NTV Telugu Site icon

Top Headines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

హైదరాబాద్‌ లో దొంగల హల్ చల్‌.. రూ.35 లక్షలు దోపిడీ..

హైదరాబాద్‌ లో దొంగలు హల్‌ చల్ చేస్తున్నారు. నగరంలో దారి దోపిడీ దొంగల ముఠా అమాయకులను హడలెత్తిస్తున్నారు. వ్యాపారస్తులే టార్గెల్‌ చేస్తూ ప్రజలను భయాభ్రాంతులకు గురిచేస్తున్నారు. రాత్రి ఒంటరి వ్యక్తులే టార్గెట్‌ చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా ఓ వ్యాపారి వద్ద నుంచి సుమారు రూ.35 లక్షలు దోచుకుని వెళ్లిన ఘటన గుడిమల్కాపూర్‌ లో సంచలనంగా మారింది. హైదరాబాద్‌ గుడిమల్కాపూర్ పీఎస్ పరిధిలోని తిబర్మల్ జ్యువెలర్స్ లో శ్రీకాంత్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజూ లాగానే బంజారాహిల్స్‌ లోని దుకాణం మూసి కార్మికుడితో కలిసి ద్విచక్ర వాహనంపై బంజారాహిల్స్‌ నుంచి అత్తాపూర్‌ వైపు శ్రీకాంత్ బయలుదేరాడు. రేతి బౌలి ఎక్స్ రోడ్‌లోని పిల్లర్ నంబర్ 28 సమీపంలోని ఓ పాన్‌ షాప్‌ వద్ద పాన్‌ కొనడానికి ఆగాడు. అయితే అక్కడకు హెల్మెట్ ధరించి పల్సర్ బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిని శ్రీకాంత్‌ పట్టించుకోలేదు. అయితే శ్రీకాంత్‌ చేతిలో వున్న బ్యాగును ఆ ఇద్దరు వ్యక్తులు లాక్కునే ప్రయత్నం చేశారు. శ్రీకాంత్‌ తన వద్ద వున్న బ్యాగును ఇచ్చేందు నిరాకరించాడు.

ఇచ్చిన హామీ మేరకు రామగుండం కొత్త పవర్ ప్లాంట్..

ఇచ్చిన హామీ మేరకు రామగుండం పవర్ ప్లాంట్ స్థలంలో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు వచ్చామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కరీంనగర్ జిల్లా రామగుండం ధర్మల్ బీ పవర్ ప్లాంట్ ను మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. పవర్ ప్లాంట్ గురించి అధికారులు మంత్రులకు వివరించారు. నేను పాదయాత్ర ఇక్కడ చేసినప్పుడు ప్లాంట్ ని చూసానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే పవర్ ప్లాంట్ ని పునః ప్రారంభం చేస్తానని మాట ఇచ్చామన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఈ పవర్ ప్లాంట్ స్థలంలో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు వచ్చామని తెలిపారు. సీఎం రేవంత్ తో చర్చించామన్నారు.

ఏదో మూడ్‌లో ఉండి తిట్టా.. త్రివిక్రమ్‌కు క్షమాపణలు చెబుతున్నా: బండ్ల గణేశ్‌

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ క్షమాపణలు చెప్పారు. ‘భీమానాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో ఎవరో ఒక అభిమాని ఫోన్ చేస్తే ఏదో మూడ్‌లో ఉండి నోరు జారానని, చాలా తప్పు చేశానని తెలిపారు. ‘గబ్బర్‌ సింగ్‌’ సినిమా తనకు రావడానికి కారణం త్రివిక్రమ్‌ అని తెలిపారు. పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌ అవకాశం ఇచ్చి తన జీవితాన్ని మార్చారని బండ్ల గణేష్ పేర్కొన్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

భీమానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో బండ్ల గణేష్ ఆడియోలు నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. ఓ అభిమాని మీరు ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కి వస్తున్నారా? లేదా? అని అడిగితే.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తనను ఈవెంట్‌కు రానివ్వడం లేదని బండ్ల గణేష్ అన్నారు. ఆ వ్యాఖ్యలు చేసింది తాను కాదన్న బండ్ల.. ఆపై ఒప్పేసుకుని క్షమాపణలు చెప్పారు. పవన్‌ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్‌ 2న గబ్బర్ సింగ్‌ రీ-రిలీజ్‌ కానుంది. ఈనేపథ్యంలో డైరెక్టర్ హరీశ్‌ శంకర్‌, చిత్ర నిర్మాత బండ్ల గణేశ్‌ మీడియాతో నేడు ముచ్చటించారు. ఓ ఫిల్మ్ రిపోర్టర్ తీన్ మార్ చిత్రం గురించి అడగగా.. గబ్బర్‌ సింగ్‌ సినిమా అవకాశం ఎలా వచ్చిందో చెబుతూ త్రివిక్రమ్‌కు క్షమాపణలు చెప్పారు.

చిత్తూరులో ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్..

