NTV Telugu Site icon

Hero Nani Birthday: విలక్షణంగా ‘దసరా’ జరుపుకోనున్న నాని!

Nani

Nani

Hero Nani Birthday: వెనుక దన్నుగా స్టార్ ఫ్యామిలీ లేదు. ముందు మూటలకొద్ది ధనమూ లేదు. కేవలం తనను తాను నమ్ముకొని చిత్రసీమలో అడుగు పెట్టిన నాని, ఇప్పుడు నవతరం కథానాయకుల్లో తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు. తన ప్రతి చిత్రంలోనూ వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ వస్తున్నారు నాని. మన పక్కింటి అబ్బాయిలా ఉంటాడనీ చాలామంది అంటారు. అందుకే కాబోలు జనానికి ఇట్టే కనెక్ట్ అయ్యారు నాని. నిజానికి ఈ యేడాది అక్టోబర్ 24న ‘దసరా’ పండుగ రానుంది. కానీ, నాని మార్చి 30న తన ‘దసరా’ జరుపుకోబోతున్నారు.

నాని అసలు పేరు ఘంటా నవీన్ బాబు. 1984 ఫిబ్రవరి 24న హైదరాబాద్ లో జన్మించారు. సెయింట్ ఆల్ఫోన్సా హై స్కూల్ లో పదో తరగతి చదివిన నాని, ఎస్.ఆర్.నగర్ లోని నారాయణ కాలేజ్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. తరువాత వెస్లీ కాలేజ్ లో డిగ్రీ చదివారు. చదువుకొనే రోజుల నుంచీ నాని మనసు సినిమాలవైపు పరుగు తీసింది. మణిరత్నం సినిమాలు నానిని భలేగా ఆకర్షించేవి. ఏదో ఒక రోజు ఆయనలాగా దర్శకత్వం వహించాలని కలలు కన్నారు నాని. బాపు ‘రాధా గోపాలం’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగు పెట్టారు. నితిన్ ‘అల్లరి బుల్లోడు’కు కె.రాఘవేంద్రరావు దగ్గర, మంచు విష్ణు హీరోగా రూపొందిన “అస్త్రం, ఢీ” చిత్రాలకూ దర్శకత్వ విభాగంలో పనిచేశారు నాని. తరువాత ఓ స్నేహితురాలి సలహా మేరకు రేడియో జాకీగా పనిచేస్తున్న సమయంలోనే మోహన్ కృష్ణ ఇంద్రగంటి ‘అష్టా చెమ్మా’లో ఓ నాయకునిగా ఎంచుకున్నారు. ఆ సినిమా ఆదరణ చూరగొంది. తరువాత సినిమాల్లోనే సాగారు నాని. ఆ పై నాని హీరోగా రూపొందిన చిత్రాలలో “రైడ్, అలా మొదలైంది, పిల్ల జమీందార్” జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి.

Read Also: Faria Abdullah: చిట్టీ.. నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. పట్టుమని పేలిందా కుర్రాళ్ళ గుండె ఖల్లాసే

రాజమౌళి సినిమాలో చిన్న వేషం వేసినా చాలు అనుకొనేవారు ఎందరో ఉన్నారు. నానిలోని టాలెంట్ ను గుర్తించి తన ‘ఈగ’ చిత్రంలో ప్రధాన పాత్రనే అందించారు రాజమౌళి. ఇంకేముంది, ‘ఈగ’తో నాని స్టార్ డమ్ కూడా రివ్వున పైకి దూసుకుపోయింది. తనకు లభించిన స్టార్ డమ్ ను నిలుపుకోవడానికి నాని ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ సాగుతున్నారు.

స్టార్ హీరోగా సాగుతున్న నాని నిర్మాతగానూ కొన్ని చిత్రాలు రూపొందించారు. సదరు చిత్రాలలో తాను మాత్రం హీరోగా నటించక పోవడం విశేషం! ‘డి ఫర్ దోపిడి’ చిత్రానికి సహ నిర్మాతగా మారిన నాని, తరువాత ‘అ! చిత్రాన్నీ అదే తీరున భాగస్వామ్యంలో నిర్మించారు. ఆ తరువాత ‘హిట్: ద ఫస్ట్ కేస్’ చిత్రాన్ని విశ్వక్సేన్ హీరోగానూ, ఆ పై ‘హిట్ : ద సెకండ్ కేస్’ సినిమాను అడివి శేషుతోనూ నిర్మించి నిర్మాతగానూ విజయం సాధించారు. తన సోదరి దీప్తి ఘంటా దర్శకత్వంలో ‘మీట్ క్యూట్’ అనే ఆంథాలజీ నిర్మించారు. గత సంవత్సరం ‘అంటే సుందరానికి’ చిత్రంలో హీరోగా నటించిన నానికి, ఆ యేడాది నిరాశనే మిగిలింది. ఈ నేపథ్యంలో తాను హీరోగా నటించిన ‘దసరా’పైనే నాని ఆశలు పెట్టుకున్నారు. మార్చి 30న విడుదల కానున్న ‘దసరా’తో నాని ఏ తీరున ఆకట్టుకుంటారో చూడాలి.