Chiru – Raviteja : చిరు – రవితేజ సినిమాల టైటిల్స్ పై ఫ్యాన్స్ అసంతృప్తి.. సోషల్ మీడియాలో ట్రోల్స్

Tollywood

Tollywood

టాలీవుడ్‌లో ఒక సినిమా విజయంలో టైటిల్ పాత్ర చాలా కీలకం. మాస్ హీరోల సినిమాలకైతే ఆ పేరులోనే ఒక ‘వైబ్’ ఉండాలని అభిమానులు కోరుకుంటారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ సినిమాల గురించి వినిపిస్తున్న టైటిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ పేర్లు విన్న అభిమానులు మాత్రం “మాకొద్దు బాబోయ్..” అంటూ తలలు పట్టుకుంటున్నారు.

బాబీ దర్శకత్వంలో చిరంజీవి ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమాకు కాకాజీ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకప్పటి క్లాసిక్ సినిమాల్లోని పాత్రల ఛాయలు ఉండేలా ఈ పేరు అనుకుంటున్నారట. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ టైటిల్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి ఇమేజ్‌కు ఈ పేరు ఏమాత్రం సెట్ అవ్వదని ఏదైనా పవర్‌ఫుల్ టైటిల్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు మాస్ మహారాజా రవితేజ యువ దర్శకుడు హసిత్ గోలి కాంబినేషన్‌లో ఒక సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమాకు అక్కాయిలు బాగున్నారా’ అనే వెరైటీ టైటిల్ ప్రచారంలో ఉంది. హసిత్ గోలి గతంలో ‘రాజా రాజ చోర’ వంటి వైవిధ్యమైన టైటిల్స్‌తో ఆకట్టుకున్నారు. అయితే రవితేజ మార్కు మాస్ ఎనర్జీని కోరుకునే ఫ్యాన్స్‌కు ఈ టైటిల్ అస్సలు మింగుడు పడటం లేదు. ఇది మరీ సాఫ్ట్‌గా ఉందని కమర్షియల్ సినిమాకు ఇలాంటి పేరు పెడితే ఆ ఇంపాక్ట్ తగ్గుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కేవలం  రూమర్స్ గానే బయటకు  వచ్చిన ఈ టైటిల్స్ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. “సినిమాలో కంటెంట్ ఎలా ఉన్నా, టైటిల్ వినగానే రోమాలు నిక్కబొడుచుకోవాలి.. కానీ ఇవేం పేర్లు?” అంటూ ఒక అభిమాని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మరి అభిమానుల నుంచి వస్తున్న ఈ వ్యతిరేకతను చూసి చిత్ర యూనిట్లు తమ నిర్ణయాన్ని మార్చుకుంటాయో లేదో వేచి చూడాలి.