తాజాగా చిత్తూరు నగరంలో ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్ కలకలం సృష్టించింది. కాలేజీకి వెళ్తున్న హేమంత్, మనోజ్ అనే ఇద్దరు విద్యార్థులను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసారు. నిన్న రాత్రి బంగారు పాలెం మండలం మిట్టపల్లిలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో రెండు గ్రామస్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దింతో పరస్పరం గొడవ పడ్డ మిట్టపల్లి, వరిగపల్లె గ్రామస్తుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. ఇకపోతే., గత రాత్రి జరిగిన గొడవల నేపథ్యంలో ఈ ఉదయం ఇద్దరూ కాలేజీ విద్యార్థుల కిడ్నాప్ అయినట్లు గుర్తించారు గ్రామస్థులు. ఈ నేపథ్యంలో వరిగపల్లెకు చెందిన 8 మంది మా పిల్లలను కిడ్నాప్ చేశారని మిట్టపల్లె గ్రామస్తులు అంటున్నారు. ఈ సందర్బంగా చిత్తూరు – బెంగళూరు రహదారిపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు మిట్టపల్లి గ్రామస్తులు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు వివరాలు తెలుసుకున్నారు. సదరు కిడ్నాప్ విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

జెండా ఊపి 3 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించిన మోడీ..

‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ కింద వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీరట్ – లక్నో, మదురై – బెంగళూరు, చెన్నై – నాగర్‌ కోయిల్‌ లకు 3 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. దేశంలోని 280 జిల్లాలను కలుపుతున్న 100కు పైగా సెమీ హైస్పీడ్ రైళ్లలో ఈ కొత్త రైళ్లు చేరనున్నాయి. ఈ రైళ్ల నిర్వహణ ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోడీ మాట్లాడుతూ.. రైళ్ల విస్తరణ అభివృద్ధి చెందిన భారతదేశం గురించి మన దృష్టికి నెలకొల్పుతోంది. ఈ 3 కొత్త వందేభారత్ రైళ్లు ముఖ్యమైన, చారిత్రక నగరాలను కలుపుతాయి. ఆలయ నగరమైన మధురై ఇప్పుడు బెంగళూరుకు అనుసంధానించబడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

గణేష్ మండపాలకయ్యే కరెంట్ ఖర్చంతా నేనే చెల్లిస్తా.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

గణేష్ మండపాలకయ్యే కరెంట్ ఖర్చంతా నేనే చెల్లిస్తా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై కరీంనగర్ సీపీ అభిషేక్ మొహంతి ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సమీక్షలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గణేశ్ మండప నిర్వాకులారా…. నవరాత్రి దీక్షలు చేపట్టాలని పిలుపు నిచ్చారు. నేను ఉదాహరణ….30 ఏళ్లుగా నిత్యం భగవంతుడిని పూజిస్తున్నా అన్నారు. గణేష్ మండపాలకయ్యే కరెంట్ ఖర్చంతా నేనే చెల్లిస్తా అని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే గణేష్ మండపాలకయ్యే కరెంట్ కేవలం కీరంనగర్ వాసులకు మాత్రమే అని తెలుస్తుంది. మండప నిర్వాహకులను విద్యుత్ శాఖ ఇబ్బంది పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. నిమజ్జనం రోజే కాకుండా 9 రోజులపాటు కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. హెల్త్ డిపార్ట్ మెంట్ ప్రత్యేకంగాట అంబులెన్స్ లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రశాంతంగా ఉత్సవాలు జరుపుకుందామని తెలిపారు. కరీంనగర్ ను ఆదర్శంగా నిలుపుదామన్నారు.

ప్రతిపక్షాల మీద విమర్శ చేయడం తప్ప పాలన మీద దృష్టి లేదు

రంగారెడ్డి జిల్లా పాలమాకుల గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ఎందుకు స్పందించరని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని, ప్రతిపక్షాల మీద విమర్శ చేయడం తప్ప పాలన మీద దృష్టి లేదని ఆయన విమర్శించారు. చీమ కుట్టినట్లు అయినా మీకు లేదు. సిగ్గుచేటని, గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే పరిస్థితి అన్నారు హరీష్‌ రావు. ప్రభుత్వం మీద నమ్మకం కొద్ది గురుకులాల్లో జాయిన్ చేస్తే ఏం చేస్తున్నారని, ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. నువ్వు పూర్తిగా విఫలం అయ్యావంటూ హరీష్‌ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లలు రోడ్డు మీదకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తుంటే బాధ తెల్సుకోవాలని వచ్చానని, దుఃఖాన్ని ఆపుకోలేక పోతున్నారు. భయంతో వణికిపోతున్నారు. కర్రలు విరిగేలా కొడుతున్నారని ఏడుస్తున్నారన్నారు హరీష్‌ రావు. అన్నంలో, పప్పులో పురుగులు అంటే తినేసి తినండి అంటున్నారు అని బాధపడుతున్నారని, ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు. రెండో జత ఇవ్వలేదు అంటున్నారన్నారు హరీష్‌ రావు.

అక్కడ ఫ్లాట్స్‌ బుకింగ్స్‌ కాన్సిల్‌ చేసుకుంటున్న కస్టమర్లు..?

ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) వ్యవహారం హాట్‌ టాపిక్‌గా నడుస్తోంది. ఇటీవల ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చడంతో ఒక్కసారిగా అందరి దృష్టి దీనిపైనే ఉంది. అంతేకాకుండా.. రోజు రోజుకు హైడ్రా స్పీడ్‌ పెంచి అక్రమ కట్టడాలను కూల్చేందుకు దూకుడుగా వ్యవహరిస్తోంది. అయితే.. హైదరాబాద్‌ ప్రాంతాల్లో ఉన్న చెరువులను అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాటిని కూల్చివేస్తున్న హైడ్రా తీరుతో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఫ్లాట్స్‌ బుకింగ్స్‌ చేసుకున్నవారు అప్రమత్తమయ్యారు. అయితే.. ఈ నేపథ్యంలోనే అమీన్‌పూర్‌ చెరువు బఫర్‌ జోన్‌లో నిర్మించిన భవనాలను సైతం హైడ్రా కూల్చేవేసే ఆలోచనలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ భవనాల్లో ఇప్పటికే ఫ్లాట్స్‌ బుకింగ్స్‌ చేసుకున్న కస్టమర్లు తమ తమ బుకింగ్స్‌ కాన్సిల్‌ చేసుకొని వారి డబ్బులు తిరిగి తీసుకునేందుకు యాజమాన్యాలతో చర్చలు జరుపుతున్నారు తెలుస్తోంది. ఇదే కాకుండా.. ప్రస్తుతం ఫ్లాట్స్‌ బుకింగ్స్‌ చేసుకున్న వారు సైతం తమ భవనాల్లు బఫర్‌ జోన్‌లో ఉన్నాయో లేదోనని ఆరా తీయడం ప్రారంభించారు. ఒకవేళ బఫర్‌ జోన్‌లో ఉంటే తమ బుకింగ్స్‌ కాన్సిల్‌ చేసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం.

అసలైన సమస్యలను పక్కదోవ పట్టించాలనే ప్రయత్నం

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, అవినీతి, అప్పుల్లో కూరుకు పోయి దివాలా తీస్తున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌ అన్నారు. ఉచితాలు, హామీలు గ్యారంటీల పేరుతో ఎన్నికలకు ముందు చెప్పి ఎన్నికలయ్యాక ప్రజల గోస పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ కటాకట్ కటాకట్ డబ్బులు వేస్తామని చెప్పారని, ఇప్పుడు తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ఫటాఫట్ దివాలా తీశాయని ఆయన సెటైర్లు వేశారు. తెలంగాణ ఢిల్లీకి ఎటీఎంగా మార్చారని, ప్రజల్ని మభ్య పెట్టేందుకు రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రుణమాఫీ చేయలేదని, తులం బంగారం లేదని, నిరుద్యోగ భృతి లేదని ఆయన వ్యాఖ్యానించారు. హైడ్రా ను తెరపైకి తెచ్చారని, హైదారాబాద్ లో చెరువులను పరి రక్షించాల్సిందే.. కానీ ఈ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు ఎంపీ లక్ష్మణ్‌. కబ్జాలకు సంబంధించిన వివరాలు బయట పెట్టాలని, ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి సార‌ధ్యంలో జాన‌ప‌ద‌ కళారూపాలకు పునర్జీవం

తెలంగాణలో అంతరించిపోతున్న జాన‌ప‌ద‌ కళారూపాలకు పునర్జీవం తీసుకువ‌చ్చేందుకు… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార‌ధ్యంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని… రాష్ట్ర ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ఱారావు అన్నారు. కళారంగానికి పెద్దపీట వేస్తుంద‌ని.కవులు, కళాకారులు, ర‌చయిత‌ల‌కు సముచితస్థానం కల్పిస్తుంద‌ని తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వం భాషా సంస్కృతిక శాఖ, తెలంగాణ రాష్ట్ర జాన‌ప‌ద క‌ళాకారుల సంఘం ఆద్వ‌ర్యంలో. ర‌వీంద్ర‌భార‌తిలో నిర్వ‌హించిన‌ ప్ర‌పంచ జాన‌ప‌ద దినోత్స‌వ వేడుక‌ల‌కు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ముఖ్య అతిధిగా హాజరై. ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీ రమణాచారితో కలిసి జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. టీవీలు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్ల లాంటి ప్రసార మాధ్యమాలు రాకముందు. కథలు, నాటికలు వేసే జాన‌ప‌ద కళాకారులకు ప్రత్యేక గుర్తింపు ఉండేదని. దీంతో కష్టానికి తగ్గ ఫలితం పొందేవారని మంత్రి పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం అరచేతిలో ప్రపంచాన్ని చూసే రోజులొచ్చాక. కళాకారుల పరిస్థితి దయనీయంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కళాకారుల వద్ద ఉన్న ప్రతిభను మాటల్లో చెప్పుకోవడానికి తప్ప. ప్రదర్శిస్తే చూసేవారు కరువయ్యారన్నారు. ఒక దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే. ప్రాచీన వారసత్వాన్ని భావితరాలకు అందించే కళల‌ను, కళాకారుల‌ను కాపాడుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంతో పాటు స‌మాజంపై ఉంద‌ని తెలిపారు.