కిషన్ రెడ్డికి ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ ఇన్‌క్రెడిబుల్ ఐఎన్‌సీ లీడర్‌షిప్ అవార్డు’
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ జి.కిషన్ రెడ్డిని ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ ఇన్‌క్రెడిబుల్ ఐఎన్‌సీ లీడర్‌షిప్ అవార్డు’ వరించింది. భారత్-అమెరికాల మధ్య వాణిజ్యం, వ్యాపారం, పీపుల్-టు-పీపుల్ ఎక్స్‌చేంజ్ కార్యక్రమాలు నిర్వహించే.. ‘యూఎస్ ఇండియా SME కౌన్సిల్’ సంస్థ ఈ అవార్డును కేంద్రమంత్రికి అందజేసింది. భారతదేశపు ఘనమైన సంస్కృతిని ప్రోత్సహించడంతోపాటు పర్యాటకాభివృద్ధికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన కృషికి గానూ.. అమెరికాలోని మేరీలాండ్ స్టేట్ నుంచి వచ్చిన పలువురు ప్రముఖులు ఈ అవార్డును కేంద్రమంత్రికి శనివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) అందజేశారు.
ఢిల్లీకి సాయం చేస్తా.. సీఎంగా తన బాధ్యతలు నిర్వర్తించడం లేదు..!
ఢిల్లీలో వరదల విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల గురించి ఆలోచించాలన్నారు. ఒక సీఎంగా ఉండి తన బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారని విమర్శించారు. ఢిల్లీకి తాము పూర్తి సాయం చేస్తామని అన్నారు. ఢిల్లీలోని పలు ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్బంధంలో ఉన్నాయని హర్యానా సీఎం ఆరోపించారు. హర్యానా నుంచి అందుతున్న నీటికి కేజ్రీవాల్ ప్రభుత్వం ఇంతవరకు ఏమీ చెల్లించలేదన్నారు. ఢిల్లీ ప్రజలతో తాము ఉన్నామన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ విదూషకులలా మాట్లాడటం సరికాదన్నారు ఆయన.
వాలంటీర్లపై ప్రతిపక్షాలు చేస్తున్న విద్వేష ప్రచారాన్ని తిప్పికొట్టాలి
ఎన్నికలకు మరో 9 నెలల సమయమే ఉన్న నేపథ్యంలో.. వైసీపీ ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. ఎలాంటి కార్యకలాపాలు చేపట్టాలి? ప్రజల్లో వైసీపీని తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలేంటి? అనే విషయాలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే.. ఆదివారం పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, పార్టీ పరిశీలకులు, జేసీఎస్ కో-ఆర్డినేటర్లతో ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో 9 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని, పార్టీకి ప్రతిరోజూ కీలకమేనని, ఏమరుపాటు పనికి రాదని సూచించారు. వైసీపీకి 175కి 175 స్థానాలు గెలుచుకునే వాతావరణం ఉందన్నారు.
బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం.. హాజరుకానున్న ముఖ్య పార్టీ నేతలు..!
బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే.. ఒక్కొక్కటిగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కగూటికి చేరుతున్నాయి. బీజేపీని దెబ్బకొట్టేందుకు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే బీహార్ సీఎం నితీశ్ కుమార్ అధ్యక్షతన ఓసారి ప్రతిపక్షాలు సమావేశమయ్యాయి. ఈ సమావేశానికి 15 మంది ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. మరోసారి సమావేశమయ్యేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యారు. రేపటి నుంచి (జులై 17) రెండురోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం జరగనుంది.
పవన్, చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా.. సీఎం జగన్‌ను ఏమి చేయలేరు
పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి ఎన్ని కుట్రలు పన్నినా.. సీఎం జగన్‌ను ఏమీ చేయలేరని మాజీమంత్రి ఆళ్లనాని చెప్పారు. రాష్ట్రంలో రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని.. జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఏలూరులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ లబ్ది కోసమే వాలంటీర్స్‌పై పవన్ కళ్యాణ్, చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఈ విమర్శల వెనుక కుట్రకోణం దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. వలంటీర్ల వ్యవస్థపై వాళ్లు విషం చిమ్ముతున్నారని.. తల్లిదండ్రులు సైతం బాధపడే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వృద్ధులు, వితంతువులకు ఉదయాన్నే ఎన్నో సేవలు అందించే వాలంటీర్స్.. మహిళల అక్రమ రవాణ కావడానికి కారణమని నీచమైన ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాతబస్తీలో మెట్రో… సన్నాహక పనులను ప్రారంభించిన హెచ్‌ఎంఆర్‌ఎల్
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు పాతబస్తీలో మెట్రో రైలు పనులు చేపట్టేందుకు హెచ్‌ఎంఆర్‌ఎల్ సన్నాహక పనులను ప్రారంభించింది. పాత నగరంలో 5.5కి.మీ బ్యాలెన్స్ మెట్రో అలైన్‌మెంట్ MGBS నుండి దారుల్షిఫా జంక్షన్ – పురానీ హవేలీ – ఇత్తెబార్ చౌక్ – అలీజాకోట్ల – మీర్ మోమిన్ దైరా – హరిబౌలి – శాలిబండ – శంషీర్‌గంజ్ మరియు అలియాబాద్ మీదుగా ఫలక్‌నుమా వరకు ఉంటుంది. ఈ మెట్రో రైల్ మార్గం లో 5 స్టేషన్లు – సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్‌గంజ్ మరియు ఫలక్‌నుమా ఉంటాయి. మెట్రో స్టేషన్లు సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్‌లకు 500 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, ఈ రెండు స్టేషన్‌లకు నగరంలో ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా వాటి పేరు పెట్టడం జరిగిందని HMRL MD NVS రెడ్డి తెలిపారు.
