NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

మరో కొత్త తరహా ప్రయోగానికి ఇస్రో సిద్ధం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కొత్త తరహా ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి ఈ రోజు ఉదయం 6 గంటలకు తొలి ప్రైవేట్ రాకెట్ లాంచ్ ప్యాడ్ ద్వారా ప్రైవేట్ రాకెట్ ప్రయోగించనుంది. ఈ నేపథ్యంలోనే కౌంట్ డౌన్ కొనసాగుతోంది. చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన అగ్ని బాన్ రాకెట్ ప్రయోగించనున్నారు. ప్రయోగంలో సెమీ క్రయోజెనిక్ ఆధారిత ఇంజిన్ ను శాస్త్ర వేత్తలు ఉపయోగిస్తున్నారు. వంద కిలోల బరువైన ఉపగ్రహాన్ని లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి పంపనున్నారు శాస్త్రవేత్తలు. భవిష్యత్తులో చిన్న తరహా ఉపగ్రహాలను లో లోయర్ ఎర్త్ ఆర్బిట్ లో ప్రవేశ పెట్టడానికి దోహదం చేయనుంది ఈ ప్రయోగం. అయితే.. ప్రైవేట్ సంస్థలు రూపొందించిన రాకెట్ ను ప్రయోగించడం ఇది రెండో సారి. గతంలో స్కై రూట్ సంస్థ రూపొందించిన విక్రమ్-1 అనే ప్రైవేట్ రాకెట్ ప్రయోగించిన విషయం తెలిసిందే. అయితే.. ప్రయోగాన్ని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్..శాస్త్ర వేత్తలు పర్యవేక్షనున్నారు.

నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ రైతు దీక్షలు..

నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బీఆర్‌ఎస్‌ రైతుదీక్ష నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల నుండి బీఆర్‌ఎస్‌ రైతుదీక్షను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, పార్టీ శ్రేణులు పాల్గొని కష్టాల్లో ఉన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రైతు భద్రత పేరుతో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్‌ నిలబెట్టుకోలేదని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 4 నెలలు కావస్తున్నా హామీలను అమలు చేయకుండా రైతులను అవమానిస్తున్నదని, రైతుబంధు విడుదలలో జాప్యం, కరెంటు కోతలతో ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని తెలిపారు.

కార్యకర్తలకు మోడీ, అమిత్ షా, నడ్డా శుభాకాంక్షలు

భారతీయ జనతా పార్టీ తన 44వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శనివారం జరుపుకుంటోంది. 1980, ఏప్రిల్ 6న బీజేపీ పార్టీ స్థాపింపబడింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. గత పదేళ్లుగా దేశంలో కమలం పార్టీ అధికారంలో ఉంది. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు సన్నద్ధమవుతోంది. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కమలనాథులు ఈ వేడుకలను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. మరోవైపు బీజేపీ కార్యకర్తలకు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక కార్యకర్తలనుద్దేశించి ప్రధాని మోడీ శనివారం ప్రసంగించనున్నారు. ప్రతి సంవత్సరం, వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో వివిధ కార్యక్రమాలు, ప్రసంగాలు, పార్టీ ప్రయాణం, విజయాలు మరియు భవిష్యత్తు లక్ష్యాలపై చర్చిస్తుంటారు. ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ కార్యకర్తలకు ఏం సందేశం ఇస్తారో చూడాలి.

రాజమండ్రిలో బీజేపీ ఆఫీస్‌ను ప్రారంభించనున్న పురందేశ్వరి

రాజమండ్రిలో నేడు ఏపీ బీజేపీ చీఫ్‌ దగ్గుబాటి పురందేశ్వరి పర్యటించనున్నారు. బీజేపీ ఆఫీస్‌ను పురందేశ్వరి ప్రారంభించనున్నారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పురందేశ్వరి నేడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్డీయే కూటమి పార్లమెంటరీ సమావేశంలో పాల్గొననున్నారు పురందేశ్వరి. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని నిన్న దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మే 13తర్వాత రాష్ట్రంలో మార్పు మొదలు అవుతుందని, మార్పు కోరుకునే ప్రతి ఒక్కరూ ఎన్ డి ఏ కూటమికి మద్ధత్తు పలకాలన్నారు. దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగులను ఎన్నికల విధుల్లో తీసుకోవాలని ఎన్నికల కమిషన్ భావిస్తోందన్నారు. వచ్చేది వుత్తరాయనం పండుగలు సీజన్ కాబట్టి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఎన్నికల విధుల నుంచి ఎండోమెంట్ ఉద్యోగులకు వెసులుబాటు కల్పించాలన్నారు పురంధేశ్వరి. ఐదేళ్ల ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆమె వ్యాఖ్యానించారు.

