NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @1pm

Top Headlines @1pm

జగన్ ముందుగా వరద పై పూర్తి వివరాలు తెలుసుకోవాలి

భారీ వర్షాలకు ఏపీలో విజయవాడ అతలాకుతలమైంది. పలు ప్రాంతాల్లో భారీ వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి సహాయక చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబు గత రెండు రోజులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. ఆయన కాకుండా మంత్రులు సైతం అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ ఎన్టీవీతో మాట్లాడుతూ.. ఒక రూపాయి ఎక్కువైనా బాధితులకు ఆహారం మాత్రం కచ్చితంగా అందాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని, శానిటేషన్ కు ప్రధాన ప్రాధాన్యత ఇచ్చారు సీఎం చంద్రబాబు అని ఆయన అన్నారు. జగన్ ముందుగా వరద పై పూర్తి వివరాలు తెలుసుకోవాలని, ఎప్పుడైనా ఇంత వరద వచ్చిందా.. ఇలాంటి పరిస్ధితులు ఎలా ఉంటాయో తెలీకుండా మాట్లాడకూడదన్నారు మంత్రి నారాయణ.

బ్రూనై, సింగపూర్ పర్యటనకు ప్రధాని మోడీ..

ఆగ్నేయాసియా దేశాలతో భారత సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ బ్రూనైలో పర్యటించనున్నారు. బుధవారం సింగపూర్‌లో పర్యటిస్తారు. బ్రూనైతో భారతదేశ చారిత్రక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంతోపాటు సింగపూర్‌తో తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం విశ్వాసం వ్యక్తం చేశారు. బ్రూనైలో తొలిసారి ఓ భారత పర్యటన పర్యటించబోతున్నారు. చారిత్రాత్మక సంబంధాలు ముందుకు తీసుకెళ్లేందుకు సుల్తాన్ హాజీ హసనాల్ బోల్కియా, ఇతర రాజకుటుంబ సభ్యలతో తాను సమావేశం కావడానికి ఎదురుచూస్తున్నానని ప్రధాని మోడీ తెలిపారు.

స్టార్‌లైనర్ నుంచి వింత శబ్ధాలు.. అసలు భూమికి తిరిగి వస్తుందా..?

బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష ప్రయాణం ఇప్పుడు నాసాకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ స్టార్‌లైనర్‌లో జూన్ 5న 8 రోజుల అంతరిక్ష ప్రయోగంలో భాగంగా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కి వెళ్లారు. అయితే, స్టార్ లైనర్ క్యాప్సూల్ అంతరిక్షానికి చేరగానే వరసగా దాంట్లో అంతరాయాలు మొదలయ్యాయి. హీలియం లీకేజీలతో పాటు థ్రస్టర్లు విఫలమయ్యాయి. వీటిని సరిచేసేందుకు గ్రౌండ్ కంట్రోల్‌తో పాటు అక్కడ వ్యోమగాములు ఎంతో ప్రయత్నించినప్పటికీ వారి ప్రయత్నాలు సఫలం కాలేదు. మరోవైపు వ్యోమగాములు ఇద్దరూ స్టార్‌లైనర్‌లో సమస్యల కారణంగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్ ఎక్స్ క్రూ-9 ద్వారా వీరిని తీసుకురావాలని నాసా ప్లాన్ చేస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం.. ఎన్టీఆర్ కోటి విరాళం..

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కారణంగా అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలలో ఎందరో ప్రజలు నిరాశ్రయులయ్యారు. భారీగా ఆస్తినష్టం జరిగింది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ పూర్తిగా నీట మునిగిపోయింది. తినడానికి తిండి తాగటానికి మంచి నీళ్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఏ నేపధ్యంలో వరద భాదితుల సహాయార్థం కనీస అవసరాలు తీర్చేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందడుగు వేసింది.

కడెం ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది..

కడెం ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. పంట నష్టం అంచనా వేస్తున్నామని తెలిపారు. వర్షాలు పూర్తిగా తగ్గాక సర్వే చేసి ప్రభుత్వం పరిహారం అందిస్తుందన్నారు. కడెం ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కానీ మా ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత నిధులు కేటాయించి మరమ్మత్తులు పూర్తీ చేశామన్నారు. ప్రాణ నష్టం జరిగితే 5 లక్షలు ఇస్తాం అని సీఎం ప్రకటించారని గుర్తు చేశారు. ప్రాజెక్టుల ఇన్ ఫ్లో లు, పెనుగంగా వరదల పై అధికారులు ఎప్పటి అప్పుడు అంచనా వేస్తున్నారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా యంత్రాంగం చర్యలు చేపట్టాలన్నారు.