18 మంది బాలికలపై వేధింపులు.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
మహారాష్ట్రలోని పూణెలో వరుస వేధింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అనూప్ వానీగా గుర్తించారు. లిఫ్ట్ ఇస్తానని చెప్పి అమ్మాయిలను వేధించేవాడని పోలీసులు తెలిపారు. దాదాపు 18 మంది బాలికలను వేధించాడని వారు పేర్కొన్నారు. నిందితుడు పూణేలోని శనివారం పేటలో నివసిస్తుంటాడని.. వేధింపులు ఎదుర్కొన అమ్మాయిల్లో.. ఓ అమ్మాయి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో నిందితుడు అనూప్ వానీని పోలీసులు అరెస్టు చేశారు. బాలిక ఫిర్యాదు మేరకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు అనూప్ వానీ రోజూ అమ్మాయిలను వేధించేవాడని పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా విచారించగా.. అతను మతిస్థిమితం కోల్పోయినట్లు తెలిసింది. నిందితుడు అనూప్ వానీ.. బాలికలను వేధించడానికి ఓ ప్లాన్ వేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు.
ప్రభుత్వ ఆఫర్.. అక్కడ సగం రేటుకే టమోటాలు..!
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జనాలు ఇప్పుడు సగం ధరకే టమోటాలు పొందనున్నారు. వారికి మొబైల్ వ్యాన్‌ల ద్వారా ఈ సదుపాయం అందించింది అక్కడి ప్రభుత్వం. లక్నో మేయర్ సుష్మా ఖార్క్వాల్ అధ్యక్షతన ఈ కార్యక్రమం ప్రారంభమైంది. భారత ప్రభుత్వ సహకారంతో నేషనల్ కన్స్యూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సిసిఎఫ్‌ఐ) ద్వారా.. లక్నోలోని 11 చోట్ల టమాటోలను మొబైల్ వ్యాన్‌లలో కిలో రూ.80కి ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. అయితే ఒక వ్యక్తి రోజుకు 2 కిలోల టమోటాలు మాత్రమే కొనుగోలు చేయాలి.
బీసీ కుల గణనపై కేంద్రానికి చీమ కుట్టినట్లు కూడా లేదు
బీసీ కుల గణనపై కేంద్రానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో బీసీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. బీసీ జన గణన కోసం సీఎం జగన్ ప్రయత్నం చేస్తే, హైకోర్టు స్టే విధించిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు విధించిన పరిమితి మేరకు బీసీలకు సీఎం రిజర్వేషన్లు ఇచ్చారన్నారు. స్థానిక సంస్థల్లో కూడా జగన్ రిజర్వేషన్లు ఇచ్చారని తెలిపారు. బీసీ కుల గణన కోసం జరిపే పోరాటానికి మల్లాడి నాయకత్వం వహించాలని కోరారు. సత్తా ఉన్న ధీరుడు, వీరుడు మల్లాడి.. కుర్చీలు కదిలిపోయేలా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానికి కుతూహలం ఉన్నా.. వెనుకున్న వారు చేయనివ్వరని ఆరోపించారు. కుల గణన కోసం ఉద్యమం చేయాలని చెప్పారు. బీసీ గణనపై కేంద్రం స్పందించడం లేదని మండిపడ్డారు. ఈ విషయం చెప్పడానికి తాను సిగ్గు పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
రేపు తిరుపతికి పవన్.. అంజు యాదవ్‌పై ఎస్పీకి ఫిర్యాదు
తిరుపతిలోని శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తపై చెయ్యి చేసుకున్న సీఐ అంజు యాదవ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఖాకీ దుస్తుల్లో హుందాగా వ్యవహరించాల్సిన ఆమె.. వింతగా ప్రవర్తిస్తూ ఓ వ్యక్తిపై చెయ్యి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో.. ఈమధ్యకాలంలో ఆమె ఇంటరాగేషన్ చేసిన వీడియోలు సైతం బయటకొచ్చాయి. అవి నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఆమె చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ నేరుగా జనసేనాధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నారు.
మానవత్వం చాటుకున్న మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ గొప్ప మానవత్వం చాటుకున్నారు. జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన వాహనంలో ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. మంత్రి కేటీఆర్ ఆదివారం జగిత్యాల జిల్లాలో జరిగిన సభను ముగించుకుని సాయంత్రం హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో చేగుంట మండలం జాతీయ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదం లో గాయపడి ఇబ్బంది పడుతున్న బాధితులను చూసి మంత్రి కారు దిగి వారిని పరామర్శించారు. అనంతరం తన కాన్వాయిలో ఉన్న మరో వాహనంలో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మంత్రి చూపిన ఔదార్యంతో స్థానికులు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అయితే క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియరాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంతో బిజీగా ఉండే మంత్రి కేటీఆర్ ఆపదలో స్పందించిన తీరు అందరి ప్రశంసలు పొందుతుంది.
