ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి 100రోజుల ప్రణాళికపై మోడీ భారీ సమావేశం
సార్వత్రిక ఎన్నికల చివరి దశ ఓటింగ్ ముగిసింది. దేశ వ్యాప్తంగా ఉన్న పలు ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేశాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వరుసగా మూడోసారి భారీ మెజారిటీతో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుకాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా 45 గంటల ధ్యానం తర్వాత కన్యాకుమారి నుంచి రాజధానికి చేరుకున్నారు. ఆయన తిరిగి వచ్చిన వెంటనే ప్రధాని పీఎంవో అధికారులతో భారీ సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం. ఎన్నికల ప్రచారంలో బిజీ కాకముందే ప్రధాని మోడీ అధికారులకు హోం వర్క్ ఇచ్చారు. మోడీ ప్రభుత్వం 3.0 మొదటి 100 రోజుల నిర్ణయాలను పూర్తి చేయాలని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం.. సీఎం రేవంత్ ప్రసంగం హైలెట్స్..
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రసంగించారు. నాలుగు కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినం ఇది. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్ద కాలం పూర్తయింది. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు ఈ సందర్భంగా నివాళి అర్పిస్తున్నానని తెలిపారు. ఆరు దశాబ్దాల మన కలను నిజం చేసిన నాటి ప్రధాన మంత్రి శ్రీ మన్మోహన్ సింగ్, నాటి యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ లకు తెలంగాణ సమాజం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ… అందరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
స్వేచ్ఛ తెలంగాణ జీవన శైలిలో భాగం. బానిసత్వాన్ని తెలంగాణ భరించదు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం మన తత్వం. ఆకలినైనా భరిస్తాం కానీ, స్వేచ్ఛను హరిస్తే సహించం. దాశరథి చెప్పినట్టు తెలంగాణ అమాయకపు నెరజాణే కానీ… అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా మనకు ఉంది. సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదన్నారు. “ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల వరకు తరిమికొడతాం… ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణాలతోనే పాతిపెడతాం” అన్న కవి కాళోజీ మాటలు అక్షర సత్యాలన్నారు.
అందుకే నేను ఆ ఎన్నికల్లో ఓడిపోయాను
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్‌ను నల్లగొండ జిల్లాలోని గాంధీ గుడి కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా గవర్నర్ రాధాకృష్ణన్ ను గాంధీ గుడి సభ్యులు శాలువాతో సత్కరించారు. తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు తీసుకున్న చర్యలను గవర్నర్‌కు గాంధీ గుడి సభ్యులు వివరించారు. అంతేకాకుండా.. మద్యపాన నిషేధ ప్రచారాన్ని చేయాలని గాంధీ గుడి సభ్యులకు గవర్నర్ సూచించారు.
డబ్బు పంపిణీకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే తాను ఓ ఎన్నికల్లో ఓడిపోయానని గవర్నర్ రాధాకృష్ణన్ తెలిపారు. సీపీ రాధాకృష్ణన్ 2023 నుండి జార్ఖండ్‌కు 10వ , ప్రస్తుత గవర్నర్‌గా ఉన్న ఒక భారతీయ రాజకీయ నాయకుడు. తమిళిసై రాజీనామా చేసిన తర్వాత 20 మార్చి 2024 నుండి అతను తెలంగాణ గవర్నర్ & పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అతను భారతీయ జనతా పార్టీ (BJP) సభ్యుడు , కోయంబత్తూరు నుండి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా.
ఇకపై తెలంగాణకు శాశ్వత రాజధానిగా హైదరాబాద్..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పదేళ్ల ఉమ్మడి బంధానికి తెరపడింది. ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ, ఏపీలుగా విభజించిన తర్వాత.. విభజిత ఏపీకి పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. ఈ గడువు నిన్నటితో ముగిసింది. ఇక నుంచి హైదరాబాద్ తెలంగాణకు శాశ్వత రాజధానిగా కొనసాగుతుంది. దీంతో హైదరాబాద్‌లో విభజన సమస్యలు లేని భవనాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ఉమ్మడి రాజధానిని పదేళ్లపాటు ప్రకటించినా.. 2016-17లో ఏపీ ప్రభుత్వం అక్కడికి వెళ్లింది. అయితే, జూన్ 1, 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగింది. హైదరాబాద్‌లోని ఏపీ ప్రభుత్వ సంబంధిత శాఖల పరిధిలోని భవనాలన్నీ తెలంగాణకు చెందుతాయి.
ప్రతిపక్షంలో కూర్చున్నా.. కేసీఆర్‌కి జ్ఞానోదయం కలగలేదు!
ప్రతి క్షంలో కూర్చున్నా కూడా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కి జ్ఞానోదయం కలగలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆరు నెలలు కేబినెట్ ప్రకటించని సీఎం దేశంలో కేసీఆర్ తప్ప ఎవరు లేరని ఎద్దేవా చేశారు. అహంభావంతో కేసీఆర్ పరిపాలన చేశాశారని, అందుకే ఈ సారి ప్రజలు రేవంత్ రెడ్డికి పట్టం కట్టారన్నారు. గతంలో జరిగిన తప్పులను గుర్తించి.. తెలంగాణ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి పని చేయాలని నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నారాయణ నివాళులర్పించారు.
