NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్ న్యూస్

Top Headlines @1pm

Top Headlines @1pm

డాన్స్ చేస్తూ కుప్పకూలిన ఇంటర్‌ విద్యార్ధిని.. చివరికి

మహబూబాబాద్ జిల్లాలో డాన్స్ చేస్తూ విద్యార్ధిని మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండల కేంద్రంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమం చేపట్టారు.ఈ సాంస్కృతిక కార్యక్రమంలో డ్యాన్స్ వేస్తూ రోజా అనే ఇంటర్ ఫస్టియర్ సీఈసీ విద్యార్ధిని కుప్పకూలింది.. వెంటనే స్పందించిన ఉపాధ్యాయులు చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.. చికిత్స పొందుతూ విద్యార్ధిని మృతి చెందినది.. విద్యార్ధిని స్వస్థలం మరిపెడ మండలం తానంచర్ల గ్రామ శివారు సపవత్ తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యార్థి మృతి పట్ల ఎలాంటి విషయాలు బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతున్నారు స్కూల్ యాజమాన్యం. పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.

గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై మాజీ మంత్రి ఫైర్

గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పాలకవర్గాలను తెలుగుదేశం పార్టీ (టీడీపీ) లాక్కుంటోందని ఆరోపించారు. గుంటూరులో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు గెలవడంపై స్పందించిన అంబటి రాంబాబు ఈ విజయాన్ని కుట్రలతో సాధించారని విమర్శించారు. గుంటూరులో 57 డివిజన్లలో వైసీపీకి 46 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ, టీడీపీ స్టాండింగ్ కమిటీని చేజిక్కించుకుందని ఆయన ఆరోపించారు. ‘మా కార్పొరేటర్లను లాక్కొని, కొందరితో క్రాస్ ఓటింగ్ చేయించారు. క్రాస్ ఓటింగ్ చేసినవారికి నైతిక విలువలు లేవు. బాహాటంగా పార్టీకి వ్యతిరేకంగా వెళ్లినవారు కన్నా లోపలుండి వెన్నుపోటు పొడిచే వారు మరింత ప్రమాదకరం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కుంభమేళాలో ప్రధాని మోడీ పుణ్య స్నానం

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ప్రయాగ్ రాజ్ చేరుకున్న ఆయన త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. అనంతరం గంగా మాతకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దేశ శ్రేయస్సు కోసం మోడీ ప్రార్ధించారు. మోడీ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వచ్చారు. ప్రధాని మోదీ మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏరియల్ ఘాట్ నుంచి మహాకుంభ్ వరకు పడవ ప్రయాణం చేశారు. ప్రధాని పర్యటన వేళ భద్రతా సిబ్బంది ఆ ప్రాంతమంతా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

గ్రామాలలో కుల గణన సంబరాలు చేయాలి.. పీసీసీ ఆదేశం

గ్రామాలలో కుల గణన, వర్గీకరణ సంబరాలు చేయాలని పార్టీ నేతలకు టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఆదేశించారు. నిన్న శాసనసభలో రెండు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న విషయం మనకు తెలిసిందే. ఎన్నో ఏళ్ళు గా పెండింగ్ లో ఉన్న బిసి కులఘనన ను, ఎస్సీల వర్గీకరణ విషయంలో మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయి. సమాజంలో రెండు ప్రధాన వర్గాలు బిసిలు, ఎస్సీ లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కులఘనన, వర్గీకరణ కార్యక్రమాలు కార్యాచరణకు సిద్ధమయ్యాయని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. అన్ని గ్రామాలలో, మండలాలలో, నియోజక వర్గాలలో జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున సంబరాలు చేయాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉప సంఘం చైర్మన్ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ దామోదర్ రాజా నర్సింహ, సభ్యులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవి కు ధన్యవాదాలు తెలుపుతూ సంబరాలు భారీ ఎత్తున నిర్వహించాలన్నారు. కార్యకర్తలు, నాయకులు, బీసీ, ఎస్సీ వర్గాలు కార్యక్రమాలలో భాగస్వాములు అయ్యేయా ప్రోగ్రామ్ నిర్వహించాలని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ సూచించారు.

మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే వాస్తవాలు.. డ్రగ్స్ ఇచ్చి, వీడియోలు తీసి..

రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య ఫిర్యాదు మేరకు ఈ కేసులో కీలకమైన మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు పోలీసులు. మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్టులో సంచలన అంశాలు వెలువడ్డాయి. మస్తాన్ సాయి, అతడి స్నేహితుడు ఖాజా కు డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. మస్తాన్ సాయి ఫుల్ గా డ్రగ్స్ తీసుకుని ఆ మత్తులో లావణ్య ఇంటికి వెళ్లి గొడవ చేసినట్టుపేర్కొన్నారు. అలాగే మస్తాన్ సాయి, లావణ్య మధ్య గతంలోనే సయోధ్య కుదిర్చాడు రాజ్ తరుణ్. మస్తాన్ సాయి లాప్ టాప్ లో ఉన్న లావణ్య వీడియోలను గతంలోనే డిలీట్ చేపించిన రాజ్ తరుణ్. అయితే రాజ్ తరుణ్ డిలీట్ చేయించే లోపే ఇతర డివైజేస్ లోకి వీడియోస్ కాపీ చేసుకున్నాడు మస్తాన్ సాయి.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సీఎం చిత్తశుద్ధితో పని చేస్తున్నారా..?

