Maharashtra Woman Getting Tomatoes As A Birthday Gift: మధ్యతరగతి కుటుంబ వంట గదిలో ‘టమోటా’దే రాజ్యం. ప్రతి వంటలోనూ టమోటా హస్తం ఉండాల్సిందే. అప్పుడే ఆ కూరకు రుచి వస్తుంది. టమోటా కూర, టమోటా రసం, టమోటా చట్నీ, టమోటా జ్యూస్.. ఇందులో ఏదో ఒకటి ప్రతి ఇంట్లో ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఏ వంటకంలో అయినా టమాట ముక్కకి వాటా ఉంటుంది. కిలో టమోటా రూ. 20 లేదా 30కి దొరకడం కూడా విరివిగా వాడడానికి ఓ కారణం. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. టమోటాలు అంటేనే జనాలు భయపడిపోతున్నారు. అందుకు కారణం టమోటాల ధరలు అమాంతం పెరగడమే.
దేశవ్యాప్తంగా కొద్ది రోజులుగా టమోటా ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. కొన్ని చోట్ల కిలో టమోటా ధర రూ. 150 ఉంటే.. మరికొన్ని చోట్ల రూ. 200 కూడా ఉంది. ఉత్తరాఖండ్‌లోని పలు జిల్లాల్లో అయితే కిలో టమోటా 250 కూడా ఉంది. చిల్లర దుకాణాల్లో ఈ ధర మరింత ఎక్కువగా ఉంది. ఆకాశాన్నంటుతున్న టమాటాల ధరలు సామాన్య ప్రజలను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా సగటు జీవి తన బాధను గుండెల్లో దాచుకొని.. మీమ్స్, ఫన్నీ ఘటనలతో తెగ నవ్వుకుంటున్నారు.
మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో కిలో టమోటా ధర రూ. 140గా ఉంది. పుట్టినరోజు వేడుక జరుపుకొన్న ఓ మహిళకు ఆమె బంధువులు ఏకంగా 4 కిలోల టమాటాలు కానుకగా ఇచ్చి.. ‘టమాటా ధరల మాదిరి ఆకాశమంత ఎదగాలి’ అని దీవించారు. కల్యాణ్ పట్టణంలోని కొచాడి ప్రాంతంలో నివసిస్తున్న సోనాల్ బోర్సే ఆదివారం పుట్టినరోజు జరుపుకున్నారు. సోదరుడు, బంధువులు కానుకగా ఇచ్చిన టమాటాలను చుట్టూ పెట్టుకొని ఆమె కేక్ కట్ చేశారు. ఇందుకు సంబందించిన వీడియో వైరల్‌గా మారింది.
Also Read: Gold Rate Today: మగువలకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
Also Read: Off The Record: ఆ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌లో ముదురుతున్న జగడం..