గన్ పార్క్ వద్ద సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ… ‘తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఎంతో మంది విద్యార్థుల ప్రాణ త్యాగాల వల్లే తెలంగాణ వచ్చింది. ఒక్కరో ఇద్దరో కష్టపడితేనే తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాలేదు. ఎంతో మంది అమరవీరుల త్యాగాలతో తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర కూడా ఉంది. ప్రజల మనోభావాలు ఉన్నా కూడా తెలంగాణ పేటేట్ రైట్స్ మొత్తం కేసీఆర్‌కే పోయింది. తెలంగాణ పేరుతో రాజకీయ పార్టీ పెట్టి పదేళ్లు కేసీఆర్ పాలించారు. సరైన పద్ధతిలో కేసీఆర్ పరిపాలన అందించలేకపోయారు. నీరు, విధులు, నియామకాలు అందించడంలో విఫలమయ్యారు. తెలంగాణను అభివృద్ధి చేస్తానన్న కేసీఆర్.. తన కుటుంబ సభ్యులను మాత్రం బాగానే అభివృద్ధి చేసుకున్నారు’ అని అన్నారు.
నేడు రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు..
నైరుతి రుతుపవనాలు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా మారాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో.. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కొన్నిచోట్ల, రేపు, పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించాయి. ఈరోజు ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు ఉంటాయని, గంటకు 30 నుంచి 40 కి.మీ. వీచే అవకాశం ఉందని తెలిపుతుంది. రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఎండల నుంచి కాస్త రిలీఫ్.. ఢిల్లీలో తేలికపాటి వర్షం
తేలికపాటి వర్షం కారణంగా ఢిల్లీ వాసులు తీవ్ర ఎండల నుండి ఉపశమనం పొందారు. వరుసగా ఆరు రోజులుగా తీవ్రమైన వేడిగాలుల తర్వాత.. శనివారం దేశ రాజధానిలో వాతావరణం కొద్దిగా మారిపోయింది. ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంది. మధ్యాహ్నం కాసేపు సూర్యరశ్మి ఉన్నప్పటికీ మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో మళ్లీ ఆకాశం మేఘావృతమై ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటు తేలికపాటి వర్షం కురిసింది. దీంతో.. ఆరు రోజుల తర్వాత శనివారం వేడిగాలుల నుండి కొంత ఉపశమనం లభించింది.
మహౠబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్.. బీఆర్ఎస్ విజయం..
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. స్థానిక బాలుర జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కోసం మొత్తం 5 టేబుళ్లను ఏర్పాటు చేశారు. నాలుగు టేబుళ్లపై 300 ఓట్లు, ఒక టేబుల్‌పై 237 ఓట్లు లెక్కించారు. ప్రధాన అభ్యర్థులుగా మన్నె జీవన్ రెడ్డి (కాంగ్రెస్), నవీన్ కుమార్ రెడ్డి (బీఆర్ఎస్), సుదర్శన్ గౌడ్ (స్వతంత్ర) పోటీ చేస్తున్నారు. 108 లీడ్ లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి ఉన్నారు. కాగా.. కౌంటింగ్ సెంటర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లి పోయారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి పై 111 ఓట్ల తేడాతో నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం వెలువడింది. పోలైన 1,437 ఓట్లలో 21 చెల్లని ఓట్లుగా నిర్ధారించారు. మొత్తం చెల్లిన ఓట్ల సంఖ్య 1,416 కాగా.. బీఆర్ఎస్ 763, కాంగ్రెస్ 652, స్వతంత్ర అభ్యర్థి 1 సాధించారు.
కెనడాపై సంచలన విజయం.. టీ20 ప్రపంచకప్‌లో అమెరికా బోణీ!
టీ20 ప్రపంచకప్ 2024లో అమెరికా బోణీ కొట్టింది. డల్లాస్ వేదికగా ఆదివారం ఉదయం కెనడాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. కెనడా నిర్ధేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని యూఎస్ 17.4 ఓవర్లలో 3 వికెట్స్ కోల్పోయి 197 రన్స్ చేసి గెలిచింది. అమెరికా విజయంలో ఆండ్రిస్ గౌస్ (65; 46 బంతుల్లో 7×4, 3×6), ఆరోన్ జోన్స్ (94; 40 బంతుల్లో 4×4, 10×6) కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో గ్రూప్-ఏలో ఉన్న యూఎస్ ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్ నవనీత్ ధాలివాల్ (61; 44 బంతుల్లో 6×4, 3×6), మిడిల్ ఆర్డర్ బ్యాటర్ నికోలస్ కిర్టన్ (51; 31 బంతుల్లో 3×4, 2×6) హాఫ్ సెంచరీలు చేశారు. శ్రేయాస్ మొవ్వ (32), ఆరోన్ జాన్సన్ (23) పర్వాలేదనిపించారు. అమెరికా బౌలర్లలో అలీ ఖాన్, హర్మీత్ సింగ్, కోరె ఆండర్సన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
నేనేం తప్పు చేయలేదు.. సిట్ ప్రశ్నలను తప్పించుకుంటున్న ప్రజ్వల్ రేవణ్ణ
సెక్స్ స్కాండల్ కేసులో జేడీ(ఎస్) నేత ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నేతృత్వంలో అతన్ని విచారిస్తున్నారు. 6 రోజుల కస్టడీకి తీసుకున్న సిట్.. ప్రజ్వల్ రేవణ్ణ విచారణకు సహకరించడం లేదని.. వరుసగా రెండు రోజుల పాటు సిట్ ప్రశ్నలకు రేవణ్ణ తప్పించుకునే సమాధానాలు ఇచ్చారని మీడియా వర్గాలు తెలిపాయి. ఈ కేసు తనపై కుట్రతో జరిగిందని.. తాను ఎలాంటి తప్పు చేయలేదని ప్రజ్వల్ రేవణ్ణ చెబుతున్నారు. దీంతో ఈరోజు లేదా రేపు క్రైమ్ స్పాట్‌లో స్పాట్ ఇంక్వెస్ట్ నిర్వహించాలని సిట్ యోచిస్తోంది. అందుకోసం హాసన్ జిల్లా హోలెనర్సిపురానికి తీసుకెళ్లే అవకాశం ఉంది.