NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @1pm

Top Headlines @1pm

దెబ్బతిన్న రైల్వే ట్రాక్స్‌కు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరంగల్ మహబూబాబాద్ రూట్ లో దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నారు అధికారులు. మూడు చోట్ల సుమారు వెయ్యి మంది సిబ్బందితో ట్రాక్ మరమ్మతు పనులను చేపడుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే జీఎం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్ష బీభత్సానికి రైల్వే వ్యవస్థ అతలాకుతలమైంది. రైల్వే ట్రాక్లు పలుచోట్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి. జోన్ పరిధిలో 101 రైళ్లు పూర్తిగా, మరో 8 పాక్షికంగా రద్దయ్యాయి. 68 రైళ్లను దారి మళ్లించారు. ట్రాక్పైకి వరద నీరు చేరడంతో కాజీపేట-విజయవాడ మార్గంలో అనేక రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దారి మళ్లించిన రైళ్లు 5-10 గంటల ఆలస్యంగా గమ్యస్థానం చేరుకున్నాయి. మహిళలు, పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలున్న ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. ద.మ. రైల్వే సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో ‘ఎమర్జెన్సీ కంట్రోల్ రూం’ను ఏర్పాటు చేసింది. మహబూబాబాద్ జిల్లాలోని ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ వరదనీటికి తీవ్రంగా దెబ్బతింది. కింద ఉండే కంకర కొట్టుకుపోవడంతో ట్రాక్ వేలాడింది. తాళ్లపూసపల్లి- మహబూబాబాద్ స్టేషన్ల మధ్య వరదనీరు రైల్వేట్రాక్ని కోతకు గురైంది. కేసముద్రం-ఇంటికన్నె స్టేషన్ల మధ్య కంకర కొట్టుకుపోవడంతో రైలు పట్టాలు వేలాడాయి.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ గవర్నర్ విజ్ఞప్తి..

భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని.. ప్రభుత్వ అధికారుల సహాయంతో అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి వెళ్లవద్దని గవర్నర్ హెచ్చరించారు. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారు ప్రభుత్వ అధికారులను సంప్రదించాలని.. తద్వారా వారిని రక్షించి పునరావాస ప్రాంతాలకు తరలించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఏర్పాటు చేయవచ్చని ఆయన అన్నారు. రెడ్‌క్రాస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇతర ఎన్‌జీవోలు ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలి.. బాధితులకు ఆహారం, మందులు, ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీలో రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్‌లలో చురుకుగా పాల్గొనాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ అభ్యర్థించారు.

మంత్రులు, అధికారులతో వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష..

మంత్రులు, అధికారులతో రాష్ట్రంలో వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులకు డివిజన్ల వారీగా బాధ్యతలను అప్పగించారు. ఇప్పటికే ఒక్కో ఐఏఎస్ అధికారికి ఒక్కో డివిజన్ కేటాయింపు చేశారు. రామలింగేశ్వర నగర్ ప్రాంతంలోకి వరద చేరుతుండడంపై అక్కడ పరిస్థితినీ సీఎం సమీక్షిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్దకు కొట్టుకొచ్చిన బోట్లని ఏ విధంగా తప్పించాలో చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అన్నింటికంటే బాధితుల తరలింపునకు.. ప్రాణాలను కాపాడేందుకే హై ప్రయార్టీ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆహార సరఫరాకు ఆటంకాలే ఉండకూడదని.. ఇక, బాధితుల తరలింపునకే కాకుండా.. అవసరమైన మేరకు ఆహార సరఫరాకూ ఛాపర్లను వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

రక్తంతో తడిసి పోయిన డాక్టర్ ను చూశానంతే.. కోల్ కతా కేసులో నిందితుడు యూటర్న్

కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల మహిళా డాక్టర్‌పై అత్యాచారం చేసి, ఆపై దారుణంగా హత్య చేసిన కేసులో అరెస్టయిన సంజయ్ రాయ్ యూ-టర్న్ తీసుకున్నాడు. నిందితుడు సంజయ్‌రాయ్‌ తన న్యాయవాది కవితా సర్కార్‌తో మాట్లాడుతూ తాను నిర్దోషినని, ఇరికిస్తున్నట్లు చెప్పారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా, ఆగస్ట్ 9 న జరిగిన ఈ దారుణ హత్య తర్వాత ఒక రోజు ఆగష్టు 10 న సంజయ్ రాయ్‌ను అరెస్టు చేశారు. సంఘటన జరిగిన సెమినార్ హాల్‌లో అతని బ్లూటూత్ హెడ్‌సెట్ కూడా కనుగొన్నారు.