పార్టీ ఫిరాయింపులు మీద తప్ప గ్యారంటీల మీద దృష్టి లేదు.. సీఎంపై కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఈ సీఎం కు పార్టీ ఫిరాయింపుల మీద దృష్టి ఉంది తప్ప ఇచ్చిన గ్యారంటీ ల అమలు మీద లేదని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ సంస్థాపన దినోత్సవం సందర్బంగా.. పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమానికి హాజరైన బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేస్తామని చెప్పాము.. చేసామన్నారు. అయోధ్య లో భవ్యమైన రామ మందిరం నిర్మాణం చేయాలని అద్వానీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు తీర్మానం చేశామన్నారు. ట్రిబుల్ తలాక్ రద్దు చేసామన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ కోసం మోడీ సర్కార్ పని చేస్తుందన్నారు. దేశం విశ్వ గురువు కావాలన్నారు. ప్రధాని విశ్వ నేతగా మార్గనిర్దేశనం చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఇంటి నినాదం ఈసారి 400 సీట్లు… మరో సారి ప్రధాని మోడీ కావాలన్నారు.

ఆనాడు జనసంఘ్ రద్దు చేసి.. జనతా పార్టీని ప్రారంభించారు

గత 44 ఏళ్ళుగా బీజేపీ పని చేస్తోందని, 45వ పుట్టిన రోజు జరుపుకుంటోంది బీజేపీ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణ రాజు వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. జనసంఘ్‌ను శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రారంభించారని తెలిపారు. ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే.. జనసంఘ్ రద్దు చేసి.. జనతా పార్టీని ప్రారంభించారని ఆయన పేర్కొన్నారు. 1980 ఏప్రిల్ 6 న జనతావపార్టీ నుంచీ బయటకి వచ్చి స్వతంత్రంగా బిజెపి ఏర్పడిందని, బీజేపీ మిగిలిన పార్టీలతో కలిసి వాజ్ పేయి నేతృత్వంలో పాలన జరిపిందన్నారు సూర్యనారాయణ రాజు. నరేంద్ర మోడీ నాయకత్వంలో పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేసారన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని, జగన్మోహన్ రెడ్డి మాట తప్పి, మడమ తప్పి మోసం చేశారని సూర్యనారాయణ రాజు విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించి… నిరసన తెలిపితే అరెస్టు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. పేదల బియ్యం దోచుకుని విదేశాలకు తరలిస్తున్నారని, వైసీపీ నాయకులు అటవీ శాఖ భూములను దోచుకున్నారని ఆరోపించారు. ఇటువంటి ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవసరం ఉందన్నారు.

భారత్లో పేదలు, ముస్లీంలు లేకుండా చేయాలని చూస్తున్నారు..

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం (CAA)పై ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ కీల‌క వ్యాఖ్యలు చేశారు. సీఏఏను ఎన్‌పీఆర్‌, ఎన్ఆర్‌సీల‌తో క‌లిపి చూడాల‌ని అప్పుడే దాన్ని స‌రిగ్గా అర్ధం చేసుకోగ‌ల‌మ‌న్నారు. లోక్‌స‌భ‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన తీరు ఇప్పుడు రాజ్‌నాథ్ సింగ్ కామెంట్స్.. సీఏఏపై కేంద్రం తీరు ఏంటో స్పష్టంగా తెలిసిపోతుందని ఆయన అన్నారు. ఈ దేశంలో పేద‌లు, ద‌ళితులు, మైనారిటీలు, ముస్లింల‌కు చోటు లేకుండా చేయ‌డ‌మే సీఏఏ, ఎన్‌పీఆర్‌, ఎన్ఆర్‌సీ లక్ష్యమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక, ఎన్నికలు రాగానే సీఏఏ నిబంధనలు వస్తాయని బీజేపీపై అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు గుప్పించారు.

ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. ఉదయగిరిని అభివృద్ది చేసి చూపిస్తా..!

నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి మండలం రావుల కొల్లు సర్పంచ్ వెంగపనాయుడు ఇచ్చిన విందులో ఉదయగిరి టీడీపీ- జనసేన- బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ముందుగా గ్రామ దేవత అయిన సీతాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడికి వచ్చిన గ్రామ నాయకులు ప్రజలతో మాట్లాడుతూ ఓటు అనే ఆయుధంతో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశాన్ని గెలిపించాలని ఆయన కోరారు. తెలుగుదేశం గెలిస్తే మీరు నేను గెలిచినట్టే అన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి సాధ్యమన్నారు. అదే విధంగా యువతకు ఉద్యోగాలు కావాలంటే బాబు రావాలన్నారు. ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రంగా, అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా తయారైందని కాకర్ల సురేష్ తెలిపారు.

ముంబై జట్టులోకి సూర్య భాయ్ ఎంట్రీ.. ప్రత్యర్థులకు దబిడిదిబిడే..

టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ 2024లోకి అడుగు పెట్టాడు. గత 2 వారాలుగా నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసంలో ఉన్న సూర్య భాయ్ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి శుక్రవారం నాడు ముంబై ఇండియన్స్ జట్టులో కూడా చేరాడు. అయితే, శుక్రవారం ముంబై ఇండియన్స్ క్యాంపులో చేరిన సూర్య అదే రోజు ప్రాక్టీస్‌ను కూడా స్టార్ట్ చేశాడు. కాబట్టి, నెక్ట్స్ మ్యాచ్‌లో ఖచ్చితంగా ప్లేయింగ్ ఎలెవన్ లో ఉంటాడని చెప్పొచ్చు. వరుసగా మూడు పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ టీమ్ కు సూర్యకుమార్ యాదవ్ రాక కొత్త బలాన్ని ఇస్తుంది. ఎందుకంటే, గత మూడు మ్యాచ్‌ల్లో ముంబై టీమ్ మిడిలార్డర్ బ్యాట్స్ మెన్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు.

ల్యాండ్ లెవెలింగ్ చేయటానికి కూడా నిధులు దోచేశారు

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో బీజేపీ కార్యాలయంను రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, పరిశీలకుడు సిద్ధార్థ నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు పార్టీ కార్యాలయం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. జగన్ కాలనీల్లో అవినీతి ఉందన్నారు. ల్యాండ్ లెవెలింగ్ చేయటానికి కూడా నిధులు దోచేశారని, మడ అడవులు అడవుల్లో జగనన్న కాలనీల నిర్మాణం ఎలా జరిపారన్నారు.

లోక్‌సభ అభ్యర్థుల మరో జాబితా విడుదల

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మరో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఆరుగురు అభ్యర్థులతో కూడిన జాబితాను వెల్లడించింది. మధ్యప్రదేశ్, గోవా, డీఎన్.హవేలీ నియోజకవర్గాలకు చెందిన ఆరుగురు అభ్యర్థుల్ని కాంగ్రెస్ ప్రకటించింది. నార్త్ గోవాకు రమాకాంత్ ఖలప్, సౌత్ గోవాకు విరియాటో ఫెర్నాండెజ్, మోరెనాకు సత్యపాల్ సింగ్ సికర్వార్, గ్వాలియర్‌కు ప్రవీణ్ పాఠక్, ఖాండ్వాకు నరేంద్ర పాటిల్, దాదర్ & నగర్ హవేలీకి అజిత్ రాంజీభాయ్ మహల్ పేర్లను ప్రకటించింది. గోవాకు చెందిన సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీ ఫ్రాన్సిస్కో సర్దిన్హాకు ఈసారి సీటు లభించలేదు. బరి నుంచి తప్పుకున్నారు.

ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు ఉన్న పార్టీ బీజేపీ

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగి నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుల్ సింగ్, మాజీ సీఎం, రాజంపేట పార్లమెంట్ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో బీజేపీ జెండా ఆవిష్కరణతో పాటు, బీజేపీ శ్రేణుల బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కార్యకర్తల ఉన్న పార్టీ బీజేపీ అని ఆయన అన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న కార్యకర్తలు అందరికి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఎంపీలు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు ఉన్నది బీజేపీలోనేని ఆయన తెలిపారు.