీఎం భ‌ట్టి విక్రమార్క చేరుకోనున్నారు. అధికారుల‌తో జిల్లా అభివృద్ది పురోగ‌తి, అమ‌ల‌వుతున్న ప‌థ‌కాలు, సంక్షేమం గురించి సమీక్షిస్తారని, ఆ త‌రువాత ఎస్టీఎస్‌డిఎఫ్ రూ.15 కోట్ల‌తో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాప‌న చేస్తారన్నారు. రూ.2 కోట్ల‌తో వాంకిడి స‌బ్ స్టేష‌న్‌కు శంకుస్థాప‌న చేయనున్నారు. రూ.3.5 కోట్ల‌తో పిప్పిరి గ్రామాంలో అభివృద్ది కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న చేసిన ఆనంత‌రం ఏర్పాటు చేసిన స‌భ‌లో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతారు. స‌భ ముగిసిన త‌రువాత ఎస్సీ కార్పోరేష‌న్‌, ట్రైకార్‌, ఐటీడీఏల ద్వారా మంజూరైన బ్యాంకు లీంకేజీ చెక్కుల‌ను పంపిణీ చేస్తారు.

నేతన్నలకు అండగా టీడీపీ: చేనేత సంక్షేమ శాఖ మంత్రి

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులకు చేనేత సంక్షేమ శాఖ మంత్రి సవిత శుభాకాంక్షలు తెలిపారు. ఐదు సంవత్సరాలు జగన్ పాలనలో చేనేత కళాకారులు ఎన్నో బాధలు అనుభవించారన్నారు. చేనేత కళాకారుల కలలు మరుగున పడ్డాయని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేనేత కళాకారులకు ఎంతో అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడ స్టెల్లా కాలేజ్ నుంచి పంట కాలువ రోడ్డు వరకు వాక్ చేనేత కళాకారులు నిర్వహించారు. చేనేత కళాకారులతోపాటు వాక్ లో చేనేత శాఖ సంక్షేమ మంత్రి సవిత, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కమిషనర్ టెక్స్టైల్స్ రేఖా రాణి, ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీత పాల్గొన్నారు. యువత.. చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత వస్త్రాలను ధరించి వాక్ కు హాజరయ్యారు. చేనేత వస్త్రాలు ధరించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటూ నినాదాలు చేశారు.

వైసీపీకి మరో షాక్.. పార్టీకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు రాజీనామా

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి షాకిచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత కొద్ది రోజులుగా పార్టీ మార్పుపై వార్తలొస్తున్న నేపథ్యంలో నేడు రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ.. “వైసీపీ కి రాజీనామా చేస్తున్నాను. 25 ఏళ్ళు గా పిఠాపురం ప్రజానీకం తో మమేకం అయి ఉన్నాను. పిఠాపురం ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. నాకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవు. అనుచరులుతో చర్చించి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటాను. పిఠాపురం లోనే ఉంటాను. ప్రజలందరికీ అండగా ఉంటాను.” అని ఆయన వ్యాఖ్యానించారు.

వయనాడ్ బాధితులను కేంద్ర సర్కార్ అవమానిస్తుంది..!

వయనాడ్ విషాదానికి అక్రమ మైనింగ్, అనుమతి లేని మానవ నివాసాలే కారణమంటూ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ చేసిన కామెంట్స్ పై కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఘాటుగా స్పందించారు. భూపేందర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు వయనాడ్ బాధితులను అవమానించేలా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. కేరళలోని కొండ ప్రాంతాలపై కనీస అవగాహన ఉన్న ప్రజలెవరూ అక్కడ నివసిస్తు్న్న ప్రజలను అక్రమ వలసదారులుగా పేర్కొనరని సీఎం చెప్పుకొచ్చారు.

హైదరాబాద్‌లో యూట్యూబర్‌పై రౌడీషీటర్‌ దాడి

హైదరాబాద్ నగరంలో న్యూస్ ఛానల్ నడుపుతున్న యూట్యూబర్‌కు ఓ రౌడీ షీటర్ కత్తితో రక్తపు గాయం చేశాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి మైలార్‌దేవ్‌పల్లిలో చోటుచేసుకుంది. వట్టెపల్లికి చెందిన బాధితుడు ముబీన్ మీర్జా, మహమూదా హోటల్ సమీపంలో నిలబడి ఉండగా, రౌడీ షీటర్ సోహైల్ , అతని సహచరులు వచ్చి అకస్మాత్తుగా బాధితుడి ముఖంపై కత్తితో దాడి చేశారు. క్షతగాత్రుడిని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదైంది. ముబీన్ మీర్జా గత నెల రోజులుగా నగరంలో , ఇతర చోట్ల మతపరమైన స్థలాలను కూల్చివేయడానికి సంబంధించిన సమస్యలను లేవనెత్తారు.

హిందూవులే లక్ష్యంగా దాడులు..భారత్ కు కోటి మందికి పైగా హిందువులు!

బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. గత కొద్ది రోజుల నుంచి రిజర్వేషన్ల విధానికి వ్యతిరేకంగా విద్యార్థులు, ప్రభుత్వ వ్యతిరేకదారులు రోడ్డెక్కారు. ఈ నిరసనల్లో వందలాది మంది మృతి చెందారు. దీంతో హసీనా సర్కారు పడిపోయింది. ప్రస్తుతం ఇంకా అల్లర్లు కొనసాగుతున్నాయి. ఇందులో ఓ వర్గీయులు హిందువులను టార్గెట్ చేశారు. హిందువుల ఇళ్లకు నిప్పుపెట్టడం, వారిని చిత్ర హింసలకు గురి చేయడం జరుగుతోంది. తాజాగా ప్రముఖ జానపద గాయకుడు రాహుల్ ఆనంద్ ఇంట్లోకి దూరి దోచుకున్నారు. ఆయన ఇంటికి ఏకంగా నిప్పుపెట్టినట్లు వార్తలు వచ్చాయి.

చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది

చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పీపుల్స్‌ ప్లాజా వద్ద చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. చేనేత రంగం మన దేశపు పురాతన సంపద, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. చేనేత రంగంలో నిపుణులైన మన చేనేత కార్మికుల అంకితభావం, సృజనాత్మకత దేశానికి గర్వకారణమని అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం పొందే విధంగా, వారికి అవసరమైన అన్ని సహాయాలు అందించడంలో ముందుంటామని ఆయన వెల్లడించారు.

స్వదేశానికి చేరుకున్న మను బాకర్‌.. ఢిల్లీలో ఘన స్వాగతం! శనివారం మళ్లీ పారిస్‌కు

పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో రెండు పతకాలు సాధించిన భారత్ యువ షూటర్‌ మను బాకర్‌ స్వదేశం చేరుకున్నారు. దేశరాజధాని ఢిల్లీలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు ఢిల్లీ విమానాశ్రయం వద్ద డప్పుల మోతతో ఘన స్వాగతం పలికారు. భారత ఫాన్స్ పెద్ద ఎత్తున ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించారు. అనంతరం మను బాకర్‌ కారులో ర్యాలీగా బయలుదేరారు. తన మెడల్‌ను అభిమానులకు చూపిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. మను వెంట కోచ్ జస్పాల్ రాణా ఉన్నారు.

పారిస్‌ ఒలింపిక్స్‌లో మను బాకర్‌ రెండు పతకాలు గెలిచిన విషయం తెలిసిందే. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను కాంస్య పతకాన్ని సాధించి.. భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి కాంస్య పతకాన్ని గెలిచింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో పతకంను స్వల్ప తేడాతో కోల్పోయారు.