సంజయ్ రాయ్ తరపు న్యాయవాది ప్రకారం.. పాలిగ్రాఫ్ పరీక్ష సమయంలో కూడా అతను తన నిర్దోషిత్వాన్ని కొనసాగించాడు. సంజయ్ రాయ్‌ను 10 ప్రశ్నలు అడిగారు. మహిళను హత్య చేసిన తర్వాత అతను ఏమి చేసాడు అనే ప్రశ్న కూడా ఇందులో ఉంది. ఆమెను హత్య చేయలేదని చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందని సీబీఐ అధికారులకు తెలిపాడు. సంజయ్ రాయ్ ఆసుపత్రిలోని సెమినార్ హాల్‌లోకి ప్రవేశించినప్పుడు, మహిళ అపస్మారక స్థితిలో ఉందని పాలిగ్రాఫ్ పరీక్షలో పేర్కొన్నాడు. ఆగస్టు 9న సెమినార్ హాల్‌లో రక్తంతో తడిసి ఉన్న మహిళను తాను చూశానని సంజయ్ పేర్కొన్నాడు. దీంతో తాను భయపడి గది నుంచి బయటకు పరుగులు తీశానని చెప్పాడు. బాధితురాలు తనకు తెలియదని కూడా సంజయ్ రాయ్ పేర్కొన్నాడు. అతడిని ఇరికిస్తున్నారని వాపోయాడు.

ట్విట్టర్, సోషల్ మీడియాలకే కేటీఆర్ హరీష్ రావులు పరిమితం

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలకు అతలాకుతలమవుతున్నాయి. అయితే.. అధికార యంత్రాంగం తగు చర్యలు తీసుకుంటోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను రక్షించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ట్విట్టర్, సోషల్ మీడియాలకే కేటీఆర్ హరీష్ రావులు పరిమితమయ్యారని విమర్శించారు. వారు ప్రజలను మర్చిపోయారని, తమది గడిల పాలన కాదని, మేము గడి లకు పరిమితం కాలేదన్నారు భట్టి. వరదలు రాగానే ప్రజలలోనే వున్నామని, సహాయ చర్యలను అందించామన్నారు. రెస్క్యూ ఆపరేషన్ లో ప్రభుత్వం కీలకంగా పని చేసిందని, గతం లో చిన్న వర్షం వస్తే హైదరబాద్ లో బీఆర్‌ఎస్‌ చేతులు ఎత్తేసే వారని ఆయన అన్నారు. ఇప్పుడు హైదరబాద్ ను అద్భుతంగా తయారు చేస్తున్నామని, నష్టాన్ని అంచనా వేస్తున్నామన్నారు భట్టి విక్రమార్క. ప్రజలు వద్దకు వస్తే ప్రజలు తిరగబడతారని అదే సోషల్ మీడియాలో అయితే ఏదైనా చెప్పే అవకాశం ఉండటంతో వారు సోషల్ మీడియాకే పరిమితం అయ్యారని విమర్శించారు. అధికారులు కూడా మనుషులే అని రేయింబవళ్లు శ్రమిస్తున్నారన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషికి అభినందిస్తున్నానన్నారు.

వరద ఉధృతి ప్రాంతాలలో పర్యటిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కోదాడ, హుజుర్‌నగర్ నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. వర్ష ఉధృతికి గండ్లు పడ్డ ప్రాంతాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శిస్తున్నారు. కోదాడ నియోజకవర్గ పరిధిలోని నడిగూడెం మండలం రామచంద్రాపురం శివారులో సాగర్ ఎడమ కాలువకు పడిన గండిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతీ రెడ్డిలు పరిశీలించారు. వీరితో పాటు నీటిపారుదల శాఖాధికారులు సి.ఇ రమేష్ బాబు, యస్.ఇ శివధర్మ తదితరులు పాల్గొన్నారు. అదే క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజుర్నగర్ నియోజకవర్గ పరిధిలోని హుజుర్నగర్, మఠంపల్లి,మెల్లచేరువు, చింతలపాలెం మండలాల్లో పర్యటించనున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. భారీ వర్షాలు, వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారిందన్నారు. ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని.. ప్రభుత్వ అధికారుల సహాయంతో అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి వెళ్లవద్దని ఆయన సూచించారు. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారు ప్రభుత్వ అధికారులను సంప్రదించాలని.. తద్వారా వారిని రక్షించి పునరావాస ప్రాంతాలకు తరలించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఏర్పాటు చేయవచ్చని ఆయన అన్నారు.

