NTV Telugu Site icon

Andhra Pradesh Crime: టమోటా రైతు హత్య.. వారి పనేనా..?

Farmer

Farmer

Andhra Pradesh Crime: టమాట ధరలు ఆకాశాన్నంటిన వేళ… రైతుల దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయన్న అనుమానంతో కొందరు దుండగులు దొంగతనానికి పాల్పడుతున్నారు. అడ్డొస్తే అంతమొందించడానికి కూడా వెనకాడట్లేదు. అన్నమయ్య జిల్లాలో కూడా అలాంటి ఘటనే జరిగింది. టమాట అమ్మిన డబ్బులు ఉంటాయన్న అనుమానంతో ఓ రైతును అటకాయించిన దుండగులు… దారుణంగా హతమార్చారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మండలం బోడిమల్లదిన్నెకు చెందిన రైతు నారెం రాజశేఖర్ రెడ్డి… తనకున్న పొలంలో టమాటా పంట సాగు చేస్తున్నాడు. రాజశేఖర్‌రెడ్డికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.. వారిద్దరికీ వివాహం కావడంతో బెంగళూరులో నివాసం ఉంటున్నారు. టమాటాలకు భారీగా డిమాండ్ పెరగడంతో రాజశేఖర్ తన భార్యతో కలిసి పొలంలోనే నివాసముంటున్నాడు. భార్యాభర్తలిద్దరు పొలంలోనే ఉంటూ పంటను కాపాడుకుంటున్నారు. టమోటా ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో… వీరు సాగు చేసిన ఎకరా పొలంలో పండిన పంటకు మంచి రేటు దక్కింది. రాజశేఖర్‌రెడ్డి ఇప్పటికే ఐదు కోతలు కోసి మార్కెట్‌లో విక్రయించారు. వారం, పదిరోజులుగా రాజశేఖరరెడ్డి తన పొలంలోని టమోటాలను కోసి మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్ముకుని తిరిగి వస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 20 లక్షల నుంచి 25 లక్షలు ఆయనకు వచ్చినట్టు సమాచారం.

మంగళవారం రాత్రి మార్కెట్‌లో టమోటా అమ్మేశాక… ఇంటికొచ్చిన రాజశేఖర్‌ రెడ్డి రాత్రి పాలు పోసేందుకు మదనపల్లె వెళ్లాడు. అదే సమయంలో… కొందరు గుర్తు తెలియని వ్యక్తులు… రాజశేఖర్‌ రెడ్డి ఇంటికి వెళ్లారు. అన్న లేడా అని ఆయన భార్య జ్యోతిని అడిగారు. ఎందుకని ఆమె అడగ్గా, టమోటాలు కావాలని వచ్చామని చెప్పారు. మదనపల్లె డిపోకు పాలు పోయడానికి వెళ్లాడని ఆమె బదులిచ్చిందామె. దాంతో వారు వెళ్లిపోయారు. ఆ రాత్రి ఎంతకీ రాజశేఖర్‌ రెడ్డి ఇంటికి రాలేదు. భార్య జ్యోతికి అనుమానం వచ్చి కుమార్తెలకు విషయం చెప్పింది. వారు తండ్రికి ఫోన్‌ చేశారు. రింగ్‌ అవుతున్నా లిఫ్ట్ చేయడంలేదు. దాంతో గ్రామంలోని ఫ్రెండ్స్‌, బంధువులకు విషయం చెప్పారు. అందరూ కలసి వెతకడం మొదలుపెట్టారు. మదనపల్లె రోడ్డులో కొందరు వెతుక్కుంటూ వెళ్లారు.

రోడ్డుకు కొంచెం పక్కన… ఓ చెట్టు కింద కాళ్లు, చేతులు కట్టేయడంతో పడి ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి. వెళ్లి చూడగా… అప్పటికే రాజశేఖర్‌ రెడ్డి చనిపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. అర్థరాత్రి వేళ స్పాట్‌కు చేరుకున్న పోలీసులు… హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. స్పాట్‌లో చూస్తే.. బైక్‌పై వస్తున్న రాజశేఖర్‌ రెడ్డిని ఆపి పక్కనే ఉన్న పొలంలోకి బలవంతంగా లాక్కెళ్లి కాళ్లు, చేతులు వెనక్కి కట్టేసి, మెడకు టవల్‌ చుట్టి గొంతు నులిమి చంపినట్టుగా ఉంది. రోడ్డు పక్కన రాజశేఖర్‌ రెడ్డి మృతదేహం కాళ్లు, చేతులు వెనక్కి కట్టేసి టవల్‌ బిగించి హత్య చేశారు.

రాజశేఖర్‌ రెడ్డి జేబులో టమోటాలు వ్యాపారులకు అమ్మగా తనకు రావాల్సిన డబ్బులకు సంబంధించిన చిట్టీలను పోలీసులు గుర్తించారు. డబ్బులు ఇంట్లో ఉంటే భద్రత ఉండదని… టమాటా కోతలన్నీ అయ్యాక డబ్బులు తీసుకుంటానని మండీ వ్యాపారుల దగ్గరే ఉంచినట్లు తెలుస్తోంది. జిల్లా ఎస్పీ బొడిమలదిన్నెకు వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్య కేసు దర్యాప్తు కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సెల్‌ టవర్‌ లొకేషన్‌ ఆధారంగా వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే హత్యకు టమోటా కారణం కాదనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో ఉన్న గొడవలు, కూతురు పెళ్ళి వివాదం కూడా హత్యకు దారితీసిందా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే, రాజశేఖర్‌ రెడ్డి హత్యకుముందు అతని ఇంటికి వచ్చిన వ్యక్తులే హంతకులా..? లేదంటే ఇతరులు చేశారా..? రాజశేఖర్‌ రెడ్డి ఇంటికి వారు ఎందుకు వచ్చినట్టు..? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు వెతుకుతున్నారు పోలీసులు.