Tomato Price Today in Hyderabad: పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. చాలీచాలని జీతాలతో జీవనం ఎలా సాగించాలో తెలియక చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో నిత్యవసర వస్తువులకు పోటీగా కూరయాగాయలు కూడా వచ్చి చేరాయి. గత కొన్ని నెలలుగా కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా టమాటా ధరలు. కొన్ని రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టిన టమాట ధరలు.. మళ్లీ పెరిగాయి.
కొన్ని రోజుల క్రితం టామాటా ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. కిలో టామాటా ధర రూ.80 నుంచి రూ.100 వరకు పలికింది. టామాటా ధర ఇటీవలి కాస్త తగ్గు ముఖం పట్టింది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.40-50కి లభించింది. హమ్మయ్య టామాటా ధర తగ్గిందని సామాన్యులు సంతోషించే లోపే మరోసారి షాక్ ఇచ్చాయి. ప్రస్తుతం కిలో టామాటా రూ.60-70కి చేరింది. కొన్ని బహిరంగ మార్కెట్‌లో అయితే ఏకంగా రూ.100కు కూడా అమ్ముతున్నారు. కిలో రూ.50 ఉంటే రూ.70కి అమ్ముతున్నారని ప్రశ్నిస్తే.. పుచ్చులు, మచ్చలున్న టమాటాలు తీసుకోండి అని అంటున్నారని జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురి పరిస్థితి విషమం!
టామాటా ధర పెరగడానికి కారణం దిగుబడి తగ్గడమే. ప్రతిరోజూ నగరంలో రైతుబజార్లకు 6వేల క్వింటాళ్ల టమాటాలు వచ్చేవి. ప్రస్తుతం 2.5 నుంచి 3వేల క్వింటాళ్లు మాత్రమే వస్తోంది. తొలకరి పంట ఇంకా చేతికి రాలేదు. సెప్టెంబరు వరకు దిగుబడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో.. ధరలు ఇలాగే ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం వర్షాల కారణంగా మరింత ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. హైదరాబాద్ శివార్లు సహా మదనపల్లి, రాజస్థాన్ నుంచి వచ్చే టమాటా 60 శాతం తగ్గిపోవడంతో ధరలు పెరిగాయని మార్కెట్ అధికారులు అంటున్నారు.