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో పని చేస్తున్నారా? అనేది పెద్ద ప్రశ్న అంటూ సోషల్ మీడియా వేదికగా YSR కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో పోలవరం ప్రాజెక్టును ప్రాధాన్యంగా తీసుకున్న సందర్భాలు చాలా తక్కువని, రాష్ట్ర విభజన సందర్భంగా 2014లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిందని తెలిపింది. 100% ఖర్చును కేంద్రమే భరించాల్సి ఉందని విభజన చట్టంలో హామీ ఇచ్చింది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) ఏర్పాటు చేయగా, చంద్రబాబు పీపీఏతో ఒప్పందం చేసుకోకుండా ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించాలని కేంద్రాన్ని కోరడం.. చంద్రబాబు చేసిన ఈ నిర్ణయం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టినట్లేనని పేర్కొన్నారు.

బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ సర్కారు పూర్తిగా అబద్ధాలను ప్రచారం చేసింది

నిన్నటి అసెంబ్లీ సమావేశం.. తెలంగాణ ప్రజలకు రెండు విషయాలు స్పష్టం చేసిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఏడాదికాలంగా పూర్తిగా విఫలమవుతున్న ప్రభుత్వానికి దేనిపై కూడా స్పష్టత లేదని ఆయన విమర్శించారు. బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ సర్కారు పూర్తిగా అబద్ధాలను ప్రచారం చేసిందని, అసెంబ్లీ లో సమర్పించిన డేటాపై రాష్ట్ర సర్కారుకే ఏమాత్రం క్లారిటీ లేదన్నారు కేటీఆర్‌. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఎంతమాత్రం లేదని నిన్నటితో తేలిపోయిందని, రిజర్వేషన్ల అంశంపై నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుంది. కేంద్రంపైకి నెపం నెట్టి తప్పించుకోవాలని పన్నాగం వేసిందని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఇచ్చిన ఎన్నికల హామీలు, చెప్పిన గ్యారెంటీలు, చేసిన డిక్లరేషన్లన్నీ బూటకమని తేలిపోయిందని, అబద్ధాలు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్దిపొందడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న రాహుల గాంధీ గారు తన పేరును ఎలక్షన్ గాంధీగా మార్చుకుంటే మంచిదన్నారు కేటీఆర్‌. అంతేకాకుండా.. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ వంద శాతం అబద్ధం.. ఈ సర్కారు నిబద్ధత వంద శాతం నకిలీ అని ఆయన ఆరోపించారు.

ఢిల్లీలో రెండో రోజు పర్యటనలో మంత్రి నారా లోకేష్.. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు

ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఈ సమావేశంలో పలు అభివృద్ధి అంశాలు, రాష్ట్రానికి సంబంధించిన విషయాలను చర్చించే అవకాశం ఉంది. నేడు మధ్యాహ్నం 12.45కు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఆయన నివాసంలో కలవనున్నారు. ఈ సందర్భంగా విద్యా రంగంలో రాష్ట్రానికి అవసరమైన సహకారం, నూతన విద్యా విధానాలపై చర్చించనున్నారు.

తగ్గేదే లే అంటున్న బంగారం ధరలు.. తులంపై రూ. 1040 పెరిగిన గోల్డ్ ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 7,905గా, 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,624 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 950 పెరిగింది. దీంతో తులం గోల్డ్ ధర రూ. 79,050 వద్ద అమ్ముడవుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 1040 పెరిగింది. దీంతో తులం పసిడి ధర రూ. 86,240 వద్ద ట్రేడ్ అవుతోంది. విశాఖ పట్నం, విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 950 పెరిగి రూ. 79,200 వద్ద అమ్ముడవుతోంది. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1040 పెరిగి రూ. 86390 వద్దకి చేరింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు (G.O.) తెలుగు భాషలో కూడా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు (జిఓలు) తెలుగు భాషలో కూడా జారీ చేయనుంది. గత నెలలోనే ఈ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించగా.. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది. ప్రస్తుతం ఈ ప్రక్రియను హోంశాఖ ప్రారంభించింది. తొలిసారిగా ఒక ఖైదీ పెరోల్‌కు సంబంధించిన జిఓ ను తెలుగు భాషలో విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం స్థానిక ప్రజల కోసం కీలకమైన చర్యగా భావిస్తున్నారు.