NTV Telugu Site icon

Chalapathi Rao Passed Away: కన్నుమూసిన.. టాలీవుడ్ బాబాయ్

Chalapati Rao

Chalapati Rao

Chalapathi Rao Passed Away: తెలుగు సినీ పరిశ్రమ ఈ ఏడాది చాలమంది గొప్ప వ్యక్తులను కోల్పోయింది. వరుస మరణాలు సంభవిస్తుండడంతో.. ఎప్పుడు ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోనని కంగారు పడుతున్నారు సినిమా పరిశ్రమ వర్గాలవారు.. ఇలా సెలబ్రెటీలు వరుసగా కన్ను మూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగి పోతున్నారు. కైకాల లాంటి గొప్ప వ్యక్తిని కోల్పోయి రెండు రోజులు కాకముందే మరో సీనియర్ నటుడు కన్నుమూయడంతో టాలీవుడ్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

తెలుగు చిత్రపరిశ్రమలో ఎంతో మంది బాబాయ్ అని ముద్దుగా పిలుచుకునే చలపతిరావు తమ్మారెడ్డి(78) హైదరాబాదులో గుండెపోటుతో తెల్లవారు జామున కన్నుమూశారు. నిండైన విగ్రహంతో విలన్ గా జడిపించి, కమెడియన్ గా కితకితలు పెట్టి, కొన్నిసార్లు సెంటిమెంట్ నూ పండించి జనాన్ని ఆకట్టుకున్నారు చలపతిరావు. అనేక ప్రేమకథా చిత్రాల్లో అమ్మాయికో, అబ్బాయికో తండ్రిగా నటించి అలరించారాయన.

Read Also: Tunisha Sharma: బాలీవుడ్‌లో విషాదం.. షూటింగ్ సెట్‌లోనే నటి ఆత్మహత్య..!

తమ్మారెడ్డి చలపతిరావు 1944 మే 8న కృష్ణాజిల్లా పామర్రు మండలం బల్లిపర్రులో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు మణియ్య, వియ్యమ్మ. చదువుకొనే రోజుల నుంచీ చలపతిరావుకు సినిమాలంటే పిచ్చి. యన్టీఆర్ నటించిన అనేక చిత్రాలు చూసి, ఆయనలా తానూ తెరపై కనిపించాలని ఆశించారు చలపతిరావు. మద్రాసు చేరుకొని పలు ప్రయత్నాలు చేశారు. కొన్ని చిత్రాలలో చిన్నాచితకా పాత్రల్లో కనిపించారు. తరువాత యన్టీఆర్ ను కలసి తన పరిస్థితి వివరించగా, ఆయన ప్రోత్సహించారు. అలా తొలిసారి తెరపై డైలాగ్ చెప్పే పాత్ర యన్టీఆర్ ‘కథానాయకుడు’ చిత్రంలో లభించింది. ఇందులో యన్టీఆర్, నాగభూషణం మునిసిపల్ ఎలక్షన్స్ లో పోటీ చేయగా, ఎన్నికల అధికారి పాత్రలో చలపతిరావు నటించారు. 1969లో విడుదలైన ‘కథానాయకుడు’ ఆ యేడాది బ్లాక్ బస్టర్ గా నిలచింది.

చలపతిరావు నటజీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం యన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ‘దానవీరశూర కర్ణ’. ఈ చిత్రానికి యన్టీఆరే దర్శక నిర్మాత. పైగా ఈ సినిమాను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. దాంతో చలపతిరావుతో యన్టీఆర్ పలు పాత్రలు పోషింప చేశారు. సూతుడు, ఇంద్రుడు, బ్రాహ్మణుడు, జరాసంధుడు వంటి పాత్రల్లో ‘దానవీరశూర కర్ణ’ చిత్రంలో కనిపించారు చలపతిరావు. సంచలన విజయం సాధించిన ఆ చిత్రం తరువాత చలపతిరావుకు మంచి పాత్రలు రావడం మొదలయింది. అప్పటి దాకా బిట్ రోల్స్ లో కనిపించిన చలపతిరావు, ఆ తరువాత కాసింత గుర్తింపు ఉన్న పాత్రల్లో నటించసాగారు. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన తొలి చిత్రం ‘గులాబి’లో హీరోయిన్ తండ్రి పాత్రను ధరింప చేశారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ పై కృష్ణవంశీ తన రెండో చిత్రం ‘నిన్నే పెళ్ళాడతా’లో హీరో నాగార్జునకు తండ్రిగా చలపతిరావును నటింప చేశారు. ఆ సినిమా విజయంతో చలపతిరావుకు అనేక చిత్రాలలో హీరోహీరోయిన్లకు తండ్రిగా నటించే అవకాశాలు వరుసగా లభించాయి.

Read Also: Jr NTR: ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవుతాడు అంటే ఎవరూ నమ్మలేదు…

చలపతిరావు భాగస్వామిగా కొన్ని చిత్రాల నిర్మాణంలో పాలు పంచుకున్నారు. బాలకృష్ణ హీరోగా ‘కళియుగ కృష్ణుడు’ నిర్మాణంలో తొలిసారి ఆయన భాగస్వామి అయ్యారు. తరువాత “కడప రెడ్డెమ్మ, జగన్నాటకం, పెళ్ళంటే నూరేళ్ళ పంట, ప్రెసిడెంట్ గారి అల్లుడు, అర్ధరాత్రి హత్యలు, రక్తం చిందిన రాత్రి” వంటి చిత్రాల నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. కొంతకాలంగా చలపతిరావు చిత్రాలలో కనిపించడం లేదు. ఏది ఏమైనా చలపతిరావు పేరు వినగానే ఆయన పోషించిన పలు పాత్రలు మన కనుల ముందు కనిపించక మానవు.

చిత్రసీమలో ఎంతోమంది ‘బాబాయ్’ అంటూ చలపతిరావు ను అభిమానంగా పిలుస్తూ ఉంటారు. ఇక నటరత్న యన్టీఆర్ కొడుకులు నిజంగానే ‘బాబాయ్’లా చూసుకుంటూ ఉంటారు. ఆయన కొడుకు రవిబాబు సైతం తండ్రి బాటలో పయనిస్తూ నటునిగా మారినా, తరువాత మెగాఫోన్ పట్టి డైరెక్టర్ గానూ మెప్పించారు. తండ్రినీ డైరెక్ట్ చేశారు రవిబాబు. దీంతో నలుగురి ఎదుట చలపతిరావు పుత్రోత్సాహంతో పొంగిపోయేవారు.