ప్రత్తిపాడు నియోజకవర్గం పదివేల ఎకరాల్లో నీట మునిగిన వరి

గుంటూరు జిల్లా లోని ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండల పరిధి గ్రామాల్లో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సుమారు పదివేల ఎకరాల్లో వరి నీట మునిగిందని అధికారులు గుర్తించారు. పొన్నూరు ఏ.డి.ఎ రామకోటేశ్వరి తో పాటు మండల వ్యవసాయ శాఖఅధికారిని కె కిరణ్మయి నీటి ముంపుకు గురైన ప్రత్తి పంట పొలాలను పరిశీలించారు. ఈ కార్యమంలో లాం శాస్త్రవేత్తలు యం.నగేష్, ఎస్. ప్రతిభ శ్రీ, వి. మనోజ్ , డి. ఆర్ సి ఇన్చార్జి డి డి ఎ సునీత ఏ ఓ రాజవంశీ , ఆయా గ్రామాల రైతులు లు పాల్గొన్నారు. ఇందులో భాగంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ప్రత్తి పంట పొలంలో నీటిని తీసివేసి అంతర కృషి చేసి పొలం ఆరేలా చూడాలని మెగ్నీషియం సల్ఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని , 90 రోజుల లోపు వయసు వున్న పొలంలో బూస్టర్ డోస్ గా 30 కిలోల యూరియాం 10 కిలోల పొటాష్ ఒక ఎకరాకు వేసుకోవాలి.

సంగారెడ్డి జిల్లాలో అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా..

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ఏజెన్సీ (హైడ్రా) అక్రమ కూల్చివేతలను కొనసాగిస్తోంది. ఈరోజు (శనివారం) గగన్ పహాడ్ లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. ఇవాళ తెల్లవారుజాము నుంచి సంగారెడ్డి జిల్లాలో అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా ఝళిపించారు. అమీన్‌పూర్‌ మండంలోని ఐలాపూర్ తండాలో దాదాపు 20 ఎకరాల ఆక్రమిత భూమిని హైడ్రా ఆధికారులు రక్షిస్తున్నారు. సర్వేనెంబర్ 119లో గుర్తుతెలియని వ్యక్తులు ప్లాట్లు చేశారన్న ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది.

ప్రైవేటు మోటార్ బోట్ నిర్వాహకులు చేతివాటం

విజయవాడ సింగ్‌నగర్ లో కొందరు వ్యాపారులు, ప్రైవేటు మోటార్ బోట్ నిర్వాహకులు చేతివాటం చూపిస్తున్నారు.. వాంబే కాలనీ, ఆంధ్రప్రభ కాలనీ, రాజరాజేశ్వరిపేట, పైపుల కాలనీ, వైఎస్ఆర్ కాలనీ ప్రాంతాల నుంచి బోట్ల సాయంతో సింగ్ నగర్ కు వచ్చే బాధితుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. మరోవైపు కొందరు వ్యాపారులు కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆహార పదార్థాలను సేకరించి శివారు కాలనీలకు తీసుకువెళ్ళి భారీ మొత్తలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.. ఆహార పదార్థాలను పంపిణీ చేస్తున్నా అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో అందిన కాడికి వారు సొమ్ము చేసుకుంటున్నారు.. దగ్గరి ప్రాంతాలకు కూడా మూడు రోజులుగా ఆహార పదార్థాలు పంపిణీ చేయలేదని బాధితుల ఆందోళన చెందుతున్నారు.. ఆహార పదార్థాలు బ్లాక్ లో కొనుగోలు చేసేందుకు కూడా డబ్బులు లేక మూడు రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

గాంధీ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ..

గాంధీ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆకస్మిక తనిఖీ చేశారు. గాంధీ ఆసుపత్రి లోని సుపరింటేండెంట్ కార్యాలయం చేరుకున్నారు. ఆస్పత్రిలో బెడ్ ల వివరాలు, ఓపి రోజు వారి వివరాలు సుపరింటేండెంట్ డాక్టర్ రాజకుమారి నీ అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి ఆకస్మిక తనిఖి సమాచారం తెలుసుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వాణి గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. సీజీనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటా.. రేవంత్‌ రెడ్డి చిట్ చాట్

ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. గుండె కరిగిపోయే దృశ్యాలు… మనసు చెదిరిపోయే కష్టాలు…స్వయంగా చూశానని తెలిపారు. బాధితుల మొఖాలల్లో.. ఒకవైపు తీరని ఆవేదన… మరోవైపు “అన్నా” వచ్చాడన్న భరోసా. వీళ్ల కష్టం తీర్చడానికి… కన్నీళ్లు తుడవడానికి…ఎంతటి సాయమైనా..చేయడానికి సర్కారు సిద్ధని తెలిపారు. తెలంగాణ ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. ఖమ్మంలో కూడా ఆక్రమణల వల్ల వరదలు వచ్చాయని తెలిపారు. గతంలో గొలుసు కట్టు చెరువులు వుండేయన్నారు. మున్నేరు రిటైర్నింగ్ వాల్ ఎత్తు పెంచడం అనేది ఇంజనీర్ల తో మాట్లాడిచూస్తామన్నారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి అవసరం అనుకుంటే. ఆక్రమణలు తొలగిస్తామన్నారు. మిషన్ కాకతీయ అనేదే కమీషన్ కాకతీయ అని దివంగత నాయిని నర్సింహారెడ్డి అసెంబ్లీలో చెప్పారని తెలిపారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పాటిష్టం చేశాం అన్నారు .. మరి గతంలో తెగని చెరువులు ,ఇప్పుడు ఎందుకు తెగుతున్నాయన్నారు. 42 సెంటీమీటర్ల వర్షం అంతే ఇది అత్యధికంగా పడింది.. 75 సంవత్సరాలలో ఇంత వర్షం పడలేదన్నారు.

Show comments