పెళ్లై ఐదేళ్లయిన పిల్లల్లేరు.. కానీ ఇప్పుడు ఒకే కాన్పులో ముగ్గురు

భగవంతుని ఆశీర్వాదం లభిస్తే ప్రతి కోరిక నెరవేరుతుందని.. అందుకోసం వేచి ఉండటం చాలా కాలం, బాధాకరంగా ఉంటుందని చెబుతారు. పెళ్లయి ఐదేళ్ల వరకు సంతానం లేని ఓ మహిళ ఇప్పుడు ఏకంగా ముగ్గురు పిల్లలకు తల్లిగా మారిన ఉదంతం ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ నుంచి వెలుగులోకి వచ్చింది. ప్రసవ సమయంలో మహిళ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. రామచంద్రపురం శారదా నర్సింగ్‌హోమ్‌లో మహిళకు ప్రసవం జరిగింది. ఇంట్లో ప్రతిధ్వనించే ముగ్గురు పిల్లల నవ్వులతో కుటుంబం మొత్తం ఈ ప్రత్యేకమైన క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. ఆ మహిళకు ఒకేసారి ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం అంత సులభం కాదు. ఇది క్లిష్టమైన కేసు. డాక్టర్ గిరిబాల, డాక్టర్ శ్రావ్యల బృందం ఆధ్వర్యంలో సిజేరియన్ ద్వారా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు.

వర్షాలు, వరద సాయంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

వర్షాలు, వరద సాయంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ గా ఉండాలన్నారు. కలెక్టరేట్ ల్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వ్యవస్థ ను సన్నద్దంగా ఉంచుకోవాలని, భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం రాష్ట్రంలోని 8 పోలీస్ బెటాలియన్ల కు ఎన్డీఆర్ఎఫ్ తరహా లో శిక్షణ ఇవ్వాలని ఆయన ఆదేశించారు. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం 4 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రజలకు జరిగిన నష్టం పై తక్షణమే అధికారులు స్పందించాలని, వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు,గొర్రెల కు పరిహారం పెంచాలన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. వరద నష్టం పైన కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని, తక్షణమే కేంద్ర సాయం కోరుతూ లేఖ రాశారు. జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని లేఖలో కోరారు సీఎం రేవంత్‌ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాస్తామన్నారు. ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్త గూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్ల లకు తక్షణ సాయం కోసం 5 కోట్లు విడుదల చేశారు.

ఇవాళ 96 రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ

తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది… నిన్న రాత్రి వరకు 177 రైళ్లను రద్దు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే.. ఇవాళ ఉదయం నుంచి 96 రైళ్లను రద్దు చేసింది… నిన్న రాత్రి వరకు 120 రైళ్ళను దారి మళ్ళించింది… ఇవాళ ఉదయం నుంచి 22 రైళ్లను దారి మళ్ళించింది… నిన్న రాత్రి వరకు 9 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది ఇవాళ దాదాపుగా 10 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది… భారీ వర్షాల తెలుగు రాష్ట్రాల మధ్య రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పండింది… మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తల్ల పూసలపల్లి లో వరద ఉధృతికి రైల్వే ట్రాక్, విరిగి పడ్డ సిగ్నల్ పోల్ కొట్టుకుపోయాయి. రైల్వే ట్రాక్ కొట్టుకు పోవడంతో సంఘమిత్ర, మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించింది దక్షిణ మధ్య రైల్వే.. ఏపీకి వెళ్లే రైళ్ల సమాచారం కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. హైదరాబాద్ , సికింద్రాబాద్ , కాజీ పేట్, వరంగల్, ఖమ్మం , విజయవాడ, రాజమండ్రి లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు చేశారు.