Site icon NTV Telugu

Tomato Prices: మొన్నటివరకూ భారీ ధర…ఇప్పుడేమో నేలచూపులు

Tomato

Tomato

టమోటా.. నిన్నమొన్నటివరకూ చాలా ఖరీదైన కూరగాయ. కానీ దాని వైభవం కొంతకాలమే అని తేలిపోయింది. 80.. 60.. 40.. 20 ఇలా ధరలు పడిపోతున్నాయి. మరోసారి టమాటా ధరలు నేల చూపులు చూస్తున్నాయి.ధరల పతనం చిత్తూరు జిల్లా రైతుల్ని కన్నీళ్లు పెట్టిస్తోంది. కూలీలు, రవాణా ఖర్చుల మోతతో అష్టకష్టాలు పడి సరుకు మార్కెట్‌కు చేర్చినా చివరకు దమ్మిడీ కూడా దక్కడం లేదు. రైతులు ఆశగా ప్రభుత్వం వైపు చూస్తున్నారు. ప్రస్తుతం మదనపల్లె మార్కెట్లో కేజి టమోటా ధర 15 రూపాయలకు పడిపోయింది.

రైతులు తెచ్చే సరకు నిగనిగలాడుతూ.. కనులకు ఇంపుగా వుంటుంది. చూడగానే కొనేట్టుగా ఉంటూ దేశంలోనే టమోటా సాగులో అగ్రగామిగా నిలిచే మదనపల్లె మార్కెట్ లో రైతులు ప్రస్తుతం ధరలు లేక అల్లాడుతున్నారు.గత మూడేళ్ళుగా టమోటా సాగు చేసి తీవ్రంగా నష్టపోతున్నారు రైతులు. ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఆశగా అని‌ ఎదురు చూస్తున్నారు. మదనపల్లె డివిజన్లో 1700 హెక్టార్లలో రైతులు టమోటా సాగు చేస్తున్నారు. సీజన్ తో సంబంధం లేకుండా 12 నెలలు ఇక్కడ టమోటా సాగు చేస్తున్నారు. మదనపల్లె మార్కెట్ నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, కోయంబత్తూరు, ఉత్తారాది రాష్ట్రాలైన డిల్లీ, పంజాబ్, మహారాష్ట్ర మార్కెట్లు టమోటా ఎగుమతి అవుతోంది.‌

Viral News: అతనికి 61.. ఆమెకి 18.. ఆయనే బెస్ట్ అంటూ కితాబు

నిత్యం 300 నుంచి 1000 టన్నుల వరకు టమోటా ఎగుమతి చేస్తారు. కాగా గత రెండు వారాల‌ క్రితం‌ టమోటా కిలో 70 నుంచి 80 వరకు ధర‌ పలికింది. కాగా బయట ప్రాంతాలలో కూడా టమోటా సాగు అవుతుండటంతో మదనపల్లె మార్కెట్‌లో ధరలు పడిపోతున్నాయి. రెండు వారాలుగా నాణ్యమైన టమోటా కిలో 15పలుకుతుండగా నాణ్యత లేని రెండో రకం టమోటా కిలో 10కి పడిపోయింది.ఉన్న పంటని ఏం చేసుకోవాలో తెలియక అయోమయంలో పడుతున్నారు రైతులు. గత వారం రోజులుగా రోజుకు 1500 టన్నుల వరకు టమోటా మార్కెట్ కు వచ్చింది.

అయితే మార్కెట్ కు టమోటా విక్రయానికి తీసుకొచ్చిన రైతులకు తిరుగు ప్రయాణం ఛార్జీలకు కూడా రావడం లేదంటే టమోటా రైతులు ఎంత నష్టపోతున్నారో అర్థం చేసుకోవచ్చు..గత రెండెళ్ళుగా కరోనా కాటు వేస్తే…ఈ ఏడాది అయినా ఓ నాలుగు డబ్బులు సంపాదించుకుందామని ఆశ పడ్డ టమోటా రైతుల ఆశలను అవిరిచేశాయి మార్కెట్ ధరలు. ఇక ఆరుగాలం శ్రమించి, పండించిన పంటను మార్కెట్ కు తీసుకు వస్తున్న రైతుకు ఇక్కడ తీవ్ర నిరాశ ఎదురవుతోంది. టమోటా కొనుగోలుకు బయటి వ్యాపారులు రావడం లేదు. కష్టపడి పండించిన పంటను ఎవ్వరూ కొనడానికి రాకపోవడంతో టమోటా రైతులకు కన్నీళ్లే మిగులుతుంది. ఎంతో వ్యయప్రయాసలు పడి మార్కెట్టుకు తీసుకొస్తున్న టమోటాను… చివరకు ఏమి చేయాలో తెలియక అక్కడే పారబోసి ఉసూరుమని రైతులు వెనుతిరుగుతున్నారు. కూలీ, రవాణా ఖర్చులూ దండగేనంటూ.. చాలామంది రైతులు పొలాల్లోనే పంటను వదిలేయాల్సిన నిస్సహాయత నెలకొంది. పంట బాగా బాగా రావడంతో రికార్డు స్ధాయిలో పంటను రైతులు మదనపల్లెకీ తీసుకువస్తున్నారు. పోటీ కారణంగా ధరలు పడిపోతున్నాయి. ప్రభుత్వమే టమోటాలు కొని తమను ఆదుకోవాలని కోరుతున్నారు టమోటా రైతులు.

Texas Shooting: టెక్సాస్‌లో మళ్లీ పేలిన గన్.. ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు

Exit mobile version